ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

– పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

‘‘ఇవన్నీ నేను మాట్లాడాలనుకోలేదు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం చెప్పాలనుకున్నాను. అమ్మ ప్రసక్తి తీసుకువచ్చావు. అందుకని ఇంతసేపు మాట్లాడాను. మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అమ్మమ్మా…! నీకు చెప్పే వయసు కాదు నాది’’.

‘‘అయినా చెబుతున్నావు కదా!’’

‘‘ఎవరో ఒకరు మాట్లాడాలి అమ్మమ్మా’’.

‘‘ఎలా చదువుతున్నావు?’’

‘‘ఇప్పటిదాకా శారీరకంగా, వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధుల గురించి తెలుసుకుంటున్నాను. ఇప్పు డిప్పుడు నాకు అర్థం అవుతోంది. నేను పరిశోధించా ల్సింది మానసిక వ్యాధుల గురించి అని. ఆ ప్రయత్నంలో ఉన్నాను’’.

తులసి మాట్లాడలేదు.

‘‘ఇవన్నీ మరిచిపో అమ్మమ్మా… బీ హాపీ’’

‘‘నాకు నిన్ను చూడాలని ఉంది’’ అంది మెల్లగా.

‘‘నేనే ఎప్పుడో వస్తాను’’.

‘‘ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు?’’

‘‘నన్ను అర్థం చేసుకునే మనిషి దొరికినప్పుడు. ఎప్పుడూ అహానికి లోనుకాని మనిషి కావాలి. నన్ను గాఢంగా ప్రేమించకపోయినా ఫర్వాలేదు. నాతో భిన్నాభిప్రాయం కలిగితే నాకు చెప్పాలి. మేం ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోగలగాలి. సమస్యలు పరిష్కరించుకోవాలి. అంతకు మించిన  సంపదలు నాకు అవసరం లేదు అమ్మమ్మా….’’

దిగ్భ్రాంతితో వింటోంది.

‘‘మేం నిరంతరం పేషెంట్ల మధ్య వుంటాం. మా దగ్గరకు మల్టీ మిలియనీర్స్ ‌వస్తారు. గొప్పగొప్ప కళాకారులు వస్తారు. అప్పుడు వారితో మాట్లాడ టానికి మనుషులుండరు. ఐ.సి.యు. బయట ఆస్తుల గురించి, వారసత్వాల గురించి మంతనాలు జరుగు తుంటాయి. ప్రతి పేషెంట్‌ ‌వెనక ఓ కథ ఉంటుంది అమ్మమ్మా… కొంతవరకే మాకు చెప్పగలరు. వీటి మధ్య నాలాంటి వారికి జీవితం ఏమిటి అన్న ప్రశ్నలు వస్తుంటాయి. ఇవన్నీ మెదడు కల్పించే అనేక భావనలు. మెదడు ఇన్ని ఆవేశాలకు, అహంకారాలకు ఎందుకు లోనవుతుందో అని పరిశోధన చేయాల నుంది’’.

‘‘నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నిజం గానే’’ అంది తులసి.

‘‘డబ్బుకి, అధికారానికి, కుట్రలకి మనసు అతీతంగా వుండాలి. మనం చేసే అన్ని పనులకి మెదడు…చిన్న మెదడు కారణం అని తెలుస్తున్నప్పుడు మాత్రం నేను ఆశ్చర్యపోతుంటాను. మనం కొన్ని నమ్ముతాం. బ్రహ్మ అన్నీ మన నుదుట రాసి భూమ్మీదకి పంపిస్తాడు అని. ఇదంతా ముందే రాసి ఉంటే మనం నిమిత్త మాత్రులం కాదా! ఇందులో మన పొరపాట్లు ఉండవు. మారాల్సింది ఉండదు కదా!’’

నిశ్శబ్దం.

‘‘ఇంక మాట్లాడను. నాకు తాతయ్య గుర్తుకు వస్తున్నాడు’’ అని ఫోన్‌ ‌కట్‌ ‌చేసింది. తులసి ఫోన్‌ని అలా చూస్తుండిపోయింది.

* * * * * * * *

ఆమె వేదిక మీదకు వచ్చింది.

అప్పటికే కొంతమంది గుసగుసలాడుకోవటాన్ని ఆద్య గమనించింది.

‘‘ఇప్పుడు నేను ఫ్యామిలీ గురించి మాట్లాడా లనుకుంటున్నాను. యస్‌. ఈ ‌ప్రపంచంలో చాలా సమస్యలు వున్నాయి. వాటన్నిటి గురించి ఇప్పటి దాకా అనేక మంది మాట్లాడారు. పేపర్స్ ‌సబ్మిట్‌ ‌చేసారు. వాటి మీద ఇక్కడకు వచ్చిన వాళ్లందరం మన స్వంత ఇళ్లకు చేరాక ఆలోచిస్తాం. చర్చిస్తాం.

మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్‌లో ‘హౌస్‌’‌కి ‘హోమ్‌’‌కి మధ్య తేడా వుంది. మనలో చాలా మందికి ‘హౌస్‌’‌లు వున్నాయి. హోమ్స్ ‌లేవు. ఇప్పుడు మిగతా పనులన్నీ వాయిదా వేసి ఓ ఫ్యామిలీని తిరిగి నిర్మిం చాలి అని మన పెద్దలు చాలామంది ఇంతకు ముందు హెచ్చరించారు. మనం అనేక విషయాలను వాయిదా వేస్తుంటాం. మనకున్న చిన్న అనుభవంతో ప్రపంచం గురించి వ్యాఖ్యానం చేస్తుంటాం. సమస్య లోతుల్లోకి వెళ్లటం ఉండదు’’.

‘‘ఏదో ఒక ఆసరా లేని ఆడవారూ-మగవారు ఉండరు. అనాథ•లకు కూడా ఆశ్రమాల్లో, రోడ్లో వుంటాయి. మనం సెక్యూర్డ్ ‌లైఫ్స్ అనుభవిస్తూ ప్రీచ్‌ ‌చేస్తుంటాం. నేను ఇక్కడున్న ఫ్రెండ్స్‌ని అడుగు తున్నాను. మీకు మీ ఫ్యామిలీస్‌లో సమస్యలు లేవా? మీ పిల్లలతో లేవా? మీ పొరుగువారితో లేవా?’’ అని ఆగింది.

గుసగుసల నుండి ఒక్కసారిగా నిశ్శబ్దం.

‘‘నాకున్నాయి. అందుకే నాకు ఫ్యామిలీ విలువ తెలుసు. నేను కుటుంబం అనే వేదిక మీద మాట్లాడు తున్నాను. అది బలహీనంగా ఉందని తెలుసు. నేను నా ఇంటి జీవితాన్ని, సమస్యల్ని, అక్కడి ఘర్షణని వదిలేసి, ముఖం మీద చిరునవ్వుని పులుముకుని మీ ముందు నిలబడలేదు. నేను ఇంకేమాత్రం రెండు రకాల బతుకుని బతకదలుచుకోలేదు.

ఇంతకు ముందు నేను ఎక్కువ ప్రీచ్‌ ‌చేసాను. ఐడెంటీ కోసం తాపత్రయ పడ్డాను. విదేశాలు వెళ్లటానికి, అవార్డులకీ• లాబీయింగ్‌ ‌చేసాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు-నా కుటుంబానికి మధ్య వైరుధ్యం కనిపించింది. ఇక్కడున్న అందరం క్రియే టివ్‌ ‌పీపుల్‌. ‌మన సమస్యలను అర్థం చేసుకోవటానికి సిద్ధాంతాలు అవసరం లేదు. మనం ఎందుకిలా తయారయ్యాం అనేది తెలుసుకోవటానికి మాత్రం అవన్నీ అవసరం. దౌర్జన్యం-హేళన-స్వార్థం-జెలసీ – ఇగో ఇవన్నీ- కుటుంబం నుండి మొదలు అవు తున్నాయి. ఒకప్పుడు అక్కడ త్యాగం ఉంది. సో… ది నీడ్‌ ఆఫ్‌ ‌ది అవర్‌ ఈజ్‌ ‌విహే వ్‌ ‌టు బిల్డ్ ఎ ‌ఫ్యామిలీ’’ అని దిగి వస్తుంటే ఎవరో నవ్వారు.

అక్కడికి వెళ్లి ‘‘థ్యాంక్స్ ‌ఫర్‌ ‌యువర్‌ ‌లాఫ్‌’’ అం‌దామె.

అప్పుడు చప్పట్లు హోరుతో ఆ ప్రదేశం దద్ద రిల్లింది. ఆద్య చప్పట్లు కొడుతూనే వుంది.

* * * * * * * *

జూలీ, ఆద్య తిరుగు ప్రయాణంలో ఉన్నారు.

ఆద్యను జూలీ గమనిస్తూనే ఉంది. ఆద్య ముఖంలో సంతోషం… ఇక్కడికి వచ్చాక మొదటి సారిగా అంత ఆనందం చూస్తోంది.

‘‘నీ సంతోషాన్ని నీ ముఖంలో చూస్తున్నాను’’ అంది జూలీ.

‘‘నాలాంటి వారు ఇంకొంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు కలిగిన ఆనందం అది’’.

అప్పుడు ఆద్య ఫోన్‌ ‌రింగ్‌ అయింది.

‘‘ఎలా వున్నావు శ్వేతా?’’ అంది ఆనందంగా.

‘‘నీ కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేసానో… ఎందుకు ఫోన్‌ ‌కట్టేసావు?’’

‘‘నేను జైపూర్‌ ‌లిటరరీ ఫెస్ట్‌కి వచ్చి తిరిగి వెళ్తున్నాను’’.

‘‘రియల్లీ… మంచి పని చేసావు. అక్కడ నుంచి కొత్త అనుభవాన్ని తెచ్చు కుంటున్నావా?’’

‘‘ఖచ్చితంగా’’.

‘‘నేను కూడా వస్తే బాగుండేది’’.

‘‘నిజంగానే… అందులోనూ నీకు ఇలాంటివి అవసరం. నేను ఇంటికి వెళ్లాక అన్నీ వివరంగా చెబుతాను’’.

‘‘బుక్స్ ‌కొన్నావా?’’

‘‘కొన్నాను. అవన్నీ నీకు మెయిల్‌ ‌చేస్తాను. నేను ఈ మధ్య ఓ పుస్తకం చదువుతున్నాను. అది పూర్తి అయ్యాక నీకు పంపిస్తాను’’.

‘‘అది ఏ విషయం మీద రాసింది?’’

‘‘జర్నీ… ది జర్నీ ఆఫ్‌ ఎ ‌గ్రాండ్‌ ‌ఫాదర్‌… ‌విత్‌…’’ అని ఆగి చెప్పింది.

‘‘ఇద్దరు మనవరాళ్లతో ఓ తాతగారి ప్రయాణం’’.

‘‘తెలుగు పుస్తకమా!’’

‘‘అవును. నువ్వు చదివి తీరాలి’’ అంది.

‘‘అలాగే… మనం మళ్లీ మాట్లాడుకుందాం’’.

‘‘ఎవరీ శ్వేత?’’

‘‘మై కజిన్‌. ‌నాకు అక్క. మా పెద్దమ్మగారి అమ్మాయి’’.

‘‘జాబ్‌ ‌చేస్తోందా?’’

‘‘ఐ.ఎ.ఎస్‌.‌కి ప్రిపేర్‌ అవుతోంది’’

జూలీ పాటలు వినటం మొదలు పెట్టింది.

ఆద్య ఆలోచిస్తోంది. ఇంటి దగ్గర ఓ మహా యుద్ధం జరగనుందని తెలుసు. శ్వేతకి జైపూర్‌ ‌ప్రయాణం గురించి తెలిసి ఉండలేదంటే బహుశా పెద్దమ్మకి కూడా అమ్మ చెప్పి ఉండదు అనుకుంది.

* * * * * * * *

తులసి గదిలో వుంది. రసజ్ఞ మాట్లాడిన దగ్గర్నుండి ఆమెలో ఓ కదలిక మొదలయింది. అది ఆమెను ప్రశాంతంగా కూర్చోనీయటం లేదు. తన జీవితం ఆమె ముందు కనిపిస్తోంది. ఒకప్పటి ఆనందాలన్నీ గుర్తు వస్తున్నాయి. ఎవరో మంత్రం వేసినట్లు ఆ రోజులన్నీ కరిగిపోయాయి.

ఎంతకాలం తను బతికి ఉంటుందో తెలియదు.

‘‘ఇది జీవితమేనా?’’ అని చాలా రోజుల తర్వాత అనుకుంది. సరయూ గుర్తొచ్చింది. అంతలో రసజ్ఞ పక్కన నిలబడినట్లు అనిపించింది. నన్ను అర్థం చేసుకునే మనిషికి మించి సంపదలు అవసరం లేదు అంటోంది ఓ మనవరాలు.

ఫ్యాక్టరీలో సరుకులు తయారయినట్లుగా డిజైనర్‌ ‌బేబీని తయారు చేయిస్తాను. అది ఇంకెవరో కని నాకు ఇస్తారు. డబ్బులు పారేస్తే ఏదయినా కొనుక్కోవచ్చు అంటోంది సరయూ…

ఇప్పటికే వసుంధర-భువనేశ్వరి  మధ్య ఓ యుద్ధం జరుగుతోంది. రేపటి నుండి సరయూ-రసజ్ఞల మధ్య అది కొనసాగుతుందా?

ఇందులో తన పాత్ర ఏమిటి?

ఇప్పటివరకు నేను నా దృష్టి నుండి ఆలోచిస్తు న్నానా? ఇంకొకరిని అర్థం చేసుకునేంత పని ఎందుకు చేయలేదు!

రసజ్ఞ ‘నాకు తాతయ్య గుర్తొస్తున్నాడు’ అంది.

‘‘అంటే…మాఅమ్మ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదన్నావు. ఎప్పుడయినా నీకు తాత గుర్తు వచ్చాడా? అనేగా అడిగింది. ఇన్ని సంవత్సరాల మీ ఇద్దరి ప్రయాణాన్ని ఎలా మరిచిపోయావు. అంత ద్వేషం మీకు ఎందుకు? ఇంత దూరం మీకు ఎందుకు పెరిగింది? మీ ఇద్దరూ కలిసి బతికినప్పుడు ఒక్క మంచి జ్ఞాపకం అయినా మిగల్లేదా?’’

రసజ్ఞ మాటల్లో ఎన్ని ప్రశ్నలున్నాయి.

ఓ కుటుంబాన్ని నిర్మించింది ఇద్దరే… దాన్ని విచ్ఛిన్నం చేసింది కూడా ఇద్దరే. ఇది పరిష్కరించుకో లేనంత శాశ్వత్వమా అంటోంది. చిన్న మనవరాలు సరయూ ఎప్పుడూ తాత గురించి మాట్లాడదు. తన మనసులో ఏముందో తెలియదు. ఏదో ఒక రోజు సరయూ కూడా ప్రశ్నలు అడగటం మొదలు అవుతుంది.

అందరూ మనసుల్లో భావాలు దాచుకుని బతుకుతున్న వారే. సమయం కోసం చూస్తుంటారా?

అలాంటి సమయం తుఫానులా దూసుకు వస్తోందా?

తులసి విలవిలలాడుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘర్షణ జరిగింది. అప్పుడు ఇన్ని సంవత్సరాల బంధాన్ని కాదు అనుకుని వసుంధర దగ్గరికి వచ్చింది. ఇన్ని రోజులూ ఆ ఆవేశంతో బతికింది. ఆ కోపాన్ని సజీవం చేసుకుంది. అదే తనని నడిపిస్తోంది.

ఇంకా అలానే ఆ పంతాలతోనే బతుకుకొన సాగించాలా? నాకేనా ఈ ఆలోచనలు. ఆయనకు రావా? తను పలకరించకూడదా? ఇది మగవాడి తత్వం కాదా?

తులసిలోని మరో మనిషి నిద్ర లేచింది.

‘‘అమ్మా… అంత డిస్ట్రబ్డ్‌గా ఉన్నావేంటి’’ అని వసుంధర అడుగుతుంటే ఆలోచనలు తెగిపోయాయి.

‘‘ఏం లేదు వసూ…’’

‘‘మనం డిన్నర్‌కి బయటకు వెళ్తున్నాం. నువ్వు తయారవ్వమ్మా’’.

‘‘నాకు బయటకి రావాలని లేదు వసూ…’’

‘‘నిన్ను గమనించాకే డిన్నర్‌ అనుకున్నాం. ఈ మధ్య కాలంలో నువ్వు ఇంటి నుంచి బయటకు కదలటం లేదు. రిలాక్స్‌గా వుంటుంది’’.

‘‘ఇంకో రోజు వెళ్దాం. ఈ రోజుకి నన్ను వదిలేయ్‌ ‌వసూ’’ అంది తులసి.

కొద్ది క్షణాలు చూసి వసుంధర ‘‘నీ ఇష్టం అమ్మా’’ అని ఆమె గది నుండి వెళ్లిపోయింది.

‘‘వసుంధరకి కోపం వచ్చిందా?’’ అనుకుం దామె.

వసుంధర జయమ్మ దగ్గరికి వెళ్లింది.

‘‘అమ్మకి ఫోన్‌ ‌వచ్చిందా ఈ మధ్య’’ క్యాజువల్‌గా అడిగింది.

‘‘పుట్టినరోజు నాడు నువ్వు బిజీగా ఉన్నావు. అప్పుడు చిన్నమ్మాయి గారు చేసారు. అందుకని పెద్దమ్మగారికి ఫోన్‌ ‌యిచ్చాను. ఎందుకమ్మా అడుగు తున్నారు?’’ అంది జయమ్మ.

‘‘చిన్నమ్మాయి చేస్తే నన్నూ అడిగేది కదా. అమ్మయినా పిలిచేది. నేను బిజీగా ఉన్నాను. అమ్మ కూడా ఈ విషయం మరిచిపోయింది. అందుకని అడిగాన్లే పెద్ద విశేషం కాదు’’ అంది వసుంధర.

రమేష్‌ ‌దగ్గరికి వెళ్లింది. అతను తయారవు తున్నాడు.

‘‘అమ్మ డిన్నర్‌కి రానంటోంది రమేష్‌’’.

‘‘అదేంటి?’’

‘‘రసజ్ఞ ఫోన్‌ ‌చేసిందంట!’’

‘‘దానికీ డిన్నర్‌కీ సంబంధం ఏమిటి?’’

‘‘తను ఏం మాట్లాడిందో…’’

నిలువుటద్దం ముందు నుండి వెనక్కి తిరిగాడు.

‘‘నాకు భువన మీద అనుమానం. కూతురితో ఈ ఆట ఆడిస్తుందేమో అని’’

‘‘అత్తయ్యని ఫోన్‌లో ఏం మాట్లాడిందో అని అడగకపోయావా?’’

‘‘అది ఫోన్‌ ‌చేసిందని అమ్మ చెప్పలేదు. నేను ఎందుకు అడగాలి?’’ అతనికి అర్థం అయింది.

‘‘అయినా అమ్మమ్మా మనవరాలు ఏదో మాట్లాడుకుంటారు. మీ చెల్లి మీ అమ్మకి ఫోన్‌ ‌చేయలేదు గదా. ఒకవేళ చేసినా మనం ఎందుకు కంగారు పడాలి’’ అన్నాడు.

‘‘మీరు కొన్ని విషయాలను సీరియస్‌గా తీసుకోరు’’.

‘‘సరే… మనం డిన్నర్‌ ‌కి వెళ్దాం’’.

‘‘నాకు డిన్నర్‌కి రావటం ఇష్టం లేదు రమేష్‌’’ అం‌ది.

అతను అంతటితో ఆ విషయాన్ని వదిలేసాడు.

* * * * * * * *

ఆద్య ఇంటిలోపలకి అడుగు పెట్టింది.

తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అఖిల వుంది. అప్పుడే ఆదర్శ్ ‌గది నుండి బయటకు వచ్చాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE