1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ ఏడు దశాబ్దాల అనంతరం కశ్మీర్‌కు నిజమైన స్వేచ్ఛ వచ్చింది. దేశానికి ఎంతో కీలకమైన ఈ రాష్ట్రానికీ కేంద్రానికీ, ప్రధాన స్రవంతి జీవనానికీ మధ్య దూరాన్ని పెంచినదే 370 అధికరణ. దానిని బీజేపీ ప్రభుత్వం సాహసోపేతంగా రద్దు చేసింది. ఆ పక్రియ పూర్తయి మూడేళ్లు గడిచాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదని క్షేత్రస్థాయిలో ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కానీ 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కొందరు సవాలు చేశారు. ఇది ఈ దేశంలో బుజ్జగింపు రాజకీయాలకీ, ప్రతిపక్షాల, మేధావుల తలాతోకా లేని ఆలోచనలకీ అద్దం పట్టేదే. అయితే సుప్రీంకోర్టు అభిప్రాయం ఏమిటి? వాదనల సారం ఏమిటి? ఇదొక ఆసక్తికరమైన అంశమే.
దేశ విభజన కాలంలో కశ్మీర్ సంస్థానాధీశుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయడానికి అంగీకరించడం, కొత్తగా ఏర్పడిన పాకి స్తాన్‌కు అది రుచించకపోవడం, విలీనం జరగ కుండానే ఆ ప్రాంతం తమదేనంటూ పొరుగు దేశం ఆక్రమణకు పాల్పడడం తెలిసిందే. ఇటు ఆ ప్రాంత మహారాజు దానిని భారత్‌లో విలీనం చేసినప్పటికీ, అటు పాక్, భారత ప్రధానులు, జమ్ముకశ్మీర్ ‘ప్రధాని’ షేక్ అబ్దుల్లా వంటి వారంతా దానిని వివాదస్పదంగా మార్చడంలో తమ వంతు పాత్ర నిర్వహించారు. ఆ క్రమంలోనే భారత రాజ్యాంగంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదాని కల్పిస్తూ 370 అధికరణను రాజ్యాంగ సభ పొందుపరిచింది. అయితే, ఈ ఆర్టికల్ తాత్కాలికమైనదని, రాజ్యాంగ సభ లేక రాష్ట్రపతి శాసనం, పార్లమెంటులో బిల్లును ఆమో దించడం ద్వారా రద్దు చేయవచ్చని విస్పష్టంగా పేర్కొంది.
అయినా, ఆర్టికల్ 370 రాజ్యాంగ విరుద్ధ మంటూ రాజకీయనాయకులు/ న్యాయవాదులు, ఉదారవాదులు, హక్కుల కార్యకర్తలుగా చెలామణి అయ్యేవారంతా సుప్రీం కోర్టుకు వెళ్లడం, వారి పిటిషన్‌ను విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే, తమపై జరిగిన ఘాతు కాలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ కశ్మీరీ హిందువులు వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం తోసిపుచ్చింది. ‘అవి జరిగి చాలాకాలం అయి పోయింది, కష్టమని వ్యాఖ్యానించింది. దీనితో హిందువులు హతాశులయ్యారు. కాగా, మేధావులు, ఉదారవాదుల ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులు మాత్రం కోర్టు నిర్ణయంతో పండుగ చేసుకున్నాయి. కానీ వారు అక్కడే ‘తప్పులో కాలు వేశారు.’ ఆర్టికల్ 370 రద్దు ఎందుకు రాజ్యాంగ విరుద్ధమో వాదించేందుకు పిటిషినర్లకు ధర్మాసనం పదిహేను రోజుల సమయం ఇచ్చింది. ఇప్పటివరకూ, వారు చేసిన వాదనలు, జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సుప్రీం కోర్టులో వాదవివాదాలు
సుప్రీం కోర్టుకు చెందిన రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ పిటిషన్లను విచారించడం ఆరంభించింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్,జస్టిస్ సంజీవ్ •న్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమ, శుక్రవారం మినహా రోజూ విచారిస్తోంది.
తన వాదనలను ప్రారంభిస్తూ ఎన్నికైన శాసన సభకు కూడా ఆర్టికల్ 370ని రద్దుచేయడం సాధ్యం కాదంటూ కపిల్ సిబాల్ పేర్కొన్నారు. రాజ్యాంగ సభ 1950లోనే రద్దు అయిపోయిందని, దానితో ఆర్టికల్ 370 కూడా తాత్కాలిక ఆర్టికల్ స్థితి నుంచి శాశ్వత స్థితికి చేరుకుందని ఆయన వాదన. ఒకవేళ దానిని రద్దు చేయాలంటే, రాజ్యాంగ సభ సలహా ఉండాలంటూ ఆయన వాదనలు వినిపిస్తుండగా, రాజ్యాంగ సభ ఉన్నంత కాలమే దాని సలహా సాధ్యం అంటూ ప్రధాన న్యాయమూర్తి మధ్యలో అడ్డుకు న్నారు. దీనితో ఉత్సాహపడిన సిబాల్, రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగసభ ప్రయోజనం అయిపో యిందని అన్నారు. దీనికి స్పందిస్తూ, ‘అంటే దీనివల్ల తాత్కాలికమైన ఆర్టికల్ 370 శాశ్వత స్వభావాన్ని ధరిస్తుందా? కేవలం రాజ్యాంగ సభ లేనందువల్లే?’ అంటూ ప్రధాన న్యాయమూర్తి మరొక ప్రశ్న వేశారు. ఆర్టికల్ 370లోని క్లాజ్ 3 1957 ••ర్వాత పనికిరాదంటారా అంటే జస్టిస్ కౌల్ వేసిన ప్రశ్నకు, ‘భారత రాజ్యాంగ నేపథ్యంలో రాజ్యాంగ సభ వ్యర్ధం’ అంటూ కపిల్ సిబాల్ సమాధానం చెప్పడంతో, అయితే, ఆర్టికల్ 370 (3)పోతే, ఆర్టికల్ 370ని ఎప్పటికీ రద్దు చేయలేరన్న మాట అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించడం, దానికి అవును, అదే కదా నేను చెప్పేది అని సిబాల్ స్పందించడం జరిగాయి. సిబాల్ తన వాదనలను వినిపించిన తర్వాత, మరొక న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆ వాదనలు కూడా కపిల్ సిబాల్ వాదనలనే ప్రతిధ్వనింపచేశాయి.
అయితే, ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఈ వాదనలతో ఏకీభవించడం లేదు. ఆయన 1957 అనంతరం జారీ అయిన అనేక రాజ్యాంగ ఉత్తర్వు లను పట్టి చూపుతూ, వారి వాదనలో పస లేదని చెబుతున్నారు. విచారణ సమయంలో ఆర్టికల్ 370ను రద్దు చేయాలన్న నిర్ణయంలో అంతర్లీనంగా ఉన్న వివేకాన్ని న్యాయపరంగా సమీక్షించమని న్యాయస్థానాన్ని కోరుతున్నారా అని ప్రశ్నించడమే కాదు, న్యాయ సమీక్షలు అన్నవి రాజ్యాంగ ఉల్లం ఘనలకు మాత్రమే పరిమితం అయిన విషయాన్ని నొక్కి చెప్పారు. అంతేకాదు, 1957 తర్వాత జమ్ముకాశ్మీర్‌కి సంబంధించి రాజ్యాంగంలో చేసిన సవరణలను ఆ రాష్ట్రమే కాదు, భారత ప్రభుత్వం కూడా ఆమోదించడమన్న వాస్తవం మీ వాదనలను సమర్ధించడం లేదు కదా అని కూడా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
రాజ్యాంగ పరిషత్ తన పనిని పూర్తి చేసిన ఆర్టికల్ 370 తన ప్రయోజనాన్ని నెరవేర్చి ఉంటే, 1957 తర్వాత రాజ్యాంగపరమైన ఉత్తర్వులను జారీచేసే అవ కాశం ఎక్కడిదని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ మీ వాదనే సరైనదనుకుంటే, అసలు రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఎక్కడిది? రాజ్యాంగ పరిషత్ రద్దుచేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఎటువంటి మార్పులూ చేయడానికి అధికారం లేదు. అలాంటప్పుడు ఆర్టికల్ 370 (1), (2), (3)లపై వ్యాఖ్యానించేందుకు తార్కికమైన అనుగుణ్యత ఉండాలని కూడా జస్టిస్ చంద్రచూడ్ అనడం వారికి నిరాశనే కలిగించిందని చెప్పాలి.
నిజంగానే 370 అధికరణంతో రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి ఏం ఒరగబెట్టింది? ఇదే పెద్ద చర్చ. ఆరు దశాబ్దాల పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయాన్ని తమ ప్రాంతంపై పెడుతుంటే, అక్కడి కొన్ని రాజకీయ కుటుంబాలు దానిని భక్షిస్తూ, లోయలో ఏ మాత్రం అభివృద్ధి లేకుండా చేయడమే కాదు, పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ 80వ దశకంలో ఇస్లామిక్ తీవ్రవాదం పెచ్చరిల్లడానికి దోహదపడినాయి. 90వ దశకం ప్రారంభంలో హింస, అత్యాచారాలతో హిందువులను తరిమివేశారు. కశ్మీర్‌లోని హిందువులు మైనార్టీలే అయినా మైనార్టీల భద్రత, హక్కుల గురించి చొక్కాలు చింపుకునే మేధావులు, ఉదారవాదులు ఎవరూ ఈ దుర్ఘటనలను పరిగణనలోకి తీసుకుని రచ్చ చేయడం కానీ, విదేశీ వార్తాపత్రికలలో వ్యాసాలను ప్రచురించడం కానీ చేయలేదు. ఇస్లామిక్ మతతత్త్వవాదుల తరుఫునే మాట్లాడారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ విధానాన్నే కొనసాగించింది తప్ప కశ్మీరీ పండితులు కూడా ఈ దేశ పౌరులేనని, వారికి న్యాయం చేయవలసిన బాధ్యత తమకు ఉందనే విషయాన్ని గుర్తించక పోయింది. అంతేకాదు, ఆ హింసకు కేంద్ర బిందువు లుగా నిలిచిన యాసిన్ మాలిక్, మరణించిన గిలానీ వంటి వేర్పాటువాదులను గౌరవించి, వారికి అండగా నిలబడింది.
2019లో పూర్తి మెజారిటీతో మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుకు ఉపక్రమించింది. ఆగస్టు 5, 2019న పార్లమెంటులో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019ని ఆమోదించడం ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేసి, తాను ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. కేవలం ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాదు, కశ్మీర్‌లో ఆర్ధికాభివృద్ధికి, మౌలిక సదు పాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఇప్పుడు కశ్మీర్‌కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. నిన్నటివరకూ అక్కడ భూమిని ఎవరూ కొనుగోలు చేయకూడదన్న నిబంధన ఉండడంతో ముందుకురాని వ్యాపార వర్గాలు అక్కడ భూమి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇస్లాంకు వ్యతిరేకమన్న ప్రచారంతో ఇంతకాలం ఆగిపోయిన సినిమా ప్రదర్శనలు ఇప్పుడు హౌస్ ఫుల్‌గా సాగుతున్నాయి. పర్యాటకం ఊపందుకుంది. ఈ క్రమంలోనే కశ్మీర్‌లో ఉండిపోయిన, కొత్తగా వెళ్లిన హిందువులను పాక్ ప్రేరిత తీవ్రవాదులు ఎంపిక చేసి మరీ హత్య చేయడాన్ని చూశాం. అయితే, ప్రభుత్వం మాత్రం కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా అటువంటివారిని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేసి, అక్కడ శాంతిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు అక్కడి కశ్మీరీలు కూడా సహకరిస్తున్నారన్న విషయం ఇటీవలే ఆగస్టు 15న లాల్ చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేయడం, ఇతర నగరాలలో వలెనే శాంతియుతంగా సంబరాలు జరుపుకోవడం ద్వారా విదితమవుతోంది.
కశ్మీర్‌కు వచ్చే ఏ నిధినైనా మింగడానికి అలవాటు పడిన రాజకీయ పార్టీలు మాత్రం ఈ పరిణామాలను సహించలేకపోతున్నాయి. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ప్రజలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ‘భారత్ జోడో యాత్ర’ అంటూ ‘మొహబ్బత్ కీ దుకాణ్’ను తన కూడా తీసుకువెళ్లిన రాహూల్ గాంధీ మాత్రం కశ్మీరు భారత్ నుంచి ‘టుకడే టుకడే’ కావాలనే కోరుకున్నారు. అక్కడకు వెళ్లి, తాము అధికారంలోకి వస్తే తాము మళ్లీ ఆర్టికల్ 370ని తీసుకువచ్చి, కశ్మీర్‌ను ‘ప్రత్యేక’ ప్రాంతంగా గుర్తిస్తామంటూ ప్రకటనలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
సార్వభౌమత్వం 1947లోనే భారత్‌కు అప్పగింత
రాహుల్ వంటి మందబుద్ధులంతా గుర్తించ వలసిన అంశం ఒకటి ఉంది. ఇది కూడా సుప్రీం కోర్టు వాదనలలో వచ్చింది. ఒకనాటి ఆ సంస్థానాన్ని అక్టోబర్ 1947లో విలీనం చేయడంతో జమ్ముకశ్మీర్ సార్వభౌమత్వాన్ని పూర్తిగా భారత్‌కు అప్పగించి నట్టేనని, అందువల్ల ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ 370 శాశ్వత స్వభావం కలిగి ఉందని చెప్పడం కష్టమేనని కూడా వాదన సమయంలో కోర్టు అభిప్రాయ పడింది. దీనిని గుర్తించడానికి ఈ నేతలు ఎందుకు వెనుకాడుతున్నారు? జమ్ముకశ్మీర్ సహా భారత్ రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 చెబుతున్నప్పుడు, ఆ రాష్ట్ర సార్వభౌ మత్వాన్ని అన్ని రకాలుగా భారత్‌కు అప్పచెప్పినట్టేనని కూడా జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్1లో ఉన్న రాష్ట్రాల జాబితాలో జమ్ముకశ్మీర్ పేరు కూడా ఉన్న ప్పుడు అది వేరెలా అవుతుందనే ప్రశ్నను కూడా ధర్మాసనం లేవనెత్తింది. కనుక, ఆర్టికల్ 370ను పొందుపరిచిన తర్వాత జమ్ముకశ్మీర్ సార్వభౌమత్వంలోని కొన్ని అంశాలను మాత్రమే యథాతథంగా ఉంచారని చెప్పలేమని కూడా స్పష్టం చేసింది.
అయినప్పటికీ, దవే, నఫాడే వంటి న్యాయ వాదులు పలు కేసులను ప్రస్తావిస్తూ, రాష్ట్రపతి దీనిని రద్దుచేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం సరికాదంటూ వాదిస్తున్నారు. రాజ్యాంగ సభ రద్దు కావడం వల్లే ఆర్టికల్ 370ని రద్దు చేయడం సాధ్యం కాకపోతే, రద్దు అనంతరం రాజ్యాంగంలో చేసిన సవరణల మాటేమిటి?
ఇటీవలి కాలంలో పలు సందర్భాలలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తమకు తిరుగు ఉండదని భావించి, కోర్టులో వాదనల బరిలోకి దిగిన ఉదారవాద, మానవహక్కుల సమూహాలతో పాటు, స్వయంగా పాక్ ప్రేమికులు సైతం హతాశులయ్యారు. అటువంటివారి తరుఫున వాదిస్తున్న న్యాయవాదులకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో కోర్టులోకి అడుగుపెట్టిన న్యాయ వాదులకు ధర్మాసనం వేస్తున్న ప్రశ్నలు మింగుడు పడడం లేదు. ఎన్ని మెలికలు పెట్టి వాదిస్తున్నా, ధర్మాసనం మాత్రం ‘పాయింట్‌కి రా’ అంటూ వారిని దారిలోకి తెస్తుండడం అంత సీనియర్లకీ ఒక రకమైన అవమానమే. ఈ దెబ్బతో చట్టపరమైన దిగ్గజాలుగా పేరుపొందిన కపిల్ సిబాల్, దుష్యంత్ దవే వంటివారి పరువు దిగజారడం ఖాయం.
– డి.అరుణ