ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారానికై బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు ప్రభృతులు మే 26, 1943న రెడ్డి హాస్టల్‌ (‌నిజాం వ్యతిరేక పోరాటంలో రెడ్డి హాస్టల్‌కు కొన్ని పేజీలు కేటాయించాలి) లోని గ్రంథాలయంలో సమావేశమై నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దాని ప్రథమ మహాసభ జూన్‌ 1‌న జరిగింది. ఆ తర్వాత నుంచి సురవరం ప్రతాపరెడ్డి, పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అడవి బాపిరాజు వంటి మహా మహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా, సంస్కృతుల ప్రచారానికి కృషి చేశారు. దేవులపల్లి రామానుజరావు జీవితాంతం కృషి చేశారు.

ఓరుగల్లు కోటలో కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డిగారి అధ్యక్షతన 1944లో ఆంధ్రసారస్వత పరిషత్‌ ‌ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. ఓరుగల్లు అనగానే ఒడలు పులకరిస్తాయి. కాకతీయుల కాలం కళ్లముందు కన్పిస్తుంది. ఇక్కడ చక్కటి శిల్పాలు న్నాయి. వాటిని మతోన్మాదులు వికృతం చేశారు. ముక్కులు చెక్కి, వక్షోజాలను కక్షతో నరికి, వికృతం చేశారు, ప్రాచీన కళా సంపదను పాడు చేశారు.

నిజాం ప్రభుత్వం అలాంటి వాళ్లకు తోడ్పాటు అందించేది. బ్రిటిష్‌ ‌వారు సాహిత్య సభలకు, మత సంబంధ ఉత్సవాలకు అడ్డు తగిలేవారు కారు. కానీ, నిజాం ప్రభుత్వం ఎలాంటి సభలకైనా… అవి సాహిత్య సభలు కానీ, మత సంబంధ సభలు జరుపు కోవడానికైనా అనుమతి తీసుకోవాలని ఒక కట్టుబాటు చేసింది. అనుమతి పొందినా సంఘ విద్రోహశక్తులు సభల్ని జరగనిచ్చేవి కావు.

గణేష్‌ ఉత్సవాలు జరుపుకుంటే రజాకారులు గలాటాలు చేసి, హత్యల దాకా వెళ్లేవారు. రజాకార్‌ అం‌టే స్వచ్ఛంద సేవకుడు అని అర్ధం. కానీ వారు చేసే సేవ హత్యలు, మానభంగాలు, ప్రాచీన శిల్పాలను వికృతం చేయటం వంటి చర్యలే. ఇవి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల దురాగతాలను మించిపోయాయి. తెలంగాణలో సాహితీ చైతన్యానికి విశేషమైన కృషిచేసిన వారిలో ప్రథములు ఆంధ్ర సారస్వత పరిషత్‌వారు. దాని ప్రథమ వార్షికోత్సవాలు ఓరుగల్‌ ‌కోటలో ప్రారంభమయ్యాయి. చక్కటి పందిళ్లు వేశారు. ఎందరెందరో సాహితీవేత్తలు, కవులు సభలకు వచ్చారు. రజాకార్లు ఉక్రోషంతో ఆ పందిళ్లు తగులబెట్టారు. కవుల దగ్గర కలాలు న్నాయి, గళాలున్నాయి. కాని కత్తుల్లేవు. కలాలకు, గళాలకు భయపడ్డ ప్రభుత్వం రజాకార్లను ఉసి కొల్పింది. తీరా కవి సమ్మేళనం ప్రారంభించే సరికి అగ్నిజ్వాలలు, భస్మరాశులు! ఏమైనా సరే కవి సమ్మేళనం జరిపి తీరవలసిందే అన్నారు సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు. అటుపిమ్మట దాశరథి కృష్ణమాచారిని సంప్రదించారు. ‘‘జ్వాలలో ఆహుతి అయిపోతాం గాని కవి సమ్మేళనం జరిపే తీరుతాం’’ అన్నారు కృష్ణమాచారి. ఇంక శాంతించేది లేదు.. ‘లడేంగే ఔర్‌ ‌మరేంగే’ పోరాడదాం, అవసర మైతే ప్రాణాలైనా వదులుదాం అన్నారు ఇతర కవులు. కాలిపోయిన పందిళ్ల బూడిద వేడిగా అరికాళ్లకు తగులుతున్నది. అయినా కృష్ణమాచారితోనే ప్రారం భించారు సభను. ఆయన తన కవితను చదివారు.

‘‘ఓ పరాధీన మానవా! ఓపరాని

దాస్యము విదల్చలేని శాంతమ్ముమాని

తలుపులను ముష్టి బంధాన కలచివైచి

చొచ్చుకొని పొమ్ము, స్వాతంత్య్ర సురపురమ్ము’’.

సురవరం అధ్యక్షులు గనుక సురపురం స్ఫురించింది కృష్ణమాచార్యునికి. అలాగే నిర్భయంగా పద్యాలు చదువుతున్నారు కృష్ణమాచారి. ‘‘సింహగర్జన చేశావు నాయనా!’’ అన్నారు ప్రతాపరెడ్డి కౌగిలించు కొని. దేవులపల్లి రామానుజరావు పుష్పహారం వేశారు. దూరం నుంచి ఓ రాయి వచ్చి ప్రతాపరెడ్డి అధ్యక్ష పీఠం మీద పడింది. మరో రాయి విసురుగా వచ్చి పడ్డది. ‘‘ఇవి రాళ్లు కావు…పూలు. చదవండి’’ అన్నారాయన.

ఈలోగా జన సాంద్రత పెరిగింది. తండోప తండాలుగా జనం, ఆ కోలాహలం రజాకార్లకు హాలాహలం. ఇక లాభం లేదని రజాకార గూండాలు తోక ముడిచారు. అర్ధరాత్రి వరకూ కవితాగానం జరుగుతూనే ఉంది. ఆకలి లేదు, నిద్రలేదు, చక్కగా జరిగిపోయింది సభ.

ఆ తరువాత ఆంధ్ర మహాసభ కార్యకర్తలతో కలిసి వరంగల్‌ ‌జిల్లాలో రోజూ ఊరూరూ తిరిగి సభ పెట్టడం, ప్రజల్ని నిజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా పోరాడటానికి సిద్ధం చేయడం ఇదే మా పని అన్నారు కృష్ణమాచారి. ఓ రోజు అదే జిల్లాలోని మానుకోట తాలూకా బయ్యవరం గ్రామానికి వెళ్లి సభ పెట్టగా, ‘‘నిజాం ముర్దాబాద్‌’’ అనే నినాదంతో ఆ సభ ప్రారంభమైంది. కృష్ణమాచారి అలా కాదు జిందాబాద్‌తో ప్రారంభిద్దామని వెంటనే గాంధీజీ జిందాబాద్‌, ఆం‌ధ్రమహాసభ జిందాబాద్‌ అనే నినాదాలతో సభను ప్రారంభించారు.

‘‘పల్లెటూరి ప్రజలనంతా, కొల్లగొట్టే నిజామోడా

 కింగ్‌ ‌కోటి మీద రేపే రంగు జండా యెగురులేరా’’

అనే పాటను ఓ బాలిక పాడింది. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి, ‘‘రజాకార్లను గ్రామంలో అడుగుపెట్టనివ్వం’’ అని జనం శపథం చేశారు, ‘‘కలిసి కట్టుగా పని చేస్తామని వాగ్దానం చేశారు, ‘‘నిజాం తొత్తులైన జమిందార్లను ఎదిరిస్తాం’’ అని నినాదం చేశారు. రాత్రి పొద్దు పోయేదాకా పాటలు, పద్యాలు, బుర్రకథలు, ఆటలు, బాగా హుషారుగానే జరిగింది. అక్కడికి కృష్ణమాచారి పుట్టిన గూడూరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరికి ఓ దొర వారున్నారు (జమీందారు). ఈ వార్తలు వేగుల ద్వారా దొరవారికి, రజాకారులకు చేరుతూనే ఉన్నాయి. కృష్ణమాచారి తప్పక గూడూరు వస్తాడు. అక్కడే కడ తేర్చాలని పథకం వేశారు. ఈ రహస్యం ఎవరికీ తెలియదు.

గూడూరు రెండు మైళ్లే కదా! అక్కడ కృష్ణమాచారి తాతయ్య, అమ్మమ్మ ఉన్నారు. చూసి రావచ్చునని బయలుదేరి వెళ్లాడు. భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చి తలుపు తట్టారు ‘‘గిరఫ్తార్‌’’ (అరెస్టు) అన్నారు. వాళ్ల అమ్మమ్మ, తాతయ్య నిర్ఘాంతపోయి, ఘొల్లున ఏడ్చారు. ఆ రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో కటకటాల వెనుక గడిపారు కృష్ణమాచారి.

స్థానిక దొరవారు కృష్ణమాచారిని తీసుకురమ్మని పోలీసులను కోరాడు. ఆ గడీలో చడీచప్పుడు లేకుండా ఖతం చేయాలని వారి కుట్ర. పోలీసులు అందుకు అంగీకరించలేదు. తెల్లవారి అక్కడికి పదిమైళ్ల దూరంలో వున్న నెల్లికుదురు హెడ్‌ ‌పోలీసుష్టేషన్‌కు నడిపించి తీసుకువెళ్లారు. అప్పట్లో యోధులకు చేతులకు బేడీలు, నడుముకు తాడు, తుపాకులతో ఇద్దరు పోలీసులు వెంట నడిచేవారు. నెల్లికుదురు పోలీసు అమీన్‌ (ఇనస్పెక్టర్‌) ‌చాలా క్రూరుడు. కృష్ణమాచారి జేబులు తనిఖీ చేయగా ఎర్ర సిరాతో రాసిన పద్యం దొరికింది, లాక్కున్నాడు. ‘‘విప్లవగీతం రాస్తున్నావా?’’ అన్నాడు. అది విప్లవ గీతమే కాని నాది కాదు సర్‌! ‌మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌గీతానికి అనువాదం, నా స్వంత రచనకాదు’’ అన్నాడు. ఒరిజనల్‌ ‌చదవమంటే చదవగా ‘‘ఇంత విప్లవం ఇక్బాల్‌లో ఉందా?’’ అని ఆశ్చర్య పోయాడు. ‘‘ఉంది, ‘ఇది బార్‌-ఎ-‌జిబ్రాయేల్‌’ అనే ఇక్బాల్‌ ‌కావ్యం లోనిది’’ అన్నారు కృష్ణమాచారి. దానితో చేతులకు బేడీలు తీయించాడు, నడుం తాడు విప్పమన్నాడు. అంతవరకు బాగానే ఉంది… కృష్ణమాచారి ‘‘నన్ను త్వరగా జైలుకు పంపండి’’ అన్నాడు. ‘‘జైలుకు నీ శవం వెడుతుంది, మొదటి దేహశుద్ధి’’ అన్నాడు అమీన్‌. ‌చిత్రహింసలకు అతడు ప్రసిద్ధి. దైవికంగా అతని కూతురు, అల్లుడు వచ్చారు. ఆ గొడవలో పడి కృష్ణమాచారిని మరిచిపోయాడు. కాపలా కాస్తున్న పోలీసులు అలిసిపోయి ఉన్నారు, బావర్చీని (వంటవాడు) మచ్చిక చేసుకుని కబుర్లు చెప్తుంటూ, ఎవరో పిలవడంతో అతడు వెళ్లాడు. ఇదే సరైన సమయం అని కృష్ణమాచారి కస్టడీ నుండి తప్పించుకున్నాడు. పొలాల్లో, నదుల్లో, అడవిలో అలా పరిగెడుతూనే ఉన్నాడు. కొంత తెలిసిన ప్రాంతం గనుక సులువుగా తప్పించుకోగలిగాడు.

ఇంతకీ ఇక్బాల్‌ ‌కవిత ఏమంటే, ‘‘యే పొలమున నిరుపేదకు దొరకదో తిండి… ఆ పొలమున గల పంటను కాల్చేయండి’’ ఈ కవిత అసంకల్పితంగా పెదవుల మీద పలుకుతూనే ఆ పంటపొలాల్లో నుంచి పరుగెత్తి, పరుగెత్తి తప్పించుకోగలిగాడు. తనను ఖతం చేయాలనుకున్న గూడూరు దొరవారిని తీవ్రవాదులు హతమార్చారు. ఇది దైవిక న్యాయం గాక మరేమిటి?

10 సం।।ల తరువాత సారస్వత పరిషత్తు సభలను గురించి ఆంధ్రేతరులు ఏమనుకున్నారో తెలుసుకోవాలంటే ‘‘మరాఠ్వాడా’’ అనే మరాఠీ ద్వైవారపత్రిక సంపాదకీయంలోని కొన్ని పంక్తులను పరిశీలించవచ్చు…

‘‘ఇటీవల జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సభలను గురించిన రిపోర్టు ఈ పత్రికలో ప్రచురించ బడింది. మరాఠీ విద్వాంసులు, మరాఠీ సాహిత్య సంస్థలు మరోసారి ఆంధ్రసభల రిపోర్టును చిత్తగించాలి. ఆంధ్ర సారస్వత పరిషత్తువారి నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. తమ సాహిత్యాన్నీ, సంస్కృతినీ లోకానికి తెలియపరచే పనిలో ఆంధ్రులు సుసంఘటితులుగా పని చేస్తున్నారు. త్వరలో మరాఠీ సాహిత్య పరిషత్తు సభలు జరుగనున్న దృష్ట్యా, వివిధ సంస్థలవారు తమ తమ కార్యకలాపాలను గురించి సింహావలోకనం చేసుకోవాలి. ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ’’

(జనవరి, 15, 1953) ‘‘మరాఠ్వాడా’’ ద్వైవారపత్రిక, హైదరాబాదు.

‘‘లోక్‌ ‌విజయ్‌’’ అనే మరాఠీ వారపత్రిక ఏమి రాసిందో కూడా చిత్తగించండి.

‘‘పట్టుమని పదేళ్లుకాలేదు, ఆంధ్రసారస్వత పరిషత్తు స్థాపించబడి, ఇంత కొద్ది వ్యవధిలో తెలంగాణాలో ఈ సంస్థ శ్లాఘనీయమైన కృషిచేసింది. రెండువందల ముప్పై రెండు శాఖలున్న ఈ పరిషత్తువారు ‘నిర్వహించే పరీక్షలను’ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాథమిక స్థాయి నుంచి పట్టభద్ర స్థాయి వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరే సోదర భాషల పరీక్షలకు ఇంతమంది అభ్యర్థులు వెళ్లడంలేదు. రమారమి పాతిక వేలమంది తెలుగు విద్యార్థులకు డిప్లొమాలు లభించాయి.’’

‘‘తెలుగు కథానికకు అంతర్జాతీయ స్థాయిలో బహుమతి లభించింది. (‘గాలివాన’- శ్రీపాలగుమ్మి పద్మరాజు) దీన్నిబట్టి తెలుగు సాహిత్యం ఎంత అభివృద్ధి చెందిందో అంచనా కట్టవచ్చు.’’

‘‘పోలీసు చర్య తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్ని అన్యభాషల సంస్థలకంటే ముందు నడుస్తున్నది’’

‘‘దేశంలో దారిద్య్రం, ఆకలి ఉన్నంత కాలం ఉత్తమ సాహిత్యం సృష్టించ బడజాలదు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అన్నారు. (ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ ‌పత్రిక (జనవరి,13, 1953)

‘‘శ్రీ రాధాకృష్ణన్‌గారి దర్శనం కోసం నిరీక్షిస్తున్న సభాసదుల సందడి చెప్పనలవిగాకుండెను. వారు వచ్చిన తరువాత సభ ప్రారంభించగానే, ఇరవై అయిదు వేల జనమున్నూ గొప్ప శిక్షణకు లోబడినట్లుగా నిశ్శబ్దంగా నుండిరి. శ్రీ రాధాకృష్ణన్‌ ‌గారు తెలుగులో రచితమైన తమ ప్రారంభోపన్యాసం చదువుతూ ఉన్నప్పుడు సభాస్థలమంతా ఆనంద ముతో నిండియుండెను. అందులో – వారు, మాతృ భాషయెడ గౌరవం, తెలుగుభాష యెడ ఆదరం, సంస్కృతి వికాసమునకు గల ప్రాధాన్యం, సాహిత్యాభి వృద్ధికి కడుపునిండా తిండి యుండవలసిన ఆవశ్యకత నొక్కి చెప్పినప్పుడు వారి మాటలు శ్రోతలకు కర్ణరసాయనముగా వినబడినవి’’. డాక్టర్‌ ‌గిడుగు సీతాపతిగారి అభిప్రాయం : (ఆంధప్రభ 1953 జనవరి 25).

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE