– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన రూ. 7,14,891 కోట్ల అప్పుతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గత అప్పులతో కలిపి ఇది రూ. 10.77 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది కూడా మరో రూ.33 వేల కోట్ల అప్పులు చేసే పరిస్థితి ఉంది. అంటే 11 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై ఉందన్నమాట. ఈ రుణాలకు ఏటా రూ.50 వేల కోట్లు వడ్డీ చెల్లించాలి. రాష్ట్రానికి వివిధ రూపాల్లో 1.25 లక్షల కోట్లు ఆదాయం వస్తున్నా ఇంత అప్పు ఎందుకు చేశారనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రశ్నకు సమాధానం రావడం లేదు.

వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు. పోనీ ప్రజలన్నా సంతోషంగా ఉన్నారా? అంటే అదీ లేదు. ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలతో వారిని తీవ్రంగా బాధిస్తోంది. పెరిగిన ధరలు, కరెంటు ఛార్జీలు, పన్నులతో ఆర్ధిక భారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పోవడంతో ప్రజలు మరింత పేదరికంలో కూరుకు పోయి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆంధప్రదేశ్‌ అప్పుల భారం మోయలేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రంగా నిలువ నుంది. దేశాన్ని అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలపాలనే ప్రధాని నరేంద్రమోదీ సంకల్పానికి ఏపీ పాలన ఒక అవరోధం కానుంది.

అప్పుల కుప్పం

 రాష్ట్ర విభజన నాటికి రూ.97 వేల కోట్ల రుణం ఉంది. అది ఇప్పటికి రూ.10.77 లక్షల కోట్లకు చేరింది. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రూ.2.65,365 కోట్లు అప్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.7,14,891 కోట్లు. భారతీయ రిజర్వ్ ‌బ్యాంకు ద్వారా అధికారికంగా చేసిన అప్పు రూ.2లక్షల 39వేల 716 కోట్లు కాగా, అనధికారిక అప్పు రూ.4లక్షల వేల కోట్లుగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యంపై రానున్న ఆదాయాన్ని చూపి 9.62 శాతం వడ్డీపై 8వేల 305 కోట్లు అప్పుగా తెచ్చారు. వివిధవర్గాల సంక్షేమానికి అంటూ ఏర్పాటు చేసిన కార్పోరేషన్లను చూపించి రూ. 98వేల 603 కోట్లు అప్పు చేశారు.

కలెక్టరేట్లు సహా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. రాష్ట్రానికి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం రూ.90 వేల కోట్లు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా శాతాన్ని పెంచి రాష్ట్రానికి రూ.35 వేల కోట్లు ఇస్తోంది. మొత్తం రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. సంక్షేమం కోసం రూ.2.50 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు చెబుతున్న రాష్ట్ర నాయకత్వం మిగిలిన రూ. 4.75 లక్షల కోట్లతో ఏం చేసిందో ఎవరీకీ చెప్పడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగు తున్నాయి. నాలుగేళ్లలో చేసిన అప్పు ఎంత? పథ కాలపై ఖర్చు చేసింది ఎంత? అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

తెచ్చిన నిధులేవి?

రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,14,891 కోట్ల అప్పు చేసినా వాటితో రాష్ట్రంలో జరిగిన పనులు ఏమైనా ఉన్నాయా అంటే భూతద్దంలో వెదికినా కనిపించడం లేదు. గ్రామీణ, పట్టణ, జిల్లా రహదార్లు మొత్తం ధ్వంసమైపోయాయి. కొత్త రోడ్లను వేయడం అటుంచి కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులు, కల్వర్టులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు, కొత్త రైల్వే లైన్లు… ఇలా ప్రభుత్వం ఏ పనీ చేయలేదు. కేందప్రభుత్వం ప్రధాని ఆవాస్‌ ‌యోజన కింద నిర్మించే ఇళ్లకు ఆర్థిక సహకారాన్ని అందించడం లేదు. మున్సిపాలీటీలు, కార్పొరేషన్లలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాంట్రాక్టర్లకు పాతబకాయిలు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సుమారు రూ. 70 వేలకోట్ల వరకు బకాయిలు ఉండవచ్చనేది అంచనా. ఒకటి రెండు బిల్లులు చెల్లిస్తా రనుకుంటే, దానికి భారీగా కమీషన్లు ఆశించడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమ గోడు ఎంత వెళ్లబోసుకున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన రూ.7.14 లక్షల కోట్లలో సంక్షేమానికి పోను మిగతా రూ. 4.75 లక్షల కోట్లు దేనికి ఖర్చుచేశారనేది ప్రశ్నార్ధకం. అక్కడక్కడ కట్టిన కొన్ని పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన పనులే.

పంచాయతీ నిధులు దారి మళ్లింపు

సర్పంచుల ఖాతాల్లో వేసిన నిధులను మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో రూ. 8వేల 660 కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కేంద్రం పంచాయ తీలకు ఇచ్చిన రూ. 2వేల 20 కోట్లనూ దారి మళ్లించ డంపై మండిపడుతున్నారు. విద్యుత్‌ ‌బకాయిల పేరుతో పంచాయతీలలో ఉన్న నిధులు కూడా తీసుకోవాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. 1984 నుంచి పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నారని, ఇప్పుడు పంచాయతీలు విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాలని వైసీపీ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని సర్పంచులు అంటున్నారు. స్థానిక సంస్థల పరిపుష్టికి చేయుత•నివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను డబ్బుల కోసం వేధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడంతో అభివృద్ధి పనుల మాట అటుంచి వీధి లైట్లు మార్చ డానికి, కొళాయిల మరమ్మతులను కూడా చేపట్టలేక పోతున్నామని, కనీసం పారిశుధ్య కార్మికులకు వేత నాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చే సిందని, తమను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఉన్న తమకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసిందని సర్పంచుల అభిప్రాయం. వాలంటీర్‌, ‌సచివాలయ వ్యవస్థలు వచ్చిన తర్వాత తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారామని అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న తమకు, వాలంటీర్‌కు ఉన్న గౌరవం కూడా దక్కడం లేదని అంటున్నారు.

సర్పంచ్‌లతో కలిసి బీజేపీ ఉద్యమం

పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, దారి మళ్లించిన నిధులను తక్షణం పంచాయతీలకు జమచేయాలని బీజేపీ డిమాండ్‌ ‌చేసింది. గ్రామాలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించింది. పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి తీరును నిలదీసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యపై గట్టిగా పోరాటం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో జోనల్‌ ‌సమావేశాలు ఏర్పాటుచేసి పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపే కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో ఆమె ప్రారంభించారు. రాయలసీమ జోనల్‌ ‌పరిధిలోని నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీల నిధుల అంశంపై చర్చించారు. డెబ్భై ఐదేళ్లలో ఎప్పుడూ పంచాయతీలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదని ఆవేదన చెందారు. పంచాయతీల పరిపుష్టికి కేంద్రం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా వాడుకుంటుంది. సర్పంచులు చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని ప్రశ్నించారు.

ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ప్రతి మండలం నుంచి వందమందికి తగ్గకుండా జిల్లాకు 5 వేల మంది చొప్పున కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆగస్టు10న చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఏడాది పల్లెప్రగతికి కేంద్రం ఇవ్వబోయే నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి జమ అయ్యేలా కేంద్ర పెద్దలతో తాను మాట్లాడతానని పురందేశ్వరి చెప్పారు.

  • ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE