ఫ్రాన్స్ పేరు తలచగానే ఫ్రెంచ్ విప్లవం గుర్తుకు వస్తుంది. స్వేచ్ఛ, సమత్వం, సౌభాత్రం అన్న ఆ విప్లవ నినాదాలు గుర్తుకు వస్తాయి. కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్‌ను కకావికలం చేసి, ప్రపంచాన్ని అటు చూడక తప్పని పరిస్థితి కల్పించిన ‘తిరుగుబాటు’ ఘట్టంలో రెండు కోణాలు చూస్తున్నవారే ఎక్కువ. ఆ విధ్వంసమంతా ఫ్రెంచ్ సమాజానికి ఉన్న ముస్లిం వ్యతిరేకతకు సమాధానమన్న కోణం ఒకటి. మరొకటి వివక్షకు గురవుతున్న మైనారిటీల ఆత్మగౌరవ నినాద ఫలితమన్న కోణం. ఇదంతా గత వలసాధిపత్య ధోరణుల, పాలనల అవశేషమే. బ్రిటన్, ఫ్రాన్స్ సహా చాలా దేశాలు గతంలో వలస దేశాల పట్ల చూపిన వైఖరికి ప్రతిఫలమూ కావచ్చు. యూరప్‌లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి ఆ చరిత్ర ఫలశ్రుతి లేదా ప్రతిధ్వని మాత్రమే. ఫ్రాన్స్‌లో నేడు స్వేచ్ఛ, సమత్వం, సౌభాత్రం – ప్రశ్నార్థకమే అయ్యాయి. వాటికి అర్థాలు మారిపోయాయి. ఆ మూడు ఇవ్వవలసిన వాళ్లకీ, తీసుకోవాలని అనుకుంటున్న వాళ్లకీ ఒక ఘర్షణను మాత్రమే మిగిల్చాయి. ఇప్పుడు ప్రపంచం చేయవలసినది అటు వివక్షనూ, ఇటు హక్కుల రక్షణ పేరుతో పెట్రేగిపోతున్న మతోన్మాదాన్నీ రెండింటినీ గమనించాలి.
ట్రాఫిక్ ఉల్లంఘన నేపథ్యంలో హెచ్చరికలను ఖాతరు చేయని నెహెల్ మెర్‌జౌక్ అనే 17 సంవత్సరాల బాలుడిని జూన్ 27న పోలీసు కాల్చి చంపిన (హతుడి తల్లిదండ్రులు అల్జీరియా – మొరక్కన్ జాతివారు) తర్వాత అల్లర్లతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నప్పటికీ, ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈఫిల్ టవర్‌ను సందర్శించేవారి సంఖ్య పెరుగుతోంది. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు కౌంట్‌డౌన్‌గా ఇక్కడ ఒక గడియారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ దేశంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో 45 వేల మంది పోలీసుల మోహరింపు కొనసాగు తున్నదని దేశ ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రి గెరాల్డ్ డార్మెనిన్ చెప్పడం దేశంలో ఇంకా సాధారణ స్థితి నెలకొనలేదనడానికి నిదర్శనం. ఒకప్పుడు ఫ్రాన్స్ కాలనీలుగా ఉన్న దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ మోహరింపు కొనసాగుతోంది. ఇక్కడ నివసించేవారిలో అత్యధి కులు అల్పాదాయ వర్గాల ప్రజలే. పారిస్ శివారులోని నాన్‌టెర్రె వద్ద నెహెల్‌పై కాల్పుల సంఘటన చోటుచేసుకున్న తర్వాత వారం రోజుల పాటు దేశంలోని 241 పట్టణాల్లో ఈ అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. విపక్ష కన్సర్వేటివ్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్యారిస్ నగర మేయర్ విన్సెంట్ జియోన్‌బర్న్ ఇంటిలోకి అర్థరాత్రి మండుతున్న కారు నేరుగా దూసుకురావడం, ఇల్లు దగ్ధం కావడం విధ్వంసకాండకు పరాకాష్ట. అప్పుడు ఆయన టౌన్‌హాలులో అల్లర్లను అరికట్టడానికి అధికారులతో మంతనాల్లో ఉండగా జరిగిన ఈ సంఘటనలో ఆయన భార్య, పిల్లలు గాయాలపాలయ్యారు. ఈ అల్లర్ల కారణంగా 23 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు, జులై 9 నుంచి జరపాల్సిన జర్మనీ పర్యటన వాయిదా పడింది.
వేగంగా అల్లర్లు వ్యాపించడానికి, సోషల్ మీడియా కూడా యథాశక్తి తన పాత్ర పోషించింది. ముఖ్యంగా యువకులు స్నాప్‌చాట్ వంటి యాప్‌ల ద్వారా హింసాకాండకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడంతో విధ్వంసం మరింత వేగంగా విస్తరించింది. ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఫ్రాన్స్‌లో అల్లర్లు స్విట్జర్లాండ్‌లో ప్రతిధ్వనించడం గమనార్హం. స్విస్‌కు చెందిన లావ్‌సన్నె నగరంలో వందకు పైగా ఆందోళనకారులు జులై 1వ తేదీ రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. అల్లర్లకు పాల్పడినవారిలో ఎక్కువమంది టీనేజర్లేనని అక్కడి పోలీసులు తెలపడం, ఈ వయసువారిపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉన్నదీ తెలియజేస్తోంది. స్విట్జర్లాండ్ పశ్చిమ ప్రాంతానికి చెందిన లావ్‌సన్నె నగరంలో ఎక్కువమంది ఫ్రెంచ్ భాష మాట్లాడేవారే. ఇంత విధ్వంసం కొన్ని రోజులలోనే దేశాలు దాటి పోవడం అనుమానాలకు తావిస్తున్నది.
కాల్పులు ఎట్లా జరిగాయి?
నెహెల్ కాల్చివేత సంఘటనకు సంబంధించి విడుదలైన వీడియో ఫుటేజ్‌లో, కారు కిటికీ వద్ద ఉన్న ఇద్దరు పోలీసు ఆఫీసర్లలో ఒకరు డ్రైవర్‌పై పిస్టల్‌ను గురిపెట్టి ఉండటం కనిపించింది. డ్రైవర్ సీట్లో ఉన్న యువకుడు కారును ముందుకు దూకించగానే పోలీసు ఆఫీసర్ కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఈ ఆఫీసర్‌పై ‘వాలంటరీ హోమీసైడ్’ చార్జ్‌ను మోపారు. నిజానికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారిపై ఫ్రెంచ్ పోలీసులు కాల్పులకు పాల్పడటం కొత్తేమీ కాదు. గత ఏడాది ఇటువంటి కాల్పుల్లో 13మంది తీవ్రంగా గాయపడగా, ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురు గాయాలపాలయ్యారు. తాజా విధ్వంసకాండ నేపథ్యంలో అనుమానితుపై దూరం నుంచే కెమేరాలు, మైక్రోఫోన్, జీపీఎస్ పరికరాలను ఉపయోగించి నిఘా కొనసాగించేం దుకు ఫ్రాన్స్ ప్రభుత్వం పోలీసులకు అధికారాలను కల్పించింది. దీనికి సంబంధించిన బిల్లును పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు లెఫ్ట్, రైట్ వింగ్ పార్టీ ప్రతి నిధుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు ఆమోదం పొందింది.
అల్లర్లలో విధ్వంసకాండ
ఆందోళనలు, అల్లర్లు ఫ్రాన్స్‌లో సహజమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఇవి మరింత హింసాత్మకంగా మారడం, సమాజంలోని వైరుధ్యా లను బట్ట బయలు చేస్తున్నాయి. పింఛనుకు సంబంధించిన అల్లర్లు, కొవిడ్ మహమ్మారికి ముందు ఎల్లో వెస్ట్ (ఇంధన ధరల పెంపునకు వ్యతిరేక ఉద్యమం) ఉద్యమంలో పెద్దఎత్తున ఆస్తుల విధ్వంసం జరిగింది. నిజం చెప్పాలంటే ఇటీవలి అల్లర్లు 2005లో జరిగిన వాటికి కొనసాగింపనే చెప్పాలి. అప్పట్లో 21 రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన అల్లర్లు, లూటీలు, దోపిడీలు దేశాన్ని కుదిపేశాయి. ఈ అల్లర్లలో పాల్గొన్న ‘బ్యాన్‌లూయీస్’ (ఫ్రాన్స్‌లో పెద్దసంఖ్యలో నిరుపేదలున్న బహుజాతి ప్రజలు)లు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమించారు. ఈ అల్లర్లకు ప్రధాన కారణం ఫ్రాన్స్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు. వీటికితోడు పశ్చిమేతర దేశాల నుంచి వలస వచ్చిన వారిపై పోలీసుల దాష్టీకాలు సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. 2005లో బ్యాన్‌లూయీస్‌కు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు వెంటాడి కాల్చిచంపడం అప్పటి అల్లర్లకు నేపథ్యం. ఇప్పుడు నెహెల్ మెర్‌జౌక్‌ను పోలీసులు కాల్చిచంపడం దేశంలో అశాంతి ప్రజ్వరిల్లడానికి కారణం. ఈ అల్లర్ల కారణంగా కేవలం ఒక్క వారంలో బిలియన్ ఆమెరికన్ డాలర్ల విలువైన ఆస్తులు ధ్వంస మయ్యాయి! విచిత్రమేమంటే ఈసారి అల్లర్లలో 2005లో మాదిరిగా ‘బ్యాన్‌లూయీస్’ ప్రజల పేరు పెద్దగా ప్రస్తావనకు రావడం లేదు. నేటి అలర్లలో పెద్దసంఖ్యలో పాలుపంచుకుంటున్నది 12 సంవత్సరాల లోపు పిల్లలు. వీరికి హైపర్ యూత్ జత కూడటం విధ్వంసకాండ తీవ్ర స్థాయికి చేరడానికి ప్రధాన కారణం. ఇంత పెద్దసంఖ్యలో చిన్నపిల్లలు ఈ హింసాకాండకు పాల్పడటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం 99 టౌన్‌హాళ్లు, 400 బ్యాంక్ శాఖలు, 500 కార్నర్ షాపులు ఈ అల్లర్లలో దాడులకు గురయ్యాయి. ఫ్రాన్స్‌లో రెండో అతిపెద్ద నగరమైన మార్సిల్లీలో తుపాకుల దుకాణంలో వేటకు ఉపయోగించే తుపాకులను ఎత్తుకెళ్లిపోయారు. ప్రభుత్వ సహాయంతో నడిచే వెయ్యి స్టోర్లలో ఆందోళనకారులు లూటీలకు పాల్పడ్డారు. దేశంలోని 241 మున్సిపాలిటీల్లో విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగింది. నెహెల్ హత్యను నిరసిస్తూ జులై 6న నిర్వహించిన ర్యాలీలో నాన్‌టెర్రేలో రెండో ప్రపంచ యుద్ధంకాలంలో ఫ్రెంచ్ ప్రతిఘటనకు గుర్తుగా నిర్మించిన కట్టడాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయడాన్ని యూరోపియన్ యూదుల కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. లూటీలకు గురైన దుకాణాలలో అన్నివర్గాల వారివి ఉండటం గమనార్హం. కాగా ఫ్రాన్స్‌లో అల్లర్లకు సంబంధించిన వార్తలు అంతర్జాతీయ మీడియాలో వెల్లువెత్తడంతో, పర్యాటకం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. జులై ప్రారంభం నుంచి 20-25% వరకు పర్యాటకులు తమ ప్యారిస్ పర్యటనను రద్దు చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ.
పింఛను వ్యతిరేక అల్లర్లు
2017లో ఇమ్మాన్యువల్ మెక్రాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను సంస్కరణలను అమల్లోకి తీసుకురావాలన్న ప్రభుత్వ యత్నం, తీవ్రస్థాయి నిరసనలకు దారితీసింది. పింఛను సంస్కరణల్లో ‘ఆర్థిక న్యాయం’ ఉండాలన్నది ఆందోళనకారుల ప్రధాన డిమాండ్. 2023 జనవరి 19 నుంచి దేశంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పింఛను సంస్కరణ బిల్లు’కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ఇమాన్యువల్ మెక్రాన్ నేతృత్వంలో ప్రధాని ఎలిజెబెత్ బోర్న్ పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64 ఏళ్లకు పెంచడానికి వీలు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పది లక్షలమంది ఆందోళనకు దిగారు. ఫలితంగా వివిధ ప్రభుత్వ వ్యవస్థలు స్తంభించిపోయాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఫ్రాన్స్ హ్యూమన్ రైట్స్ లీగ్ వంటి మానవహక్కుల సంఘాలు ప్రభుత్వం ఆందోళనను అణచివేసే తీరును ఎండగట్టాయి. కౌన్సిల్ ఆఫ్ యూరప్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇంత వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం వెనుకడుగు వేయక తప్పలేదు. ఇవి నెమ్మదించాయని భావిస్తున్న తరుణంలో ప్రస్తుత అల్లర్లు దేశాన్ని కుదిపేశాయి. అంతేకాదు ఫ్రెంచ్ సమాజం ఈ విధ్వంసకాండతో పూర్తిగా ధ్రువాత్మక స్థితికి చేరుకుందనే చెప్పాలి. ముఖ్యంగా దేశంలోని మతపరమైన మైనారిటీ గ్రూపులు ఫ్రెంచ్ సమాజంతో ఇంకా ఏకీకృతం కాలేదన్న సత్యాన్ని ఈ అల్లర్లు ప్రపంచానికి వెల్లడి చేశాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం, దేశంలోని రాజకీయ పార్టీలు పోలీసులకే తమ మద్దతు తెలపడం మైనారిటీ వర్గాల పట్ల పోలీసుల దాష్టీకానికి సంబంధించిన అంశాలను పట్టించుకునే స్థితిలో దేశ రాజకీయ వ్యవస్థ లేదనడానికి నిదర్శనం.
‘పోలీసు వ్యవస్థలో నెలకొన్న జాతివివక్ష, జాత్యహంకార మూలాలను తొలగించడంపై ప్రభుత్వం ముఖ్యంగా దృష్టిపెట్టాలని’ ఐక్యరాజ్యసమితి ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని అభ్యర్థించడం దేశంలో నెలకొన్న తీవ్రస్థాయి జాతి వివక్షకు అద్దం పడుతోంది. పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో అత్యధిక జాత్యహంకారం ఉంటోందని, మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక సమస్యల నేపథ్యంలో వారితో వ్యవహరించే విషయంలో పోలీసులు సరైన పంథాను అనుసరించడం లేదన్నది ఫ్రెంచ్ మానవ హక్కుల సంఘాల ఆరోపణ. జాత్యహంకార ఆరోపణలున్న పోలీసులకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ గత దశాబ్దకాలంగా ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ రావడం మరో అంశం. 2010తో పోలిస్తే నేడు పోలీసులు పౌరులపై కాల్పులు జరిపిన సంఘటనలు నాలుగు రెట్లు పెరిగాయి! ఈ నేపథ్యంలో పోలీసుల పట్ల ప్రజల్లో సహజంగానే రగులుతున్న అసంతృప్తికి నెహల్ కాల్చివేత ఒక ‘స్పార్క్’లా పనిచేసిందనే చెప్పాలి.
చట్టంలో మార్పు
2017లో ఫ్రెంచ్ చట్టంలో ఒక మార్పు తీసుకు వచ్చారు. దీని ప్రకారం పోలీసులు ఆపమని కోరినప్పుడు డ్రైవర్ తన వాహనాన్ని నిలపకపోయినా, అతని డ్రైవింగ్ ఇతర పౌరులకు హాని కలిగిస్తుందని భావించినా పోలీసులు సదరు డ్రైవర్‌పై కాల్పులు జరపొచ్చు. ప్రధానంగా ఇది తమను ఇబ్బందులకు గురి చేసేదిగా ఉన్నదంటూ ఫ్రాన్స్‌లోని ఇతర జాతుల ప్రజలు, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ ర్యాలీ పార్టీ నాయకుడు మారిన్ లీ పెన్, శివారు ప్రాంతాల్లో నివసించే వలసదారుల అభివృద్ధి కోసం బిలియన్ల కొద్దీ యూరోలను వెచ్చించడం వృధా అంటూ విమర్శించడమే కాదు, 16 సంవత్సరాలు నిండిన యువకులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిర్వహించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. సమస్యకు పరిష్కారం బిలియన్ల కొద్దీ యూరోలు శివారు ప్రాంతాల అభివృద్ధికి ఖర్చుచేయడంలో లేదు. వలసలను నిరోధించడమే ఇందుకు ఉత్తమ పరిష్కారమని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. జూన్ 30న నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఈ సంక్షోభ సమయంలో లీ పెన్ వ్యక్తంచేసిన అభిప్రాయాలకే అధికశాతం ప్రజల మద్దతు లభించడం గమనార్హం. మారిన్ లీ పెన్ 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం మీద లెఫ్ట్, రైట్ వింగ్ పార్టీల నుంచి మెక్రాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో చోటుచేసుకున్న అల్లర్లకు, దోపిడీలకు ప్రధానకారణం అవకాశవాదులు లేదా ఆందోళన కారులేనన్న విషయంలో అన్ని పార్టీల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.
సంస్కరణలు అవసరం
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింసాకాండ ఖండనార్హమే అయినప్పటికీ దీన్ని ఆపడానికి మార్గమేంటనేది ప్రధాన ప్రశ్న. ఇందుకు దేశంలో నెలకొన్న పొలిటికల్ ఎకానమీని అర్థం చేసుకోవడం ముఖ్యం. మొత్తం 68 మిలియన్ల ఫ్రాన్స్ జనాభాలో అరబ్ దేశాల నుంచి వలస వచ్చినవారి జనాభా 6 మిలియన్లు కాగా, నల్లజాతీయులు 4మిలియన్లు. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన డిఫెండర్స్ ఆఫ్ రైట్స్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. గడచిన ఐదేళ్ల కాలంలో దేశంలోని నల్లజాతి లేదా అరబ్ జాతీయులైన ఫ్రెంచ్ యువతలో 80% మంది కనీసం ఒక్కసారైనా పోలీసుల తనిఖీకి గురయ్యారని ఈ సర్వేలో తేలింది. ఇదే కాలంలో పోలీసులు తనిఖీలు చేసిన మొత్తం పౌరుల్లో వీరు 16% ఉండటం గమనార్హం. ఫ్రాన్స్‌లో ఆఫ్రికన్ లేదా అరబ్ జాతీయులు నివసించే ప్రాంతాల్లో సదుపాయాలు అంతగా ఉండవు. ఈ జాతీయులపై ఫ్రాన్స్ పోలీసుల దాష్టీకం అధికంగా ఉంటుంది. పరిశీలిస్తే ఫ్రాన్స్ పోలీసులు, ప్రజల పట్ల తమ విధుల కంటే, రాజ్య రక్షణ కోసమే పనిచేస్తారన్న చారిత్రక సత్యం బోధపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ చరిత్రకారుడు క్రెడిక్ మాస్ వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘1960, 1980 ప్రాంతాల్లో అమెరికా, బ్రిటన్‌లలో చోటుచేసుకున్న అల్లర్లు అక్కడి పోలీసు వ్యవస్థల్లో సంస్కరణలకు దారితీశాయి. మరి ఫ్రాన్స్ పరిస్థితేంటి? గత నాలుగు దశాబ్దాల్లో అటువంటివేమీ జరగలేదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఫ్రాన్స్ పోలీసు వ్యవస్థలో తక్షణ సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
ఎవరీ మెల్విన్ మెక్‌నైర్?
ప్రస్తుత అల్లర్ల నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ప్రముఖంగా ఒక పేరు వినిపిస్తోంది. ఆయన పేరు మెల్విన్ మెక్‌నైర్ (74). ఈయన అమెరికన్ నల్లజాతీయుడు. 1972 ప్రాంతంలో అమెరికా విమానాన్ని హైజాక్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు. అక్కడి నుంచి పారిపోయి చాలాకాలం అజ్ఞాతంలో గడిపి చివరకు ఫ్రాన్స్ చేరుకున్నాడు. ఇక్కడ విచారణ అనంతరం జైలుశిక్ష అనుభవించి ప్రస్తుతం ఒక సామాజిక కార్యకర్తగా దేశంలో అసంతృప్త యువతకు సహాయ సహకారాలు అందిస్తూ కాలం గడుపుతున్నాడన్నది ఈయనపై ప్రధాన ఆరోపణ. 841 డెల్టా విమానాన్ని హైజాక్ చేసిన కేసులో యు.ఎస్. పోలీసుల వాంటెడ్ లిస్ట్‌లో ఇంకా అతని పేరుంది.
ప్రస్తుతం ఫ్రాన్స్ అల్లర్లలో పాల్గొంటున్నవారు ఈయన వద్ద తర్ఫీదు పొందిన యువకుల మాదిరిగానే ఉన్నారంటూ ఫ్రాన్స్‌లోని విభిన్న రంగాల నిపుణులు, వ్యాఖ్యాతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఫ్రాన్స్ ఆంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ డార్మెనిన్ జులై 3న ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే అప్పటికి అరెస్టయిన 3354 మంది యువకులు 17 సంవత్సరాల వయస్సు వారే! మెల్విన్ మెక్‌నైర్‌కు ఫ్రాన్స్ పోలీసు వ్యవస్థతో, బ్యాన్‌లూయీస్ ప్రజలతో మంచి సంబంధాలుండటం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థపై ఎంతమాత్రం విశ్వాసం లేని యువకులను ‘బేస్‌బాల్’ నేర్పే మిషతో ఆయన చేరదీస్తుంటాడు. అందువల్లనే మెక్‌నైర్‌ను ‘మిస్టర్ బేస్‌బాల్’ అని పిలుస్తుంటారు. ఫ్రెంచ్ పోలీసుల్లో చాలా మంది జాత్యహంకారులున్నారని, వలసలను పూర్తిగా వ్యతిరేకించే వీరు, ముస్లింలు ఇక్కడ ఉండాలనుకోవడం లేదన్నది మెక్‌నైర్ అభిప్రాయం.
నెహాల్‌ను కాల్చి, ఉద్యోగం కోల్పోయిన పోలీసు వెనుక ఫ్రెంచ్ జాతీయులు నిలబడడం దీనికి కొసమెరుపు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్