– పి.చంద్రశేఖర ఆజాద్, 9246573575
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
‘‘ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన ఉంది. అయితే, ఇది వ్యాపార పత్రిక కాదు. ఇందులో వ్యాపారం కోసం రచనలు వ్యాపారం కోసం ఉండవు. అలా అని, పూర్తిగా పాతకాలంలోకి వెళ్లిపోం. ఇప్పుడు జరిగేదంతా విధ్వంసం. రానున్న రోజులన్నీ చెడ్డవి అని చెప్పేలా ఉండవు. పత్రికకి కొన్ని గైడ్‌లైన్స్ పెట్టు కోవాలి. ఓ కమిటీ ఉంటుంది. అంతిమంగా నిర్ణయం మాత్రం నేను తీసుకుంటాను’’.
‘‘బాగుంది సర్’’.
‘‘బాగుంటుందంటావా? ఇక్కడ కూడా సమస్యలు వస్తాయా?’’
‘‘సమస్యలు ఎప్పుడూ వస్తుంటాయి సర్… మనం లాభాలు ఆశించనప్పుడు, ఓ ప్రయోజనం కోసం మంచి పనులు చేయాలనుకుంటే అవి వస్తాయి. అంత మాత్రాన అలాంటి ప్రయత్నమే వద్దు అనటం సరైంది కాదు’’ అన్నాడు రిత్విక్.
‘‘గుడ్… మనం మళ్లీ మాట్లాడుకుందాం.’’
రిత్విక్ నమస్కరించి తన గదికి వచ్చాడు. తనని ఇప్పటికిప్పుడు ఎందుకు రమ్మన్నారో ఓ అంచనా వచ్చేలా ఉంది. ఈ వయసులో రామకృష్ణ గారు పత్రిక గురించి మాట్లాడటం కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
————-
ఆద్య ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతోంది.
‘‘నేను విన్నాను. ఇంతకు ముందు పత్రికల్లో చదివాను. అదో గొప్ప అనుభవం అవుతుంది. తప్ప కుండా వస్తాను. ష్యూర్! నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. అలాగే,’’ అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగింది. అక్కడ ఆదర్శ్ ఉన్నాడు.
‘‘నీ పర్మిషన్ లేకుండా నీ స్పేస్‌లోకి అడుగు పెట్టాను ఆద్యా….’’ అన్నాడు.
అప్పుడు తండ్రి ముఖంలోకి చూసింది.
‘‘నన్ను వెక్కిరిస్తున్నారా?’’
‘‘నీకు అలా అనిపించిందా?’’
‘‘దిసీజ్ నాట్ మై స్పేస్ నాన్నా…నా స్పేస్ ఇక్కడ వుంది’’ అని తన మెదడు చూపించింది.
అతని ముఖంలో భావాలు మారాయి.
‘‘ఇది మమ్మీ స్పేస్. అఫ్ కోర్స్ మీది కూడా. నేను ఇక్కడ ఓ బాటసారిని. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోయే అతిథి•ని. తర్వాతయినా నాదైన స్పేస్‌ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న ఓ ఆశాజీవిని’’.
‘‘నీతో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడుకుందామా? బయటకు వెళ్దామా?’’
‘‘ఓపెన్‌గా మాట్లాడుకోవటానికి ఓపెన్ స్పేస్ ఎప్పుడూ బాగుంటుంది’’ అంది ఆద్య. పది నిమిషాల తర్వాత ఆదర్శ్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. డ్రిజిల్ అవుతోంది… సన్నటి వాన చినుకులు…. వైపర్స్ పని చేస్తున్నాయి.
‘‘అద్దం మీద వాన చినుకులు బాగుంటాయి’’ అంది.
‘‘వాటిని క్లియర్ చేయకపోతే దారి కనిపించదు’’
అప్పుడు తండ్రి కేసి చూసింది…
వాన చినుకులు ఆగిపోయాయి.
‘‘ఎందుకు చినుకులు పడతాయో… ఎందుకు ఆగిపోతాయో’’ స్వగతంగా అనుకున్నాడు.
‘‘ఇప్పుడు రుతువులు కూడా మారిపోతున్నాయి. అకాల వర్షాలు వస్తున్నాయి. అలాగే ఎండలు మండిపోతున్నాయి’’ అంది ఆద్య. అలా నెక్లెస్ రోడ్‌లోకి కారు మలుపు తిరిగింది.
పది నిమిషాల తర్వాత హుస్సేన్ సాగర్ ఒడ్డున ఇద్దరూ కూర్చున్నారు. ఎదురుగా బుద్ధ విగ్రహం కనిపిస్తోంది!
‘‘నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు ఆద్యా… నేను వస్తాను, అంటున్నావు…’’
‘‘నా ఫ్రెండ్‌తో మాట్లాడాను… బాయ్ ఫ్రెండ్ కాదు’’ అంది నీటిని చూస్తూ …
అప్పుడు ఆద్యని చూసాడు. తన ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు.
‘‘నేను జైపూర్ వస్తా నన్నాను డాడ్’’.
‘‘రాజస్థాన్ చూడాలనా – నాకు చెబితే మనం ముగ్గురం కలిసి వెళ్లేవాళ్లం’’.
‘‘నేను వెళ్లేది రాజస్థాన్ చూడటానికి కాదు. లిటరరీ ఫెస్ట్‌కి వెళ్తున్నాను’’.
‘‘లిటరరీ ఫెస్ట్‌కా? వాళ్లు నిన్ను ఇన్‌వైట్ చేసారా?’’
‘‘లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరయినా పార్టిసిపేట్ చేయవచ్చు. అక్కడికి చాలా దేశాల నుంచి రైటర్స్ వస్తారు. క్రియేటర్స్ వస్తారు. మోర్ వాయిసెస్… ఈ ప్రపంచంలో భిన్న కాంటినెంట్స్‌లో థాట్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసు కోవచ్చు’’.
‘‘అక్కడ రాజకీయాలు ఉంటాయంటారు’’
‘‘రాజకీయం లేని చోటు ఎక్కడ ఉంది నాన్నా… ఇంట్లో ఉండవా! ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు ఏదో మాట్లాడాలన్నారు’’ అంది ఆద్య.
‘‘మన మధ్య దూరం పెరుగుతోంది అనిపిం చింది. ముఖ్యంగా మీ అమ్మకీ, నీకూ మధ్యన’’.
‘‘అమ్మ నాతో మాట్లాడటం లేదు. సీరియస్‌గా ఉంటోంది. ఒకే కప్పు కింద బతుకుతూ ఇలా ఉండటం నాకూ యిబ్బందిగా వుంది. అందుకని నేను హాస్టల్‌కి వెళ్లాలనుకుంటున్నాను నాన్నా….’’
‘‘అలాంటి నిర్ణయానికి వచ్చావా?’’
‘‘ఆ జీవితం నాకు కొత్తకాదు. చిన్నప్పుడే నన్ను చాలా దూరం పంపించి చదివించారు. అప్పుడు నాకు అమ్మా-నాన్నలతో పాటు, గ్రాండ్ పేరెంట్స్ కూడా గుర్తొచ్చే వారు. రాత్రిపూట నేను దుప్పటి ముసుగులో ఏడ్చేదాన్ని. తర్వాత అలవాటు పడ్డాను. అయిన వారందరికీ దూరంగా ఉండటం నాకు నచ్చలేదు. అందుకే వచ్చేశాను’’ అంది.
‘‘నీ మీద ప్రేమ లేక కాదు. నీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అక్కడికి పంపించాం’’.
‘‘మంచి ఎడ్యుకేషన్ అంటే ఏంటి నాన్నా?’’
అతను మాట్లాడలేకపోయాడు.
‘‘ఇంటిని మించి, కుటుంబంలోని రిలేషన్స్ మించిన విద్య ఉందని నేను అనుకోను. అందు లోనూ ఆ వయసులో… పిల్లలు కథలు వినాలనుకుం టారు. తమని హగ్ చేసుకోవాలి. చిన్న ముద్దులు ఇవ్వాలి. అలగాలి, అల్లర్లు చేయాలి అని కోరుకుం టారు’’.
‘‘అవన్నీ చేస్తున్నావనే కదా… అంత దూరం పంపించింది’’.
‘‘ఇది కూడా ఉందా! ఇప్పుడు కూడా అంతేగా. నేను ప్రశ్నలు అడగటం మీకు చిన్నపిల్లల అల్లరిగా అనిపిస్తోంది. అప్పుడు నేను, ఇప్పుడు మీరు అడుగుతున్నాం’’.
‘‘నువ్వు బయటకు వెళ్లటం నాకు ఇష్టం లేదు. నువ్వు అమ్మతో మాట్లాడు. మన మధ్య ఇంకా దూరం పెరగకూడదు’’.
‘‘ఇది అమ్మకు చెప్పారా?’’
‘‘చెప్పాను. నువ్వింక చిన్నపిల్లవి కాదు అని గుర్తించమన్నాను. అలాగే నువ్వు ఏం చదువుతావో నీ ఇష్టం. ఇందులో మా జోక్యం వుండదు. ఇంట్లో ఉన్నది మనం ముగ్గురం. నేను నా వ్యాపారంలో బిజీగాఉంటాను. నువ్వు నీ చదువులో తీరిక లేకుండా వుంటావు. మనందరికీ దొరికే సమయం ఎంత? ఆ కొద్ది గంటలైనా మనం ఎలాంటి వివాదాలు లేకుండా సరదాగా గడపలేమా? నువ్వే అంటు న్నావు…ఇంక నేను మీ దగ్గర ఉండేది కొన్ని సంవత్సరాలు మాత్రమే అని…. అప్పటి దాకా సంతోషంగా ఉందాం’’.
ఆద్య మాట్లాడలేదు. బుద్ధుడిని చూస్తోంది.
‘‘ఇంతకు ముందు బుద్ధుడిని చాలాసార్లు చూసావు’’.
‘‘ప్రతిసారీ కొత్తగా వుంటుంది డాడీ… సన్ రైజ్ … సన్ సెట్‌ని రోజూ చూస్తున్నామని బోర్ కొడుతుందా?’’
‘‘అమ్మా నాన్నలు కూడా అంతే ఆద్య’’.
‘‘కుటుంబంలో అమ్మా నాన్నలే ఉండరు నాన్నా’’.
అప్పుడు అతన్నో పవనం బలంగా తాకి వెళ్లింది. ఆకాశం కేసి చూసాడు. మబ్బులు కమ్ముకుంటు న్నాయి.
‘‘వర్షం వచ్చేలా వుంది. మనం బయలు దేరదాం’’.
‘‘వర్షం బుద్ధుడిని తడుపుతుంటే చూడాలని ఉంది. కారులో కూర్చుందాం. చాలామంది బుద్ధావ తారం అని వ్యంగ్యంగానూ, సరదాగానూ అంటారు. శిలలా ఉంటాడనా! ఆయన జీవితం గురించి తెలుసు కోవాలనుకుంటున్నాను. ఇప్పటికీ ప్రపంచానికి ఆయన దారి చూపిస్తున్నాడు. బుద్ధుడిని అర్థ్ధం చేసుకోవటం అంత సులభం కాదు’’.
‘‘బుద్ధుడిలో లోపాలు లేవంటావా ఆద్య’’.
‘‘అవి ఏంటో మీరు చెప్పండి’’.
‘‘కట్టుకున్న భార్యని, కన్న కొడుకుని వదిలిపెట్టి వెళ్లిపోయాడు’’ అన్నాడు ఆదర్శ్.
‘‘ఆయన మనిషి నాన్నా…’’ అంది.
అప్పుడు కూతుర్ని ఆశ్చర్యంగా చూసాడు.
‘‘మీ పేరు ఆదర్శ్ అని తాత ఎందుకు పెట్టాడో తెలియదు. నాకు మీరు ఆద్య అని ఎందుకు పెట్టారో తెలియదు. మనం ఆ పేర్లకు తగినట్లు ప్రవర్తి స్తున్నామా? ఇప్పటి వరకు యశోధర కోణం నుంచి చాలా రచనలు వచ్చాయి. చరిత్రని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తారు, వ్యాఖ్యానిస్తారు. నాకు తెలిసి బుద్ధుడి కోణం నుంచి రాసిన రచన నా దృష్టికి రాలేదు. అతను అలా చేయటానికి వెనకాల కారణాలను, ఇంకో కోణంలో చూడవచ్చు కదా’’.
‘‘అలాంటి పని నువ్వుకూడా చేయవచ్చు. ఎం.ఎ. లిటరేచర్ చేస్తానంటు న్నావుగా’’ అన్నాడు ఆదర్శ్.
————-
రిత్విక్ లైబ్రరీ అద్దాల ముందు నిలబడి చూస్తుంటే గోవింద్ వచ్చాడు. అతన్ని చూసి ‘‘రేర్ కలెక్షన్ సర్’’ అన్నాడు.
‘‘ఇందులో రామకృష్ణగారు సేకరించిన బుక్స్ వున్నాయి. మన ఆఫీస్‌లో ఇంకో పెద్ద లైబ్రరీఉంది’’.
‘‘ఇవన్నీ చదవటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి సర్….’’
‘‘ఏ సంస్థకయినా లైబ్రరీ చాలా అవసరం రిత్విక్… ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. ఇలాంటి బుక్స్‌ని డిజిటలైజ్ కూడా చేయిస్తున్నాను. రా… కూర్చుందాం’’ అని తీసుకువెళ్లాడు. ఇద్దరూ కూర్చున్నారు.
‘‘ఇప్పుడు మనం మళ్లీ పెద్ద ఎత్తున నవలల పోటీ పెడుతున్నాం రిత్విక్… అవన్నీ ఫైనలైజ్ చేసి వస్తున్నాను’’ అనగానే రిత్విక్ ముఖంలో ఓ రేఖ కదిలి మాయం అయింది.
‘‘ఈ పోటీకి నువ్వు రాయటం లేదు. అంత సమయం నీకు ఉండదు’’
‘‘నేను చాలా పోటీల్లో పాల్గొనలేదు సర్. అప్పుడు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఆ బాధ నాకు లేదు’’.
ఆయన చిన్నగా నవ్వాడు.
‘‘రామకృష్ణగారు కూడా ఓ పత్రిక పెట్టాలి అన్నారు’’
‘‘అవును. ఇలాంటి ఆలోచన వారికి ఎప్పుడో ఉంది. అందులోనూ, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. నేను కూడా పెట్టమన్నాను. ఆ పత్రికకి సర్య్కులేషన్ పెరగాలి. పోటీ పడాలి లాంటి సమస్యలు లేవు. అయిదారు సంవత్సరాల క్రితమే ఇది జరగాల్సింది. తొందర్లోనే పత్రిక తీసుకు రావాలని ఆయన ఆరాటపడుతున్నారు’’ అన్నాడు గోవింద్.
ఆ తర్వాత మళ్లీ చెప్పటం ఆరంభించాడు.
‘‘ఆ మధ్య సినిమా గురించి మనం మాట్లాడు కున్నాం. అది పూర్తికాలేదు. ఇప్పుడు నా స్నేహితుడూ, అభిమాని అయిన ఓ రచయిత కథ నీకు చెబు తున్నాను’’ అన్నాడు.
——————-
అతను ముందు చిన్న చిన్న కవితలు రాసేవాడు. తర్వాత నాటకాలు రాయటం మొదలుపెట్టాడు. స్వయంగా నటుడు కూడా. తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొల్‌కతా, ఇంకొన్ని నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే, అప్పటి మద్రాసు నగరంలో కూడా!
అలా అతని పేరు సినిమా వారి దృష్టికి వచ్చింది.
కొంతమందికి కొన్ని అభిప్రాయాలుంటాయి. కొందరు నాటకాలను విపరీతంగా ప్రేమిస్తుంటారు. నాటకం రాసినవాడే నిజమైన రచయిత అని వారు నమ్ముతారు. అందులో డ్రామా ఉంటుంది. కేవలం గంటన్నర, రెండు గంటలలోపు ఓ జీవన దృశ్యాన్ని చూపించగలగాలి. సినిమా వేరు. వాళ్లు ఎక్కడి కయినా, ఏ లొకేషన్‌కైనా వెళ్లవచ్చు. వారికి ఎనభై నుంచి వంద దృశ్యాలు కావాలి. అందులో పాటలు ఉంటాయి. యుద్ధాలు ఉంటాయి.
ప్రకృతిని భిన్న కోణాల్లో చూపించవచ్చు. చిన్న చిన్న షాట్స్‌లో గొప్ప అనుభూతిని, విషాదాన్ని పండించవచ్చు. నాటకంలో అలాంటి అవకాశాలు తక్కువ. కేవలం రెండు మూడు సెట్లు వుంటాయి. అందులోనే అన్నీ చూపించాలి. ముఖ్యంగా స్త్రీ పాత్రలు తక్కువ ఉంటాయి. ఆ పాత్రలు పోషించే వారూ తక్కువగా వుంటారు. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి.
అలాంటి చోట ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిం చటం, వారిని నాటకంలో లీనం చేయటంలో కీలకపాత్ర రచయితలది.
అందుకే నాటక రచయితకి జీవితం, నాటకీయత తెలిసి, అనుభవిస్తేనే ఏ నాటకం అయినా పండు తుంది అంటారు. అలా, అతను సినిమా రంగంలోకి వచ్చాడు. నాలుగయిదు సినిమాల వరకు అతని రచనలు నాటకాల్లానే ఉం డేవి…
‘‘ఇతనెవరో కొత్త రచయిత వచ్చాడు. బాగా రాస్తున్నాడు’’ అనుకున్నారు ప్రేక్షకులు. అప్పుడు ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అయింది. పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోల దృష్టి అతని మీద పడింది.
అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది. అతను వంద సినిమాలు రాస్తే అందులో డెభై సినిమాలు హిట్లు! పదిహేను సినిమాలు యావరేజ్, అయిదు మాత్రం డిజాస్టర్స్… ఇప్పటికీ అతని ప్రయాణం సాగుతోంది. ఇదీ స్థూలంగా అతని ఇంట్రడక్షన్.
అసలు కథలోకి వస్తే ఆ రచయితకి ఒకడే కొడుకు. మంచి అందగాడు. ఆరు అడుగుల ఎత్తు. ఎంతోమంది హీరోలను పరిచయం చేసిన ఆ రచయిత తన కొడుకుని హీరోని చేయాలనుకున్నాడు. అందుకు అన్ని విభాగాల్లో కొడుక్కి శిక్షణ ఇప్పిస్తు న్నప్పుడు, తను ఓ కథను తయారు చేసుకున్నాడు. ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించాలి. అంతేకాదు నిర్మాత కూడా తనే….
మిత్రుల దగ్గర డబ్బులు అప్పు అడిగాడు. అందరూ తమ సహకారం ఇస్తామన్నారు. అతను అడిగితే ఏ పెద్ద నిర్మాతయినా, దర్శకుడైనా ఆ అబ్బాయిని పరిచయం చేస్తారు. అప్పటికీ అడిగారు.
‘‘ఈ ఒక్క సినిమాని నాకువదిలిపెట్టండి. తర్వాత మీ ఇష్టం’’ అన్నాడు. ఆ సినిమా మొదలు పెట్టటానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి. అప్పుడు తెలిసింది.
‘‘ఆ అబ్బాయికి కేన్సర్. అతను మూడు నెలలకు మించి బతకడు’’ అని!
——————-
‘‘జీవితం చాలా క్రూరమైంది రిత్విక్… అది అతని జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపి ఉంటుందో ఆలోచించు. ఇప్పటికే నీకు ఆ రచయిత గురించి తెలిసి ఉంటుంది. వాళ్ల అబ్బాయి చనిపోవటం గురించి కూడా….’’
‘‘అవును సర్’’.
‘‘ఇది జరిగి కూడా రెండు దశాబ్దాలు దాటాయి. బట్… అతను ఏ క్షణం తన కొడుకుని మరిచి పో లేదు. అప్పటినుంచి అతని జీవితం మారి పోయింది. అతను సినిమాలకు రచన చేయటం మానలేదు. కానీ పైకి కనిపించే వ్యక్తి వేరు. లోపల వేదన వేరు. అతను నన్ను అడిగాడు’’ అని ఆగాడు…
(సశేషం)