– జమలాపురపు విఠల్‌రావు

ఇరవై రెండవ లా కమిషన్‌ ఉమ్మడి పౌరస్మృతిపై గుర్తింపు పొందిన మత సంస్థలు, పౌరుల నుంచి అభిప్రాయాలు కోరిన తాజా పరిణామంతో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు, మత సంస్థల నుంచి విభిన్న వాదనలు, చర్చలు మొదలయ్యాయి. కేవలం 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈ ఉమ్మడి పౌరస్మృతి ‘అస్త్రాన్ని’ బయటకు తీసిందంటూ విపక్షాలు ఒక పక్క విరుచుకు పడుతూనే మరోపక్క 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టే అస్త్రంగా దీనిని వాడుకోవాలని చూస్తున్నాయి.

దేశంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న తేడాలు ఉమ్మడి పౌరసత్వం అమలుతో తొలగిపోతాయన్నది బీజేపీ చేస్తున్న వాదన. ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల్లో ప్రస్తుతం ఉన్న విభిన్న ఆచారాలు వైదొలగి, దేశంలోని పౌరులందరికీ ఒకేరకమైన న్యాయం జరుగుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై ప్రధానంగా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ‘ఒకే చట్టం…ఒకే న్యాయం’ అమలు పేరుతో ‘హిందూ చట్టాన్ని’ బలవంతంగా రుద్దు తారన్న అనుమానం వ్యక్తం కావడం వాదనలోని ఒక కోణమైతే, ఈ చట్టంవల్ల బ్రిటిష్‌ ‌కాలంనాటి ‘మతపరమైన గుర్తింపు’ విధానం వైదొలగి, దేశం ‘సుసంఘటితమై’ బలోపేతమవుతుందన్నది మరో కోణం. ఇదే సమయంలో ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలు రాజకీయ ‘ధ్రువాత్మకతకు’ దారితీస్తుందని విపక్షాలు నానా యాగీ చేస్తున్నా ఇప్పటికే అవి మైనారిటీ బుజ్జగింపు పేరుతో రాజకీయాలను ఎప్పుడో ‘ధ్రువాత్మకత’ వైపుకు తీసుకెళ్లాయన్నది నిష్టుర సత్యం. అసలు దేశ పౌరులందరి విషయంలో సమ న్యాయాన్ని అవెప్పుడు పాటించాయి కనుక? సెక్యులరిజం పేరుతో ఎంతసేపు ఓట్ల రాజకీయం కోసం మైనారిటీలను బుజ్జగించి, మెజారిటీ పౌరుల అభిప్రాయాలను తుంగలో తొక్కడం తప్ప అవి ఒరగబెట్టిందేమీ లేదు. అట్లాగని మైనారిటీలకు చేసిన మేలూ లేదు! రాజకీయ లబ్ధే వాటి పరమావధి.

సమంజసం కాదంటున్న కాంగ్రెస్‌

ఉమ్మడి పౌరచట్టం దేశానికి అవసరంలేదని 21వ లా కమిషన్‌ ‌స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం 22వ లా కమిషన్‌ ‘అభిప్రాయ సేకరణ’ ఎంతవరకు సమంజసమని గ్రాండ్‌ ఓల్డ్ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తోంది. ‘భారతీయ సమాజంలోని విభిన్న సమూహాల మధ్య ఉన్న వైవిధ్యాన్ని గౌరవించాలి. సంఘర్షణలకు పరిష్కారం కనుగొనడమంటే విభిన్నతలను పూర్తిగా రద్దుచేయడం కాదు’ అన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ ‌న్యాయమూర్తి బి.ఎస్‌. ‌చౌహాన్‌ ‌నేతృత్వంలోని 21వ లాకమిషన్‌ ‘‌కుటుంబ చట్టంలో సంస్కరణల’పై 2018, ఆగస్టులో సమర్పించిన నివేదికను కాంగ్రెస్‌ ఉటంకిస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే దీన్ని బీజేపీ ముందుకు తెస్తోందని.. నిజానికి దేశ ప్రయోజనాలు పూర్తి భిన్నమంటూ వాదిస్తోంది. దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు విభిన్న రీతుల ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నప్పుడు, వీరందరినీ ఉమ్మడి పౌరస్మృతి కిందకు ఎట్లా తీసుకొస్తారని సమాజ్‌వాదీ పార్టీ ప్రశ్న. ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి విషయంలో మౌనం పాటిస్తున్న ఏకైక పార్టీ బహుజన్‌ ‌సమాజ్‌వాదీ పార్టీ. ముఖ్యంగా ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తన ‘సర్వజన’ ఫార్ములాను దెబ్బతీస్తుందని మాయావతి భయం. దళిత-ముస్లిం సంఘటితం ఆమె లక్ష్యం.

భిన్నాభిప్రాయాలు

దేశంలో ఉమ్మడి పౌరసత్వం (యు.సి.సి) అమలును భారతీయ జనతా పార్టీ మద్దతిస్తుండగా, వివిధ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తుండటం గమనార్హం. ఉమ్మడి సివిల్‌ ‌కోడ్‌ను అమల్లోకి తెస్తామని మొట్టమొదటగా ప్రజలకు వాగ్దానం చేసింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరే ఇతర పార్టీ ఈ విధమైన హామీ ఇవ్వలేదు. ముఖ్యంగా కొన్ని మతపరమైన మైనారిటీ గ్రూపులు, గిరిజన హక్కుల సంఘాలు తమ ప్రత్యేక ఆచార వ్యవహరాలు దీనివల్ల దెబ్బతింటాయంటూ యు.సి.సి.ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని మధ్య, ఈశాన్య ప్రాంతాలకు చెందిన కొన్ని గిరిజన గ్రూపులు, యు.సి.సి. అమల్లోకి వస్తే తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని భయపడుతున్నాయి. మైనారిటీ, ట్రైబల్‌ ‌గ్రూపుల్లో భయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఉమ్మడి పౌరసత్వాన్ని చట్టం రూపేణా బలవంతంగా రుద్దకూడదని, కాంగ్రెస్‌ ‌సీనియన్‌ ‌నేత అభిషేక్‌ ‌మను సింఘ్వి అంటున్నారు. మరో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ ‌కూడా, మత సంప్రదా యాలు అనుసరించే ‘స్వేచ్ఛ’ ఉండేలా యు.సి.సి.లో వీలు కల్పించాలని కోరారు. ‘అసలు ఉమ్మడి పౌరసత్వ చట్టం అంటే నిర్వచనమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. రాజ్యాంగంలో ఉమ్మడి పౌరసత్వ చట్టం ప్రస్తావన ఉన్నప్పటికీ అందుకు ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోవడం వల్ల అమలుపై ప్రభుత్వం ఇచ్చే వివరణను బట్టి తమ స్పందన ఉంటుంద’ని సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ అన్నారు. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ‘‌రాజ్యాంగంలోని 44వ అధికరణం ఉమ్మడి పౌరచట్టాన్ని అమల్లోకి తేవాలని పేర్కొన్న మాట వాస్తవం. అయితే అన్ని వర్గాలతో చర్చలు జరిపి సర్వ సమ్మతితో మాత్రమే దీన్ని అమల్లోకి తీసుకురావాలి’ అని స్పష్టం చేశారు. ఇక మమతా బెనర్జీ సరే సరి. ఆమె ఉమ్మడి పౌరసత్వం అమలును తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు ‘త్రిపుల్‌ ‌తలాక్‌’ ‌రద్దును కూడా ఎత్తేయాలన్నది ఆమె డిమాండ్‌. ‘‌సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు ముఖ్యం. ఈ విషయంలో మనం విజయం సాధించినప్పుడు, ఉమ్మడి పౌరసత్వ చట్టం అనవసరమన్నది నితీష్‌కుమార్‌ అభిప్రాయం’ అని జెడీ(యు) నేత అశోక్‌ ‌చౌదరి పేర్కొన్నారు. ‘సిక్కు మతానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక సంస్కృతి, నాగరికత సిక్కు మతం సొంతం. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆనంద్‌ ‌మ్యారేజ్‌ ‌యాక్ట్‌ను 2012లో అమల్లోకి తెచ్చారు. ఇది అమలు పరచడానికి మరికొంత సమయం పట్టింది’ ఈ నేపథ్యంలో యు.సి.సి. అవసరం లేదని శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ ‌కమిటీ (ఎస్‌జీపీసీ) అధ్యక్షుడు గోవింద్‌ ‌సింగ్‌ ‌లాంగోవాల్‌ 2019‌లోనే వ్యక్తం చేసిన అభిప్రాయం. విచిత్రమేమంటే గతంలో యు.సి.సి.కి అనుకూలంగా మాట్లాడిన శివసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఇప్పుడు వ్యతిరేకిస్తుండటం వాటి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం.

ఉమ్మడి పౌరస్మృతే దిక్కు

నిజం చెప్పాలంటే బహుళ మతాలు, వైవిధ్య ఆచారాలు కలిగిన సువిశాల దేశంలో చట్టాన్ని చక్కగా అమలు చేయాలంటే ఉత్తమ మార్గం ‘ఉమ్మడి పౌరసత్వ చట్టం’ అమలు చేయడమే. దేశ సమగ్రత, సుస్థిరతకు ఉమ్మడి పౌరస్మృతి అవసరమన్నది రాజ్యాంగకర్తల అభిప్రాయం కూడా. ఈ నేపథ్యంలో ఇవి వివిధ మతాల్లో అనుసరించే లింగవివక్ష విధానాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇదే సమయంలో వివిధ మతాలు తాము అనుసరించే సంప్రదాయా లను మరింత హేతుబద్ధంగా మలుచుకోమని కోరవచ్చు. కానీ మతఛాందసవాదులు దీనికి ఎంతమేర అంగీకరిస్తారన్నది ప్రశ్న. సెక్యులరిజం అంటే చట్టం ముందు అన్ని మతాలు, కులాలు సమానమే. కానీ మనదేశంలో విభిన్న మతాలకు, వారి వారి మతాచారాలకనుగుణంగా చట్టాలు అమలవుతున్నాయి. పరిశీలిస్తే ముస్లిం మహిళలతో పోలిస్తే, హిందూ మహిళల్లో ఎంతో పురోభివృద్ధి కనిపిస్తుంది. కారణం అమలవుతున్న చట్టాల్లో వైవిధ్యతే. ముస్లింలకు షరియా చట్టం అమల్లో ఉంది మరి. ఉమ్మడి పౌరస్మృతి కంటే, ‘స్త్రీపురుషుల మధ్య అసమానతలు తొలగించడానికి వీలుగా చట్టాల రూపకల్పనపై దృష్టిసారించాలి’ అని 21వ లా కమిషన్‌ ‌పేర్కొనడం గమనార్హం. తమకు మతం కాదు ప్రధానం, న్యాయమైన హక్కులని చెబుతున్న మహిళా గ్రూపులు, షరియా చట్టంలో మార్పులు తేవాలని కోరుతాయా?

విపక్షాలకు రాజకీయ అస్త్రం

రాజ్యాంగంలోని 44వ అధికరణ ఉమ్మడి పౌరస్మృతి అవసరమని పేర్కొనడం వల్ల, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ ఎవరూ వాదించ డానికి వీల్లేదు. అయితే ఆల్‌ ఇం‌డియా ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు, జూన్‌ 16‌న ఉమ్మడి పౌరస్మృతి అనవసరమని, ఇది దేశానికి ప్రమాదరకమని పేర్కొంది. ఈ విధంగా వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న లక్నోలో సమావేశమై ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ తీర్మానించింది కూడా. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు మతపరమైన అంశంగా రాజకీయం చేయడానికి ఇది అస్త్రంగా మారింది. బుజ్జగింపు రాజకీయాలు వాటికి అలవాటే కనుక, ఇప్పుడు యు.సి.సి. అసలు ఉద్దేశాన్ని పక్కదోవ పట్టించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమలుచేస్తే రాజ్యాంగంలోని 25వ అధికరణం కల్పించిన మతస్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లు తుందని వివిధ మతగ్రూపులు చేస్తున్న వాదనను విపక్షాలు సమర్థిస్తున్నాయి. అయితే యు.సి.సి. అమలు రాజ్యాంగ బద్ధమేనన్న అంశాన్ని సుప్రీంకోర్టు గతంలో చాలా సార్లు స్పష్టం చేసిందన్న సంగతి గుర్తుంచుకోవాలి. దీని అమలు బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో యు.సి.సి. అమలు విషయంలో విభిన్న రాజకీయ పార్టీలు దృఢమైన నిబద్ధతను ప్రదర్శించాలి. దురదృష్టవశాత్తు అది జరగడంలేదు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ‘మతం’ అజెండాను ముందుకు తీసుకొని రావడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతి పేరుతో హిందూ చట్టాలను అమలు చేస్తారన్న కొన్ని మతాలవారి వాదనకు గుడ్డిగా వత్తాసు పలకడం తప్ప విపక్షాలు హేతుబద్ధతకు ఆస్కారం ఇవ్వడంలేదు.

శీతాకాల సమావేశాలే కీలకం

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలని ఎంత కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ, ఇందుకు విపక్షాలు, ఇతర వర్గాల నుంచి ఎదురయ్యే అడ్డంకులు బీజేపీ నేతలకు తెలియనివి కావు. అయితే జి-20 సమావేశాలు ముగిసే సెప్టెంబర్‌ ‌నెలాఖరు వరకు బీజేపీ నాయకులు దీనిపై పెదవి విప్పబోరు. అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ తేనెతుట్టెను మరింత కెలికి అనవసర ఇబ్బందులు తెచ్చుకోవడానికి బీజేపీ నాయకులు సుముఖంగా ఉండరు. ఇక ప్రభుత్వం యు.సి.సి. విషయంలో ఏదైనా ముందడుగు వేయాలనుకుంటే, వచ్చే శీతాకాల సమావేశాలే చివరి అవకాశం. అయితే బిజు జనతాదళ్‌ ‌నుంచి బీజేపీకి సానుకూల సంకేతాలు వస్తున్నాయంటు న్నారు. అదే జరిగితే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక వైఖరి అవలంబిస్తున్న ఆంధప్రదేశ్‌లోని వై.ఎస్‌.ఆర్‌.‌సి.పి. ప్రభుత్వం, అకాలీదళ్‌లు మాత్రం ఈ బిల్లుకు మద్దతివ్వకపోవచ్చు. ఒక్కసారి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, సమర్థకుల సంఖ్య పెరుగు తుందన్నది బీజేపీ అంచనా. 22వ లా కమిషన్‌ ‌నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్‌వాల్‌ ‌చెప్పినదాన్ని బట్టి చూస్తే నివేదిక యు.సి.సి.కి అనుకూలంగా వస్తే, తమకు మద్దతు పెరుగుతుంద న్నది బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారని అర్థంచేసు కోవాలి.

పైలెట్‌ ‌ప్రాజెక్టుగా ఉత్తరాఖండ్‌లో?

ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం రంజన దేశాయ్‌ ‌నేతృత్వంలో యు.సి.సి. అమలుపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ మధ్య కేందప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ కమిటీ సమర్పించే నివేదిక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే యు.సి.సి. బిల్లుకు నమూనాగా ఉండవచ్చునన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల వివాహ వయస్సును 21 సంవత్సరాలుగా నిర్ణయించడం, వారసత్వ ఆస్తిపై కుమార్తెలకు సమాన హక్కు, ఎల్‌.‌జి.బి.టి.క్యు. దంపతులకు చట్టపరమైన హక్కుల కల్పన, జనాభా నియంత్రణ వంటి అంశాలు ఉన్నట్లయితే విపక్షాలకు గొంతులో పచ్చివెల్లక్కాయ పడ్డట్టే. ఇందులో వాటికి విమర్శించడానికి ఏమీ ఉండదు. ఇదే బీజేపీకి కొండత ధైర్యాన్ని ఇస్తుండవచ్చు. ఈ బిల్లును ముందుగా ఉత్తరాఖండ్‌లో పైలెట్‌ ‌ప్రాజెక్టు కింద అమలు జరిపి, తర్వాత దేశం మొత్తం విస్తరించా లన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌ ‌బిల్లు ఆధారంగానే దేశవ్యాప్తంగా అమలుచేసే బిల్లు రూపకల్పన ఉంటుందంటున్నారు.

విపక్షాల అనైక్యతే బీజేపీకి బలం

తలలు కూడని పార్టీల సమావేశం తలకు రోకలి చుట్టుకున్నట్టేనని వర్తమాన విపక్ష రాజకీయం నేర్పుతున్న పాఠం. యు.సి.సి.తో సహా 2024 ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో పట్నాలో జూన్‌ 23‌న కాంగ్రెస్‌తో సహా సమావేశమైన విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు లేదు. కాంగ్రెస్‌తో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల బలం ప్రస్తుత లోక్‌సభలో 88. మరి ఈ సమావేశానికి హాజరుకాని/ఆహ్వానించని పార్టీల సభ్యుల సంఖ్య 60. మరి దీన్ని ఉమ్మడి విపక్ష సమావేశం అని భావించడానికి అవకాశం లేదు. హాజరు కానివారిలో వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి (ఆంధప్రదేశ్‌), ‌నవీన్‌ ‌పట్నాయక్‌ (ఒడిశా), కె. చంద్రశేఖర్‌ ‌రావు (తెలంగాణ) వీరికి చెందిన మూడు పార్టీల సీట్లే లోక్‌సభలో 43. సమావేశానికి హాజరైన వారిలో ఢిల్లీ ప్రభుత్వం విషయంలో కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌పై ఆప్‌, ‌కాంగ్రెస్‌ల మధ్య ఏకాభిప్రాయం లేదు. కాంగ్రెస్‌ ఈ ఆర్డినెన్స్ ‌విషయంలో మౌనం పాటిస్తోంది. అతిముఖ్యమైన ఈ సమస్యపై కాంగ్రెస్‌ ‌తమతో కలిసి రావడంలేదని సమావేశం తర్వాత ఆప్‌ ‌ముఖ్య మంత్రులు కేజ్రీవాల్‌, ‌భగవంత్‌మాన్‌లు ఘాటుగా విమర్శించడంతో పాటు ఇట్లా అయితే కూటమి కోసం భవిష్యత్తు సమావేశాల్లో పాల్గొనబోమని హెచ్చ రించడం గమనార్హం. దీనికితోడు వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు మరో కూటమి కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత కలహాల కుంపట్లో మరింతగా కరిగిపోతోంది. మరి ఈ విపక్ష రాజకీయ భేతాళ పంచవింశతి రాజకీయా ధిపత్యానికే పెద్దపీట వేస్తున్న తరుణంలో యు.సి.సి.పై హేతుబద్ధ రాజకీయానికి తావెక్కడ?

వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE