నీ జీవితం నీదై ఉండాలి. లేదా దేశానికి అంకితం కావాలి. ఉద్యమానికి ఊపిరైనా కావాలి. అంతేకానీ ఎవరి జీవితమూ జైలు గోడలకు బలైపోకూడదు. ఎందుకు? పరాయి పాలకులు కట్టిన ఏ జైలైనా దేశ స్వాతంత్య్ర కాంక్షకే కాదు, జాతి భవిష్యత్తుకు కూడా ముందే కట్టేసిన సమాధి. అందుకే ఆనాటి జైళ్లలో ఉండిపోవడం త్యాగమని కొందరనుకుంటే, ఆ త్యాగం దేశాన్ని విముక్తం చేయలేదని ఇంకొందరనుకున్నారు.శిక్షాకాలం పెరగడమంటే, ఆజన్మ ఖైదీగా ఉండిపోవడమంటే నీ జాతిని నువ్వే ఇంకొన్ని దశబ్దాల పాటు చీకటికి అప్పగించ•డమే. పరాయిపాలనతో అలుముకున్న చీకటి జైలు గదిలో నల్లగా ఉంటే, బాహ్య ప్రపంచంలో తెల్లగా ఉంటుంది. అదే తేడా. ఇది గమనించినవాడు ఉద్యమకారుడి నుంచి దేశభక్తి తత్త్వం తెలిసిన వాడౌతాడు. సిద్ధాంతం, పథం కంటే దేశ విముక్తికి పెద్దపీట వేస్తాడు. అణచివేత యుగంలో నుదుటి రాతకూ, మనసుకూ బందీలు కాకుండా జైలును వీడాలనుకోవడం గొప్ప పరిణతి. జైలులో మగ్గిపోవడం కాదు, బాహ్య ప్రపంచంలోకి వెళ్లి మరొక పోరాటం చేయాలనుకున్నవారు మన దేశ చరిత్రలో కొందరు ఉన్నారు. స్వాతంత్య్ర వీర సావర్కర్‌ అం‌దులో అగ్రగణ్యులు. ఆయన క్షమాభిక్ష కోరడం కొత్త ఉద్యమ సూర్యోదయాలను దర్శించడానికే తప్ప, స్వాతంత్య్ర కాంక్ష సడలిపోవడం వల్ల కాదు. సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరాడన్న నీచమైన ఆరోపణతో చరిత్రపుటల నుంచి విసిరేయాలని చూడడం భారతదేశ చరిత్ర రచనలోనే అతి పెద్ద దగా.

ఇంతకీ క్షమాభిక్ష కోరినది సావర్కర్‌ ఒక్కరేనా? కాదే! అటు చరిత్రలో, ఇటు వర్తమానంలో సావర్కర్‌ ‌స్థానానికి ఇంత పతనావస్థ కలిగించిన జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ కూడా క్షమాభిక్ష కోరారు. రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌, ‌సచీంద్ర సన్యాల్‌ ‌కూడా క్షమాభిక్ష కోసం వినతిపత్రాలు ఇచ్చినవారే. ఇంకా ఎందరో వలస ప్రభుత్వం కల్పించిన ఈ చట్టబద్ధమైన హక్కును వినియోగించుకోవాలని అనుకున్నారు. కొందరు అనుకోలేదు. వినియోగించుకోవాలని అనుకున్నవారు మళ్లీ బయటకు వచ్చి సమరం చేయాలనే మనసా వాచా కోరుకున్నారన్నది నిజం. చేశారు కూడా. సావర్కర్‌ ‌పేరు ఎత్తితేనే ఆధునిక భారతదేశ సామరస్యానికి ముప్పు అని తెగ వాగే వామపక్ష మేధావులు దాచిన వాస్తవం ఒకటి ఉంది. అది ఆ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు శ్రీపద్‌ అమృత్‌ ‌డాంగే నాలుగు పర్యాయాలు క్షమాభిక్ష కోసం దరఖాస్తులు పంపారు. సావర్కర్‌ ‌పదేళ్లలో ఐదు పర్యాయాలు క్షమాభిక్ష కోరితే, డాంగే ఒకే సంవత్సరంలో నాలుగుసార్లు క్షమాభిక్షకు వినతిపత్రాలు దాఖలు చేశారు. సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరడం ముమ్మాటికీ సబబు. ఎంత హింస! ఎంత నరకం! అయినా అఫ్జల్‌ ‌గురుకు, అజ్మల్‌ ‌కసబ్‌కు, నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్షను ఖండించిన వర్గం సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరితే తప్పుపట్టడం నీచాతి నీచమైన ద్రోహం. ఒక రాజకీయ కార్యకర్తకు, ఉద్యమకారుడికి యాభయ్‌ ఏళ్లు శిక్ష విధించినది ఒక వలస ప్రభుత్వమన్న స్పృహ ఎందుకు రావడం లేదు. ఆ వలస ప్రభుత్వం జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతాన్ని రుచి చూపించినది కూడా. అండమాన్‌ ‌జైలుకీ, ఆగాఖాన్‌ ‌భవనానికీ (తాత్కాలిక జైలు) హస్తిమశకాంతరం ఉంటుంది. సావర్కర్‌ ‌తదితరులు అనుభవించినది నిజమైన జైలు జీవితం. మిగిలినవారిది ఏకాంతవాసం. సావర్కర్‌ను క్షమాభిక్షల బోనులో నిలబెట్టే వారు ఎంత నీచులో, అందులోని రాజకీయం ఎంత దారుణమో చెప్పడానికే ఇక్కడ అందుకు సంబంధించిన కొన్ని చారిత్రక సత్యాలు ఇస్తున్నాం. కమ్యూనిస్టు నేత డాంగే సహా ఎవరినీ ఈ పేరుతో అవమానించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. క్షమాభిక్ష కోరడం తిరోగమనం కాదు, ఒక వ్యూహం అని చెప్పడానికే. కేవలం హిందుత్వ నినాదం ఇచ్చినందుకే సావర్కర్‌ ‌స్వాతంత్య్రోద్యమ చరిత్రను విస్మరించడం దగా అని గుర్తుచేయడానికే.

×××××

నాభా జైలులో నెహ్రూ రాజీ

‘నీవు స్వేచ్ఛా ప్రపంచంలో ఉంటే నేను ఎంత సంతోషిస్తానో, కారాగారంలో ఉన్నా కూడా అంతే సంతోషిస్తాను’ సెప్టెంబర్‌ 28, 1923‌న మోతీలాల్‌ ‌నెహ్రూ తన కుమారుడు జవాహర్‌లాల్‌ ‌నెహ్రూకు రాసిన లేఖలోని చివరి వాక్యాలివి. నాభా జైలులో దుర్భర పరిస్థితుల మధ్య జవాహర్‌లాల్‌ ‌నెహ్రూను చూసినా ఆయన ఈ మాట రాశారు. అయినా ఎవరినీ సాయం అడగడానికి ఆయన ఇష్టపడలేదు.స్వాతంత్య్ర సమరయోధుడు, ఢిల్లీ జేఎన్‌యూ మాజీ ఆచార్యుడు ప్రొఫెసర్‌ ‌చమన్‌లాల్‌ ‌చెప్పిన మాటలవి. జవాహర్‌ ‌లాల్‌ 125‌వ జయంతికి చమన్‌లాల్‌ ఆ ‌జైలును చూడడానికి వెళ్లారు. అక్కడ జవాహర్‌ ‌కొద్దికాలం ఉన్న సంగతిని కూడా పంజాబ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయినట్టే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూడా. పంజాబ్‌తో జవాహర్‌కు ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవడానికి ఉన్న అవకాశాన్ని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తొలి ప్రధాని ఈ జైలులో కొన్నిరోజులు ఉన్న మాట నిజమే.

పంజాబ్‌ ‌ప్రాంతంలో నాభా ఒక సంస్థానం. నాటి పాలకుడు రాజా రిపుదమన్‌ ‌సింగ్‌. ఈయన జాతీయవాది. ఆ సంస్థానంలోకి ప్రవేశించరాదంటూ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఖాతరు చేయకుండా వెళ్లినందుకు జవాహర్‌ను, కె. సంతానం, ఏటీ గిద్వానీ అనే మరో ఇద్దరు స్వాతంత్య్ర సమర యోధులను సెప్టెంబర్‌ 22, 1923‌న అరెస్టు చేసినట్టు జైలు గోడలకు ఉన్న శిలాఫలకంలో మాత్రం పేర్కొన్నారు. మొదట ఆ ముగ్గురిని అరెస్టు చేసి జైతు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సెల్‌లో కొన్ని గంటలు ఉంచి, తరువాత నాభా (పటియాలా జిల్లా) జైలుకు తీసుకుపోయారు. అక్కడ రెండువారాలు ఉంచారు. గతంలో నెహ్రూ వెళ్లిన నైనీ, గోరఖ్‌పూర్‌ ‌జైళ్ల మాదిరిగా నాభా జైలులో ఆయనకు సౌకర్యాలు దొరకలేదు. తరువాత జవాహర్‌ను విడిచిపెట్టారు. ‘ఇంకెప్పుడూ నాభా సంస్థానంలోకి ప్రవేశించను అని రాసిన బాండ్‌ ‌పత్రాల మీద సంతకాలు చేసిన తరువాత మాత్రమే జవాహర్‌ను జైలు నుంచి విడిచిపెట్టారు’ అని కూడా చమన్‌లాల్‌ ‌వెల్లడించారు. నాభా జైలులో నెహ్రూ ఉన్నందున దానినొక చారిత్రక స్థలంగా గుర్తింపు తేవడానికి బియాంత్‌ ‌సింగ్‌ అక్కడ 1992లో ఒక పిల్లల పార్కును నిర్మించారు.

జవాహర్‌తో పాటే అరెస్టయిన కె. సంతానం ‘నెహ్రూతో కలిపి సంకెళ్లు’ పేరుతో రాసిన జ్ఞాపకాలలో ఈ విషయం మరింత స్పష్టంగా ఆవిష్కరించారు. జవాహర్‌, ‌గిద్వానీ, సంతానం ముగ్గురిని కలిపి ఒకే గొలుసుతో కట్టేశారు. ఆ గొలుసును మళ్లీ ఒక పోలీసు చేతికి కట్టారు. ఏ మాత్రం సౌకర్యాలు ఉండని ఒక బ్రాంచ్‌ ‌లైన్‌ ‌రైలులో నాభా తీసుకువెళ్లారు. అక్కడ జైలులోనే ఒక రహస్య స్థలంలో ముగ్గురిని వేర్వేరుగా ఉంచారు. ఆ గది 20 × 12 అడుగులు ఉంటుంది. మట్టి నేల అట. ఆఖరికి గస్తీ తిరిగే పోలీసులను కూడా వాళ్లతో మాట్లాడడం నిషేధించారు. సంతానం 1980లో కన్నుమూశారు. ఆ మట్టి అంటే నెహ్రూకు చాలా చికాకుగా ఉండేదని కూడా ఆయన రాశారు. ఆ చికాకుతోనే ప్రతి అరగంటకు చీపురు తీసుకుని నెహ్రూ అదే పనిగా ఊడుస్తూ ఉండేవారని కూడా కె. సంతానం గుర్తు చేసుకున్నారు. ఈ కథనాన్ని నెహ్రూ తన ఆత్మకథలో కూడా నమోదు చేసుకున్నారు. కేసు మరింత బలంగా ఉండడానికి అనామకుడైన ఒక సిక్కును కూడా వీరితో పాటు కోర్టులో హాజరు పరిచారని కూడా నెహ్రూ రాసుకున్నారు. తరువాత అతడి పరిస్థితి ఏమైందో తెలియదు.

‘ది నెహ్రూస్‌: ‌మోతీలాల్‌ అం‌డ్‌ ‌జవాహర్‌లాల్‌: ‌విత్‌ ఏ ‌న్యూ ప్రిఫేస్‌’ ‌పుస్తకంలో బీఆర్‌ ‌నందా ఇచ్చిన వివరాల ప్రకారం అకాలీదళ్‌కు మద్దతుగా వారు నాభా సంస్థానంలో ప్రవేశించినందుకు రెండున్నరేళ్లు శిక్ష పడింది. కానీ ఎందుకో ఆ శిక్షను వెంటనే రద్దు చేశారు. ఈ కేసు విచారణ సమయంలోనే మోతీలాల్‌ ‌నెహ్రూ వైస్రాయ్‌ని కలవడం కూడా నిజమే.

 హిందుస్తాన్‌ ‌టైమ్స్ (‌నవంబర్‌ 15, 2014, ‌రచన: విశ్వభారతి, చండీగఢ్‌)

×××××

సావర్కర్‌ ‌క్షమా వినతి, గాంధీజీ

గాంధీజీకీ, సావర్కర్‌కీ ఒక సందర్భంలో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలలో దయాభిక్ష గురించి పరస్పర అభిప్రాయాలు పంచుకోవడం కనిపిస్తుంది. ఇందులో క్షమాభిక్ష కోరడం పిరికితనమనో, అది స్వాతంత్య్ర సమరయోధులకు భావ్యం కాదనో గాంధీజీ అభిప్రాయపడలేదు. స్వాతంత్య్ర భావన నుంచి వెనక్కి తగ్గడమని కూడా భాష్యం చెప్పలేదు. సావర్కర్‌ ‌సోదరుల (వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌, ‌గణేశ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌లు. మూడో సోదరుడు నారాయణరావు సావర్కర్‌ను గాంధీజీ హత్య నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కొట్టి చంపారు) గురించి తన ‘యంగ్‌ ఇం‌డియా’లో పేర్కొన్నారు. ఇవన్నీ గాంధీ ఆశ్రమ్‌ ‌సేవాగ్రామ్‌ ‌వారు ప్రచురించిన మహాత్మా గాంధీ సమగ్ర రచనలలో ఉన్నాయి (వాల్యూమ్‌లు 19,20).

జనవరి 18,1920న డాక్టర్‌ ‌నారాయణరావ్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌గాంధీజీకి లేఖ రాశారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న ఖైదీలలో సావర్కర్‌ ‌సోదరులను (పై ఇద్దరు గణేశ్‌ ‌సావర్కర్‌, ‌వీర్‌ ‌సావర్కర్‌) ‌కలపలేదు అంటూ నిన్న భారత ప్రభుత్వం నుంచి నాకు సమాచారం అందింది. దీనిని ఒక టెలిగ్రామ్‌ ‌ద్వారా తెలియచేశారు. రాజకీయ ఖైదీ లందరికీ క్షమాభిక్ష ఇస్తున్నప్పటికి సావర్కర్‌ ‌సోదరులను మాత్రం అందులో మినహాయించాం అన్నదే దాని సారాంశం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రాజకీయ ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే కొందరికి మాత్రం ఈ వెసులుబాటు కల్పించలేదు. ‘వారిని (సావర్కర్‌ ‌సోదరులు) విడుదల చేయరాదని ప్రభుత్వం నిశ్చయించుకున్నట్టు దీనితో రూఢి అయింది. ఇలాంటి పరిస్థితులలో నేను ఎలా ముందుకు వెళ్లాలో మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని కూడా లేఖలో డాక్టర్‌ ‌నారాయణ్‌ ‌సావర్కర్‌ ‌కోరారు. వారు (నా సోదరులు) ఇప్పటికే అండమాన్‌ ‌కారాగారంలో పదేళ్ల కఠినశిక్షను పూర్తి చేశారు. వారి ఆరోగ్యం దారుణంగా దెబ్బతిన్నది. వారు 118 నుంచి 95-100కు బరువు తగ్గిపోయారు. వారికి ఆసుపత్రిలో పెట్టే ఆహారమే ఇస్తున్నప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల ఏమీ కనిపించడం లేదు. భారతదేశంలోనే మరొక జైలుకు వారిని తరలించడం అత్యవసరం. వారిలో ఒకరి నుంచి నాకు ఇటీవలే ఒక లేఖ (ఒక నెల క్రితం) అందింది. అందులో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఈ విషయంలో ఏం చేయాలో మీరు నాకు చెబుతారని ఆశిస్తున్నాను.

వారం తరువాత లాహోర్‌ ‌నుంచి గాంధీజీ జనవరి 25,1920న ‘డియర్‌ ‌డాక్టర్‌ ‌సావర్కర్‌ అని సంబోధిస్తూ ప్రత్యుత్తరం రాశారు.

నీ ఉత్తరం అందింది. నేను సలహా ఇవ్వడం అంత సులభం కాదు. నీవు క్లుప్తంగా ఒక పిటిషన్‌ ‌పంపితే కేసులోని వాస్తవాలు బయటకు వస్తాయి. మీ సోదరులు చేసిన చర్యలన్నీ పూర్తిగా రాజకీయపరమైనవని స్పష్టమవుతుంది. దీనితోనే ఈ కేసు ప్రజల దృష్టికి వస్తుంది. ఈ విషయమే ఇంతకు ముందు రాసిన లేఖలో కూడా ఉదాహరించాను. నా పద్ధతిలో నేను కూడా ఈ విషయం కదుపుతాను అని ప్రత్యుత్తరమిచ్చారాయన. ఇందులో దయాభిక్షను గాంధీజీ తప్పు పట్టలేదని తెలుస్తుంది. అంతేకాదు, మే 26,1920 యంగ్‌ ఇం‌డియా సంచికలో గాంధీజీ సావర్కర్‌ ‌సోదరుల విడుదల గురించి గట్టిగానే వాదించారు.

డాక్టర్‌ ‌నారాయణ్‌రావు దామోదర్‌ ‌సావర్కర్‌కీ, గాంధీజీకి ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినది ఆఖరి దయాభిక్ష విన్నపం మీద అని అర్ధమవుతుంది. ఆయన మొదటిసారి 1911లో దయాభిక్ష పత్రం పంపించారు. నవంబర్‌ 14, 1913‌న హోంశాఖా వ్యవహారాల సభ్యుడు రెజినాల్డ్ ‌క్రడ్డాక్‌ అం‌డమాన్‌ ‌సెల్యులార్‌ ‌జైలుకు వచ్చినప్పుడు కూడా ఆయన మరొక విజ్ఞాపనపత్రం అందించారు. 1914, 1918,1920లలో విజ్ఞాపన పత్రాలు పంపారు. మొత్తం ఐదు పత్రాలు.

క్రడ్డాక్‌కు ఇచ్చిన పత్రంలో అండమాన్‌ ‌జైలులో ఖైదీలు అనుభవిస్తున్న యమయాతన గురించి సావర్కర్‌ ‌వివరించారు.

హిందుస్తాన్‌ ‌సోషలిస్ట్ ‌రిపబ్లికన్‌ ఆర్మీ వ్యవస్థాపకుడు సచీంద్రనాథ్‌ ‌సన్యాల్‌ ‌తన ఆత్మకథ ‘బందీజీవన్‌’‌లో సావర్కర్‌కు ఎందుకు క్షమాభిక్ష ఇవ్వలేదో స్పష్టంగానే చెప్పారు. ‘క్షమాభిక్ష కోరుతూ సావర్కర్‌ ఎలాగైతే వినతిపత్రం ఇచ్చారో, నేను కూడా ఇంచుమించు అదే తరహాలో ఇచ్చాను. కానీ నన్ను విడిచిపెట్టి, సావర్కర్‌ను ఎందుకు విడిచిపెట్టలేదు? దానికి ఉన్న కారణాలలో ఒకటి- సావర్కర్‌ ఆయన అనుచరుల అరెస్టు తరువాత మహారాష్ట్రలో విప్లవోద్యమం అణగారిపోయింది. కాబట్టి సావర్కర్‌నీ ఆయన అనుచరులనీ విడుదల చేస్తే తిరిగి విప్లవోద్యమం చెలరేగుతుందని ప్రభుత్వం భయపడింది’ అని ఆయన రాశారు. కాబట్టి సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరడం, జైలులో ఉండిపోయి జీవితాన్ని వ్యర్థం చేయడం కాకుండా, బయటకు వచ్చి తిరిగి ఉద్యమించాలన్న ఉద్దేశంతోనే అన్న ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ వాదన తప్పని వాదిస్తున్నవారు ఈ విషయం గమనించాలి. సావర్కర్‌ అం‌డమాన్‌ ‌జైలు నుంచి వచ్చిన తరువాత రత్నగిరి జిల్లాకే పరిమితమైనా అక్కడ సంస్కరణోద్యమం నిర్వహించారు.

అండమాన్‌ ‌సెల్యులార్‌ ‌కారాగారంలో ఉన్న ఖైదీలు తమ మనసులో మాట చెప్పడం, వినతిపత్రాలు సమర్పించడం ఎంతమాత్రం దోషం కాదు. అది ఒక పరాయి ప్రభుత్వం కూడా ఖైదీలకు ఇచ్చిన చట్టబద్ధమైన వెసులుబాటు. లేదా హక్కు. క్రడ్డాక్‌ అం‌డమాన్‌ ‌జైలు పరిస్థితులను పరిశీలించడానికి వచ్చినప్పుడు సావర్కర్‌ ‌మాత్రమే వినతిపత్రం సమర్పించలేదు. మరొక నలుగురు కూడా పత్రాలు ఇచ్చారు. అరవింద్‌ ‌ఘోష్‌ ‌సోదరుడు, మరొక బెంగాలీ విప్లవయోధుడు బరీంద్రకుమార్‌ ‌ఘోష్‌, ‘‌స్వరాజ్‌’ ‌పత్రిక సంపాదకుడు, ప్రయాగ్‌రాజ్‌ ‌ప్రాంతం వారు నందగోపాల్‌, ‌హృషీకేశ్‌ ‌కాన్జీలాల్‌ ‌కూడా వినతులు సమర్పించారు. నందగోపాల్‌, ‌కాన్జీలాల్‌ ‌మొత్తం ఖైదీలందరి ఇక్కట్ల గురించి తెలియచేశారు. తాను కూడా మిగిలిన ఖైదీల వలెనే యమయాతన పడుతున్నానని, తనను భారతదేశంలోని వేరే జైలుకు తరలించాలన్న ఉద్దేశమే ప్రభుత్వానికి లేకపోతే, భారతదేశంలోని జైళ్లలో ఖైదీలు అనుభవిస్తున్న సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తారని ఆశిస్తున్నాను అని నందగోపాల్‌ ‌పేర్కొన్నారు.

×××××××××

సచీంద్రనాథ్‌ ‌సన్యాల్‌ 1937‌లో మరొకసారి అరెస్టయ్యారు. 1941లో క్షమాభిక్ష కోరుతూ వినతిపత్రం సమర్పించుకున్నారు. భగత్‌సింగ్‌, ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌తదితరులంతా సచీంద్ర సన్యాల్‌ ‌స్థాపించిన సంస్థ ద్వారా పోరాటం చేశారు. సన్యాల్‌ను బనారస్‌ ‌కుట్ర కేసులో విచారించి శిక్ష వేసి అండమాన్‌కు పంపించారు.

×××××××

200 మందికి క్షమాభిక్ష

భారత జాతీయ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జెండా సత్యాగ్రహం, అందులో నాగపూర్‌ ‌సత్యాగ్రహం గురించి, ఆ సందర్భంగా జరిగిన సామూహిక క్షమాభిక్షల గురించి రాజ్‌మోహన్‌ ‌గాంధీ రాసిన ‘పటేల్‌ ‌జీవిత చరిత్ర’లో ఉదాహరించారు. జెండా సత్యాగ్రహం పేరుతో జరిగిన ఆ నిరసనలో పాల్గొన్నవారిలో న్యాయవాదులు, డబుల్‌ ‌గ్రాడ్యుయేట్లు, అధ్యాపకులు, జమిందారులు, వ్యాపారస్థులు ఉన్నారు. వీరే కాకుండా వినోబా భావే, రవిశంకర్‌ ‌మహరాజ్‌ ‌పాల్గొన్నారు. వినోబా అకోలా ప్రాంతంలో ఉన్నారు. అక్కడ అరెస్టయిన వినోబాతో మండుటెండలో రాళ్లు కొట్టించారు. రవిశంకర్‌ ‌మహరాజ్‌తో నాగపూర్‌లో రోజుకు 25 కిలోల పిండి ఆడించారు. జైలు అధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆ రోజుకు వారిని ఏకాంతవాసంలోకి పంపేవారు. ఖైదీలకు వడ్డించే పప్పు చెత్తాచెదారంతో ఉండేది. చపాతీలలో రాళ్లు వచ్చేవి. మరుగుదొడ్లకు తలుపులు కూడా ఉండేవి కావు. నాగపూర్‌ ‌జెండా సత్యాగ్రహంలో 1,750 మంది స్వచ్ఛందంగా అరెస్టయిన మాట నిజమే అయినా అందులో 200 మంది జైళ్లలో బాధలు భరించలేక క్షమాభిక్ష కోరారు.

×××××××

రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌

‌రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌ ‌కకోరి కుట్ర కేసు విచారణ సందర్భంలో బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి క్షమాభిక్ష కోసం విన్నవించుకున్నారు. అయినా బిస్మిల్‌ను ప్రభుత్వం ఉరికంబం ఎక్కించింది.

×××××××××××××

డాంగే నాలుగు లేఖలు

శిక్ష తగ్గిస్తే బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి ఏజెంట్‌గా పనిచేస్తానంటూ ఒక తొలితరం కామ్రేడ్‌ ‌క్షమాభిక్ష వినతిలో పేర్కొన్న సంగతి చరిత్రలో ఉంది. ఆయన పేరు శ్రీపద్‌ అమృత్‌ ‌డాంగే. ఈయనతో పాటు నళినీ భూషణ్‌ ‌దాస్‌ ‌గుప్తా అనే మరొక తొలితరం కమ్యూనిస్టు కూడా అలాంటి వినతి సమర్పించారు. కానీ ఈ ఉదంతం గురించి కమ్యూనిస్టులు, వారి తాబేదారుల వంటి కొందరు కమ్యూనిస్టు చరిత్రకారులు మౌనం వహించడం దారుణం కాదా? నిజంగానే తేలు కుట్టిన దొంగల మాదిరిగా వ్యవహ రించారు. కాన్పూర్‌ ‌బోల్షివిక్‌ ‌కుట్ర కేసు పేరుతో ఒక వివాదాస్పద ఘట్టం భారత స్వాతంత్య్రోద్యమంలో కనిపిస్తుంది. క్షమాభిక్ష కోసం డాంగే విన్నపాలు అందించడం ఈ కేసులో భాగమే.

ఈ కేసును వివాదాస్పద కేసు అని ఎందుకు అంటారంటే, బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని హింసామార్గంలో కూలదోసి, బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం నుంచి భారత్‌ను వేరు చేయాలని కుట్ర పన్నారంటూ మార్చి 17, 1924న కొందరి మీద ప్రభుత్వం కేసు పెట్టింది. వారే శ్రీపద్‌ అమృత్‌ ‌డాంగే, ఎంఎన్‌ ‌రాయ్‌, ‌ముజఫర్‌ అహ్మద్‌, ‌నళినీ గుప్తా, షౌకత్‌ ఉస్మాని, సింగారువేలు చెట్టియార్‌, ‌గులాం హుసేన్‌, అక్షయ్‌ ‌ఠాకూర్‌. ఈ ‌కేసుకు ముందు జరిగిన పెషావర్‌ ‌కుట్ర కేసు (1922), తరువాత జరిగిన మీరట్‌ ‌కేసు (1929) ఇలాంటివే. వీరిలో సింగారవేలు అనారోగ్యం కారణంగా విడుదలయ్యారు. ఎంఎన్‌ ‌రాయ్‌ ‌విదేశాలలో ఉన్నందున అసలు అరెస్టు కాలేదు. తనకు రష్యన్లు కాబూల్‌లో డబ్బు ఇచ్చారని గులాం హుసేన్‌ ‌ప్రకటించాడు. దీనితో అతనిని క్షమించి విడిచిపెట్టారు. ముజఫర్‌ అహ్మద్‌, ‌షౌకత్‌ ఉస్మాని, డాంగేలను విచారించి నాలుగున్నర సంవత్సరాలు కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో తన పాత్ర, క్షమాభిక్ష కోసం వినతిపత్రాలు సమర్పిం చడం గురించి తరువాత డాంగే పలు విన్యాసాలకు పాల్పడ్డారు. అసలు ఆ కేసుతో డాంగేకు సంబంధం ఉన్నట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేనేలేవని ఆయన అనుచరులు కొందరు అడ్డంగా వాదించడం మొదలుపెట్టారు. ఈ కేసు, అందులో ఆయన క్షమాభిక్ష కోరడం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఆయనను కమ్యూనిస్టు పార్టీ జాతీయ మండలి నుంచి తొలగించే కార్యక్రమం ఎలా జరిగిందో కొందరు కమ్యూనిస్టులే ఆనాడు వెలుగులోకి తెచ్చారు. ఆ ప్రయత్నం ‘డాంగే అన్‌మాస్కడ్: (‌ముసుగు తొలగిన డాంగే) రెప్యూడియేట్‌ ‌ది రివిజనిస్టస్’ ‌పేరుతో వెలువరించిన 45 పేజీల చిన్న పుస్తకంతో చేశారు. 4. విండ్సర్‌ ‌ప్లేస్‌, ‌న్యూఢిల్లీ చిరునామాతో ఈ పుస్తకం (ఆంగ్లం) ఉంది. దీనికి ముందుమాట ఎం. బసవపున్నయ్య రాశారు. అది ఏప్రిల్‌ 24,1964 ‌తేదీతో ఉంది.

‘ఆనాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి ఏజెంట్‌గా సేవలు అందిస్తానంటూ 1924లో డాంగే రాసిన లేఖలను నేషనల్‌ ఆర్కైవ్స్ ‌నుంచి సేకరించి ఇక్కడ ప్రచురిస్తున్నాం’ ముందుమాట తొలి వాక్యాలు ఇవే. అంటే ఇలాంటి ఒక సమాచారం లోకం ముందు ఉంచాలన్న తపన ఇందులో సుస్పష్టం. లేఖలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత డాంగే చెప్పిన మాటలు- కేసులో ఆయన ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పడం, ఆ లేఖలు ఆయన రాయలేదనీ, ఫోర్జరీ లేఖలని చెప్పడం వంటి వాటిని ఈ ముందుమాట తీవ్ర పదజాలంతో ఖండించింది. తనను జైలు నుంచి విడుదల చేస్తే, అందుకు కృతజ్ఞతగా వారికి ఏజెంట్‌గా పనిచేస్తానని దరఖాస్తులో డాంగే స్పష్టం చేశారు. ఈ వాస్తవాలనే పార్టీ సభ్యులకూ, సాధారణ ప్రజలకూ అందు బాటులో ఉంచాలని కొందరు పార్టీ సభ్యులు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. పుస్తక ప్రచురణ ఆశయం కూడా ఇదేనని వారు చెప్పుకున్నారు. ఇలాంటి అవసరం ఎందుకు వచ్చిందో కూడా బసవపున్నయ్య ముందుమాటలో వెల్లడించారు. ఆ లేఖలు, ముందు వెనుక పరిణామాలను చర్చించడానికి జాతీయ కౌన్సిల్‌ ‌నిరాకరిస్తూనే ఉంది. ఎందుకు అంటే, కౌన్సిల్‌ ‌పూర్తిగా డాంగే అనుయాయులతో నిండిపోయింది. డాంగే రాసిన లేఖలు నేషనల్‌ ఆర్కైవ్స్‌లో ఉన్నాయి. అవి నాలుగు లేఖలు. వీటి గురించీ, 1922-1927 నాటి డాంగే రాజకీయ ప్రస్థానం గురించీ బొంబాయి, మధ్య పరగణాలు, కేంద్ర ప్రభుత్వం వద్ద ఫైళ్ల కొద్దీ సమాచారం ఉంది. అయినా డాంగే వీరాభిమానులు వాస్తవాన్ని దారుణంగా తిరస్కరించారు. ఇంకొందరు మాత్రం, ‘ఆ లేఖలు నిజమైనవే! కానీ 40 ఏళ్ల క్రితం రాసినవి కదా!’ అంటూ వాదిస్తున్నారు. అంటే చూసీచూడనట్టు వదిలివేయాలని వారి భావన. ఇంకొందరు ఆ కాలాన్ని బట్టి అలా రాసి ఉండొచ్చునని సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ బాహాటంగా మాత్రం అవి డాంగే లేఖలు కానేకావని ఢంకా బజాయిస్తున్నారు. అందుకు వారు చూపుతున్న కారణం, ‘వైరుధ్యాలు’. డాంగే ఇంటిపేరు ‘శ్రీపద్‌’ అని ఒక చోట, ‘శ్రీపత్‌’ అని మరొకచోట ఉన్నది. ఎవరైనా సొంత పేరును రెండు రకాలుగా రాస్తారా, కాబట్టి ఇవి డాంగేవి కావు అన్నారు. ఇంటిపేరు పదంలోని వర్ణక్రమం మారిపోయిందని చెప్పి అసలు చారిత్రక వాస్తవాన్నే మరుగు పరిచే యత్నం చేశారు. ఆ లేఖల గురించి కూడా సోదాహరణంగా తెలుసుకుందాం.

మొదటి లేఖ మే 24,1924న డాంగే రాశారు. కాన్పూర్‌ ‌జిల్లా మేజిస్ట్రేట్‌ను ఉద్దేశించినది. ‘నేను యునైటెడ్‌ ‌ప్రావిన్స్‌కు చెందినవాడను. బొంబాయి నుంచి కాన్పూరుకు తీసుకువచ్చారు. నేను పేర్కొంటున్న కారణాలను పరిగణనలోనికి తీసుకుని నన్ను బొంబాయి ప్రాంత జైలుకు తరలించాలని అభ్యర్థిస్తున్నాను, అని ఆయన రాశారు. అవన్నీ బంధువులను, కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం ఇక్కడ లేదు వంటి కారణాలే.

రెండో లేఖ మే 26,1924న రాశారు. ఇది నళినీభూషణ్‌ ‌దాస్‌ ‌గుప్తాతో కలసి రాశారు. మేము ఇకపై ఎలాంటి అరాచక కార్యకలాపాలకు పాల్పడబోమని హామీ ఇస్తున్నాం. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి బొంబాయి లేదా సమీపంలోని ఎరవాడకు పంపవలసిందని ఇందులో సుస్పష్టంగానే ఆయన రాశారు.

మూడో లేఖలో (ఆగస్ట్ 1, 1924)‌లో శిక్ష తగ్గించమని తాము చేసుకున్న విన్నపాన్ని దయతో పరిశీలించాలని కోరారు.

నాలుగో లేఖలో (నవంబర్‌ 19, 1924) ‌మళ్లీ తమ శిక్షాకాలం తగ్గించమంటూ చేసిన విన్నపమే ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE