మతాచారాలలో జోక్యం వేరు, మతాచారాల పేరుతో జరిగే హింసను ఆపడం వేర్వేరు అంశాలని మాజీ శాసనసభ్యుడు, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎన్‌. ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌరస్మృతిని మత సమస్యగా కాకుండా మహిళల హక్కులు, సమానత్వం వంటి కోణాల నుంచి పరిశీలించడం వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. మొత్తంగా జననాల రేటు తగ్గుతున్నది కాబట్టి జనాభా అసమతౌల్యానికీ, యూసీసీకి ముడి పెట్టడం కూడా సరికాదని ఆయన అన్నారు. అన్నింటికీ మించి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఎంతో మంచివే అయినా వాటిని అమలు చేయదలచిన తీరు, తేవడానికి తొందరపడడం వల్ల దేశానికి నష్టం జరిగిందనీ, ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఈ తొందరపాటుకు అవకాశం లేకుండా చేయాలని ఆయన సూచించారు. మంచి పని చేస్తున్నాం కాబట్టి మంచి భాషను, సామరస్యంగా పరిష్కరించాలన్న ధ్యేయం తప్పనిసరి అని కూడా ఆయన చెప్పారు. 22వ లా కమిషన్‌ ‌పిలుపు నేపథ్యంలో డాక్టర్‌ ‌జేపీతో జాగృతి జరిపిన ముఖాముఖి ఇక్కడ ఇస్తున్నాం.

ఉమ్మడి పౌరస్మృతి పెద్ద చర్చనీయాంశం, చర్చించ వలసిందే కూడా. ఉమ్మడి పౌరస్మృతిని మీరు ఎలా చూస్తున్నారు? దాని అవసరం పెరిగిందా?

ప్రతి సమాజానికి రాజ్యాంగం కొన్ని ఉదాత్త విలువలను ప్రతిపాదిస్తుంది. ఎలాంటి సమాజం ఉండాలో పెద్దలంతా అందులో ప్రతిపాదిస్తారు. అదే సమయంలో సామాజిక రీతి ఉంటుంది. మంచి రాజ్యాంగం లేదా మంచి రాజ్యం వ్యక్తి జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. అలాగే ఛాందసాన్ని నమ్మకంపేరుతో కొనసాగనీయకూడదు. అంటే రాజ్యాంగ విలువలను చేరుకోవడానికి సమాజాన్ని ప్రేరేపించాలి. ఈ రాజ్యాంగ విలువలకు, సామాజిక రీతికి మధ్య సంఘర్షణే రాజకీయం. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాషకు చెందినా భారతీయ సమాజం చాలా బలమైనది. మన కుటుంబాలంత బలంగా ఉండే కుటుంబాలు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టే ఇంత బీదరికంలోను, ప్రభుత్వాలు ఇన్ని రంగాల్లో ఇంత విఫలమవుతున్నాకూడా పెద్దగా సమాజంలో అశాంతి, హింస, నేరప్రవృత్తి చూడం. అసలు లేవని కాదు. ఇన్ని సమస్యలున్న సమాజాలు అల్లకల్లోలంగా ఉంటాయి. అలాగే మతాలకతీతమైన ధర్మనిరతి, మంచి చెడు విచక్షణ సహజంగా ఈ దేశ ప్రజల్లో అత్యధికులకు ఉన్నాయి. అది సంప్రదాయంలో భాగంగా వచ్చింది. తప్పులు చేయరని కాదు. కానీ ఇది తప్పు అన్న స్పృహ, త•ప్పు చేస్తే సమాజం వెలివేస్తుందేమో, చులకన అవుతామన్న భావన చాలామందిని మంచి మార్గంలో నడిపిస్తున్నది. ఒక రాజ్యానికి, రాజ్యాంగా నికి సవాలు ఏమిటంటే – సంప్రదాయంలో ఉన్న బలాన్ని, సమాజానికి పనికొచ్చే దాన్ని కాపాడుతూ, చెడుని, పాత వాసనలని ఆధునిక యుగానికి సరిపోనటువంటిది, మానవ హక్కుల ఉల్లంఘించేది నిర్జించకపోతే రాజ్యాంగానికి అర్థంలేదు. రాజ్యాంగ విలువలకు అర్థంలేదు. హిందూ సంప్రదాయంలోనూ గతంలో దుర్లక్షణాలు ఉన్నాయి. అసలు అది భౌగోళిక ప్రాంతమే తప్ప మతం అనడానికి లేదు. రకరకాల భావజాలాల వారి జీవన విధానమది. దానిలో చార్వాకులున్నారు, నిరీశ్వరవాదం చెప్పేవారు, కణాదులు ఉన్నారు. వారందరినీ కలిపాము. సతీ సహగమనం ఒకప్పుడు గొప్ప అనుకునేవారు. దాన్ని తెల్లవాళ్ల కాలంలోనే ఆపాం. మనవారే రాజారామమోహన రాయ్‌గానీ, ఇతరులుగానీ పట్టుపట్టి తెల్లవాళ్ల రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని అలా సమాజాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేశారు. బాల్య వివాహాలను నిరోధిస్తే ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, ‌వీరేశలింగం వంటి వాళ్ల మీద దాడులు చేశారు. నా పెంపుడు తల్లి బాల వితంతువు. ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకొమ్మని కోరాడు. ఏదో సిద్ధాంతం, ఆదర్శం కోసం కాదు.వేరే పిల్లలు లేరు. ఏదో కాస్తో కూస్తో ఆస్తి ఉన్నది. మరి సంతానం లేకపోతే ఎలా? కాని ఆవిడ ఒప్పుకోలేదు. అంటే మన సంప్రదాయం 10, 11 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్ల మనసులో మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పు అన్న భావన ప్రవేశపెట్టింది. బాల్యవివాహాన్ని ప్రోత్సహించడం, వితంతువును బానిసగా చూడడంగానీ, వితంతు పునర్‌ ‌వివాహాన్ని ఆపడం మూడూ తప్పులే. కానీ మా సంప్రదాయం ఇంతే, చిన్నప్పుడే పెళ్లి చేస్తాం మీరెవరు కాదనడానికి అన్నాడనుకోండి కచ్చితంగా తిరస్కరించాలి. నా దృష్టిలో సరిగ్గా గనుక తయారుచేసినట్లయితే ఉమ్మడి పౌరస్మృతి ఆ పరిమితమైన బాధ్యతను నిర్వర్తించాలి. దానికి ఎవరు ఎదురు తిరగవలసిన అవసరం లేదు. మనం కూడా ఇది మతాల సమస్యగా భావించకుండా మానవత్వ అంశంగా భావించాలి.

 సరే, ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశికసూత్రాలలో ఎందుకు పెట్టారు? ఒక ఆధునిక సమాజం నిర్మాణం కావాలని. సంప్రదాయంలో మానవ సమాజానికి హాని చేసే ఛాందసాలని తొలగించాలి. నా దృష్టిలో మహిళలకు అనాదిగా దాదాపు అన్ని మతాల్లో కూడా అన్యాయం జరిగింది. కొన్ని మతాల్లో ఇప్పటికీ జరుగుతున్నది. బహు భార్యాత్వం ఆధునిక యుగంలో సహించేది కాదు. అది ఏ మతం పేరుతో, ఏ కులం పేరుతో ఉన్నా కచ్చితంగా పోవాలి. ఆడపిల్ల పుట్టగానే చంపేశారనుకోండి. దానిని సంప్రదాయ మన్నారనుకోండి. ఆధునిక సమాజం అంగీకరించ కూడదు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టగానే మర్మాంగాలు కోసేస్తారు. అది సంప్రదాయ మని చెప్పినా క్షమించడానికి వీలైంది కాదు. వివాహం, ఆస్తి విషయంలో మగవారికి ఒక హక్కు, ఆడవారికి ఒక హక్కు. హిందూ సమాజంలో మగ వారికి ఆస్తి హక్కు ఉంటుంది, ఆడవారికి ఉండదు. ఆధునికయుగంలో కచ్చితంగా ఇది తప్పు. కాబట్టి మహిళల హక్కులు, వైవాహిక సంబంధంలో సమానత్వం, వ్యక్తి హింసకు దారి తీసే పరిస్థితులను ఆపడం, పౌరహక్కుల ఉల్లంఘన, ఈ పేరుతో ఉన్న ఛాందసభావాల్ని పక్కనపెట్టడం. ఇవన్నీ ఆధునిక రాజ్యం చేయాలి. హిందూమతంలో, క్రైస్తవ మతంలో, ఇస్లాంలో పొరపాట్లు ఉంటే తొలగించాలి. బౌద్ధంలో, జైనంలో, సిక్కిజంలో ఉన్నా తొలగించాలి. అందుకే యూసీసీని మతాల సమస్యగా చూడడం ఆధునిక రాజ్యంలో సరైన పద్ధతి కాదు. కానీ మన దేశంలో ఏం జరుగుతున్నదంటే కులం, ప్రాంతం, భాష, మతం పేరుతో, వాటికి ఏదో జరిగిపోతోందన్న వాదనతో ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తున్నాం. ఉమ్మడి పౌరస్మృతి అంశానికి వస్తే అది ఇస్లాంకి, హైందవా నికి లేదా క్రైస్తవానికి వ్యతిరేకమని కాకుండా అందులో ఏం ప్రతిపాదిస్తున్నారు మీరు? ఎందుకు ప్రతిపాదిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఈ మార్పు అవసరమా కాదా? అని ఆలోచిస్తే పరిష్కారాలు వస్తాయి. ఇలాంటి ఆలోచన లేక దేశానికి చాలా నష్టం జరిగింది. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా సుప్రీంకోర్టు చిన్న తీర్పు ఇచ్చింది. అదే షాబానో కేసు. బీద ముస్లిం మహిళ. ఆమెకు భర్త విడాకులిస్తే సీఆర్‌పిసీ ప్రకారం మనోవర్తి ఇవ్వాలని, ఇంతకీ రూ.200, 150, 275 అంతే. దానికి రాద్ధాంతం చేసి రాజీవ్‌, ‌పీవీ మెడలు వంచి ముస్లిం ఉమెన్స్ ‌బిల్స్ ‌తీసుకొచ్చారు. ఆనాడే కాంగ్రెసు నాయకులు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఈనాటి కేరళ గవర్నర్‌ ఆరీఫ్‌ ‌మహమ్మద్‌ఖాన్‌ ఆనాడు హోంమంత్రి. ఈ అంశం మీద రాజీనామా చేశాడు. అలాగే మన రాష్ట్రానికి చెందిన అబీద్‌ ‌హుస్సేన్‌గారు. హైదరాబాద్‌ అసోసియేషన్‌ ‌నుంచి ఐఏఎస్‌కు వచ్చాడు. వారు వ్యతిరేకించారు. దేశం చాలా నష్ట పోయింది దానివల్ల. కాబట్టి ఈ అంశాన్ని మత పరంగా కాకుండా హేతుబద్ధంగా మహిళల హక్కులు, పిల్లల హక్కులు, ఆధునిక సమాజంలో భాగస్వామ్యం కోణం నుంచి ఆలోచిస్తే దేశానికి ప్రయోజనం.

దీనికి వ్యతిరేకత మైనారిటీల వైపు నుంచి ఎక్కువ ఉంది కానీ మెజార్టీ వర్గీయల నుంచి లేదు కదా!

కారణం ఏమిటి? 50వ దశకంలో ఛాందస హిందువులు కొంతమంది హిందూకోడ్‌ ‌బిల్‌ను తిరస్కరించారు. ఆ బిల్‌ను నెహ్రూగారు వెంటనే చట్టం చేయట్లేదని అంబేడ్కర్‌ ‌రాజీనామా చేశారు. అంబేడ్కర్‌గారు రాజీనామా చేసిన తరువాత చట్టం వచ్చింది. కాబట్టి హైందవ సమాజం వరకు ఉమ్మడి పౌరస్మృతి, ఆధునికీకరణ చట్టపరంగా చాలావరకు జరిగాయి. ఇంకేమైనా కొరత ఉంటే జరిపించాలి. ఉదాహరణకు వారసత్వంలో గనుక తేడా ఉంటే కచ్చితంగా మార్పు చేయాలి. హైందవ సమాజంలో వివాహ విషయంలో తేడా లేదు. ఆడపిల్లకు హక్కులు, మగపిల్లకు హక్కులు సమానంగా ఉన్నాయి. ఆస్తి హక్కుల విషయంలో కొన్ని తేడాలున్నాయి. మన రాష్ట్రంలో ఎన్టీరామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు సమాన హక్కు ప్రవేశపెట్టారు. అదైనా కాగితం మీద ఉందిగానీ, వాస్తవంగా ఎంత అమలయిందో తెలియదు. ఎన్ని కుటుంబాలు ఆచరిస్తున్నాయో లేదో చెప్పలేను. సర్వే ఆధారాలు లేవు. కేరళ వంటి రాష్ట్రాల్లో మాతృస్వామ్యం ఉంది. చట్టపరంగా అందరికీ సమాన ఆస్తి హక్కు బహుశా హైందవ సమాజంలో అవసరం. అలాంటివి మినహాయిస్తే హైందవ సమాజంలో కొత్తగా ఉమ్మడి పౌరస్మృతి వల్ల వచ్చే మార్పులు నాకు తెలిసినంత వరకు పెద్దగా లేవు. అందుకని పెద్దగా ఇబ్బంది కనిపించకపోవచ్చు. కానీ ఒకప్పుడు హైందవ సమాజంలో కూడా ప్రతిఘటన వచ్చింది.

డా. అంబేడ్కర్‌ ‌లాంటివారు, బెనిగల్‌ ‌నరసింహా రావుగారు, ఆ తరువాత జస్టిస్‌ ‌వీఆర్‌ ‌కృష్ణయ్యర్‌గారు, జస్టిస్‌ ‌వై.వి.చంద్రచూడ్‌గారు,  వీళ్లందరు కూడా వరసబెట్టి చెబుతూనే ఉన్నారు. యూసీసీ వల్ల సామరస్యం వస్తుంది, దేశ సమైక్యత వస్తుందని చెబుతున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని పార్టీలు ఈ రోజుకీ అర్థం చేసుకోకుండా ఈ చట్టాన్ని హిందూమతం ఆధిపత్యం వహించే విధంగా వస్తుందని ముస్లింల చేత చెప్పించడం ఎంతవరకు సమంజసం? అది ప్రమాదం కదా?

ఈ మతం ఆ మతం అని కాదు. సమాజాన్ని ఆధునీకరించాలంటే ఛాందసాన్ని నమ్ముకున్నవాళ్లు కొంత వ్యతిరేకిస్తారు. మనం చూడవలసింది సమాజంలో ఉన్నటువంటి అత్యధికులకు ప్రయోజనం చేకూరుతుందా లేదా, వారికి స్వేచ్ఛ పెరుగుతుందా లేదా? సమాజం ఆధునికీకరణవైపు వెళుతుందా లేదా? ఇవే. ఆ రకంగా చూస్తే అసలు ఈ వాదనకు నాకు ఆధారం కనిపించటం లేదు. మొదట్లోనే ప్రస్తావించినట్లుగా రాజకీయంలో వ్యక్తి ఔన్నత్యం, విధానాలు వ్యక్తి జీవితానికి మధ్య సంబం ధాన్ని అన్వేషించే ప్రయత్నం పక్కన పెట్టాం. ప్రతి దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నాం. నిజానిజాలతో సంబంధం లేదు.

హిందూ బిల్‌ ‌మూలాన హిందూ మహిళ కొంత మెరుగైన పరిస్థితిలోనే ఉంది. కానీ ఇస్లాం సంబంధిం చినంతవరకు ఆరోగ్య సమస్య ఉన్నది. ఎక్కువమంది పిల్లల్ని కనడం మూంగా వచ్చిన సమస్య. దానిని  అధిగమించడానికైనా ఉదారవాదులు యూసీసీ గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది కదా! వాళ్లు మౌనంగా ఎందుకున్నారు?

ముందు ఒక విషయం గమనించాలి. ముస్లిం స్త్రీలు ఎక్కువమంది పిల్లల్ని కనటం అన్న విషయంలో చాలామందికి అపోహ ఉంది. నేను స్పష్టంగా చెబుతున్నాను. దేశంలో అన్ని వర్గాలు- అగ్రకులాలు, దళితవర్గాలు, పట్టణవాసులు, గ్రామీణులు, బీదలు, డబ్బున్నవారు, చదువుకున్న వారు, చదువులేనివారు అన్ని వర్గాలో కూడా జననాల రేటు తగ్గుతున్నది. కానీ జననాల రేటులో తేడా ఉంది.  ఇవాళ బిహార్‌లో ఎక్కువ జననాలున్నాయి. మనకు తక్కువ ఉన్నాయి. అలాగే యూపీలో ఎక్కువగాఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా జననాల రేటు క్రమక్రమంగా తగ్గుతున్నది. ముస్లింలలోను తగ్గుతున్నది. ఉత్తరాదిలో, దక్షిణాదిలో తగ్గుతున్నది. కాకపోతే వివిధ చారిత్రక కారణాలవల్ల కొన్ని వర్గాలు ఐదు, పదేళ్లు వెనుక ఉన్నాయి. ఫెర్టిలిటీ రేటు ఉంది. ఒక మహిళ ఎంతమంది పిల్లల్ని సగటున కంటుందో ఇది చెబుతుంది. 2.1 కంటే తక్కువ వస్తే జనాభా అదుపుకు వస్తుంది. తగ్గుతుంది. అంత కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. ఇవాళ దేశం మొత్తంలో ఈ ఫెర్టిలిటీ రేటు 2కు వచ్చింది. ఇది కేరళ మొట్టమొదటిగా సాధించింది. రెండు మూడు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు సాధించాయి. బహుశా వచ్చే సంవత్సరం లెక్కవేస్తే 1.9 అవుతుంది. కాబట్టి ముందు జనాభా విషయంలో మన అపోహను తొలగించుకోవాలి. ముస్లింలు అదే పనిగా పిల్లల్ని కంటున్నారన్న అపోహ ఉంది. ప్రతీ వర్గంలో కొన్ని కుటుంబాలలో ఎక్కువ పిల్లలుంటారు. మొత్తంమీద ఆధునికయుగంలో ఏ కుటుంబమైనా పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే, ఆదాయానికి తగ్గట్టుగా పిల్లలు తక్కువ ఉంటే బావుటుందని ఆలోచనకు వచ్చింది. డబ్బున్నవారు కూడా అదే పనిగా పిల్లల్ని కనటంలేదు. కాబట్టి ఉమ్మడి పౌరస్మృతికీ, ఈ అంశానికి ముడిపెట్టద్దు. అది నిశ్చయంగా చెబుతున్నాను. గణాంకాలాధా రంగా చెబుతున్నాను. ఇది మతాల సమస్య కాదు. ఇక రెండవ విషయానికి వస్తే ప్రతి మతంలో కూడా యథాస్థితి కొనసాగితే, వెనుక బాటుతనం కొనసాగితే, మూఢనమ్మకాలు కొనసాగితే బాగుపడే వాళ్లు కొందరుంటారు. కొన్నివేల సంవత్సరాల పాటు ప్రతి మతంలో కూడా ఎవరు బాగా ఆధిపత్యం చలాయించారు, పూజారివర్గం. హేతుబద్ధమైన ఆలోచన ప్రవేశ పెట్టాలంటే ఎప్పుడూ ఈ వర్గాలు భయపడు తాయి. అదే సమయంలో ఈ యూనిఫామ్‌ ‌సివిల్‌కోడ్‌ ‌కోరేటటువంటి వర్గం కూడా దీన్నొక మతాల సమస్య కాకుండా ఆధునీక రించటం కోసం జరుగుతున్న ప్రయత్నంగా భావించాలి. ఎవరికీ ఇబ్బంది కలిగించాలను కోవడం కాదు. మీరు అల్లాను నమ్మినప్పుడు, ఆ మతంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఆ స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛ కొనసాగుతుంది. ఆ మాట స్పష్టంగా చెప్పాలి.

యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ ‌వస్తే ముస్లింల వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వ జోక్యం పెరుగుతుందని వాదిస్తు న్నారు.  ఆ మాటేమిటి?

ఆ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. మానవ సమాజం ఒక ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నది. ఉమ్మడి ప్రయోజనాలని కాపాడడం కోసమే. ఒకరి స్వేచ్ఛ మరొకరికి అవరోధం కాకుండా సమాజాన్ని కాపాడాలి. బలమున్నవాడు బలహీనున్ని చితక్కొట్టకుండా ఉండాలి. ఇంతమేరకు రాజ్యానికి పాత్ర ఉండాలి. అంతేగానీ మీ జీవితంలోకి, పడకటింటిలోకి తొంగి చూసి మీరేమి చేయాలో చెప్పడం రాజ్యానికి అవసరం లేదు. అంచేత ఏ మతమైనా సరే, రాజ్యం వచ్చి మీరు జీవితంలో వ్యక్తిగతంగా ఎవరినీ ప్రేమిస్తున్నారు, ఎవరినీ పెళ్లి చేసుకుంటున్నారు, మరి మీ సంతానం ఎక్కడ బతుకుతారు, ఏం చదువుకుంటారు దీన్లో జోక్యం చేసుకుంటే వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకున్నట్లు లెక్క. అలా కాకుండా ఆడపిల్లలకు ఒక విధంగా, మగపిల్లలకి ఒక విధంగా హక్కులుండటానికి వీల్లేదు. వైవాహిక సంబంధాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. ఆధునిక సమాజ హక్కులు కాపాడాలని చెప్తుంటే నా మతం, సంప్రదాయం దెబ్బతిన్నాయని వాదిం చడం విడ్డూరం. ఇది ఎవరు చేసినా తిరస్కరించాలి.

ఇస్లామిక్‌ ‌దేశాలు షరియాను ఉపయోగిస్తు న్నాయి. ఇక్కడ షరియాకి నష్టం కలుగుతున్నదన్న వాదించేవారు ఉన్నారు. షరియాను పూర్తిగా అమలు చేయగలరా?

భారతదేశంలో షరియా లేదు, ఉండరాదు. సివిల్‌ ‌సంబంధాలవరకు. మిగతా వ్యక్తిగత సంబం ధాలవరకు, కాంట్రాక్టుల విషయంలో పాటించవచ్చు చట్టం ఒప్పుకుంటే. కానీ క్రిమినల్‌ ‌లా విషయంలో షరియా లేదు, మరొకటి లేదు. షరియా పేరుతో చేతులు నరకేస్తారు, తలలు తీసేస్తారు. రాళ్లతో కొట్టి చంపేస్తారు. దీనిని అంగీకరించలేం. ఆధునిక సమాజం నిర్మాణంలో చట్టబద్ధ పాలనకు కొన్ని పద్ధతులున్నాయి. వెనక్కి వెళ్లి వెయ్యేళ్ల క్రితం సమాజాన్ని సృష్టించాలని అనుకొన్నట్లయితే పొర పాటున కూడా ఒప్పుకోకూడదు. ఇక సివిల్‌ ‌సంబంధాల్లో చూస్తే ఇస్లాంలో వివాహం, నిఖా. నా కర్థమయినంతవరకు కాంట్రాక్టు. ఏ ప్రభుత్వము దాన్నాపకూడదు. వివాహం కాంట్రాక్టులాగే జరుగు తుంటే అభ్యంతరం పెట్టకూడదు. కానీ మగవారు మహిళను ఎప్పుడైనా కారణం లేకుండా వదిలిపెట్టే అవకాశం ఉంటే, ఇద్దరికీ సమాన హక్కులు లేకపోతే దాన్ని కచ్చితంగా ఆపాలి. ఈ రెండు వేర్వేరు విషయాలు. నిఖాలో జోక్యమంటే సంప్రదాయంలో జోక్యం చేసుకున్నట్లే. కానీ తేలికగా విడాకులు ఇచ్చేసి ఆడపిల్లలకి అన్యాయం చేస్తుంటే రాజ్యం చేయ వలసిన పని చేయక తప్పదు.

షరియా అనేది భారతదేశంలో 1937లో వచ్చింది. రాజ్యాంగ రచన 1946లో మొదలైంది. అంటే షరియా వచ్చి తొమ్మిదేళ్లు. అయినా ముస్లిం పర్సనల్‌ ‌లాని వీళ్లు అంతగా ఎందుకు అంగీకరించ వలసి వచ్చింది.
రెండే కారణాలు. ఒకటి ఆధిపత్యమన్న వర్గాలు పట్టుపోతుదన్న భయం, రెండోది అనవసరంగా గత వందేళ్ల కాలంలో ప్రపంచంలో వచ్చిన ఆర్థిక మార్పుల వల్ల కొన్ని దేశాలు ఛాందసాన్ని ఎక్కువ ప్రవేశపెట్టినాయి మతంపేరుతో. దీన్ని మనం చిత్తశుద్ధితో, వివక్ష లేకుండా ఆధునీకరణ కోసం చేసినట్ల యితే అన్ని వర్గాలు ఆమోదిస్తాయి. అత్యధికులు ఎప్పుడూ నిరాదరణకు గురౌతున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మనం చూడాల్సింది ఏమంటే, ప్రాధమ్యాలు. ఉమ్మడి పౌరస్మృతికి తొలి స్థానం ఇచ్చి మిగతా సమస్యలను ప్రక్కనపెట్టవలసిన అవసరం లేదు. అదో కీలక అంశమే. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేద్దాం. ఇస్లాంలో గనుక లేదా మరో మతంలో గనుక క్షమించకూడని సంప్రదాయముంటే వాటిని వెంటనే అరికట్టే ప్రయత్నంచేద్దాం. ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల మధ్య ఏకాభిప్రాయం సాధించటం అవసరం. ఒకవేళ నా మాటను అతను ఒప్పుకోకపోయినా కూడా అతను చెప్తున్న వాదనలో పస లేకపోయినా కూడా వీలున్నంత మేరకు కూర్చుని సామరస్యంగా ఒప్పించాలని నమ్మేవాణ్ణి నేను.

దీని గురించి ఆ వర్గం నుంచి స్పష్టత రావటం లేదు ఎందుకు?

కొన్ని మత సంప్రదాయాలలో ఒక్క మాట మాట్లాడితే మీరు పూర్తిగా మతానికి వ్యతిరేకమనే గందరగోళం ప్రవేశపెట్టారు. ఇది పూర్వం లేదు. ఒకప్పుడు అరబ్‌ ‌దేశాలు, ఇస్లామిక్‌ ‌దేశాలు ప్రపంచంలో ఆధునీకరణకు ప్రతీకలు. వెయ్యేళ్ల క్రితం జ్ఞానం అంతా భారతదేశం నుండి అరబ్‌ ‌దేశాలకు ఆపై యూరప్‌కు వెళ్లేది. యూరప్‌ ‌నుండి మనకు వచ్చేది. వీళ్లు మధ్యలో సంధిగా ఉండేవారు. కేవలం గత వంద ఏళ్లుగా కొందరు కుహనా మతవాదులు ఈ రాద్ధాంతం చేశారు. ఉదాహరణకు సౌదీ అరేబియాలో వాహబిజం వచ్చింది. ఆ వాహబ్‌ను ఆయన కుటుంబంలో కన్నతండ్రి, సోదరుడు పిచ్చోడుగా భావించారు. అలాంటి వాహబ్‌ను పెద్దోడిని చేసి వాహబిజం తీసుకొచ్చారు. ఇప్పటికీ సౌదీ అరేబియాలో నూటికి 75 మంది వాహబిజం పాటించరు. కానీ ఎప్పుడైతే అక్కడ చమురు సంపద వెల్లువెత్తిందో, ఆయిల్‌ అనేది ఆధునిక యుగంలో అవసరమైందో, రాజ్యాధికారం వాళ్ల చేతుల్లో ఉందో, నియంతృత్వం రాజ్యాధికారమయిందో అప్పుడు ఆ వాహబిజాన్ని విచ్చలవిడిగా పెంచారు. మరొకడు సయిద్‌ ‌కుతుబ్‌ అనుకుంటా.ఈజిప్షియన్‌. 1903 ‌ప్రాంతాల్లో అమెరికాలో చదువుకుంటున్నప్పుడు అనిపించిందట. ఆడమగ అంతా డాన్స్ (‌నూతన సంవత్సరం సందర్భంగా) చేస్తున్నారు. ఇది బాగాలేదు అనుకున్నాడు. సిద్ధాంతాలు అల్లాడు. ఇవాళ్టి ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం అతడు ప్రచారం చేసిన సిద్ధాంతం నుంచే వచ్చింది. కానీ భారతీయ సమాజంలో ఏ మతమైనా, ఏ ఆలోచన అయినా, సంప్రదాయమైనా కూడా సహజంగా వచ్చింది. బౌద్ధం హైందవం మీద తిరుగుబాటు, అయినా బుద్ధుడిని మన అవతారాల్లో ఒకడిగా చేశాం. అట్లాగే జైన మతస్తులు. వారిని మన సంప్రదాయంలో భాగం కాదు అని చెప్పే భావం లేదు. ఇస్లాం మొట్టమొదట వచ్చింది కేరళకు. ఎవరూ దానిని వ్యతిరేకించలేదు. వారు సహజీవనం చేశారు. క్రైస్తవం సెంట్‌ ‌థామస్‌ ‌ద్వారా వచ్చింది. ఎవరూ తిరస్కరించలేదు. జుడాయిజం రెండువేల ఏళ్లక్రితం వచ్చింది. ఎలాంటి సిద్ధాంతాన్నైనా, నమ్మకాన్నైనా అంగీకరించి కలుపుకు నేతత్త్వం ఉన్నది. అది కొనసాగుతుంది. అది గుర్తించాలి. అంతేకానీ మనం ఏం చేసినా కూడా అది మతానికో, కులానికో వ్యతిరేకం అనడం సరికాదు.

ఇది గత 75 ఏళ్లలో జరగలేదంటారా?

నేననుకోవటం సమాజం మనం అనుకున్నదాని కంటే సిద్ధంగా ఉంది. మనం వాడే భాష, దాన్ని రాజకీయ కోణం నుంచి గాక మానవీయ కోణం నుంచి చూసే తీరును బట్టి స్పందన ఉంటుంది. మనం నిర్దిష్టంగా మహిళల హక్కులు , మానవ హక్కులు లేకపోతే కొన్ని సంప్రదాయాల వల్ల జరుగుతున్న హింసను ఆపటం..అంతమేరకే తీసు కొస్తున్నామని ప్రజల ముందు చర్చ పెట్టినట్లయితే 100 నుంచి 95మంది ఆమోదిస్తారు.

ఈ చట్టం తీసుకురావడం వలన సమాజంలో సగభాగం మహిళకి న్యాయం చేకూర్చుతుందని నమ్మచ్చు కదా!

మానవ సమాజం ఎప్పుడూ కూడా మహిళల్ని నిర్దయగా చూసింది. అన్ని సంప్రదాయాల్లో కూడా ఇది కనిపిస్తుంది. హైందవం, క్రైస్తవం, ఇస్లాం ఏదైనా. మతం ఒక పక్కన ఆధ్యాత్మిక భావన పెంచింది, మనుషులకు ఆలంబనగా ఉన్నది. మనుషుల ప్రవర్తనని ఒక మంచి మార్గాన్ని పెట్టే ప్రయత్నం చేసింది. కానీ కచ్చితంగా లింగ వివక్ష, మత సంప్రదాయాలు రెండు కలిసిపోయినాయి. చాల వరకు, ప్రపంచమంతా కూడా.

పస్తుత ప్రభుత్వానికి ఈ చట్టం గురించి మీ•రేమన్నా సలహా ఇస్తారా?

మనం ప్రేమతో చేదుమందైనా తినిపించవచ్చు. కఠినంగా ఉంటే తీపిమందైనా తిరస్కరిస్తారు. కాబట్టి మంచి చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు, పార్టీలు తాము వాడే భాషను, పదజాలాన్ని కొంచెం మృదువుగా ఉంచుకున్నట్టయితే ఎక్కువ అంగీకారం ఉంటుంది. వ్యవసాయ చట్టాలు చూడండి. నూటికి నూరుపాళ్లు నేను సమర్థించాను. మంచి చట్టాలు, వ్యవసాయా నికి పనికొచ్చేవి. అదే గనుక కొంచెం మృదువుగా చేసినట్లయితే బావుండేది. అవి రాకపోవడం వల్ల దేశం చాలా నష్టపోయింది. ఈ చట్టాలు ఎందుకు అవసరమో అర్థమయ్యే రీతిలో గనుక చర్చను ప్రవేశపెట్టి, పార్లమెంట్‌ ‌కమిటీలో కూడా పెట్టి కొంచెం ఓపిగ్గా చేసినట్టయితే బహుశా చాలా తేలిగ్గా చట్టాలు అమలులోకి వచ్చేవి. ఎప్పుడైతే ఇది జరగలేదో, పక్షపాత రాజకీయ, ప్రజల జీవితానికి సంబంధం లేని రాజకీయం ప్రవేశించింది. అన్ని దేశాలలో రైతులకు స్వేచ్ఛ ఉన్నది. అమ్ముకునే స్వేచ్చ. సంకెళ్లు లేవు. చివరికి ఏ రైతుల ప్రయోజనం కోసం మనం ఏం చేయాలని అనుకున్నామో, ఏ రైతుల సంకెళ్లు తీసేయాలని అనుకున్నామో, అందుకు భిన్నంగా ఆ రైతులు మాకు సంకెళ్లు కావాలని కోరుకున్నారు. ప్రపంచ చరిత్రలో బానిసత్వంలో ఉన్నవారు బానిసత్వం కొనసాగాలని కోరుకున్న సంఘటన బహుశా ఇది ఒక్కటే. దానిలో అజ్ఞానం ఉంది. మన తొందరపాటుతనం కూడా ఉంది. వ్యవసాయ చట్టాలు చాలా మంచివి. ఈ దేశంలో నా అంత సమర్థించేవారు ఎవరూ లేరు. నేను నిర్మొహమాటంగా సమర్థిస్తాను. నిజాయితీగా చెప్పినపుడు, ఎంతో కొంత విశ్వసనీయంగా ఉన్న ఈ రంగంలో మనం చెప్పేది వాస్తవమైనప్పుడు ప్రజలంతా విశ్వసిస్తారు. దేశమంతటికి చెప్పే శక్తి మనకు లేదు, ఇన్ని భాషలున్న దేశంలో. దానిని పక్కన పెట్టండి. ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మంచైనా కూడా మనం ఒక చర్చ పెట్టి కూర్చోబెట్టి చెప్పినట్లయితే పని సులువవుతుంది. లేదూ, ఇది చేసి తీరాలని గట్టిగా అంటే మంచిది కూడా చెడు ఫలితాన్నిస్తుంది.

కానీ సుప్రీంకోర్టు, అందరూ వరుసగా దీని అవసరం గురించి గట్టి చెప్పిన మాట వాస్తవమే కదా?

కాదనటం లేదు. 75 ఏళ్లు ఆలస్యమయింది, ఒక 8 నెలలు ఆలస్యమైతే కొంపమునిగిందేమి లేదు కదా! ఏ అంశాలు కావాలో చర్చకు పెడదాం. ఎందుకవసరమో గణాంకాలతో, వివరాలతో ముందు పెడదాం. ఆ చర్చలో మనం చెపుతున్న మాట వాస్తవమైనట్లయితే దానిలో నిజాయితీ ఉన్నట్లయితే, నూటికి 90 మంది అంగీకరిస్తారు. మనం ఇవాళ మాట్లాడుకున్నాం. నేను నిష్కల్మషంగా మాట్లాడాను. నూటికి 90మంది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ వాదనను అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. మనం మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయోజనాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సరళి ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య సమాజంలో మార్పునకు నాంది పలుకుతుంది. అలా గాకుండా సంఖ్యాబలంతో చేస్తే జరగదు. అందులో మనలాంటి దేశంలో ఎవరి మాట ఎవరూ వినరు. కాబట్టి నేను కోరేది ఆ మృదుత్వం, ఆ వాస్తవాలు హేతుబద్ధ వాదన. నా లాంటివారికి చాలా తొందరగా దేశం మారిపోవాలని ఉంది. దేశం వేగంగా మారిపోవాలని చాలా ఆశ పడుతున్నవారిలో నేనొకణ్ణి. కానీ కొన్ని సందర్భాల్లో నెమ్మదితనం చాలా అవసరం.

About Author

By editor

Twitter
YOUTUBE