– పి. చంద్రశేఖర ఆజాద్‌,  9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

ఆద్య వెళ్లిన దగ్గర్నుండీ అఖిల ఏ పనీ చేయకుండా అలా తనగదిలో కూర్చుండిపోయింది. ఇంట్లో ఆదర్శ్ ‌లేడు. ‘నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే ఇంటికిరా’ అని ఫోన్‌ ‌చేయబోయి చివరి క్షణంలో ఆగింది.

ఆద్య అన్న మాటలు తలుచుకున్న కొద్దీ రక్తం వేగంగా పరుగులు తీస్తోంది. చివరికి ఆదర్శ్‌ని కూడా నువ్వు వదులుకుంటావు అని ఆద్య బెదిరించింది. నువ్వు ఒక్కదానివే బతకాలనుకుంటున్నావా? అంటోంది. తన చేతుల మీదుగా పెరిగిన పిల్ల. ఇప్పుడు ప్రతి మాటనీ తూటాలా వదులుతోంది. చివరికి ఇంటి నుంచి వెళ్లిపోతా అని బెదిరిస్తోందా? ఎంత అహంకారం వచ్చింది దీనికి అనుకుంది…

గది నుండి బయటకి వచ్చింది. కారు తీసుకుని ఎటయినా తిరిగి రావాలను కుంది. అప్పుడు జోరున వర్షం కురుస్తోంది.

‘‘ఇదేం వాన… ఇప్పుడేంటి? దీనికి వేళాపాళా లేదా? దరిద్రపు వాన అని తిట్టుకుంది. మళ్లీ తలుపు మూసి గది లోపలకి వచ్చింది. ఇంత వాన కురుస్తున్నా గుర్తించలేక పోయానా? బయట బట్టలు తడుస్తున్నాయి అనుకుని అంతలోనే ..తడవనీ’’ అనుకుంది.

అక్కడ నుంచి కదలలేదు. సమయం ఎంత యిందో తెలియదు. ఎప్పుడు వాన ఆగిపోయిందో, ఆకాశంలోకి చందమామ ఎప్పుడు వచ్చిందో తెలియదు. గదిలో బెడ్‌ ‌లైట్‌ ‌వెలుగుతోంది.

అప్పుడు డోర్‌ ‌బెల్‌ ‌మోగింది.

తలుపు తీసింది. ఆదర్శ్ ‌నిలబడి వున్నాడు.

అఖిలకి ఏడుపు వచ్చింది. అతని గుండెల మీద తల ఆనించి ఏడుస్తోంది.

‘‘ఏమైంది అఖిలా… ఎందుకు ఏడుస్తున్నావు?’’

‘‘ఆద్య జైపూర్‌ ‌వెళ్లింది’’.

‘‘ముందు నువ్వు ఏడవటం ఆపేయ్‌… ‌ప్లీజ్‌’’ అన్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.

‘‘ఆద్య జైపూర్‌ ‌వెళ్లే విషయం మనకు తెలుసు. నీకు చెప్పకుండా వెళ్లిందా?’’

‘‘అసలు ఆద్య ఒక్కతే వెళ్లటానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారు?’’

‘‘తన ఫ్రెండ్స్ ‌కూడా తనతో వెళ్తున్నారు’’

‘‘అది ఎన్ని మాటలు అని వెళ్లిందో మీకు తెలియదు కదా?’’

‘‘తెలియదు. నువ్వు చెబితే వింటాను’’ అన్నాడు శాంతంగానే…

‘‘అసలు ఆద్యకి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?’’

అతను రెండు రోజుల నుండి పనులు కావటం లేదనే చిరాకులో వున్నాడు. అయినా ప్రశాంతంగానే ‘‘నేను స్నానం చేసి వస్తాను. ఆకలిగానూ వుంది. తిన్నాక మాట్లాడుకుందాం’’ అన్నాడు.

‘‘అంటే మీకు కూడా  నేను అలుసైపోయానా?’’

‘‘అఖిలా.. ప్లీజ్‌….’’ అని గదిలోకి వెళ్లిపోయాడు.

హతాశురాలై చూస్తోంది. అరగంట తర్వాత వచ్చాడు. ఇంకా అలానే కూర్చుంది. ముఖంలో రక్తపు చుక్కలేదు.

‘‘భోజనం చేద్దామా?’’ అన్నాడు.

‘‘నేను వంట చేయలేదు’’.

‘‘ఇప్పటి వరకు నువ్వు భోజనం చేయలేదా?’’

‘‘మీ అమ్మాయి మాటల్తో నాకు కడుపు నిండిపోయింది’’

‘‘నువ్వు కోపంలో ఉన్నావు. ఆద్య విషయం గురించి కొంతకాలం  పట్టించుకోవద్దని నీకు చెప్పాను. పద. మనం బయటకు వెళ్లి భోజనం చేసి వద్దాం’’ అన్నాడు ఆదర్శ్.

‘‘‌నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్లి తిని రండి’’.

‘‘నువ్వు తినకుండా నేను తినటం ఏంటి… నాన్సెన్స్’’ అన్నాడు చిరాగ్గా…

‘‘అవును. నాకు సెన్స్ ‌లేదు’’.

‘‘నేను ఆ మాట అనలేదు’’.

‘‘నువ్వు కాకపోతే ఆద్య అంటుంది. అది జైపూర్‌ ‌వెళ్లటం నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను ఆదర్శ్… ‌రేపు అది ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరించింది’’.

‘‘మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడే ఆద్యకి ఫోన్‌ ‌చేస్తాను’’ అని ఫోన్‌ అం‌దుకుని చేసాడు.

‘‘స్విచ్చాఫ్‌’’ అని వచ్చింది. ఛ అనుకున్నాడు.

‘‘ఫోన్‌ ‌కట్టేసింది’’.

‘‘దాని ఇష్టం. అది ఏదయినా చేస్తుంది. ఎన్ని మాటలయినా అంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇప్పటికిప్పుడు ఆద్య బయలుదేరి ఇంటికి రావాలి’’.

‘‘ఆద్య రాదు. మనమే జైపూర్‌ ‌వెళ్దాం. రేపు ఉదయం ఫ్లైట్‌లో మనం బయలుదేరుతున్నాం’’.

‘‘నేను రాను’’.

‘‘చాలు’’ అరిచాడు ఆదర్శ్.

‘‘ఇప్పటి దాకా మాట్లాడింది చాలు. ఆద్య నీ కూతురు. అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలు వున్నాయి. అందరూ తెగేదాకా లాగరు. ఇతరుల సహనంతో నువ్వు ఆడుకోవటం మంచిది కాదు’’ అని గదిలోకి వెళ్లిపోయాడు.

*******

‘‘ఇంటికి వెళ్లి వచ్చాక నీలో మార్పు కనిపిస్తోంది రిత్విక్‌’’ అన్నాడు గోవింద్‌.

‘‘ఎలాంటి మార్పు సర్‌’’.

‘‘ఆనందం… ఇక్కడికి వచ్చాక కనిపించని ఆనందం’’.

‘‘ఇల్లంటే అదే కద సర్‌… ‌హారికతో మాట్లాడ టానికి సమయం తక్కువగానే ఉంది. అయినా తనని చూసాను. కొన్ని గంటలయినా మాట్లాడాను’’.

‘‘నువ్వు నీ పిల్లలకు దూరంగా ఉన్నావు. వారి సంగతేంటి?’’

‘‘సర్‌…. ఆడపిల్లలయినా, మగపిల్లలయినా ఎప్పుడూ మనతో కలిసి ఉండరు. అమ్మ తర్వాత చివరి క్షణం వరకు మనతో ఉండేది భార్యే కదా’’.

గోవింద్‌ ‌ముఖంలో భావాలు మారిపోయాయి.

‘‘పిల్లలు కావాలని దూరంగా వెళ్లలేదు. ఉద్యోగాల కోసం వెళ్లారు. నా భార్యకి నలుగురు అక్కలు. ఇద్దరు అన్నలున్నారు. అందరూ ఒకేచోట లేరు. కొంతమంది హైదరాబాద్‌లోనే దూరంగా ఉన్నారు. మా అత్తా, మావయ్య మాత్రం వాళ్ల ఊర్లో ఉన్నారు’’.

‘‘వాళ్లు ఎవరో ఒకరి దగ్గర ఉండరా?’’

అందరూ రమ్మని అడుగుతారు. రారు… వారానికి ఓ ఉత్తరం రాసే వారు అందరికీ. పిల్లలు ఉత్తరాలు రాకపోయినా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి మాట్లాడుతుంటారు. అక్కడ కొంతమంది వాళ్ల గురించి, ఆడపిల్లలూ, మగపిల్లలూ, పట్టించుకోరు అంటారు. అది నిజం కాదు సర్‌….’’

ఆశ్చర్యంగా చూస్తున్నాడాయన.

‘‘ఎవరో ఒకరు వెళ్లిపోయేంతవరకూ అక్కడే వుంటారు. ఓసారి మా మావయ్యను అడిగాను. ఇంతమంది మనవళ్లు, మనవరాళ్లు మీకు ఉన్నారు. వారిని చూడాలనిపించదా… ఆడుకోవాలనిపించదా అని’’.

‘‘అప్పుడేం చెప్పారు?’’

‘‘అయిదుగురు ఆడపిల్లలకి కాన్పులు మేమే చేసాం అల్లుడూ… ఒక్క నీ రెండో వాడికి తప్ప. మా దగ్గర ఆరు నెలల నుండి సంవత్సరం ఉన్నారు. ఆడ పిల్లలకి ఇబ్బంది వచ్చినప్పుడు కొంతమంది కొంతకాలం మా దగ్గర ఉండి చదువుకున్నారు. అలాంటి ముచ్చట్లు తీరాయి. ఎప్పుడయితే పిల్లలకు పెళ్లి అవుతుందో, వారు చదువుకోవటం మొదలు పెడతారో వారికి ఇంకో లోకం తయారవుతుంది. అలాంటిది లేకపోతే మనుషులు బతకటం కష్టం అల్లుడూ అన్నారు’’

గోవింద్‌ ‌తలూపాడు.

‘‘మా అమ్మ చనిపోయింది మా ఇంట్లోనే. దానికి ముందు మా నాన్న చనిపోయాడు. అలాగే మా మావయ్య చనిపోయాడు. మీ అత్త గానీ, నేను గానీ పది రోజులు బాధ పడ్డాం. మీ అత్త ముందుగా పోతే పది రోజులు కాదు… బతికున్నంత కాలం కోలుకోవటం కష్టం. ఆ దిగులుతో పోవలసిందే అన్నాడు సర్‌…. ఇప్పుడు నాకు ఆయన మాటలు బాగా అర్థం అవుతున్నాయి’’ అన్నాడు.

‘‘నిజమే రిత్విక్‌… ‌వెనకటి వారు చదువుకోక పోవచ్చు. కానీ వారి అనుభవం ముందు మనమెంత?’’ అన్నాడు గోవింద్‌.

*******

ఆద్య – ఫ్రెండ్‌ ‌రూమ్‌కి వచ్చారు.

వారి చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి.

‘‘నువ్వేంటి ఫోన్‌ ‌కూడా తీసుకురావటం లేదు’’ అంది గదిలో ఆద్య ఫోన్‌ని చూడగానే!

‘‘నేను వచ్చిన పర్పస్‌ ‌వేరు జూలీ’’ అంది.

‘‘అయినా ఏదన్నా అర్జెంట్‌ ‌మెసేజ్‌లు ఉంటే… ఇప్పుడు టెలిగ్రామ్‌లు కూడలేవు’’ అంది జూలీ…

‘‘అలాంటి పరిస్థితి వస్తే జైపూర్‌ ‌ఫెస్టివల్‌ ‌వాళ్లకు చెబుతారు. వాళ్లు స్జేజ్‌ ‌మీద ఆద్య ఎవరు… మీకు అర్జెంట్‌ ‌మెసేజ్‌ ఉం‌దని ఎనౌన్స్ ‌చేస్తారు. మనం ఇప్పుడు ఫోర్‌ ‌జీ యుగంలో వున్నాం. అది కూడా కొన్ని నెలలే’’ అంది.

‘‘సెమినార్‌ ‌పేపర్స్, ‌డిస్కోర్సెస్‌ ‌మరీ హెక్టిక్‌గా ఉన్నాయా?’’

ఆద్య వెళ్లి మంచం మీద కూర్చుంది. చిన్నగా ఆలోచించింది.

‘‘క్యాహువా?’’ అంది జూలీ.

‘‘మతం గురించి మాట్లాడారు. జెండర్‌ ‌గురించి, థర్డ్ ‌జెండర్‌ ‌గురించి, యుద్ధాల గురించి, వాట్‌ ‌నాట్‌… అన్నీ సమస్యలే. నేను కాదనను. వాట్‌ ఎబౌట్‌ ‌ఫ్యామిలీ?’’ అంది.

‘‘వీటిలో ఫ్యామిలీ లేదా! ఇవన్నీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాయా?’’ అంటూ…

‘‘నువ్వు కుటుంబం గురించి ఎందుకింత స్ట్రెస్‌ ‌చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు’’.

‘‘నేను చాలా సెమినార్లు గాని, మహాసభల గురించి గాని విన్నాను. వాటి ప్రారంభం ముందో, మధ్యలోనో, చివర్లోనే ఓ పాట పాడుకుంటారు. అది ఏ లాంగ్వేజ్‌లోనయినా ఉండవచ్చు. ‘జగమంత కుటుంబం నాది’ అన్నది యూనివర్సల్‌ ‌కాంసెఫ్ట్. అవునా?’’

‘‘సో వాట్‌…’’

‘‘ఇక్కడ జగమంత కుటుంబం గురించి మాట్లాడటం లేదు. కుటుంబాల రద్దు గురించి వాయిసెస్‌ ‌వినిపిస్తున్నాయి. ఎస్టర్‌ ఇయర్స్ ‌క్లాసిక్స్ ‌మీద న్యూలుక్‌ ‌కనిపిస్తోంది. అవన్నీ వింటుంటే నాకు కొంచెం….’’

‘‘కోపంగా వుందా? ఇవన్నీ నిజాలు కాదా? వాటి మీద మాట్లాడే రాసే రైటర్స్‌కి స్వేచ్ఛ లేదా?’’ అంది జూలీ.

‘‘అసంతృప్తిగా ఉంది. కోపం కాదు…. హూయామ్‌ ఐ ‌నాట్‌ ‌టు టాక్‌ ఆర్‌ ‌నాట్‌ ‌టు రైట్‌ అనటానికి. సెకండ్‌ ‌సైడ్‌ ఆఫ్‌ ‌ది కాయిన్‌ ‌చూడ మంటున్నాను. అసహనానికి ఎవరూ గురి కావద్దు అంటున్నాను. యస్‌… ‌నా స్పేస్‌ ‌కోసం నేను ఫైట్‌ ‌చేస్తాను. ఇంకొకరిని ఎందుకు వద్దంటాను?’’ అంది ఆద్య.

‘‘అలాంటి కొత్త కోణం వద్దంటావా?’’

‘‘ఓ కాలంలో అవి జరిగాయి. అప్పుడు రాసిన వాళ్లేదో రాసారు. ఆ కాలం ప్రభావం వారి మీద వుంటుంది. అదే సమయంలో వారిని వ్యతిరేకించిన వారు అప్పుడూ ఉన్నారు. అందులో మిత్‌ ‌వుంది’’.

‘‘ఆ వాయిస్‌లు వినిపించింది ఎక్కడ? జీవితం లోనూ, సాహిత్యంలోనూ ఎప్పుడూ అణిచివేత ఉంది ఆద్యా?’’

‘‘అది నిజమే. అందుకని ఇప్పుడు రివెంజ్‌ ‌తీర్చుకుంటారా?’’

జూలీ చిత్రంగా చూసింది.

‘‘నా మాటలు నీకు నచ్చలేదు. కానీ అలా చూడ నవసరం లేదు. ఎదుటి వారందరూ మూర్ఖులు అన్నట్లు’’ అంది చిరునవ్వుతో…

‘‘జగమంత కుటుంబంలో ఆడవాళ్లు, మగవాళ్లు, రకరకాల వర్గాల వారు, వర్ణాల వారు, మతాల వారు మాత్రమే ఉంటారా? జూలీ ‘లివ్‌ ఇన్‌’ అం‌టున్నాం కదా… దాని అర్థం ‘సహజీవనం’. కలిసి బతకటం ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది? ఇట్స్ ‌ఫ్రమ్‌ ‌ఫ్యామిలీ’’ అంది ఆద్య.

‘‘కానీ….’’

‘‘ఆడవాళ్లం ఉన్నాం. అందులోనూ ఇవన్నీ ఉన్నాయి. థర్డ్ ‌జెండర్‌ ఉన్నారు. అక్కడ రంగు, ప్రాంతం, దేశం ఉన్నాయి. ఎవరికి వారు బృందా లుగా విడిపోయి జీవనం చేద్దామా? అసలు గమ్యం ఏమిటి? ఆ క్లారిటీ రాకుండా నేను ఈ ప్రపంచం మారుతుందని అనుకోను’’.

‘‘ఓ.కే… ఓ.కే’’ అని ‘‘మనం బయటకు వెళ్లాం. వైన్‌ ‌తీసుకుందాం’’.

‘‘నాకు వైన్‌ ‌తీసుకునే అలవాటు లేదు’’.

‘‘భయపడుతున్నావా? అది మగవాళ్ల కేనా?’’

‘‘నాకు భయం లేదు. నాకు ఆ వాసన నచ్చదు. పురాణకాలం నుండి ద్రాక్ష సారాయో, నాటు సారాయో ఆడవాళ్లు కూడా తాగుతున్నారు ఎలాంటి భయాలు లేకుండా… గర్భవతులకి కూడా మద్యం ఇవ్వటం గురించి నేను విన్నాను. మగాళ్ల మీద యుద్ధం చేయటానికి చాలా విషయాలు ఉన్నాయి. వైన్‌ ‌నీకు రిలాక్సేషన్‌ ఇస్తే హాపీగా తీసుకో… నీ పక్కన నేను సాఫ్ట్ ‌డ్రింక్‌ ‌తీసుకుంటాను’’.

‘‘గూడ్‌ ‌గూడ్‌… ‌మనం పది నిముషాల్లో బయలుదేరదాం’’ అని రెస్ట్ ‌రూమ్‌కి వెళ్లింది. జాలీ సిగరెట్లు తాగుతుంది. అది ఆద్యకు తెలుసు. అయినా అభ్యంతరం చెప్పదు. ఎవరి మీదో కసి తీర్చుకోవ టానికి మాత్రం ఏ పనీ చేయటం ఆద్యకి ఇష్టం వుండదు.

ఇద్దరూ బయటకు వెళ్లారు తర్వాత….

అక్కడ ఫెస్టివల్‌కి వచ్చిన వారు కొంతమంది కనిపించారు. వారిలో వివిధ దేశాల వారున్నారు. పరిచయాలు చేసుకున్నారు. ఒకరిద్దరు ఆద్యతో ప్రత్యేకంగా మాట్లాడారు. మీ ప్రజల లైఫ్‌ ‌స్టయిల్‌ ఎలా ఉంటుందని అడిగారు.

‘‘మీ ఫ్యామిలీ స్ట్రక్టర్‌ ‌బాగుంటుందని అంటారు.. అందులోని ప్రత్యేకత ఏమిటి?’’ అన్నారు.

‘‘ఒకప్పుడు బాగుండేది. అప్పుడూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు. మా కుటుంబాల మీద అన్ని ప్రభావాలూ పడ్డాయి. పడుతున్నాయి. జెలసీ, ఇగో, అసహనం, ఇలాంటి వెన్నో మా ఫ్యామిలీ స్ట్రక్చర్‌ ‌ని దెబ్బతీయటమే కాదు డిస్ట్రాయ్‌ ‌చేస్తున్నాయి’’ అంది.

*******

అఖిల, ఆదర్శ్‌ల మధ్య వాతావరణం ఇంకా వేడిగానే వుంది. అఖిల తనంతట తను కంట్రోల్‌ అయ్యేదాకా ఆమెను కదిలించటం మంచిది కాదు అనుకున్నాడు. అందుకే ఆమె మానాన ఆమెను వదిలేసాడు. అయితే కాఫీ తీసుకు వచ్చి ఓ పక్కన ఉంచి వెళ్తుంది. భోజనం దగ్గర మౌనంగా పక్కన ఉం డి తింటుంది.

అతను బయటకు వెళ్తుంటాడు.

అప్పటి నుంచి ఆలోచనలు మొదలు అవుతున్నాయి.

అఖిల అక్క స్వప్న. వాళ్లు చెన్నైలో ఉంటారు. వాళ్లకి కూడా ఒకే అమ్మాయి. పేరు శ్వేత. ఆద్యకి అక్క అవుతుంది. బావ శ్రీనివాస్‌. ‌వాళ్లకు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. శ్వేతకు ఇంకా పెళ్లికాలేదు. తను ఐ.ఎ.ఎస్‌.‌కి ప్రిపేర్‌ అవుతోంది. మొదటసారి తను ఫెయిల్‌ అయింది. ఈసారి ఎలా అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE