– ఎస్‌ ‌గురుమూర్తి

భారత రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తులతో అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్షం వేసిన ప్రతి ఎత్తుగడనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో చిత్తు చేస్తూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా అయినా ప్రధాని మోదీకి చెక్‌ ‌పెట్టాలన్న ఉద్దేశంతో కొద్దిరోజుల కిందట ప్రతిపక్ష పార్టీలన్నీ పాట్నాలో సమావేశం పెట్టుకుని, తమ ఐక్యతను చాటిన కొద్ది రోజులకే ప్రధాని వారికి తిరుగులేని సవాలును విసిరారు. అదే, యూసీసీగా చెప్పుకుంటున్న ఉమ్మడి పౌరస్మృతి ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఒక తాత్విక సవాలు కూడా. కాగా, ఇది పాట్నాలో కలుసుకున్న 15 రాజకీయ పార్టీలూ మూడు గ్రూపులుగా విడిపోయేలా చేసింది. ఒక గ్రూపు యూసీసీని పూర్తిగా వ్యతిరేకిస్తుండగా, రెండవ బృందం దానికి మద్దతు ప్రకటిస్తుండగా, మూడవ జట్టు మద్దతుపలకాలా, వ్యతిరేకించాలా అనే మీమాంసలో పడి అయోమయంలో కొట్టు మిట్టాడుతోంది. అయితే, ఒక విషయం మాత్రం సుస్పష్టంగా చెప్పుకోవలసి ఉంది. ప్రధాని యూసీసీ భావన అన్నది కేవలం ప్రతిపక్షాలను విభజించాలన్న ఉద్దేశంతో ప్రతిపాదించింది కాదని, లోతుగా ఆలోచించి చేసినదని అనిపిస్తుంది. యుసిసికి మద్దతు ఇవ్వకపోవడం అంటే దేశ విభజనకు ముందు బ్రిటిష్‌వారు 1937లో ఆమోదించిన షరియ చట్టాన్ని సమర్థించడమే అన్న విషయం ఆయనకు తెలుసు. యూసీసీ అన్నది స్వచ్ఛమైన పలకమీద రాయడం కష్టం. దానిని 1937 చట్టాన్ని సరిదిద్దడమే. ప్రస్తుత రాజకీయ నాయకులు 1937 షరియా చట్టం, దాని నేపథ్య విషయంలో పూర్తి నిరక్షర కుక్షుల్లా కనిపిస్తున్నారు. ఒకవేళ 1937 చట్టం వెనుక ఉన్న నీచపు కథను మోదీ గుర్తు చేస్తే, అది ప్రతిపక్షాలను పూర్తిగా ధ్వంసం చేసేంత శక్తిమంత మైన రహస్యాలను బట్టబయలు చేస్తుంది. ఈ చట్టపు కథను గుర్తు చేసుకోవడం అంటే, విభజన ముందస్తు భారతదేశాన్ని పునఃస్థాపించడమే. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు కూడా అదేలా కనిపిస్తోంది.

కథ తర్వాత క్లైమాక్సే ముందు…

సుదీర్ఘ కథను తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు నేరుగా క్లైమాక్స్‌కు వెళ్ళిపోదాం. 1937కు ముందు ముస్లింలు అనుసరించింది, పాటించింది, ప్రభుత్వం కూడా అనుసరించింది షరియాను హిందూ చట్టాలను… మరొక్కసారి చెప్పుకుందాం – హిందూ చట్టాలను మాత్రమే. భారతదేశవ్యాప్తంగా అన్ని శాఖలకు చెందిన ముస్లింలూ క్రోడీకరించని స్థానిక హిందూ సంప్రదాయాలను, ఆచారాలను అనుసరించేవారు. భారతదేశాన్ని హిందువులూ, ముస్లింలుగా విభజించాలనే పట్టుదలతో ఉన్న బ్రిటిష్‌వారికి, గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌నుంచి ముస్లింలను ఆకర్షించాలని తహతహలాడుతున్న ముస్లిం లీగ్‌కు మధ్య జరిగిన ఇరుపక్షాలకూ లాభకరమైన ఒప్పందమే ఈ 1937 షరియా చట్టం. స్థానిక హిందూ సంప్రదాయాలు, ఆచారాల ద్వారా హిందువులతో పూర్తిగా కలిసిపోయిన ముస్లింలను మొదటగా వారి నుంచి దూరం చేసి, హిందూ వ్యతిరేక ఇస్లామిక్‌ అస్తిత్వాన్ని వారికి సృష్టించి, అంతిమంగా భారత విభజనకు మార్గాన్ని సుగమం చేయడం లీగ్‌ ఉద్దేశ్యం.

ముస్లిం లీగ్‌ ‌రహస్య లక్ష్యానికి బ్రిటిష్‌ ‌వారు ఆజ్యం పోస్తూ, లీగ్‌ ‌ప్రతిపాదించిన 1937 చట్టానికి అంగీకారం తెలిపారు. ఈ 1937 చట్టం మిషన్‌లో ఇతర రహస్యమైన, నీచమైన పిట్ట కథలు కూడా ఉన్నాయి. అటు బ్రిటిష్‌, ఇటు లీగ్‌ ఉమ్మడి వ్యూహమైన 1937 చట్టంలో ఇస్లామిక్‌ ‌షరియాను విధ్వంసం చేసే నిబంధనలు ఉన్నాయి. ఎలా? షరియా చేసే కీడు నుంచి జిన్నాను, జమిందార్లను, ముస్లిం నాయకులను కాపాడి, వారి ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు 1937 చట్టంలోకి హిందూ సంప్రదాయాలను, ఆచారాలను రహస్యంగా దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం పవిత్ర ఇస్లాం చట్టంగా కీర్తిస్తున్న 1937 షరియా చట్టంలో లీగ్‌ ‌నాయకుల ఆస్తి హక్కులను కాపాడే హిందూ చట్ట నిబంధనలు ఉన్నాయా? అవును! ఉన్నాయి. నిజానికి, ఇది 1,000 సంవత్సరాల నేపథ్యం కలిగిన విస్ఫోటక కథ.

1000 ఏళ్లపాటు ఉనికిలో లేని షరియా!

భారతదేశాంలోకి 7వ శతాబ్దంలో వాణిజ్యం ద్వారాను, 8వ శతాబ్దంలో కాసీంలు, ఘజ్నీల వంటివారి కత్తుల ద్వారాను ఇస్లాం ప్రవేశించింది. పదవ శతాబ్దం నాటికి అది భారతదేశంలోని అత్యధిక భాగాలకు విస్తరించింది.

ఇస్లాంలో మార్పులేని భాగమని ఇప్పుడు ఇస్లామిస్టులు వాదిస్తున్న షరియాను భారతదేశంలోని కపట ఇస్లాంవాదుల కోసం ఎప్పుడు చట్టంగా చేశారు? ఎవరైనా ఊహించగలరా? కాదు, 11వ శతాబ్దంలోకాదు, కనీసం 12లో లేదా 13వ శతాబ్దంలో లేక 14వ, 15వ, 16వ లేక 17వ, ఇంకా మాట్లాడితే, ఇస్లాం రాజుల పాలన అంతమైన కాలమై, అధికారం తొలుత హిందువులైన మారాఠాలకు తర్వాత బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్లిన 18వ శతాబ్దంలో కూడా కాదు. బ్రిటిష్‌పాలన వేళ్లూనుకొని, విస్తరిస్తున్న 19వ శతాబ్దంలో కూడా కాదు. మరి అయితే ఎప్పటి నుంచి?

ఇస్లాం మతం పుచ్చుకున్న వా కోసం షరియా చట్టాన్ని చేయకుండానే అత్యంత ప్రచండమైన మొగల్‌ ‌పాలకుడైన ఔరంగజేబు మరణించిన నూట పాతికేళ్లకు పైబడిన కాలం తర్వాత 1937లో ఈ చట్టం వచ్చింది. నాటి మతం పుచ్చుకున్న వారు షరియా కన్నా అప్పటికి ఉనికిలో ఉన్న స్థానిక అంటే హిందూ ఆచార, సంప్రదాయాలను ఆమోదించి, అనుసరించడాన్ని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం గుర్తించింది. భారతీయ ముస్లిం వర్గాలలో వారసత్వ వ్యవహారాలలో అప్పటివరకూ అనుసరిస్తున్న ఆచార, వ్యవహారాలకు బ్రిటిష్‌వారు బలాన్ని ఇచ్చారని ‘ది హిస్టరీ ఆఫ్‌ ఎవల్యూషన్‌ ఆఫ్‌ ‌ముస్లిం పర్సన్‌ ‌లా ఇన్‌ ఇం‌డియా’ పుస్తక రచయిత కె.కె. అబ్దుల్‌ ‌రెహ్మాన్‌ (1986) ‌పేర్కొన్నారు.

గుప్త రాజకీయ అజెండా, రహస్య ఆర్థిక అజెండా

అటువంటప్పుడు షరియా కోసం 1937లో హఠాత్‌ ‌ప్రయత్నం ఎందుకు? ఈ ప్రశ్నకు అనుబంధంగా మరొక రెండు ప్రశ్నలు తలెత్తుతాయి: మొదటిది, దాదాపు 1,000 సంవత్సరాల కాలం షరియా చట్టం గురించి ఆలోచించని ముస్లిం మతం పుచ్చుకున్నవారు, తమంతట తాముగా షరియా చట్టాన్ని ఎందుకు డిమాండ్‌ ‌చేస్తున్నారు? లేదా, దాదాపు రెండు దశాబ్దాల కాలంపాటు భారత్‌ను పాలించిన బ్రిటిష్‌ ‌పాలకులు, హిందూ- ముస్లిం ఐక్యతకు ఏదో ఒకరకంగా విఘాతం కలిగించే సుదీర్ఘ పరిణామాలు కలిగిన షరియా గురించి అకస్మాత్తుగా ఆలోచించారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానంగా, 1937 చట్టం అన్నది ముస్లిం లీగ్‌కు (అంటే ముస్లింలకు కాదు), బ్రిటిష్‌ ‌వారికీ మధ్య జరిగిన ఒప్పందం వాస్తవం వెలుగులోకి వస్తుంది. మొదటగా, మతం పుచ్చుకున్నవారు షరియాను కోరలేదు. ఆ కోరిక కోరింది ముస్లిం లీగ్‌. ‌తమ పాలనను కొనసాగించుకోవాలన్న కోరిక కలిగిన బ్రిటిష్‌ ‌వారికి హిందూ, ముస్లింలను విభజించాలనే గుప్త అజెండా ఎప్పుడూ ఉండేది. షరియాను డిమాండ్‌ ‌చేసిన లీగ్‌ ‌నాయకులకు దేశాన్ని భజించాలన్న రహస్య రాజకీయ అజెండాతో పాటుగా తమ ఆస్తి హక్కులను కాపాడుకునేందుకు హిందూ చట్టాన్ని రహస్యంగా నిలుపుకోవడం ద్వారా షరియా నుంచి తప్పించుకునే వ్యక్తిగత ఆర్ధిక అజెండా ఉంది. ఇప్పుడు, 1937 షరియాను చూద్దాం. అది పూర్తి చట్టం కాదన్నది సుస్పష్టమే. 1937 చట్టం అన్నది చట్టబద్ధమైన ఇస్లామిక్‌ ‌చట్టమే కాదు, అందులోకి రహస్యంగా తరలించిన హిందూ చట్టం కొనసాగింపుల మేళవింపు. లీగ్‌ ‌నాయకులు ఒక బాణంతో రెండు పిట్టలను కొట్టారు. మొదటగా, హిందూ సాంప్రదాయాలు, అలవాట్లు చట్టాలలో మమేకమైపోయిన భారతీయ ముస్లింలను మానసికంగా వేరు చేయడమే కాదు, కాలక్రమంలో జరుగనున్న దేశవిభజనకు వారిని సంసిద్ధం చేశారు. రెండవది, వారు షరియా నుంచి తప్పించుకోవడమే కాదు, సంప్రదాయ హిందూ చట్టాల కింద సంపన్నమైన, శక్తిమంతమైన ముస్లిం లీగ్‌ ‌నాయకులు వారసత్వ సంపదను అనుభవిస్తూ తమ ఆర్ధిక బలాన్ని పరిరక్షించుకున్నారు. అది కేవలం భారతదేశం, హిందువులకు వ్యతిరేకమైన కుట్ర మాత్రమే కాదు, సాధారణ ముస్లిం ప్రజానీకానికి వ్యతిరేకమైన కుట్ర కూడా.

షరియాలోకి హిందూ చట్టం అక్రమ రవాణా

మతం పుచ్చుకున్నవారు అనుసరిస్తున్న సంప్రదాయ హిందూ చ్టం స్థానంలో వారిపై షరియాలోని అనేక నిబంధనలను రుద్ది వారిచేత అనుసరింప చేసేందుకు 1937 చట్టంలోని కీలక భాగంలో కేవలం 92 పదాలను మాత్రమే ఉపయో గించారు. 1937లోని ఈ 92 పదాలనే ముస్లింలు అతిక్రమించలేని దైవికమైన, మార్పులేని ఇస్లామిక్‌ ‌చట్టంగా భావించి, వాదిస్తున్నారు.

కానీ, 1937 షరియా చట్టమే, నిజంగా ముస్లింలకు నిర్దేశించిన దైవిక షరియా చ్టమా? కాదు. అది వాస్తవానికి ఇస్లామిక్‌ ‌షరియాకు వ్యతిరేకం, అలాగే కొనసాగుతున్నది కూడా. ఎందుకు? హిందూ చట్టం ప్రదానం చేసే మూడు కీలక హక్కులను అది షరియత్‌లోకి అక్రమంగా రవాణా చేసుకుంది. హిందువులలాగానే, నచ్చినవారికి, పిల్లలకు తమ ఆస్తులకు సంబంధించి వీలునామాలు రాసేందుకు ముస్లింలకు 1937 చట్టం అనుమతిస్తుంది. అయితే, ఇస్లాంలో నిషిద్ధం! రెండవది, అది నాడు, నేడూ కూడా విలువైన ఆస్తి అయిన వ్యవసాయ భూమికి మినహాయింపును ఇచ్చి, ముస్లింలపై హిందూ రుషులు ప్రతిపాదించిన చట్టాలు అనువర్తితం కావడాన్ని కొనసాగించింది. మూడవది, ఇస్లామిక్‌ ‌చట్టం, ప్రవక్త నిషేధించిన దత్తతను హిందువులలాగే, పిల్లలు లేని ముస్లింలు కూడా చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్వచ్ఛమైన ఇస్లామిక్‌ ‌ధర్మశాస్త్రం దృష్టిలో చూస్తే, 1937 చట్టం ఖురాన్‌ ‌వ్యతిరేకమే కాదు, ఇస్లాంలో దైవదూషణ కూడా. 1937 షరియత్‌ ‌చట్టంలోకి హిందూ చట్టాన్ని రహస్యంగా తరలించడం ద్వారా ఎవరు లబ్ధి పొందారు?

జిన్నాకు, జమిందార్లకు హిందూ చట్టం ; సాధారణ ముస్లింలకు షరియా

తమ ఆస్తులకు సంబంధించి వీలునామాలు రాసే హక్కుకు షరియాలో అనుమతి లేదు. దీనిని తొలుత తన కోసం వ్యక్తిగత ఒప్పందంగా 1937లోకి అక్రమంగా చొప్పించేందుకు జిన్నా చర్చించాడు. తనకున్న భారీ ఎస్టేట్‌ను షరియా ప్రకారం కాకుండా తనకు నచ్చినవారికి బదిలీ చేయాలని జిన్నా భావించాడు. కాగా, 1937 చట్టం వచ్చిన రెండేళ్ల తర్వాత, అంటే 1939 మే 30న ముస్లిమేతరుడు, పార్సీ అయిన వ్యక్తిని వివాహం చేసుకున్న తన కుమార్తె దీనాకు వారసత్వ హక్కు లేకుండా చేసేందుకు జిన్నా వీలునామా రాసాడు. ఆయనకున్న ఏకైక వారసురాలిగా, షరియా కింద మొత్తం ఎస్టేట్‌ను ఆమె పొందవచ్చు. అయితే, తన కుమార్తె దీనాకు వారసత్వ హక్కు లేకుండా చేయాలని జిన్నా భావించాడన్న విషయాన్ని ఆయన స్నేహితుడు, ప్రముఖ న్యాయమూర్తి, న్యాయనిపుణుడు ఎం.సి. చాగ్లా ధృవీకరించారు. అందుకే, తన సోదరి ఫాతిమాకు తన వీలునామా రాస్తూ, ముంబైలోని ప్రతిష్ఠాత్మకమైన మలబార్‌ ‌హిల్స్ ‌ప్రాంతంలో ప్రస్తుం రూ.1,000 కోట్లఉ విలువ చేసే 2.5 ఎకరాలలో విస్తరించిన భారీ బంగ్లాతో సహా స్థిర, చరాస్తుల నన్నింటినీ సంక్రమింపచేశాడు. వారసత్వ హక్కులు లేని దీనాకు కొద్దిపాటి ఏడాదికి కొంత మొత్తాన్ని ఇస్తూ, ధార్మిక సదుపాయాలను కల్పించేందుకు అనేక అంశాలను అందులో పొందుపరిచాడు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీనా పుట్టింది ఒక పార్సీ మహిళకు కావడం. ఆమెను వివాహం చేసుకున్న జిన్నా ఆమెను ఇస్లాం మతం స్వీకరింపచేశాడు. ఇక 1937 చట్టంలో రెండు షరియా అతిక్రమణలు – వ్యవసాయ భూములను మినహాయించడం, దత్తత తీసుకునేందుకు అనుమతించడం అన్నవి ముస్లిం లీగ్‌కు వెన్నుముకగా ఉన్న జమిందార్లు, ఆస్తులు కలిగిన సంపన్నుల కోసం రూపొందించి, చేసినవే. వ్యవసాయ భూములను మినహాయించడం అన్నది హిందూ చట్టంలో లాగానే అది మగవారసుల చేతుల్లో ఉండేలా చూడటమే కాదు, షరియా ప్రకారం అందులో సెంటు భూమి కూడా దక్కకుండా అయింది. అలాగే, జమిందార్లు, ఇతరులు కూడా హిందువుల లాగానే మగపిల్లలను దత్తత చేసుకునేందుకు అవకాశమివ్వడమే కాక షరియా ప్రకారం ఆస్తిలో మరొక మగవారసుడు కోరకుండా ఉండేందుకు దత్తత చేసుకునే హక్కును పొందు పరిచారు. సాధారణ ముస్లింలకు 1937 చట్టమే షరియా, కాని జిన్నాకు, జమిందార్లకు హిందూ చట్టం.

ఇస్లాంకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్న నాయకులు

1937 షరియత్‌ ‌చట్టంలోకి షరియా వ్యతిరేక హిందూ చట్టాన్ని అక్రమంగా ప్రవేశపెట్టాలని ఎవరు పట్టుబట్టి ఉంటారు? బ్రిటిష్‌ ‌వారు అయితే అయి ఉండరు.

ముస్లింలకు దత్తత చేసుకునే హక్కు ఉండాలని లేదా ఆస్తులకు వీలునామా రాసే హక్కు లేదా 1937 చట్టం పరిధి నుంచి వ్యవసాయ భూములను మినహాయించడం కోసం వారు ఎందుకు పట్టుబడతారు? 1937 చట్టంలోకి హిందూ చట్టాన్ని రహస్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఎవరు లబ్ధిపొందారు? లీగ్‌ ‌నాయకులు పొందారు తప్ప బ్రిటిష్‌వారు కాదు. తమ కోసం హిందూ చట్టాన్ని కొనసాగించాలని పట్టుబట్టి, బ్రిటిష్‌వారితో ఒప్పందం చేసుకున్నవారు దాని నుంచి లబ్ధి పొందేవారు అయి ఉంటారని చెప్పడానికి ఏ రుషి, ముని అవసరం లేదు.

1937 షరియా చట్టం ముస్లింల చట్టమని, దానిని పార్లమెంటు కూడా తాకరానిదంటూ కప్పులెక్కి కేకలేసిన వారంతా, ఇస్లామిక్‌ ‌రాజకీయాల కోసం ఉద్దేశించిన షరియా చట్టమే 1937 చట్టమనే విషయాన్ని జిన్నా, జమిందార్ల ఆర్ధిక అవసరాల కోసం ఉద్దేశించిన హిందూ చట్టమనే అంశాన్ని కాదనగలరా? బ్రిటిషు వారితో చేసుకున్న ఒప్పందం ద్వారా షరియాలోకి అక్రమంగా హిందూ చట్టాన్ని తీసుకువచ్చి తమ ఆస్తిపాస్తులను కాపాడుకున్న లీగ్‌ ‌నాయకులు, ముస్లింలలో మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టారు.

కేవలం 10 సంవత్సరాలలోనే 1937 షరియా చట్టం, హిందూ, ముస్లింల సామాజిక మేళవింపును విచ్ఛిన్నం చేసి, వారిని విభజించి, ముస్లిం అస్తిత్వాన్ని ఘనీభవింపచేసి, 1947లో వాస్తవరూపం దాల్చిన విభజన డిమాండ్‌ను 1940ల్లో పెట్టించింది.

‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌నుంచి

వ్యాసకర్త: ‘తుగ్లక్‌’ ‌సంపాదకులు, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల విశ్లేషకుడు

About Author

By editor

Twitter
YOUTUBE