స్వరాజ్య సమరంలో  ఆయనొక అజ్ఞాతయోధుడు

పూజ్యశ్రీ గురూజీ

పరమ పూజనీయ డాక్టర్‌జీ కర్మమయ జీవనం సామాన్యునికి ఆశావహమైన సందేశాన్ని ఇస్తోంది. దారిద్య్రము, పెద్దల ఉదాసీనత, ప్రతికూల పరిస్థితి, అడుగడుగునా విరోధాలు, ఉపేక్ష, అపహాస్యాలు – అన్నిటినీ ఎదుర్కొని, స్వీకృత కార్యాన్ని పూర్తిచేయడానికి దానిలో తన్మయులై ‘‘ముక్త సంగోనహం వాదీ’’ ప్రవృత్తితో సుఖదుఃఖాలు, యశాపయశాల చింత లేకుండా ప్రయత్నశీలతతోనే  వ్యక్తికి సఫలత ప్రాప్తించి తీరుతుందని వారి జీవితం చెపుతోంది.

డాక్టర్‌జీ జీవన గ్రంథానికి శీర్షికగా ఉన్న ‘‘క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే’’ అనే సుభాషితం సముచితమైనది. కుటుంబ బాధ్యతల వల్ల నిరాశ చెందిన వ్యక్తులు, సమాజకార్యంలో పనిచేస్తూ విఘ్నాల వల్ల నిరాశ చెంది కార్య పరాజ్ము ఖులనే వ్యక్తులు, వారి పవిత్ర జీవనం నుండి ఆశా సందేశాన్ని పొంది, సదా కార్యశీలురుగా ఉండే ప్రేరణను పొందుతారు. వారి జీవనం నుండి ప్రేరక సిద్ధాంతాన్ని, కొన్ని గుణాలను గ్రహించి మన జీవనాలలో వాటికి స్థానం ఇవ్వడం శ్రేయస్కరం. ఈ దృష్ట్యా వారి గుణాలను కొన్నిటిని స్థూలంగా పేర్కొనడం జరుగుతోంది.

రాష్ట్రోన్నతికై అచంచల దీక్ష

వారిలో మొట్టమొదటగా పేర్కొనదగిన గుణం రాష్ట్ర విముక్తికి, రాష్ట్రోన్నతికి గల అచంచల దీక్ష. ఈ రాష్ట్రభక్తి బాహ్య పరిస్థితుల వల్ల ఉత్పన్నం కాలేదు, అది జన్మసిద్ధమైన వారి స్వభావం. బాల్య కాలం నుండి అది వ్యక్తమవుతూ వచ్చింది. దేశం విదేశీ యుల పాలనలో ఉండడంవల్ల దాని ఆవిర్భావం ఒక విశిష్ట స్వరూపాన్ని పొందడం అపరిహార్యమయింది. ఏదో విధంగా విదేశీ రాజ్యాన్ని మన దేశంనుండి ఉన్మూలనం చేయాలనే వారి ఇచ్చ భక్తి నుండియే జనించింది. నిర్భీకత, పౌరుషం వారి అంతః కరణంలో ఉండడంవల్ల సాయుధ విప్లవం పట్ల వారికి సహజమైన అభినివేశం ఉండేది. కానీ అన్య మార్గాల ఉపయుక్తతను అంగీకరించని క్షుద్ర భావన వారిలో లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతులలో విదేశీ ప్రభుత్వాన్ని పారద్రోల యత్నించడంలో తప్పులేదు. తన మార్గమే ఏకైక మార్గమని పిడివాదం చేయకుండా, అన్య మార్గాలను అవలంబించే వారిని హీనులుగా పరిగణించకుండా అందరిపట్ల పని చేయడమే వారి సహకార భావంలోని ఉదాత్త లక్షణం.

 నేటి రాజకీయ పక్షాల కీచులాటలను చూచినప్పుడు డాక్టర్‌జీ జీవనంలోని ఈ గుణపాఠం నేటి పెద్దల అంతఃకరణాలను కూడా ప్రభావితం చేయడం, సార్వజనిక జీవనంలో సహకారంతో, సౌజన్యంతో, పరస్పర పూరకభావంతో కూడిన వాతావరణాన్ని కలిగించడం ఎంత అవసరమో స్పష్టమవుతుంది.

హిందూరాష్ట్రం వాదాతీత సత్యం

తమ ఉగ్రస్వభావం కారణంగా సాయుధ విప్లవోద్యమం వారికి ఇష్టమయింది. కాని వారి ప్రేరణ కేవలం రాష్ట్రభక్తిపూరితం కావడం వల్ల ఆంగ్లేయులు విదేశీయులైన శత్రువులు కనుక వారిని నిరోధించడమే ఏకైక కార్యమనే దృక్పథం వారికి లేదు. కనుక వారు తమ అంతఃకరణంలో భక్తితో పూజించే ఆ రాష్ట్రం యొక్క స్వరూపం ఎట్టిది? దాని ప్రకృతి పరంపర, ఆదర్శాలు ఎట్టివి? – ఈ మౌలిక సమస్యను లోతుకుపోయి ఆలోచించారు. ప్రాచీన కాలం నుండి జరిగిన, తాము ప్రత్యక్షంగా చూచిన వివిధ సంఘటనల ద్వారా మన ఈ పుణ్యభూమి యొక్క రాష్ట్ర ఆజీవనం హిందూ జీవనమనే త్రికాలాబాధిత సత్యం వారికి సంపూర్ణంగా సాక్షాత్క రించింది. వారి జీవనకాలం నుండి నేటివరకు ప్రచురింపబడుతూ వచ్చిన అనైతికము, అసత్యము అయిన కలగూరగంప రాష్ట్రవాదం బుద్ధికి, తర్కానికి అందనిది. విశుద్ధ రాష్ట్రభావానికి విరుద్ధము అయినది. రాష్ట్రవాదంలో స్వకీయ, పరకీయులను, రాష్ట్రీయ సమాజాన్ని దాని శత్రువులను-విదేశీ ఆక్రమణదారులను, వాటి నుండి స్వదేశాన్ని, స్వసమాజాన్ని, స్వజీవన వైశిష్ట్యాన్ని రక్షించడానికై ప్రాణాలనొడ్డి పోరాడేవారిని గుర్తించడంలో క్షమార్హం కాని పొరపాటు జరిగింది. మన రాష్ట్రం ఏ భ్రమతో పని చేస్తూ ఉంటుందో, అలా ఉన్నంతవరకు మహా అనర్థాల పరంపర దానిపై పడుతూనే ఉంటుంది. రాష్ట్ర జీవనం అవమానకరంగా అసురక్షితమై, సంకటగ్రస్తమై చివరకు నాశనమయ్యే అవకాశం ఉంది.

ఈ విషయం గత 40 ఏండ్ల సంఘటనల వల్ల అందరికీ నిరూపితమయింది. పక్షాభినివేశాన్ని, దురాగ్రహాన్ని, ఇతర సమాజాల భీతిని హృదయం నుండి తొలగించి మన రాష్ట్రజీవనాన్ని పరిశీలించే పక్షంలో డాక్టర్‌జీతోపాటు మనమంతా కూడా ఇది మన హిందూ రాష్ట్రమని, స్వపరాక్రమం వల్ల సదా దీనిని సర్వశ్రేష్ట స్థితిలో ఉంచుతామనీ ప్రకటిస్తాము. స్వరాష్ట్రాన్ని గురించి పూర్వ పక్షం, ఉత్తర పక్షం చేసి, దానిని వివాద విషయంగా మార్చి ‘మనది హిందూరాష్ట్రమ’ని నిరూపించడం వాస్తవానికి డాక్టర్‌జీ యొక్క ప్రగాఢ అనుభూతికి పొసగని విషయం. హిందూ రాష్ట్రము వాదాతీతమైన సత్యం.

ధ్యేయశరణ జీవనం

మనకు ఆరాధ్యమైన హిందూ రాష్ట్రం యొక్క పరిపూర్ణ సాక్షాత్కారం పొందిన వారు గనుక, వారికి అవరోధాలు, వేదనలు సుసహ్యము అయ్యాయి. రాష్ట్రభ క్తి యొక్క ప్రభావాలు వ్యక్తిగత, కుటుంబ జీవనాల ఆకర్షణను స్వార్థాలను భస్మంచేసే అలౌకిక సుఖాన్ని వారిచే అనుభవింపజేసింది. వారి జీవనంలో ఈ స్వరాష్ట్ర శరణ నిస్వార్థ భవ్యమూర్తి మనకు కనపడుతుంది. వ్యక్తిగత ఆశయా కాంక్షలవంటి నమస్త స్వార్థాలనూ దగ్ధం చేసే రాష్ట్ర సేవాజీవనం యొక్క విశుద్ధమైన బంగారం వంటి స్వరూపం మనకు గోచరిస్తుంది. సదా ప్రసన్నమై చిరునవ్వు చిందే వారి వదనంలో స్వార్థశూన్యతలో నిజమైన సుఖం, జీవనంలో సార్థకత నిహితమైనదనే విస్పష్ట సందేశం మన అంతఃకరణానికి అందుతుంది.

అంతర్బాహ్య శుచిత్వం

స్వార్థ శూన్యమైన ధ్యేయశరణ జీవనమే విశుద్ధము, పవిత్రము, శీల సంపన్నము కాగలదు. డాక్టర్‌జీ అంతర్బాహ్య శుచిత్వం యొక్క సాక్షాన్మూర్తి కావడం సహజమే. మానవరూపాన్ని ధరించిన శుచిత్వమే డాక్టర్‌జీలో మనకు కనబడుతుంది. నేడు సామాజిక కార్యకర్తలలో సుశీల రక్షణలో ఉదాసీన తయే కాక, శీలాది విషయాలలో అవహేళన చేసే అలవాటు సర్వత్రా కనపడుతోంది. ఇట్టి స్థితిలో ఈ ధగద్ధగిత, పవిత్ర తేజంతో నిండిన వారి జీవనంలో ఎంతో కనపడుతుంది. మన మనస్సులను ఆకర్షిం చగల సామర్థ్యాన్ని కలిగి, మన జీవనాన్ని పరిశుద్ధము, మంగళమయము చేయడమేకాక ప్రేరణను, విశ్వాసాన్ని నిర్మించ గలుగుతుంది.

విలక్షణమైన స్వభావ పరివర్తన

కర్తృత్వ సంపన్నుడు, గుణవంతుడు అయిన వ్యక్తి అనేక ఆపదల నుండి బయటపడి సఫలతను పొందితే అతని ఆత్మవిశ్వాసం స్థానంలో అహంకారం జనిస్తుంది; స్వభావం ఉగ్రమవుతుంది; ఇతరులను తుచ్ఛంగా చూచే ప్రవృత్తి ఉదయిస్తుంది. ఈ ప్రవృత్తి నుండి వ్యక్తి స్వార్థం ఉత్పన్నం కావడం సహజమే కాని శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా రాష్ట్ర సేవావ్ర తాన్ని స్వీకరించినవారిలో ఇట్టి ప్రవృత్తిని మేల్కొల్పడం సర్వదా అనుచితం. డాక్టర్‌జీకి వంశపరంపరగా ఉగ్ర స్వభావం, కోపిష్టి స్వభావం, ఆత్మగౌరవం సంక్రమిం చాయి. వారిలో అనేక విపత్తులను ఎదురొడ్డి అసహాయంగా వాటిపై విజయాన్ని సాధించి రా.స్వ. సంఘ వంటి ఆతులనీయ సంఘటిత సామర్థ్యాన్ని నిర్మించగలగడంలో వారికి ఊహాతీతమైన సఫలత లభించింది. ఈ ్థ••తిలో అహంకారం, బేపరవా వంటి అవగుణాలు వారి అంతఃకరణంలో ప్రవేశించడానికి అనుకూలత ఉంది-కాని వారి జీవనాన్ని చూచినప్పుడు ఈ అవగుణాలన్నిటికీ వారు ఆలిప్తంగా ఉన్నారని తెలుస్తుంది. సౌజన్యం, నిరభిమానత, అహంకారరాహిత్యం, స్నేహశీలత, మాటలో మార్దవం, ఎట్టి పరిస్థితిలోను క్షోభరహితంగా ఉండడం-వీటన్నిటి పరిపోషణ వారిలో మనకు కనపడుతుంది. వంశపరంపరగా ప్రాప్తించిన ఉగ్ర క్రోధ స్వభావం కూడ వారి ఉత్తర జీవనంలో మనకు కనపడదు. ‘‘స్వభావో దురతిక్రమః’’ అని అంటారు. కాని దానిపై కూడ వారు విజయాన్ని సంపాదించి, తనపై నియంత్రణను పొందారని అనుభవమవు తుంది. వారి ఈ స్వభావ పరివర్తన మనస్తత్వ శాస్త్రంలోని ఒక విలక్షణమైన చమత్కారం. ఇది ఎలా జరిగింది? వారు ఈ ఆలోచనాపూర్వకమైన పరివర్త నను ఎందుకు జరిపారు? ఇది అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మనకు ఈ సమస్య పరిష్కారం కొంత సులభమవుతుంది.

స్వరాష్ట్ర స్వరూపం యొక్క నిశ్చితము, స్పష్టము అయిన సాక్షాత్కారాన్ని అనుభూతి పొంది మన రాష్ట్రం యొక్క అధోగతికి, క్షీణతకు, పరాభవానికి కారణాన్ని సత్యమార్గదర్శకమైన చరిత్ర ప్రకాశంలో వారు శోధించారు. ‘‘వ్యక్తులలో సామాజిక భావన యొక్క అభావం మాతృభూమి, ధర్మం, సంస్కృతి అవి యాంత్రికంగా స్మరించడం కాక త్యాగబుద్ధితో విదేశీ ఆఘాతాల నుండి దాని రక్షణకు ఉద్యమిం చడం యొక్క అభావం -సామాజిక, రాష్ట్రీయ కర్తవ్యాల పట్ల ఉదాసీనత పరస్పర సహకారానికి సంసిద్ధత లేకపోవడం, క్షుద్ర స్వార్థ లోలుపత ఇత్యాది అనేక అనేక అవగుణాలతో సమాజం, కర్మ, తొలిచివేయబడి అసంఘటితము బలహీనము ఆయింది. ఈ శక్తిహీనత కారణంగా దానికి పరా భవం, పారతంత్య్రం, నికృష్ట అవస్థ ప్రాప్తించింది.’’ అనే సత్యాన్ని హృదయంగమం చేసుకుని వారు ప్రజల ముందు ప్రతిపాదించారు. దీనికి ఏకైక పరిష్కారం ప్రతివ్యక్తిలో సామాజిక, రాష్ట్రీయ జీవనం యొక్క సత్‌ ‌సంస్కారాలను నిర్మించడం, ఒక సూత్రబద్ధమైన, అను శాసనాయుతమైన అంగాల వారీగా రూపొందిం చడం, అట్టి వ్యక్తులందరి స్నేహమయ వ్యవహారం ద్వారా, ఐకమత్యం ద్వారా, తన వ్యక్తిత్వాన్ని రాష్ట్రం యొక్క సమష్టిలో విలీనం చేసే గుణం ద్వారా దేశ వ్యాప్తము, అనుశాసితము, సంఘటితము ఆయిన సామర్థ్యాన్ని నిర్మించడం. ఈ నిష్కర్షకు వచ్చి, హిందూ సమాజాన్ని సుసంఘటితం చేయడమనే సర్వ శ్రేష్ట కర్తవ్యాన్ని వారు ప్రతిపాదించారు.

దైనందిన శాఖ అనే విశిష్ట తంత్రం

‘సంఘటన చేయడం’ అనేది సులభమైన పదమే. కానీ, దాన్ని ప్రత్యక్ష ఆచరణలోకి తేవడానికి శుద్ధ రాష్ట్రీయ సంస్కారాలను, రాష్ట్ర సమర్పిత జీవనం యొక్క సంస్కారాలను అంతఃకరణపై ముద్రించి, అవి దృఢంగా ఉండేటట్లు, పరస్పరానుకూలత, స్నేహమయ స్వభావం యొక్క, శాశ్వత ధర్మం అయ్యేటట్లు చేసే తంత్రాన్ని రూపొందించడం అవసరం. అట్టి ఆవశ్యకతలో నుండి రా. స్వ. సంఘ యొక్క దైనందిన శాఖ అనే విశిష్ట తంత్రాన్ని వారు నిర్మించారు. దానికి అంగభూతమైన వ్యవహారాన్ని ఏర్పరచడం, తన ఉదాహరణవల్ల అట్టి వ్యవహారానికి అనురూపంగా తన దురతిక్రమ స్వభావంలోని గుణాలను పరివర్తన చేసి, ఆశక్యాన్ని శక్యంచేసి చూపారు. సమర్పిత జీవనం యొక్క సామర్థ్యం ఎట్టి చమత్కారాన్ని చేయగలదో ఎవరు చెప్పగలరు. వారి సర్వస్వార్పణ కారణంగా వంశ పారంపర్యంగా వచ్చిన సంస్కారాలను కూడ పరిశుద్ధంచేసి, ఆవశ్యక గుణాల సంస్థాపన సంవర్ధనచేసే అతి మానవీయ శక్తి ప్రాప్తించింది.

ఈ అసామాన్య శక్తి యొక్క పరిపూర్ణ దర్శనాన్ని కలిగించే మరొక ప్రముఖాంశం పేర్కొనదగినది. డాక్టర్‌జీ జీవితంలో అసంఖ్యాకమైన రాజకీయ కార్యకలాపాలు మనకు కనిపిస్తాయి. నాడు అత్యాచారాలతో కూడిన ఆంగ్ల ప్రభుత్వం సహించ రానిదయింది. ఇంగ్లీషు వారిని వెళ్లగొట్టి, పూర్ణ స్వాతంత్య్రాన్ని పొందడం ప్రముఖమైన జీవిత కర్తవ్యమని శ్రేష్ఠుడు, విచారశీలుడు అయిన ప్రతివ్యక్తికీ• తోచింది. లోకమాన్యుని కాలంలో రాజకీయాలా? సమాజ సంస్కరణయా – ఏది ప్రముఖం అనే వివాదంలో లోకమాన్యుడు అసందిగ్ధంగా రాజకీయాలనే స్వీకరించారు. ఆదే ఆలోచనతో డాక్టర్‌జీ కూడా ఇలా అనేవారు : ‘‘పరతంత్ర రాష్ట్రానికి స్వాతంత్య్రం కోసం పోరాడడం కన్న మరో రాజకీయాలు ఉండడం అసంభవం.’’ కనుకనే ఎన్నికలు, కౌన్సిళ్లు – వీటిని ఉపేక్షించే వారాయన. ఇతర సామాజిక కార్యక్రమాలపట్ల స్వాతంత్య్ర సంగ్రామంలో ఉపయోగం దృష్ట్యానే వారు నాయకత్వం వహించేవారు.

రాజకీయాలకు అలిప్తంగా సమాజ సంఘటన

పరిస్థితుల ప్రభావం వల్ల రాజకీయాల పట్ల ధ్యానం వారికి ఉండేది. కాని రాష్ట్రం యొక్క ఉత్కర్షా పకర్షకు కారణ మీమాంస చేస్తూ చిరకాలీనమైన రాష్ట్రోద్ధరణకు స్పర్ధతో ఈర్ష్యతో నిండిన నాటి రాజకీయాలు ఉపయుక్తం కావనీ; పూర్తి జాగ్రత్త తీసుకోకపోతే అవి హాని కారకాలు కావచ్చనీ గ్రహించి, రాష్ట్రం యొక్క ఉజ్జ్వల భవిష్యత్తుకు పట్టు గొమ్మ జాగృతము, అనుకొని నిత్యము, సుసంఘటి తము అయిన దాని సామర్ధ్యమేననే సత్యాన్ని హృదయంగమం చేసుకుని వారు పరిస్థితుల యొక్క ఆఘాతాన్ని, అపుడపుడు స్వకీయుల విమర్శలను చిరునవ్వుతో సహిస్తూ, ఆ సామర్థ్యాన్ని నిర్మించే తంత్రాన్ని జీవన సర్వస్వంతో రూపొందించారు. తన పూర్వజీవనంలోని సాయుధ విప్లవోద్యమం, కాంగ్రెసు, హిందూ మహాసభల తోడి సంబంధా న్నంతటినీ క్రమక్రమంగా వారు తగ్గించుకున్నారు. ఆయా రంగాలలోని రాష్ట్ర భక్తులలో అగ్రగణ్యులపట్ల, వారి కార్యంపట్ల ఆదరాన్ని ఉంచుతూ, వారిపట్ల అనాదర భాపన క్షణమాత్రం కూడ మనస్సులో రానివ్వని దక్షతను వారు స్వయం సేవకులందరికీ అలవరచారు, కాని వాటికి అలిప్తంగా ఉండి సమాజ సంఘటన చేయడం సాధ్యమనే తన ఆదర్శాన్ని అందరి ముందు వారుంచారు.

బాల్య కాలంనుండి వివిధ రాజకీయ కార్యాలను నడుపుతూ విదేశీ పాలకుల పేరు చెప్పినంత మాత్రాన కృద్ధమయే తీవ్రభావావేశపరుడైన వ్యక్తికి రాజకీయ కార్యం నుండి బయటికి రావడం, మనస్సును దానినుండి తొలగించడం, తన బుద్ధిని, భావనలను తాను స్వీకరించిన కార్యానికి అనుకూలం చేయడం, ఎంత దుర్ఘటమయి ఉంటుందో, ఇంతటి కఠిన పరివర్త•న తనలో తేవడానికి వారి వివేకశక్తి ఎంతటి మహత్తర సామర్థ్యం కలిగి ఉండి ఉంటుందో, తన నిష్కర్షపైన తదనురూపంగా స్వీకృతమైన కార్యంపైన కార్యపద్ధతిపైన ఎంతటి ఆవిచలమైన నిష్ఠ ఉండి ఉంటుందో కల్పన చేయడం కష్టం. ఇట్టి కల్పనాతీత శక్తి సంపన్నమైన వివేకం, కార్యైకనిష్ఠ వీరి పవిత్ర నిస్వార్థ రాష్ట్ర సమర్పిత జీవనంనుండి ప్రాప్తించడం సాధ్యం. ఇది వారి జీవనంలోని అతిభవ్యమైన, అనాకలనీయమైన చమత్కారం.

సామాన్యమైన బాహ్యస్వరూపంలో అసామాన్య మైన తేజం డాక్టర్‌జీ జీవనంలో కనపడుతుంది. తద్వారా మన మనస్సులలో ఆత్మవిశ్వాసం యొక్క బీజారోపణ జరుగుతుంది; ‘‘రాష్ట్ర సమర్పితత్వ సంస్కారాలను అంతఃకరణలో పొంది, వాటిని దృఢం చేసి, నా వికృతులను తొలగించుకొని స్వభావాన్ని పరిశుద్ధంచేసుకుని, రాష్ట్రం యొక్క చిరంజీవ వైభవాన్ని నిర్మించడం కోసం బాహ్య వాతావరణం యొక్క ఆకర్షణలను జయించి రాష్ట్రం యొక్క చిరకాలీన శక్తికి ఒక అంశగా యావజ్జీవం కృషి చేయడం ద్వారా నా జీవనం సఫలమవుతుంది’’ అనే సంకల్పం జనిస్తుంది.

డాక్టర్‌జీ జీవనం యొక్క స్ఫూర్తిప్రద సందేశమిది. ఈ సందేశం ఇంటింటికీ, వ్యక్తి వ్యక్తి అంతఃకరణకు వ్యాప్తం కావడం అత్యంతావశ్యకం.

————————

1930 సత్యాగ్రహంలో డాక్టర్‌జీ

డాక్టర్‌జీ యొక్క కుశల నాయకత్వపు మహత్వపూర్ణమైన కథనాన్ని ఒకసారి  వారి నోటి నుంచే వినే సదవకాశం నాకు అకస్మాత్తుగా లభించింది. వారితో ఒకసారి కులాసాగా కబుర్లు చెపుతున్నాము. సంఘం యొక్క పూర్వ చరిత్ర గురించి మాట్లాడుతున్నాము. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు గతించిన అనేక సంఘటనల చిత్రపటమే తమ కళ్లముందు మెదులుతూ ఉన్నదని అనేవారు డాక్టర్‌జీ.

‘‘అప్పటిదాకా ఎన్నో విపత్తులు వచ్చాయి. ప్రతిసారీ ఈ విపత్తులను చాల భాగం నా మీదకే లాక్కున్నాను. దైవానుగ్రహం వల్ల సమయోచిత దృష్టితో హెచ్చరిక వహించాను. అందువల్ల సంఘం అన్ని విపత్తుల నుండి జయప్రదంగా బయటపడింది. మొండితనంతోనే ఎప్పుడూ పని జరుగదు. పెను తుపాను వచ్చినప్పుడు బుద్ధిశాలి తలవంచుతాడు. కాని సమయం వచ్చినప్పుడు మీద పడి పోరాడడానికి కూడా తాను సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కార్యకర్త మరువకూడదు’’ అని అన్నారు డాక్టర్‌జీ. సంఘ స్వయంసేవకులు వేరే ఏ ఉద్యమంలోనూ పాల్గొనకూడదనేది సంఘ దృక్పథమే అయినా తాము 1930 సత్యాగ్రహంలో ఎందుకు పాల్గొన్నదీ, వారు సవిస్తరంగా చెప్పారు. సంఘాన్ని రక్షించడానికే డాక్టర్‌జీ దానిలో పాల్గొన్నారు. ఆ విశ్లేషణ విన్న తర్వాత ప్రతి కూలములైన సన్నివేశాలను సైతం కార్యరక్షణకు పోషణకు వినియోగింపజేసుకునే వారి అప్రతిమానమైన కుశలత అర్థమైంది.

– శ్రీ యాదవరావ్‌జీ

About Author

By editor

Twitter
YOUTUBE