పేరుకు తగిన వనితారత్నం ‘సుగుణమణి.’ శతాయుష్కురాలు, అంతకు మించీ ఉండాలని అభిమాన హృదయాలన్నీ కోరుకున్నవారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్, వికాసశ్రీ పేరిట ఉన్న సమున్నత పురస్కారాల స్వీకర్త ఆమే. రామకృష్ణ మఠం నుంచి జీవనసాఫల్య అవార్డు విజేత. మిలీనియమ్, సర్వోదయ, మరెన్నో బహుకృతులూ తనవే. ఉత్తమ సంఘ సేవికగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆదర్శనీయ. బాలల సంక్షేమానికి పరిశ్రమించినందుకు గుర్తింపుగా నాటి రాష్ట్రపతి నుంచి సత్కారం అందుకున్న మహిళామణి. ప్రతిభ, కళాత్మకత, నిర్వహణ సామర్థ్యాలకు ప్రతిఫలంగా ఎన్ని నేషనల్ రివార్డులు పొందినా ఎంతో ఒదుగుదల! అలనాటి సాహితీవేత్తల రచనలను సమీకరించి, తానూ పలు అంశాలపైన రచించి, అటు తర్వాత ప్రతీ చిన్న పనినీ తానే నిర్వర్తించి ‘ఆంధ్ర మహిళ’ పత్రికను జాతీయంగా పతాకస్థాయికి చేర్చిన దీక్షాదక్షురాలు కంచ(ఆమె పుటింటి పేరు ‘గురుజు’) సుగుణమణిని ప్రతీ జులై ఐదునా ప్రత్యేకించి గుర్తుచేసుకుంటారు. ఎందరెందరో. అందరి స్మృతి పథంలో కలకాలం నిలిచి ఉంటున్న ఆమెకు మారు పేరు – ఆంధ్ర మహిళా సభ ‘మణి.’ ఆమె గురించి సాక్షాత్తు దుర్గాబాయమ్మ సంపాదకీయం రాశారంటే, అంతకు మించిన ప్రశంస ఇంకేముంటుంది? ఇదంతా 1947 నాటి మాట!
‘ఆంధ్రమహిళాసభ’ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి జననం జులైలోనే. స్థాపన స్థలం చెన్నై. అనంతరం హైదరాబాద్‌కి విస్తరించింది. స్వాతంత్య్ర సాధన ముందుకాలంలో ఆంధ్ర మహిళ పేరుతో పత్రికే ఉండేది. భాష సరళం, భావాలు ఆలోచనాత్మకం. తెలుగుతోపాటు ఆంగ్లంలోనూ వెలువడేది. కథలు, నవలలు, అనువాదాలు, వ్యాసాలు, ఇంకెన్నో పక్రియల రచనలుండేవి. ‘విజయదుర్గ’ అనే నామాంతరమూ ఆ పత్రికకు ఉంది. అంతటి పేరు ప్రఖ్యాతులున్న వ్యవస్థ నిర్వహణ బాధ్యత నంతా సుగుణమణి స్వీకరించి కొనసాగించారు. తొలి నుంచి తుదివరకు అన్ని కర్తవ్యాలనూ తానై నిర్వర్తించారు. రచనలు తెప్పించడం, తను రాసినవి వాటికి జోడించడం, లిఖిత ప్రతులను సరిదిద్దడం, ముద్రిత రూపానికి తేవడం, సంచికలకు తపాలాబిళ్లలు అంటించి స్వయంగా పోస్ట్‌చేసి రావడం… సమస్త పనులు సుగుణమణివే. కనుపర్తి, కాంచనపల్లి, ఇంకెందరో రచయిత్రులు ఆ పత్రికలో తరచూ ప్రత్యక్షం అవుతుండేవారు.
రచన, నిర్వహణ – రెండూ సుగుణమణికి అలవాటే. వీటిని దుర్గాబాయి నుంచి మరింతగా అలవరచుకున్నారు. సేవాభావన విస్తృతంగా నిండిన సుగుణమణి సామాజిక స్థితిగతులు, సంఘటనలకు స్పందిస్తుండే వారు. కళాశాల రోజుల నుంచీ తన స్వభావం ఇదే. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా సేవకు ముందుండేవారు. ముందుగా తన స్పందనకు అక్షరరూపమిచ్చేవారు. ‘గృహలక్ష్మి’ వంటి సుప్రసిద్ధ పత్రికలకు వ్యాసాలు పంపిస్తుండటం రివాజు. మరోవైపు, ఇంటింటికీ వెళ్లి విరాళాల సేకరించేవారు. ఆదుకోవడం అనేది భిన్నరూపాల్లో కనబరచేవారన్న మాట. కొన్నాళ్లకు, కుటుంబ అవసరాల రీత్యా స్వస్థలమైన తెలుగునాట నుంచి దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లారు. మరో ప్రత్యేకత, ప్రసిద్ధత ఏమిటంటే – అక్కడి ఆకాశవాణి నుంచి తెలుగు ప్రసంగాలు చేశారు. సాహిత్యం, సమాజసేవ, స్త్రీ పురోభివృద్ధి లక్ష్యంగా ఎన్ని పనులు చేపట్టారో లెక్కించడం చాలా కష్టం. నిరంతర నిరతి కొనసాగుతూఉండగానే, భర్త కంచర్ల భూషణానికి ఉద్యోగ బదిలీ కారణంగా చెన్నైకి మకాం మార్చాల్చి వచ్చింది. దుర్గాబాయినీ సందర్శించి సంభాషించడం చెన్నైలోనే. అక్కడే ఆమె ఆశయాలకు అనంత ప్రోత్సాహం లభించింది. ఉభయులూ అంశాలపై చర్చ సాగించారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు సవివరంగా తెలుసుకున్నారు.
పర్యవసానంగా ఆంధ్ర మహిళ పత్రిక నిర్వహణ బాధ్యతలను ఆమె పూర్తి స్థాయిలో చేపట్టారు. ఆ సందర్భంలో ఎందరో సేవామూర్తులతో పరిచయం ఏర్పడింది. వారి నుంచి పొందిన స్ఫూర్తి ఇంకెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించింది. అంతలో మళ్లీ మరికొన్ని ప్రాంతాల సందర్శన. మార్గదర్శిని దుర్గాబాయి సూచనతో, సుగుణమణి నివాసం హైదరాబాద్‌కి మారిపోయింది. అక్కడే మహిళాసభ శాఖ ఏర్పాటు. ఇది ఆరున్నర దశాబ్దాల కిందటి సంగతి.
రూపాయిలు వందలయ్యాయి. వందలు వేలుగా మారాయి. వేలు చూస్తూండగానే లక్షలుగా విస్తరించాయి. నిధుల సమీకరణ సాగినంత కాలమూ సేవాపరమైన ఉత్తేజం వెల్లివిరుస్తూ వచ్చింది. విద్య, వైద్యం, సంగీతం, ఇంకా ఎన్నెన్నో రంగాలకు సంబంధించి సంస్థలు స్థాపించారు. భాగ్యనగరంలోని విద్యానగర్, ఉస్మానియా విశ్వవిద్యాయ ప్రాంతాలు వాటితో కళకళలాడాయి. ఉపశాఖలు విస్తరిస్తూ వచ్చాయి. విస్తృత విభాగాలకు అధ్యక్ష, కార్యదర్శి, సలహాదారు, కార్యనిర్వహణ అధికారిణిగా…ఇలా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. తన మార్గదర్శకురాలు దుర్గాబాయి అస్తమించాక ‘సభ’ సకల బాధ్యతలనీ ఆమె వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రంలోనూ మహిళాసభ విస్తరించిందంటే దుర్గాబాయి, సుగుణమణి ఉమ్మడి కృషి కారణంఅని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. అన్ని తరహా సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేస్తూ వచ్చారామె.
దుర్గాబాయితో సుగుణమణిది అనుదిన సేవానుబంధం. పత్రిక సమస్త బాధ్యతనీ ఉన్న పళంగా అప్పగించి నిర్వహించాలని కోరారంటే, ఆమెపై ఎంత విశ్వాసం ఉండాలి? నాటి సామాజిక స్థితిగతుల్లో కస్తూరిబాయి నిధికి ఉభయులూ ఇంటింటికీ వెళ్లి లక్షల రూపాయలు సమీకరించారంటే ఎంత దక్షత, నిబద్ధత ఉండాలి? ఊరూరా సేవా సంఘాల నిర్మాణాలతో ఆనాడే గొప్ప వ్యవస్థకు శ్రీకారం పలికారంటే ఇంకెంత దూరదృష్టి వారిద్దరిదీ! ఆంధ్ర మహిళాసభ సంస్థలకు అన్ని విధాలా సహాయ సహకార సేవాపరమైన ఊతమిచ్చారంటే; గురువంటే శిష్యురాలికి ఎంతెంత గౌరవాదరణలు స్థిరమయ్యాయో కదా!
‘వివిధ రూప విద్యోన్నతి విశిష్టమై వెలయగవలె
వైద్య విద్య జన సేవా భావమ్ము వహింపగవలె’ అన్నట్లు
‘సర్వనామకాంతర్యము జనాభ్యుదయమే కావలె
సమభావం, సౌభాత్రం, సౌజన్యం సమకూరవలె’ అని పలికినట్లు
‘గ్రామ సీమలవి భాగ్యారామములై వర్థిల్లవలె
వీధి వీధి వెలిగించుచు విద్యుత్ప్రభ విలసిలవలె’
అంటూ ‘జయభారతి’ కర్త ఆకాంక్షించినట్లు
ప్రజాభ్యుదయమే ఏకైక ధ్యేయంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు ఇద్దరూ! తమ ఆశలు ఫలించినప్పుడే స్వాతంత్య్రం అర్థవంతమై నిలుస్తుందన్నారు. ఆనాడే ఈ స్వరాజ్యం ఆనందాన్ని అందిస్తుందన్నారు.
సుగుణమణి అపార నిర్వహణశక్తికి నిదర్శ నంగా దుర్గాబాయి శత జయంతి ఉత్సవాలు నిలుస్తాయి. వనితా ప్రగతి బాల్యం నుంచే రూపుదిద్దుకోవాలంటూ – బాలానంద సంఘాలను అనేకంగా ఏర్పాటు చేసిన సుగుణ మణి, స్వర్ణోత్సవ సంబరాలను దిగ్విజయంగా నిర్వహించారు. వీటన్నింటితోపాటు దుర్గాబాయి పురస్కృతినే సొంతం చేసుకున్నారంటే – సుగుణమణి సార్థక నామధేయురాలు అయినట్లే. కాదా మరి?
‘దుర్గాబాయిని ప్రత్యక్షంగా చూడకముందే – ఆమె గురించి విన్నాను. ఆ ధీరోదాత్తతను అభిమానిస్తూ వచ్చాను. ఆ పేరు వింటేనే ఉత్తేజం వెల్లివిరుస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి ప్రత్యేక సదస్సును నిర్వహించింది ఆమె. అందులో మహాత్మాగాంధీ ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేసిందీ ఆమె! వీటి వివరాలన్నీ విని ఉన్న నేను తనను నేరుగా చూడటంతో పులకించాను. ఆశీస్సులర్థించాను. సాదరంగా నన్ను దరిచేర్చుకున్న ఆమె పలు నిర్వాహక విధులను నాకే అప్పగించడమన్నది ఎంత మహాభాగ్యమో కదా!’ అన్నారు ఒక రచనలో సుగుణమణి.
వివిధ ప్రాంతాల్లో ఉంటూ, ఎక్కడికక్కడ సేవలు నిర్వహిస్తూ, సామాజిక కీలక కార్యకర్తగా రాణిస్తూ వచ్చిన సుగుణమణిలో నిజానికి అనేకానేక నాయకత్వ కోణాలున్నాయి. వాటి ఫలితంగానే – సేవను ఒక ఉద్యమంగా స్వీకరించారామె
‘నాకు జాతీయస్థాయి పురస్కృతులు చాలా వచ్చాయి. వాటన్నింటికీ సమస్థాయిలో, ఆ మాట కొస్తే ఎక్కువగానే దుర్గాబాయిగారి ఆప్యాయతలు నాకు అన్నివేళలా లభించాయి. ఏ పని చేపట్టినా విజయం సాధించడం ఆమెకు పరిపాటి. నాకూ ఆ స్వభావం ఎంతో కొంత అలవడిందంటే మూలం ఆమె మాత్రమే!’ అని ఎన్నోసార్లు అనే వారు సుగుణమణి. అది వినయగుణశీలత.
ఇద్దరినీ గుర్తుచేసుకునే సందర్భాలు జులైలోనే ఉండటం కాకతాళీయం కావచ్చు. వారు ఉభయులూ స్త్రీలోకానికి ఇచ్చిన ప్రాధాన్యం, వ్యక్తిగతంగా ఉమ్మడిగా చేసిన సేవ మాత్రం చిరస్మరణీయం, సగర్వకారణం!
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్