తెలుగు కథా రచయితల్లో ద్వితీయుడైనా అద్వితీయుడైన కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. గురజాడతో ఆరంభమైన కథానిక రచనను సుసంపన్నం చేసిన విశిష్ట రచయిత. తెలుగువారి జీవితాలను నిశితదృష్టితో పరిశీలించి తనదైన శైలిలో గురజాడ, గిడుగు ప్రభావంతో వాడుక భాషలో రాసి మెప్పుపొందిన కథక చక్రవర్తి. బహుముఖ ప్రజ్ఞతో నాటకం, నాటిక, నవల, విమర్శ, స్వీయచరిత్ర వంటి పక్రియలన్నింటినీ సృజించినా, కథారచయితగా ఎక్కువగా సుప్రసిద్ధులయ్యారు. ‘రాజరాజు’, ‘కలంపోటు’ ‘టీపార్టీ’ వంటి నాటికలు రాశారు. నవలా రచయితగా ‘మిథునానురాగం’ (1914), ‘శ్మశానవాటిక’ (1917) ‘అనాథ బాలిక’ (1924), ‘రక్షాబంధనం’ (1925) వంటి నవలలు రాశారు. ఆయన రచన ‘ఆత్మబలి’ మనోవిశ్లేషణాత్మక నవలగా ప్రసిద్ధి పొందింది. ‘నీలాసుందరం ’ పౌరాణిక నవల విమర్శకుల మెప్పు పొందింది. పాత్రికేయులుగా ‘ప్రబుద్ధాంధ్ర ’ను పక్షపత్రికగా ప్రారంభించి (1920) మాసపత్రికగా నిర్వహించారు. ‘రెడ్డిరాణి ’ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు.

ఆధునిక కథా సాహిత్యంలో చిన్నకథకు పెద్దపీట వేసిన శ్రీపాద వారు ఏప్రిల్‌ 23, 1891‌న రామచంద్రపురం తాలూకా, పాలమూరు గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మీపతి సోమయాజులు. తల్లి మహాలక్ష్మి సోదెమ్మ. వారి మగసంతానంలో శాస్త్రి మూడోవారు. తెలుగు కవిత్వం, సాహిత్యం ఏ మాత్రం గిట్టని కుటుంబ వాతావరణంలో గురువులు, పెద్దల కంటపడకుండా వీరేశలింగం ‘కవుల చరిత్ర’ మూడవ భాగం, పోలూరి వెంకట కృష్ణయ్య ‘రోహిణీ సుధాకరం’ నాటకాన్ని రహస్యంగా చదివారు.

ఏటికెదురీదిన విధంగా కథారచయితగా సుస్థిరస్థానాన్ని సంపాదించు కున్న శ్రీపాద మొత్తం 75 చిన్న కథలు రాశారు. 1925లో 19 చిన్న కథలను కథా సంపుటిగా ప్రచురించారు.

1939లో అద్దేపల్లి వారు 25 కథలను ‘చిన్న కథలు ’ శీర్షికతో ముద్రించారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ ‌వారు 2005లో 45 కథలను ‘పుల్లంపేట జరీచీర’ పేరిట ప్రచురించారు.

శ్రీపాద వారు కథానికను చిన్న కథగానే భావించేవారు. కథా రచయితకు వ్యుత్పన్నత, అభ్యాసం, నిశిత పరిశీలనా దృష్టి, సంస్కారం ఉండాలన్నది ఆయన అభిప్రాయం. ఆయన కథలను స్థూలంగా సంస్కరాణత్మక కథలు, విషాదాంత ప్రణయ కథలు, చారిత్రక, జానపద కథలు అని నాలుగు విభాగాలుగా వర్గీకరించి విశ్లేషించవచ్చు. శ్రీపాద వారి కథల్లో ఉన్న సంస్కరణ దృక్పథాన్ని విశ్లేషించడమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశం.

శ్రీపాద సంస్కరణాత్మక కథల్లో 1) వితంతు వివాహ సంస్కరణలు, 2) వితంతువుల దాష్టీక నిరసన, 3) అవినీతి నిరసన, 4) అస్పృశ్యతా నిరసన, మతమార్పిడి పరాయి సంస్కృతి ప్రోత్సాహాలు, 5) నిరుద్యోగం, స్వయం ఉపాధి ప్రబోధం, 6) నిరసనలున్నాయి. ఆయన సంస్కరణ దృక్పథం ప్రధానమైంది. కొన్ని ప్రభోదాత్మకాలు, కొన్ని ప్రణయ కథలున్నాయి. కొన్ని సూటిగా ప్రశ్నించేవి ఉన్నాయి. ప్రత్యేకించి మహిళాభ్యుదయ భావాలున్నాయి. ఆయన కథల్లో అప్పటి సాంఘిక విరుద్ధాలైన వితంతు, వయో పునస్సంధానాలున్నాయి. రజస్వల అనంతర వివాహాలున్నాయి. పరిణిత వితంతువుల అణచివేతపై తిరుగుబాటు ధోరణి, స్వతంత్రించి పునర్వివాహాలు చేసుకోవడాలు ఉన్నాయి. ఆడపిల్లలు స్వయంశక్తి శౌర్యాలు పెంపొందించు కోవడం, సాముగరడీలు నేర్చుకోవడాలున్నాయి. పెళ్లే ప్రధానంగా భావించ కుండా చదువుకొని స్వయం ఉపాధిని కల్పించుకోవడం, వరుల నిర్ణయంలో పాలు పంచుకోవడం, చొరవ చూపడం, వరకట్నాన్ని తిరస్కరించడం, భార్య భర్తను ప్రశ్నించగలగడం, తండ్రీ కూతుళ్లు పరస్పర అవగాహనతో స్నేహపూర్వకంగా మెలగడం, వేశ్యల్లో కూడా గౌరవనీయులుంటా రని గుర్తించడం వంటి మహిళాభ్యుదయ ప్రగతిస్ఫోరక భావాలెన్నో ఉన్నాయి. ఆనాటి సాంఘిక సమస్యలెన్నో నేడు యథాతథంగా లేకున్నా మౌలికంగా స్త్రీ స్వేచ్ఛ, స్త్రీపురుష సమానత్వం ఇప్పటికి సాధించవలసిన ఆశయాలు గానే కొనసాగుతున్నాయి.

వితంతు వివాహ కథలు: వీరేశలింగం ప్రభావంతో శ్రీపాద తమ కథల్లో మహిళాభ్యు దయ దృక్పథాన్ని ప్రవేశపెట్టారు. వితంతువివాహా లను ప్రోత్సహించారు. శ్రీపాదలో మహిళాభ్యు దయపు ముందుచూపు ఒక శతాబ్ది ముందుగా వచ్చిందంటే అతిశయోక్తి కాదు. తమ కథల్లో వీరేశ లింగం గారిని పాత్రగా ప్రవేశపెట్టారు. కుహనా సంస్కర్త రంగారావు పన్నిన కుటిల వలయాన్ని వివేకంతో చేధించి కోరుకున్న యువకుడిని (సూర్యారావు) వివాహం చేసుకున్న వితంతు సాహసగాథ ‘రామలక్ష్మి’ కథ.

‘వెలిపెడితే అల్లుడైనాడు’ కథలో యువ పండితుడు విశ్వనాథశాస్త్రికి వస్తున్న పేరు ప్రఖ్యా తులు చూడలేక కసితో అతడు మాల యువతిని రక్షించాడన్న నెపంతో పద్మనాభశాస్త్రి వెలి వేయించాడు. పద్మనాభశాస్త్రి వితంతు కూతురు నరసమ్మ, విశ్వనాథశాస్త్రితో వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తండ్రికి బుద్ధి చెబుతుంది. తండ్రి తనను కొట్టి చంపుతానంటే నరసమ్మ సాహసంతో అర్ధరాత్రి విశ్వనాథ శాస్త్రితో ‘ఎక్కడికేనా పోదాం పద’ అని ప్రయాణం కట్టించింది. ఆమె సాహసానికి పర్యవసానమే ఆమె పునర్వివాహం. శ్రీపాద వారి కథల్లో స్త్రీ పాత్రలకుండే తెగింపు పురుషపాత్రల్లో అంతగా కనిపించదు. నరసమ్మ, రామలక్ష్మి పాత్రలే ఇందుకు దృష్టాంతాలు.

‘అరికాళ్ల కింద మంటలు’ కథలో రుక్మిణి 17 ఏళ్ల వితంతువు. ఇంట్లో వారంతా ఆమెతో పనులు చేయించేవారు. పని చేయలేనంటే నిష్ఠూరాలాడే వారు. రుక్మిణికి తల గొరిగించి కూర్చోపెడితో బుద్ధి వస్తుందని కుటుంబ సభ్యులంతా నిర్ణయానికి వచ్చారు. వాళ్ల ప్రయత్నా లను సహించలేక రుక్మిణి, జట్కా బండివాడి సహాయంతో వితంతు వివాహాలు ప్రోత్సహిస్తున్న వీరేశలింగం గారి తోటకు వెళ్లి పునర్వివాహం చేసుకుంటుంది.

శ్రీపాద ఒకవైపు బాల వితంతువుల స్థితిపట్ల సానుభూతిని చూపిస్తూనే, పుట్టింటికి చేరిన వితంతు ఆడపడుచులు పెత్తనాన్ని, వారి ఆగడాలను ఇంట్లో బంధువులు, తమ్ముళ్లు, మరదళ్లు కలిసి బుద్ధి వచ్చేట్లు చేసిన కథలు రాశారు. ‘ఇల్లు పట్టిన వెధవాడపడుచు’ ‘కీలెరిగిన వాత’ వంటివి కథలు ఎందుకు ఉదాహరణలు. అవినీతి నిరసన కథలు:

అప్పటికే సంఘంలో ఉన్న అవినీతి, ఉద్యోగాల కోసం లంచం అడిగే స్థితిని ‘కలుపు మొక్కలు’ కథలో చిత్రించాడు. ఒక బీద బ్రాహ్మణుడు తన కొడుక్కి ఉద్యోగం కోసం ప్రెసిడెంటు గారి గుమస్తా వద్దకు వెళతాడు. అయితే గుమస్తా అడిగిన లంచం ఇవ్వలే నంటాడు. చిట్టచివరి అస్త్రంగా ఒక వేశ్యను ప్రెసిడెంటు వద్దకు పంపేట్లయితే ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. ఏంచేయాలో తోచక అతడు ఒక వేశ్య వద్ద ప్రాధేయపడతాడు. అందుకు మొదట తిరస్కరించినా, అతడి బాధను గమనించి జాలితో అంగీకరిస్తుంది. సమాజంలో పెద్దమను షులుగా కనపడుతున్న వారంతా స్వార్థంతో ఎంత సంకుచితంగా మారితే, సమాజం చులకనగా చూసే వేశ్య ఒక మంచి పని కోసం తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, మహోన్నత వ్యక్తిత్వం గల మహిళగా మారుతుంది. పేదబ్రాహ్మణ కుటుంబం కోసం తనకు ఇష్టంలేని వ్యక్తికి శరీరాన్ని సమర్పించుకున్న ఉదాత్త త్యాగశీలిగా శ్రీపాద వేశ్యను చిత్రించాడు.

శ్రీపాద కథల్లో ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ కథలో కులమతం, వివక్ష, అస్పృశ్యత, మతమార్పి డుల విషయంలో గ్రామంలో పెద్దలు, అగ్రవర్ణాల వారు ఎంత అసంబద్ధంగా, అమానుషంగా ప్రవర్తిస్తారో చూపించాడు. కులం కట్టుబాట్లకు జంకి, పెళ్లి కోసం మతం మార్చుకున్న నిమ్నజాతి యువతీ యువకుల ప్రణయగాథ ‘సాగర సంగమం’ కథ. కులాతీత మతంగా ప్రసిద్ధి చెందిన క్రైస్తవంలో చేరిన వారికి కూడా కులభేదాలు పాటించే యదార్ధ స్థితిని శ్రీపాద వాస్తవిక దృష్టితో చిత్రించారు.

నిరుద్యోగం/స్వయం ఉపాధి ప్రబోధ కథలు

 అప్పటికే సంఘంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. ఇతర సాంఘిక సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యను గూర్చి ‘తాపీమేస్త్రి రామదీక్షితులు, బి.ఏ.,’ ‘మార్గదర్శి’ ‘గుర్రప్పందాలు’ వంటి కథల్లో ప్రబోధాత్మకంగా చిత్రించారు. చదువు కున్న యువకులు అగ్రకులానికి చెందినవారైనా, ఉద్యోగాల వేటలోపడి బాధపడేకన్నా, భేషజాలు మానుకొని ఏదో ఒక వృత్తిని చేపట్టాలని, ఏదో ఒక వ్యాపారాన్ని నిర్వహించాలని రాసిన ఈ కథల్లో కథాశిల్పంతో, కథనశైలితో అగశ్రేణిలో నిలిచే కథ ‘మార్గదర్శి’. ఒక ఉద్యోగానికి సిఫారసు చేయాలని కోరుతూ తన దగ్గరకు వచ్చిన యువకుడికి ‘ఉద్యోగాల వేట మానుకొని, స్వయంగా ఏదైనా వ్యాపారం చేసుకోమని’ శ్రీపాద స్వానుభవంతో సలహా చెప్పారు. అతనికి ఇంకా ఉద్యోగ వ్యామోహం పోనందున గట్టిగా మందలించారు. ఉద్యోగాల వేట ఇతివృత్తంతో శ్రీపాద రాసిన మరో కథ ‘గుర్రప్పందాలు’. ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే యువకులకు ఎంత అసంబద్ధమైన ప్రశ్నలు వేస్తారో, ఎలా అవమానిస్తారో వ్యంగ్యస్ఫోరక సంభాషణలతో చమత్కారంగా రాశారు. పెళ్లికొడుకు పెళ్లికూతుర్ని చూసుకోవడం లాంటిదే కంపెనీ వాళ్లు దరఖాస్తు దారులను చూసుకోవడం అని అధిక్షేపించారు.  తాపీమేస్త్రి రామదీక్షితులు, బి.ఏ. కథలో రామదీక్షితులు,కంపెనీ వారు తాపీ మేస్త్రీ పని ద్వారా డబ్బు సంపాదించడాన్ని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రబోధించారు. సంస్కరణ దృక్పథంతో వివిధ అంశాలు ఇతివృత్తంగా కథలు రాసిన శ్రీపాద  కథాప్రియుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు.

– డా।। పి.వి.సుబ్బారావు, 9849177594, విశ్రాంత అధ్యాపకుడు

About Author

By editor

Twitter
YOUTUBE