స్వరాజ్య సమరంలో  ఆయనొక అజ్ఞాతయోధుడు

– శ్రీ దీనదయాళ్‌ ఉపాధ్యాయ

డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గెవార్‌ ‌జన్మత: దేశభక్తులు. ఏదో నిరాశ వల్లనో లేనిచో ప్రతిక్రియ గానో ఆయన జాతీయ కార్యరంగంలోకి ఉరకలేదు. అయితే వారు బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఏ విధంగానైనా సరే వారిని పడగొట్టాలని వాంఛి చడం నిస్సందేహం.

‘‘మన జన్మహక్కు’’ అని లోకమాన్య తిలక్‌చే వర్ణింపబడిన స్వరాజ్య సంపాదనకు సాధనాల విషయంలో డాక్టర్‌జీ మూఢ విశ్వాసాలేమీ పెట్టుకో లేదు. అందువల్ల వారు తమ కాలంలో జరిగిన అన్ని రకాల స్వరాజ్య సమరాలలోనూ పాల్గొన్నారు. ఆ లక్ష్యం కోసం పని చేసిన ప్రతివారితో సహకరించారు. అయితే మాతృదేశము దాస్యములో ఉన్నందువల్ల మాత్రమే కాదు, ఆయన ఉద్దేశంలో మాతృదేశ ప్రేమ అనేది మానవుని సహజ మనఃస్థితి. జాతీయత, దేశభక్తి అనేవి ఎవరో విశేషమైన గొప్పవారి లక్షణాలు మాత్రమే కాదు. సంఘము, సంస్కారము ఉన్న ప్రతి సామాన్యుని యొక్క లక్షణములవి. సాంఘిక భావన పోయి, కేవలం స్వార్థపరుడైపోయిన వ్యక్తి నిజానికి మానవలక్షణం కోల్పోయి గుంపుల్లో తిరిగే ఒక జంతువు వంటివాడని ఎవరో నిర్వచించారు. అందువల్ల డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ ‌వ్యక్తుల పేర్ల ముందు ‘‘దేశభక్త’’ మొదలైన బిరుదాలు తగిలించడాన్ని ఆమోదించేవారు కాదు. ఎవరో కొందరి పేర్ల ముందు ఆ బిరుదాలు తగిలించబడ్డాయంటే మిగిలినవారిలో ఈ సామాన్య లక్షణాలు లోపించినట్లు; జనులలో ఈ సామాన్య లక్షణం లోపిస్తే నిజానికి వారొక జనతయే కాజాలరు. వ్యక్తిలో ప్రాథమికమైన ఈ క్షణం ప్రకటితం కావడానికి విదేశీ ఆక్రమణలు, పరి పాలనలు అక్కరలేదని డాక్టర్‌జీ అభిప్రాయం….

రాష్ట్రీయత స్వతస్సిద్ధమైనదనే ఈ భావన వల్లనే వారు హిందూత్వమును గురించి పక్కాణించారు. బ్రిటిష్‌ ‌వారిని తరిమివేసేందుకు తాత్కాలిక అవసర సాధనాలుగా స్వీకరించబడిన సహాయ నిరాకరణ, ఖిలాఫత్‌ ఉద్యమాలు జాతీయ ఉద్యమానికి వంపునిచ్చి జాతీయత విషయంలో మన దృష్టినే మసక చేయడం జరిగింది.

సహాయ నిరాకరణ అనేది వ్యతిరేకాత్మకం అనేది కనిపిస్తూనే ఉంది. ‘బ్రిటిష్‌’ అనే ప్రతిదానిని వెలివేయాలి అని అది ప్రతిపాదించింది. అంతేగాని సహజ సిద్ధమైన జాతీయ ప్రవర్తన గురించి స్పష్టీకరించలేదు. ఇక ఖిలాఫత్‌ ఉద్యమం పూర్తిగా దేశాంతర విధేయతలకు సంబంధించిన వర్గతత్వ ఉద్యమం. అది ఇచటి ముస్లింలను ఈ దేశానికి కలిపేది కాదు. పైగా సాంప్రదాయము, అలవాటు వల్ల ఏర్పడే విధేయతలను కూడా కొద్దిగా దెబ్బ తీసే ధోరణిలో పడ్డది. దీనితో ఆ ఉద్యమ సమయంలో కొందరు ప్రముఖ ముస్లిములు భారతదేశాన్ని వదలి ఇస్లాం రాజ్యమని వారు భావిస్తున్న ఆఫ్గనిస్థాన్‌లో నివసించాలని ఆలోచించారు.

ఖిలాఫత్‌కు కాంగ్రెస్‌కు మధ్య అంగీకరామంటూ ఏదైనా ఉంటే అది కేవలం తాత్కాలిక అవసర వాదానికి మాత్రమే సంబంధించి ఉంది. బహుశా ఉభయులు రెండవవారిని ఉపయోగించుకునే వరకే పరిమితమై ఉన్నది. బ్రిటిష్‌ ‌వారు ఖిలాఫత్‌ ‌విషయంలో విశ్వాస ఘాతుకంగా ప్రవర్తించి నందువల్ల 1857 ఉద్యమం తర్వాత మొదటిసారిగా బ్రిటిష్‌ ‌వారంటే కోపం తెచ్చుకున్న ముస్లింలతో కలవడం అనేది బ్రిటిష్‌ ‌వారిని తరిమివేయడానికి ఉపయోగిస్తుందని కాంగ్రెస్‌ ‌భావించింది. అయితే కమల్‌ అటాటుర్కే స్వయంగా ఖిలాఫత్‌ను ముగించడంతో ముస్లింలకు బ్రిటిష్‌ ‌వారికి వ్యతిరేకంగా మిగిలిందేమీ లేదు. ఈ మారిన పరిస్థితులను కాంగ్రెస్‌ ‌గుర్తించి, మామూలుగా జాతీయ సాంప్రదాయాన్ని దృఢపరచి, పునరుద్ధ రించడానికి యత్నించక, ఆ తాత్కాలిక మైత్రిలో ఏదో వాస్తవికతను కల్పించి, దానినే కొనసాగించడానికి యత్నించనారంభించింది. ఫలితంగా, తరతరాలుగా ఉన్న మన జాతీయ ప్రాతిపదికలను విడనాడి, ఎవరినీ ఉత్తేజితం చేయజాలని నూతనమైన వాటిని కనుక్కోవడానికి తాపత్రయపడడం జరిగింది. ఈ పరిస్థితులలోనే డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ అసందిగ్ధంగా హిందూరాష్ట్ర భావనను ప్రతిపాదించారు.

(‘ఒక్క అడుగు దూరాన మాత్రమే కనిపించే అందరాని వ్యక్తిత్వం’ శీర్షికతో వెలువరించిన వ్యాసమిది. ఆ వ్యాసంలోని కొన్ని భాగాలు)

About Author

By editor

Twitter
YOUTUBE