ఉమ్మడి పౌరస్మృతి ఇంత సున్నితమైన అంశం ఎంతమాత్రం కాదని, అదొక సున్నితమైన మత అంశంగా కొందరు మార్చివేశారని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మతంతో, వర్గంతో, కులంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమ న్యాయం అందించడానికి ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరాన్ని ఇంతవరకు ఎవరూ నిరాకరించలేదని ఆయన అన్నారు. ఏ మతంలో అయినా బహు భార్యత్వాన్ని, స్త్రీలకు హక్కులను కల్పించే అవకాశం యూసీసీ ద్వారా వస్తుందని నమ్మవచ్చునని కూడా ఆయన చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తున్న వర్గాల స్త్రీలను ప్రశ్నించినా వారు యూసీసీని స్వాగతిస్తారని చెప్పగలమని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు తన తీర్పులలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని తెలియచేసిన సంగతిని ఇంకా విస్మరించడం సరికాదని కూడా ఆయన హెచ్చరించారు. తరువాత అమలు చేయడం అంత సులభం కాకపోవచ్చునని కూడా అభిప్రాయపడుతున్నారు. యూసీసీపై 22వ లా కమిషన్ అభిప్రాయాలను ఆహ్వానించిన నేపథ్యంలో జాగృతికి జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాలు ఇవి:
ఉమ్మడి పౌరస్మృతి… తాజాగా భారత సామాజిక, రాజకీయ వ్యవస్థ మీదకి మరొకసారి పెద్ద చర్చను తీసుకువచ్చింది. 2016, 2018 సంవత్సరాలలో జరిగిన ప్రయత్నాన్ని మించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ అంశం మీద మరింత తీవ్రంగా ఆలోచిస్తున్నట్టే అనిపిస్తున్నది. పౌరులు, వ్యవస్థలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని 22వ లా కమిషన్ చెప్పడం…కొన్ని మతాల వారి ప్రచారాలు ఈ విషయాలు మీకు తెలుసు. ఇంతకీ ఉమ్మడి పౌరస్మృతికి (యూనిఫార్మ్ సివిల్ కోడ్-యూసీసీ) ఆధారమైన రాజ్యాంగంలోని 44వ అధికరణం, అందులోని ఆదేశికసూత్రాలు ఉమ్మడి పౌరస్మృతి గురించి ఏమి చెప్పాయి? దానిని రాజకీయ పార్టీలు ఎలా అర్థం చేసుకున్నాయి?
44వ అధికరణం ఈ దేశానికి వీలైనంత త్వరలో ఒక ఉమ్మడి పౌరసత్వ చట్టం తీసుకురావాలని నిర్దేశించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడే సుదీర్ఘ చర్చ జరిగింది. రాజకీయ కారణాలు కావచ్చు, వేరే కారణాలు కావచ్చు, దానిమీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టలేదు. శాసనాలేమీ చేయలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే ఇది చేస్తే ఒక వర్గం నొచ్చు కుంటుందనీ, వాళ్ల ఓట్లు మనకు రావన్న ఉద్దేశంతో ఉమ్మడి పౌరస్మృతిని చాలాకాలం పార్టీలు పట్టించుకోలేదు.
ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకత ఏమిటి? దీని నిర్మాణంలో సామాజికాంశాలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల ప్రభావమే ప్రధానంగా ఉంటుందా?
నిజమే, ఈ విషయంలో కొంతమేర సామాజిక దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం కావచ్చు, లేకుంటే వేరేమైనా కావచ్చు. ఏ సమాజా నికైనా పౌరజీవనాన్ని ప్రతిపాదించవచ్చు. పౌరజీవనం అంటే జననం, విద్యాభ్యాసం, పెళ్లి, ఆ వ్యవస్థలో భార్యాభర్తలకు సంబంధించిన హక్కులు, వారికి కలిగే పిల్లలు, ఆస్తి పంపకాలు, దత్తత నుంచి విడాకుల వరకు కూడ అందులో వస్తాయి. ఇవన్నీ ఎంత సుస్పష్టంగా నిర్వచించి ఉంటే సమాజం అంత సామరస్యంగా నడుస్తుంది. ఆర్థిక, సామాజిక విషయాలు వేరేసంగతి. అన్నిట్లో కూడా పాత్ర వహించవలసినది ఆ దేశ పౌరులే. కాబట్టి పౌరుల సంక్షేమం, సంరక్షణ అన్నీ ఇమిడి ఉన్నది ఈ యూసీసీ. అది రకరకాలుగా ఉండచ్చు. ఎంత చట్ట బద్ధంగా, ఆమోదయోగ్యంగా ఉంటే సమాజంలో శాంతిభద్రతలు అంతగా వికసిస్తాయి. ఒక పౌరుడిలో తన పెళ్లికి సంబంధించి ఏదో అశాంతి ఉందను కోండి. ఆ అశాంతికి అతడూ లేదా అతడి భార్య- ఎవరైనా కారణం కావచ్చు. లేకుంటే రకరకాల మార్పుల ఫలితమూ కావచ్చు. వాళ్లిద్దరి అశాంతి అక్కడితో ఆగదు. కుటుంబం మీద పడుతుంది. తరువాత సమాజం మీద. కాబట్టి ఒక వ్యవస్థ నుంచి ఆశించిన ఫలితం రాదు. అతను సాధారణ పౌరుడు కావచ్చు, ఉద్యోగి కావచ్చు.పౌరుడు సుఖశాంతులతో ఉంటే సమాజంలో శాంతి ఉంటుంది. కానీ భారత్ సువిశాలమైనది. రకరకాల ప్రజలు ఉన్నారు. ఈ సమస్య గురించి అందరికీ ఒకే రీతిన పరిష్కారం ఇచ్చే వాతావరణం ఇవాళ లేదు. ఇలాంటి సమస్య లకు ఏకరూపత ఉన్న చట్టంతో పరిష్కారం చెబితే ఆచరణాత్మకంగా ఉంటుంది.
ఉమ్మడి పౌరస్మృతి ప్రయత్నం 1835 ప్రాంతం లోనే ఉంది కదా! అంటే ఈస్టిండియా కంపెనీయే చేసింది. తరువాత కూడా హిందూ, ముస్లిం పర్సనల్ లాలను తాకడానికి నిరాకరించింది. దీని నేపథ్యం ఏమిటి?
మునుపు వ్యక్తిగత విషయాలను వాళ్ల వాళ్ల మతాచారాల ఆధారంగా మలుచుకున్నారు. అవే పర్సనల్ లాలు. విదేశీయులు ఆ ప్రయత్నం మొదలు పెట్టి ఆపేశారంటే, మన మీద వాళ్లకేమిటి ప్రేమ? ఎంత దోచుకోగలమన్న ధ్యాస తప్ప ఆ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక్కడి ప్రజల అవసరాలేమిటో పట్టించుకోలేదు. స్వాతంత్య్రం వచ్చాక దీన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇస్తుంది. అంటే ప్రభుత్వం నుండి ప్రజలను కాపాడే పక్రియ. సాధారణంగా ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఆదేశికసూత్రాలు ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తాయి. ప్రభుత్వాల• ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, అందులో విధానాల ప్రాధాన్యం ఏమిటి? ఇవి చెబుతాయి. అది గోవధ నిషేధం కావచ్చు. అందరికీ పని కల్పించడం, లేకుంటే సమాన వేతనం కల్పించడం వంటివి. పౌరసత్వ చట్టం అవకాశం ఉంటే అప్పుడే చేసేవారేమో! శిక్షాస్మృతి- పీనల్ కోడ్ ఉంది. దీనికి సంబంధించిన శాసన వ్యవస్థ కోసం పార్లమెంటును దిశా నిర్దేశనం చేసి మీరు ఈ రకంగా చేయండి అని పొందుపరుస్తారు. యూసీసీ నిర్మాణంలో పార్లమెంటుకు, రాష్ట్రాలకు కూడా బాధ్యత ఉంది.
గోవాలో ఉమ్మడి పౌరస్మృతి ఉంది. మిగతా రాష్ట్రాలు ఎందుకు పూనుకోలేదు?
కర్ణాటకలో తాజా పరిణామాలు చూశాం కదా! అది ఔరంగజేబు, మొగల్ చరిత్రలో కొన్ని అంశాలు బాధాకరమైనవని ఇంతకు ముందున్న ప్రభుత్వం వాటిని పాఠ్య పుస్తకాల నుంచి తొలగించింది. కొత్త పార్టీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ వాటిని ప్రవేశపెట్టారు. ముందున్న ప్రభుత్వం గోవధ మీద ఆంక్షలు పెట్టింది. కొత్త ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని, మతమార్పిడి చట్టాన్ని వెనుకకు తీసుకొంది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ మాత్రం పాత పార్టీతో మైలపడిన అసెంబ్లీని పరిశుద్ధం చేయడానికి గోమూత్రం వాడింది.
హిందూకోడ్ నిర్మాణంతోనే నాటి కేంద్రం ఎందుకు ఆగిపోయింది?
మీరు ఇంకొకటి గమనించాలి. పౌరస్మృతి అనేది ప్రజలకే వదిలేద్దాం, అంటే పర్సనల్ లాలతోనే వాళ్లని బతకనిద్దాం, మనకెందుకులే అన్న ఉద్దేశం కాదు నాటి పెద్దలది. నిజమే, హిందువులకు సంబంధించి హిందూ కోడ్ తీసుకువచ్చారు. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ అడాప్షన్, డైవర్స్ ఇవన్నీ తీసు కొచ్చారు. అప్పుడు డాక్టర్ అంబేడ్కర్ తన అభిప్రాయాన్ని వినిపించారు. హిందువులకు మాత్రమే ఈ కోడ్‌ను ఎందుకు తీసుకొస్తున్నారు? ఆర్టికల్ 44 ప్రకారం అందరికీ సమానంగా వర్తించే చట్టం రావాలి అన్నారు. హిందూ కోడ్ బిల్లును ఆయన, ఇంకా చాలామంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా వ్యతిరేకించారు. హిందూధర్మంలో దయాబాగ, దాక్షర పద్ధతులు, వేర్వేరు ఆచారాలతో పెళ్లిళ్లు చేసుకునే పద్దతి, ఆచార వ్యవహారాల పద్ధతి అన్నీ ఉన్నాయి. అయినా చట్టబద్ధత కలిగిన పౌరులుగా అన్నిటినీ వీరు స్వీకరించారు. వ్యతిరేకించలేదు.
ముస్లింలను షరియాకు ఎందుకు అనుమతిం చారు? ముస్లింల అంశం కాబట్టి సున్నితమైనదని భావించారా?
రాజ్యాంగ పరిషత్‌లో ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం ప్రతినిధులు ప్రతిఘటించారు. నాటి ప్రభుత్వాలు కూడా మౌనం దాల్చాయి. ముస్లింలకు ఉమ్మడి పౌరసత్వాన్ని ఆపాదించడం సున్నితమైన అంశమని నాటి కొందరు ప్రభుత్వ పెద్దలు కల్పన చేశారు. షరియా నుంచి వారిని బయటకు తేవడం సున్నితమైన అంశమన్న భ్రమను సృష్టించారు. అలా పక్కన పెట్టారు. అంతేతప్ప అది సున్నితమైనది కానేకాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అదో సున్నితమైన అంశంగా మారిందనాలి. ఉదాహరణకు పెళ్లి. ఇస్లాంలో నాలుగు పెళ్లిళ్ల్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. సెంట్రల్ సర్వీస్, సివిల్ సర్వీసెస్‌లో గ్రూప్ 21 అని నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఎవరైనా భార్యగాని, భర్తగాని బతికి ఉన్నప్పుడు వేరే పెళ్లి చేసుకుంటే శిక్షార్హం. ఉద్యోగం నుంచి తీసేస్తారు. అది మిస్ కాండక్ట్ కిందకు వస్తుంది. ఈ నియమమే యూపీ సర్వీస్‌లోనూ 1956లో వచ్చింది. కానీ ఒక ముస్లిం ఉద్యోగి భార్య జీవించి ఉండగానే మరొకామెను పెళ్లి చేసుకున్నాడు. క్రమశిక్షణా సంఘం చర్య తీసుకుంది. మొదటి భార్యకు విడాకులిచ్చానని చెప్పాడతడు. ఆ విషయం రికార్డుల ద్వారా ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నించింది క్రమశిక్షణా సంఘం. చివరికి ఉద్యోగం నుంచి తొలగించింది. అలహాబాద్ హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు కూడా క్రమశిక్షణా సంఘం చర్యను సమర్థించాయి. నలుగురిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అనుకునే చోట, ఒకరి కంటే తక్కువమందిని చేసుకుంటే మతస్వేచ్ఛకు భంగం అనుకునే చోట ఆనాడు ఆ చర్యతో ఎందుకు వ్యతి రేకత రాలేదు? ఇది 1956లో మాట. విద్యావేత్తలు ఎవరూ క్రమశిక్షణా సంఘం చర్యను వ్యతిరేకించ లేదు. అంటే ఇవాళ చాలామంది నాయకులు, మత గురువులు దానిని సున్నితాంశంగా మార్చేశారనే కదా అర్ధం! వీరు అలాంటి భయాన్ని దేశంలో సృష్టించారు.
అసలు సమస్య యూసీసీని వాయిదా వేసు కుంటూ పోవడానికి వీలుగా, వాటికి అనుకూలంగా రాజకీయ పార్టీలు భాష్యం చెప్పడం వల్లనేనా?
యూసీసీ అమలునూ, నిర్మాణాన్నీ ఎంతసేపటికి వీళ్లు మత విశ్వాసం కింద పరిగణించడం మొదలు పెట్టారు. కానీ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం -సుప్రీంకోర్టు-చాలా తీర్పులలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని గుర్తుచేసిన మాట నిజం. ఆ తీర్పుల జాబితా కూడా ఉన్నది. వాటిలో ఏమన్నారంటే మత విశ్వాసం వేరు, మత ఆచారం వేరు. మత ఆచారం అంటే ఒక వర్గం నిత్యం చేసే పూజ కావచ్చు, సంధ్యావందనం కావచ్చు, ఒక వర్గంవారి నమాజ్ కావచ్చు, ప్రార్థన కావచ్చు. ఇవన్నీ మతాచారాలు. విశ్వాసమన్నది మతానికి సంబంధించినది. నేను దానిని నమ్ముతాను. అది మనసుకు సంబంధిం చినది. ఆచారాలు అనేవి అంతర్గతంగా, బహిర్గతంగా కనిపించేవి. కానీ యూసీసీ ప్రస్తావన వస్తే ప్రతిసారి 25వ అధికరణం చూపెడతారు. కానీ ఆ అధికరణం ఏమన్నది? ఆ హక్కు నిరపేక్షం (ఏబ్సల్యూట్) కాదు అనే చెప్పింది. ఇంకా సబ్జెక్టు, మొరాలిటి అండ్ అదర్ థింగ్స్ అని కూడా చెబుతుంది. మతస్వేచ్ఛ మనసుకు సంబంధించినది. మతానికి సంబంధించినది కాబట్టి స్వేచ్ఛ ఉన్నది. ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు. కానీ ఆచారం దాని కిందకు రాదు. వాటికి లోబడే ఆ స్వేచ్ఛ ఉన్నది. ఆచారాన్ని ఆ మతం నిర్దేశించాలి. నిర్దేశిస్తేనే ఆచారం. మతం ఫలానా అంశాన్ని నిషే ధించలేదు కాబట్టి పాటిస్తాననడం ఆచారం కింద రాదు. అందులో నిర్దేశిస్తేనే ఆచారం కిందకు వస్తుంది. అది ఆ మతం వారు తప్పక పాటిం చాలి. ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి నపుడు దానిని ఇది నా మతానికి సంబంధించిన ఆచారానికి వ్యతిరేకం అని ఎవరైనా అన్నపుడు, ఏమడుగుతారంటే, అది ఆచ రించమని నీ మతం నిర్దేశించిందా! అని. ఉదాహరణకు అన్ని రాష్ట్రాలలోను స్థానిక సంస్థల ఎన్నికలలో మూడో సంతానం ఉంటే పోటీకి అనర్హులవుతారు. ఈ అనర్హత మొదట హరియాణలో అమలులోకి వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మా మతంలో నలుగురు భార్యలను చేసుకోవచ్చు అని చెప్పారు. ఇద్దరు సంతానం నిబంధన పెడితే ఆ బహు భార్యత్వ హక్కుకు అడ్డం అని వాదించారు. అపుడు నలుగురు కంటే తక్కువ మందిని వివాహం చేసుకుంటే మీ మతం నుంచి మిమ్మల్ని వేరు చేస్తారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నలుగురు భార్యలను చేసుకోకపోతే ముస్లింగా పరిగణించరని ఎక్కడా లేదు. అది షరియా అంశం. బహు భార్యాత్వాన్ని అది నిషేధించక పోవచ్చు. కానీ సాంఘిక వ్యవస్థకు లోబడి ఉండాలి.
హిందూ లా నిర్మాణంలో డాక్టర్ అంబేడ్కర్ ప్రతికూలతను ఎదుర్కొన్నారు. ఆయన ఉమ్మడి పౌరస్మృతిని సమర్ధించారు. ఆ విషయంలో ఆయన బలంగా వాదించి ఉండాలి. ఆయన ఏం చెప్పారు?
ఉమ్మడి పౌరస్మృతి అవసరం కాదని ఇంతవరకు ఎవరూ అనలేదు. కానీ దానిని అమలు చేస్తే అందరికీ చేయాలి. హిందువులకు మాత్రమే చట్టం ఎలా చేస్తావు? చేస్తే అందరికి చేయాలి అని అంబేడ్కర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ మాటకొస్తే ఒక వర్గాన్ని పక్కన బెట్టారంటే వాళ్లకు మత విశ్వాసం ఉంది మిగతా మతాలకి లేదనా? ఇస్లాం వివాహ వ్యవస్థ కాంట్రాక్ట్. కానీ హిందువులకు అదొక పవిత్ర వ్యవస్థ. శాశ్వతమైన బంధం. ఆ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి పెళ్లంటే ఇది, విడాకులంటే ఇది అని తయారుచేశారు. పూజా పద్ధతి వేరు వేరుగా ఉన్నాగాని ఆ చట్టానికి లోబడే ఇప్పుడు హిందువు లంతా వివాహ వ్యవస్థను అమలు చేస్తున్నారు.
నేరస్మృతిని అందరూ అంగీకరించారు, పౌరస్మృతిని ఎందుకు అంగీకరించటం లేదు?
పౌరస్మృతిని తీసుకువస్తే ఒక వర్గం అంగీక రించదని వీళ్ల భయం. అయితే ఆ చట్టమే రూపొందిస్తే ఫలితం ఎలా ఉంటుందో అడగండి! మరీ ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ సామాజిక వర్గ స్త్రీలను అడగండి ఏమంటారో! ఇంతకాలం నలుగురైదుగురు నాయకులను బట్టి దాన్ని పనికిరాదని తోసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్లు ఇష్టం వచ్చినంత మందిని చేసుకోవచ్చు. నలుగురిని చేసుకోవచ్చు. అక్బర్ 12మందిని చేసుకున్నాడు. ఇంకొకరు 15 మంది చేసుకున్నాడు. కనీసం నలుగురిని చేసుకోవద్దా అని వాదిస్తున్నారు. ఒక పక్క పురోగమన సమాజం అనుకుంటూ ఈ మూఢ విశ్వాసాన్ని అంటిపెట్టుకుని ఉండిపోవడం ఏమిటి? దీనివల్ల ఆ ఇద్దరు సుఖంగా ఉన్నారా? లేదు. ట్రిపుల్ తలాక్ ఉంది. ఒకసారి చట్టం తీసుకురాగానే ఎవరూ నోరు మెదపలేదు. ప్రతి దానికి వ్యతిరేకత అనేది సహజం. ఆ వ్యతిరేకత ఎంతవరకు సమంజసమో పరిశీలించాలి.
తక్షణావసరం: జస్టిస్ చిన్నపరెడ్డి
షరియాను అనుసరిస్తూ కొంతమంది పురుషులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రధానంగా ఆ మతంలో స్త్రీకి మరింత నష్టం వాటిల్లుతున్నది. ఇస్లాంలో పెళ్లి ఒక ఒప్పందం. దీనితో షాబానో, అంత కంటే ముందు నుంచి చాలామందికి అన్యాయం జరిగింది. జస్టిస్ చెన్నప్పరెడ్డి ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం గురించి చెప్పారు. జోర్డాన్ డీన్డే వర్సెస్ ఎస్‌ఎస్ చోప్రా కేసులో మే 10, 1985న ఇచ్చిన తీర్పును ఈ వాక్యాలతో ఆరంభించారా న్యాయ నిపుణుడు.
It was just the other day that a Constitution Bench of this Court had to emphasise the urgency of infusing life into Art. 44 of the Constitution which provides that “The State shall endeavour to secure for the citizens a uniform civil code through out the territory of India.” The present case is yet another which focuses attention on the immediate and compulsive need for a uniform civil code. The totally unsatisfactory state of affairs consequent on the lack of a uniform civil code is exposed by the facts of the present case. Before mentioning the facts of the case, we might as well refer to the observations of Chandrachud, C.J., in the recent case decided by the Constitution Bench (Mohd Ahmed Khan v. Shah Bano Begum &Ors.)
ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలో వాస్తవికత ఎంత? చట్టం కోణం నుంచే చెప్పండి!
యూసీసీ ద్వారా దక్కుతుందనుకుంటున్నది చట్టబద్ధత. ఈ చట్టబద్ధత అన్నది రాజ్యాంగం నిర్దేశించింది. సుప్రీంకోర్టు దశాబ్దాలుగా ఉమ్మడి పౌరస్మృతి రావాలి రావాలి అని అంటూ వచ్చింది. తప్పకుండా చేయాల్సిందే. తరువాత చేద్దామన్న వీలుకాకుండా పోతుంది. ఇప్పటికే వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది జనానికి. మెట్రోపాలిటన్ సిటీలో చూడండి విడాకుల తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నది. అలాగే మాట్రిమోనీ డిస్ప్యూట్స్ కూడా. వీటి నుంచి బయటపడాలంటే యూసీసీ ఉపకరిస్తుంది.
చాలామంది ముస్లిం మత గురువులు, ముస్లిం వర్గ మేధావులు చెబుతున్నట్టే ఇవాళ షరియాను ఎక్కడైనా యథాతథంగా అమలు చేయగలరా?
టీవీ చర్చలలో చాలామంది అంటుంటారు. ముస్లిం మేధావులు, ఆ మత బోధకులు షరియా పాటిస్తాం అంటారు. అలా అయితే మొత్తం షరియానే అమలు చేద్దాం. దొంగతనం చేస్తే చేతులు నరకేద్దామా అంటే మాట్లాడరు. ఒప్పుకోరు. ఇపుడు ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చామే అనుకొండి. దాన్ని న్యాయబద్ధం చేయడానికి కోర్టులు ఉన్నాయి. మత స్వేచ్ఛ నిరపేక్షం కాదు. సబ్జెక్, మొరాలిటి, హెల్త్- ఈ మూడు కోణాలు ఉండాలి. మా మతం ప్రకారం కత్తి పట్టుకొని తిరుగుతామంటే అది పబ్లిక్ ఆర్డర్‌కి వ్యతిరేకం. కావాలంటే ఇంట్లో తిప్పుకోమని చెబుతుంది చట్టం. అట్లాగే మొరాలిటి, నైతికత, ఆరోగ్యం. ఆరోగ్యం విషయం ఎప్పుడొచ్చిందంటే సుప్రీంకోర్టు – జావేద్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ, 2003 కేసులో వచ్చింది. ఇది జనాభాకి సంబంధించిన వ్యాజ్యం. ఒక స్త్రీ ఉన్నది. అదే పనిగా పిల్లల్ని కనడంవల్ల ఆ స్త్రీ ఆరోగ్యం ఏమి కావాలి? ఆ పుట్టిన పిల్లల మధ్య ఎడమ లేకుండా ఉంటే వారి పరిస్థితి ఏమిటి? ఇంతమంది పిల్లల్ని కనాలని మీ మతం ఎక్కడా చెప్పలేదు. రెండోది ఆ స్త్రీ ఆరోగ్యం, పుట్టిన పిల్లల ఆరోగ్యం చూడాలి. దానికి లోబడే నీ మత స్వేచ్ఛ. అపుత్రస్య గతర్నాస్తి అన్నారు. అక్కడ శతపుత్ర అనలేదు.
ఇపుడు దీనిని జనాభా అసమతౌల్య కారక సమస్యగా చూడవచ్చా?
దీంట్లో జనాభా వ్యవస్థ, వివాహవ్యవస్థ ఉన్నాయి. ఆంగ్లేయులు ఉండగానే హిందూ బైగమెస్ చట్టం తీసుకువచ్చారు. దీని ప్రకారం హిందువులు రెండో పెళ్లి చేసుకోకూడదు. 1952లో బాంబే స్టేట్‌గా ఉన్నప్పుడే ఆ హైకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేశారు. చట్టం ఉంది కాబట్టి రెండో పెళ్లి చేసుకునే వీలులేదని కోర్టు నిర్దాక్షిణ్యంగా చెప్పింది. హిందూ మతం ఎట్లానో ఇస్లాం కూడా అంతే. క్రిస్టియన్, పార్సీ కూడా అంతే. వివాహ వ్యవస్థకు సంబంధించి నదే జనాభా వ్యవస్థ. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ఎన్నికలలో పోటీ చేసే హక్కు లేదు. దానికి న్యాయబద్ధత వచ్చిందంటే దాని ఫలితం వేరే ఉంటుంది. జనాభా అనేది దేశ ప్రజాస్వామ్యంమీద ఆధారపడి ఉంటుంది. జపాన్, జర్మనీ దేశాలు న్నాయి. పాపులేషన్ నెగెటివ్ గ్రోత్‌గా ఉంది. అక్కడ అమ్మాయి, అబ్బాయినని కంటే కారును బహుమానంగా ఇస్తారు.
కానీ ఇటీవలి పరిణామాలన్నీ ఈ జనాభా పెరుగుదల అనేది కుట్రపూరితంగా జరుగుతున్నదని అర్థమవుతుంది. ఫ్రాన్స్‌లో ప్రతి ముగ్గురు స్కూల్ విద్యార్థులలో ఒక మహమ్మద్ ఉన్నాడు. ఇది ఒక రకమైన కుట్ర. ఇది కొనసాగితే హిందూ దేశంలో పరిస్థితి ఏమిటి?
జనాభా పెరుగుదలలో మార్పు రెండు రకాలు. ఒకటి పిల్లల ద్వారా. రెండోది అక్కడెక్కడో నలుగురిని కొట్లాట పెట్టుకోమనడం. రెండు మూడు బాంబులు వేయడం. ఒక పడవలో ఐదువేల మందిని నింపడం, కాందిశీకుల పేరుతో ఇక్కడ వదిలిపెట్టడం. అట్లా జరుగుతున్నది. జర్మనీలో ఇది ముందు మానవ హక్కుల విషయం. కొందరు అడ్డగోలుగా వచ్చి ఆ దేశంలో ఉండిపోతున్నారు. దీనితో తరువాత తలలు పట్టుకుంటున్నారు.
స్వీడన్ వంటి దేశాల్లో ముస్లింలు రావడం మీద నిబంధనలు పెట్టారు. మరి ఇవన్నీ చూసిన తరువాత భారతీయ సమాజం ఏ రకంగా స్పందించాలి?
అది రాజకీయమైన సమస్య. ఏరకంగా చేయాలనేది సాంఘిక, రాజకీయ కోణం నుంచి చూడవలసిందే. పౌరస్మృతి వస్తే ఎంతవరకు న్యాయం దక్కుతుంది అన్నంత వరకే చూడాలి. నా నమ్మకం ఏమిటంటే పౌరస్మృతి వస్తే స్త్రీలకు న్యాయం జరుగుతుంది.
ఉత్తరాఖండ్‌లో తాజాగా తలెత్తిన సంక్షోభాన్ని చూసినపుడు భారతదేశంలో మెజార్టీ ప్రజలైన హిందూ జీవనంలోకి వారు కుట్రపూరితంగా వస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ వాతావరణం నుంచి ఉమ్మడి పౌరస్మృతి హిందూ సమాజాన్ని రక్షించ గలదా?
యూసీసీని ఏ రూపంలో తీసుకొస్తున్నారో ఇంకా చెప్పలేం. ఉమ్మడి అనుకున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యం కావాలి. పార్సీ మతం ఉన్నది. దాని మౌలిక లక్షణాలు చూడాలి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఇస్లాం, క్రిష్టియానిటి, హిందూ అందరికీ కామన్‌గా చేయాలి. అలా అని ఉమ్మడి అన్నంత మాత్రాన అందరి అభిప్రాయాలకు పూర్తిగా సమాధానం చెప్పలేం. అలాగే తిరస్కరించలేం కూడా. లా కమిషన్ అభిప్రాయాలను ఆహ్వానించడం మంచి పక్రియే. ఒక ఇంట్లో యజమాని ఆదాయం 10వేల రూపాయలు. అందర్నీ సంతృప్తిపరిచే బాధ్యత ఆ యజమానిది. ఉమ్మడి పౌరస్మృతి అంటే మొత్తం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ మేరకు వ్యవస్థను తయారుచేయడం. మత విశ్వాసా లను దెబ్బతీయకుండా దానిని ఎట్లా తీసుకు రావచ్చునో, వ్యక్తి వికాసానికి ఏ రకంగా దోహదం చేయవచ్చో వంటి అన్ని అంశాలను కలిపితేనే చట్టబద్ధత. న్యాయపక్రియను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సామాజిక పక్రియను, మత సంబంధ విషయాలన్నింటిని కలిపి తీసుకుంటేనే మంచి చట్టంగా తయారవుతుంది.
వాస్తవానికి అందులో చేరవలసిన ఇలాంటి చాలా విషయాలను ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ధారించింది. ట్రిపుల్ తలాక్ మొన్నటి దాకా ఉంది. ఇపుడు లేదు. అలాగే బహు భార్యత్వం. దీనికి ఇవాళ ఏ మతం ఆమోదం తెలుపదు. ఇవన్నీ పరిశీలించి ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చూసుకొని, మతపెద్దల అభిప్రా యాలు తీసుకుంటే దీనితో సమర్థవంతమైన జాతిని తయారుచేయవచ్చు. దురదృష్టం ఏమంటే మనలో చాలామందికి మాది భారతజాతి అన్న భావన రావడం లేదు. దానితో నష్టం జరుగుతున్నది.