సామాజిక స్పృహతో సమాజంలో జరిగే సంఘటనలను విశ్లేషాత్మకంగా చూచి వాటిలోని రుగ్మతలను, వక్రతలను, దుర్మార్గాలను, కుళ్లును తన రచనల ద్వారా పాఠక లోకానికి తెలియచేసేవాడే ఆదర్శ కవి. స్వాభిమానాన్ని, రాగ ద్వేషాలను ప్రక్కన పెట్టి, కుండబద్దలు కొట్టినట్లు రచన సాగించాడు శ్రీ జన్నాభట్ల నరసింహ ప్రసాద్‌. ‌వీరి రచనలోని ప్రతి శబ్దానికి రంగు, రుచి, తావి ఉన్నాయి. దేశం పట్ల ప్రేమ ఉంది. దేశద్రోహుల పట్ల ఆగ్రహం ఉంది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపట్ల గౌరవం, ఆభిజాత్యం కూడా ఉంది.
ఈ వ్యాస మంజూషలోని వ్యాసాలకు కాలపరిమితి లేదు. ఇక రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా సమాజానికి దిక్సూచిగా పనిచేస్తాయి. మచ్చుకు కొన్ని ఉదాహరిస్తాను.
రూపాయి విలువ తగ్గటానికి కారణాలు. నిజాయతీగా ఓటు, చైనాకు చెక్కుపెట్టే సూత్రాలు, ఎన్నికల హడావిడి, రైతు సంక్షేమం, కార్పొరేట్‌ ‌వ్యవస్థ మనుగడ లాంటి దేశ సమస్యలకు తనదైన పరిష్కా రాలు చూపారు. ఎన్నికల కురుక్షేత్రంలో ఎప్పటికీ ధర్మానికే విజయం అనే వ్యాస కాపీలు వెయ్యి అమలాపురం ప్రాంత ప్రజలకు అందజేశారని తెలిసింది. కాకతాళీ యమో లేక యాదృశ్చికమో 2019లో జరిగిన సారస్వత ఎన్నికలలో రచయిత ఊహించిన విధంగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు కావడం గొప్ప విషయమే.
వివిధ విషయాలపై ప్రచురించిన 23 గ్రంథాలపై వీరి విశ్లేషణ అద్భుతంగా ఉంది. వీరిలో రచయితే కాదు, ఉత్తమ విశ్లేషకుడు కూడా ఉన్నారని తెలుస్తుంది. నాగ్నజితి పరిణయంలో గత శతాబ్దికి విశేషాలు వివరించారు. సుధామ పీఠికలు, సభకు నమస్కారం, ఈ కల్పన బాగుంది. గంగ నుంచి గంగ వరకు, మెదక్‌ ‌జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల సమీక్షలు పరిశీలనాత్మకంగా ఉన్నాయి. సినీ నటి జమున గారి వివాహం వెనుక ఉన్న వృత్తాంతం గొప్ప ఆసక్తిదాయకంగా ఉంది. బహుశ ఈ విషయాలు ఈనాటి తరంవారికి తెలిస్తే థ్రిల్‌గా ఉంటుంది. గుంటూరు సీమ సాహిత్య చరిత్రను పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాశారు. వీరి ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు.
ఈ గ్రంథంలో రచయిత నాన్నగారి పేరుతో తన పేరును విశ్లేషించుకున్నారు. తండ్రితో తన పేరు చూసుకోవడం రచయిత అదృష్టమే కదా!
పది కవితలు వ్రాశాడు. ఏ కవితకు అది గొప్పగానే ఉంది తన స్నేహితుడు చనిపోతే అతనిపై ప్రేమతో ఒక ఎలిజీ వ్రాసి ప్రచురించాడు. ఇది రచయిత ఉదాత్తకు ఉదాహరణ. ఇంతటి మంచి గ్రంథాన్ని డా।। హిప్నా పద్మాకమలాకర్‌ (‌ఫ్యామిలీ కౌన్సిలర్‌) ‌గారికి అంకితం ఇవ్వడం ముదావహం.

వ్యాస మంజూష
రచయిత: జన్నాభట్ల నరసింహప్రసాద్‌
‌పే.: 200, వెల: రూ.150/-
ప్రతులకు : రచయిత
సెల్‌: 8297263741
‌నవోదయ, నవచేతన పుస్తక నిలయాలు

సమీక్షకులు:  ‌ప్రొ।। ముదిగొండ శివప్రసాద్‌, ‌చారిత్రక నవలాచక్రవర్తి

About Author

By editor

Twitter
YOUTUBE