‘తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం.’ ఇదీ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సిద్ధాంత వ్యాస గ్రంథం. ‘విద్యాబోధన మాతృభాషలో ఉంటేనే అన్ని విధాలా ఉత్తమ ఫలితాలు.’ ఇదీ ప్రధాన ప్రసార మాధ్యమంలో ఆయన కొనసాగించిన మాటా మంతీ. ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక సాహితీ రీతుల మీద తనకున్న సాధికారతను చాటి చెప్పే అశేష విశేష రచనలు మరెన్నో. జూన్ పదో తేదీన తన పుట్టినరోజును సారస్వత ఉత్సవంగా సంభావించిన ఆ అవధాన సుధాకరుడిని అదే నెల చివరన ప్రతిష్ఠాత్మక పురస్కారం కోరి మరీ వరించింది-‘భాషా సమ్మాన్.’ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుని చేతుల మీదుగా అందే సమున్నత పురస్కృతి. ప్రధాన వేదిక దేశ రాజధాని నగరం. అంతటి ఉత్సవ ఉత్సాహం, ‘సభాసంచాలక సార్వభౌమ’ బిరుదాంకితుడికి అక్షర కిరీటం. ప్రతీ తెలుగు వ్యక్తినీ పులకితం చేసేవే. బేతవోలు వారు నాలుగు దశాబ్దాలనాడే ‘ఓచిన్నమాట’ అంటూ ఎంతో పెద్దమాటే రాశారు. అవి ఆయన పర్యవేక్షక గురువు తొలి పలుకులు. ఏమిటీ అంటే – ‘ఏది చెప్పినా సహేతుకంగా సాధికారిక•ంగా ఉండాలి. చెప్పదలచింది సూటిగా చెప్పాలి. సున్నితంగా, పొదుపుగా ఉండాలవి. రాశి కన్నా వాసి మిన్న.’ వీటన్నింటినీ తు.చ. తప్పక పాటించినందునే భాషా సమ్మాన్ ఆయనను సాదరంగా అక్కున చేర్చుకుందని తెలుగునాట ఏ స్వరమైనా ఇప్పుడు ఢంకా బజాయించి చెప్తుంది.
గోదావరి ప్రాంతన పుట్టి, సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుంచి ఎం.ఏ. పోస్టు గ్రాడ్యుయేట్ అయిన బేతవోలు, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రాజమండ్రి సమీప బొమ్మూరు మూల కేంద్రంగా ఉన్న సాహిత్య పీఠానికి ఆచార్యవర్యులయ్యారు. అటు తర్వాత హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆచార్య బాధ్యత వహించి ఎంతగా భాషా సేవ చేయాలో అంతగానూ చేశారు. ఎంతైనా, తాను రెండు పదులైనా నిండని వయసు లోనే అవధాన భేరి మోగించిన పండిత ప్రకాండులు. ఎన్ని వందలు చేశారో, ఇంకెన్నెన్ని సదస్సులకు పర్యవేక్షకత్వం వహించారో ఒక పట్టాన లెక్కించలేం. సౌందరనందం వంటి కళారూపక ప్రదర్శనల నిర్వహణతో దేశ విదేశీ భాషా ప్రేమికులను మంత్ర ముగ్ధుల్ని చేసిన దీక్షా దక్షత ఆయనది. భాగ్యనగరాన ఆంధ్ర పద్యకవితా సదస్సు బాధ్యత చేపట్టడంతో పాటు, ఊరూరా సందర్శన సాగించిన క్రియాశీలురు. ధార్మిక గురువు లక్ష్మణ యతీంద్రుల వారైతే, పరిశోధనాత్మక విద్యారంగాన మార్గనిర్దేశకులు తన ఆచార్యవర్యులైన తూమాటి దొణప్ప అని కృతజ్ఞతాం జలి సమర్పిస్తుంటారు ఎప్పుడూ. సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించిన కొన్నాళ్ళకే ‘శృంగార శ్రీకంఠం’, ఆ మరుసటి సంవత్సరమే ‘స్వర్ణకమల’ రచనం. షోడశీ పేరు విన్నారా? భట్టనారాయణ ప్రణీత వేణీ సంహారానికి తెలుగు వ్యాఖ్యానం చదివారా? ఈ అన్నీ ఆయనకు నలభై ఏళ్లయినా రాకముందటివే.
శ్రీమద్రామాయణం, ద్వారకా తిరుమల క్షేత్ర మహాత్మ్యం, శ్రీ దేవీభాగవతం, దత్తాత్రేయ గురు చరితం, ఆంధ్ర మహాభారత శాంతి పర్వ వ్యాఖ్యానం, ఉమాశంకర స్తుతిమాల…. ఇవి ఆయన పుస్తకాల్లో కొన్నే. బంగారుతల్లికి నీరాజనాల సమర్పణ వేళ- జగదేక మోహినీ, సర్వేశుగేహినీ అంటూ ప్రస్తుతిం చారు. గేహిని అంటే ఇల్లాలు. కెంపైన, భక్తికి ఇంపైన అని ప్రశంసించారు. మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు తల్లిగా అక్షర సమర్పణ జరిపారు. రతనాల, భక్తి జతనాల నీరాజనమని సరి పోల్చారు. అనురాగ, భక్తి కనరాగ; నిండిన, మెండైన; ముత్యాల, భక్తి నృత్యాల… అంటుంటే ఉప్పొంగని భక్త హృదయమంటూ ఉంటుందా? పదాల మధురిమలతో, తన్మయ తత్వంతో రామబ్రహ్మం ఆధ్యాత్మిక అమృతాన్ని ఇంటింటా పంచిపెట్టారు. ‘కొత్త గోదావరి’ గలగలలు విన్నారు. ‘పలుకు చిలుక’ను తాను చూసి, అందరూ చూసేలా చేశారు. ఆధునిక గాథావళి వినిపించారు. వ్యాస గౌతమిని చూపించారు. పీఠికనూ రచించారు. శతకాలు సరేసరి. వాటికి వ్యాఖ్యానాలూ ఆయన కలం నుంచి అలవోకగా జాలువారాయి. వాట న్నింటినీ పేరుపేరునా ప్రస్తావించాలంటే, పెద్ద జాబితా తయారవుతుంది. అందులో అనేకం భక్తి సంబంధితాలే. మురారి అనర్ఘ రాఘవం, శ్రీహర్ష నాగానందం, భవభూతి ఉత్తర రామచరితం, కంకంటివారి ఉత్తర రామాయణం, ఎర్రన హరి వంశం, కొమండూరివారి శ్రీకృష్ణలీలా విలాసం, మరెన్నో. ఒక్కోటీ ఒక్కొక్క సాహితీరత్నం. బేతవోలు ధార్మిక చింతనకు నిలుపుటద్దం పడుతున్న వ్యాఖ్యాన కావ్యాలు అనేకం.
భాషకు భక్తిభావాన్ని రంగరించిన ఆయన అందుకు సామాజిక హిత అభిలాషనీ జోడించారు. భాషా సమ్మాన్ అనేది సంబంధిత భాషాభివృద్ధికి పరిశ్రమించిన పండితులు, సేకర్తలు, వ్యాఖ్యా నకర్తలు, అనువాదకులు, సంపాదకులకు ఇచ్చేది. ఆ అన్ని వర్గీకరణల్లోనూ మిన్నగా ఉంటారు బేతవోలు రామబ్రహ్మం. ఎంత పండితులో తెలుగు, సంస్కృత భాషల్లో తాను రచించిన పుస్తకాల పరంపర తేటతెల్లం చేస్తుంది. గతంలోనే అనువాదపరంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నారు. అది ‘దేవీభాగవతం’ గద్యభాగం. ముందుగా ఆయన ఏమన్నారంటే – ‘స్తుతులూ తీర్థక్షేత్ర దైవత వర్ణనలూ వచ్చేసరికి వ్యాసవాణి ఆనందలాస్యం చేస్తుంది. బాణీలో చాలా మార్పు వస్తుంది. దీన్ని వచనంలో కూడా పట్టుకునే యత్నం చేశాను.
‘ధ్వని సంపుటీకరణ వల్ల, వ్యాసుడు ఉద్దేశించిన ప్రయోజనాలను యథాతథంగా అందించడానికి కష్టపడ్డాను. ప్రధానంగా స్తోత్రాల్లో దీన్ని గుర్తించ వచ్చు’- అంటూనే మధ్యలో ఒక మాట చెప్పా రాయన. ‘మూలకర్త ఆశించిన జన ప్రయోజనాన్ని తెలుగు పాఠకులకు దూరం చేయలేదనే విశ్వసిస్తున్నా’ అని. అంతటి పరిశ్రమ, ప్రగాఢ విశ్వాసం, పట్టుదల, రచనా ప్రావీణ్యం నిండి ఉన్నందునే ఇప్పుడు భాషా సమ్మాన్ బేతవోలు వారి కిరీటంలో మేలిమి కలికితు రాయిగా మారింది. సుదీర్ఘంగా కొనసాగిస్తూ వస్తున్న నిరుపమాన భాషా సేవకు జాతీయ గుర్తింపు ఇది. వ్యాఖ్యాన బ్రహ్మ అనుపమాన పాండితీ ప్రకర్షకు బహూకృతిగా లభిస్తున్నదిది. అలనాటి మేటికవుల మనోగతాలను గుర్తించి గమనించి గౌరవించిన ఆయనకు దక్షిణ భారతాన సాటిలేని కానుక. ఎంత బాగా రాస్తారో అంత చక్కగా నిర్వహిస్తారు. ఎంత ధాటిగా నిర్వ హిస్తారో అంత సూటిగా వ్యవహ రిస్తారు. సంస్కృత కావ్యాల గురించి తెలుగులో ప్రతి ఒక్కరికీ అవగతమయ్యేలా వ్యాఖ్యానాలు వెలయించిన వారాయన. నోటిమాట, పంచె కట్టుతో నిండైన తెలుగుతనం. ఆ కారణంగానే భాషా సమ్మానానికే ఎనలేని గౌరవం లభించినట్లయింది.
ఉన్నత పదవుల్లోనివారు అదీ విదేశాల్లో; సాంకేతిక శాస్త్రీయ విద్యను అభ్యసిస్తున్నవారు కూడా ఇప్పుడు పద్యకావ్యాలంటే మక్కువ ఎక్కువగా చూపుతున్నారు. అదే అనురక్తి, ఆసక్తి, ఆ శక్తి తెలుగు రాష్ట్రాలకీ విస్తరించి అమ్మ భాషలోనే విద్యాభ్యాసం కనీసం పదో తరగతి వరకైనా జరిగితే చాలన్నది ఆయన మనోగతం. రెండోసారి సైతం కేంద్ర పురస్కార విజేత అయిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ మాటల వెనుక ఎంతో నేపథ్యముంది. అత్యాధునిక తరం కోసం పద్య కవితను ప్రచారానికి తెచ్చిన సూక్ష్మగ్రాహి. తాను పద్యం చదువుతుంటే ప్రతీ పదమూ రససముంచితంగా ఉంటుంది. శ్రుతిపక్వంగా వినిపిస్తుంది. మళ్లీ మళ్లీ వినాలని ఎన్నోసార్లు అనిపిస్తుంది. అధ్యాపకత్వం, విస్తృత పర్యటనం, పాఠకమిత్ర వ్యాఖ్యానం భాషోన్నతికి ఎంతగానో ఊతమిస్తోంది. పద్యంతో పాటు ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాకరణ విశేషం, ఛందస్సు, అలంకార ప్రత్యేకతలన్నింటినీ ఆ పద్యాలు విస్తృత పరుస్తున్నాయి. ఇప్పటి అభిరుచులు, అవసరాలకు దీటుగా నవీనతరానికి ప్రాచీన సాహితిని అందించాలన్నదే జీవితాశయం. అటువంటి సందర్భోచిత పక్రియ ‘పాఠకమిత్ర’కు రూపకర్త, ప్రచారకర్తా ఆయనే. అందుకే తెలుగు సాహిత్య ఘట్టాలకు తాత్పర్యాదులతో ఆరంభించి, ఇప్పటికి పాతికేళ్ల క్రితమే పద్య కవితా పరిచయాన్ని చదువరుల ముందు ఉంచారాయన.
కృషిలో భాగంగానే, మరో రెండు పుస్తకాలను తెలుగువారి కరకమలాల్లో ఉంచారు బేతవోలు వారు. వేంకట నగాధిపతి శతకం, మూలకర్త మంచెళ్ల. వేరొకటి – వర్ణన రత్నాకరం. ఇందులోని పద్యాల సంఖ్య ఎనిమిది వేలకు పై మాటే. వీటి వ్యాఖ్యాతగా ఆయన పాండిత్య శక్తి, రసహృదయ యుక్తి -రెండూ చదువరులకు ముందు నిలుస్తాయి. అన్వయించి చెప్పడంలో, చెప్తూనే మనసుకు హత్తుకునేలా చేయడంలో తాను ఎప్పుడూ ముందే. మాదయగారి మల్లన విరచిత ‘రాజశేఖర చరిత్ర’కూ రామబ్రహ్మం కలమే వ్యాఖ్యాన భాగ్యాన్ని అందజేసింది. ‘హరివంశా’నికి సంబంధించి ఆయన వెలయించిన తాత్పర్యం ఎన్నిసార్లయినా చదవాలనిపిస్తుంది.
ఆధునిక వేమన శతకం కర్త బేతవోలు వారే. ఒంటిమిట్టి రఘువీర శతకానికీ ఆయనే కర్త (వ్యాఖ్యాతగా). కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’, మంచన కవి ‘కేయూర బాహు చరిత్రం’ సైతం వ్యాఖ్యానందాన్ని అందిస్తున్నాయి. తెలుగు, సంస్కృత ప్రేమికులందరికీ. ఎంతో రాసిన, ఎన్నో చేసిన ఆయనను సద్గురువుగా ప్రశంసించినవారెందరో. తన సాహిత్య గరిమ, పరిశోధనా గ్రంథాల రచనలో పటిమ, వ్యాఖ్యాన మహిమ ప్రముఖులెందరినో ఆకట్టుకున్నాయి. వారిలో అలనాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్‌తోపాటు భూటాన్ దేశ ఆధ్యాత్మిక మఠం అధిపతి ఉన్నారు.
తెలుగు సారస్వతంపైన సంస్కృత భాషా ప్రభావం ఎంతైనా ఉంది. నిజానికి సంస్కృత వ్యాసభారతం అనువాదంతోనే కదా తెలుగులో కావ్యరచన ఆరంభం! వ్యాకరణ రీత్యా మనవారు ఉపయోగించిందీ చాలా మట్టుకు సంస్కృత ప్రణాళిక లనే. ఇలా అనేకానేక అంశాలను క్రోడీకరిస్తూ, విశ్లేషిస్తూ బేతవోలు రామబ్రహ్మం చేసిన రచనలు, ఉపన్యాసాలు లెక్కలేనన్ని. వాటిల్లో ఒక గద్య ఉదాహరణ.
‘సంస్కృత వ్యాకరణ నియమాల ప్రకారం ఏర్పడిన సమాసాన్ని ప్రాతిపదికగా స్వీకరించి తెలుగు విభక్తులు చేరిస్తే అది సిద్ధ సాంస్కృతికం. ఏ పదానికి ఆ పదం తత్సమాలుగా చేసుకుని, తెలుగు వ్యాకరణ నియమాలను అనుసరించి సమాసం కడితే అది సాధ్య సాంస్కృతికం.’
ఇంత నిశితంగా, విశ్లేషణ సహితంగా కావ్య రచనలు సాగించిన; వ్యాఖ్యానాలతో భాషా సంస్కృతు లను మరింత సుసంపన్న చేసిన ఆయనకు భాషా సమ్మాన్ పురస్కృతి ప్రకటన ఎందరినైనా అమందా నంద కందళిత హృదయారవిందుల్ని చేస్తుంది, చేస్తోంది. దక్షిణాదికేకాక, సమస్త భారతీయ సాహితికీ మహదానంద ప్రదాయకం ఈ పురస్కారం. అక్షరాభివాదం అందిద్దాం. వ్యాఖ్యాన బ్రహ్మను అందరమూ ముక్తకంఠంతో అభినందిద్దాం.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
‘సాహిత్య అలకాపురికి కుబేరా!’- శ్రీ బేరా సుధీవరా!!
భారతీయ భాషలలో సాహితీవేత్తలకి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారంగా-లక్ష రూపాయల నగదు, ఒక స్మరణిక 1954 నుంచి ఇస్తున్నారు.
(శ్రీ సత్యజిత్ రే ఈ మెమెంటో డిజైన్ చేసారు)
ఆ సాహిత్య అకాడెమీ వారు సాహిత్య భాషా సమ్మాన్ పురస్కారాలు సాహిత్య సృజనతో సాహితీసేవ కావించినవారికి 1996 నుంచి ఇస్తున్నారు.
ఈ పర్యాయం సాహిత్య భాషా సమ్మాన్ పురస్కారానికి నేటి సాహితీవేత్తల్లో మేరు శిఖరం, మహామహోపాధ్యాయ శ్రీ బేతవోలు రామబ్రహ్మం (బేరా) గారిని ఎంపిక చేయటం- అర్హతని గుర్తించిన అర్హత!
శ్రీ బేరా1948లో పశ్చిమ గోదావరి నల్లజర్లలో జన్మించారు. శ్రీ బేరా సంస్కృతాంధ్ర కవితా సంప్రదాయాభిజ్ఞులు. ప్రాచీనతనారాధించారు. ఆధునికతనాదరించారు.
గోదావరీ తరంగాల్లో పురాతనాంధ్రవాణీ చతురాననులైన కవుల్ని దర్శించారు. వీరి పరిణత భావుకత, పద్య నిర్మాణ చతురత ఆంధ్ర విద్వత్కవుల్ని ఆకర్షించింది.
ఆయన వాచికంలో సత్కవుల వాచామాధురి-
ఆయన ఆంగికంలో లలిత మర్యాద-
ఆయన ఆహార్యంలో సాహితీ గాంభీర్యం
ఆయన సాత్త్వికతలో సాహితీ రిరంస
ఆయన సాహిత్యంలో క్లిష్టత లేని స్పష్టత –
ఇదీ ఆయన సాహిత్య విశిష్టత!
నేటి తెలుగు సాహిత్యానికి- పద్యకవితకి- వ్యాఖ్యాన పారీణతకి ఆయన చెక్కుచెదరని దీపస్తంభం!
శ్రీశ్రీశ్రీ లక్ష్మణయతీంద్రుల ఆశీర్బలం- రామానుజ శీలం- ఆయన కలం మషీజలం!
క్రొత్త గోదావరి- పలుకుచిలుక
(జాతీయకవులకవితలకి అనువాదాలు)-
‘తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం’ (సిద్ధాంత గ్రంథం)-
షోడశి (సంస్కృత పత్రాలు)
ఇంక వేణీ సంహారం, అనర్ఘరాఘవం, రాజశేఖర చరిత్రము, విజయ విలాసం వంటి ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్య వ్యాఖ్యానాలన్నీ ‘పాఠకమిత్ర’ములు.
పద్య కవితా పరిచయం, రామాయణం, దేవీభాగవతం (వచనములు).
ఆధునిక వేమన శతకం, ఆధునిక గాథావళి… ఇలా ఎన్నో రచనలు ఆయన సాహితీ వరివస్యకి నిలువుటద్దాలు.
‘‘వేలుముద్రగాడు విద్యాశాఖా మంత్రి
మర్మకవితలే‘మొ’ మలయాళ సినిమాలు!’’-
‘‘మార్కులిచ్చువాడు మా మంచి మాస్టారు
మాదుశిష్యులెల్ల మార్క్సిస్టులైనారు’’
ఇదీ ఆయన సామాజికాంశాల విమర్శన రీతి.
రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో బేరా గారు రిఫ్రెషర్ కోర్స్ నిర్వహించిన తీరు అమోఘం. ఉత్తర దక్షిణ ధ్రువాలకు సయోధ్య తెచ్చారు.
రెండవరోజు ప్రారంభంలో
‘‘నిన్నటి వారు మంచి బోణీ కొట్టారు!’’
‘‘అభినందించటం వస్తే అసూయకి తావుండదు!’’
అత్తరు వాసనలతో ఒకాయన సభలోకి రాగానే- కస్తూరీమృగం
‘‘ఈ ప్రక్కగా వచ్చిందాయనిపించింది!’’
‘‘లేసులో అల్లిక కన్నా అల్లని భాగం ఎక్కువ అందమిస్తుంది!’’-
కవి-వ్రాసినదానిలో కనిపించే అక్షరాల కన్నా వినిపించేదే ఎక్కువ ఉండాలి!’’
ఇవీ ఆయన చమత్కార చారువులు.
ఒక నాస్తిక ప్రసంగంపై స్పందిస్తూ
‘‘దేవుడు ఉన్నాడనుకుంటే ఉండే ఆత్మవిశ్వాసం లేడనుకుంటే ఏమీ లేదు గదా!’’- అన్నారు.
ఆ రోజుల్లో వారి కారు డ్రైవర్ ఖాన్ చేత భగవద్గీత వల్లె వేయించారు!
రామబ్రహ్మం గారు ఈనాటి అవధానులందరికీ పెద్దదిక్కు!
ఆయన అవధానాలన్నీ ‘రెండు భాషలకు మేమె కవీంద్రులం’
అన్నట్టుగానే అలరించాయి. ఆకర్షణ వారి ప్రధానాయుధం!
ఆయన వల్ల భువనవిజయాలు త్రిభువన విజయాలయ్యాయి.
అవధానాలు అవనీ నిధానాలైనాయి.
రామబ్రహ్మం గారిని రామరాజ్యంలో రావణబ్రహ్మగా మరచిపోలేం.
పద్య- కావ్య వ్యాఖ్యానాలు పదార్థ సారసంధానాలు.
పురస్కారాలకి ఆయన ప్రతిభ వల్ల గౌరవ ఆస్కారాలు లభించాయి.
ఈ వాఖ్యాతృవిద్వత్కవీశుని గురించి చివరగా
‘‘ఒక యేరై జననంబునందితివి-
స్వీయోపజ్ఞనిండార నొ
క్కొక తీరస్థలి వృద్ధి బొందితివి
గంగోత్తుంగ కీర్తి ప్రభా
ధికతన్గెల్చితివేడుపాయలుగ విస్తీర్ణించి- సంతృప్తి జెం
దక యంభోనిధివైతివెంతటి పరీణాహమ్ము గోదావరీ!’’
ఈ క్రొత్త గోదావరీ తరంగంలో
‘గోదావరీ’ బదులుగా ‘‘బేరా సుధీ!’’-అంటే చాలు.
త్వరలోనే వారు జ్ఞానపీఠాధిపతి కాగలరని ఆశిస్తున్నాను.
వారికి మన ‘జాగృతి’ ద్వారా శుభాభినందనలందజేస్తున్నాను.
– పొన్నపల్లి శ్రీరామారావు, 9849021056