– తటవర్తి నాగేశ్వరి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘చెల్లీ.. నాన్న చనిపోయాడే..’’ అక్క లలిత ఫోన్‌కాల్‌తో ఉలిక్కిపడి లేచి ఆమె చెప్పింది వినగానే వణికి పోయింది నర్మద. క్షణకాలం ఊపిరి ఆడలేదు. అసలే ఆస్మా పేషంట్‌ ‌కావడంతో ఇన్‌హెలర్‌ ‌చేతికి తీసుకొని ప్రెస్‌ ‌చేసింది మందు గొంతులోకి వెళ్లింది కానీ టెన్షన్‌ ‌మధ్య ఆయాసం తగ్గలేదు.

పక్క గదిలో పడుకున్న కొడుకును ‘‘చిన్నా..’’ అని పిలిచింది. ఉలుకూ పలుకూ లేదు.

‘‘ కీర్తనా’’ అని అరిచింది. కీర్తనలో కూడా స్పందన లేదు. కళ్లు తిరుగుతున్నట్టు అన్పించింది. బలవంతంగా లేచి నిలబడింది. తడుముకుంటూ లైటు వేసి హాల్లో పడుకొని నిద్రపోతున్న కీర్తన దగ్గరకెళ్లి తట్టింది. కీర్తన కళ్లు నులుముకుంటూ లేచింది. ‘‘ఏంటి మమ్మీ..’’ అని అడిగింది.

వెంటనే గొంతు పెగల్లేదు. ‘‘ఏమయింది మమ్మీ..?’’ అడిగింది కీర్తన.

‘‘తాతయ్య చనిపోయాడే’’ అంది. ‘‘వ్వాట్‌.?’’ అని లేచింది కీర్తన. ‘‘ఏమయిందమ్మా.’’ అడిగింది ఆందోళనగా ‘‘ఎలా జరిగిందో తెలీదు.. ఇప్పుడే పెద్దమ్మా.. ఫోన్‌ ‌చేసింది..’’ చెప్పింది.

గోడ గడియారం కేసి చూసింది కీర్తన. పన్నెండు అవుతుంది. వెళ్లాలి కదా అమ్మ..’’ అడిగింది. ‘‘అవును తల్లీ ..’’ అంది ఏడుస్తూనే.. చెల్లి ప్రసన్నకి ఫోన్‌ ‌చేసింది.

‘‘నాకు ఇప్పుడే పెద్దక్క చెప్పిందక్కా. మాకు రావడానికి ట్రాన్స్పోర్ట్ ‌లేదు కదా.. పైగా ఇవి కరోనా రోజులు. ’’ అంది. ‘‘నాన్నకు వచ్చింది కరోనా కాదు కదా..’’ అంది నర్మద.

‘‘ఎవరు చూడొచ్చారు? గత వారం నుండి ఆరోగ్యం బాగలేదని అక్క దగ్గరకి వచ్చి వున్నా డాయన. అంది ప్రసన్న. నిజమే నాలుగు రోజుల క్రితం పెద్దక్క లలిత ఫోన్‌ ‌చేసింది.

‘‘నాన్న జ్వరం వచ్చిందని వచ్చాడు. హాస్పిటల్లో చూపించడానికి తీసుకెళ్లా.. వాళ్లేవో మందులిచ్చి టెస్ట్  ‌రాసిచ్చారు. టెస్ట్ ‌చేయిస్తే వైరల్‌ ‌ఫీవర్‌ అని మందులు రాసిచ్చారు. మళ్లీ రెండు రోజుల తర్వాత నాన్నకు దగ్గుకూడా వస్తుందని సిటీ స్కాన్‌ ‌రాసిచ్చాడు. బయట చేయించాము. ‘‘చెప్పింది లలిత. ‘‘జాగ్రత్తక్కా.’’ అని ఫోన్‌ ‌పెట్టేసింది నర్మద.. ఈ సంభాషణ జరిగింది ఆరోజు ఉదయమే. కానీ ఇప్పుడు ఏకంగా మరణ వార్త చెప్పింది. కాళ్లూ చేతులూ ఆడడం లేదు. మంచంకి ఆనుకొని కూర్చొంది. తల్లి ఎగశ్వాస దిగశ్వాసగా    ఉంటే అమృతాంజనం తెచ్చి పూసింది కీర్తన. అలికిడికి నర్మద కొడుకు పవన్‌ ‌లేచి వచ్చాడు. వాడికి పన్నెండేళ్లు.. ‘‘ఏమయిందమ్మా?..’’ అడిగాడు.

‘‘తాతయ్య చనిపోయాడు రా.. మనకున్న ఒకే ఒక దిక్కు పోయింది..’’ అంది కన్నీళ్ల పర్యంతం అవుతూ. పిల్లలిద్దరూ తల్లికి దగ్గరగా చేరి ధైర్యం చెప్పడం మొదలెట్టారు. లలితక్క మళ్లీ ఫోన్‌ ‌చేసింది. ‘‘వస్తున్నావా?’’ అడిగింది. ‘‘బయట బస్సులు కూడా లేవుకదా అక్కా’అంది నర్మద ఏంమాట్లాడాలో అర్ధం కాక. ‘‘ఎలాగోలా బయలుదేరవే.. నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు..’’ అంది ఫోన్‌ ‌పెట్టేస్తూ.. ‘‘ఓనరాంటి వాళ్లకు కారు ఉంది కదా అమ్మా..’’ అంది కీర్తన.

‘‘ఇప్పుడు సమయం పన్నెండు అవుతుంది. ఈ సమయంలో వాళ్లని లేపితే నిద్రాభంగం అవుతుంది కదా.’’ అంది. ‘‘ఆంటీకి ఫోన్‌ ‌చేస్తానమ్మా ’’అని కీర్తన ఫోన్‌ ‌చేతికి తీసుకొంది. అప్పటికే నర్మద పెట్టిన శోకాలకు పక్కనే ఉన్న ఇంటి యజమాని మంజుల నిద్ర లేచింది. కీర్తన ఫోన్లో విషయం చెప్పింది.

‘‘అయ్యో’’ అంది మంజుల. ‘‘మరి ఇప్పుడు ఎలా వెళతారు..’’ అడిగింది.

‘‘మీ కారు ఇవ్వండి ఆంటీ..’’ అడిగింది కీర్తన. ‘‘డ్రైవర్‌ ‌లేడమ్మా.. ఆరోగ్యం బాగా లేదని వారం నుండి రావడం లేదు..’’ చెప్పింది. నిమిషాల వ్యవధిలోనే తలుపు తీసుకొని వచ్చింది మంజుల.

కరోనా రోజులు కావడంతో దగ్గరకి తీసుకొని ఓదార్చలేదు. ‘‘ప్లీజ్‌ ‌కంట్రోల్‌ ‌యువర్‌ ‌సెల్ఫ్ ‌నర్మదా..’’ అంది ‘‘ఎలా జరిగింది?..’’ అడిగింది. కాసేపు నర్మద ఏమీ మాట్లాడలేదు..

‘‘అమ్మ పోయాక నాన్నలో ఒంటరి తనం మరింత పెరిగిపోయింది. అమ్మ పేరే పదే పదే తలుచుకొనేవాడు. నాన్నకి కేన్సర్‌ అన్న విషయం తెలుసు కదా.. మందులు కూడా ఈమధ్య సక్రమంగా వాడడం లేదంట. ఒంట్లో బాగుండడం లేదని పెద్దక్క ఇంటికి హనుమకొండకి వచ్చాడు. అక్కయ్య డాక్టర్కి చూపించింది. ఇప్పుడీ మరణవార్త చెప్పింది..’’ చెప్పడం ఆపింది నర్మద.

మంజులకు అడగాలని నోటిదాకా వచ్చినా అడగ లేదు. తన మనసులో ఆలోచన అర్థం చేసు కున్నట్టు‘‘సిటీస్కాన్‌ అక్క ఉదయమే తీయించిందంట. అందులో కరోనా ఉంటే తెలిసి పోతుందట కదా..’’ అంది. ‘‘నేరుగా కరోనా పరీక్ష చేయించా ల్సింది. బహుశా కరోనాఎఫెక్ట్ అయిందేమో..’’ అంది మంజుల. ‘‘జాగ్రత్తగా ఉండాల్సింది..’’ అంది మంజుల

‘‘నాన్న ఊర్లో అందరికీ తలలో నాలుకులా ఉంటాడు. పట్వారీ చేశాడు కదా.. ఊర్లో అందరూ తెలుసు ఆయనకి. ఈమధ్య రెండు మూడు చావులకి కూడా వెళ్లి వచ్చాడట. ’’ అంది.

‘‘కరోనా కాకూడదని ఆశిద్దాం..’’ అంది మంజుల. ‘‘అయినా మనిషి పోయాక.. ఏ జబ్బు అయితే మాత్రం చేసేది ఏముంది మంజుల గారూ..’’ అంది నర్మద. ‘‘మరి ఇప్పుడు ఎలా బయలు దేరుతారు?’’ అడిగింది మంజుల.

‘‘అదే అర్థ్ధం కావడం లేదు..’’ అంది ఆందోళనగా నర్మద.

‘‘మీరేం వర్రీ కాకండి..నాకు తెలిసిన ట్రావెల్స్ ‌నుండి వెహికల్‌ ‌తెప్పిస్తాను.. ఉదయాన్నే బయలు దేరండి’’ చెప్పింది మంజుల.‘‘థాంక్స్ ‌మంజుల గారూ’’ అంది నర్మద, ‘‘థాంక్స్ ఆం‌టీ ’’ అంది కీర్తన. ‘‘ఇలాంటి సమయాల్లో ఒకరికి ఒకరు తోడుం డాలి కదా..’’ అంది. మంజుల వెళ్లాక మళ్లీ గడియ పెట్టి వచ్చింది కీర్తన. శోక దేవతలా మారిన తల్లిని చూసి కీర్తన కళ్లలో నీళ్లు ఆగలేదు.

‘‘ఉన్న ఒక్క ఆధారం తాతయ్య కూడా మనకి లేకుండా పోయాడు’’ అంటూ ఏడ్చింది.

తల్లిని పట్టుకొని తనుకూడా ఏడ్చేసింది కీర్తన. ‘‘ఏడవకు మమ్మీ..’’ అంటూ పవన్‌ ‌కూడా ఓదార్చాడు. పదేళ్ల క్రితం భర్త రామచంద్రం గుండాగి చనిపోయాక మొత్తం కుటుంబ భారం నర్మద మీదే పడింది. అతడొక ప్రయివేటు కంపెనీలో పని చేసేవాడు. కంపెనీనుండి కూడా ఆమెకి ఏ సాయం అందలేదు. కళ్ల ముందు ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు వాకిలి కూడా లేదు. ఎలా బ్రతకడం ? ఇంట్లోనే చిన్న బ్యూటీ క్లినిక్‌ ‌పెట్టుకుంది. కానీ దాని నుండి కూడా వచ్చే సంపాదన ఇల్లు గడిచే అంత లేదు. తండ్రే సంవత్సరానికి సరిపడే బియ్యం పంపేవాడు. ఇంటి రెంటు కూడా తనే సర్దేవాడు. తాను సంపాదించే కొద్దిపాటి డబ్బు కూరగాయలకు చిల్లర -సామానుకి సరిపోయేది. నాన్నకి ఏమయినా అయితే తన పరిస్థితి ఏంటని మధనపడుతూనే ఉండేది. సరిగ్గా ఇలా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆయన కాలం చేయడం ఆమెకి షాకిచ్చింది.తనకి నాన్న సాయం చేయడంపై ఇద్దరక్కలు చెల్లెలు కూడా అసూయ పడుతు ఉండే వాళ్లు. సూటి పోటీ మాటలు అంటూండేవాళ్లు. అమ్మ తనకి రక్షణ కవచంగా ఉండి సహకరిస్తూ ఉండేది. అమ్మ పోయిం తర్వాతే సగం క్రుంగిపోయింది నర్మద. ‘‘బిడ్డల్నేసుకొని అది ఒంటరి బ్రతుకు బ్రతుకుతుంది.. దాని బాగోగుల్ని నేనున్నా లేకున్నా చూసుకోండి..’’ అని పోయేప్పుడు కూడా తల్లి అన్నదని నాన్న మాటల ద్వారానే తెలిసింది. నాన్న చూపే శ్రద్ధ, చేసిన సాయం వల్లే పిల్లల్ని  చదివించు కోగలుగుతుంది.

ఇప్పుడెలా? పిల్లల భవిష్యత్తు అంధకారంగా కన్పిస్తుంది. రెండో అక్క శారదకి ఫోన్‌ ‌చేసింది.

‘‘నేను రావడం లేదే స్వీటీ నీళ్లు పోసుకొని ఉందికదా’’ అంది. శారదక్క కూతురు గర్భవతి కావ డంతో తను పుట్టింటికి వచ్చి ఉందట. అదే ఊర్లో ఉంటూ కూడా తండ్రి చివరి చూపు చూడక పోవడం దారుణమనిపించింది. చెల్లి ప్రసన్న మళ్లీ ఫోన్‌ ‌చేసి ‘‘నువ్వు కూడా పోక పోవడం బెటర్‌ ‌కదా అక్కా.’’ అంది ‘‘ఏంమాట్లాడుతున్నావ్‌ ‌చిన్నీ’’ అంది కోపంగా.

‘‘నాన్న సిమ్హమ్స్‌ను  బట్టి అది కోవిడే అని అక్క కూడా అనుకుంటుంది. తనే వణికి పోతుంది ’’ అంది. ‘‘ఎలా చనిపోయినా నాన్నని చివరి చూపు చూసుకోకపోతే అది జీవితకాలం నాకు క్షోభగానే మిగిలి పోతుంది చిన్నీ..’’ అంది. కాసేపు మౌనం వహించి ‘‘నీకు అలా అన్పించడం సహజమే కదక్కా. ఆయన సాయం ఎక్కువ పొందిన దానివి కూడా నువ్వే కదా..బహుశా కృతజ్ఞతా భావం నిన్ను నలిబిలి చేస్తూ ఉంటుంది..’’ కంక్లూజన్‌ ఇచ్చింది.

 కొద్దిసేపటి తర్వాత పెద్దక్క లలిత ఫోన్‌ ‌చేసింది. ‘‘నర్మదా నాన్న డెడ్‌ ‌బాడీ ఊర్లో ఉన్న మనింటికి తీసుకెళ్లి పోతున్నాము. అక్కడే కదా బరియల్‌ ‌చేసేది..’’ అంది. ‘‘సరే అక్కా. నేను ఎర్లీ మార్నింగ్‌ ‌బయలుదేరుతాను.. ’’చెప్పింది. కాసేపటి తర్వాత చిన్నక్క శారద ఫోన్‌ ‌చేసింది. ‘‘ఏంటే వెళ్లాలని డిసైడ్‌ అయ్యావా?’’ అడిగింది. ‘‘వెళుతున్నా అక్కా..’’ అంది స్థిరంగా. ‘‘సర్లే నువ్వు వెళ్తే వెళ్లావ్‌ ‌పిల్లల్ని ఇంట్లోనే వదిలి వెళ్లు.. తిరిగివచ్చాక తలస్నానం చేసి సపరేట్గా ఒక గదిలో ఉండిపో.. పద్నాలుగు రోజుల వరకూ పిల్లల్ని దగ్గరకు రానీవ్వకు..’’ సలహా ఇచ్చింది.

‘‘ముందు నన్ను వెళ్లనీయక్కా. ’’ అంది. చెప్పి నట్టుగానే ఇంటి ఓనర్‌ ‌మంజుల తనకు తెలిసిన ట్రావెల్స్ ‌మాట్లాడి కారు పంపింది. పిల్లలకు జాగ్రత్తలు చెప్పి బయల్దేరింది నర్మద. కారు వెళ్తూ ఉన్నంతసేపు నర్మద కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కారు హనుమకొండ దాటి గణపురం చేరేసేరికి శారదక్క ఫోన్‌ ‌చేసింది. ‘‘నాన్న శవంపై పడి ఏడవకు. ఆయనకు కరోనా ఎఫెక్ట్ అయ్యిందన్న సందేహం కూడా ఉందట.’’ చెప్పింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నర్మదకి.. ఫోన్‌ ‌కట్‌ ‌చేసింది.

శ్మశాన వాటిక దగ్గర ఏర్పాట్లు జరుగు తున్నాయ్‌. ‌దగ్గర బంధువులు పదిమంది కంటే ఎక్కువ లేరు. ఊర్లో పనిచేసిన పట్వారీ కాబట్టి. ఆర్‌.ఐ.‌వచ్చి పోయాడు. నర్మదను చూడగానే ఆమె అక్క లలిత భోరున ఏడ్చింది. అక్కని కావలించుకొని ఏడ్వాలను కుంది కానీ చెల్లెలు ప్రసన్న మాట్లాడిన మాటలే గుర్తొచ్చాయ్‌..

‘‘అక్క గతవారంగా నాన్నకు సేవలు చేస్తుంది కదా. తనకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఉంటుందేమో కాస్త దూరంగా ఉండు ఆమెకి కూడా. పైగా నువ్వు  ఆస్మా పేషంటివి..’’ నర్మదకి ఆమె మాటలన్నీ గుర్తొచ్చినా దుఃఖం ఆగలేదు. ‘‘అక్కా. నాన్న ఇక మనకిక లేడా..’’ అంటూ కావలించుకొని ఏడ్చేసింది. ఏమనుకుందో ఏమో లలిత ఆమెని కాస్త దూరంగా నెట్టింది. బంధువులు ఆపుతున్నా ఆగలేదు. తండ్రి శవంపై పడి భోరున ఏడ్చింది నర్మద. ఎందుకైనా మంచిదని నర్మదని దూరంగా తెచ్చారు. అదే రోజు తిరిగి ప్రయాణమయ్యింది. ఊపిరాడనట్లు అనిపిస్తే మాస్క్ ‌తీసివేసింది. అప్పుడు మొదలైంది ఆమెలో భయం. ‘‘నాన్న కరోనాతో పోయారా? అక్కకి ఎఫెక్ట్ అయ్యిందా? తనకి కూడా కరోనా వస్తుందా. తనకే మయినా అయితే తన బిడ్డల పరిస్థితి ఏంటి?’’ సందేహాలతో ఆమె తల వేడెక్కి పోయింది. హైదరా బాద్‌ ‌చేరేసరికి ఒళ్లు వేడిక్కి నట్టు అన్పిం చింది. కారు దిగి ఇంట్లోకెళ్లి బేసిన్‌ ‌దగ్గరకు వెళ్లి వాంతులు చేసుకుంది. పిల్ల లిద్దరూ ‘‘అమ్మా..’’ అని ఎదురొస్తే ‘‘దగ్గరకు రావొద్దు ముందు గదిలో కూర్చోండి’’ అని చెప్పింది. ఒంటిమీద ఉన్న బట్టలన్నీ వాషింగ్‌ ‌మిషన్లో వేసి వేడినీళ్లతో తల స్నానం చేసింది. అంతలోకి చిన్న చెల్లెలు ఫోన్‌చేసింది. ‘‘అక్కా నాలుగు రోజులు ఐసోలేషన్లో ఉండు. పిల్లల్ని దగ్గరకు రానివ్వకు..’’ చెప్పింది. గుండె గుబేల్‌ ‌మంది. తండ్రిని గుర్తు చేసు కుంటూ ఆ రాత్రంతా ఏడుస్తూనే పడుకుంది నర్మద. కీర్తన అన్నంవండి తాను తిని కొంత తమ్ముడికి పెట్టి ముందు గదిలో పడుకున్నారు. పక్కరోజు పదకొండు గంటలకు ఫోన్‌ ‌చేసింది లలితక్క, ‘‘సిటీ స్కానింగ్‌ ‌రిపోర్ట్ ‌వచ్చింది నర్మదా.. నాన్నకి కరోనా ఎఫెక్ట్ అయ్యిందట.’’ అంది. నర్మద గుండె జారిపోయింది. ‘‘ముందు నువ్వు వెళ్లి టెస్ట్ ‌చేసుకో అక్కా..’’ అంది నర్మద లేని ధైర్యాన్ని తెచ్చు కుంటూ.. కాసేపటి తర్వాత శారదక్క ఫోన్‌ ‌చేసింది.

‘‘నేనూ, చిన్నది ప్రసన్న రాకుండా పోవడం మంచిదయింది. నాన్నకి  వచ్చింది కరోనానే అంట కదా..’’ అంది .నర్మద ఏమీ మాట్లాడలేదు. ‘‘నాన్న శవం మీద పడి బోరున ఏడ్చావట కదా.. జాగ్రత్తగా ఉండవే’’అంది. ‘‘దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగు తుంది లేక్కా’’ అంది. అలాఅన్నదే కానీ క్షణ.. క్షణం తనలో భయం పెరిగిపోయింది. తనకి ఏనా అయితే తన పిల్లల పరిస్థితి ఏంటి? వారిని ఎవరు చేర దీస్తారు. నాన్న సాయం చేస్తుంటే ఓర్వలేని తన అక్కా చెల్లెళ్లు ‘ఇప్పుడు తనకేమయినా అయితే పిల్లల్ని చేరదీస్తారా? ‘‘నువ్వుకూడా వెళ్లకుండా ఉండాల్సింది’’ చెల్లి మాటలు ‘‘వెళ్తేనే ప్రేమ ఉన్నట్టా’’ శారదక్క మాటలు గుర్తొచ్చాయి నర్మదకు ..నాన్న కరోనాకి ఎఫెక్ట్ అయ్యినట్టు తనకి సందేహాలు ఉన్నా తనకి చేసిన సాయానికి కృతజ్ఞతగా ఆయన్ని కడసారిచూసి వీడ్కోలుపలకడం తన ధర్మం’’ అనుకుంది.

తల్లి పరిస్థితి గమనించి కీర్తన దగ్గరకి రాబో తుంటే ‘‘వద్దు తల్లీ.. దూరంగా ఉండడి’’ అంది.

‘‘ఎందుకమ్మా..అంత భయపడుతున్నావ్‌. ‌కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్లందరూ చనిపోరు. తాతయ్య క్యాన్సర్‌ ‌పేషెంట్‌ ‌కాబట్టి ఆయనలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది.’’ అంది.

‘‘అమ్మకి కూడా ఆస్మా వుంది కదక్కా. అమ్మకే మయినా అయితే..’’ అన్నాడు పవన్‌ ‌సందేహంగా. ‘‘ఏమీ కాదు..వందేళ్లు వయస్సు ఉన్న వాళ్లు కూడా కోలుకున్న వాళ్లు చాలామంది వున్నారు.’’అంది కీర్తన. పవన్‌ ఏడ్చేశాడు. ‘‘అమ్మా.. నీకేమయినా అయితే.. నేను బతకనమ్మా..’’ అన్నాడు. తమ్ముడ్ని అదిలిస్తూ. ‘‘ఏంట్రా పిచ్చి మాటలు..’’ అంది కీర్తన కోపంగా. నర్మదకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ‘‘అయినా తాతయ్య ఆఖరి చూపుకి మమ్మల్ని కూడా- నువ్వు తీసుకెళ్లాల్సింది మమ్మీ.. తాతయ్య మనందరికీ సాయం చేశాడు కానీ,. నీ ఒక్కదానికే కాదు కదా..’’ అంది కీర్తన బాధగా. సాయంత్రంగా లలితక్క ఫోన్‌ ‌చేసింది. ‘‘నేను రాపిడ్‌ ‌టెస్ట్ ‌చేయించుకున్నాను.. బై గాడ్‌ ‌గ్రేస్‌ ‌నాకు నెగిటివ్‌ ‌వచ్చింది’’ చెప్పింది. నర్మద కళ్లు ఆనందంతో మెరిశాయ్‌.. ‘‘‌కంగ్రాట్స్ అక్కా.. నాన్నకి సర్వీస్‌ ‌చేసినా నీకు పాజిటివ్‌ ‌రాలేదు. దేవుడికి వందసార్లు ధాంక్స్ ‌చెప్పాలి’’ అంది. ‘‘నువ్వు కూడా టెస్ట్ ‌చేయించుకో చెల్లీ..’’ అంది లలితక్క ‘‘వారం రోజులు నాన్నకు సేవచేసిన నీకే నెగిటివ్‌ ‌వస్తే నాకు పాజిటివ్‌ ఎం‌దుకు వస్తుంది అక్కా.’’ అంది. ‘‘కీడెంచి మేలు లెక్కపెట్టాలికదా’’ అంది. నర్మద వెంటనే ఏమీ మాట్లాడలేదు. అవతల లలితక్క ఏడుస్తున్న చప్పుడు విన్పించింది.  ‘ఏంటక్కా ఏడుస్తున్నావా?’’ అంది. ‘‘అవును చెల్లీ నాన్న గుర్తొస్తున్నాడు. ఆయన మాట్లా డిన ఆఖరి మాటలు గుర్తొస్తున్నాయి’’ అంది. ‘‘ఏం చెప్పాడక్కా?’’ అడిగింది. ‘‘చెల్లి దిక్కులేని జీవి తాన్ని జీవిస్తుందమ్మా.. దానికి అండగా నిలువ మని ఆఖరి శ్వాసవదిలాడు’’ నర్మద కళ్లలోకూడా నీళ్లు చిప్పిల్లాయి. ‘‘ఆయన ప్రాణాలన్నీ నీమీదే ఉన్నాయ్‌ ‌చెల్లీ’’ అంది. ‘‘నాన్న ప్రేమ గురించి నాకు తెలుసక్కా.. అందుకే చిన్నక్కా, చెల్లీ వారిస్తున్నా ప్రాణా లకు తెగించి పచ్చి నాన్నను చూశాను. అది నా మనోధర్మం’’ అంది నర్మద. ‘‘నేను నా ధర్మాన్ని నిర్వర్తించలేదు..’’ అను కుంది గొణుగుతూ లలిత.  రెండునెలల తర్వాత ఒక రిజిష్టర్‌ ‌పార్శిల్‌ అం‌దుకుంది నర్మద. అవి వీలు నామా పత్రాలు. అందులో ఒక ఉత్తరంకూడాఉంది.

‘‘చెల్లీ నాన్నని చేతులారా పోగొట్టుకున్నామేమో అన్న బెంగ నన్ను ప్రతిరోజూ కృంగదీస్తుంది.

నిజానికి అందరికంటే నాన్న ఎక్కువ మేలు చేసింది నాకే. పాతికేళ్లక్రితం మీ బావ బావిలో పడి చనిపోయిన విషయం నీకు తెలిసిందే. అది ఆఫీసులో గొడవలతో చనిపోయాడని ప్రపంచం అనుకుంది. నా గయ్యాళి తనం, నా అనుమానాలే మీ బావని మృత్యువు దగ్గరికి తీసుకెళ్లింది. మీ బావ తాలూకూ వ్యక్తులు ‘నేనే మీబావని హత్య వేసి బావిలో పడేశా’నని నిందలు వేశారు. నేను వణికి పోయాను. నాన్న తన ప్రతిష్టనంతటిని అడ్డుగా వేసి నన్ను కాపాడారు. మీ బావ ప్రభుత్వ ఉద్యోగం కూడా నాకు వచ్చేలా చేశారు. నేను వాళ్ల నాన్న హంతకురాలినని పిల్లలు నా నుండి దూరంగా వెళ్లి పోయారు. డబ్బుకి లోటులేదు కానీ ఒంటరి జీవితంతో కుంగిపోయాను. నాన్నే లేకుంటే నేనెప్పుడో లోకం వదిలి పోయేదాన్నేమో.ఈ మధ్యే నా పిల్లలు నాకు దగ్గరవుతున్నారు. నేను సంపాదించే ప్రతి పైసా వాళ్లకే చెందాలని పొదువు చేస్తున్నాను. నాన్న జ్వరంతో వచ్చినప్పుడే నాలో అనుమానం వేసింది.

ఏ ప్రవేటు హాస్పిటల్లోనో చేర్పిస్తే కరోనా అంటారేమో నా దగ్గరున్న మొత్తం డబ్బు హాస్పిటల్‌ ‌ఫీజుల క్రింద తీసేసుకుంటారేమోనని భయపడినేను హాస్పిటల్లో సమయానికి చేర్చలేదు. బహుశా సకాలంలో చేర్చుంటే నాన్న కొంతకాలం మన మధ్య ఉండేవారేమో. ఎందుకో మనసు పీకి ఎట్టకేలకు ఒక ఆలోచన కొచ్చి, సీటీ స్కాన్‌ ‌చేయిస్తే రిపోర్టులు రాకముందే..అదే రోజు నాన్న లోకం వదిలి పోయారు. బిడ్డగా నేను నా ధర్మాన్ని నెరవేర్చలేదేమో అన్పించింది. ఆయనకి సేవ చేయడానికి కూడా నేను వెనుకా ముందూ ఆడేదాన్ని. ఆ దూరం నాకు కరోనా రాకుండా కాపాడిందేమో కానీ అంతకు మించిన డబ్బు జబ్బు నా రక్తంలో ఉందని గుర్తించలేక పోయాను. నాన్నని కాపాడుకోలేకపొయ్యానన్న గిల్టీ ఫీలింగ్‌ ‌కంటే మరో రోగం మరేముంటుంది? అన్నం సయించడం లేదు. చిక్కి శల్యమవుతున్నాను. పిల్లలు కూడా నా దగ్గరకు రావడం మానేశారు. ఆరోగ్యం క్షీణించింది. ఎప్పుడు మృత్యుఒడిలోకి వెళతానో నాకే తెలీదు. నాన్న పోయాక ఆర్థికంగా నువ్వు చాలా విషమ పరిస్థితిలోకి వెళ్లావని నాకు అర్థమవుతుంది. నాన్నకి కరోనా ఎఫెక్ట్ అయ్యిందేమో అన్న సందేహాలున్నా అన్నింటికీ తెగించి నాన్నను చివరి చూపు చూడాలనివచ్చిన నీ మనోధర్మం ముందు నేను దూది పింజలా మారిపోయాను. చెల్లీ నేను సంపాదించుకున్న ఆస్తి మొత్తం నీ పేరు మీద నీ పిల్లల పేరు మీద రాస్తున్నాను ఒకవేళ నేను రాలిపోతే నీ పిల్లలే నా ఆస్తికి వారసులు. నీ అక్క లలిత.’ ఉత్తరం చదివి హతాశురాలైంది నర్మద.

‘‘ఎందుకు చేశావక్కా ఇలా ఏమైంది నీకు?..’’ అని దుఃఖ పడుతుంటే అక్కడికి వచ్చింది కీర్తన. తల్లి చేతిలోని ఉత్తరం, ఆస్తి పత్రాలు చూసింది.

‘‘పెద్దమ్మ ఆస్తి ఏమీ మనకు వద్దమ్మా. ఈ ఏడాది ఇంటర్‌ అయిపోతుంది నాకు. నేను జాబ్‌ ‌చేస్తాను.’’అంది కీర్తన చేతిలో లలిత ఆస్తి పత్రాలు ముక్కలు ముక్కలు అయ్యాయి.

About Author

By editor

Twitter
YOUTUBE