– డాక్టర్ పార్థసారథి చిరువోలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుంది? జెలెన్‌స్కీ రాజీ పడతారా? రష్యా వెనక్కి తగ్గుతుందా? ఇప్పుడు అన్ని దేశాలనూ కలవరపరస్తున్న ప్రశ్న ఇది. మరోవైపు రష్యా పెంచి పోషించిన సొంత కిరాయి సైన్యం తిరుగుబాటు చేయటానికి సిద్ధం కావటం, ఎంత ఉద్ధృతంగా ఈ ప్రహసనం మొదలైందో అంతే వేగంగా పాలపొంగులా చల్లారిపోవటం కొంత ఊపిరి పీల్చుకునేలా చేసినా… వాగ్నర్ ఇంకా తోకముడవలేదు… బెలారూస్‌లోనే ఉన్నాడనే బాంబు లాంటివార్త బయటకురావడంతో, రేపేమవుతుందోననే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
ఐదు వందల రోజుల క్రితం, ఓ శీతాకాలం ఉదయం రష్యా తన సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌పై సైనిక దాడికి తెగబడింది. ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ ద్వారా క్రెమ్లిన్ తాను అనుకున్నది సాధించగలనని భావించింది. కానీ, ఉక్రెయిన్ తాను ఊహించినంత బలహీనంగా లేదు సరికదా.. సై అంటే సై అంటూ యుద్ధ రంగంలో కాలు దువ్వింది. పశ్చిమదేశాల సహకారంతో ఆయుధాలను సమకూర్చు కోగలిగింది. రష్యాపై వాణిజ్య ఆంక్షలను విధించగలిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ప్రపంచ దేశాల్లో రష్యాను ఏకాకిని చేయటానికి తన వంతు పాత్ర పోషించాడు. కాగా, 16 నెలలుగా సాగుతున్న పోరాటంలో ఈ రెండు దేశాల అధ్యక్షులు ఈ మధ్య కాలంలో చేసిన భిన్నమైన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి.
ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధయుద్ధాన్ని ప్రకటించనుందా? చాలా రోజులుగా ఈ సందేహాలు వెంటాడుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నోటి వెంట కూడా అదే మాట వచ్చేసరికి అందరూ అప్ర మత్తమయ్యారు. రష్యా భూభాగంపై దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్ వార్‌కి దిగుతా మని స్పష్టం చేశారు పుతిన్. అటు అగ్రరాజ్యం అమెరికా మాత్రం రష్యా అణ్వాయుధాలు వినియోగి స్తుందనడానికి ఎటువంటి సంకేతాలూ లేవని వాదిస్తోంది. గత ఏడాది సైనిక చర్య ప్రారంభించి నప్పటి నుంచి రష్యాకు బెలారూస్ సహకారం అందచేస్తోంది. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ఇది ‘లాంచ్‌ప్యాడ్’గా మారింది. పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను బెలారూస్‌కు తరలించే యోచనలో ఉంది రష్యా. ‘మాపైన వ్యూహాత్మకంగా గెలవాలని చూసే వాళ్లకు ఇదో హెచ్చరిక’ అని పుతిన్ స్పష్టంగా చెప్పటం అంతర్జాతీయంగా అలజడి రేపుతోంది.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. రష్యాతో సంప్ర దింపులకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ దేశ సైన్యం సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నాకే ఈ చర్చలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రష్యా సైనికులు అక్కడి నుంచి వెనుదిరిగితే కానీ అందుకు ఒప్పుకోనని జెలెన్‌స్కీ పరోక్షంగా చెప్పారు. క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సాన్ ప్రాంతాలు ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్ అధీనంలోనే ఉన్నాయి. రష్యా సైనిక చర్యతో అవి రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వీటిపై తిరిగి పట్టు సాధించేందుకు ఉక్రెయిన్ సైన్యం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
యుద్ధ ప్రభావం
యుద్ధం కారణంగా 500 మంది పిల్లలతో సహా 9,083 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్టు ఐరాసకు చెందిన హక్కుల సంస్థ ప్రకటించింది. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. 6.3 మిలియన్ల మంది ఉక్రెయిని యన్లు నిరాశ్రయులయ్యారని యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సిఆర్) ప్రకటించింది. ఉక్రెయిన్‌లో 15,779 మంది పౌరులు గాయపడ్డారు. రెండు వైపు సైన్యంలో ఎంతమంది మరణించారనే లెక్కల విషయంలో తేడాలు కనిపిస్తున్నాయి. ఈ వినాశనం దాదాపు 143 బిలియన్ డాలర్ల నష్టం కలిగించిందని కెయివ్ స్కూలు ఆఫ్ ఎకనమిక్స్ పేర్కొంది. ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతాన్ని రష్యా స్వాధీనంలోకి తీసుకుందని అంచనా. ఉక్రెయిన్‌కి నాటో సభ్యత్వం ఇవ్వవల సిందిగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కోరారు.
వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు
రష్యాలో అధ్యక్షుడు పుతిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటుదారులు తమ తిరుగుబాటును విరమించటంతో రష్యన్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కీలకమైన రోస్తోవ్, ఓరోజెన్ నగరాలను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు వాగ్నర్ సేనలు మాస్కో దిశగా పయనిస్తున్న క్రమంలో బెలారూస్ అధ్యక్షుని జోక్యంతో, తమ పురోగమనాన్ని నిలిపి వేస్తున్నట్టు గ్రూప్ అధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తాము తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్టు తెలిపారు. తాను స్వయంగా పెంచి పోషించిన వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేయడం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సవాలుగా నిలిచింది.
మాస్కో దిశగా వాగ్నర్ సేనలు వస్తున్నట్టు తెలిసి వారిని ఎదుర్కొనేందుకు రష్యన్ సైనికులు సర్వ సన్నద్ధం అయ్యారు. అధికార యంత్రాంగానికి అడ్డు తగిలితే ఎవరినైనా, ఎలాంటి విచారణ లేకుండా 30 రోజులపాటు జైళ్లలో నిర్బంధించే ఆదేశాలపై పుతిన్ సంతకం చేశారు. మాస్కోకు 200 కిలోమీటర్ల దూరం వెళ్లిన వాగ్నర్ సేనలు హఠాత్తుగా తమ నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఉక్రెయిన్‌కు వెళుతున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్ మాత్రం వాగ్నర్ తిరుగుబాటుపై సంతోషం వ్యక్తం చేసింది. దుర్మార్గా లకు పాల్పడేవారు వాటిచేతనే నాశనమవుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యా నించారు.
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్. శత్రు దేశాల్లో తన చేతులకు మట్టి అంటకుండా ఆపరేషన్స్ నిర్వహించేందుకు వాగ్నర్ గ్రూపును అధ్యక్షుడు పుతిన్ వాడుతుంటారని సమాచారం. రష్యా సైన్యమే 1990 దశకంలో దీనిని ఏర్పాటు చేసింది. అధికారికంగా ఈ సంస్థ ఎక్కడా రిజిస్టర్ కాలేదు. వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ (పీఎంసీ)ని రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కల్నల్ దిమిత్రీ ఉత్కిన్ ప్రారంభించారు. పుతిన్ అధ్యక్షుడయ్యాక ఈ సంస్థ ప్రిగోజిన్ చేతుల్లోకి వచ్చింది. రష్యా సైన్యానికి మద్దతుగా ఈ సంస్థ ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడిని ప్రారంభించటానికి ముందు వరకు ఈ సంస్థలో దాదాపు 6000 మంది కిరాయి సైనికులు ఉన్నట్టు అమెరికా అంచనా వేసింది.
ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుకాగానే ప్రిగోజిన్ రష్యాలోని అన్ని జైళ్లను సందర్శించి అక్కడ శిక్షలు అనుభవిస్తున్న దొంగలు, బందిపోట్లు, సైన్యంలో అనుభవం ఉండి తుపాకీ కాల్చడం వచ్చిన ప్రతి ఒక్కరినీ వాగ్నర్‌లో చేర్చుకొన్నారు. దీంతో సంస్థ సభ్యుల సంఖ్య ఒక్కసారిగా 50 వేలు దాటింది. ఈ సైన్యం కొద్ది నెలల క్రితం కీలకమైన బఖ్‌ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకొంది. ఈ యుద్ధంలో వాగ్నర్ తీవ్రంగా నష్టపోయింది. రష్యా సైన్యాన్ని నమ్మి యుద్ధంలో ముందుండి పోరాడినా.. కీలక సమ యంలో సైన్యం నుంచి మద్దతు లభించక పోవటంతో వేలమంది వాగ్నర్ సైనికులు బలయ్యారు. ఈ సమన్వయ లోపం కారణంగా ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలపై రష్యా సైన్యం క్షిపణులు, భారీ ఫిరంగు లతో దాడి చేయటంతో ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలతో సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ కక్ష పెంచుకొన్నాడు. నిజానికి మొదట్లో వాగ్నర్ గ్రూప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వెతికిపట్టుకొని చంపడానికే పంపించారు. కానీ, ఉక్రెయిన్ సైన్యం నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురు కావటంతో ఈ కిరాయి సైనికులు పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆ గ్రూప్ ఏకంగా సొంత దేశంపైనే తిరుగుబాటు మొదలు పెట్టింది.
ఎవరీ ప్రొగోజిన్?
పుతిన్ సొంత పట్టణం సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. పుతిన్‌కు అత్యంత సన్నిహితుల్లో, నమ్మకస్తుల్లో ఒకడిగా మారకముందు హాట్ డాగ్ (తినే పదార్థం) అమ్మకందారుగా ఉన్నాడు. సోవియట్ పాలన సమయంలో మోసం, దొంగతనం కేసులో దాదాపు దశాబ్దం పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత 1990ల్లో ఓ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ప్రారంభించాడు. అనంతర కాలంలో పుతిన్, ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. ప్రిగోజిన్ స్థాపించిన కంపెనీ క్రెమ్లిన్ కోసం పనిచేయడంతో పాటు, ప్రిగోజిన్ ‘పుతిన్ చెఫ్’గా పేరుగాంచాడు. 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర బయటకు వచ్చింది. ప్రిగోజిన్‌తో పాటు ఆపరేషనల్ కమాండర్ దిమిత్రి ఉత్కిన్, సాయుధ దళాల మాజీ కల్నల్ అండ్రీ త్రోషెవ్, పీఎంసీ కార్యకలాపాల ఇన్‌చార్జి పికలోవ్ వాగ్నర్ గ్రూపులో కీలకంగా ఉన్నారు.
భారత్ వైఖరి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందని పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి. కానీ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.‘మేము తటస్థ వైఖరి అవలంబిస్తున్నామని కొందరు అంటు న్నారు. అది నిజం కాదు. మేం ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశంలో తటస్థంగా లేము. మేం శాంతి వైపు నిలబడుతున్నాం. దేశాల సార్వ భౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం కచ్చితంగా గౌరవించి తీరాలి. చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే వివాదాలను పరిష్కరించు కోవాలి. తప్ప యుద్ధంతో కాదు. ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం కోసం రష్యా అధినేత పుతిన్‌తో, ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీతో పలుమార్లు మాట్లాడాను. భారత్ ఏం చేయగలదో అన్నీ చేస్తోంది. ఘర్షణలను పరిష్క రించి ఇరు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం, అలాంటి ప్రయత్నాలను సమర్థిస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. భారత్, చైనా సంబంధాల గురించి, భారత్, అమెరికా మైత్రి గురించి ప్రధాని తన మనో గతాన్ని, భారత్ వైఖరిని స్పష్టం చేశారు. జీ20 దేశా లకు అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తోంది. యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుతోంది. ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్