సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ఆషాఢ బహుళ అష్టమి – 10 జూలై 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


వర్తమానం తడబడుతూ ఉంటే, చేయి అందించి ముందుకు అడుగులు వేయిస్తుంది చరిత్ర. అందుకే, ‘ఇంత చరిత్రను చూస్తుంటే ఒక మహా మాతృమూర్తి నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టు ఉంటుంది’ అన్నారు శేషేంద్ర. అలాంటి దురవస్థ నుంచి వర్తమానాన్ని తప్పించడానికి జరిగిన ప్రయత్నాలలో ఒకటి కేంద్రం నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ ‌మహాత్సవ్‌. ‌వలస దేశంగా విముక్తమైనా, వర్తమాన భారతావనికి విజాతీయ భావనల సంకెళ్లు బిగుస్తూనే ఉన్నాయి. ఇందుకు కనిపిస్తున్న కారణాలలో తాత్త్విక పరమైనది-చరిత్ర రచనలో జరిగిన అన్యాయం. చరిత్ర నిర్మాణంలో చొరబడిన వక్రీకరణ. అట్టడుగు వర్గాలకూ చరిత్ర ఉంది. స్వతంత్ర భారతంలో వారి స్థానం వారిదే. వారికీ సమస్యలు ఉన్నాయి. ఫలితాలు వారికీ అందాలి. ఇది మన చరిత్ర సారం నుంచి మనం గ్రహించగలగాలి. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌స్థాపన కంటే, నిజానికి ప్లాసీ యుద్ధ కాలానికి అటు ఇటుగానే ప్రారంభమైన గిరిజన పోరాటాలు మన కర్తవ్యం ఏమిటో తెలియచేసే సామర్థ్యం ఉన్నవే. అంతటి తాత్త్వికతను ప్రసాదించేవే. జూలై 4,2023తో ముగిసిన అల్లూరి శ్రీరామరాజు 125వ జయంతి వేడుకల వెనుక ఉద్దేశం కూడా వాటిని ఆకళింపు చేసుకోవడమే.

గాం గంతన్న దొర, గాం మల్లుదొర, కంకిపాటి బాలయ్య పడాలు, సంకోజు ముక్కడు, గోకిరి ఎర్రేసు వంటి అనేకమంది మన్యవాసుల అండాదండతో చరిత్ర విస్తుపోయే స్థాయిలో తెలుగునాట గిరిజనోద్యమం నిర్వహించిన మహనీయుడు అల్లూరి శ్రీరామరాజు. అంతకు ముందు వందేళ్ల క్రితం ద్వారబంధాల చంద్రయ్య, కారం తమ్మనదొర వంటి నిర్వహించిన పోరాటాల అనుభవాలు వీరికి దారి చూపాయన్నదీ నిజం. ప్రత్యర్థి ఎవరైనా విధ్వంసమే ఉద్యమ లక్షణమన్న భ్రాంతికి రామరాజు పోలేదనిపిస్తుంది. దేశమంతా స్వాతంత్య్రం కోసం పోరాడుతుంటే, అందులో అడవిబిడ్డలను కూడా భాగం చేయవలసిన అవసరం ఉందని గుర్తించినవారు శ్రీరామరాజు. కొండకోనలలో ఉన్నప్పటికీ వారూ భారతీయులేనని మిగిలిన సమాజం చేత గుర్తింప చేయడం, అంగీకరింప చేయడం కూడా ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. రామాయణ, భారతాలలో, అంటే ఒక కాలంలో కనిపించని ఈ ‘దూరం’ ఆధునికకాలంలో ఎందుకు దాపురించిందో అంతుపట్టదు. అల్లూరి గెరిల్లా ఉద్యమ పంథాను ఆనుసరించారు. అందులో హింస నిషిద్ధం కాదు. కానీ రక్తపాతమే పోరాట ధ్యేయం కాదని తెలిసిన వారు అల్లూరి. ఆయన హింసనే నమ్ముకుని ఉంటే దామనపల్లి ఘటన (సెప్టెంబర్‌ 24, 1922) ‌రక్తపంకిల చరిత్రగా మిగిలేది. రెండు బెటాలియన్లు (దాదాపు 60 మంది) ప్రాణాలు వదిలేవి. కానీ కవర్ట్, ‌హైటర్‌, ‌వారికి అడ్డుగా నిలిచిన మరో ముగ్గురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అన్నవరం, మల్కనగిరిలలో పోలీస్‌ ‌స్టేషన్‌ల మీద దాడికి వెళ్లినప్పుడు ఆయన వెల్లడించిన అభిప్రాయాలలో ఇవి కనిపిస్తాయి. మన్యం ఉద్యమానికి బాటలు వేసిన లంబసింగి రోడ్డు ఉదంతం సమయంలో ఒక ప్రశ్న వచ్చింది. మన్యవాసుల స్వేదంతో కాదు, కన్నీళ్లతో, రక్తంతో గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ ‌బాస్టియన్‌ ‌నిర్మించాడా రోడ్డు. ఇలాంటి హింసను మీరు రాజమండ్రి లేదా బెజవాడ వాసుల మీద ప్రయోగించగలరా అన్నదే ఆ ప్రశ్న. ఇది ఇప్పుడు కూడా చాలా సందర్భాలలో ఎదురవుతున్న ప్రశ్నే కదా! ఇలాంటి అరాచకం మీద, అణచివేత మీద అల్లూరి పోరాడారు. ఆ పోరును స్వాతంత్య్రోద్యమంతో అనుసంధానం చేయాలనీ గట్టిగా ఆశించారు. ఈ ఉద్యమం, మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీని ఇది భయపెట్టిన తీరు ఏ విధంగా చూసినా ఘనమైనవే. మద్రాస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌లో జరిగిన చర్చలు పరిశీలిస్తే ఇది అర్ధమవుతుంది. 62 పర్యాయాలు రాజు దళాలకీ, బ్రిటిష్‌ ‌బలగాలకీ మధ్య కాల్పులు జరిగాయి. మద్రాస్‌, ‌బొంబాయి కలకత్తా ప్రెసిడెన్సీలు కలసి దీనిని అణచివేశాయి. విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. దాదాపు 260 మందిని శిక్షించారు. కొందరు అండమాన్‌ ‌జైలుకు వెళ్లారు. ఈ చరిత్ర గురించి ఇంకా ఎంతో పరిశోధన జరగాలి.

చరిత్రలో అల్లూరికి వాస్తవంగా ఉన్న స్థానానికి తగిన గుర్తింపు ఇప్పుడు వచ్చిందని అనుకోవచ్చు. అందుకు తగ్గటే ఆయన 125వ జయంతి వేడుకలను ప్రభుత్వాలు నిర్వహించాయి. అల్లూరి నడయాడిన భూమిలో నిరుడు అక్కడికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ జూలై 4న హైదరాబాద్‌ (‌గచ్చిబౌలి స్టేడియం)లో ముగించారు. ఇది నిజంగా అపురూపం.

ఈ గౌరవం తక్కువమంది స్వాతంత్య్రం సమరయోధులకే దక్కింది. ఎస్‌టీ వర్గానికీ చెందినవారిగా, పైగా గిరిజనోద్యమ చరిత్రలో ప్రముఖంగా కనిపించే ఒక పోరాట తెగకు చెందిన మహిళగా ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాలను ముగించడం సందర్భోచితంగా ఉంది. వాటికి సార్ధకతను తెచ్చింది. అయితే ఒక స్వాతంత్య్ర సమరయోధుడు, ఒక యోగి, ఒక కళావేత్తల జీవితానుభవాలు, తాత్త్వికతల అవసరం, అవి ఇచ్చే స్ఫూర్తి వారి శత జయంతులతో, లేదా వజ్రోత్సవాలతో, రజతోత్సవాలో, వర్ధంతులతోనే ముగిసిపోతుందనుకుంటే పొరపాటు. వారిని స్మరించుకోవడం, అంటే చరిత్రను స్మరించుకోవడం జాతి నిరంతరాయంగా చేయాలి. స్వేచ్ఛ కోసం మొదట ప్రారంభమైన గిరిజనోద్యమాలు, తరువాత ఆరంభమైన పత్రికల పోరాటం, విదేశీ గడ్డ మీద నుంచి ఈ దేశ విముక్తి కోసం జరిగిన పోరాటాలు, చట్టసభలే కేంద్రంగా జరిగిన ఆందోళనలు, గాంధీ మార్గం ఆవల నడిచిన ఉద్యమాలు, మహిళలు చేసిన పోరాటాలు, విద్యార్థులు చేసిన పోరాటాలు సందర్భానుసారం స్మరించుకుంటూ ఉండడం సంప్రదాయం కావాలి. ఆ తపన ఉండాలి.

About Author

By editor

Twitter
YOUTUBE