– సుజాత గోపగోని, 6302164068
ప్రభుత్వం అంటేనే ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఒక యంత్రాంగం. ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధులు ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహించాలి. అయితే ఈ క్రమంలో వారు ప్రజలను ఆకట్టుకునేందుకు, తమ పార్టీపై అభిమానాన్ని పెంపొందింపజేసేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం, వాటిని అమలుచేయడం సాధారణమే. కానీ, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిని అంచనా వేయకుండా, ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా… ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు హామీలు ఇవ్వడం, పథకాలు ప్రారంభించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిదికాదు. హద్దే లేని హామీలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ఖాయం. ఇందుకు తాజా ఉదాహరణే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం.
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తన మానసపుత్రికగా చెప్పుకుంటుంటారు. దేశంలోనే కాదు.. ప్రపంచం లోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదని, ఎవరికీ కనీసం ఈ దిశగా ఆలోచన కూడా రాలేదని బీఆర్‌ఎస్ నేతలు గర్వంగా చెప్పుకుంటుంటారు. ఇదే అంశాన్ని ఆ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటుంటారు. అయితే, వాస్తవ పరిస్థితులు, ఆర్థిక పరమైన పరిస్థితులు ఏంటనే అంశాన్ని అంచనా వేయకుండా గుడ్డిగా కేసీఆర్ ఈ పథకాన్ని మొదలుపెట్టారని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఈ పథకం వల్ల అత్యధిక భారం పడుతుందని విమర్శకులు ఆదినుంచీ వాదిస్తున్నారు. కానీ, బీఆర్‌ఎస్ సర్కారు మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా కొట్టిపారేస్తోంది. రైతుబంధు పథకం తెలంగాణలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లో ఈ పథకం కూడా బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిందని చెబుతుంటారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన సమయంలో ఇదొక సంపన్న రాష్ట్రం. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం ఇది. కానీ, యేళ్లు గడిచిన కొద్దీ పరిస్థితులు తారుమారయ్యాయి. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు గోల పెడుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం తాననుకున్నది చేసుకుంటూనే ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే రైతుబంధు పథకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా తయారవుతా యని ప్రతిసారీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పైగా, అసలు వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను పక్కనబెట్టి కేవలం భూస్వాములకే రైతుబంధు డబ్బులన్నీ చెందుతున్నాయన్న విమర్శలు మొదటినుంచీ ఉన్నాయి. ఈ విమర్శలు పక్కన బెడితే.. రైతుబంధు లబ్ధిదారుల మధ్య కూడా ప్రభుత్వం చిచ్చు పెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొందరు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు వచ్చి.. వాళ్ల కళ్లముందే మరికొందరు రైతులకు రైతుబంధు డబ్బులు జమ కాకపోవడం అన్నది వారి మధ్య చిచ్చురాజేసే పరిస్థితిని కల్పిస్తోంది. ఈ పరిస్థితులకు నిధుల కొరతే కారణమంటున్నాయి అధికారవర్గాలు. ఫలితంగా రైతులు.. వానలకోసమే కాదు.. రైతుబంధు డబ్బులు తమ అకౌంట్‌లో ఎప్పుడు పడతాయా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం… ఇప్పటివరకు దాదాపు 50శాతం మందికి మాత్రమే రైతుబంధు నిధులు జమ అయ్యాయని చెబుతున్నారు. మరోసగం మంది డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల్లోపు భూములు ఉన్నవాళ్ల ఖాతాల్లోకే నగదు బదిలీ జరిగిందంటున్నారు. అంతకంటే ఎక్కువ భూములు ఉన్నవాళ్లకు డబ్బులు జమ కాలేదంటు న్నారు. ఖజానాలో కటకట కారణంగా ఆర్థిక శాఖ రైతుబంధు పథకానికి సరిపడా నిధులు సర్దుబాటు చేయలేదని తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4వేల 378 కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద అకౌంట్లలో జమ చేశారు. ఇంకా 3వేల 342 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం రైతుబంధు పథకం నిధులు జమ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, కొద్దిరోజుల పాటు మాత్రమే ఈ పక్రియ కొనసా గింది. ఆ తర్వాత నగదు బదిలీ నిలిచిపోయింది.
వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులు రైతు బంధు డబ్బులు తమ బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయా? తమ సెల్‌ఫోన్‌కు ఎప్పుడు మెస్సేజ్ వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. మొబైల్‌ఫోన్‌కు మెస్సేజ్ వస్తే చాలు.. డబ్బులు జమ అయిన సమాచారం కావచ్చని చూసుకుంటున్నారు. వర్షాలులేక ఇప్పటికే ఆందోళనలో ఉన్న తరుణంలో రైతుబంధు సాయం చేతికి అందితే కాస్త ఊరట లభిస్తుందన్న ఆశతో వారున్నారు.
ఇప్పుడు రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. ఆర్థికశాఖ నుంచి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో ట్రెజరీలో బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదు బదిలీని గత జూన్ 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. తొలిరోజు 22లక్షల 55వేల 81 మంది రైతులకు 642కోట్ల 52లక్షల రూపాయలు బదిలీ చేశారు. రెండో రోజు 16లక్షల 98వేల 957 మంది రైతులకు 1278కోట్ల 60లక్షల రూపాయలు చెల్లించారు. మూడో రోజు 10లక్షల 89 వేలమంది రైతుల ఖాతాల్లో ఒకవెయ్యి 325కోట్ల 24లక్షల రూపాయలు నగదు బదిలీ జరిగింది. అలాగే, నాలుగో రోజు 6లక్షల 64 వేల 717 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో ఒకవెయ్యి 131 కోట్ల రూపాయలు జమచేశారు.
మొత్తం ఈ సీజన్‌లో 7వేల 720 కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు. 4వేల 378 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లిం చారు. ఇంకా 3వేల 342 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ నిధులను కేసీఆర్ ప్రభుత్వం సర్దుబాటు చేయలేకపోతోంది. ఫలితంగా గడిచిన కొద్దిరోజులుగా నగదు బదిలీ నిలిచిపోయింది.
వ్యవసాయ శాఖ నుంచి పంపించిన బిల్లులన్నీ ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి నిధులు సర్దుబాటు చేస్తేనే బిల్లులు పాస్ చేసే అవకాశం ఉంటుంది. నిధుల కటకటతో ట్రెజరీ వద్దే పక్రియ నిలిచిపోయింది. దీంతో బిల్లులు ఎప్పుడు పాసవుతాయో అని వ్యవసాయశాఖ అధికారులు, ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమచేస్తారో నని రైతులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు వేయగా మరికొందరు వర్షాలు వస్తేనే నాటుతామని దుక్కులు దున్ని వేచిచూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో రైతుబంధు డబ్బులు వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని రైతులు అంటున్నారు. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు చెల్లించటానికి కూడా నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించే పద్ధతి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా వేతనాలు చెల్లిస్తు న్నారు. ఇదే సమయంలో రైతుబంధు నగదు బదిలీ కూడా చేయాల్సి రావటంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చడం ఇబ్బందికరంగా మారింది.
బీఆర్‌ఎస్‌కు డబుల్ ధమాకా!
సాధారణంగా రాజకీయ పార్టీలకు కార్యాల యాల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటా యించడం రివాజుగా వస్తోంది. అయితే, ఒకే రాజకీయ పార్టీకి రెండుచోట్ల పార్టీ ప్రధాన కార్యాలయాలకోసం ప్రభుత్వం స్థలం కేటాయించడం అరుదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ కోసం రెండో కార్యాలయా నికి స్థలం కేటాయించింది. ఇదంతా రహస్యంగా జరిగి పోయింది. బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్న ప్పటికీ అత్యంత విలువైన 11 ఎకరాల భూములను మళ్లీ కేటాయించడం అక్రమమని పేర్కొంటూ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలోని 239, 240 సర్వే నంబర్లలో ఎకరం 50 కోట్ల రూపాయలు విలువచేసే 11 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ పార్టీకి ప్రభుత్వం కేటాయించిందని పిల్‌లో ఆయన వివరించారు. దీని మార్కెట్ విలువ 500 కోట్లకు పైగా ఉంటుందని, ధరతో సంబంధం లేకుండా ఎకరానికి 3కోట్ల 41లక్షల రూపాయలు చొప్పున బీఆర్‌ఎస్‌కు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ భూ కేటాయింపునకు సంబంధించిన జీవోగానీ, ఆదేశాలుగానీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఎక్కడా అందు బాటులో లేవని… విషయాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించారని… తాము ఎంతో కష్టపడితే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి క్యాబినెట్ ఆమోదించిన ఒక మెమో (సీఎన్. 12425 / ల్యాండ్ అడ్మిన్.2(2)/2023 తేదీ లేదు-అత్యంత రహస్యం) మాత్రం లభించిందని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవల్‌ప మెంట్ వంటి గొప్ప గొప్ప శిక్షణ సంస్థలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ, వ్యక్తిత్వ వికాస కేంద్రం ఏర్పాటుకు బీఆర్‌ఎస్ పార్టీ 11 ఎకరాల భూమి కేటాయించాల్సిన అవసరం అసలే లేదని పద్మనాభరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్కువ ధరకు అత్యంత విలువైన భూమి తీసుకోవాలన్నదే ఈ కేటాయింపు వెనుక ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న సదరు భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుని బీఆర్‌ఎస్ పార్టీకి కేటాయించిందని…అసాధారణంగా కొద్దికాలంలోనే భూకేటాయింపు జరిగి పోయిందని వెల్లడించారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఏడాది మే 12న జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకోగా.. కలెక్టర్ సీసీఎల్‌ఏకు ప్రతిపాదన పంపారని… మే 17న సీసీఎల్‌ఏ ప్రభుత్వం ముందు ఉంచిందని… దీనికి ముఖ్య మంత్రి అంగీకరించి మంత్రిమండలి ముందు పెట్టడానికి ఒప్పుకున్నారని… తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. నాలుగు నుంచి ఐదు నెలల్లో జరగాల్సిన పక్రియ మొత్తం ఇలా ఐదు రోజుల్లో పూర్తయిందని ఆరోపించారు.
మే చివరి వారంలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ భూమి పూజ కూడా చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి బంజారాహిల్స్‌లో పెద్ద కార్యా లయం ఉన్నప్పటికీ, అదనంగా రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించుకున్నారని.. మరోవైపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్నారని తెలిపారు.
కారుచౌకగా రాజకీయ పార్టీలకు చేసిన భూ కేటాయింపును ఇటీవలే హైకోర్టు కొట్టేసిందని.. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని… దాన్ని నచ్చిన వారికి ధారాదత్తం చేయడం చెల్లదని సుప్రీం కోర్టు అనేక తీర్పుల్లో ఉద్ఘాటించిందని పిటిషనర్ గుర్తు చేశారు. కావాలంటే బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ వేలంలో భూములను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఈ వ్యాజ్యంలో రెవెన్యూ శాఖ, హెచ్‌ఎండీఏ, సీసీఎల్‌ఏ, రంగారెడ్డి కలెక్టర్, బీఆర్‌ఎస్ పార్టీని ప్రతివాదులుగా చేర్చారు.