సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ అధిక శ్రావణ షష్ఠి
24 జూలై 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ప్రాణం ఎవరిదైనా విలువైనదే. కానీ కొన్ని నిప్పులాంటి నిత్యసత్యాలకు కూడా చెదలు పట్టిస్తున్నారు. ఈ చెదపురుగుల పాత్ర పోషిస్తున్నవారే ఈ దేశంలోని మేధావులు, కొన్ని కొన్ని ప్రజా సంఘాల నేతలు. ఈ విధ్వంసానికి కాంగ్రెస్ తన వంతు సాయం ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన కొన్ని వారాలలోనే.. జూలై 6-8 మధ్య జరిగిన ఒక జైనముని హత్య, రెండు రోజుల తరువాత జరిగిన యువ బ్రిగేడ్ కార్యకర్త వేణుగోపాల్ నాయక్ హత్య ఇదే రుజువు చేస్తున్నాయి. ఒక్క మేధావి నోరెత్తడం లేదు. కర్ణాటక ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. జైన ముని (సన్యాసి) దిగంబర ఆచార్య శ్రీకామకుమార నంది మహరాజ్ హత్య కర్ణాటకను కుదుపు తున్నది. ఒక జైన సన్యాసిని ఇంత దారుణంగా చంపడం దేశాన్ని విస్తుపోయేటట్టు చేసినా, ఢిల్లీ వరకు నిరసనలు తాకినా మేధావులు మాత్రం గాఢనిద్రలోనే ఉన్నారు. జైనులూ మైనారిటీలేనన్న సంగతి వీరికి ఎప్పుడూ స్పృహలో లేదు. నంది మహరాజ్ శరీర భాగాలు బెలగావి జిల్లాలోని చిక్కోడి తాలూకా, కటకబావి గ్రామంలోని బావిలో కనిపించాయి. ఇది డబ్బు గొడవ అని ప్రభుత్వం తేల్చింది. ఇద్దరిని అరెస్టు చేశారు. కానీ జైన వర్గం కోరినట్టు సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి అంగీకరించలేదు. నిజమే మరి, ఇది హిందూ వ్యతిరేకి గౌరీ లంకేశ్ హత్య వంటిది కాదు కదా, దేశమంతా కల్లోలం చెలరేగడానికి, రేపడానికి.
అహింస గురించి నిరంతరం బోధించే జైన మునిని ఇంత హింసాత్మకంగా చంపడం దారుణమని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే అన్నారు. ఇంతకు ముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని చట్టాతో పాటు గోరక్షణ చట్టాన్ని కూడా తుంగలో తొక్కడానికి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపడినప్పటికీ ప్రజాగ్రహం కారణంగా వెనకడుగు వేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జైన ముని, నాయక్‌ల హత్యలు జరిగాయి.
15 ఏళ్లుగా నివాసం ఉంటున్న నంది పర్వత ఆశ్రమం నుంచి జూలై 6న శ్రీకామకుమార్ మహరాజ్ అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిదో తేదీన ఛిద్రమైన జైన ముని శరీర భాగాలు గోనె సంచిలో కనిపించాయి. మరునాడే జైనులు నిరసన కార్యక్రమాలు ఆరంభించారు. 12వ తేదీన ఈ అంశం మీద శాసనసభలో, వెలుపలా కూడా బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ కేసులో ఇద్దరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ ఇద్దరు జైన మునికి లక్షల రూపాయలు బకాయి ఉన్నారని, ఆ ధనం కోసం వత్తిడి తేవడం వల్లనే చంపామని ఆ ఇద్దరు అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇద్దరు నారాయణ మాలి, హసన్ సాబా మక్బూల్ దల్యాత్. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. జైన ముని హత్యోదంతం తీరు తెన్నులు చూస్తే దీని వెనుక ఐఎస్‌ఐఎస్ ఉన్నట్టు అనుమానించవలసివస్తున్నదని బీజేపీ ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి ఆరోపించడం గమనార్హం. జైన ముని హత్య అంశం మీదే జూలై 17 సోమవారం దేశ రాజధానిలో జైనులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జినేంద్ర కుమార్ జైన్ ఆరోపించడం చాలా సంగతులు వెల్లడిస్తుంది.
జైన ముని హత్య జరిగిన రెండు రోజులకే, అంటే జూలై 10న యువ బ్రిగేడ్ కార్యకర్త వేణుగోపాల్ నాయక్‌ను మైసూరు జిల్లా, టీ నరసీపూర్‌లో కొందరు నరికి చంపేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా వాహనాలు నిలిపే చోట వచ్చిన తగాదా అతని హత్యకు కారణమైందని పోలీసులు చెబుతున్నారు. యువ బ్రిగేడ్‌నే నమో బ్రిగేడ్ అని కూడా పిలుస్తారు. హిందువుల హక్కుల కోసం పోరాడే చక్రవర్తి సలిబేలే నాయకత్వంలో యువ బ్రిగేడ్ పనిచేస్తున్నది. నాయక్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు చంపారని సలిబేలే చెబుతుంటే, ఇది రెండు హిందూ సంఘాల మధ్య ఘర్షణగా పోలీసులు చిత్రిస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ (మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఈయన కుటుంబం కాంగ్రెస్‌తో కలసి పనిచేసింది) అభిమానులు ఆయన బొమ్మతో హనుమ ఊరేగింపునకు వచ్చినప్పుడే ఘర్షణ మొదలయింది.
ఇదే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా 2017లో బెంగళూరులోనే గౌరీ లంకేశ్ హత్యకు గురయ్యారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయలేకపోయింది. మధ్య బీజేపీకి ఒకసారి అధికారం వచ్చినా మళ్లీ ఇప్పుడు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి. ఆ కేసేమీ తేలలేదు. అదలా ఉంచితే, గౌరీ లంకేశ్ అనే ఆ జర్నలిస్ట్/మేధావి హత్య పట్ల వెల్లువెత్తిన నిరసనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. బీజేపీకి వ్యతిరేకంగా వ్యాసం రాసి కోర్టు చేత చీవాట్లు తిన్న ‘ఉదారవాది’ గౌరి. ఎవరి ప్రాణాన్నయినా హరించే హక్కు ఎవరికీ లేదని ఆమె హత్య విషయంలో వాదించిన ప్రబుద్ధులంతా ఇప్పుడేమయ్యారు? ఎవరి ప్రాణమైనా విలువైనదే అన్న తిరుగులేని వాస్తవాన్ని అంగీకరిస్తూనే ఈ ప్రశ్న కూడా వేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికీ, దేశంలో మేధావి వర్గానికీ నడుమ అభేదాన్ని చూడవలసి వస్తున్నది. హిందువులు లేదా ముస్లిమేతర మైనారిటీలు ఎవరు హత్యకు గురైనా వీళ్లకి పట్టదు. ముస్లింల ప్రాణాలే విలువైనవి. లేదంటే అర్బన్ నక్సల్స్ ప్రాణాలు విలువైనవిగా కనపడుతున్నాయి. ఇక్కడ పేర్కొన్న మూడు హత్యలు, వాటిపై స్పందనలు గమనించి తమ ప్రాణాల విలువ ఏపాటిదో హిందువులే తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టే రాజకీయ, సామాజిక చైతన్యం తెచ్చుకోవాలి. కర్ణాటక ప్రజానీకంతో పాటు, దేశ ప్రజలూ ఇది గమనించాలి.