– వీరంరాజు

ఆగష్టు 15వ తేదీ ప్రతి భారతీయునికి పర్వదినం. పదిహేనేండ్లకు పూర్వం శతాబ్దాలు తరబడి పారతంత్య్ర శృంఖలాలలో బంధింపబడిన భారతదేశం విముక్తి గాంచింది. ఈ సుదినానికి వేరొక విశిష్టత కూడా ఉంది. వ్యాస మహర్షి తదనంతరం వేదాలలో, ఉపనిషత్తులలో, రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో, బ్రహ్మసూత్రాలలో ప్రతిపాదింపబడిన సనాతన ధర్మానికి ఒక నూతన వ్యాఖ్యానాన్ని, ఒక నవరూపాన్ని ఇచ్చిన అరవింద యోగీంద్రులు జన్మించిన పర్వదినం కూడా ఇదే.

హిందూధర్మ సూత్రాలు పరమసత్యాలని (చాటిన) ‘ఉత్తరపర’ ప్రసంగం

పాశ్చాత్యుల నాగరికతా సంస్కృతులచే ప్రభావితులై భారత స్వాతంత్ర సమరాన్ని నడుపుతున్న నాయకుల నుండి భారత జాతీయ ఉద్యమాన్ని సముద్ధరించి, దానికి మహోగ్ర విప్లవరూపాన్ని ప్రసాదించిన దివ్యమూర్తులు శ్రీ అరవిందులు. భారతీయ ఆత్మను సందర్శించి అనేక శతాబ్దాల అనంతరం కూడా భారతీయులకు ఒక శాశ్వతమైన దివ్యస్ఫూర్తిని ప్రసాదించారు శ్రీ యోగివర్యులు. భారత ‘‘స్వాతంత్య్ర’’ సంపాదనకు పశుబల ప్రదర్శన కంటే మించిన ఆధ్యాత్మిక తపస్సు చేసి కృతకృత్యు లయ్యారు శ్రీ అరవిందులు.

భారతీయులకు శాశ్వత ప్రయోజనాన్ని, స్ఫూర్తిని ప్రసాదించిన అరవింద సందేశం 1909 మే 30న వినిపింపబడింది. అలీపూర్‌ ‌జైలు నుండి విముక్తుడైన శ్రీ అరవిందులు ‘ఉత్తరపర’లో (ఇచ్చిన) ఒక మహత్తర ఉపన్యాసంలో భారతదేశ పరమాశయాన్ని గురించి వివరించారు.

ఆత్మ విస్మృతి నుండి, పరానుకరణం నుండి మేల్కొనిన అరవిందులు అదే దురవస్థలో ఉన్న భారతీయులను మేల్కొల్పుతూ తన అనుభవమును చక్కగా అభివర్ణించారు. ‘‘విదేశీయ భావాలలో, విదేశీయ వాతావరణంలో నేను ఇంగ్లండులో పెద్దవాడినయ్యాను, హిందూధర్మంలోని అనేక విషయాలు నాకు వట్టి అభూత కల్పనలుగా కన్పించాయి. ఆ ఆశయాలన్నీ ఎన్నడూ నిజంగాని కలలుగా భావించాను. అదంతా ఒక మాయా జాలంగా నాకు కన్పించింది. కాని ఇప్పుడు రోజుకు రోజు పైబడిన కొద్దీ నా మనస్సులో, నా హృద యంలో, నా శరీరంలో హిందూ ధర్మ సూత్రాలన్నీ వెలుగొందుతున్నాయి. పరమ సత్యాలుగా వాటిని నా జీవితంలో సాక్షాత్కరింప జేసుకున్నాను. ఏ భౌతికశాస్త్రం కనుగొనజాలని విషయాలను నేను తెలుసుకోగలిగాను…. కొంతకాలానికి పూర్వం నాలో అవిశ్వాసి మకాం వేశాడు. నిరీశ్వరవాది తిష్టవేశాడు. భగవంతుడనేవాడు ఉన్నాడా? అనే సందేహం నాలో ఉండేది. కాని ఏదో ఆగోచరమైన, మహత్తరమైన శక్తి నన్ను వేదాలలో, భగవద్గీతలో ఇమిడి ఉన్న హిందూ ధర్మ పరమ సత్యాలవైపు లాగివేసింది.

అలీపూర్‌ ‌జైలులో శ్రీమన్నారాయణుని సందర్శనం

అలీపూర్‌ ‌సెంట్రల్‌ ‌జైలులో ఆరవిందులకు ఏకాంతవాస శిక్ష విధించింది బ్రిటిష్‌ ‌ప్రభుత్వం. కాని ఆ శిక్ష ఆరవిందుల పాలిట మహత్తరమైన వరప్రదాయిని. అక్కడే అరవిందులకు భగవ త్సాక్షాత్కారమయింది. అప్పుడే సనాతన ధర్మ స్వరూపం వారికి అవగతమయింది.

ఆ విచిత్ర అనుభవాన్ని గురించి వర్ణిస్తూ ‘‘నేను యోగనిద్రా నిమగ్నుడ నైనప్పుడు నాకొక భగవదా దేశం వినిపించింది: ‘‘నీవేకాంతవాసం జేసిన ఈ సంవత్సరంలో నీకిదివరకు హిందూ ధర్మ విశిష్టత పట్ల ఉన్న సందేహాలను నివృత్తి చేశాను. హిందూ ధర్మం, సత్యాల పట్ల నీకు నమ్మకం కల్గించటానికి కొంత పని చేశాను. ఈ ధర్మాన్నే ప్రపంచంలో ప్రతిష్ఠాపన చేయనెంచాను. అనేకులైన ఋషులు, భక్తులు, అవతార పురుషుల ద్వారా పరిపుష్టం చేయబడి పరిపూర్ణత్వం సాధించిన ఈ ధర్మం నేను చేయబూనిన కార్యాన్ని తానే ఇతర జాతులలో సాధించనున్నది. నా అభిమతాన్ని సాధించు కొనటానికి ఈ జాతిని ఉద్ధరించనున్నాను’’ ఈ శాశ్వతమైన సనాతన ధర్మం నీకిదివరకు అవగాహన కాలేదు. ఇప్పుడు నీకు దీనిని సందర్శనం చేయించనున్నాను. నీలోని ఆవిశ్వాసికి, భౌతికవాదికి తగు సమాధానాలిచ్చి సందేహాలన్నీ తీర్చాను. ఈ విషయంలో నీలోను, నీ బయటను, ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా నీకు అనేకమైన ఋజువులు ప్రత్యక్షంగా చూపించాను… గాన నీవు జైలునుండి బయటికి వెళ్ళినప్పుడు చెప్పు, నీజాతి ప్రజలందరికి నామాటగా. ‘సనాతనధర్మ పునఃప్రతిష్టాపన కొరకు గాఢ తమో నిద్ర నుండి మేల్కొనాలి. తమ కోసం కాదు. ప్రపంచం కొరకు వారు మేల్కొనాలి. వారికి నేను స్వాతంత్య్రం ప్రసాదించటం ప్రపంచ శ్రేయస్సుకై పని చేయటానికే. అందువల్ల భారత్‌ ఉత్ధానమవు తుందంటే సనాతన ధర్మం కోసమే. భారత్‌ ‌మహా దేశంగా వినుతి గడిస్తుందంటే అది (వినుతి లేదా ఖ్యాతి) సనాతన ధర్మానిచే. భారత్‌ ‌విశాలమై, వ్యాప్తిగాంచుతుంటే అది ప్రపంచంలో సనాతన ధర్మ వ్యాపన కోసమే. భారత్‌ ‌ధర్మంలోనే, ధర్మం కోసమే జీవిస్తున్నది. ధర్మం దేదీప్యమానంగా వెలుగుతు న్నదంటే భారత్‌ ‌దివ్యజ్యోతిగా వెలుగుతుందన్నమాటే.

నేను సర్వాంతర్యామినని నీకు నిరూపించాను. అందరి మానవులలో, సకల వస్తుపులలో నేనున్నాను. నేను ఈ జాతీయ ఉద్యమంలో ఉన్నాను. ఈ దేశోన్నతి కోసం కష్టిస్తున్న వారిలోనే కాదు, వారి మార్గాన్ని అడ్డుతూ వారిని వ్యతిరేకించే వారిలో కూడా నేనే వున్నాను. నేను ప్రతి వ్యక్తి ద్వారా కార్యనిమగ్ను డనైనాను. తామేదో ఆలోచిస్తున్నామని, ఏదో కార్యాన్ని సాధిస్తున్నామని మానవులు ఎంత చెప్పుకొన్నా నాకు వ్యతిరేకంగా వారేమీ చేయలేరు. నా లక్ష్య సాధనకే వారే పని చేసినా. వారు నాపనే చేస్తున్నారు. వారు నాకు శత్రువులు కాజాలరు. వారు నా చేతులలో సాధనాలు మాత్రమే. నీవు చేసే ప్రతిపనిలో నీవెటు పోతున్నావో తెలుసుకోకుండానే నీవు ముందుకు పోతున్నావు. నీవేదో ఒకటి చేద్దామనుకుంటావు కాని వేరొకటి చేస్తావు. ఒక ఫలితాన్ని ఆశించి పని చేస్తున్నావు. కాని నీ చేతలు నీవు కోరిన ఆశయానికి పూర్తిగా విభిన్నమైనది లేక విరుద్ధమైన ఫలితానికే దారితీస్తున్నవి. మానవులలో ప్రవేశించి, వారిని ముందుకు నడిపేది ఒక మహాశక్తి. ఎంతోకాలం నుంచే ఈ తిరుగుబాటుకు (జాతీయ ఉద్యమం) భూమిక తయారుచేశాను. ఇప్పుడు సమయం సమీపించింది. దీనిని సఫలీకృతం చేయటానికి నేనే దీనిని నడుపుతాను.

నేనే మిమ్మల్ని నడుపుతున్నాను. మీరేం భయపడకండి. నిన్నే పనికోసం జైలుకి తీసుకొని వచ్చానో అందులోనే నిమగ్నుడవై ఉండు. నీవు విడుదల అయిన తర్వాత ఎన్నడూ భయపడకు. జంకు గొంకు విసర్జించు. ఈ పని అంతా చేస్తున్నది నేనే. నీవు కాదు. మరెవరూ కాదు. గాన ఎన్ని కాలమేఘాలు ఎదురొచ్చినా, ఎన్ని ప్రమాదాలు, బాధలు, కష్టనష్టాలు ఎదుర్కొనవలసివచ్చినా ఈ జగత్తులో అసాధ్యమంటూ ఏదీలేదు. నేను వాసుదేవుడిని. నేనే నారాయణుడిని. నేనే వ్యాపించి ఉన్నాను.ఈ తిరుగుబాటులోనూ నేను వ్యాపించి ఉన్నాను. నేను అనుకున్న పనికి ఎవరు ఎంత ఉద్దేశించినా వ్యతిరేకించలేరు. నేను చేద్దామనుకున్న పనిని ఏ మానవశక్తి నిలుపజాలదు’’

హిందూధర్మమే భావిలో విశ్వధర్మం

‘‘హిందూధర్మమే భవిష్యత్తులో విశ్వధర్మ మవుతుంది’’ అంటూ అరవిందులు ‘‘హిందూ జాతి ఎంతో శ్రమించి పరిరక్షించుకున్నది గాబట్టే ఇది హిందూ ధర్మమయింది. ఆసేతు హిమనగ పర్యంతమైన ఈ విశాల ద్వీపకల్పంలో, సనాతనమైన ఈ పవిత్రభూమిలో అనేక యుగాలుగా ఆర్యజాతి సంరక్షణలో ఇది పుష్టిగాంచింది. ఈ ఆర్య జాతి దీనిని రక్షించుకున్నది. ఒక్క దేశపు గోడల మధ్యనే పరిమితమయ్యే ధర్మం కాదిది. ప్రపంచంలో ఇక నిబద్ధమైన ఒక భూభాగంలోనే శాశ్వతంగా పరిమితం గావలసిన ధర్మం కాదు ఇది. మనం దేనినైతే హిందూ ధర్మమనుకుంటున్నామో, అదే నిజమైన సనాతన ధర్మం. ప్రపంచంలోని ప్రజలందరినీ తన ఒడిలో ఇముడ్చుకోగలిగిన ధర్మం కాబట్టే అది అమరమైన ధర్మం. విశ్వానికంతటినీ ఆవరించజాలని ధర్మం, అమరమైన ధర్మం కాజాలదు. ఒక సంకుచిత దృక్పధం కలిగి, ఇతరులను దూరదూరంగా నుంచే ధర్మం ఏదో కొంతకాలం, ఒక లక్ష్య సాధన కోసం ప్రపంచంలో నిలుస్తుంది. భౌతికతత్వంపైన అపూర్వ విజయాన్ని సాధించినది ఈ మతం ఒక్కటే. విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం ముందెన్నడో ఊహించ బోయే ఊహాచిత్రాలను, కనుగొనబోయే కొంగ్రొత్త విషయాలను ముందే ప్రతిపాదించినది ఈ ధర్మమే. భగవంతుడు మనకెంతో సన్నిహితుడని మానవులకు నచ్చజెప్పి, భగవంతుని సాక్షాత్కరింపజేసుకొనుటకు ఎన్ని మార్గాలుండుటకు అవకాశముందో అన్నిటిని తనలో ఇముడ్చుకొనినది ఈ ధర్మమే. భగవంతుడు అందరి మానవులలో, అన్ని వస్తువులలో ఉన్నాడు. ఆయనలోనే మనం జీవిస్తున్నాం, ముందుకు నడుస్తు న్నామనే సత్యాన్ని ప్రతిక్షణం మానవుని ముందుం చుతున్న ధర్మమే హిందూ ధర్మం. ఈ సత్యాన్ని అర్థం చేసుకొనటం, ఇందులో విశ్వాస ముంచటమే గాక, మానవుల నిత్యజీవితంలో అనుక్షణం ప్రతి చిన్న పనిలోను సమర్థత ఇచ్చేదే ఈ హిందూధర్మం. ఈ విశ్వమంతా వాసుదేవుని లీల అని ప్రబోధించేది ఈ ధర్మమే. ఈ లీలలో మనకు నిర్దేశింపబడిన పాత్రను, నిగూఢమైన ధర్మాలను, మహోన్నతమైన నియమ పాలన ద్వారా ఎంతో సమర్థవంతంగా నిర్వహించటం ఎట్లాగో చూపించేదే ఈ ధర్మం. ఈ నిత్యజీవితంలో ఏ చిన్న పనిని మితానికి దూరంగా ఉంచకుండా యావత్తు జీవితాన్ని ధర్మావలంబనగా నిరూపిస్తూ, అమరత్వం ఏమిటో తెలియచెప్పి, మృత్యువనే యదార్థ విషయాన్ని మన మధ్య నుండి ఎంతో దూరానికి తరిమివేసేదే ఈ ధర్మం.’’

హిందూధర్మాన్ని గురించి ఇంత వివరంగా సుగ్రాహ్యంగా చెప్పిన ఆధునాతన పురుషులెవరూ లేరని చెప్పినను అతిశయోక్తి గాదు.

భారత ధర్మం యొక్క ప్రధాన సూత్రం ఏమిటి?

నేటి ప్రపంచంలో విశృంఖలంగా విహరిస్తున్న ఆసురిక సిద్ధాంతాలను, వ్యవస్థలను హిందూధర్మం ఛత్రం క్రిందికి వచ్చి సమన్వయం చేయాలనే ఆదుర్దా కొంత మందిలో ఉంది. ఎంత నికృష్టమైన, నీచ•మైన భావమునైనా హిందూధర్మ సూత్రంగా చెలామణి చేయాలని కొందరు కుయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల హిందూధర్మానికి మూలతత్వం, మూల ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ తెలియకుండా ఆయోమయావస్థలో పడిపోతున్నారు నేటి ప్రజలు. భారత ధర్మం యొక్క మూలసిద్ధాంతమేమిటి? లక్ష్యమేమిటి? అనే విషయాన్ని గురించి అరవిందులు ఇలా స్పష్టీకరించారు: ‘‘భారత ధర్మం యొక్క ప్రధాన సూత్రం సమస్త చరాచర జగత్తులో సనాతనమైన ఆత్మ వ్యాప్తిగాంచి ఉందనేది. భౌతిక స్థాయిలో మానవుడు అనేక జన్మల ద్వారా ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా పురోగమిస్తూ మానసిక స్థాయిలో విశ్వవ్యాపి సత్యాలను కనుక్కుంటూ ఉత్తమమైన, చైతన్యవంతమైన నైతిక జీవనగామిగా రూపొందుతున్నాడు. అచేతనమైన భౌతిక ప్రపంచంపై తిరుగులేని విజయం సాధించి తనలోని ఉన్నతమైన మానసిక శక్తిని మేల్కొల్పి మేధస్సుకు అతీతమైన పరిపూర్ణమైన చైతన్య శక్తితో తాను సారూప్యం పొందుతున్నాడు. ఈ లక్ష్య సాధనకే భారతీయుల సామాజిక వ్యవస్థ, తత్వశాస్త్రం, మతం, కళ, సాహిత్యం రూపొందించబడ్డాయి. ఈ ధర్మం భౌతికశక్తి వికాసాన్ని పనికిరాదనదు. కాని మానవుడు భౌతిక సుఖాలలో మత్తిల్లకుండా వీటిని అనుభవిస్తూనే వీటికతీతంగా అధిగమించే దృక్పథాన్ని మానవులకు ప్రసాదించటమే ఈ దేశ నాగరికత విశిష్ట లక్షణం. ఈ మహత్తరమైన ఆశయాన్ని సాక్షాత్కరింప చేసుకోటానికే నిరంతర కృషి సల్పుతున్నది గాన భారతజాతి ప్రపంచంలో ఒక విభిన్నమైన విశిష్టజాతిగా మన్ననగాంచుతున్నది.’’

విజిగీషు ప్రవృత్తి అవసరం

ఈ ధర్మరక్షణకు అవసరమైతే విజగీషు ప్రవృత్తితో, జయించి తీరాలనే మనో ప్రవృత్తితో ఇతరుల పట్ల ప్రవర్తించాలి అంటారు అరవిందులు. దీనినే ఆక్రమణపూర్వకమైన రక్షణ పథకం (స్త్రతీవఱఙవ •వ•వఅమీవ) అని అంటూ, ‘‘ఇందులో ఒక నూతన సృష్టి చేయవలసినది ఉన్నది. మనలోని సమస్తశక్తులను కూడగట్టుకొని ఒక అజేయమైన శక్తికి రూపకల్పన చేయాలి, మన ఆధ్యాత్మికతకు విరుద్ధం కాని వాటినన్నిటిని ఇతరుల నుండి మనం గ్రహించవచ్చు. వాటిని పూర్తిగా జీర్ణింపజేసుకోవాలి. అంతటితో తృప్తిపడి ఆగిపోరాదు. వినూత్నమైన శక్తివంతమైన వ్యూహాలను పన్ని ఇతరులను వెనుకకు నెట్టటమేగాక ఇతరులపై విజయం సాధించాలని ఆక్రమణకు పూనుకోవాలి.

మన జాతి ఉనికికి అవసరమైన యెడల మన జాతిపై దురాక్రమణ జేసినవాని దేశంలోనికి జొరబడి యుద్ధం చేయడానికి జంకరాదు, అమరమైన భారత శరీర పరిపుష్టికి నూతనమైన ఆహారాన్ని, భావాలను తీసుకొని జీర్ణం చేసుకొనటమే భారతీయుల ప్రత్యేక ప్రజ్ఞ’’ అని అరవిందులు ఉద్ఘోషించారు. భారతీయు లెన్నడూ పరానుకరణ చేయరాదని వారిలా హెచ్చరించారు: ‘‘గత తరంవారు పాశ్చాత్యుల సిద్ధాంతా లను, వ్యవస్థలను దాని సప్రవృత్తితో స్వీకరించి వాటినే పునశ్చరణ చేసుకొంటూ చేసిన ఒక నిర్జీవ యత్నం భారతీయుల రాజకీయ పరిజ్ఞానానికి, వారి మేధాశక్తికి ఒక ఆనవాలు కాదు.. ఈ అయోమయ వాతావరణంలో ఒక నూతన సంధ్యాజ్యోతి, ప్రాతః సంధ్యాజ్యోతి కనుపించుతున్నది. ప్రాచీన భారత్‌ ఇం‌కా చావలేదు. తాను చెప్పదలచుకొనిన చివరిమాట చెప్పలేదు. భారత్‌ ‌జీవిస్తున్నది. తనకోసమేగాక మానవజాతి కోసం కూడా తాను చేయవలసినది కొంత మిగిలి ఉంది. గాన మేల్కొల్పబడవలసినది పాశ్చాత్యుల అడుగులకు మడుగులొత్తే ఆంగ్లభావ ప్రేరితులై నిత్యం వారి ఉన్నతిని, వారి పతనాన్ని గురించి స్మరించే శిష్య బృందం గాదు; అంతః శక్తులను సమీకరించుకొని మహోన్నతమైన దివ్య ఆశయాన్ని స్మరించుకుంటూ, దివ్యశక్తిని దర్శిస్తూ, విశాలమైన ధర్మాన్ని అవగాహన చేసుకుంటూ నిరంతరంగా ముందుకు నడుస్తున్న సనాతన ధార్మిక శక్తిని జాగృతం చేయాలి’’ అని జాతీయ చైతన్యాన్ని కాంక్షిస్తూ పనిచేసే కార్యకర్తలన• శ్రీ అరవిందులు హెచ్చరించారు.

(జాగృతి, ఆగస్ట్ 15, 1962)

About Author

By editor

Twitter
YOUTUBE