– మహామహోపాధ్యాయ శ్రీ బాలశాస్త్రి హరదాస్‌

‌భారత స్వరాజ్య సమర చరిత్ర మహోన్నతమైనది. అనేక పంథాల కలయిక అది. అనేక సిద్ధాంతాల వేదిక అది. అన్ని వర్గాల సమష్టి పోరాటం కూడా. ఆ ఔన్నత్యాన్ని  నేటి తరాల పరిపూర్ణంగా దర్శించుకోకుండా చేసిన ఘనత మాత్రం ఆ సమర చరిత్ర రచనా విధానానిదే. ఎందరో యోధుల త్యాగం, రక్త తర్పణలు, పోరాట పటిమ చరిత్రలో వాక్యాలు కాలేకపోయాయి. అసలు చరిత్రపుటలకు చేరలేకపోయిన యోధులే ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వ్యవస్థాపకులు పూజనీయ డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గెవార్‌ ‌వంటివారు స్వరాజ్య సమరంలో నిర్వహించిన పాత్ర చరిత్ర గ్రంథాలలో స్థానం పొందడానికి పెద్ద పోరాటమే అవసరమైంది. నాగపూర్‌ ‌ప్రాంత జాతీయ కాంగ్రెస్‌ ‌కార్యకర్తగా ఆయన మీద రాజద్రోహం నేరం నమోదైంది. కారాగారవాసం చేశారు. సహాయ నిరాకణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో ఆయన భాగస్వామి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పేరుతో స్వరాజ్య సమరంలో పాల్గొనరాదని ఆయన విధానం. అంటే అర్ధం ఆయన, స్వయంసేవకులు స్వాతంత్య్ర సమరానికీ, దాని స్ఫూర్తికీ సుదూరంగా ఉండిపోయారని కాదు. తాను స్వరాజ్య సమరంలో పాల్గొనడానికి పరాంజపే అనే మరొకరికి సంఘ నాయకత్వం తాత్కాలికంగా అప్పగించి డాక్టర్‌జీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి మహనీయుల స్వాతంత్య్ర సమరకాంక్ష, స్వతంత్ర భారతం మీద ఏర్పరుచుకున్న కల్పన, చేసిన త్యాగాలు అజ్ఞాతంగా ఉండిపోవడం అంటే చరిత్ర రచనను సమగ్రం చేసుకోవాలన్న సంకల్పం లేనందువల్లే. ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కొద్దికాలం క్రితమే ప్రారంభమైంది. అసలు ‘దేశభక్తుడు’ వంటి విశేషణాలు వ్యక్తికి తగిలించడానికి  డాక్టర్‌జీ నిరాకరించారు. దేశభక్తి ప్రతి పౌరునికి సహజ అలంకారంలా,  ఆ భావన నరనరాన ఉండాన్నదే వారి నిశ్చితాభిప్రాయం. జన్మభూమిని పరాయి పాలన నుంచి విముక్తి చేసే పోరాటంలో పేరు ప్రతిష్టలను ఆశించడం అసహజమన్నది కూడా ఆయన విశ్వాసం. డాక్టర్‌జీ భారత స్వాతంత్య్రం కోసమే కాదు, స్వతంత్ర భారత భవిష్యత్తు గురించి కూడా స్వప్నించారు. ఈ లక్షణం ఆ కాలంలో అరవిందుడు, డాక్టర్‌జీ వంటివారిలో మాత్రమే చూడగలం. ఈ ఆగస్ట్ 15 ‌సందర్భంగా ఆయన సమరాన్నీ, స్వప్నాలనీ కొద్దిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్‌జీ మీద ‘స్మరణిక’ పేరుతో ఏప్రిల్‌ 5, 1962 ‘‌జాగృతి’ లోని కొన్ని భాగాలను పాఠకులకు అందిస్తున్నాం.  

———–

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత పరమ పూజనీయ డా. హెడ్గెవార్‌ ‌రాష్ట్రనిష్ఠ స్థాయీభావంగా కలిగిన మహాపురుషులలో అగ్రగణ్యులు. వారి విశాల హృదయంలో వ్యక్తిత్వ భావనకు స్థానం లేదు. బాల్యం నుండి వారి జీవితం రాష్ట్ర సమర్పిత జీవితం కావడం వల్ల పరతంత్ర భారతం యొక్క స్వాతంత్య్రో ద్యమంతో వారికి పిన్న వయస్సు నుండి సంబంధం ఉన్నది. దినపత్రిక సంపాదకత్వం నుండి సహాయ నిరాకరణ, సత్యాగ్రహ ఆందోళన వరకు ప్రతి జాతీయకార్యంలోనూ ఆయన మహత్వపూర్ణమైన పాత్ర వహించారు. విప్ల వోద్యమంతో కూడ వారికి సన్నిహిత సంబంధం ఉండేది.

బాల్యంలో విప్లవవాద బీజాలు

బాల్యం నుండి డా. హెడ్గెవార్‌ ‌హృదయంలో పుణ్యశ్లోకుడు శ్రీ ఛత్రపతి అంటే అపరిమితమైన ఆకర్షణ ఉండేది. పాఠశాలలో చదువుకునేటప్పుడు వారు శ్రీ శివాజీ పేరిట ఒక మిత్రబృందాన్ని స్థాపించారు. ప్రఖ్యాత విప్లవకారుడు, గదర్‌ ఆం‌దోళనలో ఒక ప్రముఖుడు అయిన డా. పాండు రంగ సదాశివ ఖాన్‌ఖోజీ, శ్రీ రామలాల్‌ ‌వాజ్‌ ‌పేయీలు వారికి సన్నిహిత మిత్రులు. శ్రీ ఖాన్‌ఖోజీ యొక్క విప్లవ సంస్థ ‘‘స్వదేశ బాంధవ సమితి’’ లో హెడ్గెవార్‌ ‌సభ్యుడు. ఈ సంస్థలో వారు ఉపన్యాసాల ద్వారా విప్లవ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. లోకమాన్య తిలక్‌ ‌గారి ‘‘కేసరి’’, శివరామ్‌ ‌మహాదేవ పరాంజపే గారి ‘‘కౌల్‌’’ ‌పత్రికలు హెడ్గెవార్‌జీ మనోభూమికను విప్లవవాద సిద్ధాంతాలతో సంచితం చేశాయి. నాడు నాగపూర్‌లోని ప్రఖ్యాత నాయకుడు డా. మూంజే హెడ్గెవార్‌కు, వారి విప్లవవాది మిత్రులకు ఆసరాగా ఉండేవారు. 1904లో డా. మూంజే గృహంలో జరిగిన డా. హెడ్గెవార్‌, ‌బలవంతరావ్‌ ‌మండలేకర్‌ ‌ప్రభృతి విప్లవవాది యువకుల రహస్య సమావేశంలో బాంబు తయారు చేయడం చూపబడింది. క్రమంగా ఈ విప్లవోద్యమం ప్రాంత వ్యాప్తమయింది. దేశంలోని విభిన్న ప్రాంతాలలోని విప్లవ సంస్థల మధ్య సంబంధం స్థాపించి దేశవ్యాప్తమైన ఒక సంఘటన నిర్మించ డానికి నాడు నాగపూర్‌లో ఒక పథకం తయా రయింది.

అనుశీలన సమితి

వివిధ ప్రాంతాలలోని విప్లవసంస్థలతో బెంగాలు లోని అనుశీలన సమితి ప్రభావం సర్వాధికమైనది. వంగ విభజన తర్వాత బెంగాలులో శ్రీ అరవింద ఘోష్‌, ఆయన సోదరుడు బారీంద్రకుమార ఘోష్‌ ‌నాయకత్వాన ఒక విప్లవ సంస్థ ఉదయించింది. అలీపూర్‌ ‌బాంబుకేసులో బారీంద్ర కుమార ఘోష్‌ ‌ప్రభృత నాయకులకు ఆజీవన కారాగారవాస శిక్ష విధింపబడిన తర్వాత కూడ పులిన (పులీన్‌) ‌బిహారీదాన్‌ ‌నాయకత్వాన అనుశీలన సమితి పేరిట విప్లవవాదులు పని చేస్తూ వచ్చారు. నాగపూర్‌ ‌సంస్థకు బెంగాల్‌ ‌సంస్థకు మాధవదాస్‌ ‌సన్యాసి సంబంధం ఏర్పరచారని భావింపబడుతోంది. అలీపూర్‌ ‌బాంబు కేసు నిధికై నాగపూర్‌లోని ప్రఖ్యాత న్యాయవాది శ్రీ భయ్యాసాహేభ్‌ ‌బోబడే డాక్టర్‌జీకి వంద రూపాయలిచ్చారు. 1909 డిసెంబరు 1న హెడ్గెవార్‌ ‌మెట్రిక్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత వారిని వైద్య విద్య కోసం కలకత్తాలోని నేషనల్‌ ‌మెడికల్‌ ‌కాలేజీకి డా।। మూంజే, ఇతర విప్లవవాది మిత్రులు పంపారు. కాని డాక్టర్‌జీ చదవడం నిమిత్త మాత్రమే. అసలు కారణం అనుశీలన సమితితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం. నేడు అమెరికాలో నివసిస్తున్న డాక్టర్‌ ‌పరమ మిత్రులు, విప్లవవాద నాయకులు శ్రీ రామ్‌లాల్‌ ‌వాజ్‌పేయీ తన స్వీయ చరిత్రలో ఇలా వ్రాశారు: ‘‘శ్రీ కేశవరావ్‌ ‌హెడ్గెవార్‌ ‌రా. స్వ. సంఘ జనకులు. ఈయన దాజీ సాహెబ్‌ ‌బూటీ నుండి ఆర్థిక సహాయాన్ని పొంది డాక్టర్‌ ‌చదువుకోసమని పులిన (పులీన్‌) ‌బిహారీ దాస్‌ ‌సాహచర్యంలో విప్లవ సంఘటన కార్యం కోసం పంపడం జరిగింది.’’ 1910లో డా।।మూంజే పరిచయ పత్రంతో డా।। హెడ్గెవార్‌ ‌కలకత్తా వెళ్ళారు.

బెంగాలు విప్లవవాదులతో డాక్టర్‌జీ

కలకత్తా నేషనల్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలో ఉంటూ డా।।హెడ్గెవార్‌ అక్కడి స్వదేశీ ఆందోళనలో పాల్గొ న్నారు. అనుశీలన సమితి నాయకులు పులిన (పులీన్‌)‌బాబుతో పరిచయం ఏర్పడిన తర్వాత డాక్టర్‌జీ నాగపూర్‌ ‌విప్లవవాదులకు ఎంతో ఉపయోగ పడ్డారు. సెలవులలో నాగపూర్‌ ‌వచ్చినప్పుడు ఆయన అక్కడి విప్లవ వాదులకోసం రివాల్వరులు, ఇతర ఆయుధాలు తెస్తూ ఉండేవారు. స్వాతంత్య్ర వీర సావర్కర్‌ ‌తమ్ముడు డా.నారాయణరావ్‌ ‌సావర్కర్‌తో పాటు శ్రీ నళినీ కిశోర్‌ ‌గుహ ద్వారా డాక్టర్‌జీ అనుశీలన సమితిలో ప్రవేశించారు. అనుశీలన సమితిలో నాలుగు తరగతులుండేవి. అన్నిటికన్న పైతరగతిలో కఠోర పరీక్ష లేనిదే చేర్చుకునేవారు కాదు. ఆసామాన్యమైన శీలము, అపరిమిత సాహసము, ఆకర్షక సంఘటన చాతుర్యముల వల్ల డాక్టర్‌జీ అనతికాలంలోనే పైతరగతిలో ప్రవే శించారు. సమితిలో మారు పేర్లతోనే కార్యకలాపాలు జరిగేవి. డాక్టర్‌ ‌మారు పేరు ‘కోకెన్‌’. ‌సాయుధ విప్లవసంస్థల కార్యకలాపాలు రహస్యంగా కొన సాగడం వల్ల, శ్రీ కేశవరావ్‌ ‌హెడ్గెవార్‌ అతి గంభీర స్వభావం కలిగి, తనను గురించి సదా మౌనం వహించడం వల్ల విప్లవసంస్థలో వారి కృషికి సంబంధించిన పూర్తి వివరాలు ఉపలబ్ధం కాలేదు. అయితే వీరి వెనుక సదా ప్రత్యేక ప్రభుత్వ గుప్తచారులు (సి.ఐ.డి.వారు) ఉండేవారనేది నిశ్చయం. కలకత్తాలో డాక్టర్‌జీకి శ్రీ శ్యామసుందర చక్రవర్తి, మౌల్వీ లియాకత్‌ ‌హుసేన్‌లతో సన్నిహితమైన స్నేహం ఏర్పడింది. మహా ప్రతిభాశాలి అయిన రచయిత అయి కూడా మాతృభూమి పట్ల గల ప్రేమ కారణంగా ఆయన కారాగారవాసాన్ని, దారిద్య్రాన్ని మరెన్నో విపత్తులను ఎదుర్కొనవలసి వచ్చింది. మౌల్వీ లియాకత్‌ ‌హుసేన్‌ ‌ముస్లిము అయి కూడా హృదయంలో సంపూర్ణ భారతీయుడు. స్వదేశీ ఆందోళనలో ఆయన తన టర్కీ టోపీని త్యజించాడు. భగవాధ్వజం రాష్ట్ర ధ్వజమని గుర్తించాడు.

తిలక్‌ ‌పట్ల శ్రద్ధాభక్తులు

ఆ రోజులలో డాక్టర్‌జీ యొక్క అపారమైన తిలక్‌ ‌భక్తి స్పష్టమయింది. ఒకసారి మౌల్వీ లియాకత్‌ ‌హుసేన్‌ అధ్యక్షతన జరిగిన ఒక సభలో ఒక ఉపన్యాసకుడు లోకమాన్య తిలక్‌ను గురించి అనాదరణ పూర్వకంగా మాట్లాడాడు. శ్రోతలలో ఉన్న డా. హెడ్గెవార్‌ ఆ ‌మాటలు విన్నదే తడవుగా ఆ ఉపన్యాసకుణ్ణి చెంప చెళ్లుమనేటట్లు కొట్టారు. సభికులంతా నిశ్చేష్టులయ్యారు.

ఆ రోజులలో ఆయన మిత్రుడు డా. నారాయణ రావ్‌ ‌సావర్కర్‌కు అండమాను నుండి సోదరుడు స్వాతంత్య్ర వీర్‌ ‌సావర్కర్‌ ‌నుండి స్ఫూర్తిదాయకమైన లేఖలు వస్తూ ఉండేవి. అంతా కలసి కూర్చొని ఆ లేఖలను చదవడం డాక్టర్‌కి, ఆయన మిత్రులకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఉండేది. ఆ రోజులలో రత్నగిరి నుండి ఒక విప్లవవాది యువకుడు కలకత్తా వచ్చాడు. కలకత్తా సమీపాన ఉన్న గ్రామాలలో ఆయన యువకులకు రహస్యంగా బాంబుల తయారీ నేర్పడం ప్రారంభించాడు. శ్యామసుందర చక్రవర్తి ద్వారా డాక్టర్‌జీ ఆయనతో పరిచయం సంపాదిం చారు. డాక్టర్‌జీ, వారి మిత్రులు ఆ విప్లవవాది నుండి ఆ విద్యను గ్రహించారు. దురదృష్టవశాత్తు ఆ విప్లవవాది అక్కడే మరణించాడు. డాక్టర్‌జీ నాయకత్వాన అతనికి సమంత్రకంగా దహన సంస్కారం జరిగింది.

1914లో ఎల్‌. ఎమ్‌. అం‌డ్‌ ఎన్‌. ‌పరీక్షలో ఉత్తీర్ణులై, కొద్దిరోజులు కలకత్తాలో ఉండి డాక్టర్‌జీ నాగపూర్‌ ‌వచ్చారు. అదే సంవత్సరం జూన్‌ 17‌న లోకమాన్య తిలక్‌ ‌మాండలే జైలు నుండి విడుదల అయ్యారు. డాక్టర్‌జీకి తిలక్‌పై గల భక్తి ఎంత అపారమంటే తిలక్‌ ‌బందీగా ఉన్నంతకాలం కేవలం ఆయన కోసం ఏకాదశినాడు ఉపవాస వ్రతాన్ని కొనసాగించారు. తిలక్‌ ‌విడుదల అయిన వార్త వినడంతోనే 18వ తేదీన నాగపూర్‌లో డాక్టర్‌ ‌ధర్మవీర, డా।।మూంజే గృహాన్ని అసంఖ్య దీపాలతో అలంకరించి దీపావళి ఉత్సవం జరిపారు.

ఆ జీవన రాష్ట్రకార్యం కోసం బ్రహ్మచర్య దీక్ష

నాగపూర్‌ ‌రావడంతోనే డాక్టర్‌జీ విప్లవోద్యమాన్ని ప్రాంతమంతటా విస్తరించడం ప్రారంభించారు. విప్లవాది జీవనంలోని సంకటాలను చూచి ఆయన వివాహపు ఆలోచనను సైతం హృదయాన్ని తాకనీయలేదు. వారి పినతండ్రి గారు శ్రీ ఆబాజీ హెడ్గెవార్‌కు ఆ రోజులలో వ్రాసిన లేఖలో డా.హెడ్గెవార్‌ ఇలా వ్రాశారు: ‘‘అవివాహితంగా ఉండి ఆజీవనం రాష్ట్రకార్యాన్ని చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. దేశ కార్యం చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రాణం ప్రమాదంలో పడవచ్చు. అనవస రంగా ఒక యువతి జీవితాన్ని నాశనం చేయడం ఏమంత సబబు?’’

సాయుధ విప్లవంతోపాటు ప్రజలలో సంసిద్ధత కావాలి

డా. హెడ్గెవార్‌ ‌పరమ మిత్రులు శ్రీ భావుజీ కావ్‌రే నాయకత్వంలో నాగపూర్‌ ‌ప్రాంతంలో విప్లవ కార్యం వర్ధిల్లుతూ వచ్చింది. యోజన, మార్గదర్శనం కేశవరావ్‌జీది, ప్రత్యక్ష కార్యం శ్రీ భావుజీ కావ్‌రేదిగా ఉండేది. వీరిద్దరి శరీరాలు రెండయినా ఆత్మ ఒకటిగా ఉండేది. భావుజీ సహచరులు ఆయనలో మాతా పితల, బంధువుల ప్రేమను చవిచూచేవారు. సంయమనం, నిష్ఠ, సౌశీల్యం, ధైర్యం, సంఘటన, కుశలత, త్యాగం ఆది సద్గుణాలలో డాక్టర్‌జీ భావుజీలలో బింబ ప్రతిబింబ భావమే ఉండేది. భావుజీ కేవలం సాయుధ విప్లవంలోనే విశ్వాసం కలిగినవారు. డాక్టర్‌జీ విప్లవనాయకులైనప్పటికి అన్య మార్గాల ద్వారా సమాజాన్ని సంసిద్ధం చేయడం అవసరమని భావించారు. వారిద్దరి మధ్య భేద మిది మాత్రమే. తమ విప్లవకార్యంలో యోగ్యులైన యువకులను చేర్చడం కోసం భావుజీ, డాక్టర్‌జీల ఒక సహచరుడు స్వ.అణ్ణా సాహెబ్‌ఖోత్‌ ‘‘‌నాగపూర్‌ ‌వ్యాయామశాలను’’ స్థాపించారు. అనేక కార్యక్రమాల సందర్భంలో పర్యటన చేస్తూ ఆయన ప్రాంత మంతటా విప్లవ సంఘ శాఖలను స్థాపించారు. ధనికుల నుండి ధనాన్ని గ్రహించి దానితో ఆయుధాలను సేకరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలను బయటికి పంపి దేశ వ్యాప్తమైన ఉద్ధరణకు సన్నాహం ప్రారంభించబడింది. ఈ యోజనలో వార్ధాకు చెందిన శ్రీ గంగాప్రసాద్‌ ‌పాండే ఉత్తర భారతానికి పంపబడ్డారు. ఆజ్మీరులోని హిందుత్వ నిష్ఠ నాయకులు శ్రీ బందకిరణ్‌ ‌శారదా వారికి ఎంతో సహాయపడ్డారు.

దేశవ్యాప్తమైన సాయుధ విప్లవానికి యోజన

ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఇంగ్లీషు సైన్యం వివిధ స్థలాలలో విభజింపబడి ఉండడంవల్ల ఈ అవకాశాన్ని వినియో గించుకోవడానికి డాక్టర్‌జీ ప్రయత్నం ప్రారంభిం చారు. వారు నాయకులను అనేకులను కలుసుకొని భారతీయ స్వాతంత్య్రాన్ని ప్రకటించి ఉద్ధరణకు పథకం తయారుచేయ యత్నించారు. కాని గదర్‌ ఆం‌దోళన విఫలం కావడం చూచిన తర్వాత ఎవరికీ ఆ సహనం లేకపోయింది. ఉత్తరభారతంలోని గదర్‌ ఆం‌దోళనతో డాక్టర్‌జీకి శ్రీ వినాయకరావ్‌ ‌కావ్‌లే ద్వారా సంబంధం ఏర్పడింది. నాగపూర్‌లోని ఆయుధాలు పంజాబు, రాజస్థాన్‌లోని విప్లవ సంస్థలకు పంపేవారు. ఒకసారి ఈ పనికై నియ మించబడిన కొందరు వ్యక్తులు భుసువల్‌ ‌స్టేషన్‌ ‌వద్ద పట్టుబడ్డారు. ఆ తర్వాత స్త్రీ వేషధారులైన యువకుల ద్వారా ఆ పని కొనసాగించబడింది. ధన సంచయానికీ, శాస్త్ర సంగ్రహానికీ వివిధ మార్గాలు అవలంబించబడేవి. ఒకసారి డాక్టర్‌జీ సహచరులు కామ్‌ఠీలోని సైనిక శిబిరంతో సంబంధం ఏర్పరచు కొని సైనికుల వేషాలతో అక్కడ నుండి ఆయుధాల పెట్టెలు తెచ్చారు. ఆ తర్వాత డాక్టర్‌జీ జాగ్రత్తగా ఆ సైనిక గణవేషాలన్నిటినీ తగులపెట్టి, ఆ ఆయుధాలను ‘‘ఆయాచిత బువా వాహీ’’ అనే ఒక చెరువులో దాచి ఉంచారు. గదర్‌ ఆం‌దోళనతో పరిచయాన్ని పెంపొందించి దేశవ్యాప్తమైన సాయుధ విప్లవం జరపాలనే ఈ విస్తృత పథకంలో నేటి విదర్భ ప్రాంత సంఘచాలక్‌ ‌మా. అప్పాజీ జోషీ కూడా ఉన్నారు. నేటి విదర్భ ఆందోళన నాయకులు వీర బాబూరావ్‌ ‌హరకరే, నానాజీ పురాణిక్‌, అణ్ణా సాహెబ్‌ ‌ఖోత్‌, ‌దాదాసాహెబ్‌ ‌బక్షీ, యవత్‌ ‌మాలుకు చెందిన వామనరావ్‌ ‌ధర్మాధికారి, జోషీ, గంగాప్రసాద్‌ ‌పాండే ప్రభృతులు డాక్టర్‌జీతో ఏకాగ్రతతో ఈ యోజనలో సహకరించారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌ ‌విజయం పొందడంతో ఈ యోజన దేశ వ్యాప్తంగా కార్యాన్వితం కావడం అసంభవ మయింది.

డాక్టర్‌జీ యొక్క ఈ విప్లవదళ్‌లో పరీక్ష చేసిన తర్వాతనే యువకులను చేర్చుకునేవారు. డాక్టర్‌జీ యొక్క రహస్య సంస్థ సమావేశాలు బార్‌ద్వారా, తులసీ బాగ్‌, ‌సోనేగావ్‌ ఆలయం, కర్నల్‌డాగ్‌ ‌వంటి స్థలాలలో జరిగేవి. ఈ సమావేశాలలో సావర్కర్‌జీ వ్రాసిన మాజినీ, ఇండియన్‌ ‌వార్‌ ఆఫ్‌ ఇం‌డిపెండెన్స్ ఆది గ్రంథాలు పఠించబడేవి.

సంస్కారితమైన తరాన్ని నిర్మించనిదే పునరుద్ధ రణ ప్రయత్నం సఫలంకాదని విప్లవోద్యమాన్ని నడుపుతున్నపుడు డాక్టర్‌జీకి అనుభవం కలిగింది. ఈ చింతన యొక్క ఫలితంగానే వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు.

(‘విప్లవోద్యమంలో…’ పేరుతో ఈ వ్యాసం వెలువడింది.)

About Author

By editor

Twitter
YOUTUBE