ఇది ఏడు దశాబ్దాల నాటి మాట. కాదు కాదు, పాట.
‘విజ్ఞాన దీపమును వెలిగింపరారయ్య
అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా
పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమె
మానవుల ధర్మమని భావించరయ్యా’
ఈ టైటిల్ సాంగ్‌లో గాయని ఎ.పి.కోమల (ఆర్కాటు పార్థసారథి కోమల). ఆకాశవాణిలో నాడు సరిసాటిలేని మేటి గాయనీమణి. చలనచిత్రాల పరంగా మొదటి పాటను తెలుగులో ఆలాపించిన తమిళనాడు నివాసి. జననీ జనకులు లక్ష్మి, పార్థసారథి. ఉభయులూ గీతామృత ఆరాధకులు, సంగీత సరస్వతీ ఉపాసకులు. వారి ఆలనాపాలనా ఫలితం-ఈమె అతి చిన్న ప్రాయంలోనే గానం చేయడం. గురు ప్రోత్సాహంతో మకాం తెలుగునాట రాజమండ్రికి మారింది. ఆలిండియా రేడియోతో అనుబంధం దినదిన ప్రవర్ధితం అయింది. దేశ స్వాతంత్య్ర సాధన తదుపరి, మొత్తం తెలుగు వారందరూ విని పరవశించేలా ప్రథమంగా దేశభక్తి గీతాన్ని పాడిందీ కోమలే! కుడి ఎడమల.. రేడియో, సినిమా అనేలా తన గానస్రవంతి దశాబ్దాల తరబడి ప్రవహించింది. ఆబాల గోపాలాన్నీ మురిపించిన ఈమె జన్మదినోత్సవ శుభసందర్భంలో ఇది అక్షర కుసుమాంజలి. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ వేలపాటలు పాడి మెప్పించిన కలైమామణి, అమృతగాన వర్షిణి, సుగాత్ర ధారిణి గురించిన సవివర సమర్చనే ఇది. భాగ్యనగరంలో అలనాడు ఘంటసాల పేరిట స్వర్ణకంకణ స్వీకర్త. అన్నట్లు, ‘విజ్ఞాన దీపము’ గీతాన్ని అప్పట్లో తాను ఆలాపించింది ఘంటసాలవారితోనే. అందులో ‘ఓం’ అని ఈమె పలికిన విధానం ఆపాతమధురం, శ్రవణానందకరం!
బరంపురంలోని ఆలయ ప్రాంగణంలో పాడిన ప్పుడు కోమలది చిన్న వయసు. బంగారు పతకం అందుకున్నప్పుడు ఎంతగానో మురిసింది ఆమె మనసు. అటు తర్వాత రాజమండ్రి వేదికగా గీతా లాపనకు వెండి భరిణె బహూకృతి. ఇంకా ఎన్నెన్ని ప్రాంతాల్లో పాడారో ఒక పట్టాన లెక్కించలేం. ఆకాశ వాణిలో గానలహరి సాగించిన తొలినాళ్లలో తనను చూసిన ప్రతీ ఒక్కరూ ముచ్చటపడేవారు. అంత బాలగాయని అన్న మాట. శాస్త్రీయ సంగీతానికే అన్ని విధాల పెద్దపీట. దీక్షితార్ కృతి, త్యాగయ్య కీర్తన, ఇంకెన్నెన్నో. అనంతర కాలంలో లలిత సంగీతానికీ సమధిక ప్రాధాన్య మిచ్చారు. దేవులపల్లి భావగీతమైనా, గురజాడ దేశభక్తి గేయమైనా ఆ స్వరంలో మరింత పరిమళిం చాయి. గ్రామ్‌ఫోన్ గీతాలైతే సరేసరి. మొదటగా యుగళగీతాన్ని ఘంటసాలతో పాడిన సందర్భంలో కోమలకి కేవలం పదిహేనేళ్లు! తాను తెలుగులో పాడిన చిత్రం సింహళంలోకి అనువదిత మైతే, ఆ భాష గీతికనూ తానే ఆలాపన చేశారు. ఆకాశవాణి, చిత్రాలలోకి అనువాదమైతే , ఆ భాష గీతికనూ తానే ఆలాపన చేశారు. ఆకాశవాణి, చిత్రాలగాన ప్రతిభ కారణంగా దేశ విదేశాల్లో పర్యటించారు. ఆమె రేడియో పాట నాటి తమిళ ప్రభుత్వాధినేతల జేజేలందుకుంది. మంగళంపల్లివారి చేతుల మీదుగా మధుర వాణి బిరుదాన్ని అందుకునేలా చేసింది. నిత్యనిరంతర సాధన, పిల్లల మొదలు పెద్దల వరకు ఇచ్చిన శిక్షణ తన జీవితానికి ధన్యత కలిగించింది. అప్పటికప్పుడే పాటకు వరసకట్టి పాడటమన్న అలవాటు గాత్ర దీక్షాదక్షతలను విస్తృతపరచింది. ఒకే పాటను ఇద్దరు సుప్రసిద్ధ గాయనీమణులతో విడివడిగా పాడిన అనుభవమూ ఉంది. ఎన్ని పాటలు పాడినా, ఇంకెన్ని పర్యటనలు చేసినా అలుపూ సొలుపూ ఉండేది కాదు కోమలకి. పద్యం, గద్యం, నృత్యగేయం, భక్తి, హాస్యం సమస్తమూ గొంతులో అలవోకగా పలికేవి.
‘నరజన్మ అత్యున్నతమురా’ అనడంలో పరమార్థ భావన
‘పన్నగ శయనా పంకజనయనా నల్లని స్వామీ నారాయణా’ అని పాడటంలో అపార భక్తి తత్పరత
‘ఈ మౌనమేలనోయీ / గతంబే మరచుట మేలేయి’ అంటూ ఆలాపించడంలో అత్యంత హితాభిలాష
ఎంత దీటుగా భావాలు వ్యక్తమయ్యేవో తెలిపేందుకు మాటలు చాలవు మరి.
ఆకాశవాణి నుంచి చలనచిత్ర గీతాలా అనేది అప్పట్లో ఎదురైన ప్రశ్న. ఆ పాటల ప్రసారాల వల్ల లలిత గేయాలకు ప్రాచుర్యం తగ్గుతుంది కదా? అనే విమర్శలూ వచ్చేవి. ఫలితంగా, రేడియో కళాకారు లకు సినిమాల్లో పాడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. అటువంటి పరిస్థితుల్లోనూ సహన శీలత కనబరిచారు కోమల. వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి-ఎం.ఎల్. వసంతకుమారి, ఎస్.వరలక్ష్మి స్వరాలను ఎంతగానో ఇష్టపడేవారు. అదే విధంగా, పి.సుశీల గొంతులో పలికే స్వచ్ఛత, స్పష్టతలను పరిపూర్తిగా అభిమానించేవారు. తాను అన్నమాచార్య కీర్తన పాడినప్పుడు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి రేడియో స్టేషనుకు వచ్చి మెచ్చుకోవడాన్ని మరపురాని అనుభవంగా చెప్తుండేవారు. ఇలా అనేక అనుభ వాలను సందర్భం వచ్చినప్పుడల్లా సభాముఖంగా ప్రస్తావిస్తుండేవారు.
‘ప్రేమ’లో ‘ఓహో ఇది కదా! వియోగి ఇది గదా! కలలు నిజములై పోయె గదా’
‘జయసింహ’లో ‘నడిరేయి గడిచేనే, చెలియా! రాడాయెనే సామి నా సామి’
‘బంగారు పంజరం’లో ‘పదములె చాలు రామా! నీ పద ధూళులె పదివేలు’
‘పుట్టిల్లు’ చిత్రంలో ‘జోజో లాలి లాలి! జోజో కుమారా!’
ఇలా ఎన్నెన్నో గీతాలను రసహృదయులకు వీనుల విందుగా సమర్పించారామె. 1950 మొదలు 1968 వరకు దరిదాపు రెండు దశాబ్దాల పర్యంతం ఏది పాడినా శ్రోతలలోకం ఉర్రూతలూగింది. ఎన్ని పాడినా, తన తొలి ప్రాముఖ్యం ఆకాశవాణిదే అన్నారు ఎన్నోసార్లు. ఆ సంస్థలోనే ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, విరమణదాకా కొనసాగుతూ వచ్చారు. వ్యక్తిగతం కన్నా వృత్తి జీవితానికే ప్రాధాన్య మిచ్చారు. భక్తి ప్రపత్తికి పెట్టింది పేరు ఆకాశవాణే అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. ప్రత్యేకించి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి విఖ్యాత వ్యక్తులు అనేక పర్యాయాలు కోరి మరీ గీతాలాపనను ఆస్వాదించేవారు. కోమల తన జీవనయాత్రను సంగీత సమన్వితంగా నిర్వహించు కున్నారు. ఇదే అన్నింటికంటే మించిన అశేష విశేషం. తెలుగు వెలుగు తాను. నాటికీ నేటికీ కూడా.
ప్రఖ్యాత గాయని పి.లీల అంటే, కోమలకి ప్రేమాదరాలు – గౌరవాభిమానాలు. కోమల స్వరంలో భాషా నుడికారం బహు మేలిమిగా పలికేది. ఇద్దరూ చాలాకాలం పాటు శాస్త్రీయ సంగీత కచేరీల ద్వారా మనోహర జ్ఞాపకాలను పంచిపెట్టారు. అంతకుముందే ఆకాశవాణి ఉద్దండుల వద్ద విశిష్టత లెన్నింటినో అభ్యసించారు.
‘ఆకులో ఆకునై’ పాటలో చివర
‘ఆకలా దాహమా? చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతను తిరుగాడు
ఈయడవి దాగిపోవ, ఎటులైన నిచటనే ఆగిపోనా?’
అనేటప్పుడు ముక్తాయింపు వైవిధ్యాన్ని విని తీరాల్సిందే! గలగల వీచే చిరుగాలి కెరటాలు, జలజలమని పారేచోట తేటదనాలు – వీటన్నింటినీ సంగీత శ్రోతల అనుభవానికి తెచ్చారు – కోమల.
మరో చిత్రరాజంలోని పాటనీ జ్ఞప్తికి తెచ్చుకో వాల్సిందే! జమునారాణి, జక్కీలతో కోమల గాత్ర మేళవింపును విని అబ్బురపడాల్సిందే. అలాగే ‘మధురా నగరిలో చల్లనమ్మబోదు, దారివిడుము కృష్ణా’ అనే పాటలో…
‘కొసరి కొసరి నాతో సరసమాడకు
రాజమార్గమిది కృష్ణా, కృష్ణా!
వ్రజవనితలు నను చేరవత్తురిక
విడువడునా చేయి కృష్ణా, కృష్ణా!…. అనడంలో కూడా లాలిత్యం ఎంతైనా అనుపమానం. పదాల పోహళింపు, గాత్ర సౌలభ్యం పరమ అనిర్వచనీయం. ఎప్పుడు ఎక్కడ ఏ పాట పాడినా కోమలది ప్రత్యేక ముద్ర. ఎత్తుగడ మొదలు ముగింపు వరకు ఆర్ద్రత వెల్లివిరుస్తుండేది.
దీపావళి, సత్యనారాయణ మహోత్సవం చిత్రాల్లోనైతే భక్తి గీతికల పరంగా జీవించారు. శ్రుతి, లయ, రాగం, భావం ప్రధానాంశాలు. గాన యోగ్యమైతేనే అది గీతం అనిపించుకుంటుంది. గేయానికి తాళమే ప్రాణాధారం. జానపద గీతమైతే మటుకు, లలిత గేయానికి పరిణామ ఫలితం. ప్రేమ, విరహాలు మాత్రమే కావు; భావుకత వంటివెన్నో ఆ పాటల్లో చోటు చేసుకుంటాయి. వీటికి జోడింపుగా దేశభక్తి, సాంఘిక చైతన్యం పాటలకు సొగసులద్దాయి.
ఎందరెందరో కవుల లలిత గీతాలకు చక్కని వేదిక – ఆకాశవాణి. తమకు తాముగా బాణీలు కట్టినవారు కొందరైతే, బహుచక్కగా పాడించి కృతార్థత సాధించినవారు ఇంకొందరు. ఆ సంగీత పక్రియల దర్శకులూ విఖ్యాతి గడించారు. పాట అనే రెండు అక్షరాల్లో ఎన్నో భావనలున్నాయి. ఆ మాటకొస్తే, సినిమా పాటలకు మూలాధారం లలిత గీతికలే! ఎంతగానో పట్టం కట్టింది ఆల్ ఇండియా రేడియో. నిజానికి ఇది ఏనాడో మద్రాసులో ఆరంభమైంది. పలు లలిత గీతాలకు శిఖరస్థాయి తెచ్చింది. అనంతరకాలంలో నాటకాలకు సంబంధించీ లలిత గీతికలు వెలువడ్డాయి. భాష, సంగీతాభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందాయి. ఒక్క మద్రాసులోనే కాదు; తెలుగునాట విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోనూ లలిత గీతాల ప్రభలు వెల్లివిరిశాయి. ఈ అన్ని సందర్భా ల్లోనూ కోమల గాత్రం పరిమళించింది. శ్రోతలకు సదానుభూతిని పంచి పెట్టింది. వీటన్నింటి ప్రభావా లనూ తరచి తరచి చూశారు కోమల. విలక్షణత కనబరచి కీర్తివంతులయ్యారు. అక్షరాలా ఆమె అమృతవర్షిణే!
సినిమాల్లో బుర్రకథా గీతాలలో కూడా కోమలదే పైచేయి. అలనాడున్న జానపద కథాచిత్రంలో
‘తందానా హోయనందానా తాని తందనానా’ అంటూ ఘంటసాలతో కలిసి పాడారు.
‘మనసైన చెలీ! పిలుపు వివరాలేలా ఓ చందమామా!’కు ఆర్. బాలసరస్వతీదేవితో గొంతు కలిపారు.
అంతేకాక – ‘మురిపెము మీరా మీ కోరిక తీరా’ పాటను కె.రాణితో కలిసి ఆలపించారు.
‘క్లాసికల్ జీనియస్’ అని సాక్షాత్తు పి.సుశీలతో పిలిపించుకున్న మేధోనిధి. అంజలీదేవి సినిమాల్లోని పాటల్లో చాలావాటిని కోమలే పాడేవారు. కృష్ణకుమారికి, కేఆర్ విజయకి పాడిందీ తానే! ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ నీ సమర్పించారు. సహజనటి సావిత్రికి పాడిన పాటలతో ఎంతెంతో పేరు సంపాదించారు. ఘంటసాల సొంత చిత్రంలో సైతం కోమలే గాయనీమణి. తిరుమల-తిరుపతి బ్రహ్మోత్సవాల వేదికమీద సంగీత గానఝరిని వెలయించారు. ప్రజల నుంచి వచ్చే అవార్డులూ, రివార్డులే తనకు ప్రధానమని పలుమార్లు చాటి చెప్పారు. గానలోల పదం ఆమెకు పరిపూర్తిగా వర్తిస్తుంది.
‘అడుగడుగో, అరుదెంచెను బృందావన మోహనుడు
ఎన్ని నాళ్లకు ఈ కనికరం? ఎన్నాళ్లకు ఈ దర్శనం?
ఎన్నో ఏళ్లుగా సలిపిన తపము
ఈనాడే ఫలియించినదే!
తొందరపడకే రాధికా,
నందకుమారుడు నీవాడే’
అంటూ కోమల గాత్రం వినవస్తుంటే, 1956 ప్రాంతాల్లో గానమాధురి ఉప్పొంగింది, అదీ ఆమె స్వర మధురిమ! కాంతికిరణం, గానపక్రియకు ఆభరణం ఆమె! అందుకనే, ఈనాటికీ చిర యశస్విగా నిలిచారు.
పేరుపరంగా సార్థక నామధేయురాలు.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్