పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు హింస ప్రజ్వరిల్లింది. బెంగాల్‌లో హింస కొత్త కాదు. గతంలో లెఫ్ట్ ప్రభుత్వంలో గానీ, ఇప్పుడు మమత హయాంలో గానీ శాంతిభద్రతలు అదుపు తప్పటం అక్కడ సర్వసాధారణ విషయం. అయితే గమనించాల్సిన విషయం ఏమంటే పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా.. అందుకు దీదీ తప్పుపట్టేది బీజేపీనే. ఇది కూడా సర్వసాధారణ విషయంగానే మారింది.
హింస అనే మృగం మళ్లీ పశ్చిమ బెంగాల్ పైన విరుచుకుపడింది. పంచాయతీ ఎన్నికల వేళ అది జూలు విదిల్చి తన ప్రతాపం చూపింది. ఒకటి కాదు, రెండు కాదు పదుల సంఖ్యలో దాడులు జరిగాయి. వాటి వివరాలు ఓ సారి గమనిద్దాం.
ప్రధాన సంఘటనల వివరాలు
- జూన్ 12న సౌత్ 24 పరగణాస్, ముర్షీదా బాద్‌లో హింస చెలరేగింది. ముర్షీదాబాద్‌లోని రతన్‌పూర్ గ్రామంలో ఫూల్‌చంద్ షేక్ అనే కాంగ్రెస్ కార్యకర్తను కాల్చి చంపారు. టీఎంసీ కార్యకర్తలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తే, తృణమూల్ కాంగ్రెస్ దాన్ని తిప్పికొట్టింది. వ్యక్తిగత మైన స్పర్ధలే ఇందుకు కారణమని ఆరోపించింది.
- జూన్ 10న తమను నామినేషన్లు వేయ కుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) శ్రేణులు ఆరో పించాయి. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసులో ఒక ఉద్యోగిని టీఎంసీకి చెందిన ఓ గుంపు చితకబాదింది. అతను ప్రత్యర్థి పార్టీకి నామినేషన్ పేపర్లు పంచుతున్నాడని ఆరోపించింది.
- బంకు, పుర్బా, పశ్చిమ బర్ధామన్, బీర్భూమి జిల్లాల్లో అధికార టీఎంసీ కార్యకర్తలకు, ప్రతిపక్షాల కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
- జూన్ 12న సోనాముఖీలో బీజేపీ ఎమ్మెల్యే దిబాకర్ ఘరామీని లక్ష్యంగా చేసుకుని కొందరు దాడి చేశారు. నామినేషన్ సెంటర్ బయటే ఈ దాడి చోటుచేసుకుంది.
- మరో బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని బెంగాల్ పోలీసులు హుగ్లీ నామినేషన్ సెంటర్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. తనను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్న అధికారులతో ఛటర్జీ వాదనకు దిగటానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యింది.
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల జరిగాయి. కొన్ని చోట్లనైతే టీఎంసీ గూండాలు రెచ్చిపోయి ప్రవర్తిం చారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన ఘటనలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. హింసాత్మక సంఘటనల కోసం టీఎంసీ కొందరు కార్యకర్తలను ప్రత్యేకంగా నియమించుకుంటుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ కార్యాల యాల మీద దాడి చేసి, ధ్వంసం చేయడమే వారి పని. ఎన్నికల వేళ ప్రతిపక్ష కార్యకర్తలకు వీరు తుపాకులు, కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారని చెబుతున్నారు.
తాజా ఘటనలపై బీజేపీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఘాటు గానే స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తోందని ఆరోపించారు. బెంగాల్‌లో జంగిల్ రాజ్ నడుస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి కూడా స్పందించారు. ఇంత జరుగుతున్నా మమత ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని మండి పడ్డారు. ఎన్నికల వేళ కేంద్ర బలగాలను మోహ రించాలని కోరారు.
బెంగాల్ ‘హింస’ను తక్కువ చేసే ప్రయత్నం చేశారు టీఎంసీ నేత సౌగత్ రాయ్. ‘ఒకే ఒక్క వ్యక్తి చనిపోయాడు. పెద్దగా హింస చెలరేగిన దాఖలాలు లేవు. అదేమంత పెద్ద హింస కాదు. మీడియా, ప్రతిపక్షాలు కావాలనే దాన్ని పెద్దవిగా చేయటానికి ప్రయత్నిస్తున్నాయి’ ఆయన తేలికగా కొట్టిపారేశారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసను ఏ మాత్రం సహించేది లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నేతలంతా ఆయనను కలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు జోక్యం చేసుకో వాలని, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలను ఒకే దశలో జూలై 8వ తేదీన నిర్వహిస్తారు. ఫలితాలను 11వ తేదీన ప్రకటిస్తారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జూన్ 9వ తేదీన ప్రారంభమై 15వ తేదీ వరకూ కొనసాగింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా సాగటానికి రాష్ట్రవ్యాప్తంగా భద్రతా దళాలను నియమించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అక్కడ అది మామూలే!
ఎన్నికల వేళ హింస చెలరేగటం బెంగాల్లో సర్వసాధారణమైన విషయం. కమ్యూనిస్టులు రాజ్యమేలుతున్నప్పటి నుంచి ఈ పరిస్థితి ఉంది. 2011లో అధికారాన్ని చేజిక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది అంతే. 2018 పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింసలో 13 మంది మృత్యువాత పడ్డారు. ఎంతోమంది గాయపడ్డారు. అలాగే విధ్వంసాలు, బాంబుదాడులు, బ్యాలెట్ బాక్సులకు నిప్పుపెట్టటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. ఈ హత్యలపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై కనీసం నోరు విప్పలేదు. బీజేపీలోని కీలక కార్యకర్తలను హతమార్చాలన్నదే దీదీ ప్రయత్న మని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. బెంగాల్‌లో బీజేపీని ఎదగకుండా చెయ్యాలనే ఇదంతా చేస్తున్నారని అప్పట్లో బీజేపీ నేత నిర్మల్ కేసరి ప్రభుత్వం ఘాటైన విమర్శలు గుప్పించారు. తృణమూల్ నేత అనుబ్రత్ మండల్ ఆ ఆరోపణలను ఖండించారు. ఈయన మమతా బెనర్జీకి సన్నిహితుడనే పేరుంది.
కాంగ్రెస్‌తో సయోధ్య నీటి మీద రాతేనా?
నిన్న గాక మొన్న పట్నాలో ప్రతిపక్షాల కూటమి సమావేశమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించేందుకు వ్యూహాలు రూపొం దించుకున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌తో అంతగా పొసగని మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. రాహుల్‌తో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమై పోరాడతాయని స్పష్టంచేశారు. పట్నా నుంచి చరిత్ర మొదలవుతుందని, చరిత్ర తిరగరాయాలని కోరకుంటున్న కాషాయ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు. ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే పట్నా సమావేశం ముగిసి ఎన్నో రోజులు కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ (గూండాలు) కార్యకర్తలు.. తాజాగా ఓ కాంగ్రెస్ కార్యకర్తను హతమార్చారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఒకర్నొకరు దూషించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు సందర్భంగా రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కష్టమనే అభిప్రాయం కలుగుతోంది. దీదీ మాటలు నీటి మీద రాతలేనా? కాంగ్రెస్‌తో చెలిమి మాటలకే పరిమితమా? అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు, సీనియర్ జర్నలిస్ట్