కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో సెంగోల్‌ (‌రాజదండం) ను ప్రతిష్టించడమంటే దేశాన్ని వెనక్కి తీసుకుపోవడమేనని ప్రతిపక్షాలు తేల్చేశాయి. రాజదండాన్ని నిలబెట్టడమంటే తిరోగమనమేనని ఉదారవాదులు, సెక్యులరిస్టులు సైతం నిర్ధారించారు. కానీ దేశం పురోభివృద్ధి చెందాలంటే ఉమ్మడి పౌరస్మృతి అవసరమని రాజ్యాంగం ఘోషిస్తున్నది. సుప్రీం కోర్టు చాలాసార్లు హెచ్చరించింది. సెంగోల్‌ను పార్లమెంట్‌కు తెచ్చిన ప్రభుత్వమే దానిని ప్రతిపాదిస్తున్నది. ఈ విషయం దగ్గర మాత్రం ఆ గొంతులలో వెలక్కాయలు దిగాయి. మైనారిటీలను ఓటర్లుగా చూస్తున్న పార్టీలు, బీజేపీ ఏం చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న సంస్థలు, ఆధునిక పరిజ్ఞానంతో దేశాన్ని, తమ వర్గాన్ని ఏడో శతాబ్దంలోకి ఈడ్చుకు వెళ్లాలని కంకణం కట్టుకున్న ముస్లిం మతోన్మాదులు ఏకం కావడం వల్ల దేశానికీ, సామరస్యానికీ, మహిళలకీ, సమాన హక్కుకు ఎవరూ తీర్చలేనంత చేటు జరిగింది.

ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ ‌యూసీసీ), లేదా ఏకరూప చట్టం తేవాలని బీజేపీ ప్రభుత్వం నడుం కట్టిన మాట నిజమే. ఆ అంశం ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఉన్న సంగతీ వాస్తవమే. అయినా అది రాజ్యాంగకర్తల ఆశయం. సుప్రీంకోర్టు ఆదేశం. ఆ కోణం నుంచి పరిశీలించాలి. రాజ్యాంగం చెబితే ఏమిటి? సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఏమిటి? అలాంటి చట్టం పేరు చెబితే మైనారిటీ ఓట్లు పోతాయి కదా అని ఆలోచించడం అమానుషం. భారతీయులందరినీ మతం, ప్రాంతం, వర్గం, తరగతులతో సంబంధం లేకుండా ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావడమే ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం. ఉమ్మడి నేరస్మృతిలాగే ఉమ్మడి పౌరస్మృతీ అందరికి ఒకే విధంగా వర్తిస్తుంది. వివాహం, విడాకులు, ఆస్తి వ్యవహారాలు, దత్తత స్వీకారం ఇవన్నీ పౌరులందరికీ ఒకే విధంగా అమలు చేయడమే దీని ఆశయం. దీనికి మూలం ఏమిటి? రాజ్యాంగంలోని 44వ అధికరణ. భారత భూభాగంలో ఉండే పౌరు లందరికీ సమానంగా వర్తించే ఒక చట్టం తీసుకు రావాలని అది స్పష్టం చేస్తున్నది. పర్సనల్‌ ‌లా పరిధి నుంచి తప్పించి అందరికీ ఒకే చట్టం అమలు చేసే దిశగా జరుగుతున్న ప్రయాణమే ఉమ్మడి పౌరస్మృతి. 44వ అధికరణం చెబుతున్నదే ఒకే దేశం ఒకే చట్టం గురించి. ఈ అధికరణం ప్రాధాన్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఆదేశిక సూత్రాల గురించి చెప్పే అధికరణమిది. వివక్షకు గురయ్యే అవకాశ మున్న వర్గాలను దాని నుంచి తప్పించడం, భిన్నత్వం కలిగిన భారతీయ సంస్కృతిలో సామరస్యం తీసుకు రావడమే దాని ఆశయం. అదే సమయంలో వాస్తవిక తను దృష్టిలో ఉంచుకున్న అధికరణ కూడా. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం అవసరమే కానీ అది స్వచ్ఛందంగా జరగాలని అంటుంది. 35వ అధికరణాన్ని ముసాయిదా రాజ్యాంగంలో చేర్చినది కూడా ఈ ఉద్దేశంతోనే. దేశం సంసిద్ధంగా ఉన్నప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యాంగంలో చేర్చాలి.

 పర్సనల్‌ ‌లా-మతం, కులం, విశ్వాసం, నమ్మకం ఆధారంగా ఆయా సమూహాలకు మాత్రమే వర్తించే చట్టం. ఈ చట్టంలోని సూత్రాలు కేవలం మత సంప్రదాయాలు, వాటి గ్రంథాలు నిర్దేశించినవి. హిందూ పర్సనల్‌ ‌లా అయినా, ముస్లిం పర్సనల్‌ ‌లా అయినా అలా ఏర్పడినవే. ఇలా ఆధునిక కాలానికి చెందని చట్టాలు, మత గ్రంథాల ఆధారంగా నిర్మించుకున్న నియమాల స్థానంలో ఆధునిక కాలానికి సరిపోయే చట్టాలను రూపొందించడమే ఉమ్మడి పౌరస్మ్మతి. ఈ వివాదం, తేవాలన్న ప్రయత్నం, తర్జనభర్జనలు వందేళ్ల నాటివి. ఇంత కాలానికైనా దేశ సమైక్యతకు అవసరమైన ఇలాంటి ఒక చట్టం తీసుకువస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టిన పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీయే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఉమ్మడి పౌరస్మృతి నిర్మాణం, అమలు తమ ఆశయమని బీజేపీ ప్రకటించింది. సంప్రదాయంలోని మంచిని తీసుకుని, సమాజం మొత్తాన్ని ఆధునిక కాలానికి తగినట్టు సామరస్యపూర్వక వ్యవస్థగా తయారు చేయడానికి ఉపకరించేదే ఉమ్మడి పౌరస్మృతి.

ప్రాథమిక హక్కుల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ఉప సంఘం ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశిక సూత్రాలలో చేర్చింది. ముసాయిదా రాజ్యాంగంలోని 35వ అధికరణం ఇలా చెప్పింది.‘భారత భూభాగంలో నివసించే పౌరులందరికీ వర్తించేటట్టు ఉమ్మడి స్మృతిని తీసుకురావడానికి రాజ్యం ప్రయత్నం చేయాలి’ అని పేర్కొన్నది. ఉమ్మడి పౌరస్మృతి దేశానికి అత్యవసరమే అయినా, అందరి అంగీకారంతో స్వచ్ఛందగా తీసుకురావాలి అని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీర్మానానికి ముస్లిం ప్రతినిధులు తీవ్ర నిరసన తెలియచేశారు. పర్సనల్‌ ‌లాలో ప్రమేయం అంటే, ప్రాథమిక హక్కులలో జోక్యం కల్పించుకోవడమే అవుతుందని వారి వాదన. మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ‌సాహెబ్‌, ‌నజీయుద్దీన్‌ అహమ్మద్‌, ‌మహమ్మూద్‌ అలీ బేగ్‌ ‌సాహెబ్‌ ‌బహదూర్‌, ‌బి, పోకర్‌సాహెబ్‌ ‌బహదూర్‌ ‌ముసా యిదా రాజ్యాంగంలోని ఆ 35వ అధికరణకు పలు సవరణలు సూచించారు. ఈ అధికరణంలోని ఏ అంశం వల్ల ప్రజల పర్సనల్‌ ‌లాకు భంగం వాటిల్ల కూడదన్న నిబంధన జోడించాలని చెప్పారు. ఏ వర్గం కూడా పర్సనల్‌ ‌లాను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ అందులో మార్పులు తీసుకురావాలని అనుకుంటే అది వర్గం ముందస్తు అనుమతితోనే జరగాలన్న వాదన కూడా వినిపించింది. దీనికి రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ ‌సున్నితంగా వారి వాదనలను నిరాకరిస్తూనే, పౌర సంబంధాలలో, లావాదేవీలలో, ఆస్తి వ్యవహా రాలకు సంబంధించిన అన్ని శాఖలలో పౌర స్మృతి ప్రమేయం ఉంటుందని తేల్చి చెప్పారు. రాజ్యం ఉమ్మడి పౌరస్మృతి తీసుకు రావాలని ఒక సాధారణ ప్రకటన చేస్తే దానికి ఎందుకు అభ్యంతరం ఉండాలని కూడా ఆయన అన్నారు. తరువాత కేఎం మున్షీ హిందూ చట్టం ముసాయిదాను సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లులోని అంశాలు మనువు, యాజ్ఞవల్క్య స్మృతులలోని అంశాలకు సమాధానంగా ఉంటాయని కూడా అన్నారు. మనం పురోగమిస్తున్న వ్యవస్థలో ఉన్నామని, రాజ్య వ్యవహారాలలో మత ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతూ, దేశాన్ని ఐక్యం చేయడానికి, పటిష్టం చేయడానికి మనం పాటు పడాలని మున్షీ అన్నారు. అయితే ఈ అధికరణానికి సవరణలు చేయడానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌వ్యతిరేకించారు. ఆయన ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి పూర్తి అనుకూలంగా ఉన్నారు.

1950లో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌హిందూ వివాహ వ్యవస్థ, సంరక్షణ, విడాకులు, ఆస్తి హక్కు వంటి అంశాల కోసం హిందూకోడ్‌ ‌బిల్లును తీసుకురావాలని చూశారు. అప్పుడు కొన్ని ఛాందస వర్గాల నుంచి ప్రతికూలత ఎదురైంది. అలా స్వతంత్ర భారతదేశంలోను హిందూ స్త్రీకి న్యాయం వాయిదా పడింది. తరువాత ఆ చట్టం అమలులోకి వచ్చిఆ నష్టం కొంతవరకు భర్తీ అయింది. కానీ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం చివరిదశలో వ్యక్తిగత సమస్యల పరిష్కా రానికి చట్టాల అసవరం పెరిగినప్పుడు హిందూ చట్టాల క్రోడీకరణకు బీఎన్‌ ‌రావు కమిటీని నియమించారు. ఇదే హిందూ లా కమిటీ. ఉమ్మడి హిందూ చట్టం అవసరం గురించి పరిశీలించడమే ఈ కమిటీ పని. ఈ కమిటీ భారతీయ పురాతన స్మృతులను పరిశీలించి హిందూ చట్టం అవసరం గురించి సిఫారసు చేసింది. ఇది హిందూ మహిళకు కొంత మేరకు సమాన హక్కులు కల్పిస్తుంది. 1937 చట్టాన్ని సమీక్షించి హిందువుల వివాహం, వారసత్వం వంటి సమస్యల పరిష్కారానికి కూడా పౌర స్మృతిని రావు కమిటీ సిఫారసు చేసింది. బీఎన్‌ ‌రావు కమిటీ ఇచ్చిన నివేదికనే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత 1951లో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌నాయ కత్వంలోని ఎంపిక సంఘానికి చర్చ కోసం ఇచ్చారు. అయితే చర్చలు జరుగుతూ ఉండగానే హిందూ కోడ్‌ ‌బిల్లుకు కాలదోషం పట్టింది. అయినా తిరిగి 1952లో సమర్పించారు. దీనినే 1956లో హిందూ వారసత్వ చట్టంగా ఆమోదించారు. వారసత్వానికి సంబంధించి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు ఇది చట్టమైంది. దీనినే మరింత సంస్కరించి హిందూ చట్టంగా రూపొందించి ఆస్తిలో మహిళలకు హక్కును కల్పించారు. దీని ప్రకారమే మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు సంక్రమించింది.

మతం ఏదైనా స్త్రీకి పూర్తి న్యాయం చేసిందని చెప్పడం సాధ్యం కాదు.కారణం పర్సనల్‌ ‌లాలు. షరియా అనే ముస్లిం పర్సనల్‌ ‌లా నీడలో ముస్లిం మహిళ అనుభవిస్తున్న కష్టాలు వేరు. తలాక్‌ ఒక అమానుష ఆచారం. ఒక ముస్లిం నలుగురిని చేసుకోవాలని ఎక్కడా లేదంటున్నారు న్యాయ నిపుణులు. ఇంతమంది పిల్లలను కంటేనే ముస్లింగా గుర్తింపు వస్తుందని ఎక్కడైనా ఉండా అని కూడా వారు ప్రశ్నించారు. షరియా మాటున స్త్రీని విలాసవస్తువుగా, భోగకాంతగా కూడా మార్చేయడం ఒక వాస్తవమన్న వాదనలు ఉన్నాయి. ఇది దురదృష్టం. అరేబియా దేశాల నుంచి షేక్‌లు హైదరా బాద్‌ ‌పాత బస్తీకి వచ్చి ముక్కు పచ్చలారని బాలికలను డబ్బిచ్చి తీసుకుపోవడాన్ని ఏమనాలి? ఒక ముస్లిం మతస్థుడు ఏదో ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఒక ముస్లిం మహిళలను లేదా మత మార్చిన మహిళనో వివాహం చేసుకుంటాడు. కొన్నేళ్లకి తలాక్‌ ‌తలాక్‌ అని చెప్పి అక్కడ నుంచి జారుకుంటున్నాడు. అంతవరకు ఆమె విషయంలో నియమాలు చెప్పిన షరియా ఆపై ఆమెను పట్టించుకోదు. ఆ పిల్లలు, ఆమె ఏం కావాలి? షరియా వారి గురించి మాట్లాడనంత మాత్రాన వారికి జీవితం ఉండదా? కాబట్టి సెక్యులర్‌ ‌చట్టాలు అవసరం. దశాబ్దాల నుంచి వారికి షరియా పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని షాబానో కేసు ద్వారా సుప్రీంకోర్టు చేసిన చరిత్రాత్మక ప్రయత్నాన్ని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ దారుణంగా భగ్నం చేశారు. పెళ్లికి ముందు, తరువాత కూడా మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యలు, దేశ వ్యాప్తంగా ఉన్న ట్రిపుల్‌ ‌తలాక్‌ ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని తీవ్రం చేశాయి. సెక్యులరిస్టు పార్టీల బూటకాలు, ఉదార వాదుల కపటత్వం, ముస్లిం మతోన్మాదుల తిరోగమన లాలసలను గమనించే కాబోలు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం గురించి రాజ్యాంగంలో ఉంది, కళ్లు తెరిచి చూడండని షాబానో కేసు నుంచే అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలను హెచ్చరించడం మొదలుపెట్టింది. అయినా ఆ ప్రయత్నం జరగలేదు. అయితే స్వతంత్ర భారతదేశంలో మొదటి సారిగా ఉమ్మడి పౌరస్మృతి నిర్మాణం అవసరం గురించి పార్లమెంట్‌కు సుప్రీం కోర్టు సూచించినది మహమ్మద్‌ అహ్మద్‌ ‌ఖాన్‌ ‌వర్సెస్‌ ‌షాబానో బేగమ్‌ ‌వ్యాజ్యంతోనే. రాజ్యంగంలోని 44వ అధికరణం (అంటే ఉమ్మడి పౌరస్మృతి నిర్మాణంలో ప్రభుత్వ బాధ్యత గురించి తెలియచేసేది) నిర్వీర్యమై పోయిందని కూడా వ్యాఖ్యానించింది. విభేదాలను తొలగించి దేశ సమైక్యతకు ఉమ్మడి పౌరస్మృతి ఉపకరిస్తుంది. ఇదే అంశాన్ని జోర్డెన్‌ ‌డీన్డే వర్సెస్‌ ఎస్‌ఎస్‌ ‌చోప్రా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. వివాహం, విడాకుల విషయంలో ఒక ఉమ్మడి చట్టం తేవడానికి పార్లమెంట్‌ ‌జోక్యం అనివార్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సరళా ముద్గల్‌ ‌వర్సెస్‌ ‌భారత ప్రభుత్వం వ్యాజ్యంలోను ఉమ్మడి పౌరస్మృతి అవసరం గురించి అత్యున్నత న్యాయ స్థానం గుర్తు చేసింది.

వ్యక్తిగత చట్టాలు లేదా పర్సనల్‌ ‌లాలు అంత ప్రబలమైనవా? ఈ ప్రశ్న ఎందుకంటే, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఈస్టిండియా కంపెనీ మొదట 1835లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అక్టోబర్‌, 1840‌లో లెక్స్ ‌లోసి నివేదిక వచ్చింది. అన్నివర్గాలకు, మతాలకు వర్తించే విధంగా ఉమ్మడి పౌర స్మృతి అవసరమని చెప్పాడు. కానీ హిందూ, ముస్లిం పర్సనల్‌ ‌లాలను దీని నుంచి మినహాయించాలని ప్రభుత్వం సూచించింది. అంటే ఆ పర్సనల్‌ ‌లాలలోని చట్టాలను క్రోడీక రించే పని చేయవద్దన్నదే దాని సారాంశం. తరువాత మాత్రం హిందూ పర్సనల్‌ ‌లాను క్రమబద్ధం చేశారు. మిగిలినవి మాత్రం వాటివాటి మత సూత్రాల ప్రాతిపదికగానే అమలు చేస్తున్నారు. నేరాలు, ఆధారాలు, కాంట్రాక్టులకు సంబంధించి చట్టాల క్రోడీకరణ (ఉన్న చట్టాలను ఒక క్రమ పద్ధతిలోకి తీసుకు రావడం) గురించి ఆ నివేదిక చర్చించింది. అయితే హిందూ వ్యక్తిగత చట్టాలు, ముస్లిం వ్యక్తిగత చట్టాలను వారు కావాలనే పక్కన పెట్టారు. ఇది శ్వేతజాతి బుద్ధి లక్షణం. ఉమ్మడి పౌరస్మృతి వచ్చి, అది భారతీయ సమాజంలో ఐక్యత తెస్తుందన్న అనుమానంతోనే వలస పాలకులు ఆ చట్టం జోలికి వెళ్లలేదని అనిపిస్తుంది. తెల్లవాళ్లు వెళ్లిపోయిన తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన పని కూడా ఇదే. భారతీయ సమాజాన్ని ఐక్యతకు దూరంగా ఉంచడమే. నాడు ఈస్టిండియా కంపెనీ చేసిన పనినే ‘21వ శతాబ్దం ఫేమ్‌’  ‌రాజీవ్‌గాంధీ చేశారు. ముస్లిం పర్సనల్‌ ‌లాను ముట్టుకోలేదు.

చాలా ప్రపంచం దేశాలు తమ పౌరులకు ఉమ్మడి పౌరస్మృతినే అమలు చేస్తున్నాయి. మతం, వర్గం ప్రాతిపదికగా ఉండే వివక్షను నివారించడమే ఆ పౌరస్మృతి అసలు ఉద్దేశం. ప్రతి పర్సనల్‌ ‌లాలోను కనిపించేది అణచివేతేనని బలమైన అభిప్రాయం ఉంది. కొన్ని మతాలలో తక్కువ, కొన్ని మతాలలో మరీ ఎక్కువగాను ఇది కనిపిస్తుంది. నిజానికి మహిళల అణచివేతకు పర్సనల్‌ ‌లాను ఒక ఆయుధంగా ఉపయోగించు కుంటున్నారన్న వాదన కూడా ఉంది. అంటే మత సూత్రాలను అడ్డం పెట్టుకుని కొందరి హక్కులను నియంత్రించడమే. స్త్రీపురుష వివక్షను పెంచి పోషించడంలో పర్సనల్‌ ‌లాదే ప్రబలమైన పాత్ర అన్న విమర్శ కూడా ఉంది. అయితే భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు అన్న సూత్రాన్ని బలపరుస్తుంది. వివిధ మతాలు, వర్గాలు, సమూహాల పర్సనల్‌ ‌లాలు ఈ మౌలిక సూత్రానికి భంగకరంగా పరిణమించాయి. భారత రాజ్యాంగం సెక్యులరిజాన్ని బలపరుస్తుంది. కానీ పర్సనల్‌ ‌లా లోని భిన్న భిన్న సూత్రాలు సెక్యులర్‌ ‌సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వీటన్నిటి ఫలితం ఏమిటంటే, భిన్నత్వంలో ఏకత్వం అన్న మౌలిక భారతీయ విలువకు సవాలు ఎదురవుతున్నది. చట్టాన్నీ, మతాన్నీ వేరు చేయ వలసిన సమయం వచ్చింది. అది ఉమ్మడి పౌరస్మృతి చేయగలుగుతుంది.

ఉమ్మడి పౌరస్మృతి గురించి అనుకూలంగా లేదా ప్రతికూలంగా మాట్లాడేవారు మొదట పాటించ వలసిన నియమం- దీనిని ఓట్లు తెచ్చే ఆయుధంగా, లేదా రాజకీయ అజెండాగా భావించడం సరికాదు. ఇది భారతదేశ సమైక్యత, స్త్రీపురుష సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నంగా పరిగణించాలి. దీని వాస్తవిక స్వరూపం ఇదే కూడా. అదేకాదు, విధ్వంసక రాజకీయాలకు మూలమైన వలసవాద దృష్టిని ఇది వ్యతిరేకిస్తుంది. మహిళా సాధికారతకు పరిపూర్ణత చేకూర్చగలిగిన పరిణామమిది. ప్రధానంగా ముస్లింలలో ఉన్న బహు భార్యాత్వానికి అడ్డుకట్ట వేసి మహళలకు న్యాయం చేస్తుంది. ముస్లిం మహిళలు పర్సనల్‌ ‌లాతో ఎదుర్కొంటున్న ఇబ్బం దుల నేపథ్యంలోనే ఉమ్మడి పౌరస్మృతి రాజకీయ తెర మీదకు వచ్చిందన్నా అతిశయోక్తి కాదు.

ఉమ్మడి పౌరస్మృతి నిర్మాణం, సూత్రం అంతా అన్ని మతాలలోని, వర్గాలలోని, సమూహాలకు చెందిన మహిళలకు ప్రాథమిక హక్కులు కల్పించడం మీదే ఆధారపడి ఉంది. ఆస్తి, వివాహం, విడాకులు, దత్తత వంటి అంశాలలో వారికి హక్కులు ఇస్తున్నది. ప్రస్తుతం కొన్ని వర్గాలు అమలు చేస్తున్న పర్సనల్‌ ‌లా ఉన్నత వర్గాలకు సంబంధించిన అంశాలనే ప్రధానంగా పరిష్కరిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అని పేరు పెట్టిన తరువాత అన్ని మతాల వారి వాదనలను వినాలి.ఉమ్మడి పౌరస్మృతి గురించి మైనారిటీలలో ఉన్న భయాలలో కొన్ని చిత్రంగా ఉంటాయి. నిజానికి అవి భయాలు కావు. పురుషాధిపత్యం, మతోన్మాదాల సమ్మేళనంతో వచ్చిన కపటత్వం. తమ హక్కులను యూసీసీ లాక్కుంటుందన్న భావనను ప్రచారం చేస్తున్నారు.

తమ సంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తుందన్న భావన కూడా ఉంది. మెజారిటీ మతానికి చెందిన విశ్వాసాలను రుద్దే అవకాశం ఉందని కూడా మైనారిటీలు చెబుతూ ఉంటారు. మతాచారాలను స్వేచ్ఛగా అనుసరించే అవకాశం రాజ్యాంగం ఇస్తున్నా ఉమ్మడి పౌరస్మృతి ఆ స్వేచ్ఛ పరిధిని కుదిస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే రాజ్యం ప్రమేయం మత విషయాలలో ఎక్కువ అవుతుందని అంటున్నారు. గడచిన ఏడున్నర దశాబ్దాలుగా ఇవే వాదనలు వినిపిస్తున్నారు మతోన్మాదులు. ఓట్లు దండుకునే పార్టీలు ఓట్లు దండుకుంటున్నాయి. వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చరిత్రాత్మకం. ఎందుకంటే ఇది భావి భారతజాతి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న. భారత భవిష్యత్‌ ‌భౌగోళిక, జనాభా రక్షణకు సంబంధించిన అంశం. ఇది ఇప్పుడు కాకపోతే, బహుశా ఎప్పటికీ కాదు. బహుపరాక్‌.

About Author

By editor

Twitter
YOUTUBE