‌గెలవదలచుకున్నవాడు, పక్కవాడి లోపాలు, బలహీనతల మీద ఆధారపడడు. తాను గెలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో తన శక్తి, సామర్ధ్యాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ, సానుకూల వైఖరితో కృషిని సాగిస్తాడు. ఎదుటివాడిని ఓడగొట్టాలనుకున్న వాడికి ఏ విషయంలో వారిని ఓడగొట్టాలనే దానిపై స్పష్టత ఉండాలి… ఆ కారణం హేతుబద్ధమైనదై ఉండాలి. ఇంత చిన్న విషయాన్ని ప్రతిపక్షాలు మరచిపోవడం విచిత్రమే !  కానీ, అన్ని విరామాలతో (ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ) ఇండియా జనంలో సానుకూల అభిప్రాయాన్ని కలిగించలేకపోతోంది. మోదీపై ఉన్న గుడ్డి ద్వేషం, తమ బలహీనతల కారణంగా అవి ఆ విషయాన్ని మరచిపోయాయా? తాజాగా, ప్రతిపక్షాలన్నీ కలిసి ఐ.ఎన్‌. ‌డి.ఎ.ఐ.ఎ. (ఇండియన్‌ ‌నేషనల్‌ ‌డెవలప్‌మెం•ల్‌ (‌డెమోక్రాటిక్‌ ‌కాదు సుమా!) ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్)‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? యూపీఏ (యునైటెడ్‌ ‌పోగ్రెసివ్‌ అలయెన్స్)‌గా రెండుసార్లు అధికారం చెలాయించిన వారికి ప్రస్తుతం అది అచ్చిరాలేదనిపించిందా? యూపీఏ తిరిగి అధికారంలోకి రాకపోవడానికి కారణాలను వారు ఒకసారి అవలోకనం చేసుకుని ఉంటే, తమ లోపాలను, బలహీనతలను సరిచేసుకోవడానికి ప్రయత్నించేవారే తప్ప కొత్తగా మరొక కూటమికి తెరలేపవలసిన అవసరం వారికి వచ్చేది కాదు. తాము కూడా దేశ భక్తులమేనని, ఇండియా వర్సెస్‌ ‌మోదీగా ఈసారి ఎన్నికలకు వెళ్లాలన్నది వీరి ప్రయత్నంగా కనిపిస్తోంది.

పెద్ద, చిన్నచితకా సహా మొత్తం మోదీ, బీజేపీ వ్యతిరేక పార్టీలు 26 బెంగళూరులో సమావేశమమై, కొత్త కూటమిని ప్రకటించుకున్నాయి. ప్రతి పక్షాలను ఏకం చేయాలంటూ ఇంతకు ముందు కేసీఆర్‌, ‌నితీష్‌ ‌వంటి ప్రాంతీయ నాయకులు చేసిన ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. కాంగ్రెస్‌ ‌నాయకుడు, గాంధీ-నెహ్రూ వంశ వారసుడు రాహుల్‌ ‌గాంధీ విదేశాలలో తన దేశవ్యతిరేక పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన జోక్యంతో ఈ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టాలన్న ఆలోచన రాహూల్‌ ‌గాంధీదే నని, అది మహత్తరమైన ఆలోచన అని కాంగ్రెస్‌ ‌నాయకులే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ తంతు చూస్తుంటే, 1970వ దశకంలో ఎమర్జెన్సి విధింపునకి కాస్త అటుఇటుగా కాంగ్రెస్‌ ‌నాయకుడు దేవ్‌కాంత్‌ ‌బారువా, ‘ఇండియా ఈజ్‌ ఇం‌దిర – ఇందిర ఈజ్‌ ఇం‌డియా’ అంటూ ఇచ్చిన నినాదం గుర్తు రాకమానదు. కాంగ్రెస్‌ ‌పార్టీలో వందిమాగధుల సంప్రదాయం నేటిది కాదన్నది వాస్తవం. ఇందిరాగాంధీ సమయం నుంచీ కేంద్రీకృత నాయకత్వం కాంగ్రెస్‌పార్టీకి చుక్కానిగా ఉంటూ వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రులైనా సరే హైకమాండ్‌ ఆజ్ఞ లేకుండా ఒక్క అడుగు స్వతం త్రంగా వేయడానికి వీలులేదు. ఇప్పటికీ ఇదే సంప్ర దాయం కొనసాగడం మనకు కనిపిస్తున్న వాస్తవమే.

మరొక విచిత్రమేమిటంటే, ఎమర్జెన్సికి వ్యతిరేకంగా జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌చేపట్టిన ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చిన లాలూ వంటి నాయకులు కూడా ఆ విషయాలను ఎప్పుడో విస్మరించి, కాంగ్రెస్‌తో జతకూడడం. యుద్ధంలో, ప్రేమలో అన్నీ న్యాయమే అన్న చందంగా, ఒకనాడు అవినీతికి, వంశ/కుటుంబ రాజకీయాలకు, నియంతృత్వ పోకడలకూ వ్యతిరేకంగా పోరాటాలు చేసి వెలుగులోకి వచ్చిన నాయకులే అధికారం రుచి తెలిసిన తర్వాత, ఆ విలువల కోసం తమ పోరాటాలకు విరామమిచ్చి, వచ్చి కాంగ్రెస్‌ ‌సరసన కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి ప్రజలు కొత్తగా ఏమి ఆశిస్తారు? వారి మధ్య లెక్కలు బానే కుదురుతున్నాయి కానీ కెమిస్ట్రీ ఎంతవరకూ కుదురుతుందన్నదే ప్రశ్న.

నూతన కూటమిని ప్రకటిస్తున్న సమయంలో తమకు ప్రధాని పదవిపై మోహం లేదంటూ కాంగ్రెస్‌పార్టీ ఘనంగా ప్రకటించడం మనందరం విన్నాం. ఆ మహత్తర త్యాగాన్ని మనం అభినందిం చడంలో తప్పులేదు కూడా. మాకు పదవులు కాదు ముఖ్యం, దేశం అంటున్నారు, దాన్నీ నమ్ముదాం. అటువంటప్పుడు వారు దేశం కోసం ఏం చేయాలను కుంటున్నారు? వారు ప్రజలకు ఏం అందించా లనుకుంటున్నారు? మోదీని విమర్శించడం, ఆయన చేసిన పనులలో రంధ్రాన్వేషణ చేయడమూ సరే… అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ ‘‘‌నువ్వు ఎవరు?’’ లాగా, ‘‘ఈ పార్టీలన్నీ మోదీ అమలుచేస్తున్న పథకాలకు ప్రత్యామ్నాయంగా మాకు ఏమి అందించాలనుకుంటున్నాయి?’’ అని ప్రజలు ప్రశ్నించరా?

‘గరీబీ హఠావో’, ‘రోటీ, కపడా ఔర్‌ ‌మకాన్‌’, ‘‌బిజిలీ, పానీ, సడక్‌’ (‌పేదరికాన్ని నిర్మూలిద్దాం, కూడు, గుడ్డ, గూడు, విద్యుత్తు, నీరు, రహదారి) ఇలా కొన్ని దశాబ్దాల పాటు అధికారాన్ని చేజిక్కించు కునేందుకు కాంగ్రెస్‌ ఇచ్చిన నినాదాలన్నింటినీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రధాని మోదీ దాదాపుగా అమలు చేసేశారు కదా. 2021నాటికి దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న 415 మిలియన్లమందిని ఈ రేఖ పైకి తీసుకువచ్చినట్టు సాక్షాత్తు యుఎన్‌డిపి లెక్కలే వెల్లడిస్తున్నాయి. ఇక, ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద పేదలకు గృహాలు, అంత్యోదయ  నిరుపేదలకు రేషన్‌, ‌రహదారులు, ఉపాధి, ఇంటింటికీ రక్షిత మంచినీరు, మారుమూల గ్రామా లకు కూడా విద్యుత్తు ఇవన్నీ వేగంగా జరిగి పోతు న్నాయి. గత ఎన్నికలలో ఇచ్చిన మోదీ హైతో ముమ్‌కిన్‌ ‌హై (మోదీ ఉంటే తప్పనిసరిగా జరుగు తుంది) అన్న నినాదానికి ప్రధాని వాస్తవరూపం ఇచ్చుకుంటూపోతున్నారు. పైగా, ప్రతి ఎన్నికల సభ లోనూ ఆయన తాను చేసి చూపించిన విషయాలన్నీ పట్టి చూపుతున్నారు.

వీటన్నింటితోపాటు, దేశంలో అవినీతిపై ప్రధాని మోదీ ఉక్కుపాదం మోపడం ప్రతిపక్షాలకు మింగుడు పడని విషయం. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో జరిగిన అవినీతి వల్లే కదా ప్రజలు వారిని తిరస్కరించింది? రాజకీయ పార్టీలు ప్రాథమికంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ప్రజలు వారనుకుంటున్నట్టుగా వెర్రి గొర్రెలు కాదని. అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు కూడా టీవీలు, మొబైల్‌ఫోన్‌ల ద్వారా ఇప్పుడు సమాచారం అందు బాటులో ఉంటోంది. అయితే, దానివల్లే ప్రజలు తెలివిమీరిపోయారు అనుకోవడం కూడా తప్పే. అత్యధిక నిరక్షరాస్యత, సమాచార సాధనాలు అందుబాటులో లేని 1970వ దశకంలోనే ఎమర్జెన్సి అనంతరం వచ్చిన ఎన్నికలలో ప్రజలు నిర్దయగా కాంగ్రెస్‌ ‌పార్టీని, ఇందిరాగాంధీని తిరస్కరించిన విషయం మనం గుర్తుచేసుకుంటే ప్రజలు ఎంత విజ్ఞులో అర్థమవుతుంది. దేశానికీ, తమ ప్రయోజనా లకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను ప్రజలు ఇట్టే గుర్తించి, నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూనే వస్తున్నారు.

కాగా, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలన్నీ ఒకరకంగా కాంగ్రెస్‌ ‌మార్గంలోనే నడుస్తూ, కుటుంబ పాలనకే కాక కుల రాజకీయాలకు కూడా నాంది పలికాయి. మొదట్లో, కుల రాజకీయాలు బాహాటంగా చేయకపోయినా, ఇప్పుడు సుస్పష్టంగా కుల సమీకరణాల గురించి చర్చలు మీడియాలో కూడా బహిరంగంగా జరుగుతున్నాయి. కులం, మతం, కుటుంబం, అవినీతి ఆలంబనగా అధికారం చెలాయిస్తున్న, చెలాయించాలనుకుంటున్న పార్టీలన్నీ ఒక చోట చేరినంత మాత్రాన వారిని ప్రజలు గుడ్డిగా సమర్ధిస్తారా? వారి సెక్యులరిజం, సామ్యవాదం ఏపాటివో ప్రజలకు అర్థం కాదా? రాష్ట్ర స్థాయిలో వేసినవారికే జాతీయ స్థాయిలో కూడా ఓటు వెయ్యం అని ప్రజలు స్పష్టంగా తమ తీర్పును వినిపిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికలలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ ‌జాతీయ ఎన్నికల్లో అదే స్థాయిలో అక్కడ విజయాన్ని సాధిస్తుందన్న గ్యారెంటీ లేదు.

గమనించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ప్రతిపక్షాలలో మెజారిటీ పార్టీలు కాంగ్రెస్‌ను వ్యతిరేకించి, దాని నుంచి విడిపోయి పిల్ల పార్టీలు పెట్టుకుని అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించినవే. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు మొలక పార్టీలనే చెప్పాలి. ఇక ప్రాంతీయ పార్టీలన్నీ తాము కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా వస్తున్నామనే నినాదంతో పుట్టినవే. ముఖ్యంగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ! అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఈ పార్టీ పై అవినీతి ఆరోపణలు మోపని రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుడు కానీ లేకపోవడం గమనార్హం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలాదీక్షిత్‌పై చేసిన ఆరోపణలను ప్రస్తుతం కాంగ్రెస్‌ అధి నాయకత్వం విస్మరిస్తున్నా, ఢిల్లీ కాంగ్రెస్‌ ‌సహించ లేకపోతోంది. పైగా, వివిధ అంశాలపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం మరొక ముఖ్య విషయం.

కేంద్రం తీసుకురానున్న ఢిల్లీ ఆర్డినెన్స్ ‌విషయంలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చేందుకు నిన్న మొన్నటివరకూ అనాసక్తి చూపించిన కాంగ్రెస్‌ ‌పార్టీ, బెంగళూరులో బలప్రదర్శన కోసం సరే అనేసింది. కానీ, ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్‌ ‌నాయకుల మండి పాటును పరిగణనలోకి తీసుకోలేదు. రేపు ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌నాయకులు పార్టీ కోసం పని చేయకపోతే ఎవరికి నష్టం? ప్రధాని కానక్కర్లేదు కానీ చరిత్ర కలిగిన పురాతన పార్టీగా మర్యాద దక్కించుకోగలిగి నన్ని సీట్లు అయినా గెలుచుకోవాలి కదా? లేదా ప్రధాని మోదీ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌ ‌నినా దానికి సహకరించాలనుకుంటున్నారా? ఒక్క ఢిల్లీలోనే కాదు, ఇప్పుడు ఐ.ఎన్‌.‌డి.ఎ.ఐ. కూటమిలో చేయి చేయి కలిపి, ఫోటోలకు పోజులిచ్చిన పార్టీలన్నీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించు కుంటాయా అన్నది కూడా వేచి చూడవలసిన విషయమే. సమావేశం పూర్తి అయ్యి, మీడియాకు విషయం అర్థం అయ్యి వార్తలను ముద్రించేసరికే, వామపక్ష నాయకురాలు బృందా కరాత్‌ ‌బెంగాల్‌లో తాము మమతకు సహకరించ బోమని ప్రకటించేసి, కూటమిలో డొల్లతనాన్ని బయటపెట్టేశారు. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో కూడా జరుగబోయేది అదే అన్నది వాస్తవం.

ప్రతిపక్షాలన్నీ ఏకస్వరంతో, ఉమ్మడిగా చేసిన ఆరోపణ మాత్రం, ఈడీ, సీబీఐలను కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో పెట్టుకుని తమపై ప్రయోగిస్తున్నా రన్నదే. యూపీఏ కాలంలోనే స్పెక్ట్రం అవినీతి వ్యవహారం, డీఎంకె నాయకుల అరెస్టులు జరిగిన విషయాన్ని వారు మర్చిపోవడం రాజకీయ అవకాశ వాదం కాక మరేమిటి? ప్రస్తుతం ఈ కూటమిలో ఉన్న పార్టీలలో అవినీతి ఆరోపణలను ఎదుర్కోని పార్టీ ఏది? మా అంత క్లీన్‌ ‌పార్టీ ఏదీ లేదని, అవినీతి చెత్తను ఎత్తి పోస్తామని, చీపురే గుర్తుగా వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా ప్రతి ఒక్కరి పై ఇప్పుడు అవినీతి కేసులు నడుస్తున్నాయి. పుట్టలోంచి చీమలు బయటకు వచ్చినట్టు రాష్ట్రాలలో పలువురి నాయకుల అవినీతి వ్యవహారాలు బయిటపడుతున్నాయి. స్వయంగా కాంగ్రెస్‌ అధినేతలైన గాంధీ కుటుంబమే బెయిల్‌పై స్వేచ్ఛను అరువుగా తెచ్చుకుని తిరుగుతున్నది. ఆర్జేడీ, డీఎంకే, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఉద్ధవ్‌ ‌వర్గపు శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ సహా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన, వెలుగుతున్న పార్టీలన్నీ కూడా అవినీతి వ్యవహారా లలో సీబీఐ లేదా ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాయి.

ఈ పార్టీలన్నీ కొత్త గొడుగు కింద, కొత్త పేరుతో అవతరించిన 24 గంటలు పూర్తి కాకుండానే, ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ.(ఇండియా) పేరును తమ స్వప్రయో జనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని, ఎన్నికలలో అనుచిత ప్రయోజనాలు పొందడం కోసమే ఈ పేరు పెట్టారంటూ ఢిల్లీలోని బారాఖంబా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడం విశేషం. కాంగ్రెస్‌, ‌టీ•ఎంసీ, డీఎంకె. ఆప్‌, ఆర్జేడీ, జేడీయూ, ఎన్‌సీ, ఎన్‌సీపీ, పీడీపీ, సీపీఎం, సీపీ•ఐ, ఆర్‌ఎస్‌పీ, ఎస్పీ, ఆర్‌ఎల్డీ, అప్నాదళ్‌, ‌ఫార్వార్డ్ ‌బ్లాక్‌, ఎం‌డీఎం•కే, ఆర్‌ఎస్‌పీ•, కేరళ కాంగ్రెస్‌ ‌సహా పలు పార్టీలపై పోలీసు కేసు నమోదు అయింది. ఈ పార్టీలన్నీ ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడడం, తమను తాము ఇండియా పౌరులుగా భావించే ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని కేసు నమోదు చేసిన ఫిర్యాదుదారు అందులో పేర్కొన్నారు. ఎంబ్లమ్స్ అం‌డ్‌ ‌నేమ్స్ (‌ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇం‌ప్రాపర్‌ ‌యూజ్‌) ‌యాక్ట్, 1950‌లోని కొన్ని ప్రకరణల కింద కేసును నమోదు చేస్తూ, ఇండియా అన్న పేరును ఈ విధంగా ఎవరైనా ఉపయోగించడం నిషిద్ధమేనని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. ఇటువంటి బాలారిష్టాలన్నీ ఈ పార్టీలు కలిసికట్టుగా, ఐక్యతతో దాటి ప్రజల ముందుకు వస్తే వారి పట్ల కొంత విశ్వసనీయత ఏర్పడుతుంది. కానీ, మోదీ హైతో ముష్కిల్‌ ‌హై (మోదీ ఉంటే కష్టం) అన్న భావనతో వీరు పోరాడితే మాత్రం మిగిలేది ఏమీ ఉండదు. ఇప్పటికే ఈ కూటమి గురించి రాజకీయ విశ్లేషకులు పాత చింతకాయ పచ్చడే అంటూ పెదవి విరిచేస్తున్నారు. పైగా, కొందరు ఇండియా అన్న పేరును ఎంచుకోవడాన్ని కూడా సమర్ధించడం లేదు. ముఖ్యంగా, కాంగ్రెస్‌ను సమర్ధించేవారు కూడా ఆ భావనకు రావడానికి కారణం లేకపోలేదు. ఒకవేళ ఇండియా పేరుతో ఈ కూటమి ఎన్నికలకు వెడితే, బీజేపీ కూటమి భారత్‌ ‌పేరుతో వస్తే, జాతీయ భావనతో ఉన్న ప్రజలు భారత్‌ను సమర్ధిస్తారు తప్ప ఇండియాను కాదని వారి భయం. నేడు హిందూత్వ భావాలకు ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. నేను హిందువును అంటూ జంకు లేకుండా చెప్పుకుంటున్నారు. సెక్యులరిజం తమ రక్తంలోనే ఉందని, కొత్తగా దాని గురించి మాట్లాడ నక్కర్లేదని భావిస్తున్నారు. ఇటువంటి వాతావరణంలో, ప్రతిపక్షాలు ప్రజలకు సిద్ధాంత పరంగా, భావపరంగా, అభివృద్ధిపరంగా ఏం అందించబోతున్నాయి అన్నదే ప్రశ్న. ఈ భేతాళ ప్రశ్నకు ఈ విపక్ష విక్రమార్కులు సరైన సమాధానం చెప్తేనే వారికి భవిష్యత్తు ఉంటుంది.

అంతేతప్ప, విదేశాలకు వెళ్ళి మాతృదేశాన్ని తక్కువ చేసి చూపుతూ, తనకు సహాయానికి రమ్మని విదేశీయులను ఆహ్వానిస్తే ప్రజలు అంగీకరిస్తారను కోవడం కాంగ్రెస్‌ ‌పార్టీ తప్పిదమే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ని తప్పులు చేసినప్పటికీ, విదేశాలలో ఏనాడూ దేశాన్ని తక్కువ చేసి చూపలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ‌నేత, వారసుడు రాహుల్‌ ‌గాంధీకి వివరించే ప్రయత్నం విదేశాలలోనే జరిగి నప్పటికీ ఆ వ్యక్తి నోరు నొక్కి వేయడాన్ని అందరం టీవీల్లో చూశాం. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఇప్పుడు ఒక వెలుగు వెలిగిపోతోంది. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడమే కాదు, మూడవ స్థానాన్ని చేజిక్కించు కోవడానికి వేగంగా దూసుకువెళుతోంది. ఈ విషయాలను ప్రజలు గ్రహించారు, విశ్వసిస్తున్నారు, సగర్వంగా తమను తాము భారతీయులుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బయటి శక్తుల సాయంతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ ‌వంటి పార్టీలను ప్రజలు సమర్ధిస్తారా అన్నది కూడా బలమైన ప్రశ్నే.

ఇన్ని కోణాలలో తప్పటడుగులు వేస్తున్న ప్రతిపక్షాలు ఇండియా అన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజామోదం పొందగలవా? కాదనే అనిపిస్తుంది, ఇప్పటివరకూ వచ్చిన సర్వేలన్నీ కూడా మోదీ గెలుపు ఖాయమని వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి గెలుపు సమస్య కాదు, తాము కోరుకుంటు న్నట్టుగా మూడు వందలకు పైగా స్థానాలను సాధించడం. ప్రతిపక్షాలు భారీ కూటమిగా ఏర్పడి నట్టు సంకేతాలిస్తూ పెద్ద సభను ఏర్పాటు చేసుకున్న రోజే విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఎన్డీయే కూటమి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

————–

‘ప్రతికూలతతో విజయం సాధ్యం కాదు’

జూలై 18న జరిగిన ఈ ఎన్డీయే సమావేశానికి 38 పార్టీల నాయకులు హాజరై, కూటమిని బలోపేతం చేయడం పట్ల తమకు గల నిబద్ధతను ప్రకటిం చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కూటమిలోని భాగస్వాములు అవిశ్రాంతంగా చేస్తున్న కృషి వల్ల 2024 ఎన్నికలలో ఎన్డీయే ఓట్ల వాటా 50 శాతానికి పైగా ఉంటుందని అంచనా వేశారు. ఎన్డీయే అంటే ఎన్‌ – ‌న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌మెంట్‌, ఎ అం‌టే ఆస్పిరేషన్‌ (ఆకాంక్ష) అంటూ ప్రధాని అర్థం చెప్పారు. ప్రతికూలతా భావాలతో ఏర్పడే కూటములు ఎప్పుడూ విజయాన్ని సాధించలేవని ప్రధాని ప్రతిపక్ష పార్టీలను పరోక్షంగా ఎద్దేవా చేశారు. అయితే, ఎక్కడా ఆల్‌ ఈజ్‌ ‌వెల్‌ అన్నది నూటికి నూరు శాతం వాస్తవ రూపం దాల్చదన్నది నిజం. ఎన్డీయే కూటమిలో కూడా అసంతృప్తులు లేకపోలేదు. కొన్ని సందర్భాలలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందన కూడా ఆలశ్యంగా రావడం హిందూ ఓటర్లలో అసంతృప్తిని రేపుతోం దన్నదీ వాస్తవమే.

అనేక సున్నిత విషయాలలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంటే ఓటరు మాత్రం సినిమాల్లో హీరోలా మోదీ, షాలు ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. కానీ, గత రెండు ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మానిఫెస్టోలో ప్రకటించిన దాదాపు ప్రతి అంశాన్ని నెరవేరుస్తూ వస్తోంది. అది ఆర్టికల్‌ 370 ‌రద్దు కావచ్చు, రామమందిర నిర్మాణం కావచ్చు… మోదీ హైతో ముమ్‌కిన్‌ ‌హై అన్న మాటలను నిజం చేస్తోంది. ఈసారి ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు మద్దతు ఉండటం సహజమే కదా?

– డి. ఆరుణ

About Author

By editor

Twitter
YOUTUBE