– క్రాంతి

పంచాయితీలకు ఎన్నికలు కావచ్చు. శాసనసభ, లోక్‌సభ.. ఎన్నిక ఏదైనా అక్కడ హింస షరా మామూలే. రక్తపాతం, చావులు సర్వసాధారణమే. కొద్దిరోజుల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్‌ ‌పంచాయితీ ఎన్నికలూ ఇదే నిరూపించాయి.  భారీ హింస చెలరేగింది. 60 మంది మరణించారు.  వందమందికిపైగా గాయపడ్డారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌దుండగులు యథేచ్ఛగా పోలింగ్‌బూత్‌లను ఆక్రమించారు. ఎవరో ఆరోపించనక్కరలేదు. ఆ పార్టీని దుండగులు, హంతకుల పార్టీగా సాక్షాత్తు కోర్టులే ఎప్పుడో తేల్చాయి. ఎప్పటిలాగే టీఎంసీ గూండాలు బీజేపీ, కాంగ్రెస్‌, ‌వామపక్ష కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇంత చేసి, దేశ ప్రజల చేత ఛీకొట్టించుకుని ఎన్నికల్లో పైచేయి అనిపించుకున్నా, గత రక్తపాతంతో పోలిస్తే టీఎంసీకి ఓట్లు, సీట్ల శాతం తగ్గిన సంగతి గమనించాలి.  బీజేపీ రెండో స్థానంలో నిలిచినా గత పంచాయితీ, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్లు, సీట్లపరంగా గణనీయమైన పురోగతిని సాధించింది. కాంగ్రెస్‌-‌లెఫ్ట్ ‌ఫ్రంట్‌ ఉమ్మడిగా పోటీ చేసి, ఫలితాల వరసలో మూడు, నాలుగు స్థానాలకే పరిమితమయ్యాయి.

ఈ పంచాయితీ ఎన్నికల్లో తృణమూల్‌ ‌గెలిచింది. ప్రజాస్వామ్యం ఓడింది. పశ్చిమ బెంగాల్‌లోని 22 జిల్లాల్లోని 63,229 గ్రామ పంచాయితీ స్థానాలు, 9,730 పంచాయితీ సమితి స్థానాలు, 928 జిల్లా పరిషత్‌ ‌స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్‌, ‌వామపక్షాలు సంయుక్త మోర్చా పేరుతో పోటీ చేశాయి. ఇందులో సీపీఐ, ఇండియన్‌ ‌సెక్యులర్‌ ‌ఫ్రంట్‌, ‌ఫార్వర్డ్ ‌బ్లాక్‌, ఎన్సీపీ, ఆర్‌ఎస్‌పీ ఉన్నాయి.

టీఎంసీ రక్తదాహం పోలింగ్‌ ‌రోజుతోనే తీరలేదు. నిజానికి నామినేషన్ల పక్రియ నుంచే హింసాకాండ మొదలై, ఓట్ల లెక్కింపు రోజు వరకు కొనసాగింది. 55 మంది చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, ఆ సంఖ్య 60 దాటిందని తెలుస్తోంది. అనేక జిల్లాల్లో వీధి పోరాటాలు, బూత్‌ల ఆక్రమణ, బ్యాలెట్‌ ‌బాక్సులకు నిప్పు పెట్టడం, కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు కనిపించాయి. తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించిన ప్రజలను టీఎంసీ లక్ష్యంగా చేసుకుంది. పదే పదే తీవ్ర స్థాయిలో హింసాకాండకు దిగింది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నుంచి హింసాత్మక ఘటనలు తీవ్రమై పోలింగ్‌ ‌కేంద్రాల్లోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బిహార్‌, ‌ముర్షిదాబాద్‌, ‌నదియా, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, బర్ధమాన్‌, ‌పశ్చిమ మిడ్నాపూర్‌, ‌బంకురా, బీర్‌భూమ్‌, ‌బోల్పూర్‌ ‌మొదలైన చోట్ల ఇదే పరిస్థితి. కూచ్‌బిహార్‌ ‌జిల్లా దిన్హాటాలో బ్యాలెట్‌ ‌బాక్సులను దుండగులు ధ్వంసం చేసి, బ్యాలెట్‌ ‌పత్రాలకు నిప్పంటించారు. బర్నాచినా ప్రాంతంలో బ్యాలెట్‌ ‌బాక్సుకు స్థానికులు నిప్పంటిం చారు. ఓ యువకుడు బ్యాలెట్‌ ‌బాక్సును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. గెలిచిన సీపీఎం అభ్యర్ధులక• ఎన్నికైనట్లు సర్టిఫికెట్ల• ఇచ్చే సమయంలో తృణమూల్‌ ‌గూండాలు వాటిని లాక్కుని, చించివేసినట్లు వార్తలు వచ్చాయి. భావనగర్‌లో మరింత ఘోరం జరిగింది. అక్కడ ఐఎస్‌ఎఫ్‌ అభ్యర్ధి జెహనారా బీబీ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గెలుపొందారు. కానీ తృణమూల్‌ అభ్యర్ధి గెలుపొందినట్లు ప్రకటించడానికి ప్రయత్నాలు జరిగాయి. స్థానికులు తీవ్ర నిరసన వ్యకం చేశారు. దాంతో అర్ధరాత్రి సమయంలో, వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

ఈ హింసను అడ్డుకునేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించినా, అది సాగకుండా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అధికార టీఎంసీతో కుమ్మక్కవడం కనిపించింది. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సీపీఎం గూండాలు ఏం చేశారో, ఇప్పుడు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌చేస్తున్నది అదేనని ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. తృణమూల్‌ ‌కార్యకర్తలు యథేచ్ఛగా ఓట్లు గుద్దుకున్నా సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించింది. అడ్డుకుంటే ఏం జరుగుతుందో వారికి తెలుసు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. సాక్షాత్తు ఆ రాష్ట్ర హైకోర్టే పంచాయితీ ఎన్నికల హింసపైన ఆవేదన, అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాల్సిం దిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయినా ఎన్నికల తంతు ముగిసింది.

గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యకాండ కోసం టీఎంసీకి యంత్రాంగమే ఉంది. ఆ పార్టీ నాయకులు వ్యాపారులతో పాటు సామాన్యులను బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల నిధులను ‘కట్‌ ‌మనీ’ (కమిషన్లు) ద్వారా స్వాహా చేస్తుంటారు. అవినీతిలో నిండా మునిగిన మమతా బెనర్జీ ప్రభుత్వం ఆ సొమ్ముతో క్యాడర్‌ను బలోపేతం చేసుకొని విపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోంది.

పంచాయితీ ఎన్నికల కోసం 63,000 మంది కేంద్ర రిజర్వు పోలీసులను, దాదాపు 70,000 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. అయితే, మెజారిటీ బూత్‌లలో కేంద్ర బలగాలు లేకపోవడం, అస్తవ్యస్తమైన మోహరింపే పోలింగ్‌ ‌నాటి హింసకు ప్రధాన కారణం. 822 కంపెనీల బలగాలను పంపాలని కోరగా.. పోలింగ్‌ ‌ముగిసే సమయానికి 144 బెటాలియన్లు బెంగాల్‌కు చేరుకోలేదు. బలగాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సక్రమంగా మోహరించకపోవడమే సమస్యలకు దారితీసిందని కేంద్రం దళాల సీనియర్‌ అధికారులు ఆరోపించారు. అయితే హింసను అరికట్టడంలో విఫలమైనందుకు బీజేపీ సహా ప్రతి రాజకీయ పార్టీ బలగాలను నిందిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ కేంద్ర బలగాల కో-ఆర్డినెటర్‌కు బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కోర్టు ధిక్కార కేసు పెట్టారు.

గెలుపే లక్ష్యంతో తృణమూల్‌ ‌కార్యకర్తలు బీజేపీ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలు సాగించారు. బీర్భూమ్‌, ‌మాల్దా, ముర్షిదాబాద్‌, ‌దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలలో పలుచోట్ల ఇళ్ల ముందు బాంబులు విసిరి భయభ్రాంతులను చేశారు. చోప్రాలో బీజేపీ అభ్యర్థులను కనీసం నామినేషన్‌ ‌కూడా వేయనీయలేదు. ఫలితాలు వెలువడిన తర్వాత టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు తమ ఇళ్ల• ఖాళీ చేసి బీజేపీ కార్యా లయాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అసన్‌సోల్‌ ‌లోని బీజేపీ కార్యాలయంలో వెస్ట్ ‌బుర్ద్వాన్‌ ‌జిల్లాతో పాటు బరాబని, సలాన్‌పూర్‌, ‌జమూరియా, రాణిగంజ్‌ ‌ప్రాంతాల కార్యకర్తలకు ఆహారం, వసతిని సమకూర్చారు. వీరు ఎప్పుడు తిరిగి ఇళ్లకు వెళ్లగలరో తెలియదని పార్టీ నేతలు తెలిపారు.

పశ్చిమ మేదినీపూర్‌లోని పార్టీ కార్యాలయంలో దాదాపు 500మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆశ్రయం పొందారు. వీరిలో జిల్లా పరిషత్‌, ‌పంచాయతీ సమితి, గ్రామ పంచాయతీ సభ్యులు ఉన్నారు. తాను నామినేషన్‌ ‌వేసినప్పటి నుంచీ అనేక సార్లు టీఎంసీ గూండాలు దాడికి ప్రయత్నించారుని పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోలీమాన్‌ఖాన్‌ ‌తెలిపారు. గ్రామాల్లో తమ తల్లి దండ్రుల భద్రతపై జిల్లా బీజేపీ యువమోర్చా కార్యదర్శి శుభంకర్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై హైకోర్టులో కేసు వేస్తామని బెంగాల్‌ ‌బీజేపీ నేతలు తెలిపారు.

బెంగాల్‌ ‌తాజా పరిణామాలపై కేంద్రం దృష్టి సారించింది. గవర్నర్‌ ‌సీవీ ఆనంద్‌బోస్‌ ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షాను కలిసి బెంగాల్‌ ‌పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై నివేదికను సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌సిన్హా తన విధులను నిర్వర్తిం చడంలో విఫలమయ్యారని గవర్నర్‌ ఆరోపించారు. ‘మనం పేదరికాన్ని చంపాలి, కానీ పేదలు చనిపోతున్నారు’ అని ఈ ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌ ఆనంద్‌బోస్‌ ‌నిరాశను వ్యక్తం చేశారు. ఈ హింసాకాండను పరిశీలించేందుకు బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ బెంగాల్‌లో పర్యటించింది. హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరిగిన కూచ్‌బెహార్‌లోని దిన్హాటాతో పాటు ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలను సందర్శించి వాస్తవాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తోందని ఆయన గుర్తు చేశారు. విపక్షాల విజేతలను టీఎంసీలో చేరాలని ముఖ్యమంత్రి మమత కోరడం సిగ్గుతో తలదించు కోవలసిన అంశమని అన్నారు. అసలు ఎవరు గెలిచినా టీఎంసీలో చేరితేనే సర్టిఫికెట్‌ ఇస్తామనడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అన్నారు ఇటీవలి ఉత్తరప్రదేశ్‌ ‌స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ ‌చేసినా ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని రవిశంకర్‌‌ప్రసాద్‌ ‌గుర్తు చేశారు. రాహుల్‌ ‌సహా, కాంగ్రెస్‌ ‌నేతలు బెంగాల్‌ ‌హింసపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

నిజానికి బెంగాల్‌ ‌కాంగ్రెస్‌ ‌వైఖరి, ఢిల్లీ కాంగ్రెస్‌ ‌ధోరణి వేర్వేరు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌మమతా బెనర్జీని దోషిగా తేల్చింది. రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి పిలుపుతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హింసను ఖండించారు. ఏ పార్టీనీ నిందించలేదు. సీపీఎందీ ఇదే ద్వంద్వ వైఖరి. పంచాయితీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కానీ తమ వ్యతిరేకత రాష్ట్రానికే పరిమితమని నిర్లజ్జగా ప్రకటించారు.

పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గతంలోకన్నా పుంజుకున్నది. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ 2018‌లో 72 శాతం ఓట్లు సాధిస్తే ఈసారి దాని బలం 51 శాతానికి పడిపోయింది. అప్పుడు 38,118 గ్రామపంచాయితీలను గెలుచుకుంటే ఈసారి 35,606కి పరిమితమైంది. ఆ ఎన్నికల్లో (2018) బీజేపీ 13 శాతం ఓట్లు సాధిస్తే, ఈసారి 23 శాతానికి బలం పెంచుకుంది. గతంలో 5,779 గ్రామ పంచాయితీలను గెలుచుకుంటే ఈసారి 9,756 గ్రామాల్లో బీజేపీ పాగా వేసింది. సంయుక్త మోర్చా (వామపక్షాలు, కాంగ్రెస్‌ ‌కూటమి) 6,822 గ్రామపంచాతీలు గెలుచుకొని మూడోస్థానంలో నిలిచింది. ఇందులో సీపీఎం మూడు వేలకు పైగా గెలుచుకోగా, మిగతా చోట్ల కాంగ్రెస్‌ ఇతర కూటమి పక్షాలు గెలిచాయి.

పంచాయితీ సమితిలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 6,560 చోట్లా, బీజేపీ 1,044 స్థానాల్లో గెలిచింది. సంయుక్త మోర్చాకు 559 సీట్లు వచ్చాయి. ఇక జిల్లా పరిషత్‌ ‌సీట్లలో టీఎంసీ 877 గెలుచుకుంది. బీజేపీకి 26 రాగా సంయుక్త మోర్చాకి కేవలం 10 దక్కాయి. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ పని తీరు మెరుగ్గా ఉంది. అప్పటితో పోలిస్తే ఈసారి బీజేపీ ఓట్లు దాదాపు 10 నుంచి 11 శాతం పెరిగాయి. పంచాయితీ ఎన్నికలపై కోర్టు తీర్పును పరిశీలించి గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు ఇంటింటికీ వెళ్లి అభినందనలు తెలియజేయాలని నిర్ణయించారు. జూలై 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెలలో మళ్లీ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు.

తాజా పంచాయితీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఏకపక్ష విజయం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో జాతీయస్థాయిలో ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించి ప్రధాని పదవి చేపట్టాలనే ఆశలు గల్లంతయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో మునుపటికన్నా ఎక్కువ సీట్లు దక్కించు కునేందుకు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్‌ఎస్‌సీ, బొగ్గు స్మగ్లింగ్‌ ‌కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. మమత మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీని సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీకి కలిసివస్తాయని చెప్పక తప్పదు.

About Author

By editor

Twitter
YOUTUBE