– డాక్టర్ హెచ్ ఆర్ నాగేంద్ర
యోగా అనేది తేలికైన, సమర్థవంతమైన, ఎలాంటి ఖర్చులేని, సురక్షితమైన ఆరోగ్య రక్షణ పక్రియ. ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గిపోయిన ఈ కాలంలో, యోగ సానుకూల మార్పులను తీసుకొచ్చింది. అంతేకాక, యోగాభ్యాసం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పుష్కలంగా అందుతాయని శాస్త్రీయంగా కూడా రుజువైంది. కండరాల బలాన్ని పెంచడం నుంచి, మన శరీరాన్ని మనకు అనువైనదిగా మార్చుకోవడం, శ్వాసకోశ వ్యవస్థను మెరుగు పరచుకోవడం, హృదయనాళ పనితీరు, దురలవాట్ల నుంచి, ఒత్తిడి, ఆందోళన, కుంగిపోవడం, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవడం, నిద్రవేళలు మెరుగు పరచుకోవడం వరకు మొత్తం మీద ఒక వ్యక్తి శ్రేయస్సుకు యోగ దోహదం చేస్తోంది. ఆరోగ్య సమస్యల విషయంలో యోగ సామర్థ్యం నిరూపితం కావడంతో, పుట్టిన స్థలం భారత్‌ను మించి ఇది విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. నేషనల్ సెంటర్ ఫర్ కంప్లిమెంటరీ, ఇంటిగ్రేటివ్ హెల్త్ (ఎన్ సిసిఐహెచ్) ప్రకారం, 1.3 కోట్ల మందికి పైగా వృద్ధులు సాధన చేసే పరిపూరకమైన చికిత్స విధానంగా యోగ అత్యంత ప్రజాదరణ పొందింది.
ఐక్యరాజ్య సమితి (యూఎన్) 69వ సర్వసభ్య సభలో డిసెంబర్ 11, 2014న యోగ అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు పొందింది. అదే సమయంలో, యోగాభ్యాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన తెచ్చేందుకు జూన్ 21ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా (ఐవైడి) యుఎన్ ప్రకటించింది. ఐవైడి ప్రారంభం కావడం భారత మృదుస్వభావానికి కలిగిన గుర్తింపుల్లో ఒకటి. ఐవైడి ప్రారంభానికి ముందు కూడా యోగకు ప్రాచుర్యం ఉన్నప్పటికీ, ఐవైడి వార్షికోత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడంతో యోగకు ప్రజాదరణ మరింత పెరిగింది. యోగకు గణనీయమైన సహకారాన్ని అందించే పలు శాస్త్రీయత సదస్సులు, కాన్ఫరెన్సులు ఈ వార్షికోత్సవాలలో నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి యోగ దినోత్సవాన్ని ప్రకటించడం ప్రాచీన భారతదేశ విశిష్టతకు ఇచ్చిన గుర్తింపు.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో యోగను ప్రోత్స హించడం కోసం అన్ని యోగ సంస్థలు పలు కార్యక్రమాలను చేపట్టాలని ఐవైడి రెండో వార్షిక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇది స్థానిక పరిపాలన విభాగాలు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు దోహదం చేసింది. నియంత్రిత మధుమేహ భారత అభియాన్‌గా పిలిచే దేశవ్యాప్త ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా, విజయవంతంగా అమలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యమైన ఆశయం. యోగ ఆధారిత జీవన శైలి ద్వారా భారతదేశంలో మధుమేహ ప్రాబల్యం పెరగకుండా నిలిపివేయొచ్చని శాస్త్రీయ ఆధారాలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. బహుళ కేంద్రాల్లో క్లినికల్ ప్రయోగాలు చేయడం ద్వారా, 4 వేల మంది వ్యక్తులు యోగను నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా మూడు నెలల్లో 64 శాతం వరకు మధుమేహ ప్రమాదాన్ని తగ్గించుకున్నారని నిరూపితమైంది. అదే ఏడాది దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో, భారత జనాభాలో 92.6 శాతం మంది జీవన విధానాల మార్పులలో యోగ ఒక ఉపయోగకరమైన విధానంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
యోగపై ఉన్న సానుకూల దృక్పథాన్ని ఇది మరింత పెంచింది. భారతదేశ జనాభాలో యోగపై అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగదినోత్సవంతో ముడిపడి ఉంది.
యోగాభ్యాసంలో దాగి ఉన్న ప్రేరణాత్మక అంశాలను వెలికితీయడం కోసం విస్తృతమైన సర్వేలు జరిగాయి. సంక్షేమం, ఆరోగ్యం, దృఢత్వం, ఆరోగ్య పరిస్థితులు, రోగ నిరోధకత, శరీరంలో శక్తిని పెంచుకోవడం వంటివి వీటిలో అత్యంత సాధారణమైన ఉదాహరణలుగా ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపించడం వలన, 2015 తర్వాత పశ్చిమ దేశాల్లో యోగ ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో యోగ బాగా ప్రాచుర్యం పొందింది. మేము యోగకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడ కొన్ని ఉదాహరణలను ప్రస్తావించాం. భవిష్యత్ ప్రపంచానికి యువత అత్యంత ముఖ్యమైన శక్తి. 2018 ఏడాదిలో, అత్యంత ప్రతిష్టాత్మకమైన జర్నల్స్‌లో ఒకటైన లాన్సెట్ నివేదిక యువత విద్య (జ్ఞానం, విద్యా విషయక సాధన, మానసిక, సామాజిక, శారీరక చర్యలు మొదలైనవి) లో యోగ ప్రయోజకరమైన ప్రభావాలను వివరించింది. 2019 నుంచి అమెరికాలో వృద్ధులు సాధన చేసే అత్యంత ప్రాధాన్యత పొందిన ఆరోగ్య విధానంగా యోగ ఉన్నట్టు గోథే, సహ ఉద్యోగులు చెప్పారు. అమెరికాలో అంతకుముందు నిర్వహించిన జాతీయ ఆరోగ్య సర్వేకు ఈ నివేదిక మరింత మద్దతు ఇచ్చింది. ఈ జాతీయ ఆరోగ్య సర్వే అమెరికాలో 2012లో 3.1 కోట్ల మంది పెద్దలు లేదా 13.2 శాతం జనాభా జీవిత కాల ప్రాబల్యాన్ని పేర్కొంది. యూకెలో ఇటీవల 2434 మంది యోగాభ్యాసకులపై చేపట్టిన సర్వేలో, వారి ఆరోగ్య పరిస్థితులకు, సంక్షేమానికి, మధుమేహానికి స్వతహాగానే సంరక్షణ తీసుకునేందుకు, ఖరీదైన ఆరోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు యోగ అనేది మద్దతుగా నిలుస్తోందని తెలిసింది. 2018లో యోగాథెరపీ క్లినికల్ ట్రయల్స్ సంఖ్య జర్మనీ దేశంలో పెరుగుతున్నట్టు ఆ దేశానికి చెందిన డాక్టర్ హోల్గర్ క్రామెర్ చెప్పారు. జర్మన్ ఆరోగ్య విధానాల్లో ఎంపిక చేసిన వైద్య పరిస్థితులకు యోగ చికిత్సను అనుబంధ చికిత్సా విధానంగా అవలంభిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. 2017లో ఆస్ట్రేలియా మహిళలపై పెద్ద ఎత్తున సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ఆస్ట్రేలియా మహిళలలో (శారీరకంగా ఎక్కువగా కార్యకలాపాలు చేపట్టే వారు, శాకాహారుల జీవన విధానం లేదా శాకాహారం తినేవారు) యోగ/ధ్యాన విధానాలకు, సానుకూలమైన ఆరోగ్య ప్రవర్తనలకు మధ్యనున్న సంబంధాలను నివేదించింది.
ఐవైడి సూచనలను తీసుకొంటే, మానసిక సమస్యలను పరిష్కరించడంలో యోగ ప్రయోజన కరంగా ఉన్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. కొవిడ్-19కి సంబంధించిన మానసిక ఆరోగ్య సమస్యలను యోగ అధిగమిస్తున్నట్టు భారత్, యుకె, నైజీరియా, ఇటలీ, బ్రెజిల్, టర్కీ, న్యూజీలాండ్ శాస్త్రవేత్తల బృందం ఆమోదించింది. SARS-CoV-2 సంక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు లేదా దీనికి చికిత్స అందించేందుకు ధ్యానం, యోగాసన (భంగిమ), ప్రాణాయామ (శ్వాస) విధానాలు సమర్థవంతమైన అనుబంద చికిత్స విధానాలుగా ఉన్నట్టు కాలిఫోర్నియా శాన్ డియాగోకు చెందిన మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్-19 లాక్ డౌన్ విధించిన సమయంలో, యోగాభ్యాసం వల్ల కలిగిన ప్రయోజనాలపై పలు శాస్త్రీయాత్మక నివేదికలు రూపంలో ఉన్నాయి. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఒత్తిడిని, ఆందోళనను, కుంగుబాటును అధిగమించేందుకు, శ్రేయస్సు కోసం యోగ అనేది అత్యంత సమర్థవంతమైన విధానంగా ఉన్నట్టు భారతీయ రచయితలు పూజ ఎస్, సహ ఉద్యోగులు చెప్పారు.
2020 ఏడాదికి చెందిన అంతర్జాతీయ యోగ దినోత్సవాలను పాఠకుల ముందుకు మేము తీసుకురావాలనుకుంటున్నాం. కొవిడ్- 19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా విధించిన కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు, సామాజిక దూరం పాటించడం వంటి వాటితో పాటు యోగ స్టూడియోలు, ఇతర ప్రదేశాలు మూతపడటంతో, 6వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఆన్‌లైన్ ద్వారా విజయవంతంగా నిర్వహించారు.
డాక్టర్ నాగేంద్ర బెంగళూరు ఎస్-వ్యాస విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్. పద్మశ్రీ పురస్కార గ్రహీత. 2015లో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ముందుండి నడిపించిన వ్యక్తులలో ఒకరు.
– ‘న్యూ ఇండియా సమాచార్’ నుంచి