భూమి గుండ్రంగా ఉందనడం ఎంత సత్యమో, భూగోళ వైశ్యాం ఒక్క అంగుళం కూడా పెరగదన్నదీ అంతే వాస్తవం. కానీ జనాభా పెరుగుతూనే ఉంటుంది. వారి అవసరాలు రోజురోజుకి పెరుగుతాయి. ఆ అవసరాలన్నింటిని తీర్చేది భూమాత. అసంఖ్యాకమైన ఆ అవసరాలను తీర్చుకునే క్రమంలో భూరక్షణ అనే పరమోన్నత ప్రాధాన్యాన్ని మానవాళి దారుణంగా విస్మరించిన సంగతి ఇప్పుడు రుజువయింది. నేల సారాన్ని ధ్వంసం చేయకుండానే, పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంతో, సంప్రదాయ పద్ధతిని తిరస్కరించకుండానే మానవాళి అవసరాలు తీర్చుకోవలసి ఉంటుందన్న గొప్ప దృక్పథం  ఇప్పుడిప్పుడే మనిషి అనుభవానికి వస్తున్నది. కానీ మనిషి అత్యాశతో, అనాలోచిత ధోరణులతో భూమికి ఇప్పటికే ఎనలేని చేటు జరిగిందంటే సత్యదూరం కాదు. పంచభూతాలలో ఒకటి ఈ నేలనే కాదు, గాలి, నీరు, ఆకాశాలను కూడా మనిషి కాలుష్యమనే కాటుకు గురిచేశాడు. దీనిని ఆపడానికి ఎక్కడో అక్కడ, చిన్నదే అయినా ఎంతో అంత ప్రయత్నమైతే మొదలు కావాలి. భూమి వర్తమాన తరాల అవసరాలు తీర్చడానికి మాత్రమే లేదు. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవాళి ఈ భూమ్మీద నివసించింది. రేపటి తరాలూ ఇక్కడే జీవించాలి. అందుకే భూమిని రక్షించుకోవాలి. నేలంటే హిందూ తాత్త్వికతలో ఉన్న సమున్నత భావనను బట్టి అది భారతగడ్డ మీద మొదలు కావడం సముచితం. ఆ ప్రయత్నంలో భాగమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కృషి విజ్ఞాన కేంద్రాల స్థాపన. హరిత విప్లవం విస్మరించిన చేదు నిజాలను గుర్తించే సరికొత్త విప్లవం సేంద్రియ వ్యవసాయం. దానికి కేంద్ర బిందువులే కృషి విజ్ఞాన కేంద్రాలు.

రసాయనిక ఆయుధాలతో యుద్ధాలు, పారిశ్రామిక వ్యర్థాలు, అధికోత్పత్తుల కోసం పొలాలను కప్పేసిన ఎరువులు, పేలిన అణు కేంద్రాలు… భూమాతను నిలువెల్లా గాయపరిచాయి. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఆహారోత్పత్తుల పెంపు కోసం ప్రపంచంలో చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి. అందులో భారత్‌ ‌కూడా ఉంది. తిండిగింజల కొరత తీర్చడానికి ఆనాటి నాయకులు, శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ కృషి శంకించ దగినది కాదు. కానీ ఈ విషయంలో లోపించిన వారి దూరదృష్టిని అభిశంసించకుండా ఉండలేం. ఈ చర్చ భవిష్యత్తు అనుభవాల కోసమే తప్ప, ఎవరినీ అవమానించడానికి కాదు. భూరక్షణకు జరుగుతున్న కొత్త యజ్ఞంలో అలాంటి ప్రతికూల కోణాలను పరిహరించడానికి మాత్రమే. ఆ పని కృషి విజ్ఞాన కేంద్రాలు ఆరంభించాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు హరిత విప్లవం తాత్కాలిక ప్రయోజనాలను విజయవంతంగా నెరవేర్చి, నేల, పర్యావరణాల ఆరోగ్యాల విషయంలో దీర్ఘకాల సమస్యను మిగిల్చిందన్న విమర్శ ఉంది. పొలాలకు నీటి సౌకర్యం కల్పించే అంశం కంటే, ఎరువులతో దిగుబడి పెంచే విధానానికి హరిత విప్లవం ప్రోత్సాహమిచ్చింది. దీని ఫలితం దారుణం. నీటి వసతి సంపూర్ణంగా లేని నేలలో ఎరువులు వేస్తే జరిగేది ఒక్కటే- నేల సారం ధ్వంసమవుతుంది. హరిత విప్లవం ప్రచారం చేసిన ఎరువులు, పురుగుమందుల సేద్యం ఖర్చుతో కూడుకున్నదే కాదు, కొన్ని పంటలకే పరిమితమైనది. అదొక విష వలయం. అధిక దిగుబడికి సంకరజాతి వంగడాలు ఉపయోగించాలి. వీటి రక్షణకు రసాయనిక ఎరువులు, మందులు కావాలి.  రెండు పంటలు వచ్చాయి. దిగుబడి విపరీతంగా పెరిగింది. కానీ దాచడానికి గోదాములు లేవు. దీనితో పాటు క్షమార్హం కాని పెద్ద ఆరోపణ- పర్యావరణం మొత్తం కలుషితమైంది. అదృష్టమో, దురదృష్టమో…నీటి వసతికి దూరంగా ఉండిపోయిన 60 శాతం భూమికి హరిత విప్లవం చేరలేదు. 40 శాతం భూమికి పరిమితమైన హరిత విప్లవం మొత్తం వాతావరణాన్ని కలుషితం చేసింది. వరి, గోధుమ పంటల కమతాలే హరిత విప్లవ లక్ష్యాలుగా కనిపించాయి. భారతీయ రైతుల మధ్య అంతరాలను ఆ విప్లవం మరింత పెంచింది.

ఆరంభమైన  నాలుగైదేళ్లలోనే రైతుల మీద విపరీతమైన ప్రభావం చూపుతున్న, మంచి ఫలితాలు ఇస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాల సేవ ముమ్మాటికీ పరిశీలించదగినదే. దేశమంతటా 730 వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మెదక్‌ ‌జిల్లా, కౌడిపల్లి మండలం, తునికి గ్రామంలోని డాక్టర్‌ ‌రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్‌ ‌నిర్వహిస్తున్న కేంద్రం మనకు సమీపంలో ఉంది. ఇవన్నీ భారత వ్యవసాయ పరిశోధన మండలి మార్గదర్శకత్వంలో నడుస్తాయి. రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు  భాగస్వాములవుతాయి. తునికి కేంద్రం మే, 2017లో మొదలయింది. ఈ  కేంద్రాల ధ్యేయం సేద్యాన్ని స్వయం ఉపాధిగా, స్వీయ వ్యాపారంగా రూపొందిం చడం. అంటే రైతులు బాహ్య అవసరాల మీద ఆధారపడడాన్ని తగ్గించడం. నేల సారాన్ని మరింత ధ్వంసం కాకుండా చూసుకుంటూ, రసాయనేతర పద్ధతులతో ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఇదే అంశం మీద ఈ కేంద్రం రైతులకు శిక్షణ ఇస్తుంది. ఈ సేద్యం అవసరాన్ని తెలియచేస్తుంది.

తునికి కృషి విజ్ఞాన కేంద్రం 30 ఎకరాలలో కార్యకలాపాలు సాగిస్తున్నది. ఇందులో నికర సాగు విస్తీర్ణం 21.5 ఎకరాలు. 2018 నుంచి ఇక్కడ సాగుతున్న మొత్తం సేద్యం సేంద్రియ పద్ధతిలోనే జరుగుతున్నది. పంట మార్పిడి విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వరి బదులు ఆకుకూరలు, పండ్లు, కూరగాయల పంటలను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం  పెరుగుతున్న వినియోగాన్ని బట్టి తృణధాన్యాలు, పప్పుధాన్యాల సేద్యానికి కూడా పెద్ద పీట వేస్తున్నారు. ప్రయోగశాలల సేవలను క్షేత్రాలకు తీసుకురావడం ఇంకొక అంశం. అక్కడ విజయవంతమైన ప్రయోగాలనే పొలాలకు అందిస్తున్నారు. కంకర, రాతి నేలలు, సమస్యాత్మక నేలలను కూడా దిగుబడికి అనుకూలంగా మార్చే విధానాలను ఇక్కడ రైతులకు నేర్పుతున్నారు. పందిళ్లతో, సంచి సేద్యంతో తీగజాతి కూరల పెంపకం పరిచయం చేయడం వల్ల ఆ ప్రాంతం వారు లాభపడుతున్నారు. శిక్షణ కోసం రైతులు ఈ కేంద్రానికి వస్తారు. అవసరాన్ని బట్టి ఈ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి అక్కడే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కూడా. ఇక్కడే ఒక చిన్న తరహా ప్రయోగశాలను ఏర్పాటు చేసి 560 మట్టి నమూనాలను పరీక్షించారు. ఆ ఫలితాల ఆధారంగా పంటలను సిఫారసు చేశారు. అదే సమయంలో ఎరువుల వాడకం తగ్గించి, నేల సారాన్ని పరిరక్షించడం ఎలాగో తప్పనిసరిగా వివరిస్తారు.

ఇక్కడ ఇచ్చే శిక్షణలో దాదాపు 14 అంశాలు ఉన్నాయి. సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులు, వర్మీ కంపోస్ట్ ‌తయారీ, నేల ఆరోగ్య నిర్వహణ, తెగులు, వ్యాధి నిర్వహణ మీద శిక్షణ, వ్యవసాయ యంత్రాల ప్రాధాన్యం చెప్పడం,  సాధికారత మీద మహిళలకు శిక్షణ, జీవన ఎరువుల పాత్ర, వ్యవసాయోత్పత్తుల డీలర్ల శిక్షణ, వ్యవసాయ పర్యావరణ పరిస్థితి మీద అవగాహన పెంచే శిక్షణ, వ్యవసాయ విస్తరణలో సాంకేతిక సమాచారం గురించి శిక్షణ, నర్సరీ పెంపకం, తేనెటీగల పెంపకం- వంటి అంశాల మీద కేంద్రం దృష్టి సారించింది. ఇక్కడ 12 రకాల జీవన ఎరువులను తక్కువ ధరలకే రైతులకు అందిస్తారు. సేద్యం ఏ రూపంలో చేసినా తక్కువ ఖర్చు చేయగలగాలన్నదే కేంద్రం లక్ష్యం. ఒక పద్ధతితో బహుళ ప్రయోజనాలు సాధించడం కూడా. ఉదాహరణకు మామిడితోటలలో వర్మీ కంపోస్ట్ ‌తయారీ. రైతుకు, తోటకు, నేలకు కూడా దీనితో లాభాలు ఉన్నాయి.

పశు సంరక్షణ లేకుంటే వ్యవసాయం పరిపూర్ణం కాదు. ఆ రెండూ పరస్పర పూరకాలు. అందుకే పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పెంపకం గురించి కూడా ఇక్కడ సలహాలు ఇస్తారు. డ్రోన్‌ల ద్వారా కూడా పురుగు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అటు ఆధునిక పద్ధతులు, ఇటు సంప్రదాయం ఇచ్చిన అనుభవాలు, వాస్తవాలు కూడా కృషి విజ్ఞాన కేంద్రం శిక్షణలో, ఆలోచనలలో దర్శనమిస్తాయి.

శాస్త్రవేత్తల ప్రయోగాలను పొలాలకు పరిచయం చేయడమే కాదు, అందుకు సంబంధించిన ఆలోచనలను, ఆ ఆలోచనలను స్వాగతించే వాతావరణం సృష్టించడం కోసం కూడా ఏకలవ్య ఫౌండేషన్‌ ‌తన వంతు కృషి చేస్తున్నది. వికారాబాద్‌ ‌జిల్లా, తాండూరు మండలం, జింగుర్తిలో 2018లో స్థాపించిన ఏకలవ్య ఆర్గానిక్‌ అ‌గ్రికల్చరల్‌ ‌పాలిటెక్నిక్‌ ఇం‌దుకు అద్దం పడుతుంది. ఇది ఆచార్య జయశంకర్‌ ‌తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్నది. నాలుగు సెమిస్టర్లతో కూడిన ‘ఆర్గానిక్‌ అ‌గ్రికల్చర్‌ అం‌డ్‌ ‌హార్టీకల్చర్‌’ ‌డిప్లోమా కోర్సును ఇక్కడ బోధిస్తారు. తక్కువ వ్యయంతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు ఇక్కడ నేర్పుతారు. వ్యాపారవేత్తగా ఎదిగే అంశాన్ని కూడా బోధిస్తారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లతో పరిచయం, గోశాలల నిర్వహణలో శిక్షణ కూడా ఉన్నాయి.

కొంచెం వాస్తవిక దృక్పథం కలిగిన వారికి గ్రామాల వాతావరణం కలవరం కలిగిస్తుంది. పోషకాహారం గురించే కాదు, విపరీతంగా పెరిగిపోతున్న రసాయనిక ఎరువుల వల్ల పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకోవడం ఎలాగో వారికి తెలియడం లేదు. మొత్తంగా గ్రామీణుల ఆరోగ్యం, కుటుంబాల ఆరోగ్యం గురించి ఇప్పుడు పరిజ్ఞానం కలిగించాలి. ఇందులో స్త్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలలో వారికి తెలియకుండానే ఆయుర్వేదంతో అనుబంధం కలిగి ఉంటారు. అందుకే జింగుర్తిలోనే ఒక ఔషధీ జాతులతో ఒక పార్కును అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. గోవుకూ భారతీయ జీవనానికే కాదు, భారతీయ వ్యవసాయానికి కూడా గోవు అవసరమే. అందుకే గోవుల పెంపకం కూడా ఏకలవ్య ఫౌండేషన్‌ ‌చేపడుతున్నది.

అలాగే సాందీపని గురుకులం పేరుతో జింగుర్తిలోనే ఒక పాఠశాల కూడా వచ్చే సంవత్సరం నుంచి మొదలవుతున్నది. సీబీఎస్‌ఈ ‌పాఠ్య ప్రణాళికతో పాటు సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్‌, ‌మాతృభాష ఇక్కడ బోధిస్తారు. పిల్లలలో కళాత్మక దృష్టి కోసం అనేక కళలలో తర్ఫీదు కూడా ఇస్తారు. దీని ప్రధాని ఉద్దేశం ఉద్యోగాలు కోరే వారిని తయారు చేయడం కాదు. ఉద్యోగాలు ఇచ్చే వాణిజ్యవేత్తలను నిర్మించడం.

తునికి కృషి విజ్ఞాన కేంద్రం ధర్మకర్తల మండలికి ప్రస్తుతం తాండ్ర వినోద్‌రావు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వి. శ్రీనివాస్‌ ‌సీఈఓగా సేవలు అందిస్తున్నారు.   ఈ కేంద్రానికి శాస్త్రవేత్తల బృందమే పెద్ద బలమని వినోద్‌రావు చెప్పారు. డాక్టర్‌ ‌శంభాజీ నాల్కర్‌ ‌సీనియర్‌ ‌సైంటిస్ట్‌గా, ప్రిన్సిపల్‌ ‌కోఆర్డినేటర్‌గా, పశు సంవర్ధక శాఖ అధిపతిగా వ్యవహరి స్తున్నారు. రవికుమార్‌ (‌సస్య రక్షణ విభాగం), ఎన్‌.శ్రీ‌నివాస్‌ (‌ఫలపుష్ప సాగు), ప్రతాపరెడ్డి (సేద్య విభాగం), ఎం. ఉదయ్‌కుమార్‌ (‌వ్యవసాయ యంత్రీకరణ విభాగం), డాక్టర్‌ ‌జి. భార్గవి (గృహ విజ్ఞాన విభాగం) ఇక్కడ సేవలు అందిస్తున్నారు.

ఈ నేలలో పండిన పంట ఈ మట్టి వాసన వేయకుండా, రసాయనాల కంపు కొట్టడం ముమ్మాటికీ విషాదమే. రసాయనాలు లేకుండా సేద్యం చేస్తే బతకలేమన్న నమ్మకాన్ని తునికి కృషి విజ్ఞాన కేంద్రం క్రమంగా కలుపు తొలగించినట్టు  రైతుల ఆలోచనల నుంచి తొలగిస్తున్నది. జాగృతి బృందం అక్కడికి వెళ్లినప్పుడు వచ్చిన ఒక రైతు అన్నమాట దీనిని రుజువు చేస్తున్నది. ‘మందులు వేయని పంట పండించాలి. ఆ పంట తినాలి. అసలైన జీవితం ఏదో అప్పుడే తెలుస్తుంది’ అన్నాడాయన. సేంద్రియ సేద్యానికి ఆదరణ లేకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ అందుకు సంబంధించిన భయాలను తొలగిస్తే చాలు. సేంద్రియ సేద్యం కూడా రసాయనిక ఎరువులతో సమానమైన దిగుబడి ఇస్తుందని ఆధారాలతో చూపాలి.  అదే నేలను కాపాడుకునే సిద్ధాంతమవుతుంది. అదే రైతును రాజును చేస్తుంది. పాతాళంలో దాగిన వానపాములను మళ్లీ స్వాగతిస్తుంది. రెండు చేతులు ఎత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నట్టు విత్తనం నుంచి వెలువడుతున్న అసలు సిసలు ఆకుపచ్చని అంకురం మళ్లీ దర్శనమిస్తుంది.

About Author

By editor

Twitter
YOUTUBE