జూన్‌ 21 అం‌తర్జాతీయ యోగా దినోత్సవం

యహుది మెనుహిన్‌, ‌క్లిఫర్డ్ ‌కర్జన్‌, ‌జిడ్డు కృష్ణమూర్తి, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌వంటి ప్రముఖులకు ఆయన యోగా బోధించారు. దేశ విదేశాలనుంచి అందిన విరాళాల సహాయంతో పూనాలో అత్యాధునిక యోగా ఫౌండేషన్‌ను  బి.కె.ఎస్‌. అయ్యంగార్‌ ‌దివంగత సతీమణి రామామణి పేరిట నెలకొల్పారు.  ప్రస్తుతం ఈ యోగా ఫౌండేషన్‌ ‌ప్రపంచ వ్యాప్తంగా యోగాభ్యాసకులను పెద్దఎత్తున ఆకర్షిస్తోంది. అయ్యంగార్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ..

మీలో యోగా పట్ల ఎప్పటినుంచి ఆసక్తి పెరిగింది?

టీనేజ్‌ ‌వయసులో నేను చాలా బలహీనంగా ఉండేవాడిని. ఛాతీ 20సెంటీమీటర్లు, లావైన తల కలిగి కేవలం 32 కిలోల బరువుతో ఒక క్షయ రోగిమాదిరిగా కుటుంబానికి భారంగా ఉండేవాడిని. నా పరిస్థితి నన్ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసింది. ఆ స్థితిలో నేను బెంగళూరునుంచి బయలుదేరి మైసూరులో ఉన్న మా బావగారు శ్రీ కృష్ణమాచార్య వద్దకు వెళ్లాను. అప్పట్లో ఆయన మైసూరు మహారాజు పోషకత్వంలో నిర్వహిస్తున్న ఒక యోగశాలకు అధిపతిగా ఉండేవారు. అక్కడ నేను మా బావగారి మార్గదర్శకత్వంలో యోగాసనాలు నేర్చుకున్నా.

మీ భౌతిక శరీర స్థితిలో మార్పునకు యోగా ఎంతమేర సహాయపడింది?

నిజం చెప్పాలంటే అదొక సుదీర్ఘ పోరాటం. నాకు యోగామీద పెద్దగా నమ్మకం ఉండేదికాదు. అయితే నేను యోగాభ్యాసం చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. యోగా టీచర్‌గా కెరీర్‌ ‌ప్రారంభిస్తే కొద్దోగొప్పో ఆర్థికంగా వెసులుబా టుంటుందనేది మొదటి కారణం. ఇందుకు నా భౌతిక శరీరం సహకరించాలి కదా. అందుకు దాన్ని మెరుగుపరచుకోవడం రెండో కారణం. చివరకు నా ప్రయత్నం ఫలించి యోగాభ్యాసం వల్ల నా శరీరం  క్రమంగా మామూలు స్థితికి చేరుకుంది.

మీరు మీ కార్యకలాపాలకు పూనా నగరాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

ఇది యాదృచ్ఛికంగా జరిగింది. 1936లో నేను, మా గురువుగారు బెల్గామ్‌లో యోగా ప్రదర్శన ఇస్తున్నాం. ఎం.కె. గోఖలే అనే ఒక సివిల్‌ ‌సర్జన్‌ ‌మా ప్రదర్శనచూసి ముగ్ధుడయ్యారు. అప్పుడాయన మమ్మల్ని కలిసి, పూనా కళాశాలకు చెందిన విద్యార్థులకు దక్కన్‌ ‌జిమ్‌ఖానాలో యోగాభ్యాసాన్ని నేర్పించాలని కోరారు. ఇందుకోసం మొదటగా ఆరునెలల కాంట్రాక్టు కుదిరింది. క్రమంగా దీన్ని మూడేళ్ల వరకు పొడిగించారు. ఆ తర్వాత నేను నా సొంతంగా యోగాను బోధించడం మొదలుపెట్టా.

ఇతర రకాల భౌతిక వ్యాయామాల కంటే యోగా ఎందుకు ఉన్నతమైంది?

ముఖ్యంగా ఇది మొత్తం శరీరానికి సంబంధించింది. యోగా అంటే సర్వాంగసాధన. శరీరంలోని కండరాలు, ఎముకలు, గ్రంధులు, నాడీవ్యవస్థ, రక్తప్రసరణ మరియు శ్వాసవ్యవస్థలను ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. మిగతా వ్యాయామాలు కేవలం భౌతిక అభివృద్ధికి మాత్రమే ఉపకరిస్తాయి. ఉదాహరణకు బరువులెత్తడం (వెయిట్‌ ‌లిఫ్టింగ్‌) ‌కేవలం కండరాల అభివృద్ధికి మాత్రమే సహాయపడుతుంది.

భారతీయులకంటే పశ్చిమదేశాలవారు యోగా పట్ల ఆసక్తి ప్రదర్శించడానికి ప్రధాన కారణం?

యోగుల పట్ల మనదేశంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉండటమే. ముఖ్యంగా యోగులంటే సర్వసంగ పరిత్యాగులని (సన్యాసులని) కొండ గుహల్లో లేదా నదీ తీరాల్లో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారన్న భావన మనదేశవాసుల మనసుల్లో బలీయంగా నాటుకుపోయింది. నిజానికి యోగా అంటే లంపటాలనుంచి బయట పడేసే మార్గం కాదు. యోగా నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలపై పోరాడే సామర్థ్యాన్ని మీలో కలుగజేస్తుంది. అయితే పశ్చిమదేశాల్లో యోగాపట్ల తప్పుడు అభిప్రాయాలు లేవని కాదు. ఒకసారి లండన్‌లో కస్టమ్స్ అధికార్లు నన్ను, ‘మీరు పౌండ్స్‌ను మింగేయగలరా? నిప్పులపై నడవగలరా?’ అంటూ ప్రశ్నించడమే ఇందుకు  ఉదాహరణ. ఇప్పుడిప్పుడే వారిలో యోగాపట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా జీవనశైలిలో కలిగే ఒత్తిడిని ఎదుర్కొనే సాధనంగా వారు గుర్తిస్తున్నారు.

ఆధునిక జీవనం వల్ల కలిగే ఒత్తిళ్లకు యోగా సమాధానమా?

తప్పకుండా ఇది సమాధానమే. మనోశరీరాలను ఏవిధమైన అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంచేందుకు, శవాసనం వంటి వివిధ రకాల యోగాసనాలు ఉపయోగపడతాయి. హృద్రోగులకు డాక్టర్లు ఇప్పుడు శవాసనాన్ని సూచించడం మొదలు పెట్టడం నిజంగా నాకు ఆనందాన్ని కలిగించింది.

అన్ని రకాల వైద్యవిధానాలు విఫలమైన దశలో, చిట్టచివరి యత్నంగా మీవద్దకు ఆయా రోగులు వస్తున్నారా?

అటువంటి రోగులు చాలా కొద్దిమంది నా దగ్గరకు వచ్చారు. భౌతికంగా, మానసికంగా దెబ్బతిని అన్నిరకాలుగా నిష్ఫలమైన దశలో వారు వచ్చిన మాట నిజం. ఇటువంటి స్థితిలో వచ్చిన రోగుల్లో ముందుగా ఆత్మవిశ్వాసాన్ని నింపడం చాలా ముఖ్యం. తద్వారా వారు తమ సమస్యలను ఎదుర్కొనే  సామర్థ్యాన్ని పొందుతారు.

మద్యాన్ని, మాంసాహారాన్ని మానివేసి శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవా లని విద్యార్థులకు మీరు నిర్దేశిస్తారా?

నేనెప్పుడూ అలా చెప్పలేదు. కానీ వారికై వారే శాఖాహారులుగా మారిపోతుంటారు.

కొంతమంది తమ గుండె కొట్టుకోవడాన్ని ఆపేస్తారు. కొంతమంది తమకు తామే తమ గుండె గదులను మూసివేస్తారు. అటువంటి ప్రయోగాల్లో ఉన్న అంతరార్థం ఏమిటి?

ఇది ‘యోగ’ కాదు! ఈ శాస్త్రానికి ఇది చెడ్డపేరు తెస్తుంది. ఇటువంటి ట్రిక్కులు కేవలం అమాయకులైన ప్రజలను మోసం చేయడానికి తప్ప మరోటి కాదు. కొంతమంది బాబాలు, స్వాములు తమ వెంట్రుకలనుంచి బూడిదను సృష్టించడం వంటిదే తప్ప ఇది మరోటికాదు. ముంబయిలో నీటిపై నడక ప్రయోగ ఫలితం ఏమైందో మీకు బాగా తెలుసు. ఇక్కడ నా లక్ష్యం ఒక్కటే. ఒక సాధారణ మనిషిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా రూపొందేలా చేయడం.

మత్తుమందులకు బానిసైనవారు మీ విద్యార్థుల్లో ఉన్నారా?

అటువంటివారి సంఖ్య చాలా స్వల్పం. యోగ మిమ్మల్ని ఎంతటి ప్రశాంత స్థితికి తీసుకెళుతుందంటే, ఆ దశలో ఇక ఎల్‌ఎస్‌డి అవసరమే ఉండదు. దీనికి సంబంధించి ఇంగ్లండ్‌లో యోగాను బోధిస్తున్న నా విద్యార్థి కుమారి అంజెలా ఫార్మర్‌ అనుభవాన్ని మనం పరిశీలించాలి. ఆమె ఇంగ్లండ్‌లోని ఒక స్కూల్‌లో విద్యార్థులకు యోగా పాఠాలను బోధించేది. పాఠశాల యాజమాన్యం ఆమెకు కొంతమంది మత్తుమందులకు అలవాటుపడిన విద్యార్థులను బాగుచేసే బాధ్యత అప్పగించింది. ఆవిషయంలో ఆమె విజయం సాధించింది. అయితే స్కూలు యాజమాన్యంతో కాంట్రాక్టు విషయంలో విభేదాలు రావడంతో ఆమెను ఉద్యోగంనుంచి తొలగించారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఆయా విద్యార్థులు మత్తుమందులు తీసుకోవడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన యాజమాన్యం, మళ్లీ ఆమెను ఉద్యోగం లోకి తీసుకుని, ఆయా విద్యార్థుల బాధ్యతలను అప్పగించింది.

యోగా ఫౌండేషన్‌ ‌ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?

ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడకు వచ్చి యోగాను నేర్చుకుంటున్నారు. ఆసక్తి కనబరచిన వారికి యోగాను ఎలా బోధించాలో కూడా నేర్పిస్తు న్నాం. యోగశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేయడమే నా లక్ష్యం.

రాజకీయనాయకులు యోగాభ్యాసం చేయడం వల్ల మనదేశానికి ప్రయోజనం చేకూరుతుందా?

కేవలం రాజకీయవేత్తలు మాత్రమేనా? ప్రపంచం మొత్తం ఉన్నతంగా రూపొందుతుంది. యోగా అంటే శాంతి మరియు ప్రసన్నతను కలిగించేదని గుర్తించాలి.

– ‘ది ఇలస్ట్రేటెడ్‌ ‌వీక్లీ’

మే 25, 1975 నుంచి

అను: విఠల్‌ ‌రావు

About Author

By editor

Twitter
YOUTUBE