‘‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’’ – కాళోజీ
పశువుకు పచ్చిక నోటి కందినంత చులాగ్గా, పక్షికి పండు దొరికినంత విరివిగా పులికి లేడి చిక్కే సదుపాయాన్ని సృష్టి కల్పించలేదు. అలా తేలిగ్గా దొరికే పక్షంలో పులి అంతటి సహజ సిద్ధమైన బలానికి, తీవ్ర వేగానికి నోచుకోదు. అలాగే హైదరా బాద్ విముక్తి పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు, మానాలు పోతేగాని స్వేచ్ఛ సిద్ధించలేదు.
గ్రామాలతో ప్రజలు ముఖ్యంగా పేద మధ్య తరగతి రైతులు, వ్యవసాయ కూలీలు, ఎక్కువ మంది రెక్కాడితే గాని డొక్కాడనివారు. వారికి అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం తెలియదు. ఇటువంటి అమాయకులపై నిజాం పోలీసు, మిలటరీ, రజాకా రుల అమానుషదాడులు బాగా పెరిగాయి. తమను తాము కాపాడుకోవడం కోసం ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వారంతా ఆత్మరక్షణ దళంగా ఏర్పడాల్సిన పరిస్థితి వచ్చింది. తలుపులు బిగించి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది. రజాకార్ అణచివేత యత్నానికి అదే అనుభవం ఎదురైంది.
ఈ దళాలు కర్రలు (గుతుపలు), వడిసెలలు, కారం ముంతలు ఉపయోగించేవారు. చాలా సందర్భాలలో రైతుల నుంచి కూడా యువకులు దళ సభ్యులుగా చేరేవారు. గ్రామ జనాభాను బట్టి 50 నుంచి 30 మంది, లేదా 20 నుంచి 10 మందితో దళాలు ఏర్పడేవి. ఈ దళాలకు ఒక కమాండర్, ఉప కమాండర్‌లను ఎన్నుకునేవారు. చురుకు, చొరవ ఉన్నవారినే కమాండర్లుగా నియమించేవారు.
ఈ దళాల కార్యక్రమం-గ్రామాలను రాత్రిం బవళ్లు కాపలా కాయటం. పరాయివారు వస్తే తెలుసు కుని గ్రామ సంఘానికి చెప్పి, వారెందుకు వచ్చారో తెలుసుకోవటం. సి.ఐ.డి.లు వస్తే నేరగాళ్లను పట్టివ్వడం, దొంగతనాలు జరగకుండా చూడటం, తగాదాలు తీర్చడం. తమ చేత కాకపోతే గ్రామ సంఘం ద్వారా పరిష్కరించడం. వీరికి తప్పనిసరిగ్గా డ్రిల్లు నేర్పేవారు. వారిలో మెరికల్లాంటి వారిని కేంద్ర దళాలకు పంపేవారు. ఆరోగ్యం, గ్రామాలను పరి శుభ్రంగా ఉంచటం, జబ్బు పడినవారికి, పేదలకు సాయమందించడంలో గ్రామ దళాలు నిర్మాణాత్మక పాత్రను పోషించాయి. వీరే కొంత కాలానికి గెరిల్లా దళాలుగా ఏర్పడి దూరప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. వారికి వ్యవసాయం, ఇంటి పనులు చూసుకోవటం సాధ్యం కాకపోతే వాలంటీర్లు లేదా దళ సభ్యులు సహాయపడేవారు.
కాలక్రమంలో పార్టీ ఆర్గనైజర్లకు, అధికారులు తగ్గి గెరిల్లా దళాలకు అధికారం పెరిగింది. గెరిల్లా దళాలకు ఆయుధాల సరఫరా పెరిగి, అధికారం మరింత పెరిగింది. ఈ సమయంలో ఆయుధాల సమీకరణ బాగా జరిగింది.
దళ సభ్యులకు కఠోర శిక్షణ ఇచ్చేవారు. నాటు తుపాకులు, షాట్‌గన్స్ మాత్రమే దొరికాయి. రైఫిళ్లు దొరకలేదు. వాటికోసం రావులపెంట పోలీసు క్యాంపుపై దాడి చేయాలని నల్గొండ జిల్లా కమిటీ నిర్ణయించింది. ఆ సమాచారం కోసం ఓ బృందాన్ని నియమించింది. ఈ బృందం క్యాంపునకు సంబంధిం చిన పూర్తి సమాచారం సేకరించి, ఇరవై రోజుల తర్వాత దాడి కోసం తేదీని నిర్ణయించింది. అయితే దాడి చేసే సమయానికి వారు వ్యవస్థలో కొన్ని మార్పులు చేశారు. దానితో ఇద్దరు దళ సభ్యులు మరణించారు. అంటే ఇరవై రోజుల్లోనే అనేక మార్పులు జరిగే అవకాశం ఉంటుందని దీనితో తేలింది. ఈ అనుభవంతో ఆయుధాల కోసం పోలీసు స్టేషన్లపై దాడి సరికాదని నిర్ణయించారు.
సుమారుగా ఇదే సమయంలో కొందరు రజాకార్లు పోలీసులతో సహా వచ్చి ఉదయం 9-10 గంటల మధ్య కోటపాడు మీద దాడి చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది. దళం రజాకారులను ఎదుర్కొని తరచుగా ఓ మేడలో దాక్కుని అక్కడ నుండి కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. దళ సభ్యులు ఆ మేడను చుట్టుముట్టి లొంగిపొమ్మన్నారు. సుశిక్షతులైన సభ్యుల• భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వారిని ఎదుర్కొన్నారు. రజాకారులు చాకచక్యంగా తప్పించుకోగలిగారు. దళానికి ఇదొక అనుభవం. శత్రువు దగ్గర ఆధునిక ఆయుధాలు, మన దగ్గర సాధారణ ఆయుధాలు ఉన్నప్పుడు ఈ పద్ధతి పని చేయదని అర్థమైంది. రైఫిల్ లాంటి ఆయుధం లేక దూరం నుండి రజాకార్లను కాల్చలేక పోయేవారు. మాటు వేసి దాడి చేసే విధానం మొదలుపెట్టారు. చివ్వెములలో ఇది కొంతవరకు పనిచేసింది. సరిహద్దు గ్రామాల నుండి శత్రువుపై దాడి చేయడం మరో ఆలోచన. అది వరంగల్‌లో జరిగింది.
రైఫిల్ ధరించిన ఒక పోలీసువెంట ఉండి, లెవీ ధాన్యాన్ని బండ్లపై వేసి గ్రామంనుంచి తీసుకువెళుతున్నారు. ఈ బండ్లు చందుపట్ల, నామవరం, మోతె, చివ్వెముల గ్రామాలకు చెందినవి. దారిలో అక్కడక్కడ దళ సభ్యులు మాటువేసి ఉన్నారు. అదనుచూసి ఆ పోలీసును పట్టుకుని ఆయుధం లాక్కోవాలని నిర్ణయించారు. చివ్వెముల- సూర్యాపేట మధ్యన సైదులు మిట్ట దగ్గర కొంత మరుగు ఉంది. అక్కడ అదను చూసుకొని ఒకేసారి నలుగురు దళసభ్యులు పోలీసు మీద పడి ఆ రైఫిల్ లాక్కున్నారు. బండ్లను గ్రామ సంఘం స్వాధీనం చేసుకుని ధాన్యాన్ని ప్రజలకు పంచింది. ఈ విధంగా మొదటి రైఫిల్ దొరికింది.
వరంగల్ జిల్లా ప్రత్యేక పరిస్థితి వలన సరిహద్దు ప్రాతం నుండి దళాలు దాడి చేయడానికి అవకాశం కలిగింది. తిరువూరు, నందిగామ తాలూకాలు అక్కడి ఖమ్మం, మధిర తాలూకాలు సరిహద్దు ప్రాంతంగా ఉండేవి. ఈ రెండు తాలూకాలు నిజాం పాలనలో కాకుండా యూనియన్ పరిపాలనలో ఉండేవి. అప్పటికి తీవ్ర నిర్బంధం ప్రారంభం కాలేదు. దానితో సరిహద్దులో దళాల శిక్షణ, రక్షణకు అవకాశం ఉండేది. సరిహద్దు దాటి, దాడి చేసి మళ్లీ యూనియన్ సరిహద్దుల్లోకి వెళ్లడానికి సౌకర్యంగా ఉండేది. కాబట్టి పరిటాల, తిరువూరు, మీనవోలు స్టేషన్ గేటు వద్ద పోలీసు దళంపై దాడి, మధిర, రేణిగుంటలలో రజా కారులపై దాడులు జరిగాయి.
పరిటాల నందిగామ తాలూకాల మధ్యనున్నది జాగీరు ప్రాతం. ఈ జాగీరుకు వ్యతిరేకంగా పూర్వం కొన్ని పోరాటాలు జరిగాయి. ఇక్కడ ఓ తహశీల్దారు ఆఫీసు, పోలీసుస్టేషన్ ఉన్నాయి. తహసీలాఫీసు వారు పోలీసు సాయంతో పన్నులు వసూలు చేసేవారు. సుమారు 10-15 మంది పోలీసులు మాత్రమే ఉండేవారు. ఇది బలహీనమైన కేంద్రం. వారికి రక్షణ నిచ్చేవారెవరూ దగ్గరలో లేరు. పెట్రోలింగ్‌కు కూడా అవకాశం లేదు. వీటన్నిటిని అవకాశంగా తీసుకుని ఆయుధాల కోసం ఈ స్టేషన్‌పై దాడి చేయగా పోలీసులు సులువుగా లొంగిపోయారు. ఇక్కడ నాటు తుపాకులే దొరికాయి. రైఫిళ్లు దొరకలేదు. ఈ దాడికి రాజకీయ ప్రాధాన్యం ఉంది చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు ఈ దాడి నైతిక బలాన్ని ఇచ్చింది. రాబోయే కాలంలో చేయబోయే దాడులకు కావలసిన భూమిక ఏర్పడింది. దీని తరువాత తిరువూరు ప్రాంతంలో పోలీసుల లారీలపై దాడి జరిగింది.
తిరువూరు ప్రాంతంపై సరిహద్దుల్లో గల ఒక దళం దాడి చేసింది. పోలీసులు కూలీలను వెంట పెట్టుకొని లారీల్లో ఈ గ్రామాలకు వచ్చేవారు, పని ముగించుకుని సాయంత్రం వెళ్లేవారు. స్థానిక ప్రజలు, దళాల సభ్యులు పై ప్రాంతం నుండి వచ్చే కూలీలకు అడ్డు పడతారనే భయంతో పోలీసును వెంట తీసుకుని వచ్చేవారు. దళానికి అందిన సమాచారం ప్రకారం పోలీసులు ఓ లారీలోనూ, కూలీలు వేరే లారీలో వస్తారు.
కాబట్టి పోలీసు లారీపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు కూడా అదే లారీలో వచ్చారు. సాధారణ ప్రజలు నష్టపోతారు కాబట్టి దాడిని దళం వాయిదా వేసుకున్నది. ఆ విధంగా తరువాత దాడి చేశారు. పెద్దగా ఆయుధాలు దొరకలేదు. కాని మంచి ప్రాచుర్యం వచ్చింది.
ఒక సార్జెంట్‌ను వెంట తీసుకుని రజాకార్లు మీనవోలులో ప్రవేశించారు. అప్పటికే సమాచారం తెలుసుకున్న దళాలు ఆ గ్రామానికి వచ్చి రజాకార్లను వెంటబడి తరిమారు. ఈ సంఘటనలో కొందరు పోలీసులు, సాధారణ పౌరులు నష్టపోయారు. అయినా ప్రజల ఆత్మస్థయిర్యం చెడకుండా ఇది పనికి వచ్చింది. ఈ దాడిలో ఓ రైఫిల్‌ను రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మధిర దగ్గర సరిహద్దు ప్రాంతంలో ఒక స్టేషన్ గేటు వద్ద దాడి జరిగింది. దళం సరియైన ప్లాన్‌తో రాత్రిపూట పోలీసులపై గ్రానైట్ విసిరారు. గ్రానైట్ దెబ్బకు ముగ్గురు లేక నలుగురు పోలీసులు చని పోయినట్టు తెలిసింది. నాలుగు రైఫిల్స్ సంపాదిం చారు. ఈ దళానికి మంచికంటి రాంకిషన్ రావు నాయకుడు. ఆయనకు కొంత మిలటరీ శిక్షణ కూడా ఉంది. సరైన పోరాట పద్ధతులలో దాడి చేసి జయ ప్రదంగా ముగించి మంచి ఫలితాలను రాబట్ట గలిగారు.
కొద్దిరోజుల తరువాత మధిర ప్రాంతంలో ఓ తప్పు జరిగింది. సైగల్ అనే యువ హిందూ ఇంజనీరు, రైల్లో ప్రయాణిస్తున్నాడు. ఇతడు జాతీయవాది, ఉత్తర భారత దేశస్థుడు. ప్రభుత్వో ద్యోగి. నిజాంకు వ్యతిరేకంగా ఉంటూ జాతీయ భావాలు కలిగి ఉండటం వలన వారికి పరోక్షంగా బాగా సాయంచేసేవాడు. ప్రభుత్వోద్యోగులను కాల్చడం జరుగుతూ ఉండేది కాబట్టి ఇతన్నీ కాల్చారు. అతని శవాన్ని రాచమర్యాదలతో ఊరేగించి హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేశారు. అనాలోచితంగా చేసిన పనికి దళంపై బాగా వ్యతిరేకత వచ్చింది.
హైదరాబాద్‌కు సమీపం భువనగిరి తాలూకాలో రేణిగుంట గ్రామం ఉంది. స్థానిక భూస్వామి రామిరెడ్డి సొంత దళాన్ని తయారు చేసుకొని గ్రామాన్ని కాపాడుకునేవాడు. నిజాం వ్యతిరేక ఉద్యమం రావడంతో రజాకార్ల దాడి నుండి గ్రామాన్ని, ప్రజలను రక్షించుకోవాలని ఊళ్లో వున్న భూస్వాములు కూడా పార్టీకి సహకరించారు. రామిరెడ్డి దళానికి నాయకుడుగా ఉంటూ రైఫిళ్లు, ఇతర ఆయుధాలు కూడా దగ్గర పెట్టుకొని చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా తిరిగేవాడు. ఇతను ఇంటికి వచ్చిన సమాచారాన్ని అందుకొని పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి, దళంపై దాడి చేయడానికి రజాకార్లు గ్రామంలో ప్రవేశించారు. ఈ సంగతి రామిరెడ్డికి తెలిసింది. గెరిల్లా యుద్ధం ప్రకారం తప్పుకోవడానికి అనుకూలంగా ఉంది. స్థానికుల సహకారం కూడా ఉంది. కాని తప్పుకోవడానికి బదులు వారితో అటో ఇటో తేల్చుకోవాలనుకున్నాడు. చివరి దాకా యుద్ధం చేసి వీరమరణం పొందాడు.
మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడితో ధర్మరాజు ‘‘తాతా’’ శత్రువు బలవంతుడైతే బల హీనుడు ఏ ఉపాయంతో ఆ విపత్తు నుంచి తప్పించు కుంటాడు అని ప్రశ్నిస్తాడు, ధర్మరాజు. శత్రువు బలంగా ఉంటే అహంకారంతో, మూర్ఖంగా, ఎదురు పడకుండా ప్రవర్తించాలి (తెలివిగా తప్పుకోవాలి). అప్పుడు బలహీనుడు చెడకుండా నిలబడతాడు’ అని ఉపదేశిస్తాడు భీష్ముడు.
గెరిల్లా యుద్ధరీతిలో మన బలానికి మించి శత్రువులున్నప్పుడు వెనక్కి తగ్గి, మనకు బలమున్న స్థానంలో శత్రువును దెబ్బతీయాలి. మూర్ఖత్వం సరికాదు. రామిరెడ్డి అలా చేయక ‘విజయమో, వీరమరణమో’ అన్న సూత్రం అమలు చేశాడు. ఇలాంటి బాహాబాహీ యుద్ధాలు తెలంగాణ పోరాటంలో పెద్ద సంఖ్యలోనే జరిగాయి. దానివల్ల ఎక్కువగా ప్రజలు నష్టపోయారు.
కరీంనగర్ జిల్లాలో ప్రభాకరరావు ముఖ్య జిల్లా స్థాయి నాయకుడు. గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ తీసుకున్నాడు. సరియైన అవగాహన లేకపోవడం వలన అతడు గుట్టల్లో ఉన్న సంగతి తెలిసిన పోలీసుల•, మిలటరీ చుట్టముట్టారు. అయినా దళం తప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పోలీసులు, మిలటరీ ఈ మొత్తం దళాన్ని కాల్చివేశారు. నాటు ఆయుధాలతో రజాకార్లు గుంపుగా రావటం, మిలటరీ సహాయం వారికి బాగా కలిసి వచ్చాయి. అయినా క్రమంగా దళాలు రజాకార్లను భయప్టెగలిగిన స్థితికి వచ్చాయి. సరిహద్దునుండి వచ్చి దాడులు చేయడానికి ఉన్న సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మాటున ఉండి దాడి చేయటం వలన ఫలితాలు వచ్చాయి. బాహీబాహీగా తలపడిన చోట విజయం సాధించ లేదు. ఇవి ఈ కాలంలో వచ్చిన అనుభవాలు, గుణపాఠాలు.
ఓ కవి ‘కన్నీరు కారిస్తే కాదు – రక్త చిందిస్తేనే చరిత్ర తిరగ వ్రాయగలవు’ అన్నాడు.
– డా।।కాశింశెట్టి సత్యనారాయణ