పార్లమెంట్‌ ‌సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నా కొన్ని శక్తులు ఒక సంచలనాన్ని దేశం మీదకు వదిలి పెట్టడం రివాజుగా మారింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి నైచ్యానికైనా వెనుకాడని తెంపరితనం సాధారణమైపోయింది. ఈసారి బొత్తిగా నీతి తప్పి కొద్దికాలం క్రితమే జరిగినా దాచి పెట్టి, అమానవీయమైన రీతిలో ఇద్దరు మణిపూర్‌ ‌మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి విడుదల చేశారు. ఇది ఎవరు చేసినా, ఎక్కడ జరిగినా దేశ ఔన్నత్యాన్ని ప్రశ్నించేదే? తలవంపులు తెచ్చేదే. కానీ దీని మీద రాజకీయం చేస్తున్న విపక్షాల వైఖరి, అందులో అవి గుర్తించ నిరాకరిస్తున్న హీనత్వం అంతకంటే ప్రశ్నార్థకంగా లేవా? కాంగ్రెస్‌ ‌పార్టీలాగే దశాబ్దాల పాటు ఈశాన్య భారతదేశం సంగతే ఏనాడూ పట్టించుకోని భారత మీడియా ఇప్పుడు పోటీపడి మరీ ఆ వీడియోలోని అంశాన్ని విశ్లేషిస్తున్నది. కేంద్రం త్వరలో తీసుకురావాలని  అనుకుంటున్న ఉమ్మడి పౌరసత్వ బిల్లును నిరోధిం చడానికి మణిపూర్‌ ‌హింసాకాండను, దానిలో భాగంగా చెబుతున్న ఈ వీడియోను వాడుకోవాలని విపక్షాలు యోచిస్తున్నట్టు కూడా చాలామంది అనుమానిస్తున్నారు.

ఇద్దరు మహిళలను హింసిస్తూ నగ్నంగా ఊరేగిస్తున్నట్టు చూపుతున్న ఆ వీడియో దేశాన్ని కదిలించింది. కలత పెట్టింది. ఈ దురంతం వెనుక ఉన్న వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆ స్త్రీలు గిరిజనులైనా, క్రైస్తవులే అయినా ఈ దేశానికి చెందినవారు. భారతీయ మహిళలు. వారి పట్ల అంత క్రూరంగా వ్యవహరించడం దారుణమే. ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే అరెస్టులు జరిగాయి. మణిపూర్‌ ‌విధ్వంసం, దీని కారణంగా జరిగిందని చెబుతున్న మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడమైనా వీటి వెనుక అసలు కారణాలు వేరే. దేశం ముందు వెల్లువెత్తుతున్న ఆ వార్తలూ, వీడియోలూ వాస్తవాలు కావు. మణిపూర్‌ ‌తాజా పరిణామాలలో కుకీలు, మెయితీల ఘర్షణ ప్రధానాంశం కూడా కాదు. ఇదంతా నల్లమందు యుద్ధం. చైనా చరిత్రలో నల్లమందు యుద్ధాల పేరుతో చాలా పేజీలే ఉంటాయి. ఇప్పుడు కూడా చైనాకు సంబంధం లేకపోలేదు. అక్కడ కొండలలో యథేచ్ఛగా సాగుతున్న నల్లమందు సాగుకు బీజేపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో మొదలైన యుద్ధమిది.  బీజేపీ ప్రభుత్వం 18,000 ఎకరాలలో నల్లమందు (గసగసాలు) సాగును ధ్వంసం చేసింది. మత్తు మందుల రవాణా కేంద్రంగా మణిపూర్‌కు ఉన్న స్థానాన్ని ధ్వంసం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దీక్ష పూనడమే అసలు కారణం. దీనితో నష్టపోయిన వాళ్లే తాజా గొడవ రేపారు. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడమే ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పిస్తే పశ్చిమ బెంగాల్‌లోను ఇలాగే జరిగింది. పంచాయితీ ఎన్నికల వేళ ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించిన సంగతి బయట పడినా ఎందుకు పట్టించుకోరు? ఇదేం నీతి? అందుకే ఇప్పుడు జరుగుతున్నది నీచ రాజకీయమని చెప్పక తప్పదు.

 పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షం కోరింది. అందుకు ప్రభుత్వం సరే అన్నా కార్యకలాపాలకు అంతరాయం తప్పలేదు. అంటే వాస్తవాలతో పనిలేకుండా గతంలో మాదిరిగానే విపక్షం చేయాలనుకున్నదే చేసింది. సరిహద్దులలో ఇరుగు పొరుగు ప్రమేయంతో దశాబ్దాలుగా సాగుతున్న జాతుల వైరంతో తలెత్తిన ఘర్షణలకు ప్రధానిని బాధ్యుడిని చేయాలని చూడడం వెనుక ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్న సంగతినే ఎక్కువమంది గమనిస్తున్నారు. మణిపూర్‌లో మెయితీలకు (53 శాతం) ఎస్‌టీ హోదా కల్పించే అంశం గురించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చునని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించిన తరువాతనే, మే 3న  ఘర్షణలు మొదలయినాయి. హిందువులైన మెయితీలకు రిజర్వేషన్‌ ‌కల్పించడం కుకీలకు (ప్రధానంగా క్రైస్తవులు) ఇష్టం లేదు. కుకీ విద్యార్థులు మొదలు పెట్టిన ప్రదర్శనతో ప్రారంభమైన ఈ గొడవ కొన్ని గంటలలోనే హింసాపథంలోకి వెళ్లింది. ఇంత వేగం, ఐదారు వారాలు ఎడతెగక సాగుతున్న అల్లర్లు, విధ్వంసం వెనుక ప్రణాళిక, పథకం లేవంటే ఎవరూ నమ్మరు. అన్ని ఆయుధాలు ఎక్కడివి? పొరుగు దేశం అందించినవే. అన్ని వర్గాల వారు 160మంది మరణించారు. ఇవన్నీ అవాంఛనీయ పరిణామాలే. సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ప్రయత్నించారు. ఇంత పెద్ద దేశంలో చాలాచోట్ల సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. వీటి గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు. కానీ అందుకు పార్లమెంటరీ సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని గాలికి వదిలి వివాదాన్ని చిరకాలం, సాధ్యమైతే మరొక పదినెలల్లో జరిగే ఎన్నికల వరకు, పొడిగించాలన్న బుద్ధి ఎంతవరకు సమంజసం?

ఎంత కాదనుకున్నా భారతీయులు ఒక అంశాన్ని ఇప్పుడు సమీక్షించుకోక తప్పడం లేదు. మణిపూర్‌ ‌రగడ మీద గొంతు చించుకుంటున్న కాంగ్రెస్‌ ఈశాన్య భారత అభివృద్ధి కోసం, అక్కడ ప్రధానంగా ఉండే గిరిజనుల కోసం సుదీర్ఘ పాలనలో ఏం ఒరగబెట్టింది? అలాంటిదేమీ లేకున్నా, అక్కడ క్రైస్తవం పెచ్చరిల్లి పోవడానికి ఎర్ర తివాచీ పరిచింది. గిరిజనుల వెనుకబాటుకు, వారు ప్రధాన జాతీయ స్రవంతికి దూరం కావడానికి, ఫలితంగా వేర్పాటువాదం ప్రబలడానికి వాతావరణం కల్పించింది. కేంద్రంలో, ఈశాన్య భారతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జాతుల మధ్య ఘర్షణలు చాలావరకు తగ్గిపోయాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 8000మంది ఉగ్ర వాదులు లొంగిపోయారు. ఈ పరిణామాలే కాంగ్రెస్‌ ‌వంటి శక్తులకు మింగుడు పడడం లేదు.

కేవలం పుకార్లు వెదజల్లిన ఫలితంగానే ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయన్న వాదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. చైనా, పాకిస్తాన్‌ ‌కూడా మణిపూర్‌ ‌గురించి దొంగ వీడియోలు పెట్టాయన్న ఆరోపణ ఉంది. తాజా ఘర్షణలలో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సొంతూళ్లు విడిచిపోయారు. వారందరికి పునరావాసం కల్పించి, ఇంత అన్నం పెడుతున్న సంస్థ వనవాసీ కల్యాణ ఆశ్రమమే. ఈ విషాద సమయంలో నిరాశ్రయులైన 50,000 మంది బాధితులకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ్‌ ‌దత్తాత్రేయ హోసబలే సంఘీ భావం ప్రకటించారు. ఇలాంటి సమయంలో రెండు వర్గాల వారు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ పని దేశంలో మరే ఇతర సంస్థ అయినా, రాజకీయ పార్టీ అయినా చేసిందా? పైగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విభజన రాజకీయాల వల్లనే ఇది జరిగిందని పినరయ్‌ ‌విజయన్‌ ‌తేల్చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా మణిపూర్‌ ‌ఘటనల వెనుక ఇరుగుపొరుగు దేశాల కుట్ర, మిషనరీల ఉన్మాదం, బీజేపీ వ్యతిరేకత మాటున హిందూ ద్వేషం ఒక నిజం. తక్కువ శాతం ఉన్న కుకీలు తమవద్ద ఉన్న ఎక్కువ శాతం భూమిలో మొదలు పెట్టిన గంజాయి సాగు, మత్తు మందుల వ్యాపారం అరికట్టేందుకు బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ ‌సమాయత్తం కావడమే కుకీల వ్యతిరేకతకు ప్రధాన కారణమన్న వాదన సహేతు కమే. ఇప్పుడు కుకీలకు ఒక ప్రత్యేక భూభాగం కావాలని అంటున్నారు.

రోజుల తరబడి సాగుతున్న ఈ హింసాకాండలో మెయితీలు కూడా చాలా మంది చనిపోయిన సంగతి, ఆ వర్గం స్త్రీలను కూడా అవాంఛనీయ శక్తులు అవమానించిన సంగతి బయటపడ్డాయి. ఆ వాస్తవాలు యథాప్రకారం  ఉదారవాదుల చెవులకు సోకలేదు. మహిళల మీద అత్యాచారాలు, సామాజిక ఘర్షణల పట్ల విపక్షాల దృష్టి బీజేపీ పాలిత రాష్ట్రాలకీ, బీజేపీయేతర పక్షాల పాలనలోని ప్రాంతాలకీ మారిపోతూ ఉంటుంది. బిహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌రాజస్తాన్‌లలో మహిళలపై అఘాయిత్యాలు నిజమేనని కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు పి. చిదంబరం జూలై 23న అంగీకరించారు. నిజానికి మణిపూర్‌ ‌ఘటనను ఇంకా తెరమీద ఉంచడానికే ఆయన ఆ రాష్ట్రాలలో జరిగినట్టు చెబుతున్న ఘటనల గురించి ట్వీట్‌ ‌ద్వారా ప్రస్తావించారే తప్ప బాధ్యత కలిగిన ఒక నాయకుడిగా మాత్రం కాదు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ఇటీవలనే ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చేసిన ఆరోపణ గురించి ఎవరికీ పట్టడం లేదు. రాజస్తాన్‌లో గడచిన నాలుగేళ్లలోనే మహిళలపై అత్యాచారాలకు సంబంధించి దాదాపు లక్ష కేసులు నమోదైనాయని ఆయన ఆరోపించారు. అందులో 33 వేలు లైంగిక అత్యాచారాలకు సంబంధించినవే. అయినా, వీటికీ మణిపూర్‌ ఉదంతానికీ పోలిక ఎక్కడిదని చిదంబరం అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో మహిళలపై జరిగిన అత్యాచారాలను అత్యాచారాలుగా చూడకూడదని భావం కాబోలు.

అయినా మెయితీలకు ఎస్‌టీ హోదా ఇవ్వడానికి కుకీలు ఎందుకు వ్యతిరేకించాలి? మెయితీలు స్వాతంత్య్రం రాకముందు సామాజికంగా ఆ వర్గం వారే కదా! ఆ హోదా కూడా ఉంది. చిత్రంగా స్వతంత్ర భారతదేశంలో మెయితీల ఎస్‌టీ హోదాను తొలగించి, కుకీలకీ, క్రైస్తవులకూ ఎస్‌టీ హోదా కట్టబెట్టారు. నాటి నుంచి మెయితీలు ఆగ్రహంగానే ఉన్నారు. 2010లో మెయితీ సమాజ్‌ ‌తమను ఎస్‌టీ కేటగిరీలో చేర్చాలని హైకోర్టును ఆశ్రయించింది. దీని మీద వచ్చినదే ఇటీవలి తీర్పు. మరి కుకీలు ఎవరు? మణిపూర్‌ ‌రాజుకీ, మెయితీలకి జరిగిన యుద్ధం కోసం రాజు కుకీలనీ, రొహింగ్యాలనీ సైన్యంలో చేరడానికి పిలిపించాడు. యుద్ధం అయిపోయిన తరువాత కుకీలు కొండలన్నీ ఆక్రమించారు. అప్పటిదాకా అక్కడ ఉన్న మెయితీలను తరిమేశారు. కొద్దిగా ఉన్న నాగా జనాభాతో కలసి కుకీలు, రొహింగ్యాలు కొండలలో నల్లమందు సాగు ఆరంభించారు. నిజానికి దీనిని స్వర్ణ త్రిభుజి (గోల్డెన్‌ ‌ట్రయాంగిల్‌) అని పిలుస్తారు. ఇది మత్తుమందులకే పరిమితం. ఇక్కడి నుంచే దేశ, విదేశాలలోని చాలా ప్రాంతాలకు మత్తుమందులు రవాణా అవుతాయి. కొన్ని వందల కోట్ల చీకటి వ్యాపారం. ఇలాంటి చోటే ఉగ్రవాద సంస్థలు కూడా పుడతాయి. అదే జరిగింది. చీకటి వ్యాపారానికి వాళ్లే కాపలా. ఇక్కడి మత్తు మందుల ప్రభావం పంజాబ్‌ను ఉడ్తా పంజాబ్‌ను చేసింది.

ఈ విష వలయానికే 2014లో అడ్డుకట్ట పడింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ మతాంతరీకరణలు, విదేశీ చొరబాటు ప్రమాదాలు ఉన్నాయో, ఎక్కడైతే హిందువులు ప్రమాదకర స్థితిలో ఉన్నారో అక్కడల్లా బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే వేర్పాటువాదం వీరంగం వేస్తున్న ప్రదేశాల మీద ఓ కన్నేసింది. ఈ పరిధిలోకి అస్సాం, నాగాలాండ్‌, ‌మణిపూర్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌తమిళనాడు సహజంగానే  వచ్చి చేరాయి. నిఘావర్గాల సమాచారంతో గోప్యంగా తీసుకున్న చర్యలు కశ్మీర్‌, అస్సాంలలో ఫలించాయి. ఇంటి దొంగలు పట్టుబడ్డారు. 2022 అసెంబ్లీ ఎన్నికలలో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీరేంద్రసింగ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి ఈయన కాంగ్రెస్‌ ‌నుంచి వచ్చారు. మెయితీ వర్గం వారు. అక్కడి రాజకీయాలు కరతలామలకం. మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అసలు మణిపూర్‌ ‌వాస్తవ సమస్య ఏదో ఆయనకు పూర్తిగా తెలుసు. ముందు వేల ఎకరాలలోని నల్లమందు సాగును ధ్వంసం చేయమని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ ‌షా ఈయనకు చెప్పారు.

మణిపూర్‌లో మెయితీలకీ, కుకీలకీ ఘర్షణలు కొత్త కాదు. 2008లోను జరిగాయి. తరువాత ఒక శాంతి ఒప్పందం జరిగింది. దీనితోనే మణిపూర్‌లో నల్లమందు సాగుకు మన్మోహన్‌ ‌ప్రభుత్వం అనుమతించినట్టయిందన్న విమర్శ ఉంది. ఇక్కడ జరుగుతున్న నల్లమందు సాగుకు చైనా, పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌, ‌మైన్మార్‌ల ఆర్థికసాయం ఉంది. మత్తు మందుల రవాణా నిలిపివేతతో కక్ష కట్టి ఉన్న కుకీలు, మాఫియాలు హైకోర్టు తీర్పును ఆసరా చేసుకుని ఈ మంటలు సృష్టించారు. కానీ మెయితీలు ఈసారి మౌనంగా లేరు. తమ ప్రార్థనామందిరాలు, ఇళ్ల ధ్వంసానికి నిరసనగా 300 చర్చిలను, కొన్ని ఇళ్లను వీరు కూడా ధ్వంసం చేశారు. మిషనరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. మణిపూర్‌ ‌నుంచి కుకీలను తరమడం మొదలు పెట్టారు. ఒక వర్గం మీడియాకు ఇది బాధ కలిగించింది. హిందువులలో చైతన్యం సహించలేని పరిస్థితి మరి!

కుకీలకి ఇప్పుడే హఠాత్తుగా ఇజ్రాయెల్‌ ‌గుర్తుకు వచ్చింది. ఇక్కడ బెనీ మెనాషె పేరుతో ఉన్న ప్రాచీన యూదు తెగవారిని రక్షించుకోవలసిందిగా  జూలై 13న కుకీలు ఇజ్రాయెల్‌ ‌ప్రధాని బెంజిమెన్‌ ‌నెతన్యాహుకు లేఖ రాయడం విశేషం. ఇక్కడ ఆ వర్గం వారు ఐదువేల మంది ఉన్నారు. వందల సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ యూదులు 2018 నుంచి తమ మాతృదేశానికి వెళ్లడం ఆరంభించారు. తాజా గొడవలలో ఒక యూదు మరణించాడు. పది మంది కనిపించడం లేదు. వీరి ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. అందులో ఒకటి ప్రార్థనా మందిరం (సినగాగ్‌).

అల్లర్లను ఆపడానికి వచ్చిన సాయుధ దళాలను స్త్రీలతో అటకాయించే పని అత్యంత నీచం. ఆ సమయంలో దళాలు కాల్పులు జరపకుండా సంయమనం పాటించడం అందరి మంచికే. కానీ అదే అలుసయినట్టుంది. ఇదే సాహసం ఉగ్రవాదులు, తుపాకీ పట్టిన వేర్పాటువాదుల విషయంలో ఎందుకు లేదన్నది ఇప్పుడు వినవస్తున్న ప్రశ్న. సీఏఏ విషయంలో షాహీన్‌బాగ్‌ ‌దగ్గర ముస్లిం మహిళలు, రైతు సంస్కరణ చట్టాల సమయంలో ఢిల్లీ సరిహద్దులలో రైతుల పేరుతో ఖలిస్తానీలు సాగించిన రహదారుల దిగ్బంధనం విన్యాసాన్నే ఇప్పుడు మణిపూర్‌ ‌కుకీ మహిళలు ప్రదర్శిస్తున్నారు. అంటే టూల్‌కిట్‌ ‌మిగిలిన భాగం అమలవుతున్నదనే అర్ధం. రాష్ట్రంలోని కీలక రహదారులను  దిగ్బంధనం చేసే పనికి మహిళలు పూనుకున్నారు. ఇది భద్రతాదళాలకు కొత్త సవాలు కానున్నది. గ్రామాలను, పట్టణాలను కలిపే ఆరు కీలక రహదారులు మూడు వారాలుగా మహిళల దిగ్బంధనంలో ఉన్నాయి. ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించడానికి మణిపూర్‌ ‌వచ్చామని, కానీ మహిళలు తాము విధులు నిర్వర్తించ కుండా అడ్డుపడుతున్నారని మూడు వారాల క్రితమే సైన్యం ఆరోపించింది. సైన్యం అదుపులో ఉన్న 12 మంది నిషిద్ధ కాంగ్లి యావూల్‌ ‌కున్నా లుప్‌ ‌సంస్థ కార్యకర్తలను 1500మంది మహిళలు మూకమ్మడిగా దాడి చేసి తీసుకుపోయారు. యాయన్‌గాంగ్‌పోక్పి దగ్గర ఇది జరిగింది. నిజానికి ఈ మహిళలు పూర్తి ఏర్పాట్లతో వచ్చారు. వీరి వెనుక సాయుధులైన పురుషులు వాహనాలలో ఉన్నారు. వెంట ఒక అంబులెన్స్ ‌కూడా ఉంది. వీరు విడిపించుకుపోయిన ఆ 12మందిలో చాందేల్‌ ‌దాడిలో పాల్గొన్న ఉగ్రవాది కూడా ఉన్నాడు. 2015లో సైనిక శిబిరం మీద జరిగిన ఆ దాడిలో 18 మంది జవాన్లు చనిపోయారు.

ఈ అల్లర్లు, పరిణామాల నుంచి గ్రహించ వలసిన మొదటి అంశం భారత దేశంతో ఈశాన్య భారతాన్ని కలిపే ‘చికెన్‌ ‌నెక్‌’ ‌మార్గాన్ని తక్షణం రక్షించుకోవాలన్నదేనన్న అభిప్రాయం వ్యక్తమవు తున్నది. ఈ మార్గాన్ని వశం చేసుకోవాలని షహీన్‌ ‌బాగ్‌లో షర్జిల్‌ ఇమామ్‌ అనే మతోన్మాద జేఎన్‌యూ విద్యావంతుడు వాగాడు కదా! దానిని అమలులో పెట్టే యోచన ఇప్పుడు తీవ్రమైనట్టు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి చికెన్‌ ‌నెక్‌ను ఆనుకుని ఇటు అస్సాం, అటు పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాలలోని జిల్లాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం తక్షణాసవరం అన్న అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్‌ ఈశాన్య భారత్‌కు ఏనాడూ మేలు చేయలేదు. క్రైస్తవాన్ని ప్రోత్సహించి, వేర్పాటువాదానికి దారులు వేయడం మాత్రమే ఆ పార్టీ చేసింది. ఇప్పుడు కూడా అల్లర్లను సమర్ధించే రీతిలో ఉన్న ఆ పార్టీ వైఖరి వేర్పాటు వాదానికి ప్రోత్సాహం ఇస్తున్నది. ఉగ్ర వాదానికి ఊపిరులు ఇస్తూ, దేశాన్ని సర్వనాశనం చేసే మత్తు మందుల మాఫియాను ఆ విధంగా పరోక్షంగా సమర్ధిస్తున్నది. దీనిని భారతీయులు గుర్తించడం అవసరం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE