ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్‌లో 13-14 తేదీల్లో నిర్వహించిన అధికార పర్యటన రెండుదేశాల మధ్య సంబంధాల్లో మరో మైలురాయికి చిహ్నంగా నిలిచిపోయింది. ప్రధాని హోదాలో నరేంద్రమోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. 1998, జనవరి 26న ప్రారంభమైన ఈ వ్యూహాత్మక భాగ స్వామ్యానికి 25ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో 2047 వరకు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని జులై 14న ఫ్రాన్స్ ‌బాస్టిల్లె డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. మనదేశానికి చెందిన రాఫెల్‌ ‌యుద్ధవిమానాలతో పాటు స్టెల్త్ ‌డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ ‌చెన్నై ఈ ఉత్సవాల్లో పాల్గొన్నది. మొత్తం భారత్‌ ‌త్రివిధ దళాలకు చెందిన 269మంది బాస్టిల్లె డే పరేడ్‌లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా తొలిసారి పాల్గొన్న మన దేశ ప్రధాని డా।।మన్మోహన్‌సింగ్‌. ‌మన త్రివిధదళాలకు చెందిన 400మంది సైనికులు అప్పట్లో ఈ పరేడ్‌లో పాల్గొనడం విశేషం. 2008 రిపబ్లిక్‌ ‌పరేడ్‌కు ముఖ్య అతిథిగా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్‌ ‌సర్కోజి హాజరుకాగా, మరుసటి ఏడాది జరిగిన బాస్టిల్లె డే ఉత్సవాల్లో మన్మోహన్‌సింగ్‌ ‌పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌లో యూసీసీ సేవలు అమల్లోకి రావడం ఒక విశేషం. ఈమేరకు రెండు దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. అంటే ఫ్రాన్స్ ‌వెళ్లేవారు రూపాయిల్లోనే చెల్లింపులు జరపవచ్చు. ఇప్పటికే ఈ సదుపాయం సింగపూర్‌, ఆ‌స్ట్రేలియా, కెనడా, హాంకాంగ్‌, ఒమన్‌, ‌కతార్‌, ‌యు.ఎస్‌, ‌సౌదీ అరేబియా, యుఎఇ, యుకెవంటి దేశాల్లో అమల్లో ఉండగా, తాజాగా  ఈ జాబితాలో ఫ్రాన్స్ ‌చేరింది.

 ఫ్రాన్స్ అత్యున్నత అవార్డు ‘‘గ్రాండ్‌ ‌క్రాస్‌ ఆఫ్‌ ‌లీజియన్‌ ఆనర్‌’’‌ను ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యువల్‌ ‌మెక్రాన్‌ ‌చేతుల మీదుగా ప్రధాని నరేంద్రమోదీ అందు కోవడం గొప్ప విశేషం. ఈ అవార్డును స్వీకరించిన తొలి భారతీయ నేత నరేంద్ర మోదీ. గతంలో దక్షిణాఫ్రికా అధ్యక్షులు నెల్సన్‌ ‌మండేలా సహా పలువురు ప్రముఖులు ఈ అవార్డును అందు కున్నారు. మార్సెల్లీలో కొత్త కాన్సులేట్‌ ఏర్పాటు, ఫ్రాన్స్‌లో మాస్టర్స్ ‌డిగ్రీ చేయాల నుకునే భారతీయ విద్యార్థులకు వీసాగడువు ఐదేళ్లకు పెంపు, తమిళ తత్వవేత్త తిరువళ్లువార్‌ ‌విగ్రహాన్ని ప్రాన్స్‌లో కొద్ది వారాల్లో ప్రతిష్టించడం వంటివి ప్రధాని ప్రకటించిన అంశాలు.

కీలక ఒప్పందాలు

ప్రస్తుతం ఫ్రాన్స్ ‌నుంచి నావికాదళం కోసం 26 రాఫెల్‌ ‌యుద్ధ విమానాలతోపాటు మరో మూడు జలాంతర్గాములను భారత్‌ ‌కొనుగోలు చేయనున్నది. ఇవికాకుండా ఫిఫ్త్ ‌జనరేషన్‌ ‌యుద్ధ విమానాలకు ఇంజిన్ల అభివృద్ధి, 12 టన్నులకంటే అధిక తరగతికి చెందిన ఇండియన్‌ ‌మల్టీరోల్‌ ‌హెలికాప్టర్ల (ఐఎంఆర్‌హెచ్‌) ‌తయారీని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌తో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు ఒప్పందం కుదిరింది. అదేవిధంగా అత్యధిక శక్తిగల అడ్వాన్స్‌డ్‌ ‌మీడియం కంబాట్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ (ఏఎం‌సీఏ)ను కూడా ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు డిఆర్‌డిఒ-ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్‌ ‌సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి డిజైన్‌ను డి.ఆర్‌.‌డి.ఒ. రూపకల్పన చేస్తుంది. ఈ ప్రాజెక్టు రోడ్‌మ్యాప్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఈ సంస్థలు రూపొంది స్తాయి. ఈ ఇంజిన్‌కు సంబంధించి నూటికి నూరుశాతం సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు జరపడానికి ఫ్రాన్స్ ‌ముందుకు వచ్చింది. దీని తయారీలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అంతరిక్ష రంగంలో రెండుదేశాల మధ్య సమన్వయ సహకా రాలు మరింత బలోపేతమయ్యాయి.

ఈనాటి ఈ బంధమేనాటిదో..

రెండు దేశాల మధ్య సంబంధాలు నేటివి కావు. రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. మహారాజా రంజిత్‌సింగ్‌ ‌సైన్యంలో రెండు వేలమంది ఫ్రెంచ్‌ ‌సైనికులుండేవారు. ఆయన సైన్యంలోని ‘‘ఫౌజ్‌- ఇ- ‌ఖాస్‌’’ ‌బ్రిగేడ్‌ ‌ఫ్రెంచ్‌ ‌పద్ధతు ల్లోనే ఉండేది. 17వ శతాబ్దం నుంచి 1954వరకు ఫ్రాన్స్‌కు వలసగా ఉన్న పుదుచ్చేరి నేటికీ ఫ్రాన్స్ ‌పౌరులకు ప్రముఖ పర్యాటక కేంద్రం. నిజానికి భారత్‌-‌ఫ్రాన్స్‌లు వ్యూహాత్మక కూటమిగా ఏర్పడ టానికి ప్రచ్ఛన్నయుద్ధ కాలంలోనే బీజాలుపడ్డాయి. నాటి సోవియట్‌ ‌యూనియన్‌, ‌మన దేశానికి రక్షణ, దౌత్యపరమైన భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ, భారత్‌ ‌పూర్తిగా యుఎస్‌ఎస్‌ఆర్‌పై ఆధారపడకుండా సమతుల్యతను సాధించేందుకు ఈస్నేహం దోహద పడిందనే చెప్పాలి. నాటో దేశమైనప్పటికీ, యు.ఎస్‌.‌ను లెక్క చేయకుండా భారత్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలిచిన మంచి మిత్రదేశం ఫ్రాన్స్. ‌దక్షిణాసియాలో భారత్‌ ‌ప్రాధాన్యతను గుర్తించిన దేశం కూడా ఫ్రాన్స్ ‌మాత్రమే. 1971 ఇండో-పాక్‌ ‌యుద్ధంలో మన దేశానికి మద్దతుగా ఫ్రాన్స్ ‌నిలిచింది. 1990ల్లో యుఎస్‌ఎస్‌ఆర్‌ ‌విచ్ఛినం తర్వాత, నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు జాకస్‌ ‌చిరాక్‌ ‌రెండు దేశాల మధ్య ‘‘వ్యూహాత్మక సంబంధాలను’’ ముందుకు తెచ్చారు. 1998లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరినప్పటి నుంచి వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, అణుసరఫరా గ్రూపు దేశాలు, మన దేశంపై ఆంక్షలు ఎత్తేసిన తర్వాత, భారత్‌తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న మొట్ట మొదటి దేశం ఫ్రాన్స్. ఇం‌డియా, ఫ్రాన్స్‌ల మధ్య రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం, భద్రత వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. చైనా ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో- పసిఫిక్‌ ‌ప్రాంతంలో ఈ భాగస్వామ్యం మరింత దృఢతరం కావడం విశేషం.

నిజమైన స్నేహితుడు

1998లో అణుపరీక్షలు నిర్వహించినప్పుడు ఫ్రాన్స్ ‌మనదేశ చర్యను ఖండించలేదు. జి-8లోను, ఐక్యరాజ్యసమితిలో మనకు శాశ్వతసభ్యత్వం కోసం తిరుగులేని మద్దతునిచ్చి ఆప్తుడిగా నిలిచింది. మనదేశానికి పెద్దమొత్తంలో అణు ఇంధనాన్ని సరఫరాచేసే దేశం ఫ్రాన్స్. ‌గతంలో మన దేశానికి మిరాజ్‌-2000 ‌యుద్ధవిమానాలను, స్కార్పియన్‌ ‌క్లాస్‌ ‌జలాంతర్గాములను సరఫరా చేసింది. ప్రస్తుతం మనదేశంలో ఫ్రాన్స్‌కు చెందిన వెయ్యి కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం వార్షిక టర్నోవర్‌ 20‌బిలియన్‌ ‌డాలర్లు. దేశంలో ఫ్రాన్స్‌కు చెందిన 25 పరిశోధనా కేంద్రాలు పనిచేస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఫ్రాన్స్ ‌మనదేశంలో 11వ స్థానంలో ఉంది.

2000-2022 మధ్యకాలంలో భారత్‌లో ఫ్రాన్స్ ‌పెట్టుబడులు 10.31 బిలియన్‌ ‌డాలర్లు. మన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఇవి 1.70%. 2021-22లో రెండుదేశాల మధ్య వార్షిక వాణిజ్యం 12.42 బిలియన్‌ ‌డాలర్లకు చేరుకుంది.

 అంతరిక్ష-రక్షణ రంగాలు

1960లో శ్రీహరికోట లాంచ్‌ప్యాడ్‌ ‌నిర్మాణానికి సహాయం చేసిన దగ్గరి నుంచి, ఇరుదేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం మరింతగా బలపడుతూ వచ్చింది. 2020లో ఇస్రో, ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌స్పేస్‌ ‌స్టడీస్‌ (‌సీఎన్‌ఈఎస్‌)‌లు ‘‘జాయింట్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ’’ని ఏర్పాటుచేశాయి. తర్వాత ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా మార్స్ ‌మిషన్‌కు ప్రణాళిక సిద్ధంచేశాయి. అంతరిక్ష వ్యర్థాల సమస్యను పరిష్కరించడంలో కూడా ఫ్రాన్స్ ‌మనదేశానికి సహాయం చేసింది. 2017-21 మధ్య కాలంలో మనదేశానికి రెండో అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా రూపొందింది. సంప్రదాయిక స్కార్పియన్‌ ‌జలాంతర్గాములను ‘‘2005 సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు ఒప్పందం’’ కింద ప్రవేశపెట్టడం, 36 రాఫెల్‌ ‌యుద్ధ విమానాలను మనదేశం కొనుగోలు చేయడం ఇందులో భాగమే. వీటికితోడు టాటా కంపెనీ ఎయిర్‌బస్‌ ‌భాగస్వామ్యంతో సి295 రవాణా విమానాల తయారీని వడోదరలో చేపట్టనుంది.

హిందూమహాసముద్రం కీలకం

 హిందూమహాసముద్రంలో భద్రత విషయంలో రెండు దేశాలమధ్య పరస్పర సహకారం ఇటీవలి సంవత్సరాల్లో మరింతగా పెరిగింది. ముఖ్యంగా 7500 కిలోమీటర్ల తీరం, 1380 ద్వీపాలు, రెండు మిలియన్‌ ‌చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలం కలిగిన ఈ ప్రాంతంలో  భారత్‌ ‌పాత్ర అత్యంత కీలకం. ఇదే ప్రాంతంలో ఫ్రాన్స్‌కు చెందిన మయొట్టె, లారె యూనియన్‌ ‌ద్వీపాలు, వీటికి సంబంధించిన ప్రత్యేక ఆర్థిక మండలం భద్రత చాలా ముఖ్యం.  వీటితో పాటు జిబౌటీ, అబుదాబిల్లో కూడా దళాల మోహరింపు కొనసాగుతోంది. ఈనేపథ్యం లోనే ‘‘భారత్‌-‌ఫ్రాన్స్ ‌భాగస్వామ్యానికి సంబంధించి ఉమ్మడి వ్యూహాత్మక విజన్‌’’‌తో ముందుకు సాగేందుకు రెండు దేశాలు 2018లో ఒక అంగీకారానికి వచ్చాయి.

మింగుడుపడని చైనా వైఖరి

ప్రస్తుతం యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలు చైనా వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ముఖ్యంగా ‘ఒకే చైనా’ విధానం ఆమోదించాలని ఆ దేశంనుంచి వస్తున్న ఒత్తిళ్లు, చైనా దౌత్యంలో ‘‘ఉల్ఫ్ ‌వారియర్‌’’ ‌విధానాన్ని అనుసరిస్తుండటం ఈయూ దేశాలకు మింగుడు పడటంలేదు. ఈ నేపథ్యంలో ‘‘ఈయూ-చైనా: వ్యూహాత్మక దృక్కోణం’’ పేరుతో యూరోపియన్‌ ‌కమిషన్‌ ఒక అధ్యయనాన్ని విడుదలచేసింది. ఇందులో చైనా అనుసరిస్తున్న ‘‘ప్రత్యామ్నాయ ప్రభుత్వ నమూనాలు’’ ఆమోద యోగ్యంగా లేవని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ ‌మహాసముద్ర ప్రాంతాల్లో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి ఫ్రాన్స్ ‌ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించేదిగా ఉండటం మరో ముఖ్యాంశం. ఈ నేపథ్యంలో చైనాపట్ల ఫ్రాన్స్‌లో వ్యతిరేకత పెరుగుతోంది.

కొనసాగుతున్న సవాళ్లు

ఇన్ని సానుకూలతలున్నప్పటికీ భారత్‌-‌ఫ్రాన్స్ ‌ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరలేదు. అదేవిధంగా భారత్‌-ఈయూల మధ్య విస్తృత ప్రాతిపదికన వాణిజ్య పెట్టుబడుల ఒప్పందం (బీటీఐఏ) కూడా లేదు.

ఇది రెండు దేశాల మధ్య మరింత స్వేచ్ఛగా వాణిజ్యం కొనసాగించడానికి ప్రధాన అడ్డంకి. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య వాణిజ్య అసమతౌల్యత ఉంది. ఇది భారత్‌కు ఇబ్బంది కలిగించే విషయం. ఇదే సమయంలో మేధోపరమైన హక్కుల పరిరక్షణలో భారత్‌ ‌విఫలమైందంటూ ప్రాన్స్ ఆరోపి స్తోంది. అయితే, హిందూమహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ప్రస్తుతం రెండుదేశాలను ఒక్కతాటిపై నడిపిస్తోంది.  చైనా వైఖరి ఈ ప్రాంతంలో శాంతిని దెబ్బతీస్తుందని రెండుదేశాలు నమ్ముతున్నాయి.

మరో విశ్వసనీయ మిత్రదేశం యు.ఎ.ఇ.

ఫ్రాన్స్ ‌పర్యటన తర్వాత మోదీ 15వ తేదీన అబుదాబి (యు.ఎ.ఇ) వెళతారు. టెక్నాలజీ, సెక్యూరిటీ, ఇంధన రంగాల్లో రెండు దేశాలమధ్య ఇప్పటికే మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. యు.ఎ.ఇ.పాలకుడు షేక్‌ ‌మహమ్మద్‌ ‌బిన్‌ ‌జయాద్‌ అల్‌ ‌నహ్యాన్‌తో చర్చలు జరుపుతారు. గత ఏడాది ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చల్లో భవిష్యత్తులో రెండుదేశాల భాగస్వామ్యానికి సంబంధించి రోడ్‌మ్యాప్‌పై ఒక అంగీకారానికి వచ్చారు. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే జి-20 సమావేశానికి యు.ఎ.ఇ. ప్రత్యేక ఆహ్వానిత దేశంగా పాల్గొననుంది. ఈ ఏడాది చివర్లో యు.ఎ.ఇలో జరుగనున్న కాప్‌-28 ‌సమావేశం కోసం రెండు దేశాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ఈ సదస్సుకు యు.ఎ.ఇ. ఆతిథ్యం ఇవ్వనుంది. 2022 మే నుంచి 2023 ఏప్రిల్‌ ‌మధ్యకాలంలో రెండు దేశాలమధ్య జరిగిన వాణిజ్యం విలువ 50.5బిలియన్‌ ‌డాలర్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.8% ఎక్కువ. యు.ఎ.యి. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనదేశ ఎగుమతుల్లో యు.ఎ.ఇ.ది రెండోస్థానం. మన దేశంలో పెట్టుబడుల్లో యు.ఎ.ఇ.ది నాలుగో స్థానం. ప్రస్తుతం యు.ఎ.ఇ.లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 3.5బిలియన్లు. అంటే యు.ఎ.ఇ. జనాభాలో 38శాతం భారతీయులే! ఈ నేపథ్యంలో ప్రధాని యు.ఎ.ఇ. పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE