తెలంగాణ ప్రభుత్వం తాజా కేబినెట్ భేటీ (జూలై 31)లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే, వీటిని ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా తీసుకునే నిర్ణయాలు అనే కన్నా.. ఎన్నికల నిర్ణయాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే కాదు.. ఇటీవల బీఆర్‌ఎస్ సర్కారు ఏం చేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా, ఎలాంటి ప్రకటనలు చేసినా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేసినట్లు అర్థమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 43 వేల మందికి పైగా ఉన్న ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై గల వ్యతిరేకతను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశం ఐదుగంటల పాటు జరగగా.. అందులో రెండున్నర గంటల పాటు ఆర్టీసీ అంశంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ సిబ్బంది అంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు. అయితే, వీరి కోసం ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. దాని కిందకు వీరిని తెచ్చి ఆ శాఖ నుంచే వీరికి జీతభత్యాలు చెల్లించడంతో పాటు ఇతర అంశాలను పర్యవేక్షి స్తారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే, కార్పొరేషన్‌ను యథావిధిగా కొనసాగించనున్నారు. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంలో విలీనమవుతారు. మరోవైపు.. ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయి పడిన సీసీఎస్ నిధులు 1150 కోట్ల రూపాయలు, ఎస్‌ఆర్‌బీఎస్ కింద 500 కోట్ల రూపాయలు, ఎస్‌బీటీకి సంబంధించిన 500 కోట్ల రూపాయలు, 2013 పీఆర్‌సీ బకాయి నిధులు సుమారు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేబినెట్ సమావేశంలో ఈ విషయాలన్నింటిపైనా చర్చ జరిగిందని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ కాకుండా.. ఒక్కసారిగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. కాగా.. నిధుల లేమితో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మెట్రో ప్రతిపాదనలు పూర్తయ్యేనా?
హైదరాబాద్‌లో పెరిగిన అవసరాలు, రోడ్లమీద తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వాహనాల రద్దీ.. తదితర కారణాల నేపథ్యంలో ఇప్పుడు నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్‌ను శంషాబాద్ వరకు విస్తరించ నున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, పరిసర ప్రాంతాలోని పలుమార్గాల్లోనే మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ నిర్ణయించిన ప్రకారం 60 వేల కోట్ల రూపాయలతో వివిధ మార్గాల్లో మెట్రో లైన్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సైతం జనాకర్షణ సూత్రంగానే కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలతో పాటు.. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కానీ, ఇంత భారీ ఎత్తున ప్రకటించిన మెట్రో ప్రతిపాదనలు కనీసం దశాబ్ద కాలంలో కూడా పూర్తయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చునంటున్నారు నిపుణులు. దీనిని భూసేకరణ, ఆర్థికపరమైన అంశాలు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
ఇక, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్థులపైనా ఎట్టకేలకు ఈ మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరూ ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరినవాళ్లే కావడం గమనార్హం.
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. 1999-2004 మధ్య సంగారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కె.సత్య నారాయణ ఆ తర్వాత కాలంలో బీఆర్‌ఎస్‌లో చేరగా.. ఆయన పేరు అనూహ్యంగా ఫైనల్ అయిందని అంటున్నారు. కాగా, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేసిన దాసోజు.. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
చర్చిస్తారనుకున్నవి వదిలేశారు!
కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే, పెండింగ్‌లో ఉన్న మరికొన్ని అంశాలను కేబినెట్ విస్మరించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి, బకాయి ఉన్న డీఏల చెల్లింపు, పాత పింఛను పథకం పునరుద్ధరణ తదితర అంశాలపై మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ సంఘాలు భావించాయి. కానీ ఆ విషయాలేవీ కేబినెట్‌లో ప్రస్తావనకు రాలేదు. ఈ పరిణామంపై కొన్ని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు. రెండు వారాల్లోనే ఈ మంత్రివర్గ సమావేశం ఉండనుందని ఆయన సన్నిహితులు పేర్కొంటు న్నారు. ఎన్నికల షెడ్యూలు కూడా మరికొద్ది రోజు ల్లోనే విడుదల కానున్న దృష్ట్యా.. రాబోయే సమావేశంలో మిగిలిన ఇంకొన్ని ప్రజాకర్షక అంశాలపై నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అన్నదాతకు ఆసరా ఏది?
కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వెలిశాయి. అన్నదాత తీవ్రంగా కుంగిపోయాడు. అయినా, రైతులకు.. రాష్ట్ర కేబినెట్ మొండి చేయి చూపింది. వరదల నేపథ్యంలో తక్షణ సాయంగా 500 కోట్ల రూపాయలు ప్రకటించినప్పటికీ.. అవి ఏ మూలకూ సరిపోవనే చర్చ జరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.10-20 వేల వరకు నష్టం జరిగింది. గతంలో మాదిరిగా ఎకరాకు రూ. పదివేలైనా పరిహారంగా ప్రకటిస్తారని రైతులు ఆశించగా.. అలాంటిదేమీ జరగలేదు. పంట నష్టపోయిన వారికి పరిహారంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్నదాతలు నిరాశకు గురవుతున్నారు.
అన్నదాతలకు ఈ వానాకాలం సీజన్ కలిసి రాలేదు. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో జూన్‌లో వర్షాలు పడలేదు. జూలైలోనూ రెండు వారాల తర్వాతే వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే, కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు, రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెరువులు, కుంటలు తెగిపోయాయి. వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, నీటిపారుదల శాఖల పరంగా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 41 మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఏ మేరకు పరిహారం ప్రకటిస్తారనే అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు. అయితే, కేబినెట్ భేటీ తర్వాత మంత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ… వర్షాలు ఇంకా పడుతున్నాయని, పంట నష్టంపై సమగ్ర వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
సర్కారు లెక్కలపైనా చర్చించని కేబినెట్
ఇక, రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. ప్రధానంగా వరి, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. జూలై చివరి నాటికి సేకరించిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లాలో 4,300 ఎకరాల్లో వరి, పత్తి, పెసర పంటలు దెబ్బ తిన్నాయి. వికారాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. నిర్మల్ జిల్లాలో 30వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
నిర్మల్, ఖానాపూర్, భైంసా ప్రాంతాల్లో ఇసుక మేటలు వేసిన చోట ఈ సీజన్‌లో పంటలు సాగుచేసే పరిస్థితే లేదు. పెద్దపల్లి జిల్లాలో 5వేల ఎకరాల్లో వరి పంట, వెయ్యి ఎకరాల్లో పత్తిపంట దెబ్బ తిన్నాయి. భూపాలపల్లి జిల్లాలో 15,700 ఎకరాల్లో వరి, 15,300 ఎకరాల్లో పత్తి, 2,500 ఎకరాల్లో మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్‌లో 22వేల ఎకరాల్లో వరి, 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 5,279 ఎకరాల్లో సోయాబీన్, 1,447 ఎకరాల్లో పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17 వేల ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో కంది, 6 వేల ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం జరిగింది. జగిత్యాల జిల్లాలో 16 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 5 వేల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 15వేల ఎకరాలు, హనుమకొండ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. స్వల్పంగా మేటలు వేసిన చోట్ల ఇసుక తొలిగించినా.. మళ్లీ కొత్తగా విత్తనాలు నాటాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని అటకెక్కించారు. దాని స్థానంలో కొత్తగా ఎలాంటి పథకాన్నీ ప్రకటించలేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. గత యాసంగిలో ప్రకటించి నట్లుగా.. ఎకరాకు రూ. 10వేలు ఇచ్చినా కొంత మేర రైతులకు ఊరట కలిగే అవకాశం ఉంది. కానీ, తాజా కేబినెట్ భేటీలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్