–    ఖురాన్‌ ‌మీద ఒక చిన్న డాక్యుమెంటరీ తీస్తే ఏమవుతుంతో ఊహించగలరా?

–    అలాంటి అసభ్యకర దుస్తుల దేవుళ్లు మీ పూజగదులలో ఉంటే బాగుంటుందా?

–    పురాణ గాథలు తీసేవారికి కఠిన మార్గదర్శకాలు అమలు కావాలి!

–    ఆదిపురుష్‌ ‌నిర్మాణ బృందాన్ని తూర్పార పట్టిన అలహాబాద్‌ ‌హైకోర్టు

‘ఆదిపురుష్‌’ ‌పేరుతో వచ్చిన ఒక సినిమాని నిషేధించాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను జూన్‌ 28‌న అలహాబాద్‌ ‌హైకోర్టు విచారించింది. ఈ విచారణ, ఇందులో లక్నో బెంచ్‌ ‌చేసిన వ్యాఖ్యలు చరిత్రాత్మకమే. జూన్‌ 16‌న విడుదలైన ఈ చిత్రం రామభక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉన్నది కాబట్టి నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇంకా కొన్నిచోట్ల కూడా నిర్మాత, దర్శకుల మీద, కథానాయకుడు ప్రభాస్‌, ‌నాయిక కృతీ సనన్‌, ‌రావణ పాత్రధారి సైఫ్‌ అలీఖాన్‌ ‌మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఒక భారతీయ పురాణ చిత్రం మీద ఇంత దుమారం రేగడం ఇదే ప్రథమం. సినిమాలు, అందులోని వివాదాలు మనకి కొత్తకాదు. అందులోను హిందూ పురాణ పాత్రలను వెకిలిగా, వ్యంగ్యంగా చిత్రించడం తమ హక్కు అనుకునే దర్శకులు, నిర్మాతలు పుష్కలంగా ఉన్నారు కూడా. చిరకాలంగా ఈ ధోరణి మీద హిందూ సంఘాలు తమ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఖాతరు చేసిన వారు లేరు.

హీరో ఇమేజ్‌కి తగ్గట్టు పురాణపాత్రను, చారిత్రక పాత్రను ఇష్టానుసారం కూర్చడం, వక్రీకరించడం, మొత్తంగా వాటి స్ఫూర్తిని నాశనం చేయడం ఇటీవలి పరిణామం. ఆ సినిమా ఎలా ఉన్నా, పురాణాన్నీ, చరిత్రనీ, వాస్తవాలనూ ఎంత ధ్వంసం చేసినా నోరెత్తకుండా చేయడానికి అభిమాన సంఘాలు నడుం కడుతున్నాయి. భారత జాతికి ఆదర్శపురుషుడైన రాముడి విషయంలోను ఇదే జరుగుతోంది. లవకుశ అనే మహోన్నత పౌరాణిక చిత్రం ఈ తరానికి తెలియకపోవచ్చు. తెలుసుకుంటే మంచిది. ఒకసారి చూస్తే మంచిదే కూడా. ఆ సినిమా చూసినవారి మదిలో రాముడు, సీతమ్మ పాత్రలు నిలిచిపోతాయి. స్వర్గీయ ఎన్‌టి రామారావు, అంజలీదేవి ఆ పాత్రలలో కనిపించారు. అది కూడా రామకథే. అలాగే భీష్మ, సీతారామ కల్యాణం, సంపూర్ణ రామాయణం వంటి తెలుగు సినిమాలు పౌరాణిక చిత్రాలకు నమూనాలుగా నిలిచాయి. అప్పటి విధానం, నటనా రీతులు ఇప్పుడు లేవు కదా. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడాలి కదా అని వాదించడం బొత్తిగా అజ్ఞానమే. నటుల కోసం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా మూల కావ్యాలను అవమానిస్తామంటే దేశ ప్రజలు సహించరు. పౌరాణిక పాత్రలలో ఊహించుకోవ డానికి కూడా అవకాశం లేని వారిని ఎంపిక చేసి, ఇమేజ్‌ ‌చట్రంలో కూరుకుపోయిన ఫలితంగా రగడ జరుగుతున్నది. అది శాంతిభద్రల సమస్యగా పరిణ మిస్తున్నది? ఎందరివో మనోభావాలు గాయపడు తున్నాయి. ఇది కళ ధ్యేయం కారాదు. అది ఏ రూపంలో ఉన్నా కళ పరమార్ధం ఇది కాదు. స్వర్గీయ చిత్తూరు వి.నాగయ్య నిర్మించి నటించిన యోగి వేమన చిత్రం చూసిన తరువాత ఒక పశువుల కాపరి యోగి అయ్యాడు. ఆయనే ముమ్మిడివరం బాల యోగి. కళ చేసే ప్రభావం ఇలా కదా ఉండాల్సింది!

ఆదిపురుష్‌ ‌వివాదం వీటికి పరాకాష్ట. అసలు వాల్మీకి రామాయణం స్ఫూర్తినే ధ్వంసం చేసి, వక్రీకరించారని పిటిషనర్లు వాదించారు. ఇందులోని సంభాషణలు కూడా ఇతివృత్తాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని కూడా ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ అఖిల భారత సినీ కార్మికుల సంఘం కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్‌షాకు లేఖ రాసింది. నిర్మాతల మీద కేసు పెట్టాలని ముంబై పోలీసులకు కూడా విజ్ఞప్తి చేసింది. భారతీయుల ఆరాధ్యదైవం రాముడు, సీతమ్మ, హనుమ పాత్రల చిత్రణ పూర్తి అభ్యంతర కరంగా ఉందని వారు ఆరోపించారు. ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించాలని కోరుతూ  హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెంటనే విచారించ డానికి ఆ న్యాయస్థానం నిరాకరించింది. కానీ అలహాబాద్‌ ‌హైకోర్టు (లక్నో బెంచ్‌) ‌జస్టిస్‌ ‌రాజేశ్‌సింగ్‌ ‌చౌహాన్‌, ‌జస్టిస్‌ శ్రీ‌ప్రకాశ్‌సింగ్‌లతో కూడిన వెకేషన్‌ ‌ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకమైనవి. ఈ చిత్రంలోని సంభాషణలకు వ్యతిరేకంగా లక్నోలో నిరసన ప్రదర్శన జరిగి, ఉద్రిక్త తలకు దారి తీసింది. మహారాష్ట్రలోని పాల్ఘార్‌లో కూడా దీనికి నిరసనలు జరిగాయి.

ప్రభాస్‌, ‌కృతి సనన్‌, ‌సైఫ్‌ అలీ ఖాన్‌లతో కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకు మొదటి నుంచి అరిష్టాలు ఎదురయ్యాయి. ట్రైలర్‌ ‌విడుదలకే గగ్గోలు మొదలయింది. ఓమ్‌ ‌రౌత్‌ ‌దర్శకత్వం వహిస్తే మనోజ్‌ ‌మంతాషిర్‌ ‌సంభాషణలు రాశారు. ఇద్దరూ ఇలాంటి సినిమా తీయడానికి పనికిరారని చాలా మంది విమర్శకులు ఏకగ్రీవంగా తేల్చారు.

ఆదిపురుష్‌ ‌వివాదం నేపథ్యంలో సృజనాత్మక స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వెండితెర వేల్పులు దేశం మీద వదిలిపెడుతున్న వ్యర్థాలను అలహాబాద్‌ ‌హైకోర్టు తూర్పార పట్టింది. ఆదిపురుష్‌ ‌పేరుతో ఒక అవమానకరమైన చిత్రాన్ని నిర్మించారని బాగా తలంటింది. హిందువులు సహనశీలురు కాబట్టి మీరు బతికిపోయారన్న తీరులో దును మాడింది. ఖురాన్‌ ‌మీద చిన్న డాక్యుమెంటరీ నిర్మిస్తే (ఆదిపురుష్‌ ‌తరహాలో) దేశం భగ్గున మండేది కాదా? అని సాక్షాత్తు హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. ‘మీరు ఖురాన్‌, ‌బైబిల్‌ ఇతర పవిత్ర గ్రంథాల జోలికి వెళ్లకూడదు. ఇది ఒక మతాన్ని దృష్టిలో ఉంచుకుని చెబుతున్న మాట కాదు. మీరు ఏ మతాన్ని వక్రీకరణలతో చిత్రించరాదు. కోర్టుకి మతమంటూ ఏదీలేదు. మాకు సంబంధించిన ఏకైక అంశం శాంతిభద్రతలను రక్షించడమే’ అని ముందే చెప్పింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. కానీ అందుకు కొన్ని పరిమితులను కూడా నిర్దేశించింది. ప్రజాజీవనం సాఫీగా సాగేటట్టు చూడడం, నైతికత కూడా అదే అధికరణంలో ఉన్నాయి. ఇలాంటి స్వేచ్ఛను ఇస్తున్న 19వ అధికరణాన్ని ఐపీసీలోని 295ఎ అదుపు చేస్తుంది. ఈ విషయాన్ని కోర్టులు పలు సందర్భాలలో వివరించాయి. ఆదిపురుష్‌ ‌సినిమా నిర్మించిన వాళ్లకి హిందూధర్మం మీద గౌరవం లేదన్నది కొందరు పిటిషనర్ల ఆరోపణ. వాదోపవాదాలు మాత్రం లక్నో బెంచ్‌లో జరిగాయి. అసలు ఇంతవరకు ఇలాంటి సినిమా గురించి అటు సెన్సార్‌ ‌బోర్డ్ ‌గాని, ఇటు ప్రభుత్వం గాని ఎందుకు ప్రతికూలంగా ఆలోచించ లేదు అని తీవ్రంగానే ప్రశ్నించింది. అసలు సినిమాయే ఒక అవమానకరమైనదని అని కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఖురాన్‌, ‌రామాయణం, బైబిల్‌ ఆధారమంటూ అసలు ఇలాంటి సినిమాలు నిర్మించకూడదని కోర్టు ఆదేశించింది. ఈ సినిమా మీద కోర్టు వైఖరి ఏమిటో ఐదు అంశాలతో తెలియచేసింది.

  1. ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాల ఆధారంగా ఇలాంటి సినిమా కనుక నిర్మించి ఉంటే దేశంలో శాంతి భద్రతలు ఇలా ఉండేవా? ఉదా హరణకి ఖురాన్‌ ఆధారంగా చిన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించినా కూడా దేశంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తేదో మీరు ఆలోచించ గలరా? హిందువులకు ఉన్న సహనాన్ని బట్టి ఇలాంటి సినిమా అనే ఘోరతప్పిదం నిర్మాతలు చేసినప్పటికి పరిస్థితులు అదుపు తప్పలేదు (కోర్టు ఈ వ్యాఖ్యను చేసి 1927 నాటి ఒక ఉదంతాన్ని గుర్తు చేసింది. అది కూడా మత విశ్వాసాలు, అందులో ముస్లింలు వ్యవహరించిన తీరుకు సంబంధించిన కేసే. ఇదే రంగీలా రసూల్‌ ‌కేసు. ఒక ప్రచురణ సంస్థ ప్రచురించిన కరపత్రంలో మహ్మద్‌ ‌ప్రవక్త వ్యక్తిగత జీవితం గురించి అవమానకర వ్యాఖ్యలు ఉన్నాయి. భారత శిక్షా స్మృతి, 153ఎ సెక్షన్‌ ‌ప్రకారం ఆ ప్రచురణకర్త మీద కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించడానికి కుట్ర పన్నాడన్న ఆరోపణ చేశారు. కానీ కోర్టు అతడిని నిర్దోషిగా విడిచిపెట్టింది. దీనితో కోర్టు నిర్ణయాన్ని చాలామంది విమర్శించారు. చివరికి జరిగింది ఏమిటీ అంటే ఆ ప్రచురణకర్తను ఆ సంవత్సరమే ఎవరో హత్య చేశారు. ఈ కేసు ఐపీసీలో 295ఎ సెక్షన్‌ను చేర్చవలసిన అవసరాన్ని కల్పించింది. ఉద్దేశ పూర్వకంగా మత విశ్వాసాలను గాయపరిచేవారిని ఈ చట్టం కిందనే శిక్షిస్తారు. ఆదిపురుష్‌తో ఈ సెక్షన్‌ ‌మరొకసారి చర్చకు వచ్చింది. దీనిని దుర్వినియోగం చేస్తున్నారంటూ క్రికెటర్‌ ఎంఎస్‌ ‌ధోని 2017లో కోర్టుకు వెళ్లారు. 2013లో ఆయనను శ్రీమహా విష్ణువుగా చిత్రించి ఒక పత్రిక ముఖపత్రంగా ప్రచురించింది. ఇది వివాదం రేపింది).
  2. ఒక వర్గం మనోభావాలను తీవ్రంగా గాయ పరిచిన, దేశంలో కావలసినంత అలజడిని సృష్టిం చిన ఈ సినిమా ప్రదర్శనని ఎందుకు నిలిపివేయ కూడదు? ఒక సినిమాలో శంకరుడు తన త్రిశూలం పట్టుకుని పరుగులు పెడుతున్నట్టు గతంలో చిత్రించారు. ఇప్పుడు అంతటి అవమానకరమైన రీతిలోనే రామాయణంలోని పాత్రలను చిత్రించారు. ఇలాంటి ధోరణిని అపవలసిన అవసరం లేదా?
  3. ఈ సినిమా ఇంత హాస్యాస్పదంగా చిత్రించి నప్పటికి కోర్టు మౌన ప్రేక్షక పాత్ర వహించాలా?
  4. మత విశ్వాసాలు, గ్రంథాలు ఆధారంగా ఇలాంటి సినిమాలు నిర్మించిదలుచుకున్నవారి కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించవలసిన అవసరం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. అలాంటి సినిమాలు ఏ వర్గం మనోభావాలను గాయపరచ డానికి వీలులేదని కూడా ఆదేశించింది.
  5. ఖురాన్‌, ‌బైబిల్‌ ‌పేరుతో ఇలాంటి సినిమాలు వస్తే, ఎవరైనా పిటిషన్‌ ‌వేస్తే కూడా ఇలాగే స్పందిస్తా మని కోర్టు చెప్పింది.
  6. రాములవారి త్యాగం, సోదరుల పట్ల ఆయనకున్న అనురాగం గురించి ఎందుకు సినిమా తీయలేదని ఆదిపురుష్‌ ‌సమర్ధకులను జస్టిస్‌ ‌సింగ్‌ ‌ప్రశ్నించారు.
  7. రాముడు, ఇతర రామాయణ పాత్రల ఆహార్యం గురించి వర్ణించి చెప్పే ఏ గ్రంథము లేదని ఆదిపురుష్‌ ‌నిర్మాతలు, టి-సిరీస్‌ ‌తరఫున సీనియర్‌ ‌న్యాయవాది సుదీప్‌ ‌సేథ్‌ ‌వాదించడంతో కోర్టు ఆయనకు పాఠాలు చెప్పింది. మీరు రాజ్యాంగాన్ని పూర్తిగా చదివినట్టు లేరు. మీరు మూల రాజ్యాంగ ప్రతిని చూస్తే అర్ధమయ్యేది. అందులో రాముడిని, ఇతర హిందూ దేవతలను హుందాగా ఉండే వస్త్రధారణతో చిత్రించిన విషయం తెలుస్తుంది అని కోర్టు ఆయనకు వివరించింది. దీనితో సీనియర్‌ ‌న్యాయవాదికి మాట పడిపోయింది.
  8. మీ పూజగదిలో ఇలాంటి అడ్డగోలు, అసభ్యకర రీతిలో బట్టలు కట్టిన దేవీదేవతల బొమ్మలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా అని కూడా సీనియర్‌ ‌న్యాయవాదిని కోర్టు నిలదీసింది.
  9. అసలు సెంట్రల్‌ ‌సెన్సార్‌ ‌బోర్డు ఈ సినిమా పట్ల ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కూడా కోర్టు ప్రశ్నించింది. సెంట్రల్‌ ‌సెన్సార్‌ ‌బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమీక్షించ లేదని కూడా కోర్టు ఉప సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్‌బీ పాండేను ప్రశ్నించింది.
  10. చాలామంది సీనియర్‌ ‌సభ్యులు వీక్షించిన తరువాతే ఈ సినిమాకు సర్టిఫికెట్‌ ఇచ్చారని పాండే చెప్పగానే, అలాంటి తతంగాలు నడిపే వారికి మరింత స్పృహ ఏర్పడాలని కోర్టు తీవ్రంగానే వ్యాఖ్యా నించింది.
  11. కోర్టు తన వైఖరిని వెల్లడించింది. ఆదిపురుష్‌ ‌నిర్మాతలను కూడా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నది.

ఆదిపురుష్‌ను నిషేధించాలని కోరుతూ కుల్దీప్‌ ‌తివారీ, నవీన్‌ ‌ధావన్‌ ‌దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మీద కోర్టు విచారణ జరిపింది. అంతకు ముందు రోజు కూడా ఈ వ్యాజ్యం మీద వాదోప వాదాలు జరిగాయి. ఇంత హాస్యాస్పదమైన సినిమా తీశారు కదా, నీ సోదర భారతీయులు తలకాయ లేని వారని మీకు నమ్మకమా? అని సినిమా నిర్మాతలను కోర్టు కడిగి వదిలిపెట్టింది.

ఈ సినిమా హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందనీ, రామాయణ పాత్రల మౌలిక విలువలను ధ్వంసం చేసే విధంగా చిత్రించారని మమతా రాణి అనే మరొక న్యాయవాది కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మన పురాణాలు, కావ్యాల మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ఏ వేదిక వాటిని వక్రీకరించకుండా ఆదేశాలు ఇవ్వవలసిందిగా మమతా రాణి తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి కూడా. ఈ మౌలిక గ్రంథాలు ఒక నాగరిక సమాజానికి చెందిన ఆధ్యాత్మిక భౌతిక స్వరూపానికి అద్దం పడతాయని, వాటిని బట్టే ఆ సమాజంలోని మనిషి జీవనం సాగిస్తాడని ఆమె వాదించారు. ఈ సినిమాలో ప్రధానమైన రాముడు, మారుతి పాత్రలను వాటి మౌలిక విలువలను ధ్వంసం చేసే విధంగా వక్రీకరించారని కూడా ఆమె ఆరోపించారు. మొత్తం ఆ కావ్యాన్నే వక్రీకరించారని, అన్ని పాత్రల విలువలకు ఎసరు పెట్టారని ఆమె విమర్శించారు. ఇందులో రావణపాత్రను ముఖేశ్‌ఖన్నా అభివర్ణించిన తీరు మొత్తం దర్శకుడి అజ్ఞానానికి అద్దం పడుతుంది. రావణుడు మహమ్మద్‌ ‌ఖిల్జీలా ఉన్నాడని ముఖేశ్‌ అన్నారు.

ఇది కోర్టులలో జరుగుతున్న న్యాయపోరాటం. ఇది గాయపడిన మనోభావాల తరఫున జరుగుతున్న బలమైన పోరాటమే. కానీ దేశం నలుమూలలా కూడా రామాయణ గాథను ఈ విధంగా చిత్రించినందుకు నిరసన తెలియచేస్తూ రోడ్డెక్కిన వారూ ఉన్నారు. అసలు హిందూ దేవతలను కించపరిచే విధంగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్‌ ‌సర్టిఫికెట్‌ ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న.

తాగి వాగిన వాళ్లు మాట్లాడినట్టు సంభాషణలు ఉన్నాయన్న తీవ్ర విమర్శ కూడా వచ్చింది. లక్నోతో పాటు ముంబైలో కూడా ఈ సినిమాను నిషేధించా లని నిరసన ప్రదర్శనలు జరిగాయి. సంభాషణల రచయిత మనోజ్‌ ‌మంతాషిర్‌, ‌దర్శకుడు ఓమ్‌ ‌రౌత్‌లకు చంపేస్తామంటూ క్షత్రియ కర్ణిసేన పేరుతో బెదిరింపు కాల్స్ ‌వచ్చాయి. మనోజ్‌ ‌తనకు రక్షణ కల్పించాలంటూ ముంబై పోలీసులను అభ్యర్థించ వలసి వచ్చింది. ఇదా కళ ధ్యేయం? ఈ స్థితికి ఎందుకు తీసుకు వచ్చారు? సంచలనం మీద ఎందుకు దుగ్ధ? కొందరు ప్రతిపక్షాల వారు కూడా ఈ సినిమా పట్ల తమ నిరసన ప్రకటించారు.

సినిమా హీరోల అభిమాన సంఘాల వీరావతారాలు ఎలా ఉంటాయో చాలా కాలం తరువాత మళ్లీ బయపడింది, ఈ చిత్రంతోనే. ఈ సినిమా బాగా లేదు అన్నందుకు ఒక యువకుడి మీద మిగిలినవారంతా దాడి చేశారు. ఇది హైదరాబాద్‌లో జరిగింది. అభిమాన సంఘాలు అసురగణాలుగా మారిపోయి చాలాకాలమే అయింది. అందుకు ఇది తాజా ఉదాహరణ. గతంలో కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ అభిమానులు బెంగళూరు మీద తమ ప్రతాపం చూపుతూ ఉండేవారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కొందరు హీరోల సినిమా విడుదలైనప్పుడు కొందరు వీరాభిమా నులకు వచ్చే పూనకం చూస్తే భయమేస్తుంది. మరొక చిత్రమైన ఉదంతం కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. ఇది హనుమ కోసం సీటు కేటాయింపు వ్యవహారం. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. విడుదలకు ముందే నిర్మాతలు తీసుకున్న ఒక నిర్ణయం ఫలితమిది. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లోను ఒక సీటు రిజర్వు చేసి ఉంచారు. అది మారుతి కోసమట. ఆయన ఎవరు? ఎవరో కాదు, సాక్షాత్తు రామబంటు హనుమంతుడు. ఈ సంగతి తెలియని ఒక ప్రేక్షకుడు వెళ్లి ఆ సీటులో కూర్చున్నందుకు కూడా ప్రభాస్‌ అభిమానుల ప్రతాపం చవిచూడవలసి వచ్చింది. ఆంజనేయ స్వామి పట్ల అపార భక్తి ప్రపత్తులు ఉంటే ఎవరూ కాదనలేం. ప్రశ్నించలేం కూడా. కానీ రాముడిని, సీతనీ ఇంత దారుణంగా చిత్రించిన సినిమాను హనుమ ఇన్ని థియేటర్లకు వచ్చి మరీ చూస్తాడా? చూడగలడా? చూసినా నిర్మాతల మీద, దర్శకుడి మీద తన ప్రతాపం చూపించకుండా మౌనం దాల్చుతాడా?

అసలే మనోభావాల యుద్ధంగా మారిన ఆదిపురుష్‌ ‌వివాదం సాక్షాత్తు దర్శకుడు ఓమ్‌ ‌రౌత్‌ ‌చేష్టతో మరింత వేడెక్కింది. ఆదిపురుష్‌ ‌బృందం వెంకన్న ఆశీస్సులు కోరుతూ జూన్‌ 7‌న తిరుమల వచ్చారు. ఆ పవిత్ర స్థలంలోనే అందరి ముందు సీత పాత్రధారిణి కృతిసనన్‌ ‌బుగ్గ మీద దర్శకుడు ముద్దు పెట్టాడు. దీనిని చాలామంది ఈసడించారు. కాబట్టి ఆధునిక సినీ రంగంలోని పోకడలకు బాగా అలవాటు పడిన వ్యక్తులు, స్త్రీకి గౌరవం, సాంఘిక మర్యాదలు తెలియని వారు రామాయణం చిత్రంగా నిర్మిస్తే అది హాస్యాస్పదమే అవుతుంది.

వాల్మీకి రామయ్యను ఇలాంటి సినిమాలలో కనిపించే కోట్ల రూపాయలతో తయారైన రాముడిలో చూడవద్దని దేశ యువతికి విజ్ఞప్తి. వాల్మీకి రామాయణంలో కనిపించే రామచంద్ర ప్రభువు అద్భుత వ్యక్తి. మర్యాద రామన్న. ఆదర్శ పురుషుడు. అసలు కావ్యం దగ్గరికి వెళదాం. ఆ మహోన్నత కావ్యంలో తరువాతి కాలాలలో చేరిపోయిన అబద్ధాల నిజరూపం కూడా తెలుస్తుంది. ఆదిపురుష్‌ ‌లేవనెత్తిన దుర్గంధానికి విరుగుడుగా రామానంద్‌ ‌సాగర్‌ ‌రామాయణం టీవీ సీరియల్‌ ‌త్వరలో మరొకసారి ప్రసారం కాబోతున్నది. ఇదొక శుభవార్త.


అన్ని చోట్లా అదే పైత్యం

ఆదిపురుష్‌ ‌హిందూ సమాజాన్ని గట్టిగానే కదిలించింది. అసలు బాలీవుడ్‌లో నిర్మిస్తున్న హిందూ వ్యతిరేక చిత్రాల కోసం ఒక సనాతన సెన్సార్‌ ‌బోర్డును ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ సంత్‌ ‌సమితి అక్టోబర్‌, 2022‌లో విజ్ఞప్తి చేసింది. ఆదిపురుష్‌ ‌ట్రయిలర్‌ ‌విడుదలైన సమయంలోనే ఢిల్లీలో జరిగిన సంత్‌ ‌సమితి ఈ మేరకు గట్టిగా కోరింది. సాధువుల కోరికలో అతిశయోక్తి లేదు. దీనిని చాదస్తంగా చెప్పడమూ దుస్సాహసమే. హిందూత్వను అవహేళన చేస్తూ, హిందూ దేవుళ్లను హాస్యపాత్రలను చేస్తూ చాలా సినిమాలే వచ్చాయి.

విశాల దృక్పథం కలవారంటూ హిందువులను నమ్మించడం వల్ల హిందూ దేవుళ్లను వెకిలిగా చిత్రించినా వారు మాట్లాడడం లేదు. అసలు దేవుడిని అలా చిత్రించడం సరైనదేనని ఎవరైనా వాదిస్తే, ముస్లింల దైవాలను, క్రైస్తవుల దేవుళ్లను ఎందుకు వెకిలిగా చిత్రించడం లేదు? లేదా సిక్కు గురువులను ఎందుకు అవహేళన చేయడం లేదు. ఎందుకంటే వాటిని ప్రదర్శించిన థియేటర్లు బూడిదవుతాయి. జనం చస్తారు.. అంటారు ప్రముఖ రచయిత అమృత్‌ ‌హల్లాన్‌.

ఆమీర్‌ఖాన్‌ అనే నటుడు పీకే అనే పేరుతో తీసిన సినిమా అప్పుడు చాలా వివాదాలను మూటగట్టు కుంది. దాదాపుగా అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఆ సినిమాలో పీకే అనే ప్రధాన పాత్ర అన్ని మతాల దేవుళ్లనీ విమర్శిస్తుంది. కానీ మిగిలిన మతాల వరకు దేవుడు పేరుతో జరుగుతున్న వ్యాపారం గురించి ప్రశ్నిస్తాడు. అదే హిదూధర్మం దగ్గరకు వచ్చే సరికి, అసలు దేవుడు అనే వ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తాడు. అదే తేడా. గడచిన కొద్దికాలంలో శివుడిని వెకిలిగా చూపిస్తూ భారతదేశంలో ఆరు సినిమాలు వచ్చాయంటేనే వాళ్ల మదం ఎలా ఉన్నదో తెలుస్తుంది. అందులో పీకే ఒకటి. ఇందులో శివుడు బుర్ఖాలు ధరించిన ఇద్దరు మహిళలను రిక్షాలో తాను తొక్కుకు తీసుకువెళ్లే సన్నివేశం ఉంది. అలాగే టాయిలెట్‌లోకి కూడా శివుడు వెళతాడు. దీనితో సినిమా నిర్మాత, దర్శకుడి మీద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోద యింది. బ్రహ్మచారి, మగరాయుడు, ఆపద్బాంధవుడు సినిమాలలో కూడా శివుడిని అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయి.

హిందూధర్మాన్నీ, దానితో జనానికి ఉన్న అనుబంధాన్నీ ఏ విధంగా తెర వెనుక అంశంగా ఉంచుతారో (హిందీ సినిమాలలో) అమృత్‌ ఒక వ్యాసంలో రాశారు. ‘102 నాట్‌ ఔట్‌’ అన్న పేరుతో, అమితాబ్‌, ‌రిషి కపూర్‌ ‌నటించిన చిత్రం వచ్చింది. అందులో తండ్రిగా అమితాబ్‌ ‌నటించారు. కొడుకు పాత్రలో రిషి కనిపిస్తారు. సినిమాలో చివరికి రిషికి ఒక అస్తిత్వ సమస్య ఎదురవుతుంది. అతడు ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఒక చర్చ్‌లో కూర్చుని ఉన్నట్టు దర్శకుడు చిత్రించాడు. అలా అని ఆ తండ్రీకొడుకులు క్రైస్తవులు కారు. అయినా చర్చ్‌ను ఎందుకు ఎంచుకున్నాడు? గుడిలో కూర్చుని తండ్రి గురించి ఆలోచించినట్టు చూపిస్తే నగర ప్రాంత ప్రేక్షకులు అర్ధం చేసుకోలేరని దర్శకుడి అంతరంగం కాబోలు. ‘హిచ్‌కి’ అనే చిత్రంలో ఒక చిన్న లోపం ఉన్న యువతి ఉపాధ్యాయిని ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవ్వరూ ఇవ్వరు. ఆ లోపాన్ని చూపించి వదిలించుకుంటూ ఉంటారు. చివరికి ఒక క్రైస్తవ పాఠశాలలో, ముస్లిం ప్రిన్సిపాల్‌ ఆమెకు ఉద్యోగం ఇస్తాడు.

చాలాకాలం క్రితం అమర్‌ అక్బర్‌ ఆం‌థోని అనే పేరుతో సినిమా వచ్చింది. అంతా పెద్ద నటులే ఉన్నారు. ఇందులో ముగ్గురు అన్నదమ్ములు చిన్న తనంలో తప్పిపోతారు. ముస్లిం చేరదీసిన అక్బర్‌కు అతడి పెంపుడు తండ్రి మతానికి సంబంధించిన అన్ని సుగుణాలు బోధిస్తూ ఉంటాడు. దర్గాలో హితబోధలు చేస్తాడు. దర్గాల ఔన్నత్యాన్ని కీర్తిస్తూ అక్బర్‌ ‌పాటలు పాడతాడు. అలాగే క్రైస్తవుల కుటుంబంలో పెరిగిన ఆంథోనికి కూడా తండ్రి మత సంప్రదాయాలన్నీ చెబుతాడు. అనేక సంభాషణలు చర్చ్‌లోనే జరుగుతాయి. ఇతడు జీసస్‌తో మాట్లాడ తాడు. కానీ హిందు అమర్‌ను మాత్రం అతడు హిందువుగా పెరిగినట్టు ఎక్కడా చూపరు.

స్వచ్ఛమైన హిందీ భాషలో సంభాషణలు చెప్పించడం కేవలం పాత్రలను వెక్కిరించడానికి మాత్రమే ఉపయోగించే అలవాటు కనిపిస్తుంది. స్వచ్ఛమైన హిందీ మాట్లాడే పాత్ర ఛాందసానికి ప్రతీకగా ఉంటుంది. అదే సమయంలో ప్రేమ సన్నివేశాలలో ఉర్దూ కవిత్వం వాడుతూ ఉంటారు. ఎక్కడైనా పాత్ర ఔచిత్యాన్ని మరింత ఉన్నతంగా చూపడానికి వాడేది ఇంగ్లిష్‌ ‌మాటలు. పాటల విషయంలో కూడా అంతే. గాఢమైన ప్రేమ సన్నివేశా లలో వినిపించే పాటలలో ఉర్దూ పదాలు, పర్షియన్‌ ‌సామెతలు గుప్పిస్తారు. స్వచ్ఛమైన హిందీలో రాసే పాట హాస్య సన్నివేశాలకు పరిమితం చేస్తారు.

తెలుగు, తమిళ చిత్రాలు కూడా హిందూ దేవుళ్లను కించపరచడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నాయి. దీని మీద ఒక వ్యాఖ్య ఉంది. బాలీవుడ్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం చేతిలో నలిగిపోతున్నది. కోలీవుడ్‌ ‌మిషనరీ చేతిలో కీలుబొమ్మగా మారింది. మలయాళ చిత్రాలలో వెకిలి పాత్రలన్నీ కూడా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులవే.

About Author

By editor

Twitter
YOUTUBE