స్వరాజ్య సమరంలో ఆయనొక అజ్ఞాతయోధుడు

సహాయ నిరాకరణోద్యమపు రోజులు (1920-21). అప్పుడు డాక్టర్‌జీ నాగపూర్‌ ‌ప్రాంత కాంగ్రెసు కార్యదర్శి. తీవ్రంగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉండగా భండారా జిల్లాలో ఆయన చేసిన ఒక ప్రసంగం రాజ్య ద్రోహకరంగా (seditious) ఉన్నదని ‘నేరం’ ఆరోపించి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ విచారణలో డాక్టర్‌జీ చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ న్యాయాలయాధికారి ‘‘నేరం ఆరోపింపబడిన ప్రసంగము కన్న దానిని సమర్ధిస్తూ చేసిన ప్రకటన మరింత ద్రోహకరంగా ఉన్న’’దని చెప్పుకోవలసి వచ్చింది. చారిత్రకమైన ఆ ప్రకటనను యథాతథంగా దిగువన ఇస్తున్నాము:

చట్టరీత్యా ఏర్పడిన బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని రెచ్చగొట్టడానికి, దానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని, హైన్యభావాన్ని పెంపొందించడానికి, భారతీయులకు, యూరోపియనులకు మధ్య శత్రుత్వభావాలను రగుల్కొల్పడానికి ఉద్దేశింపబడిన ప్రసంగాలను నేను చేస్తూ ఉన్నానా లేదా అనే -ప్రశ్నకు నన్ను జవాబు చెప్పమంటున్నారు.
‘ఒక విదేశీ శక్తి’ ఒక భారతీయుడు భారతదేశంలో చేసిన పనిపై విచారణకు పూనుకోవడం నాకు, మహత్తరమైన నా దేశానికి అవమానకరంగా భావిస్తున్నాను.
భారతదేశంలో చట్టరీత్యా ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదని నేను భావించడం లేదు; అట్టిది ఉన్నదని నాతో చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాన్ని ఒక కీలుబొమ్మగాను, న్యాయస్థానాలను పరికరాలుగాను వాడుకునేది, పాశవిక బలంపై ఆధారపడినది, ప్రజల నెత్తిన రుద్దబడినదీ అయిన ఒక దమనకారీ పరిపాలన మాత్రమే ఇక్కడ ఉన్నది.

ఈ భూమండలంలో ఏ భాగం మీదనైనా అధికారంచేసే అర్హత గలిగిన ప్రభుత్వం ప్రజల ద్వారా, ప్రజలచే, ప్రజలకోసం నడుపబడే ప్రభుత్వం మాత్రమే. మిగతా ప్రభుత్వ వ్యవస్థలన్నీ దోపిడీ చేయడానికి దురాక్రమణపరులు సృష్టించిన మాయాజాలములే.

దీనస్థితిలోనున్న మా మాతృభూమి పట్ల ప్రేమను జాగరణ చేసేందుకు నేను ప్రయత్నించాను; భారతదేశం భారతీయులదేననే సూత్రాన్ని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించాను. రాజ్య ద్రోహకరం కాకుండా దేశభక్తియుతమైన ఈ సూత్రాలను ఒక భారతీయుడు ప్రబోధించలేని పక్షంలో; ఇక్కడి భారతీయులకు యూరపియనులకు మధ్య శత్రుత్వ భావనలను రెచ్చగొట్టకుండా వాస్తవాలను సూటిగా చెప్పలేనిపక్షంలో; పరిస్థితి అంతగా విషమించే పక్షంలో-యూరపియనులు భారత ప్రభుత్వమని తమను పిలుచునేవారు, తాము సరసంగా వైదొలగవలసిన తరుణం మించిపోతోందనే హెచ్చరికను పొందవలసి ఉంది.

నా ప్రసంగాలు సంపూర్ణంగాను, యథాతథంగాను తీసుకోబడలేదని నా కళ్ళముందు నాకు కనుపిస్తోంది; నేను మాట్లాడిన దాన్ని తునాతునకలుగా అపసవ్యంగా వర్ణించి నా ముందుంచారు. కాని నేను దాన్ని లక్ష్యపెట్టను. జాతికి జాతికి మధ్య గల సంబంధాలను నిర్ణయించే సూత్రం యూరపియన్ల పట్ల, ఇంగ్లండు పట్ల నా ఆచరణను నిర్దేశిస్తుంది. ఏది ఏమయినా నేను మాట్లాడినదంతా నా దేశ ప్రజల హక్కులను, స్వాతంత్య్రాలను సమర్థిస్తూనే. నేను మాట్లాడిన ప్రతి మాటను సమర్థించడానికి నేను సంసిద్ధుడనే. నేను మాట్లాడినట్లు చెప్పబడుతూన్న దానిలో నేను దేనిని మాట్లాడడం నేరమైతే దానినంతటినీ నాదేనని ప్రకటించడానికి, అదంతా పూర్తిగా సమర్థనీయమేనని చెప్పడానికి సంసిద్ధుడనే.
-(సం.) కె. బి. హెడ్గెవార్‌

About Author

By editor

Twitter
YOUTUBE