రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చివేస్తూ ఆర్-5 జోన్ ఏర్పాటు, బయటి ప్రాంతాలకు చెందిన వారికి అక్కడ ఇళ్ల స్థలాలివ్వడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగానే, ప్రభుత్వం అక్కడ ఇళ్ల నిర్మాణానికి పూనుకోవడం విస్తృత ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని జస్టిస్ డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, జస్టిస్ మాన వేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు, ఇళ్లపట్టాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ 13/2022, తదనంతరం జారీ చేసిన జీవో 45ని సవాల్ చేస్తూ రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ, రాజధానిలోని వివిధ గ్రామాల ప్రజలు ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడి వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అలాగే అమరా వతి భూకేటాయింపు విధానంలోని నిబంధనలకు విరుద్ధంగా సెంటు చొప్పున ఇంటి స్థలం కేటాయిం చేందుకు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దా•లైంది. వీటిపై ఇటీవల విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. అమరావతిలో స్థానికేతరు లకు స్థలాల పంపిణీ ప్రభుత్వ దురుద్దేశంగా పార్టీలు పేర్కొంటున్నాయి. అమరావతిని ఉద్దేశ్యపూర్వకంగా నాశనం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. ఆంధప్రదేశ్ రాజధానిగా అమరావతిని సరిగా గుర్తించక విశాఖకే ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి అక్కడి స్థలాలను ఎందుకు పేదలకు ఇవ్వడం లేదని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ తీర్పుతో ప్రభుత్వ కుటిలత్వానికి ఉన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసిందని చెబుతున్నాయి.
నేపథ్యం
విభజిత ఆంధప్రదేశ్‌కు విజయవాడ – గుంటూరు మధ్య అమరావతి పేరుతో ఒక రాజధాని నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించి చట్టసభల్లో తీర్మానించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్థానిక రైతుల నుంచి సేక రించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ప్రణాళిక మొత్తాన్ని ధ్వంసం చేయనారంభించింది. మూడు రాజధానులని చెప్పి ప్రజల్లో వేర్పాటువాదం తీసుకువచ్చింది. ఆర్-5 జోన్ పేరిట మరో కుట్రకు తెరలేపినట్లు పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజధానిలోని పారిశ్రామిక జోన్‌ను ఎంచుకుని దానిని ఆర్ 5గా సృష్టించింది. అందులోని ఐనవోలు, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు, బోరుపాలెం, పిచ్చుకల పాలెం, నెక్కల్లు, అనంతవరం, నిడుమర్రు, మందడం గ్రామాల్లో 1402 ఎకరాల భూమిని ఆయా జిల్లాల కలెక్టర్లకు 45 జీవో ద్వారా కేటాయించి 25 లే అవుట్లు, 48 వేల ప్లాట్లు వేసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అమరావతిని అభివృద్ధి చేయకుండా బయట ప్రాంతం వాళ్లకు స్థలాలు ఇవ్వడాన్ని రైతులు వ్యతిరేకించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఆర్-5 జోన్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చినట్లు ఆరోపించారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా ఈ ఆర్-5 జోన్ ను ఏ రకంగా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ ఆందోళన తెలియచేస్తూ ఉండగానే ప్రభుత్వం ఆర్-5 జోన్‌లో జంగిల్ క్లియరెన్సు పనులు కూడా చేపట్టింది. ఈ కార్యక్ర మాన్ని రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసుల అండతో పనులు కొనసాగించారు. ఈ పరిస్థితుల్లో అమరావతి వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ రైతులు ఉద్యమం ప్రారంభించారు.
శంకుస్థాపన రోజున అబద్దాలు వల్లింపు
రైతుల ఆందోళన నేపథ్యంలో ఎలాగైనా ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తిచేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.25 లేఅవుట్లు అత్యంత వేగంగా వేయించి సెంటు స్థలం చొప్పున 48 వేల ప్లాట్లు గుర్తించి అక్కడ ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై 24న రాజధానిలోని కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వాస్తవానికి సీఆర్డీయే చట్టం ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి, వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తరువాతే ప్రభుత్వానికి రైతులిచ్చిన భూమిపై హక్కులు సంక్రమిస్తాయి. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వం… పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. హక్కులు లేని భూమిలో గత నెల 24న జోరువానలో వేలాది మంది లబ్ధిదారులను రాజధానికి తరలించారు. మోడల్ ఇళ్లను ప్రారంభించి హడావిడి చేశారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు తాను ‘‘సుప్రీంకోర్టు, హైకోర్టులతో పోరాడి గెలిచానని చెప్పారు. తాజాగా హైకోర్టు తీర్పుతో సీఎం మాటలు పచ్చి అబద్ధమని తేలిపోయినట్లుగా ఉద్యమకారులు పేర్కొంటున్నారు. రాజధానిలో ఆర్- 5 జోన్ ఏర్పాటు, రాజధానేతర ప్రాంతాలకు చెందిన వారికి అక్కడ సెంటు చొప్పున స్థలాల కేటాయింపు…అంతా పెద్ద మోసం అని లోకానికి తెలిసిపోయిందంటున్నారు. రాజధాని కోసం భూములిచ్చి బలైన రైతులు 28వేల మందైతే.. ఇళ్ల స్థలాలపేరుతో మోసపోయిన నిరుపేదలు 48 వేల మంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వీరిని గత ఆరు నెలలుగా ఇళ్ల స్థలాల పేరుతో రాజధాని చుట్టూ తిప్పుతూ, చివరికి వారికి ఏమీ దక్కకుండా చేశారు. ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేని స్థలాల్లో భూములిచ్చి నిండా ముంచేశారు.
అది పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూమి
అమరావతి రాజధానిలోని పారిశ్రామిక జోన్‌లో నిడమర్రు, చౌలూరు మండడం, ఐనవోలు, కురగల్లు, కృష్ణాయపాలెం.. మొత్తం ఆరు గ్రామాలున్నాయి. సిఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇందులోని 1134 ఎకరాల భూమిలో పబ్లిక్ పార్కులు, నాన్ పొల్యూషన్ జోన్, ఎడ్యుకేషన్ సెంటర్, ఎలక్ట్రానిక్ హబ్, నైబర్ హుడ్ ఇలా వివిధ రకాల అభివృద్ధి నిమిత్తం భూమిని కేటాయించారు. అమరావతి రాజధాని అభివృద్ధిలో ఇది కీలకప్రాంతం. దీనిని లేకుండా చేస్తే అమరావతి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని వైసీపీ భావి స్తోంది. ఇప్పటికే రాష్ట్రం లోని పలు పరిశ్రమలను వెళ్లగొట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది. ఈ కోవలోనే కొత్తగా ఆర్ 5 జోన్ సృష్టించి పారిశ్రామిక అవసరాల నిమిత్తం అట్టి పెట్టిన భూమిని సెంటు భూమిగా పంచేందుకు నిర్ణయించుకుంది. తద్వారా ఈ భూమిలో ఇక భవిష్యత్‌లో ఎలాంటి పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ప్రవేశించ• కుండా ఉండేలా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా రాజధాని రైతులు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
న్యాయస్థానం ఏం చెప్పింది
రాజధానిలో బయటి ప్రాంతాల వారికి ఇచ్చిన ఇళ్లపట్టాలపై.. కోర్టు తుది తీర్పునకు లోబడే లబ్ధి దారులకు హక్కు దఖలు పడుతుందని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. ఈ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో గుర్తు చేసింది. పేదలకు పంచిన ఇళ్ల స్థలాలపై ‘తదుపరి చర్య’ కోర్టు తీర్పులకు లోబడే ఉంటుందని పట్టాపై ప్రభుత్వమే రాసింది కదా? అలాంటప్పుడు అక్కడ ఇళ్లు ఎలా నిర్మిస్తారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇంటి స్థలంపై హక్కు విషయం లోనే సుప్రీం కోర్టు అంత స్పష్టంగా చెప్పిన ప్పుడు, అక్కడ ఇళ్లు కట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడాన్ని తప్పుబట్టింది. అది రాసిన వ్యక్తి చేసిన పొరపాటు అని, దాన్ని పరిగణనలోకి తీసుకోరాదని అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఏఏజీ ప్రభుత్వ చర్యను సమర్థించుకోవాలని చూస్తున్నారని, దానితో తాము ఏకీభవించబోమని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతే.. అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. రాజధానిలో బయటి ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల నిర్మాణం.. అమరావతిపై హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలులో భాగమే నని ఏఏజీ చెప్పడంపై ధర్మాసనం చురకలు వేసింది. ‘రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిన అన్ని కార్యక్ర మాల్నీ వదిలేసి, కేవలం ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కోర్టు ఆదేశాల్ని పాటించడం అంటారా?’ అని వ్యాఖ్యానించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల జీవించే హక్కు జీవనోపాధితో ముడిపడినదిగా హైకోర్టు విస్తృత ధర్మాసనం తన తీర్పులో పేర్కొందని, ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆ కోణంలో చూడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
ఆర్థిక కష్టాలున్నాయనో, మరో కారణమో చెప్పి రాజధానిలో నిర్మాణాల్ని సగంలో వదిలేయడం కుదరదనీ విస్తృత ధర్మాసనం స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. అమరావతి అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తామని హైకోర్టు విస్తృత ధర్మాసనం పేర్కొందని, దాన్ని చట్టం ద్వారా తొలగించలేరని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు తీర్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ, రాష్ట్రంలో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే నివాస గృహాలు నిర్మిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ‘‘కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పడాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు న్యాయం, ధర్మం పక్షం వైపే ఉంటాయని రుజువైందన్నారు. దేశంలోనే అత్యధికంగా పీఎంఏవై గృహాలను ఏపీకి కేంద్రం కేటాయించిందని, పేదల కోసం కేంద్రం కేటాయించిన గృహాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.
తుది తీర్పు వ్యతిరేకంగా ఉంటే 2 వేల కోట్లు ఖర్చు వృథా
భూమి నిమిత్తం సీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం, ఇళ్ల నిర్మాణానికి ప్రతిపా దించిన మొత్తం కలిపి.. సుమారు రూ. 2,000 కోట్లు ప్రభుత్వం అక్కడ ఖర్చు చేయనుందని, అదంతా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మని, రేపు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. అదంతా నష్టపోవాల్సిందేనని కోర్టు పేర్కొంది. ప్రజల సొమ్మును ప్రభుత్వం తన ఇష్టానికి వృథా చేస్తుంటే.. కోర్టు ప్రేక్షకపాత్ర వహించబోదని స్పష్టంచేసింది. కోర్టుల నుంచి తుది తీర్పు వెలువడేంత వరకు ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని స్పష్టం చేసింది.
ఆర్ 3 జోన్‌లో 5 శాతం భూమి
సీఆర్‌డీఏ చట్టం ప్రకారం 5 శాతం భూమిని 2055 సంవత్సరం వరకు రాజధానిలో ఉపాధి కోసం వచ్చిన వారికి ఇవ్వవచ్చు. ఆర్-3 జోన్లో రిటర్నబుల్ ప్లాట్లు రైతులకు ఇవ్వగా మరో 5వేల ఎకరాల మిగులు భూమి ఉంది. పేదలకు స్థలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ కేటాయించిన భూమిని ఇవ్వవచ్చని రైతులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న కాలనీ’లను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి ఆర్ 5 జోన్‌లో మాత్రం ఆగమేఘాల మీద లేఔట్లు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఇళ్లను కూడా నిర్మించడం మొదలుపెట్టడం వెనుక అసలు ఉద్దేశం… పేదలకు మేలు చేయడం కాదు. అమరా వతిని చెడగొట్టడమే!
– వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఛైర్మన్,సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు,
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ