ఆవేశం అనర్థదాయకం. దాన్ని కుటుంబం మీద చూపడం ఘోరాతి ఘోరం. కుటుంబమన్నాక కొరతలూ, కలతలూ మామూలే. వాటిని పరిష్కరించుకోవడం మాని, విపరీత ఉక్రోషాన్ని అదుపుచేసుకునే ప్రయత్నమైనా ఆరంభించని వ్యక్తులు…ముఖ్యంగా తండ్రి తన లోపలి క్రోధాన్ని పిల్లలమీద చూపిస్తే? పసిప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతున్నాయి. కలహాలతో ఎటువంటి సంబంధమూ లేని, ఏ పాపమూ ఎరుగని, ముక్కుపచ్చలారని బాలలు విగత జీవులుగా మారుతున్నారు. తెలుగునాట ఖమ్మం ప్రాంతంలోని ఇటీవలి సంఘటన గురించి చదువుతుంటే / వింటుంటే / అనంతర దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటే – గుండెలు అదిరిపోతున్నాయి. గ్రామంలోని దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అవి మరింత ముదిరిన స్థితిలో, కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యమీద పగతో సంతానం ఉసురు తీసేశాడు! నిండా పదేళ్లయినా లేని బాబును, పాపను గొంతు నులిమి చంపి, దుప్పట్లో మూటకట్టి, ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. వాళ్లని అంత కర్కశంగా చంపినవాడు తండ్రి ఎలా అవుతాడు? ‘ఆడపిల్లని బంగారంలా చూసుకుంటా’ అని ఒకప్పుడు చెప్పినవాడే…. ఆ పిల్ల గొంతు నొక్కడం ఏమిటి? ఈ జంట హత్యల కేసు పరిశోధనకు వచ్చిన శిక్షణ ఐపీఎస్‌ అధికారి మాటలు కటిక చేదు నిజాల్ని బయటపెడుతున్నాయి. పసిబిడ్డల ప్రాణాల్ని నిష్కారణంగా తీసేయడం, అదేమంటే…‘క్షణిక ఉద్రేకానికి లోనై చేశా’ అనడం హంతకులకు పరిపాటి మాటగా మారింది. పిల్లలను కసురుకునేందుకే నోరు రాదు తల్లిదండ్రులకి. అటువంటిది పిల్లల గొంతు నులిమేసి దుప్పట్లో చుట్టేయడమంటే…అది కరడు గట్టిన నేరగాడి పని. అంతేకానీ, తండ్రి చేసేది కానే కాదు. నిస్సహాయ పరిస్థితి కనుకే, ఆ పిల్లలిద్దరు తమను తాము కాపాడుకో లేకపోయారు. ‘జన్మనిచ్చింది మేమే, జీవం తీసేదీ మేమే’ అనే వాళ్లకు కఠినాతి కఠిన శిక్షలు పడి తీరాల్సిందేనని చెప్తున్నప్పుడు దర్యాప్తు అధికారుల స్వరం ఎంతో ఎంతో బలంగా వినిపించింది. ఇటువంటి నేరసంఘటనల పూర్వాపరాలు, మూల కారణాలను శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు మనకు అనిపించేదొక్కటే – శిక్షల విధింపు ఎలా ఉండాలంటే… నేరగాడిని అణువణువునా వణికించాలి, మరెవ్వరూ ఇకముందు ఆ తరహా ఆలోచన చేసేందుకే గజగజలాడేంతగా శిక్షలుండాలి!

హింస నానా రకాలు. ఏ రూపంలో ఉన్నా, అది రాక్షసత్వమే! పౌరులెవరినైనా పీడించినా, హింసించి ప్రాణం తీసినా అది మహానేరం. క్రోధం, క్షణికావేశం అనేవి మొత్తం మానవ జాతికే శత్రువులు. సాటి మనిషే క్రూరంగా ప్రాణాల్ని హరించే స్థితిలో ఉంటే పసిపిల్లలు ఏం చేయగలరు? కంటి రెప్పలా కాపాడాల్సిన తండ్రే నిండు ప్రాణాల్ని చుట్ట చుట్టేస్తుంటే మానవత ఏమైపోయినట్లు? అందులో బాలికల స్థితి! తల్లిగర్భంలో ఉన్నప్పటి నుంచి జీవితయాత్ర ముగిసే వరకూ అమ్మాయిలకు అడుగడుగునా కడగండ్లేనా! ఈ ఘాటు ప్రశ్నలకు దీటు సమాధానాలు ఎక్కడా లభించవిప్పుడు. అసలు బాలల హక్కులకే దిక్కులేకుండా పోయింది. ఈ నేరాలు, ఘోరాలు, దారుణాల్లో సమాజంలోని చాలామందికి ఎంతో కొంత భాగం ఉన్నట్లే! ఇవి బాలికల హక్కుల పరిరక్షణ జాతీయ సంఘం బాధ్యుల మాటలు / హెచ్చరికలు. బడి చదువులతో రోజులు గడపాల్సిన పిల్లలు హతులవడం ఏ విధమైన సంస్కృతి? ఈమధ్య వెలుగు చూసిన ఈ నేర సంఘటనలోనూ, ఆ హంతక తండ్రి సాయంత్రం వేళ పాఠశాలకు వెళ్లాడు. ఒకటో తరగతి, మూడోతరగతి చదువు తున్న చిన్నారులను ఇంటికి తీసుకు వచ్చాడు. కాసేపట్లోనే – నేరం. నేరగాడు పరారీ! అనుమానించి ఆ ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపల చూసిన తర్వాతనే… పైశాచికత్వం బయటపడింది.

లెక్కలేనన్ని చట్టాలున్నా….

చట్ట ప్రకారం శిక్షల విధింపులకు ఎలాంటి ఢోకా లేదు. ముఖ్యంగా పిల్లల్ని హింసిస్తే, శారీరకంగా బాధిస్తే కనీసం మూడేళ్లు కఠిన కారాగార శిక్ష! చట్టనిబంధనల్లో మార్పులు చేర్పులు గతంలో అనేకం జరిగాయి. అలా అని చట్టాల రూపకల్పన, సవరణ, సంస్కరణల దశలతోనే ప్రభుత్వ బాధ్యతలు తీరవు. నిబంధనల సక్రమ అమలు, దృఢతర ఆచరణతోనే పిల్లలకు రక్షణ కలుగుతుందని సంబంధిత సంఘాలు ఘోషిస్తున్నాయి. భద్రత పొందడం బాలబాలికల ప్రాథమిక హక్కు. దానికి పూర్తి స్థాయి పరిరక్షణ చేకూర్చడం ప్రభుత్వాల బాధ్యత. చిన్నారులకు విద్య, వైద్యం, ఆహారం, సంరక్షణ.. అన్నీ నిత్యావసరాలే. వాటి కల్పన బాధ్యతల నుంచి పెద్దలెవరూ తప్పించు కోలేరు. అమ్మానాన్నలు అసలు తప్పించుకోలేరు. బాలబాలికల సంక్షేమానికి సంబంధించి, ఐక్యరాజ్య సమితిలో విభాగముంది. ‘హాయిగా బతికేందుకు ప్రతి పిల్ల(వాడి)కీ హక్కుంది’ అన్నదే ఆ అధ్యయన శాఖ నినాదం, విధానం. అదే హక్కును తాను పరిరక్షిస్తూ; మరెవ్వరూ కాలరాయకుండా చూడటమే, ఆ విధంగా ముందుకు కొనసాగితేనే ప్రజా ప్రభుత్వం అనిపించుకుంటుంది. ప్రత్యేకించి ఆడపిల్లలకు పుట్టుకతో వచ్చిన హక్కులను కాపాడితేనే, అది శాంతియుత దేశమవుతుంది. గర్భంలో ఉండగానే ఆడశిశువును తొలగించడం, బాల్యంలోనే పెళ్లిచేసి బండెడు భారాన్ని మోపడం శిక్షార్హ నేరాలు. పాఠశాలకు పంపకుండా ఇంటా బయటా చాకిరీ చేయించడం, సకాలంలో సరైన చికిత్స అందకుండా చేయడం కూడా దారుణ నేరాలే. అఘాయిత్యం, లైంగిక వేధింపులు, హింస, అక్రమ రవాణా అమ్మా యిలకు ఎదురైతే వాటి కారకులను శిక్షించకపోడమూ పెద్ద నేరమే. ఈ అంశాల్ని ప్రభుత్వాలు ఎంత త్వరగా తెలుసుకొని వ్యవహరిస్తే అంత ఉత్తమమని చట్ట నిబంధనలు తేటతెల్లం చేస్తూ వస్తున్నాయి. సంక్షేమమనేది నినదిస్తే రాదు, ఆచరణకు తెస్తే వస్తుంది.

దీపాల్ని ఆర్పవద్దు

ఇల్లు, పిల్లలు, కుటుంబం. ఇదే స్వర్గసమానం. వీటిని మించింది మరేదీ ఉండదు. పసివారి జీవన స్థితిగతులన్నింటినీ ఎప్పటికప్పుడు అంచనావేసే ‘సేవ్‌ ‌ది చిల్డ్రన్‌’ ‌సంస్థ ప్రకారం-తల్లి గర్భమే మృత్యు పీఠంగా మారిన ఆడ శిశువుల సంఖ్య ఇప్పుడు పలు రెట్లు పెరిగింది. వేలాది పసిరూపాలు అమ్మ కడుపు లోనే కడతేరుతుంటే, ఎలాగో బతికి బయటపడిన పాపల ఉసురును తండ్రులే తీసేస్తున్నారు. ఇంతకుమించిన నేరాతినేరం, ఘోరాతిఘోరం, దారుణాతి దారుణం ఇంకేదైనా ఉంటుందా? ‘జాతి ఆశలకు పిల్లలే ప్రతి రూపాలు. వాళ్లు మరణించే పరిస్థితులు నెలకొంటే, పాలకులకు అవే పెను సవాళ్లు’ అని అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు ఐసెస్‌ ‌హోవర్‌ అన్నారు. ‘జాతి వికాసం, బాలల దరహాసం’ రెండూ ఒకటే అనేవారు. ఎటువంటి వైపరీత్యం, విపత్కర వాతావరణం ఎదురైనా, జాతి తన శిశుసంపదను కోల్పోకుండా జాగ్రత్తపడాలి. వారిని అన్ని విధాలా పరిరక్షించుకోవాలన్న స్పృహ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు నెరవేరతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, బాలికల సంరక్షణ ఎంత అత్యవసరమో పూర్తిగా అవగతమ వుతుంది.

బాలల పురోభివృద్ధే ప్రభుత్వాల విధి. అమూల్య బాల్యానికి అండదండగా నిలుస్తామంటూ ఐరాస ఇదివరకే బాలల హక్కుల ప్రకటనను వెలువ రించింది. ప్రపంచ దేశాల ఒప్పంద పత్రం లోని 54 అధికరణలు బాలబాలికల హక్కులు, వాటిని అమలుచేయాల్సిన విధానాల్ని విశదీక రిస్తున్నాయి. అదే విధంగా మన భారత రాజ్యాంగం లోని అనేక అధికరణలతోపాటు వివిధ చట్ట నిబంధనలు దేశవ్యాప్తంగా పిల్లలకు కల్పించాల్సిన ఆలంబన, సామాజిక భద్రతపరంగా అంశాల వారీ వివరా లందిస్తున్నాయి. ఇంట్లో అనేకమంది బాలలు, హింస, దాడి, వేధింపుల బారినపడి, చివరికి తండ్రుల దురాగతాలకు బలైన ఉదంతాలు ఎన్నో. కుటుంబ కలహాలతో పిల్లలను చంపి…’ అని వార్తలు వచ్చిన ప్రతిసారీ మానవతా సౌధం కుప్పకూలినట్లే!

మాటలు కాదు; చేతలు కావాలి

‘బాలల పరంగా ప్రభుత్వాలు కనబరచాల్సిన ఆదరణ పూర్వక రక్షణలు కేవలం హామీలుగానే ఉండి పోతున్నాయి. అవి దస్త్రాల్లో మగ్గిపోతున్నాయే తప్ప ఆచరణకు రావడం లేదు’..ఈ ఆవేదన బాలల హక్కుల నేత కైలాస్‌ ‌సత్యార్థిది. ‘బాల్యాన్ని కాపాడండి’ అంటూ 1980ల లోనే భేరీ మోగించారాయన. మగపిల్లలు, ఆడపిల్లల హక్కుల పరిరక్షణ కృషిలో తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. కుటుంబ సభ్యుల లోని ఇతరులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సామాజిక సంక్షేమ సంస్థల వారు తమ వంతు విధి నెరవేర్చాల్సి ఉంటుంది.

ఆ మాటకొస్తే, ప్రాణహక్కు పరిరక్షణ ప్రభుత్వంతోనే పూర్తిగా ముడివడి ఉండదు. సంరక్షణ అనేది సంపూర్తిగా ప్రభుత్వేతర సంస్థలకు వర్తించేదీ కాదు. ఉమ్మడి విధి. బాలలను కాపాడటం, కాపాడుకోవడం సామాజికంగా అందరి కర్తవ్యం. హక్కు విలువ తెలిసిన వారెవ్వరూ దాన్ని ఉల్లంఘించి ప్రవర్తించరు. అందునా కన్నవారు. అలాంటిది పసిపిల్లలను, కడుపున పుట్టిన వారినే అంతం చేయడమన్నది ఎంతటి శిక్షకూ అందనంత పైశాచికం (అంతం అనే మాటను ఇక్కడ చాలా వ్యధతో ఉపయోగించాల్సి వస్తోంది). శిశురక్షణకు దేశదేశాల హక్కుల సంరక్షణ సంఘాలు, ‘చైల్డ్‌లైన్‌’ ‌వంటి ప్రభుత్వేతర సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అన్నింటికీ మించి, బాలబాలికల ప్రాణ పరిరక్షణ హక్కును పాఠ్యాంశంగా సవివరంగా తెలియజేసేంత స్పందన కావాలిప్పుడు. ఇది ప్రభుత్వాల నుంచే రావాలి.

తస్మాత్‌ ‌జాగ్రత

బాలల ప్రాణపరిరక్షణకు జరిగిన కృషి కాస్తంత, జరగాల్సింది కొండంత. గత ఫిబ్రవరిలో కర్ణాటకలోని ఒక వ్యక్తి తన భార్యమీద అనుమానంతో శిశు హత్యకు పాల్పడ్డాడు. రోజూ ఆమెతో గొడవపడే అతడు, ఇంట్లో నుంచి ఒకరోజు పిల్లలిద్దరినీ బయటికి తీసుకెళ్లాడు. గొంతు కోసి పరారయ్యాడు. కట్టుకున్న ఆమెపై లేనిపోని నిందలు మోపి, ఆ ఆగ్రహాగ్ని ఇంకా చల్లారకపోవడంతో సంతానం ఉసురు తీశాడా కర్కోటకుడు! రెండు సంఘట నల్లోనూ ప్రాణాలు కోల్పోయింది ఏ పాపమూ తెలియని పసివాళ్లే. ఇవన్నీ తలచుకుంటుంటే, గుండె మండుతుంది ఎవరికైనా! ప్రాణరక్షణ, హక్కు, కాపాడుకోవడం-ఇవేవీ తెలియని పసిబిడ్డల్ని గొంతునొక్కి / కోసి చంపేయడంతో ఆ నేరతండ్రు లకు ఏమొస్తుందో కానీ… మనిషి తత్వం అనేది మాత్రం మటుమాయమైనట్లే! మానవతా భవంతి నిలువునా కుప్పకూలినట్లే!!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE