ఉమ్మడి పౌరస్మృతి విషయంలో మనదేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు కూడా గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అనుసరించిన సంతుష్టీ కరణ విధానాల కారణంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం 2016లో ఉమ్మడి పౌరస్మృతిని పరిశీలించాలని లా కమిషన్‌కు సిఫార్సు చేసింది. దీనిపై వివిధ వర్గాలతో చర్చించి అధ్యయనం చేసిన లా కమిషన్ ప్రస్తుతానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదంటూ నివేదిక ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంతటితో వదిలేయకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చింది.
దేశంలో వివాహం, విడాకులు, జనన, మరణాలు, ఆస్తుల విషయంలో అన్ని మతాల వారికీ ఒకే చట్టం అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే దీన్ని కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ, ఎన్సీ, లెఫ్ట్, తృణమూల్ సహా అనేక అన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. వీరి వ్యతిరేకత ఎందుకో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తే వారి ఓట్లు పడవు కనుక. అయితే ఇందులో వాస్తవం ఎంత? ఈ చట్టం తీసుకొస్తే ముస్లింకు నిజంగా హాని కలుగుతుందా? సానకూల అంశాలేమీ లేవా? అన్నది కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగ సభలో చర్చ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనా సమయంలో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ జరిగింది. ‘భారతదేశ ప్రజలందరికీ ఏకరూప పౌరస్మృతిని ఏర్పరచ డానికి మన రాజ్యాంగ వ్యవస్థ కృషి చేయాలి’ అని రాజ్యాంగ ముసాయిదాలో పొందు పరిచారు కూడా. నవంబర్ 23, 1948న ఈ అంశంపై రాజ్యాంగ సభలో చర్చ కూడా జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలోని ముస్లిం సభ్యులు మహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్, నజీరుద్దీన్ అహ్మద్, మహబూబ్ అలీ బేగ్, సాహిబ్ బహదూర్, పాకర్ సాహిబ్, హుసేన్ ఇమాంలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలన్న ప్రతిపాదనకు వీరు గండికొట్టారు. ఉమ్మడి పౌరస్మృతి పట్ల వారి తీవ్ర వ్యతిరేకత చూసి అంబేడ్కర్ సహా రాజ్యాంగ సభలోని ఇతర సభ్యులూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ముస్లిం ప్రతినిధుల దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ముస్లింలకు వర్తించే సూత్రాలు పూర్తిగా మతం మీదే ఆధారపడినవని ముస్లిం ప్రతినిధులు వాదించారు. లౌకిక వాదానికి మహబూబ్ అలీ బేగ్ ఓ వికృత భాష్యం చెప్పారు. లౌకిక రాజ్యంలో భిన్న మతస్థులు తమ తమ వ్యక్తిగత న్యాయ సూత్రాలను పాటిస్తూ తమ పంథాలో తాము జీవించే హక్కు కలిగి ఉండాలన్నది ఆయన వాదన సారాంశం. ఈ వాదన లను మున్షీ గట్టిగా సవాలు చేశారు. ‘ఏ ఆధునిక ముస్లిం దేశంలోనూ ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మైనారిటీల వ్యక్తిగత న్యాయ సూత్రాలు అడ్డురాలేదు, రానివ్వలేదు. అవి తిరుగులేనివని ప్రకటించలేదు. కావాలంటే టర్కీ, ఈజిప్ట్‌లను చూడండి. అక్కడ ఏ మైనారిటీ వర్గానికీ సొంత వ్యక్తిగత న్యాయసూత్రాలను అనుమతించలేదు’ అని మున్షీ గుర్తుచేశారు. మనదేశంలోనూ ముస్లింలలో మైనారిటీలైన ఖోజా, కుఠి మెమన్‌లకు సొంత, వ్యక్తిగత న్యాయ సూత్రాలను మెజారిటీ ముస్లింలు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ సభలోని ముస్లిం సభ్యుల వాదనలు భారత్‌ను సమైక్య దేశంగా పటిష్టం చేస్తాయా అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ప్రశ్నించారు. ఈ దేశంలో వివిధ వర్గాలు నిత్యం పోటీ పడుతూ, కల హించుకుంటూ జీవితం గడపాలా? అని నిలదీశారు. బ్రిటిష్‌వారు దేశమంతటికీ ఒకే నేరస్మృతిని ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించని ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు ప్రతిఘటించాలని అయ్యర్ సవాలు చేశారు. మారుతున్న కాలానికి తగినట్లు మారడానికి ఈ దేశంలో సిద్ధంగా ఉన్న ఏకైక వర్గం మెజారిటీ హిందూ వర్గమేనని ఆయన అన్నారు.
అపోహలు-నివృత్తి
ఉమ్మడి పౌరస్మృతి మీద ముస్లింలకు ఉన్న అపోహలు ప్రథానంగా ఇలా ఉన్నాయి. అయితే వాటికి సమాధానాలు కూడా ఉన్నాయి.
- యూనిఫాం సివిల్ కోడ్ అంటే హిందూ చట్టాన్ని విధించడం.
ఇది పూర్తిగా తప్పు. యూనిఫాం సివిల్ కోడ్ అంటే వ్యక్తిగత చట్టాలలో ఏకరూపత మాత్రమే. ఇది మతంతో సంబంధం లేని తటస్థ చట్టం అవుతుంది.
- యూనిఫాం సివిల్ కోడ్ ముస్లిం మత స్వేచ్ఛను హరిస్తుంది.
లేదు. ప్రాథమిక హక్కుగా ఇచ్చిన మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం అలాగే ఉంటుంది.
- మాకు (ముస్లింలకు) నిజంగా యూనిఫాం సివిల్ కోడ్ అవసరం లేదు.
ఈ లాజిక్ ప్రకారం వాదిస్తే మనకు ఇక ఎలాంటి చట్టాలు అవసరం లేదు. ఈ చట్టం దీర్ఘకాలంలో సమాజానికి మేలు చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఉమ్మడి పౌరస్మృతి తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు భావిస్తున్నారు. తమ వ్యక్తిగత అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఉమ్మడి పౌరస్మృతి అడ్డంకి అని వాదిస్తున్నారు. ఇది ముస్లింల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో మేధావులు కూడా మౌనం వహిస్తున్నారు. ఉమ్మడి పౌర చట్టంపై ప్రతిఘటన రావొచ్చని వారి ఆందోళన.
అయితే ఉమ్మడి పౌరస్మృతిపై చర్చకు ముందు ముస్లిం సమాజాన్ని కుదిపేసిన మూడు ప్రధాన ఘటనలు ఉన్నాయి. అవి షాబానో కేసు, సరళా ముద్గల్ కేసు, త్రిపుల్ తలాక్ రద్దు. మొదటిది రాజీవ్ గాంధీ హయాంలో జరిగితే, మూడోది ప్రస్తుత ప్రధాని మోదీ తీసుకొచ్చినది.
షా బానో కేసు (1985)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 62 ఏళ్ల ఒక సాధారణ ముస్లిం మహిళ పేరు ఉన్నట్లుండి దేశమంతా మార్మోగిపోయింది. మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 40 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత తన భార్య షా బానోకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆమెకు మనోవర్తి కూడా ఇవ్వడానికి నిరాకరించాడు. స్థానిక కోర్టు రూలింగ్ వల్ల తొలుత కొద్ది నెలలు ఆమె భరణం అందుకుంది. అయితే అహ్మద్ ఖాన్ దీనిపై సుప్రీంకోర్టు కెక్కాడు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం తాను షా బానోకు జీవితాంతం మనోవర్తి ఇవ్వాల్సిన పనిలేదని వాదించాడు. సుప్రీంకోర్టు ఆలిండియా క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 125ను ఉపయోగించింది. భార్యా బిడ్డలు, తలిదండ్రుల పోషణ భారం సదరు భర్తదేనని ఆమెకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఆ సందర్భంలోనే సీజేగా ఉన్న జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను చెప్పారు. ‘కామన్ సివిల్ కోడ్ ద్వారా జాతీయ సమైక్యత, సమగ్రతలను సాధించవచ్చు. పార్లమెంటు దీనిపై వెంటనే దృష్టిపెట్టాలి’ అన్నారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. అప్పట్లో ముస్లింలలోని ఒక వర్గం ఒత్తిడికి తల వంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టాన్ని తెచ్చింది. ఇది మహిళల వ్యక్తిగత హక్కులకు, మైనారిటీ వర్గ హక్కులకు మధ్య సంఘర్షణను సృష్టించింది.
సరళా ముద్గల్ కేసు (1995)
హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక మహిళను పెళ్లాడిన ఓ వ్యక్తి, అది కొనసాగుతుండగానే, ఇస్లాం మతంలోకి మారి ఓ ముస్లిం మహిళను పెళ్లాడిన ఘటన ఇది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు రెండో పెళ్లి చట్టవిరుద్ధమని తేల్చింది. ఆ సమయంలోనే సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి పౌరస్మృతి తేవాలని కేంద్రానికి సూచించింది.
త్రిపుల్ తలాక్ రద్దు
మోదీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో త్రిపుల్ తలాక్ రద్దు ఒకటి. ఇది భారత్‌తో పాటు ముస్లిం దేశాల్లో కూడా చర్చనీయాంశమైంది. దీని ప్రకారం ముస్లిం పురుషులు మూడు సార్లు తలాక్ చెప్పి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని (ట్రిపుల్ తలాక్ లేదా తలాక్-ఏ-బిద్దత్)ను నేరంగా పరిగణిస్తారు. తలాక్ చెప్పడాన్ని ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలో చెప్పినా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్-ఏ-బిద్దత్ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే, వారెంట్ లేకుండానే అతన్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్తసంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను, తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది.
త్రిపుల్ తలాక్ రద్దు మాదిరిగానే ఉమ్మడి పౌరస్మృతి కూడా ముస్లిం మహిళల పరిస్థితిని మెరుగుపరుస్తుంది. లింగసమానత్వ న్యాయం దిశగా ఇది మరో ముందడుగవుతుంది. త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన ‘భారతీయ ముస్లిం ఆందోళన సంస్థ’ ప్రతినిధులు ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తామని ప్రకటించడం కీలక పరిణామం.
ఎందుకీ వ్యతిరేకత
కులాలు, మతాలు ఉండవద్దంటున్న వారే ఉమ్మడి పౌరస్మృతి అనగానే ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయంలో ముస్లింలకన్నా కమ్యూనిస్టులే ముందుంటారు. వారి తరవాత మైనార్టీ ముస్లిం ఓట్లు పోతాయనే భయంతో కాంగ్రెస్ తదితర పార్టీలు జతకడతాయి. ఉమ్మడి పౌరస్మృతి అన్న పదం రాగానే ఈ పార్టీలకు వణుకు పుడుతుంది.