– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో ఉచిత, సంక్షేమ పథకాల ఉచ్చు అధికార పక్షాన్ని చుట్టుకుంటోంది. తాజాగా రైతులకు అందించే ఉచిత విద్యుత్‌ అం‌శం పైన దుమారం చెలరేగుతోంది. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నా మని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ, ఇటీవల కాలంలో విపక్షాలు చేస్తున్న నిరసనలతో అసలు బండారం బయటపడు తోంది. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నా మన్న వాదన అంతా వట్టిదే అని బట్టబయలవుతోంది. దీనిపై చర్చ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వేర్వేరు వాదనలు వినిపిస్తున్నారు. ఈ అంశంపై చర్చ మొదలయ్యే దాకా రోజుకు 12 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్‌ ‌సరఫరా చేశారని, ఇప్పుడు మాత్రం సమయాన్ని 20 గంటలకు పెంచారని చెబుతున్నారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్నది నిజం కాదనే వాదనకు బలం చేకూరుతోంది. అవసరమైన చోట్ల, అవసరం మేరకు మాత్రమే విద్యుత్తు సరఫరా జరుగుతోందని క్షేత్రస్థాయి పరిణామాలు చెబుతున్నాయి. ఇటు అధికార యంత్రాంగం, మరోవైపు అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలు కూడా ఇది నిజమేనని నిర్ధారిస్తున్నాయి.  విద్యుత్తు ఎన్ని గంటలు ఇస్తున్నామనే విషయం ముఖ్యం కాదని, నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించారు. మరోవైపు.. రైతులకు అసలు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని, అయినా 24 గంటల కరెంట్‌ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు 24 గంటలు విద్యుత్తు సరఫరా జరగడం లేదని చెప్పకనే చెబుతున్నాయి. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సబ్‌స్టేషన్లలో ఉండే లాగ్‌బుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకోవడం, ఒకవేళ సబ్‌స్టేషన్లలో ఉంచినా.. వాటిని ఎవరికీ చూపించవద్దని సిబ్బందికి ఆదేశాలివ్వడం కూడా దీనిని నిర్ధారిస్తున్నాయి. వాస్తవానికి టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్‌ ‌టి.శ్రీరంగారావు 2022 మార్చి 23న ఓ ప్రకటన చేస్తూ.. వ్యవసాయానికి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల దాకా పీక్‌ ‌పీరియడ్‌లో కరెంట్‌ అవసరం లేదని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారని, ఆ మేరకు డిస్కమ్‌లకు సూచనలు ఇస్తామని చెప్పారు. ఆయన సూచనను డిస్కమ్‌లు పాటించాయన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది.

వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్కులను పరిశీలించి.. అక్కడే తేల్చుకుందామంటూ విపక్షాలు విసిరిన సవాల్‌తో అధికార బీఆర్‌ఎస్‌ ఇరుకున పడింది. ప్రస్తుతం ఆ సవాల్‌ను తప్పించుకొని.. 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదనే సత్యాన్ని అంగీకరించే దిశగా ప్రకటనలు చేస్తోంది. ట్రాన్స్‌కో సీఎండీ, మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు అందులో భాగమేనని తెలుస్తోంది.

సబ్‌స్టేషన్ల వద్ద ఉండే కీలకమైన లాగ్‌బుక్‌లే కేంద్రంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌చేసిన సవాలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టినట్లే తెలుస్తోంది. వాస్తవానికి రెండేళ్లుగా వ్యవసాయ రంగానికి త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ‌సరఫరాపై డిస్కమ్‌లు నియంత్రణ విధిస్తున్న విషయం విదితమే. పలు చోట్ల 9 నుంచి 12 గంటలే వ్యవసాయానికి త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఇస్తున్నారు. అయితే త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ‌సరఫరాపై నియంత్రణ కొనసాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ అధికార పార్టీని టార్గెట్‌ ‌చేస్తూ ఉద్యమిస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌కు లాగ్‌బుక్‌ అనే బలమైన ఆయుధం లభించినట్లయింది. క్షేత్రస్థాయిలో సబ్‌స్టేషన్ల నుంచే అన్ని రంగాలకు కరెంట్‌ ‌సరఫరా అవుతోంది. ఇక్కడ షిఫ్టులవారీగా పనిచేసే సిబ్బంది… విద్యుత్తు సరఫరా ఏ సమయంలో ఆగిపోతుంది? ఏ సమయంలో ఇస్తున్నామనే వివరాలన్నీ సమయం వేసి మరీ రికార్డు చేస్తుంటారు. అయితే 24 గంటల పాటు రైతులకు త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఇవ్వడం లేదనే విషయం కూడా నల్లగొండ జిల్లాలోని సబ్‌స్టేషన్‌లలో ఉండే లాగ్‌ ‌బుక్‌లతోనే తేటతెల్లమయింది. కాంగ్రెస్‌ ‌లాగ్‌బుక్‌లే కేంద్రంగా అధికార పక్షాన్ని టార్గెట్‌ ‌చేయడంతో ఆ పుస్తకాలను ఆపరేటర్లంతా ఏఈల చేతికి అప్పగించాలనే ఆదేశాలు వెళ్లాయి. దీంతో అవన్నీ సబ్‌స్టేషన్‌ల నుంచి మాయమయ్యాయి.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా పరిధిలో పలు సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లను ఏఈలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల లాగ్‌బుక్‌ ‌లను ఎవరికీ చూపించొద్దని సబ్‌స్టేషన్లలోని ఆపరేట ర్లకు ఏఈలు, ఇతర ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించినట్లు కొందరు సబ్‌స్టేషన్‌ ‌నిర్వాహకులు చెప్పారు. నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్‌లన్నింటినీ ఏఈలు తెప్పించు కొని తమ వద్ద ఉంచుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాగ్‌బుక్స్ ‌సబ్‌స్టేషన్లలోనే ఉన్నా.. వాటిని ఎవరికీ చూపించవద్దని, ప్రజాప్రతినిధులు, విలేక రులు వచ్చినా ఫొటోలు తీయనివ్వవద్దని ఆపరేటర్లకు అనధికారిక ఆదేశాలు ఇచ్చారు. వికారాబాద్‌ ‌జిల్లాలో రెండు, మూడు రోజుల క్రితం కొన్ని సబ్‌స్టేషన్ల నుంచి లాగ్‌బుక్‌లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రాల్లోని సబ్‌స్టేషన్లకు కొత్తవి సరఫరా చేశారు. ఇతర సబ్‌స్టేషన్లకు ఇంకా ఇవ్వకపోవడంతో నోట్‌ ‌బుక్‌ల్లో నమోదు చేస్తున్నారు.

ఐదు రోజుల క్రితం దాకా రోజుకు 12 గంటల పాటే త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఇచ్చిన డిస్కమ్‌లు.. ప్రస్తుతం 20 గంటలకు పైనే కరెంట్‌ ‌సరఫరా చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఐదురోజుల క్రితం వరకు 9 గంటలు విద్యుత్తు సరఫరా ఉండగా, నాలుగు రోజులుగా 24 గంటలు సరఫరా చేస్తున్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజూ వ్యవసాయానికి 10 నుంచి 12 గంటలే కరెంట్‌ ఇస్తున్నారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో పగటిపూట త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఇస్తుండగా, కొన్ని మండలాల్లో రాత్రి 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు రోజుల కిందటి దాకా రోజుకు 12 గంటల పాటు కరెంట్‌ ఇచ్చిన అధికారులు.. నాలుగు రోజులుగా రోజుకు 18 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. ఇక హన్మకొండ జిల్లాలో రోజుకు 6 నుంచి 12 గంటలు మాత్రమే ఇస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కరెంట్‌ అం‌దుతోంది. వనపర్తి జిల్లాలో కొన్ని చోట్ల 12 గంటలు, మరికొన్ని చోట్ల 14 గంటలు కరెంట్‌ ఇస్తున్నారు.

2022 ఏప్రిల్‌లో ఎన్‌పీడీసీఎల్‌లో షెడ్యూల్‌ ‌విడుదల చేసి, ఏ సర్కిల్‌ ‌పరిధిలో ఎంత మేర కరెంట్‌ ఇవ్వాలనేది అధికారికంగా నిర్ణయించారు. కానీ, ఏడు గంటల పాటే విద్యుత్తు అందించారు. ఏ రోజు కారోజు షెడ్యూల్‌ ‌విడుదల చేసి.. అధికారికంగా కోతలు అమలుచేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. ప్రభుత్వం షెడ్యూల్‌ను పక్కనపెట్టి, మౌఖిక ఆదేశాలతో కరెంట్‌ ‌కోతలు అమలు చేసింది. వాస్తవానికి ఉదయం 6 నుంచి 9 గంటల దాకా పీక్‌ ‌పీరియడ్‌ ఉం‌టుంది. తిరిగి సాయంత్రం 6 నుంచి 10 గంటల దాకా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బహిరంగ విపణిలో కరెంట్‌ ‌కొనుగోలు చేయాలంటే భారీగా వెచ్చించాలి. ఇది వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో డిస్కమ్‌లు కరెంట్‌ ‌కోతలు అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌పై చర్చ మొదలైన తర్వాత కూడా డిస్కమ్‌లు వ్యవసాయానికి 12 గంటలలోపే కరెంట్‌ను సరఫరా చేస్తున్నాయి.

రాష్ట్రంలో రెండేళ్లుగా వ్యవసాయ విద్యుత్తు వినియోగంపై డిస్కమ్‌లు కఠినంగా నియంత్రణ విధిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ఎప్పుడొస్తుందో తెలియక త్రీఫేజ్‌ ‌కోసం రైతులు కళ్లలో కాగడా పెట్టుకొని ఎదురుచూడాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల పగటిపూట సరఫరా చేయగా, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం, ఇంకొన్ని చోట్ల రాత్రిపూట త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఇచ్చారు. వ్యవసాయ మోటార్లన్నీ త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఉం‌టేనే నడుస్తాయి. కానీ కేవలం సింగిల్‌ ‌ఫేజ్‌ ‌కరెంట్‌కే డిస్కమ్‌లు పరిమితమవుతున్నాయి. దాంతో బోర్లలో పుష్కలంగా నీళ్లున్న రైతులంతా మోటార్లకు ఆటోమేటిక్‌ ‌స్టార్టర్లు బిగిస్తున్నారు. త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ‌వచ్చినప్పుడే మోటార్లు పనిచేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీళ్లు అంతంత మాత్రంగా ఉన్న బోరుబావులు ఉన్న రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రీఫేజ్‌ ‌కరెంట్‌ను ఏ ప్రాంతంలో ఏయే సమయంలో ఇవ్వనున్నామనే అంశంపై డిస్కమ్‌లు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.

వ్యవసాయ మోటార్లకు 2018 జనవరి 1 నుంచి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని విద్యుత్తు సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఏ రైతు కోరకపోయినా ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇది కూడా కొంతకాలం పాటే నడిచింది. నాలుగున్నరేళ్లుగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా కోత విధిస్తున్నారు. 24 గంటల కరెంట్‌ ‌నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పట్లో పలు జిల్లా పరిషత్తులు తీర్మానం కూడా చేసి ప్రభుత్వానికి పంపించాయి. విద్యుత్తు సంస్థల అధికారులు కూడా 24 గంటల కరెంట్‌ ‌వద్దని ముఖ్యమంత్రికి చెప్పారు. అయినా కేసీఆర్‌ ‌వినకపోవడంతో డిస్కమ్‌ల పరిస్థితి ఉల్టా పల్టా అయింది. ఎనిమిదేళ్లలో రూ.46 వేల కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగానే త్రీఫే•జ్‌కు క్రమంగా మంగళం పాడాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE