ఆరోపణలు ఖండించడంలోను, అర్థం లేని, అనవసర ప్రశ్నలకు చెంప చెళ్లుమనిపించే రీతిలో స్పందించడంలో ప్రధాని నరేంద్ర మోదీది అందె వేసిన చేయి. అదే అమెరి కాలో జరిగిన విలేకరుల సమావేశంలోనూ కనిపించింది. ‘ప్రజాస్వామ్యం మా డీఎన్‌ఏ లోనే ఉంది’-ఒక జిత్తులమారి ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీ సూటిగా ఇచ్చిన సమాధానమిది. అంతేకాదు, ‘ప్రజాస్వామ్యం మా రక్తంలోనే ఉంది’ అని కూడా తగిలించారు.
సబ్రినా సిద్దికి అనే మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన అంత ఘాటుగా స్పందించవలసి వచ్చింది. ‘పాకిస్తాన్ మూలాలు ఉన్న’ సబ్రినా ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ అనే అమెరికా పత్రిక ప్రతినిధిగా జూన్ 22న శ్వేతసౌధంలో జరిగిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి వచ్చారు. శ్వేతసౌధం వార్తలు రాయడానికి నియోగించిన విలేకరిగా ఆమె వచ్చారు. అసలు పత్రికా విలేకరిగా కావచ్చు, టీవీ చర్చలలో ప్యానల్ సభ్యులుగా కావచ్చు. లేదా మరో సమావేశంలో వక్తగా పాల్గొన్న సందర్భం కావచ్చు. ఈ పాత్రలు పోషించడానికి వచ్చే చాలామంది ముస్లింలు తాము నిజంగా చర్చించవలసిన అంశానికి సుదూరంగా, వారి మత విశ్వాసాల పునాదిగానే వాదించడం, మలచడం ఇటీవలి ధోరణి. ఇది దాచేస్తే దాగని నిజం. సబ్రినా అమెరికాలోనే ఉన్నా, విలేకరుల సమావేశం శ్వేతసౌధంలో అధ్యక్షుడు జోబైడెన్ సమక్షంలోనే జరిగినా ఆమె తన ‘మూలాలు’ మరచిపోలేదు. ఇది ప్రపంచ ప్రజానీకం, అమెరికా సమాజం బాగానే గుర్తించాయి. ప్రధానంగా పత్రికా ప్రపంచం మొదటే పసిగట్టింది. ఇలాంటి ప్రశ్నలు వేసే వారి ఉద్దేశమే మోదీ వంటి నేతలను ప్రపంచ ప్రజల ముందు బోనులో నిలబెట్టాలన్న అత్యాశ. కానీ ప్రశ్నను బట్టి ప్రపంచ ప్రజానీకం కూడా ఆమె ‘మూలాల’ సంగతి విస్మరించడం లేదు. ఇది దురుద్దేశంతో కూడిన, ప్రచార యావతో అడిగిన ప్రశ్న అని కొందరు మీడియా సభ్యులే నిర్ధారించారు.
ఆ ప్రశ్న ఆమె అడగడానికి అవకాశం ఇచ్చినది మళ్లీ అమెరికా మంత్రే. ఆ దేశ విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఒక ఇంటర్వ్యూలో, ‘ఇటీవల కాలంలో భారత్‌లో మైనారిటీల పట్ల పెరుగుతున్న అసహనం పట్ల అమెరికా కలత పడుతున్నది’ అన్నారు. కానీ మోదీని కాంగ్రెస్‌లో ప్రసంగించమని కోరిన బైడెన్ మాత్రం భారత్, అమెరికా రెండూ అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలని వ్యాఖ్యానించారు. ఈ ద్వంద్వ వైఖరి సహజంగానే ‘పాక్ మూలాల’ జర్నలిస్టులో ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది. మోదీని సబ్రినా అడిగిన ప్రశ్న ఇది: ‘ప్రధానమంత్రి గారు! ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం మాదేనని భారత్ చిరకాలంగా గర్వంగా చెప్పుకుంటున్నది. కానీ మీ ప్రభుత్వం మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నదని చాలా మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మీరు విమర్శకుల నోళ్లు నొక్కుతున్నారన్న మరొక ఆరోపణ కూడా ఉంది. శ్వేతసౌధంలో ఇప్పుడు మీరు నిలబడి మాట్లాడుతున్న ఈస్ట్ రూమ్ ఎందరో ప్రపంచ ప్రఖ్యాత నాయకులు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని తమ నిబద్ధతను ప్రకటించిన స్థలం. మైనా రిటీల, ముఖ్యంగా ముస్లింల హక్కుల ఉద్ధరణకు, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’
ఇప్పుడు ప్రధాని మోదీ స్పందన చూద్దాం
‘భారతదేశం ప్రజాస్వామిక దేశం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్టు భారత్, అమెరికాలకు ప్రజాస్వామ్యం వాటి డీఎన్‌ఏలోనే ఉంది. ప్రజా స్వామ్యమే మాకు స్ఫూర్తి. అది మా రక్తంలోనే ఉంది. మా పూర్వికులు దీనిని మా రాజ్యాంగంలో పొందుపరిచారు కూడా.’ అన్నారు మోదీ. భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యం అనే గట్టి పునాదుల మీద నిలబడి పని చేస్తున్నదనీ, ప్రజాస్వామ్యం లక్షణాల తోనే ఏర్పాటయిందనీ కూడా ఆయన చెప్పారు. కులం, వర్గం, మతం, లింగభేదం కారణంగా చూపే వివక్షను నిరాకరించే గుణం ప్రజాస్వామ్యంలో అంత ర్గతంగానే ఉంటుంది. ప్రజాస్వామ్యం మానవత్వం, మానవీయ విలువలు, మానవ హక్కుల పట్ల గౌరవంతోనే ఉంటుంది. మా ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక లక్షణాల ఆధారంగానే పనిచేస్తున్నది. మనం ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తున్నా అందులో మానవత్వం, మానవ హక్కుల పట్ల గౌరవం, మాన వీయ విలువలు లేకపోతే దానిని ప్రజాస్వామ్యంగా పరిగణించలేమని అన్నారాయన. మనం ప్రజా స్వామ్యం గురించి మాట్లాడినప్పుడే, ప్రజాస్వామ్యాన్ని ఆమోదించినప్పుడే మనం ప్రజాస్వామ్యంలో ఉండగలుగుతాం అన్న విలువైన మాటలను క•డా ప్రధాని తన సమాధానంలో భాగం చేశారు.
నిజానికి సబ్రినా వేసిన ప్రశ్న ప్రధాని మోదీని ఇరుకున పెట్టడానికి సంధించిందని వేరే చెప్పక్కర లేదు. కానీ మోదీ నుంచి అందుకు దీటుగానే సమాధానం వచ్చింది. ఇది కూడా ప్రపంచ మీడియా అభిప్రాయమే. అయినా సబ్రినాను సమర్థించడానికి అల్ట్ న్యూస్‌కు చెందిన జుబేర్ ఉత్సాహపడ్డాడు. అయితే ఇతడు చేసిన ట్వీట్ వల్ల ఒక గొప్ప సత్యం, అది కూడా సబ్రినా ‘మూలాలు’ గురించినది అనుకోకుండా బయటపడింది. సబ్రినా ఎవరో కాదు, భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ మనవరాలికి మనవరాలే. ‘సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ముని ముని మనుమరాలు చాలామంది ముస్లింల వలెనే భారతదేశం పట్ల తన విధేయతను చాటుకున్నారు. అధికారంలో ఉన్నవాళ్లని నిలదీస్తే మీ మీద ఒక ముద్ర వేస్తారు. జాతి విద్రోహులని, పాకిస్తానీ అని, హిందూ వ్యతిరేకి అని, భారత వ్యతిరేకి అని. ఇదంతా మితవాదులు ప్రదర్శించే విద్యే’ అన్నాడు జుబేర్.
వైట్‌హౌస్‌లో వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికా ప్రతినిధికి మోదీ మర్యాదగా సమాధానం ఇచ్చినా, ఒక్క మాట చెప్పి ఉండవలసిందని చాలామంది అభిప్రాయ పడడం విశేషం. సెబాస్టియన్ జంగేర్ పురస్కారం అందుకున్న సబ్రినా ‘వార్ అండ్ ట్రైబ్’ అని పుస్తకం కూడా రాశారట. ఇందులో జర్నలిజం వెల్లడించ వలసినది ఏమిటీ అంటే వాస్తవమే అని వాక్రుచ్చింది. కాబట్టి పాకిస్తాన్‌లో మైనారిటీల పరిస్థితి ఏమిటో, ఆ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు తప్పనిసరిగా అక్కడి మైనారిటీల గురించి ప్రశ్నించాలని నా విన్నపం అని మోదీ ఒక చురక అంటించి ఉండ వలసింది. కనీసం ఈ మధ్య ఎంతమంది మైనారిటీ లను (హిందువులు, క్రైస్తవులు, సిక్కులు) పాకిస్తాన్‌లో చంపారు? ఎంతమంది హిందూ బాలికలను అపహరించుకుపోయి మతం మార్చి పెళ్లిళ్లు చేసు కున్నారు? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడగవలసిందని, అప్పుడు మాత్రమే మైనారిటీల మీద, వారి రక్షణ పట్ల నీకు ఉన్న నిబద్ధత ప్రపంచానికి తెలుస్తుందని సూచించి ఉండవలసింది. పత్రికా రచన కీలక లక్ష్యం సత్యాన్ని చాటడం, సత్యాన్ని నివేదించడమేనని కూడా చాలా పెద్ద పెద్ద మాటలు ఆమె తన పుస్తకంలో నొక్కి వక్కాణించారు కాబట్టి మోదీ ఈ సూచన చేసినా తప్పు లేదనిపిస్తుంది. ఆమె ప్రశ్న, మోదీ సమాధానం ప్రపంచం మీదకు వచ్చిన తరువాత పలువురు జర్నలిస్టులు, కాలమిస్టులు కూడా సబ్రినాలోని గురవింద న్యాయాన్నే సుస్పష్టంగా చూశారు. ఇంకా చాలా మాటలు రాశారామె. సత్యనిష్టతో, సమాచారాన్ని పంచుతూ, ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా, పక్షపాత రహితంగా జర్నలిస్టులు ఉండాలట. ఈ మాట కాదనడం మహాపాపం. కానీ తన తల్లిదండ్రుల దేశంలో, తను పాటిస్తున్న విశ్వాసం పాకిస్తాన్‌లో మైనారిటీల పట్ల ఎంత అమానుషంగా ఉన్నదో ఆమె నోటితో చెప్పిస్తే ప్రపంచం చక్కగా ఆలకిస్తుంది. ఈమె సత్యనిష్ట సంగతి కూడా తెలిసిపోతుంది. తమ కుటుంబాలకు దూరమైన బాలికల కోసం హిందువులు పాకిస్తాన్ పోలీస్‌స్టేషన్ల చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేస్తున్నారో, ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌లు రాసి, అమ్మాయిల ఆచూకీ తెలిసినా, కోర్టులు వారిని తల్లిదండ్రులకు అప్పగించ డానికి ఎలా నిరాకరిస్తున్నాయో సబ్రినా రాసే వ్యాసాలలో వర్ణించి ఉంటే ఆమె నిజాయతీని అంతా మెచ్చేవారమని పలువురు వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ షరియా న్యాయస్థానాలు బాధితుల (హిందువులు) మీదనే నేరగాళ్ల ముద్ర ఎలా వేస్తాయో కూడా ఆమె రాయాలని వారు అంటున్నారు. పాకిస్తాన్‌లో అణచివేతకు గురైన అహ్మదీయ ముస్లింలు భారతదేశంలో సురక్షితంగా జీవిస్తున్న విషయం సబ్రినా గమనించడం చాలా అవసరమని ఇంకొం దరు రాశారు. పాకిస్తాన్ రాజ్యాంగం అహ్మదీయ ముస్లింలు, ముస్లిమేతరుల పట్ల ఎంత వివక్షను ప్రదర్శిస్తున్నదో కూడా సబ్రినాకు తెలియదా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. అహ్మదీయ ముస్లింలు, ముస్లిమేతరులు పాకిస్తాన్ ప్రధాని పదవికి అనర్హులని అందులో ప్రకటించారు.
ఇప్పుడు సబ్రినా ప్రశ్నను మీడియా ఎలా భావిస్తున్నది? అసలు ఇలాంటి ప్రశ్న సరికాదు. ఈ ప్రశ్నలోనే సున్నిత అంశం ఉంది. ముందు ఈ ప్రశ్నలోని వాస్తవం మాటేమిటి? అంటూ, అది అబద్ధమే అయినా, అది అబద్ధమేనని అందరికీ తెలిసినా ముందురి కాళ్లకు బంధం వేసే అతి తెలివి వ్యూహం కూడా కనిపిస్తుంది. అందుకే దీనిని ప్రచారం కోసం వేసిన ప్రశ్నగా చాలామంది భావిస్తు న్నారు. మైనారిటీల హక్కులక• భారత రాజ్యాంగం పూచీ పడినప్పటికీ, నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం రక్షించలేకపోతున్నదన్న అభిప్రాయానికి అంతా ముందే వస్తారు. అంటే భారత్ అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అనడం సరికాదన్న వాదనకు తెర తీసేది అవుతుంది. అందుకే మోదీ ప్రభుత్వ మార్పు కోసం దింపుడు కళ్లం ఆశతో ఉన్న అమెరికా లాబీ ఆశ చిగురింప చేయడమే సబ్రినా ప్రశ్న వెనుక ఉన్న అంతరార్థమన్న వాదన కూడా ఉంది. అయితే అనూహ్యంగా నరేంద్ర మోదీ తన దీటైన సమా ధానంతో వాళ్లందరి కుట్రను ఛేదించారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భారతీయులు సహా కొందరు ప్రశ్నిస్తే హేళన చేస్తారా అంటూ గోల చేయడం, సబ్రినా విక్టిమ్ కార్డ్ వెంటనే బయటకు తీయడం కూడా జరిగింది.
సబ్రినా ‘టూల్‌కిట్ గ్యాంగ్’లో సభ్యురాలని బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ విమర్శించారు. కొందరు మాత్రం ఆమెను పాకిస్తానీ ఇస్లామిస్ట్ అని, ఆమె ఇండియాను లక్ష్యంగా చేసుకున్నారని ట్వీట్ చేశారు. ఒకరైతే ఆమె ద్వేషం అనేది పాకిస్తాన్ డీఎన్‌ఏలోనే ఉంటుందని ట్వీట్ చేశారు. పాకిస్తాన్ దంపతులు కన్న ఈమె ఇస్లామిస్ట్‌ల వాదననే వినిపించిందని ఇంకొదరు వ్యాఖ్యానించారు. భారత దేశంలో మోదీని వ్యతిరేకించే వామపక్షవాదులు, ఉదారవాదుల పనుపున సబ్రినా ఈ ప్రశ్న వేశారని నమ్మాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వెలువడిన తరువాత తాను భారతదేశాన్ని తీవ్రంగా ప్రేమిస్తానని నమ్మించడానికి సబ్రినా ఒక మ్యాచ్‌లో గెలిచిన భారత క్రికెట్ బృందాన్ని తన తండ్రితో కలసి అభినందించినప్పటి ఫోటోను ట్వీట్ చేశారు. అయితే భారతదేశం నుంచి కూడా సబ్రినాకు సంఘీభావం తెలియచేసిన వాళ్లు లేకపోలేదు. అందులో ప్రథముడు కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్. నీ పని నీవు అద్భుతంగా చేశావ్. నీ వెనుక మేమున్నాం అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రశ్నించడాన్ని నేరంగా చూడకూడదని సబ్రినాపై ట్రోలింగ్ నేపథ్యంలో వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. భారత ప్రధానిని ప్రశ్నించినందుకే ఆమెను ఇలా అవహేళన చేయడం సరికాదని, అందరికీ ప్రశ్నించే తత్త్వం ఉండాలని వైట్‌హౌస్ ప్రతినిధి వ్యాఖ్యా నించారు. దొడ్డిదారినే కావచ్చు, మోదీనీ ఇరకాటంలో పెట్టాలని చూసినందుకే ఒక మహిళా జర్నలిస్ట్ రాత్రికి రాత్రి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేశారు. ఇది అసలు ట్విస్ట్. ఇప్పుడు ఆమె వెనుక వేలాది మంది మేధావులు నిలబడ్డారు. ఇది ఇవాళ్టి ప్రపంచ రీతి.
– జాగృతి డెస్క్