– జమలాపురపు విఠల్‌రావు
దేశంలో కొని చోట్ల జరుగుతున్న అల్లర్ల వెనుక ఉన్న వాస్తవ కారణాలను వెతకడంలో ప్రధాన స్రవంతి మీడియా విఫలమైందనే చెప్పాలి. ఒక వర్గానికి కొమ్ము కాసే మీడియా సంస్థలు ప్రజల్ని గందరగోళానికి గురిచేసేలా కథనాలు వెలువరిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మణిపూర్, నూహ్ (హరియాణాలోని ఒక జిల్లా) అల్లర్ల మధ్య ఒక సారూప్యత మాత్రం కచ్చితంగా ఉంది. ఈ రెండు ఘటనలకు కారణం- అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన రొహింగ్యాలు, కుకీలు కొనసాగిస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఆయా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడమే. మణిపూర్‌లో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయి పంటల్ని ప్రభుత్వం నాశనం చేయగా అది కాస్తా రెండు జాతుల మధ్య ఘర్షణగా మారింది. ఇక హరియాణాలోని నూహ్ సైబర్ నేరాలకు అడ్డాగా మారడంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నవారు దీనికి మత ఘర్షణల రంగు పులిమారు. ఇక ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడంలో ఎప్పుడూ ముందుండే సోషల్ మీడియా ఈ అల్లర్లలో తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించింది. అయితే, ఇటువంటి అల్లర్లకు మూలకారణాలు ఏమిటన్నది తరచి చూడడం అవసరం.
జూలై 31, 2023న బజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హరియాణాలోని నూహ్ జిల్లాలో బ్రజ్ మండల్ జలాభిషేక్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా, ముస్లిం వర్గానికి చెందిన కొందరు నూహ్ పట్టణంలో ఖేడ్లా మోడ్ వద్ద దానిని అడ్డుకొని రాళ్లదాడికి పాల్పడటంతో ఘర్షణ మొదలైంది. ఈ ప్రాంతంలోని హిందువుల దుకాణాలను ధ్వంసం చేయడం, కార్ల దహనకాండ యథేచ్ఛగా కొన సాగాయి. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో పెద్దసంఖ్యలో హిందువులు సమీపంలోని నుల్హార్ మహాదేవ్ ఆలయంలో తలదాచుకున్నారు. వీరిలో అత్యధికులు స్త్రీలు, పిల్లలే! ఆలయాన్ని చుట్టుముట్టిన మూకలు రాళ్లదాడికి దిగడంతో సుమారు ఐదు గంటపాటు భీతావహ పరిస్థితి నెలకొంది. చివరకు చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి పోలీసు బగాలను రప్పించి రక్షించగలిగారు. అల్లరి మూకలు నూహ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లోకి బస్సుతో దూసుకెళ్లాయి. నూహ్ బస్టాండ్, మార్కెట్, గ్రెయిన్ మార్కెట్లపై యథేచ్ఛగా దాడులు జరిపారు. నూహ్ సంఘటనలకు ప్రతీకారంగా గురుగ్రామ్‌లో అల్లర్లు చెలరేగాయి. సోహ్నా ప్రాంతంలో 500 మందితో కూడిన అల్లరిమూకలు దుకాణాలను తగుల బెడుతూ, రాళ్లదాడి చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డాయి. గురుగ్రామ్‌లో ఒక మత పెద్ద హత్యకు గురయ్యాడు. నిజానికి గత మూడు సంవత్సరాలుగా ఈ యాత్ర కొనసాగుతున్నప్పటికీ ఈ తరహా ఎప్పుడూ ఘర్షణలు జరగకపోవడం గమనార్హం. గురుగ్రామ్ లేదా నూహ్ ప్రాంతంతో శాంతియుత వాతావరణం నెలకొని ఉండేది. అయితే గోరక్షక సమితికి చెందిన మొను మనేశర్ ఈ ఊరేగింపులో పాల్గొన బోతున్నాడన్న వార్తలు వ్యాపించడంతో, ఆయనపై ఆగ్రహంగా ఉన్న కొన్ని ముస్లిం వర్గాలు ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపారు. అంతకుముందు మొను మనేశర్‌పై రాజస్తాన్ పోలీసులు జంట హత్యలకు సంబంధించిన కేసు నమోదు చేయడం గమనార్హం. ఆయన కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. హరియాణాలో గోహత్య నిషేధం అమల్లో ఉంది. నేరం రుజువైతే పదేళ్ల కారాగార శిక్ష విధించేలా ప్రభుత్వం చట్టాన్ని కఠినతరం చేసింది. ఫలితంగా గోసంరక్షణకు సంబంధించి రెండు వర్గాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తలు పెరిగిపోయాయి. ఇదే విషయమై జిల్లాలోని వివిధ గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మహా పంచాయత్‌లు జరిగినా పెద్దగా ఫలితం లేదు.
పోలీసుల హెచ్చరికలు బేఖాతరు!
ఈ యాత్రకు మూడు రోజుల ముందు అంటే జూలై 27న జిల్లా పోలీసు యంత్రాంగం, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌తో పాటు జమాయత్ ఉలేమా హింద్ సభ్యులు, స్థానిక ప్రజలతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి మతపరమైన ఊరేగింపు సమయంలో ఆయుధాల వినియోగంపై గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫ•లితం లేకపోయింది. రెండు వర్గాలు పరస్పరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటమే ఈ అల్లర్లకు కారణమని గురుగ్రామ్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ పేర్కొనడం గమనార్హం. జూలై 20న మొను మనేశర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారమైనప్పటి నుంచే ఇరు వర్గాలు ఘర్షణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఆగస్ట్ 2వ తేదీ రాత్రి ఒక వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మంది రాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఒక మందిరం షార్ట్ సర్క్యూట్ కారణంగా, మరో మందిరం గుర్తు తెలియని కారణాలతో అగ్ని ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా తర్వాత సర్దుమణిగాయి.
మూడేళ్లుగా యాత్ర నిర్వహణ
ఈ ఏడాది విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అజిత్ సింగ్ ఈ యాత్రను నిర్వహించారు. ఈ ఊరేగింపునకు అనుమతి ఉన్నప్పటికీ, యాత్రలో పాల్గొనే వారి సంఖ్యపై తమకు స్పష్టమైన అంచనా ఏర్పడలేదని తెలపడం గమనార్హం. కాగా హరియాణాలోని నూహ్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 79.2 శాతం మంది ముస్లింలు ఉండగా; 20.37% మంది హిందువులు ఉన్నారు. ఇక్కడ బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్రను బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ గత మూడేళ్లుగా నిర్వహిస్తు న్నాయి. ఈ జిల్లాలోని హిందూ పవిత్ర స్థలాలకు పూర్వ వైభవం తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ రెండు సంస్థలు ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. పూర్వం ఈ నూహ్ ప్రాంతాన్ని మేవాట్‌గా వ్యవహరించేవారు. అందువల్లనే దీన్ని మేవాట్ దర్శన్ యాత్ర అని కూడా అంటారు. పాండవుల కాలం నుంచి ఇక్కడ మూడు ప్రముఖ పురాతన శివలింగాలున్నాయని, శ్రీకృష్ణుడు ఇక్కడ గోవులు కాసేవారని హిందువుల విశ్వాసం. అయితే ఈ మూడు ప్రదేశాలు ఈ ప్రాంతంలో పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తుల కబ్జాల్లోకి వెళ్లే ప్రమాద మున్నదని విశ్వహిందూ పరిషత్ ఆరోపణ. బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్‌లు నిర్వహించే ఈ ఊరేగింపులో స్థానిక, హరియాణా ప్రాంతానికి చెందిన హిందువులు పెద్దఎత్తున పాల్గొంటారు. నల్హర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి జలాభిషేకం చేసిన తర్వాత సోన్హాలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇది నూహ్ పట్టణానికి సమీపంలో ఉన్న పురాతన దేవాలయం. ఇక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర జై రాకేశ్వర్ మహాదేవ్ ఆలయం మీదుగా ష్రంగార్ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం, శృంగేశ్వర్ మహాదేవ్ ఆలయాలకు వెళుతుంది. నిజానికి పూర్వం ఈ నూహ్ జిల్లాలో ‘మియో తెగ’ ప్రజలు నివసించే వారు. ముస్లిం రాజుల పాలనాకాలంలో వీరంతా ఇస్లాంలోకి మారిపోయారు. అయితే 1920 వరకు వారు తమ పూర్వ సంప్రదాయాలనే పాటిస్తూ వచ్చారు. తర్వాతి కాలంలో తబ్లికీ జమాత్ అనే ముస్లిం మతసంస్థ ప్రభావంతో వీరు ఛాందసులుగా మారిపోయారు. దేశవిభజన సమయంలో మహాత్మా గాంధీ కోర్కె మేరకు వీరు పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడంతో దేశంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మేవాట్ కూడా ఒకటిగా కొనసాగుతూ వస్తోంది.
సైబర్ పోలీస్ స్టేషన్‌పై దాడి అందుకేనా?
తాజా అల్లర్లతో హరియాణాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు చేతిలో నూహ్ సైబర్ పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. ఈ దాడిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. దేశ రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న నూహ్‌లో జరిగిన ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించడమే కాదు, ఆ దిశగా విచారణ జరుపనుంది. నూహ్ చౌక్‌లో జూలై 31న అల్లర్లు చెలరేగిన సమయంలో 500-600 మంది సైబర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడిం చారు. అప్పుడు స్టేషన్‌లో 20 మంది పోలీసులు ఉన్నారు. దాదాపు గంట తర్వాత అదనపు పోలీసు బలగాలు వచ్చిన తర్వాత మాత్రమే వారికి విముక్తి కలిగింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు కూడా. హరియాణా-రాజస్తాన్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో చోటుచేసుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నూహ్ సైబర్ పోలీస్ స్టేషన్‌ను రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నూహ్, భరత్‌పూర్, అల్వర్ ప్రాంతాలు సైబర్ నేరాలకు అడ్డాగా మారడంతో వీటిని ‘న్యూ జమత్రా’గా (జార్ఖండ్‌లోని జమత్రా సైబర్ నేరాలకు ప్రసిద్ధి) పిలుస్తున్నారు. సైబర్ నేరాలపై కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసుల వివరాలు లేకుండా చేయడానికే నిరసనకారులు ఈ దాడికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఇక ఈ ఘర్షణలకు సంబంధించి 93 ఎఫ్.ఐ.ఆర్.లు నమోదయ్యాయి. 176 మందిని అరెస్ట్ చేసి, వారిలో 78 మందిపై పీడీ యాక్ట్ ప్రయో గించారు. రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నప్పటికీ, ఆగస్ట్ 5వ తేదీ వరకు ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు.
ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ స్థాయికి దూసుకెళుతున్న మన దేశానికి ఇటువంటి అల్లర్లు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. మతం కంటే అభివృద్ధి ముఖ్యమన్న సందేశం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే యత్నం మరింతగా జరగాలి. దీన్ని పాటించే ప్రాంతాలు దేశంలో వేగంగా అభివృద్ధి చెందు తుండగా, మతమౌఢ్యాలతో నిండిన ప్రాంతాలు ఇంకా వెనుకబాటుతో కునారిల్లుతుండటం వర్తమాన సత్యం. దేశహితానికి అభివృద్ధి అత్యవసరమన్న సత్యాన్ని అన్ని వర్గాలు గుర్తించాలి.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్