– డాక్టర్ పార్థసారథి చిరువోలు
అరబ్ దేశాలు మన ప్రధాని నరేంద్రమోదీని ఎందుకు అంత గాఢంగా అభిమానిస్తున్నాయి? యూఏఈతో సంబంధాలకు భారతదేశం ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తోంది? ఈ రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా వాణిజ్యం పెరుగుతూ రావటానికి కారణం ఏమిటి? మొన్న ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ మరోమారు ఈ దేశాన్ని సందర్శించారు. ఈ దఫా పర్యటనతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఇవన్నీ చూద్దాం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబుదాబీలో చేసిన ఒక రోజు పర్యటన భారత్, యూఏఈ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బీన్ జాయద్ ఆల్ నహ్యాన్‌తో కలిసి బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునే లక్ష్యంతో సమగ్ర చర్చలు జరిపారు. స్థానిక కరెన్సీలలో వాణిజ్య వ్యవహారాలను చేపట్టేందుకు భారతదేశం, యూఏఈ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లను అనుసంధానించడానికి, గల్ఫ్ దేశంలో ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్ తెరిచేందుకు అంగీకరించారు.
అసలు అరబ్ దేశాలకు భారత్ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోందనే అంశం ఆసక్తికరం. సుమారు కోటి మంది గల యూఏఈ జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 35 శాతం ఉన్నారు. వీళ్లందరు అక్కడ చాలా రంగాల్లో పని చేస్తున్నారు. యూఏఈ ఆర్థిక వ్యవస్థకు వారెంతో కీలకం. అదే సమయంలో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు 2018లో తమ ఇళ్లకు రూ. 6.4 లక్షల కోట్లు పంపితే, యూఏఈలో పనిచేస్తున్న వారి వాటా రూ. లక్ష కోట్లు. సౌదీ అరేబియా నుంచి రూ. 91 వేల కోట్లు, కువైట్ నుంచి రూ. 33 వేల కోట్లు, ఒమన్ నుంచి రూ. 27 వేల కోట్లు పంపించారని అంచనా. విదేశీ మారకద్రవ్యం విషయంలో ఆ దేశానికి ఉన్న ప్రాధాన్యాన్ని అంచనా వేసుకోవచ్చు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ, భారతదేశానికి మూడో అతిపెద్ద ముడిచమురు సరఫరాదారు. భారతదేశం చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా పది శాతం వరకు ఉండేది. 2030 నాటికి యూఏఈ నుంచి చమురుయేతర వ్యాపారాన్ని రూ.8 లక్షల కోట్లకు పెంచాలని భారతదేశం నిర్ణ యించింది. గత ఏడాది కుదిరిన సీఈపీఏ (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం) భారతదేశం, యూఏఈ మధ్య పెరుగుతున్న సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశం సంతకం చేసిన తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే. భారత్ 2011లో జపాన్‌తో చివరిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది.
2027నాటికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలను కుంటోంది. ఇందులో భాగంగా 2030 నాటికి ఎగుమతులను ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచాలను కుంటోంది. సీఈపీఏ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
మోదీ ప్రధాని అయిన నాటి నుంచి యూఏఈతో సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి.తన తొమ్మిదేళ్ల పాలనలో గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఆయన దృష్టిసారించారు. 2015 ఆగస్టులో మొదటి పర్యటన, రెండోది 2018 ఫిబ్రవరిలో, మూడోది ఆగస్టు 2019లో, నాల్గవది 2022 జూన్‌లో చేశారు. తాజా పర్యటన ఐదోది. ఇందిరాగాంధీ తర్వాత యూఏఈని సందర్శించిన భారత ప్రధాని మోదీయే. ఇందిర 1981లో యూఏఈలో పర్యటించారు. ఆ తర్వాత 34 ఏళ్లకు మోదీ వెళ్లారు.
మోదీ విదేశాంగ విధానంలో యూఏఈకి ఇస్తున్న గౌరవం, 2017లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో మోదీ ప్రభుత్వం మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిం చింది.అప్పుడు నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు కాదు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్. సంప్రదాయం ప్రకారం భారతదేశం ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడిని గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుంది. అయితే 2017లో రిపబ్లిక్ డేకి అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి 28వ వాతావరణ మార్పు సదస్సు సీవోపీ-28ని యూఏఈ నిర్వహి స్తోంది. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూప్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ అల్‌జబీర్‌ను దానికి చైర్మన్‌గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నియమించింది. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు దుబాయ్‌లో ఈ సదస్సు జరగనుంది. సీవోపీ-28 అధ్యక్ష పదవి విషయంలో యూఏఈకి మోదీ పూర్తి మద్దతును ప్రకటించారు.
భారత్ పై ఆశలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు ఆహార భద్రత విషయంలో తీవ్రంగా ఆలో చించవలసి వచ్చింది.అరబ్ ప్రపంచానికి 60 శాతం ఆహారం రష్యా, ఉక్రెయిన్‌లనుంచి వస్తుంది. అందువల్ల ఈ యుద్ధం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను కదిలించింది. ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండ టంతో యూఏఈ అప్రమత్తమైంది. ఆహార మిగులు దేశంగా ఉన్న భారతదేశంపై దృష్టి సారించింది.
భారత ఆయుధాలపై ఆ దేశం ఆసక్తి చూపు తోంది. బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలను కుంటోంది. దీంతో పాటు భారత్‌తో కలిసి మిలటరీ హార్డ్‌వేర్‌ను కూడా తయారు చేయాలనుకుంటోంది. ఇది భారత మేకిన్ ఇండియా ప్రచారానికి కూడా ఉపయోగపడుతుంది. తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ యూఏఈ ఇండియాకు మద్దతుగా ఉంది. యూఏఈ దృష్టి ఇప్పుడు ఫుడ్ బిజినెస్, గ్రీన్ ఇన్‌ఫాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై పడింది. ఈ వ్యాపా రాలన్నింటికీ భారతదేశాన్ని నమ్మకమైన భాగ స్వామిగా చూస్తోంది పెట్టుబడులు పెట్టాలనుకుం టోంది.
యూఏఈతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం 1970లలో కేవలం రూ. 1,400 కోట్లు మాత్రమే ఉంది. అది ఇప్పుడు రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. 2021-22లో అమెరికా, చైనా తర్వాత యూఏఈ భారతదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అమెరికా తర్వాత యూఏఈకి భారత్ అత్యధికంగా ఎగుమతులు చేస్తోంది. యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే యూఏఈతో భారత్ వాణిజ్యం 19 శాతం పెరిగింది.
రెండు దేశాల నేతలు ఏం చర్చించారు?
మోదీ తన తాజా పర్యటనలో యూఏఈ అధ్యక్షుడితో ఇంధనం, ఆహార భద్రత, రక్షణ సహా అనేక అంశాలపై చర్చించారు. యుఎఇ-ఇండియా సంబంధాలు అన్ని రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధించాయని ఈ సందర్భంగా రెండు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం-యూఏఈ వాణిజ్యం 2022లో 85 బిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి పెరిగింది. 2022-23 సంవత్సరానికి యూఏఈ భారతదేశం మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, రెండో అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.
సంబంధిత సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్‌లు సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఆయా సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్‌ల ద్వారా ఇంటర్ లింకింగ్ పేమెంట్, మెసేజింగ్ సిస్టమ్‌లపై అవ గాహన ఒప్పం దంపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య స్థానిక కరెన్సీ వ్యవస్థను అభివృద్ధి చేయడం పరస్పర విశ్వాసానికి ప్రతిబింబమని నేతలు అభిప్రాయపడ్డారు.
జాతీయ కార్డ్ స్విచ్‌లను ఇంటర్‌లింక్ చేయడం ద్వారా దేశీయ కార్డ్ స్కీమ్‌ల పరస్పర అంగీకారాన్ని కూడా ఇటువంటి సహకారం కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థల మధ్య ఏకీకరణ రెండు దేశాల పౌరులు, నివాసితుల ప్రయోజనం కోసం చెల్లింపు సేవలకు ప్రాధాన్యతను మెరుగుపరుస్తుంది.
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) ప్రణాళికను వారు అభినందించారు. ఇది భారత దేశంలో యూఏఈ పెట్టుబడి అవకాశాలను మరింత సులభతరం చేస్తుంది.
ఙ అబుదాబీలో ఐఐటి(ఢిల్లీ) ఏర్పాటు కోసం భారత విద్యా మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అబుదాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జిల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు నేతల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా, యూఏఈలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించడానికి అంగీకరించారు. ఇరుపక్షాలు గత రెండేళ్లుగా అవిశ్రాంతంగా కృషిచేశాయి. ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీలో మాస్టర్స్ పోగ్రా మ్‌ను అందించడం ద్వారా జనవరి 2024 నాటికి ఐఐటీ ఢిల్లీ-అబుదాబి కార్యరూపం దాలుస్తుంది. సెప్టెంబర్ 2024 నుండి ఇందులో ప్రవేశాలు చేపడతారు.
చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, ఇంధన రంగంలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచాలని నాయకులు నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ, గ్రిడ్ కనెక్టివిటీలో ఇరుపక్షాలు తమ సహకారాన్ని ముందుకు తీసుకు వెళతాయి. భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌పోగ్రామ్ సహా ఎనర్జీస్పెక్ట్రమ్‌లో పెట్టుబడులను పెంచేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.
భారతదేశంలో ఫుడ్ కారిడార్ల ప్రాజెక్టులతో సహా ఆహారం, వ్యవసాయ వాణిజ్యాన్ని మెరుగుపరి చేందుకు నాయకులు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటిం చారు. ఈ ప్రాంతంలోని ప్రాజెక్టుల ప్రారంభ సాకారంకోసం యూఏఈ వివిధ భారతీయ వాటాదారులతో సంప్రదించాలని నిర్ణయించింది.
వ్యాక్సిన్‌లు ఔషధాల ప్రపంచ ఆరోగ్య సరఫరా గొలుసులో విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారడానికి రెండు దేశాల సామర్థ్యాన్ని చర్చించారు.
భారతదేశం, యూఏఈ, భాగస్వామ్య పొరుగు ప్రాంతాలలో శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఈ ప్రాంతంలో సముద్ర భద్రత, కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ట పరచుకునేందుకు నాయకులు అంగీకరించారు. డిఫెన్స్ ఎక్స్ఛేంజీలు, అనుభవాలను పంచుకోవడం, శిక్షణ,సామర్థ్యాన్ని పెంపొందించడానికి కూడా వారు అంగీకరించారు.
ఙ సరిహద్దు తీవ్రవాదం, తీవ్రవాద సంస్థకు నిధులు తదితర అంశాల్లో పోరాటానికి ద్వైపాక్షిక సహ కారాన్ని పెంచుకోవాలని అంగీకరించారు.
ఙ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విషయాలలో, ముఖ్యంగా 2022లో, రెండు దేశాలు యూఎన్ ఎస్‌సీలో శాశ్వత సభ్యులుగా పనిచేసినప్పుడు, ఇరు పక్షాల మధ్య సమన్వయంపై కూడా ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతామండలిలో సభ్యుడిగా కొనసాగిన కాలంలో యూఏఈ సాధించిన విజయాలను ప్రధాని మోదీ కొనియాడారు. యూఎన్ ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం వేసిన బిడ్‌కు యూఏఈ తన ఆమోదాన్ని తెలిపింది.
ఙ 2023 సెప్టెంబరు 9-10 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే జీ-20నేతల సదస్సుకు షేక్‌మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్‌ను మోదీ ఆహ్వానించారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్