– కె.కె. భాగ్యశ్రీ
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘అబ్బబ్బా.. ఇందాకటినుంచీ వింటున్నా.. ఏమిటమ్మా అంతంత శబ్దాలు! ఓ పక్క చెవులు చిల్లులు పడేలా కుక్కర్ మోతలు.. మరోపక్క ‘బ్ర’మని మిక్సీ చప్పుళ్లు. ఇవి చాలనట్లు మధ్యమధ్య నువ్వు-నాన్న పెద్దగొంతుతో పోట్లాడుకోవడాలు. మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనీరా?’’ గదిలో నుంచి బయటకొచ్చి కస్సు బుస్సులాడుతున్న పవన్‌వైపు కోపంగా చూసింది లలిత.
‘‘అవునుమరి! ఎక్కడుండాల్సినది అక్కడే ఉంటే బాగుండేది. ఆఫీసు ఇంటికి వస్తే ఇలాగే ఉంటుంది! మేము వచ్చి మీ ఆఫీసులో ఇంటి పనులు చేసుకుంటా మంటే మీ ఆఫీసువాళ్లు ఒప్పుకుంటారా?’’ వెట కారంగా బదులిచ్చింది.
‘‘నువ్వు అంత ఎగతాళిగా మాట్లాడనక్కరలేదు. మేమూ ఎదురు చూస్తున్నాము. ఎంత త్వరగా ఆఫీసులు తెరుస్తారా అని! ఈ ‘వర్క్ ఫ్రం హోమ్’ కాదు గానీ…ఎంతసేపు పనిచేసినా తనివి తీరదు మా పై అధికారులకి. పైగా ఇంట్లో ఎప్పుడు చూసినా యుధ్ధ వాతావరణం.’’ దీటుగా బదులిచ్చాడు పవన్.
‘‘ఇదిగో పవన్… మీ టీంలో ఎవరో నిన్ను పింగ్ చేస్తున్నారు.’’ లోపల నుంచి అరిచింది కవిత.
‘‘వస్తున్నా..’’ అని అరిచి ‘‘ప్లీజ్ అమ్మా.. కాస్త శబ్దాలు కాకుండా చూసుకో.’’ అభ్యర్థ్ధనగా అని లోపలికి పోయి దఢాలున తలుపేసుకున్నాడు.
లలితకి ఏడుపొక్కటే తక్కువైంది.
‘వెధవది.. ఈ కరోనా మహమ్మారి కాదుగాని, తన జీవితమే తల్లకిందులైంది. ఇదివరకు ఎంత పనిచేసినా తనకంటూ ఏకాంతం దొరికేది. కొంత సమయమూ మిగిలేది. ఇదిగో.. వర్క్ ఫ్రం హోం’ అంటూ పిల్లలు ఇళ్లకి చేరిన తరువాత అంతా ‘కృష్ణార్పణం’ అయిపోయింది.
‘‘చూశారా? వాడేమంటున్నాడో! మనింట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమేనట!’’ జీరబోయిన గొంతుతో భర్తతో మొరపెట్టుకుంది.
‘‘ఉన్నమాటేగా అన్నాడు..’’ చేతిలోని పుస్తకం మీదనుంచి దృష్టి మరల్చకుండానే అన్నాడు మంగపతి.
‘‘అదుగో.. మీరు కూడా అదేమాట!’’ కుళాయి విప్పడానికి సన్నద్ధమైంది లలిత.
‘‘సరదాకి అన్నా లేవే.. అయినా వాళ్లు ఇళ్లకి రావాలంటూ పట్టుపట్టుకు కూర్చుని, వాళ్ల చేత ఇళ్లు ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు కాదూ! ఇప్పుడు ఏడ్చి ఏం లాభం!’’ సానుభూతిగా అన్నాడు మంగపతి.
‘‘బుధ్ధితక్కువై తీసుకొచ్చాను మహాప్రభూ! దాని పర్యవసానం ఇది అనుకోలేదు.’’ లెంపలేసుకుంది లలిత.
కిందటేడాది విజృంభిస్తున్న ‘కరోనా’ని దృష్టిలో పెట్టుకుని ఐటీ ఉద్యోగస్తులందరికీ’ వర్క్ ఫ్రం హోం’ ఆప్షన్ ఇచ్చాయి ఐ.టి. కంపెనీలన్నీ.
లాక్డౌన్ పుణ్యమా అని ఎక్కడివారక్కడే స్థంభించి పోయి ఎంచక్కా ‘ఇంటిలో నుంచే పని’ చేసుకోవడం ప్రారంభించారు.
లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత మరి కొన్నాళ్లపాటు ఈ ‘వర్క్ ఫ్రం హోమే’ ఖాయమని గ్రహించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులందరూ తట్టాబుట్టా సర్దుకుని, ఇళ్లు ఖాళీలు చేసి తమతమ స్వస్థలాలకి తరలిపోసాగారు.
పవన్, అతడి భార్య కవిత.. ఇద్దరూ కూడా చెన్నైలో పని చేస్తున్నారు. ఇద్దరికీ ‘వర్క్ ఫ్రం హోం’ ఆప్షన్ ఉంది. దానితో లలిత పోరు ప్రారంభించింది.
‘అంతంత అద్దెలు పోసుకుని అక్కడే ఉండడం దేనికి? హాయిగా ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చే యండి. మనదా లంకంత కొంప. ఏ సామాను ఎక్కడ పడేసుకున్నా అడిగేవారుండరు. ఎంచక్కా నాచేత్తో ఇంత వండి పెడతాను. మీ పని మీరు చేసుకో వచ్చును.’’ అంటూ కొడుకుని ఊదరగొట్టింది లలిత.
అప్పటికే చిన్నకొడుకు గగన్ ఇల్లు చేరాడు. అనుకోకుండా అతడు జనతా కర్ఫ్యూ ముందురోజే ఇంటికి వచ్చాడు. ఆ తరువాత లాక్‌డౌన్ పెట్టేయడంతో అతడు గత కొన్ని రోజులుగా ఇంటినుంచే పనిచేస్తూ ఇంటిపట్టునే ఉన్నాడు.
తల్లి అంతలా శతపోరుతూంటే పవన్‌కి కూడా ఇంటికి వచ్చేయబుద్ధయ్యింది. సామాన్లన్నీ ట్రాన్స్ పోర్ట్ లో వేసేసి, ఆఫీస్ లాప్‌టాప్‌లు తీసుకుని కార్లో వచ్చేశారు వాళ్లు.
దాదాపు ఏడాది తరువాత పెద్దకొడుకుని- కోడల్ని చూసిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది లలిత.
వాళ్లకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టడంలో తలమునకలైపోయి, కిందామీదా పడింది.
కొన్నాళ్లు బాగానే గడిచాయి. రాన్రానూ.. ఇంటి వాతావరణం మారిపోయింది. ఇదివరకంటే గగన్ ఒక్కడే కాబట్టి ఓ గదిలో కూర్చుని పని చేసుకునే వాడు.
ఇప్పుడు ఒకళ్లకి ఇద్దరు వచ్చి చేరారు. ఎవళ్ల గదిలో వాళ్లు పని చేసుకోవడం వరకు బాగానే ఉంది. కాని, తరుచు మీటింగ్‌లు, కాల్స్‌తో బిజీగా ఉండే పవన్ ఏమాత్రం చిన్న శబ్దం అయినా తల్లితండ్రుల మీద విరుచుకు పడడం మొద లెట్టాడు.
ఇల్లన్న తరువాత కుక్కర్ విజిల్ వేయడాలు, మిక్సీ బర్రుమనడాలు, ఇంట్లోని మనుషులు ‘చిర్రు-బుర్రు’ లాడడాలు ఇవన్ని సహజమే కదా!
లలిత- మంగపతి లది మార్జాల దాంపత్యం. ప్రతిక్షణం కీచులాడుకోకపోతే వారికి దినం గడవదు.
ఈ మధ్య ఏదో విషయంలో ఇద్దరికీ భేదాభి ప్రాయం వచ్చి పెద్ద గొంతుతో వాదులాడుకున్నారు. అదే సమయానికి టీం మెంబర్స్‌తో ముఖ్యమైన సమా వేశంలో ఉన్న పవన్‌ని వాళ్ల పి.ఎల్. అడిగాడు…’’ ఏమిటి పవన్… ఆ డిస్ట్రబెన్సూ… వీధిలో ఏదైనా కొట్లాటా?’ అని.
పవన్‌కి ఏం చెప్పాలో తెలియక ‘ అయ్యుండొచ్చు …’’ అని దాటవేసి, బయటకి వచ్చి తల్లిదండ్రులని ముక్క చీవాట్లు పెట్టాడు.
‘‘ఇన్నేళ్లైంది… ఇంకా మీరు దెబ్బలాడుకోవడం మానలేదేంటి నాన్నా? మా పి .ఎల్. అలా అడుగు తూంటే ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా!?’’ అన్నాడు మంగపతితో.
‘‘అలా గడ్డిపెట్టు. నేను కాబట్టి ఈ మనిషితో ఇన్నేళ్లు వేగుతున్నాను. ఇంకొకతైతే ఎప్పుడో ఉద్వాసన చెప్పేసి పారిపోయుండేది.’’
జిర్రున ముక్కు చీదింది లలిత.
‘‘చాల్లే ఆపమ్మా… భార్యాభర్తలన్నాక కలిసుండక తప్పదు . అలాంటప్పుడు ఇద్దరూ అడ్జస్ట్ అయి బతకాలి. ఒకవేళ ఆయన కోపంలో ఏమన్నా అన్నారే అనుకో… నువ్వన్నా కాస్త తగ్గితే తప్పులేదు కదా!!?’’ అంటూ తల్లిని సున్నితంగా మందలించాడు.
ఈ వయసులో కొడుకు చేత సుద్దులు చెప్పించు కోవలసి వచ్చినందుకు సిగ్గుతో చితికిపోయింది లలిత.
‘‘గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట… అలా ఉంది వీడి వాలకం’’అని మనసులోనే వాపోయింది.
ఇదంతా ఒకెత్తు…వీళ్లింటికొచ్చాక లలిత మీద పడిన అదనపు పనిభారం ఒకెత్తు. తన చేత్తో పిల్లలకి కమ్మగా వండి పెట్టచ్చునని ఎంతగానో మురిసిన లలిత, అది ఆచరణలో అంత సులభం కాదని అర్ధమై డీలా పడిపోయింది.
పవన్-కవితల ఆహారపు అలవాట్లు వేరు. వీళ్ల ఆహారపు అలవాట్లు వేరు. అసలే గగన్ వచ్చాక వంట విషయంలో కొంత అసౌకర్యానికి గురైన లలిత పెద్దకొడుకొచ్చాక మరీ అయోమయంలో పడింది.
గగన్‌కి ఇది కావాలి… అది కావాలి అన్న గొంతెమ్మ కోరికలేమీ ఉండవు. ఏది పెడితే అది తింటాడు. కాకపోతే ఎప్పుడు తింటాడో… ఎప్పుడు తినడో చెప్పలేము. అతడికీ ‘ఇంటినుంచి పని’ చేసే సౌలభ్యం ఉన్నా అప్పుడప్పుడు వర్క్ చేసుకోవడం కోసం అదే ఊళ్లో ఉంటున్న టీం మేట్ ఇంటికి వెళిపోతూ ఉంటాడు.
ఒక్కోపూట లలిత వంట అంతా పూర్తి చేసుకు కూర్చున్నాక ‘ఈ పూట ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది. నేను రావడానికి లేటవుతుంది… కాబట్టి నాకు వండొద్దు.’ అంటూ మెసేజ్ పెడతాడు. దానితో వండిన వంటంతా ఏం చేసుకోవాలో తెలియక, కరోనా కాలం కాబట్టి ఎవరూ పట్టుకెళ్లకా లలిత నానా అవస్థా పడేది.
ఇదొక రకమైతే పవన్ వాళ్ల సంగతి వేరేరకం. లలితకి- మంగపతికి కూడా ఉదయాన్నే అల్పాహారం చేయడం అస్సలు అలవాటులేదు. పూజాదికాలు పూర్తిచేసుకుని, ఎంచక్కా రాగిజావచేసుకుని, అందులో కాస్త మజ్జిగ, నిమ్మరసం కలిపి తలా ఓ రెండు గ్లాసులు పుచ్చుకునే వారు. గగన్‌కి బారెడు పొద్దెక్కాక లేచే అలవాటు కారణంగా అతడూ వీరితో పాటే జావతాగేసి పన్నెండిటికల్లా భోజనం చేసేసే వాడు.
కాని,పవన్‌కి, కవితకి ఉదయాన్నే దండిగా టిఫిన్ పడాలి. దానితో లలితకి చచ్చినట్లు టిఫిన్ తయారు చేయాల్సిన పని పడింది. కవిత పాపం… మంచి కోడలే!
‘‘మీరు చేయలేకపోతే ఇబ్బంది పడకండత్తయ్యా. నేను చిటికలో స్నానం చేసొచ్చి క్షణాల మీద టిఫిన్ రెడీ చేస్తాను’’ అంటూ అభయమిచ్చేది.
మొదట్లో అలాగే కామోసు అనుకుంది లలిత. కాని, కవితకి విపరీతమైన ఒ.సి.డి. కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి ఇలా చాలా సేపు శుభ్రత- పరిశుభ్రత అన్న కాన్సెప్ట్ మీద తన సమయమంతా వెచ్చిం చేది. ఆ తరువాత తన చేతులకి ఏమన్నా మలినాలు మిగిలిపోయాయేమోనన్న సందేహంతో వాటిని కడుగుతూ కాలాన్ని, కాలం కన్నా విలువైన నీళ్లు వృథా• చేసేది. ఆమె బాత్ రూం లోనుంచి బయట పడేసరికే పదిన్నర అయ్యేది.
ఈ లోపు పవన్ ఆకలి కేకలు వేసేవాడు.
‘‘అమ్మా… కవిత వచ్చేసరికి నేను ఆకలితో పోయేలాగున్నా… అక్కడెలాగూ తప్పదు. కనీసం నీ దగ్గరున్నన్నినాళ్లైనా కమ్మగా చేసి పెట్టమ్మా.’’అంటూ గారాలు పోయేవాడు.
కన్నకడుపు… కడుపు నింపమని అలా ఆర్తిగా అడుగుతూ ఉంటే లలిత లోని మాతృహృదయం తల్లడిల్లిపోయింది. చెంగు బిగించి కొడుకు అడిగిన వన్నీ ఆరారా చేసి, కొసరికొసరి తినిపించడం మొద లెట్టింది. ఈ పక్రియ వలన పవన్ సంతోషపడినా, కవిత మాత్రం మండిపడింది. అక్కడు న్నప్పుడు చచ్చినట్లుగా తానెప్పుడు ఏ రకంగా వండినా, నోరు మూసుకుని తినే భర్త ఇక్కడకొచ్చేసరికి తనని తీసిపారేస్తూ ఉండేసరికి ఆమె తట్టుకోలేక పోయింది.
తన భార్య స్థానాన్ని చిన్నబుచ్చి, తల్లికి పెద్దపీట వేసినట్లుగా ఫీలైంది. ఫలితం మూసిన తలుపుల చాటున పవన్‌కి ‘బ్రెయిన్ వాష్’ కార్యక్రమం నిరాటం కంగా జరిగేది.
ఆ సంగతి పక్కనపెడితే. ఉదయాన్నే జావ తప్ప ఇంకేదీ తినే అలవాటులేని లలిత చాలా ఇబ్బంది పడేది. ఆ సమయంలో ఇన్ని రకాలు చేసే వీలు లేక పోవడంతో వాళ్ల కోసం చేసిన టిఫినే ఓ ముద్ద తినడం అలవాటుచేసుకున్నారు లలిత మంగపతులు.
మంగపతైతే హాయిగా టిఫిన్ చేసేసి అది అరిగి పోయేవరకు ఓ కునుకు తీసి లేచేవాడు. లలితకి మాత్రం ఆ అవకాశం దొరకలేదు. కడుపులో అల్పా హారం పడగానే కళ్లమీదకి మత్తు ముంచు కొచ్చేది. అలా జోగుకుంటూనే మిగతా శాకపాకాలు తయారు చేసుకునేది.
ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఇంటిచాకిరీ చేయడం లలితకు తలకు మించిన భారమైంది. కరోనా కార ణంగా పని మానిపించేసిన పనమ్మాయిని బతిమి లాడి, మరో ఐదువందల జీతం ఎక్కువచేసి మళ్లీ పనిలో పెట్టుకుంది.
‘ఏమిటో… ఒక తల్లిగా తానిలా భావించడం తనకి తగదేమో గాని, ఎక్కడి వారక్కడ ఉంటేనే సుఖం లాగా ఉంది.’ అని ఒకటే వగచేది.
మధ్యలో ఆటవిడుపుకోసం కవిత వాళ్ల పుట్టింటికి వెళ్లినా అక్కడ నెట్ సిగ్నల్ సరిగ్గా రావడంలేదంటూ… గోడక్కొట్టిన బంతుల్లా మళ్లీ ఇంటికొచ్చి పడేవారు.
‘చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా!’ అనేవాడు మంగపతి.
*****
‘‘అమ్మా త్వరలో మేము మళ్లీ చెన్నై వెళ్లిపోవాల్సి రావచ్చునేమో!’’ ఆరోజు ఉదయాన్నే పేపర్లో వార్తలు చదువుతూ అన్నాడు పవన్.
‘‘అదేంటిరా? ఇప్పట్లో ఆఫీసులు తెరవరని, వర్క్ ఫ్రమ్ హోం మరికొన్నాళ్ల పాటు కొనసాగుతుందని మొన్నేగా అన్నావు.’’ బోలెడు ఆశ్చర్యపోయింది లలిత.
‘‘అవును. ఇప్పటికీ అదే అంటున్నా. నాకైతే ఆ ఆప్షన్ కంటిన్యూ అవుతుంది గాని, కవిత మాత్రం ఆఫీసుకి వెళ్లాల్సి వస్తుంది. కరోనాకి వాక్సిన్ వచ్చింది కదా! రికవరీ రేటు పెరిగింది. జనాల్లో కరోనా అంటే భయం కూడా పోయింది. దానితో కొన్ని ఆఫీసులు తెరుచుకోనున్నాయి.’’ వార్తాపత్రికలోని వార్తను యధాతథంగా చెప్పాడు పవన్.
నిజం చెప్పద్దూ… ఆనందంతో లలితకి ఎగిరి గంతేయాలనిపించింది. పిల్లలు తనకి దూరంగా వెళతారన్న బాధని, తనకి గాడిద చాకిరీ నుంచి విముక్తి లభించ•నుందన్న సంతోషం అధిగమించింది.
బయటకు మాత్రం ‘‘ఏమిటోరా? మీరు వెళ్లి పోతారంటే ఏదో దిగులుగా ఉంది.’’ అంది.
తల్లి మాటల్లోని దిగులు కంఠంలో కనబడక పోయేసరికి అనుమానంగా చూశాడు పవన్. దొరికి పోయిన దొంగలా చూపులు మరల్చుకుంది లలిత.
‘‘మళ్లీ సంసారం పునఃప్రతిష్ట చేయాలి కాబట్టి, మీకు కావలసినవన్నీ ఏర్పాటుచేస్తాను.’’ అంది ఏదో అపరాధభావన మదినిండగా.
పవన్ అద్దెఇంటి కోసం ఆన్‌లైన్‌లో వేట మొద లెట్టాడు. నచ్చిన ఇల్లు దొరకగానే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. ఇక నేడో రేపో… సామాన్లు ట్రాన్స్ పోర్ట్ ద్వారా తరలిద్దామనుకుంటున్నాడు.
ఓ పక్క వారికి కావలసినవన్నీ సర్దిపెడుతూన్న లలిత తనకి పూర్వవైభవం రానున్నట్లుగా ఊహించు కుంటూ మనసులోనే మురిసిపోతోంది. గతంలోలా తను తన స్నేహితులతో కలిసి సినిమాలకీ, షికార్లకీ తిరుగుతున్నట్లు, సంబరంతో కిట్టీపార్టీలు చేసుకుంటు న్నట్లూ ఒకటే కలలు.
మంగపతికి మాత్రం ఆవాహనా…విసర్జనా లేదు. అతడు ఏదైనా తనకొకటే అన్నట్లు తటస్తంగా బతికేస్తాడు.
*****
‘‘అమ్మా… అమ్మా…’’ ఆరోజు ఉదయం నిద్ర లేస్తూనే పవన్ గావుకేకలు పెట్టసాగాడు.
‘‘ఏమైందిరా పవన్… ఏమిటా పెడబొబ్బలు పెట్టడం?’’ గుండెలదిరిన మంగపతి విసుక్కున్నాడు.
‘‘అమ్మ ఇక దిగులు పెట్టుకోనక్కరలేదు నాన్నా… మరి కొన్నాళ్లపాటు నేనిక్కడ నుంచి కదలనక్కరలేదు.’’ ఆనందంగా చెప్పాడు పవన్.
‘‘అదేంటిరా? మొన్ననేగా కోడలికి ఆఫీసు తెరిచేస్తారు… వెళ్లిపోవాలి అన్నావు. ఇల్లు కూడా తీసేసుకున్నావు?’’ కొడుకు సంరంభానికి బిక్కచచ్చి పోయిన లలిత నీరసంగా అడిగింది.
‘‘అన్నీ నిజమేనమ్మా. కాని, కరోనా సెకెండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది కదా! ఈ దశలో మొదటికన్నా వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోందట. అన్నిచోట్లా మళ్లీ పాక్షి కంగా లాక్‌డౌన్ పెట్టే ఆలోచన కూడా ఉందట… కవిత ఆఫీసు వాళ్లు మెయిల్ పెట్టారు… మరి కొన్నాళ్ల పాటు ఆఫీసు తెరచే ఉద్దేశ్యమేలేదట. ఎంచక్కా ఇక్కడే హ్యాపీగా ఉండచ్చు.’’ పవన్ చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టాడు.
‘‘మరి ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశావు కదరా!’’ మంగపతి అయోమ యంగా అన్నాడు.
‘‘అడ్వాన్స్ ఎక్కడికీ పోదు నాన్నా… ఈ కరోనా కాలంలో అద్దెలకి వచ్చే వాళ్లు ఎవరున్నారు? ఎప్పటి కైనా అందులో దిగాల్సింది నేనే.
మరి కొన్నాళ్లు ఇక్కడుంటానంటే అమ్మకి మాత్రం ఆనందంకాదూ!’’ గోముగా తల్లివైపు చూశాడు పవన్.
లలితకి కొడుకు చెప్పేదేమీ చెవులకెక్కడం లేదు. కళ్లు బైర్లు కమ్ముతూ ఉండగా అలా చూస్తూండి పోయింది.