– మణి వడ్లమాని
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
నాన్నమ్మతో ప్రయాణం అంటే నాకు భలే ఇష్టం. సరదాగా కూడా ఉం టుంది. అమ్మా, నాన్నా దుబాయిలో ఉండటంతో నేను ఆల్మోస్ట్ నాన్నమ్మ్ట దగ్గరే పెరిగాను. అంతే కాదు నాన్నమ్మ పేరునే కాస్త మోడరన్‌గా మార్చి పెట్టారు.
ఆవిడ పేరు మాలిని, నా పేరు మాన్వి.
నేనిప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నాను. పరీక్షలప్పుడు కష్టపడి చదివేస్తాను. అందుకే నాకు బాక్‌లాగ్స్ లేవు. అన్ని సబ్జెక్టస్‌లో కూడా 93 పెర్సెంట్ తో.. గ్రేడ్‌లోనే ఉండేదాన్ని.
ఉన్నట్టుండి ఒక రోజున రాత్రి ‘‘ఏయ్ మాన్వి! ఇటు చూడు’’ అంటూ పిలిచింది. చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ చూస్తున్న నాకు సరిగా వినిపించలేదు. అప్పుడు దగ్గరగా వచ్చి ‘‘మాన్వీ మనము తుంగనాథ్ వెళదాము రా’’ అంది.
సరే అని తలూపాను.
ఓహ్ మీకు చెప్పలేదు కదా ! మా నాన్నమ్మ మంచి ట్రెక్కర్ (trekker) ఆవిడ భలే ఎక్కేస్తుంది, నడిచేస్తుంది కూడా. నాకు కూడా సరదానే, అందుకే వెంటనే వెళ్దాము అనేసాను.
నిజానికి అప్పుడు కాలేజికి ఓ పది రోజులు సెలవులు. అందుకే ఇంట్రెస్ట్ చూపించాను.
ఇక్కడ నాన్నమ్మ గురించి చెబుతాను. నాన్నమ్మ ఉమ్మడి కుటుంబంలో ఉంటూ కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సామయినా తట్టుకుని నిలబడింది.
అమ్మ ఎప్పుడూ కూడా నాన్నమ్మ గురించి చెప్పేది. అలా చెబుతూ ఒక మాట అంది. ‘‘దగ్గరు న్నావుగా! నేను చెప్పడం కన్నా నీ అంతట నువ్వు నాన్నమ్మ వ్యకిత్వం గురుంచి తెలుసుకో!’’
అలా నాన్నమ్మ దగ్గర నేను లైఫ్ గురించి తెలుసు కుంటున్నాను.
‘‘ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల ఎదు రయినా పారిపోవడం కాదు, ఎదుర్కోవడం అలవాటు చేసుకో మాన్వీ, అప్పుడు సొల్యుషన్స్ కూడా దొరుకు తాయి’’ అని చెప్పేది
నాన్నమ్మకి హైకింగ్, మౌంటెనీరింగ్ లాంటి సాహసయాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకు తగ్గట్టుగా ఎప్పుడూ యోగ, వాకింగ్‌ణ్ బాగా చేసేది మా కమ్యూనిటీలో జిమ్‌కి కూడా వచ్చేది నాతో పాటుగా!
తాతగారు ప్లేన్‌క్రాష్‌లో చనిపోయారు. ఆ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఇదే ముఖ్య సాధనమయింది. అప్పటికే నాన్న ఉద్యోగంలో చేరారు.
యాత్రల ద్వారా కొత్త పరిచయాలు, కొత్త అనుభూతులే కాదు, ఆత్మ విశ్వాసాన్ని, స్వతంత్రతని పెంచుకోవచ్చు అని నాన్నమ్మ నమ్మకం
అన్నిటికన్నా ఈ ప్రయాణాలలో నాన్నమ్మకి అస్సాం రోడ్డు ప్రయాణాలు ఎంతగానో నచ్చేసాయి. పొగమంచు కొండలు, జలపాతాలూ, నదులూ, చెట్ల వరుసలూ ఇలా దేశంలోని ఎన్నో ప్రకృతి దృశ్యాల్ని తన కెమేరాలో బంధించేస్తూ తన ప్రయాణం చేస్తూనే ఉంది.. ఒక ట్రావెల్ జర్నలిస్ట్‌లా పని చేయడంతో తను చూసే ప్రదేశాలపై ఆసక్తికరంగా కథనాలను రాస్తూ వివిధపత్రికలు, బ్లాగ్‌లకు పంపేది. కొండలు, జలపాతాలు, పర్వతాలు మన దేశంలో ఇలా ప్రతి ఒక్కటీ అబ్బురపరిచే ప్రకృతి అందాలే. అయితే, వీటిని చూసొచ్చేయటంలోనే కాదు, వివిధ ప్రాంతాల్లో మనకు తారసపడే రకరకాల వ్యక్తుల ద్వారా మనకు కొత్త ఉత్సాహం తోడవుతుంది అంటుంది నాన్నమ్మ.
నాన్నమ్మ ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడ లేదు. తాతగారు సెంట్రల్ గవర్నమెంట్‌లో చేసేవారు. ఆ ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నాన్నమ్మ పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి కూడా ఉండేది.
తను దేశమంతా తిరుగుతూనే, తనలాగా ఇలా ప్రయాణాలు చేసే వాళ్లను కలుపుకుంటూ వెళ్లినప్పుడు కొన్ని గ్రామాల్లో అక్కడి పిల్లలకు కావాల్సిన వస్తువుల్ని, పుస్తకాల్ని కొనిపెట్టడం, ఎంత ఇవ్వ గలిగితే అంత వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం చేసేది. అంతేకాదు అక్కడ స్థానికంగా జరిగే ఎన్నో సేవా కార్యక్రమాల్లోనూ తమవంతు బాధ్యతను తీసు కునేవారు. ఇలా కలిసికట్టుగా వాళ్ల కష్టాన్ని పంచు కోవడం ద్వారా వచ్చే ఆనందం దేనితోను సరిపోదు అనేది.
అందుకే అమ్మకి నాన్నమ్మ అంటే భలే ఇష్టం. అత్తగారయినా కూడా ఇద్దరూ ఫ్రెండ్స్‌లా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటారు.
అక్కడికి నేను ఏడిపిస్తాను. ‘‘దూరంగా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. అదే కలిసుంటే ఇంత ఓపెన్‌గా ఉండగలిగేవారా నానీ ?’’
సమధానంగా ‘‘ఎస్! నువ్వన్న దాంట్లో నిజం లేకపోలేదు. ఒప్పుకుంటాను. అయినా అందులో కూడా ఒక బాధ్యత కూడిన ప్రేమ ఉంటుంది. అది బాహాటంగా పైకి కనిపించకపోవచ్చు’’ అంది.
అదే నాకు నాన్నమ్మలో నచ్చే గుణం చాల క్లారిటీగా చెప్పేస్తుంది.
*******
ఈ మాటు వాళ్ళ టూర్‌లో భాగంగా చంద్రశిల ట్రెక్ ప్లాన్ చేసుకున్నారు. ఇది పూర్తిగా సాహసయాత్ర. మొత్తం పదిమందితో పాటుగా కొంతమంది కొత్త ఫ్రెండ్స్ కూడా కలిసారు. అందులో మొదటిసారి నేను కూడా ఉన్నాను.
‘చలో హిమాలయాస్’ అనుకుంటూ బయలు దేరాము. వెళ్లిన ప్రతిసారీ గుండె నిండా చక్కటి అనుభూతులను మూట కట్టుకొని వచ్చే నాన్నమ్మకి, వెంట వెళుతున్న నాకు మా జీవితాలను మార్చేసే అనుభవం ఎదురు చూస్తోందని తెలియదు.
అనుకున్నట్లే అందరూ డెహ్రాడూన్‌లో కలుసు కున్నారు. అక్కడ నుంచి 19 సీటర్‌వ్యాన్‌లో బయలు దేరాము. అందరూ కొత్త వాళ్లయినా, చక్కగా కలిసి పోయారు. అందరూ నన్ను బాగా కలిపేసుకున్నారు. నాన్నమ్మని అయితే మీ సిస్టర్‌లా ఉంది…మీ మనవరాలులా లేదని ఒకటే ఏడిపించారు. నిజంగానే నాన్నమ్మ చలాకీగా, చిన్నపిల్లలా చకచకా నడిచేస్తోంది.
రుద్ర ప్రయాగలో బ్రేక్ అయ్యాక, రాత్రికి బేస్ క్యాంపుకి వచ్చేసాము. మరునాడు పొద్దున్న అసలు ట్రెక్ మొదలయింది. ఆ రోజంతా నడిచి రాత్రికి మరో చోట బ్రేక్ తీసుకున్నాము. మళ్లీ తెల్లారే లేచి ట్రెక్. మూడు-మూడున్నర మధ్యలో తుంగనాథ్ కి చేరుకున్నాము. మధ్యలో ఇంకా నేనన్నా అలిసి పోయనేమో కానీ డెభయ్ ఏళ్ల వయసులో నాన్నమ్మ చకచక నడవడం నిజంగ్ గ్రేట్ ! హాట్సాఫ్ నాన్నమ్మ!
*******
ఆ రోజు పౌర్ణమి. నిజానికి ఆ రోజుకి తుంగనాథ్‌లో ఉండాలనే ప్లాన్ చేసుకొని వచ్చాము.
అందరిలోను ఆనందం, సంతోషం. పైపైకి వస్తున్న చంద్రబింబాన్ని చూస్తూ ముందు కళ్లనిండా నింపుకొని, తరువాత ఫొటోలు, వీడియోలు తీసేసు కున్నారు.
ఆ సంతోషం పొద్దునే లేవడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. కొన్నివేల అడుగుల ఎత్తు మీద నుంచి ఒకటేసారి చంద్రోదయం, సూర్యోదయం చూడ గలగడం ఓ అపూర్వమైన అనుభవం. నాన్నమ్మకి అదే సంగతి కొన్ని వందలసార్లు చెప్పాను ఆ రాత్రి.
చంద్రశిల మీదసూర్యోదయం చూడటానికి అందరం తెల్లవారుజామున నాలుగుకి బయలు దేరాము. ఎనర్జీ డ్రింక్స్ వాటర్ బాటిల్స్, చాక్లెట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నాము.
అద్భుతం!!
అప్పటికే కుమావ్, గడ్వాల్ మంచు శిఖరాల వెనుక నుండి పసుపు నారింజ రంగుల కల నేతతో ఆకాశం అద్భు••ంగా ఉంది. ఇక సూర్యబింబం పైకి వస్తున్న క్షణాలు …..
అందరూ బొమ్మల్లా నిలబడిపోయారు.
ఆ దృశ్యం ఎవరో చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంది. యే కౌన్ చిత్రకార్ హై?
చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ పరవశించి పోయారు మిగతావాళ్లు. అందరి గొంతులలోంచి వావ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్ లాంటి పదాలు ఎన్నిసార్లో వస్తూనే ఉన్నాయి. అంత సౌందర్యాన్ని చూస్తూ తబ్బిబ్బు అవుతున్నారు.
‘‘ఏం చూస్తున్నావు’’ అన్న మాటకు వెనుతిరిగి చూసాను. నాన్నమ్మతో అంటున్నాడతను.
‘‘ఏం కనిపిస్తోంది అక్కడ’’ అని మళ్లీ ప్రశ్న. అసలు ఇతగాడికి ఏమి కావాలి అనుకుంటూ, అతని ఆకారం వైపు దృష్టి మళ్ళించాను. చేతిలో త్రిశూలం,. ఒంటినిండా బూడిద, మెళ్లో వరుసలుగా రుద్రాక్ష దండలు, జడలు కట్టిన జుట్టుతో ఉన్నాడు.
నిజానికి అతను మమ్మల్ని కొన్ని గంటలుగా చూస్తున్నాడు.
మళ్లీ హిందీలో అదే ప్రశ్న, అప్పుడు చెప్పాను ‘‘హిమాలయాలు చూడాలని, కేదార్‌బాబా దర్శనం చేసుకొని బదరీ వెళుతూ ఇదిగో తుంగనాథ్‌ని చూడటం కోసం వచ్చాను’’ .
‘‘పంచ కేదారాలు అన్నీ చూసావా?’’
‘‘లేదు! కుదరలేదు కానీ, కేదార్‌నాథ్, ఇదిగో ఇప్పుడు ఈ తుంగనాథ్ మాత్రం చూసాను.’’
‘‘ఎలా అనిపించింది, కేదార్‌నాథ్•కి వెళ్లినప్పుడు?’’
‘‘అద్భుతమైన దర్శనం జరిగింది’’.
‘‘ఆ పెద్ద బండ రాయి ఇక్కడ ఎందుకు ఉందో తెలుసా’’
‘‘అదే జల ప్రళయం వచ్చినప్పుడు, వచ్చి ఆగింది ఇక్కడ, అందుకే గుడి మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండిపోయింది. అంతా ఆ కేదార బాబా వల్లనే’’
‘‘అవును! అంతా ఆ బాబా వల్లనే’’ అంటూ దగ్గరగావచ్చి ‘‘నీకు ఇక్కడ ఓ మహానుభావుడి దర్శనం అవుతుంది, అదృష్టవంతులు,’’ అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఈ చంద్రశిల దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నప్పుడు ఈ మహా ప్రకృతి ముందు మోకరిల్లి.. ఇసుక రేణువు కన్నా తక్కువ ప్రమాణం మానవ జీవితం అనిపిస్తోంది.
అదో అద్భుతం, తన్మయత్వంతో మాట్లాడాలని లేదు! ఫోటోలు కూడా తీయలనిపించలేదు. కన్ను తిప్పితే అందం కనిపించదేమో అన్నట్లుగా అనిపి స్తోంది
మనసంతా ప్రశాంతంగా, తృప్తిగా, ఒక అనిర్వచనీయమైన అనుభూతి.
అతను వెళ్లిపోయాక, అక్కడే ఆ బండరాళ్ల మీద కూర్చొని తదేకంగా చూస్తూ ఉండిపోయాము. ఓహ్! ఎంత అద్భుతమైన సౌందర్యం. చుట్టూ కొండలు, కొన్ని వెండి రంగులో మెరిసిపోతున్నాయి. మరికొన్ని బంగారు కాంతితో, ఇంకొన్ని ఆకుపచ్చని కొండలు. అలా చూస్తూ చాలాసేపు ఉండిపోయాను. చలి తెలియటం లేదు.
ఏదో అలౌకిక భావన..!
ఇంతలో ..
‘రా నిన్ను నాతో పాటు తీసుకొనివెళతాను’ అన్న మాటలకి నా ఏకాగ్రత చెదిరింది. యథాస్థితికి చేరు కోవడానికి కొంత సమయం పట్టింది. మా వెనకాల ఆ సాధువు నుంచొని ఉన్నాడు
అంతవరకూ నాన్నమ్మనే చూస్తున్నాడు.
‘‘ఇక వెళదామా’’ అన్నాడు.
ఆ కళ్లలో ఏదో ఆకర్షణ వద్దు, వద్దు అనుకున్నా అతని వెంటే నాన్నమ్మ ,ఆ వెనకాలే నేను ఫాలో అవుతున్నాము.
మిగతావాళ్ల గురించి ఆలోచనే రాలేదు
అప్పుడు దారిలో అతనే నాన్నమ్మతో చెప్పాడు ‘‘ఇక్కడ ఇక గొప్ప యోగి ఉన్నారు అతను నిన్ను తీసుకు రమ్మని చెప్పారు’’
ఒకింత ఆశ్చర్యంగా ‘‘నేను ఎలా తెలుసు’’ అంది.
ఒక నవ్వు నవ్వాడు
వెంటనే స్ఫురించింది. ఇందాక ఆ సాధువు చెప్పాడు కదా ! అయితే విన్న వన్నీ నిజమేనా? ఈ హిమాలయాలలో ఇలాంటి అద్భుతాలు ఉన్నాయా?
కొంతదూరం అడవిలోంచి నడిచి అక్కడ నుంచి కొండ ప్రాంతానికి చేరు కున్నాము. అక్కడి ఒక గుహలోకి వెళ్లాం. అక్కడ పద్మాసనం వేసుకొని, జడలు కట్టిన జుట్టుతో ఉన్న వ్యక్తిని చూశాం. ఆయన చెంతకు వెళ్లగానే ఏదోహాయి, మనసంతా ప్రశాం తంగా, మరో లోకంలోకి ప్రవేశించినట్లు, కొద్ది క్షణా లకు ఆయన కళ్లు తెరిచాడు. ఆ కళ్లలో అమోఘమైన తేజోశక్తి, వెంటనే చేతులు జోడిస్తూ నిలుచున్నాము.
అప్పుడు ఆయన హిందీలో ‘‘నువ్వు ఇంత దూరం జిజ్ఞాసతో ఏదో తెలుసుకోవాలని సత్యాన్వేషివై వచ్చావు కదా! నిజానికి దేవుడితో మనకున్న బాంధవ్యం మర్చిపోతున్నాము. అదే నీ లోపల అశాంతికి, దుఃఖానికి కారణం . మరో మాటలో చెప్పాలంటే మాయ. అసలు భగవంతుడు నీలోనే ఉన్నాడు అది తెలుసుకో. ఒక్కటే గుర్తుంచుకో …బాహ్యానికి విలువ ఇవ్వకుండా నీలో ఉండే ‘నేను’ని తెలుసుకో చాలు’’ అన్నాడు నాన్నమ్మతో.
అలా చెప్పిన మరుక్షణంలో నాన్నమ్మ ఆయన పాదాల చెంత ఉంది. నన్ను కూడా పిలిచి తల మీద చేయి పెట్టి దీవించాడు.
ఆ తరువాత నెమ్మదిగా కిందకి దిగడం మొదలుపెట్టాము. అక్కడ మిగతావాళ్లు మా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు నేను కూడా వెళ్లి నా అనుభవాన్ని, అనుభూతిని అందరికీ చెప్పాలి.
*******
ఐదేళ్లు గడిచాయి. ఉద్యోగం, పెళ్లి అనే రెండు ప్రధాన ఘట్టాలు నా జీవితంలో జరిగాయి.
సౌరవ్ నా జీవితంలోకి ప్రవేశించాడు. తను నానమ్మను చూడకపోయినా నేను చెప్పిన మాటల ద్వారా చూసేసాడు. పైగా ఇప్పుడు నాకన్నా కూడా నానమ్మ విషయాలు తనే ముందు చెప్పేస్తాడు.
పెళ్లయ్యాక హనీమూన్ ప్లాన్ చేశాడు ‘‘సౌరవ్, నువ్వు ఎక్కడికయినా తీసుకెళ్లువస్తా, బట్ నేను కూడా ఒకచోటు చెబుతాను మనం అక్కడకి వెళ్లాలి’ అని గట్టిగా చెప్పాను. ‘‘సరే సరే. ఈజీ,ఈజీ’’ అన్నాడు.
ప్రస్తుతం మేము బొంబాయిలో ఉన్నాము. ఈ ఐదేళ్లలో ఇక్కడకి నాలుగుసార్లు వచ్చాను. ఇది ఐదోసారి. సరిగ్గా నాన్నమ్మ నన్ను వదిలేసి వెళ్లిన చోటు ఇదే.
చిన్న కాగితం మీద ‘‘మన్ను డియర్ ఎప్పటి నుంచో ఈ రిలేషన్‌షిప్స్ నుంచి డిటాచ్ అవ్వాలని అనుకున్నాను. నాపరంగా పనులన్నీ పూర్తయ్యాయి. సో! నేనిప్పుడు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటు న్నాను..వెతికించడం, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం లాంటి పిచ్చి పనులేమి చేయకు. ఆల్రెడీ మీ నాన్నకు, అమ్మకు మెసేజ్ పెట్టాను. జాగ్రత్తగా ఉండు! హ్యాపీగా ఉండు! above all you are a matured and brave girl, లవ్ నాన్నమ్మ’’ అనే వాక్యాలు చదివి ఆరోజు ఎంతసేపు ఏడ్చానో! అందరూ తలోచోట వెతికారు, కానీ లాభం లేకపోయింది.
నాన్నకు నేనే ధైర్యం చెప్పాను. బాధ పడొద్దని. అమ్మ అయితే కొన్ని రోజులు తట్టుకోలేక బాగా జబ్బుపడింది.
ఈ ఐదేళ్లలో మానసికంగా ఎదిగాను. ప్రతి దానికీ చలించి పోవటం లేదు. ఎన్ని పనులున్నా నాన్నమ్మ నన్ను వదిలివెళ్లినప్పటి రోజుకి ఇక్కడకు వస్తాను. కాసేపు అక్కడ కూర్చొని వచ్చేస్తాము. ఏదో ప్రశాంతత కలుగుతుంది. నాకు తోడుగా సౌరవ్ వస్తాడు.
అయితే కాలానికి ఏ గాయన్నైనా మాన్పే గుణ ముంది.
మేమున్న ప్లేస్ నుంచి కొంచెం లోపలకి అలా నడుచుకుంటూ వెళుతుండగా దూరంగా కాస్త అస్పష్టంగా నడుస్తూ వెళుతున్నారు ఇద్దరు. ఆ నడక… అవును…నాకు బాగా పరిచితం అది .. నాన్నమ్మదే
‘‘సౌరవ్ .. నాన్నమ్మ ..’’ అన్నాను వేలుపట్టి చూపిస్తూ… ఆ వైపుగా తను కొంత దూరం పరిగెత్తాడు. నేనయితే ‘‘నాన్నమ్మా’’ అంటూ గట్టిగా కేకలు వేయసాగాను.
అది నిజమా ! భ్రమా ! అర్థం కాలేదు.
నా భుజం చుట్టూ చేయి వేసి అనునయంగా ‘‘మన్నూ’’ అంటూ దగ్గరకు తీసుకున్నాడు సౌరవ్.. ప్రశాంతంగా ఉన్న ఆ కొండలలో నా గొంతు ప్రతిధ్వనిస్తోంది.