వెయ్యి సంవత్సరాలకు పైగా వలసపాలనలో ఉన్నప్పటికీ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ వచ్చిన భారతదేశాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలనే పట్టుదలతో పని చేస్తున్నవారి సంఖ్య ఇప్పటికీ తగ్గలేదు. తాజాగా, వార్తలలోకెక్కిన జార్జ్ సోరోస్ అన్న వ్యక్తి ఈ కోవలోకే వస్తాడు. అత్యంత సంపన్నుడైన ఈ వ్యక్తికి విపరీత పోకడలు ఎక్కువ. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు, తన అహాన్ని చల్లార్చుకునేందుకు ఆయన దేశాలలో ఉన్న పలు సమస్యలను ఆసరాగా చేసుకుని అక్కడ చిచ్చుపెడుతుంటాడు. భారత దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నిక కావడం ఆయనకు అసలు రుచించలేదు. ఇంకేం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొదలెట్టేశారు. దాని ఫలితమే షాహీన్‌బాగ్, వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం తదితర పోరాటాలన్నీ.
దాతృత్వం ముసుగులో ఎప్పటి నుంచో స్వచ్ఛంద సంస్థలకు సహాయం అందిస్తూ, ఆయా దేశాలలోని పరిస్థితులను అతలాకుతలం చేయడం అతని ప్రత్యేకత. ఇందుకుగాను, ఆయన ఏర్పాటు చేసిన సంస్థ పేరు ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్’ (ఒఎస్‌ఎఫ్). 1979లో ఏర్పాటైన ఒఎస్‌ఎఫ్ సుమారు 120 దేశాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సామాజిక న్యాయం పేరిట ఉద్యమాలు చేస్తూ, చేయిస్తూ ఉంటుంది. ఈ రకంగా మీడియా నుంచి రకరకాల పేర్లు కలిగిన స్వచ్ఛంద సంస్థల వరకు ఈ సంస్థ నుంచి నిధులు అందుకుని, సోరోస్ కోరుకునే వాతావరణాన్ని దేశంలో సృష్టించేందుకు శాయశక్తులా పని చేస్తున్నాయి. తన అపారమైన సంపదతో దేశ నాయకులను కీలుబొమ్మల్లా ఆడిస్తుంటాడనే కుట్ర సిద్ధాంతాలు సోరోస్ మీద కోకొల్లలు.
సోరోస్ – ఒఎస్‌ఎఫ్‌కు వ్యతిరేకంగా విమర్శలు
- ఎన్నికలలో జోక్యం: ఎన్నికల/ రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసేలా తన అపార సంపదను వినియోగిస్తాడన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.
- నూతన ప్రపంచ వ్యవస్థ/ క్రమాన్ని సృష్టించడం: అంతర్జాతీయ ప్రభుత్వం లేదా ‘నూతన ప్రపంచ వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలన్నది సోరోస్ లాలస అన్న ఆరోపణలు అనేకం.
- ఉద్యమాలకు, నిరసనలకు నిధులు: వివిధ దేశాలలో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు నిధులను సమకూర్చడంద్వారా ప్రభుత్వాలను అస్థిరం చేయడం.
- దేశ సార్వభౌమత్వాన్ని బలహీనపరచడం: సామాజిక ప్రయోజనాలు, సాధికారత, హక్కుల పేరుతో వాటికి మద్దతు ఇస్తూ, దేశాల అంతర్గత వ్యవహా రాలలో కలుగచేసుకునే విధంగా వ్యవహ రిస్తూ, ఆ దేశాల సార్వభౌమత్వాన్ని ధిక్కరించడం.
తన కార్యకలాపాల కోసం భారత్ వంటి దేశాలకు చెందినవారిని చేరదీసి, వారికి తమ సంస్థలలో అత్యున్నత బాధ్యతలను అప్పగించడం సోరోస్ ఎత్తుగడలలో ఒకటి. అటువంటి వ్యక్తే ఒఎస్‌ఎఫ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి.
ఈ సలీల్ శెట్టి తండ్రే విటి రాజ్‌శేఖర్‌గా ప్రాచుర్యం పొందిన ఒంటిబెట్టు తిమ్మప్ప రాజశేఖర శెట్టి. అతను జర్నలిస్టు, హక్కుల కార్యకర్త. దాదాపు 25 ఏళ్లపాటు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో పని చేసిన శెట్టి, ‘దళిత్ వాయిస్’ పేరుతో పత్రికను ప్రారంభించేందుకు 1981లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. భారత్ వ్యతిరేక భావనలతో, వివాదాస్పదమైన రాతలు రాస్తుండడంతో, 1986లో అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, తీవ్రవాదం, దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడన్న ఆరోపణలు మోపి, ప్రభుత్వం అరెస్టు చేసింది. తొలుత వామపక్షవాది అయిన అతను, తర్వాత కాలంలో ఇస్లామిస్టు భావజాలానికి దగ్గరవ్వడమే కాదు, భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించేందుకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతేనా, ద్రవిడ, ఆర్య సిద్ధాంతాన్ని బలంగా సమర్ధిస్తూ, అగ్రకులాలవారు ఆర్య ఆక్రమణదారులంటూ విపరీతంగా ప్రచారం చేశాడు. ఇంతగా ఇస్లాంను సమర్ధించిన శెట్టి, హిట్లర్ మద్దతుదారుడంటే ఆశ్చర్యం కలగడం సహజమే కదా? నాజీలు అసలు మారణహోమానికే పాల్పడ లేదని, అది జియోనిస్టుల కుట్ర అని ప్రచారం చేశాడు. అంతేనా? భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు తెరతీసేందుకు బ్రాహ్మణ జాతిని విధ్వంసం చేయాలంటూ బహిరంగంగా పిలుపిచ్చాడు. హిందూ సంస్కృతిని పురుషాధిపత్య సంస్కృతిగా అభివర్ణిస్తూ, విమర్శల వర్షాన్ని కురిపించిన అదే వ్యక్తి, ‘నిఖా హలాలా’ను, ‘త్రిపుల్ తలాక్’ను సమర్ధించడం అన్నది అతనిలోని కపటత్వాన్ని బట్టబయలు చేస్తుంది. అంతేనా, అతడు ‘బుర్ఖాను కానీ పరదా’ను కానీ అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం.
భారతదేశంలో ఉన్న సామాజిక సమస్యలను ఆధారంగా చేసుకుని, అనేక ‘స్తాన్’ల కోసం పోరాటం చేసేందుకు ఒఎస్‌ఎఫ్ నిధులు సమకూరుస్తూ వస్తోంది. ఆ విషయం ఇటీవలి కాలంలో బయట పడడంతో అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఖలిస్తాన్, దళిస్తాన్, ద్రవిడిస్తాన్, కాశ్మీర్ సహా పలు వేర్పాటు ఉద్యమాలకు ఒఎస్‌ఎఫ్ మద్దతు ఉంది. అబద్ధపు వార్తలను, ప్రచారాలను ఆధారాలతో సహా బయిటపెట్టే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. డిస్‌ఇన్ఫో ల్యాబ్. ఆర్గ్ అనే వెబ్‌సైట్ దళిస్తాన్ వెబ్‌సైట్ చేసే అబద్ధపు ప్రచారాన్ని బయిటపెట్టింది. కావాలనే దళిస్తాన్ భారత్ దేశపు సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతకు విఘాతం కలిగించడం ద్వారా భారత్‌ను ఖండ ఖండాలు చేయాలన్న మీటి రాజ్‌శేఖర్ ఉద్దేశ్యమని, విదేశీ సంస్థల మద్దతుతో ఈ కారణంగా డిజిటల్ దళిత ఉద్యమం భారత్‌లో ఉధృతమైంది. మీటి రాజశేఖర్ అనంతరం వచ్చిన అతడి కుమారుడు ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
‘బ్రేకింగ్ ఇండియా’ (భారత్‌ను విచ్ఛిన్నం చేసే) శక్తుల అజెండాను విఘాతం కలిగిస్తూ, జులై 11, 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్ల తర్వాత కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిషేధించిన 18 వెబ్‌సైట్లలో దళిస్తాన్ కూడా ఉండడం గమనార్హం. ఈ చర్యద్వారా భారత్ విచ్ఛిన్నాన్ని అడ్డుకున్నామని ప్రభుత్వం భావించినప్పటికీ, అది మరొక పరిణామానికి దారి తీసింది.
డిస్‌ఇన్ఫో ల్యాబ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ బ్రేకింగ్ ఇండియా శక్తులన్నీ 2006 అనంతరం యునైటెడ్ స్టేట్స్‌లో మకాం వేశాయి. భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలన్న ‘బాల్కనైజ్ ఇండియా’ ప్రాజెక్టు బహురూపిలా అనేక వేషాలు మార్చుకుని అంతిమంగా, అందరికీ ఆమోద యోగ్యంగా అనిపించే ‘ఈక్వాలిటీ లాబ్స్’గా స్థిరపడింది. ఈ కాలంలో వచ్చిన మరొక చెప్పుకో దగిన మార్పు ఏమిటంటే, క్రైస్తవ మిషనరీల స్థానంలో ఫిలాంత్రొపిస్టులు (లోకోపకారులు, దాతలు) రావడం. భారత సమాంలో అత్యంత సున్నితమైన దళిత ఉద్యమానికి ఈ కార్యకర్తలు, దాతలు మార్గదర్శనం, చేసి నిధులు సమకూరుస్తున్నారు.
తండ్రి బాటలో తనయుడు
ఒఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సలీల్ శెట్టి తన తండ్రి విటి రాజశేఖర్ శెట్టి అడుగుజాడలను అనుసరిస్తూ భారత్‌లో సోరోస్‌కు అత్యంత విశ్వసనీయమైన దూతగా ఉన్నాడు. సోరోస్ సంస్థలో చేరకముందు సలీల్ శెట్టి విప్రో, యాక్షన్ ఎయిడ్ ఇండియాలో, తర్వాత యాక్షన్ ఎయిడ్ కెన్యాలో పనిచేశాడు. 1998 నుంచి 2003 వరకు యాక్షన్ ఎయిడ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశాడు.
కాగా, 2004లో ఇంటెలిజెన్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం యాక్షన్ ఎయిడ్ కూడా గ్రీన్‌పీస్ ఇండియా, కార్డ్ ఎయిడ్, ఆమ్నెస్టీ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్థానికంగా ఉన్న పియుసిఎల్, నర్మదా బాచావ్ ఆందోళన్ వంటి సంస్థల ద్వారా అభివృద్ధి వ్యతిరేక పోరాటాలకు ఊతమిస్తోంది. ముఖ్యంగా, నిర్మాణంలో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను వీరు ఎలా వ్యతిరేకిస్తున్నదీ వివరించింది. భారతదేశంలో సోరోస్‌ను వివిధ ప్రముఖులు, వ్యక్తులు, సంస్థలతో కలపడంలో సలీల్ శెట్టి కీలకపాత్ర పోషిస్తాడనే భావన విస్త్రతంగా ఉంది. 2010 నుంచి 2018 వరకు సలీల్ శెట్టి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రెటరీ జనరల్‌గా పని చేశారు. అయితే, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) ఉల్లంఘనల కింద ఆమ్నెస్టీ ఇంటర్నే షనల్ ఇండియా శాఖ మూతపడిన విషయం తెలిసిందే.
కాగా, భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న రెండవ తరం వేర్పాటువాది సలీల్ శెట్టి అనే విషయం గమనార్హం. అటువంటి వ్యక్తి, భావిప్రధాని కావాలని కలలు కనే రాహూల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆయన వెంట నడవడం దేనికి సంకేతం?
(‘ఆర్గనైజర్’ నుంచి)