సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌జ్యేష్ఠ బహుళ విదియ – 05 జూన్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చే హామీలు దేశ ప్రజలను జడిపించడం ఖాయం. ఆ హామీలు గుప్పించే ఉత్సాహంలో నేతలు దేశంలో కోర్టులు ఉంటాయన్న సంగతి కూడా మరచిపోతున్నారు. కారాగారాల తాళాల గుత్తులు వారి జేబులో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. దేనినైనా నిషేధిస్తాం, ఎవరినైనా ఊచలు లెక్కించేటట్టు చేయగలం అన్న ధీమా ఆ పార్టీలో బాగా ఊరినట్టుంది. ఇక తాము ఏం చెప్పినా, ఎలాంటి ఆరోపణ చేసినా ఈ వెరిప్రజలు నమ్మక ఏం చేస్తారు అన్న ధీమా ఆ పార్టీకి ఆది నుంచి ఉన్నదే. విజయాలకీ, అధికార అందలాలకీ మరీ కరవాచిపోయి ఉన్న తరుణంలో హామీల తోక పట్టుకుని ఎన్నికల వైతరుణులను అలవోకగా దాటవచ్చునన్న నమ్మకం కుదిరింది కాంగ్రెస్‌ ‌పార్టీకి. కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన మత్తు అలాంటిదే మరి. మేం అధికారంలోకి వస్తే బజ్రంగ్‌దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలోనే  కన్నడ కాంగ్రెస్‌ ‌హామీ ఇచ్చింది. అలాంటిది ఒక్క బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తలనే కాదు, దాని సోదర సంస్థ బీజేపీ కార్యకర్తలను కూడా జైల్లో కుక్కేస్తామని హామీ ఇస్తే ఇంకెన్ని ఓట్లు వెల్లువెత్తుతాయ్‌? ఇక వద్దు బాబోయ్‌ అనే దాకా ఓటర్లు కాంగ్రెస్‌ ‌కాతాలోకి  సీట్లు జమ చెయ్యరూ!

ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. అంటే పెద్దల సభికుడు. కానీ నోరు విప్పితే పిల్లలనూ విరగబడి నవ్వించగలిగే విదూషకత్వం ఆయన సొంతం.  మధ్యప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కూడా. వీటన్నిటికీ మించి ఆయనకు ఉన్న భారీ భుజకీర్తి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌గాంధీకి రాజకీయ గురువు. ఆయన పేరు దిగ్విజయ్‌ ‌సింగ్‌. ‌కాంగ్రెస్‌కి ఇంకా కాస్తో కూస్తో ఖ్యాతి ఏమైనా ఉంటే దానిని మూట గట్టి మురికి కాలవలోకి విసిరే పనిని దిగ్విజయంగా చేస్తున్న మొట్టమొదటి నాయకుడు ఇతడే. ఈయన ఇచ్చిన హామీ గురించే ఇక్కడ చర్చంతా. ఈ సంవత్సరాంతంలో జరగబోయే మధ్యప్రదేశ్‌ ‌శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు కనుక అధికారం అప్పగిస్తే భారతీయ జనతాపార్టీ, బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తల మీద దేశద్రోహం నేరం కింద కేసులు పెట్టేస్తాడటాయన. తరువాత జైళ్లకి పంపుతాడట. పాకిస్తాన్‌ ‌గూఢచారి సంస్థ ఇంటర్‌ ‌సర్వీసెస్‌ ఇం‌టెలిజెన్స్‌కు వీళ్లంతా కూడబలుక్కుని మరీ దేశంలో గూఢచర్యంలో సహకరిస్తున్నారట. మే 27వ తేదీన ఖాండ్వా అనేచోట విలేకరులు అడ్డంగా దొరికిపోయారు పాపం. వాళ్లకే ఇవన్నీ చెప్పారు. సరే, ఆ గూఢచర్యం కేసు వివరాలు కాస్త చెబుతారా అంటే మాత్రం డిగ్గీరాజాకి నోరు పెగల్లేదు. ఇంకొక విషయం కూడా ఆయన జాతికి వివరించడం మరిచారు. ఈ గూఢచర్యం ఆరోపణతో  కేవలం మధ్యప్రదేశ్‌ ‌బీజేపీ, బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తల మీద మాత్రమే కేసులు బనాయిస్తారా? లేక యావత్‌ ‌భారతదేశంలో ఉన్న ఆ సంస్థల కార్యకర్తలకు కూడా ఇందులో అరెస్టయ్యే అవకాశం ఇస్తారో ముదిమి లక్షణంతోనే కాబోలు సెలవివ్వలేదు. అవినీతి కేసులు ఎలాగూ తిరగతోడతాడట దిగ్గీరాజా. దానికి అదనంగా గూఢచర్యం కేసులు కూడా బనాయిస్తారన్నమాట. ఈ లెక్కన చూస్తే గురుశిష్యుల లెక్క సరిపోతుంది. రాహుల్‌ ‌గాంధీ మొన్ననే తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో 150 స్థానాలు గెలవడం ఖాయమన్నారు. ఈ నమ్మకానికి పునాది ఏమిటి? కర్ణాటకలో కాంగ్రెస్‌కి 136 సీట్లు ఇచ్చారు. కాబట్టి మధ్యప్రదేశ్‌లో 150 సీట్లు ఇస్తారన్నదే ఆయన ఫిలాసఫీ. ఎక్కడో తర్కం తుంగలోకి పోయిందని అనిపించినా,  దిగ్గీ గురువర్యుల హామీలోకి మళ్లీ తొంగి చూస్తే విషయం కరతలామలకమవుతుంది. బజ్రంగదళ్‌ ‌నిషేధం అన్న ఒక్క మాటకే కర్ణాటకలో 136 సీట్లు రాలితే, బజ్రంగ్‌దళ్‌తో పాటు బీజేపీని కూడా జమిలిగా అణచేస్తామని చెబితే మధ్యప్రదేశ్‌ ఓటర్లు మారు మాట్లాడకుండా 150 సీట్లు కుమ్మరిస్తారన్నదే కాంగ్రెస్‌ ‌నేతల అంతరంగం.

దిగ్గీ దిగులేమిటో, ఎందుకో అర్ధం చేసుకోవచ్చు. మధ్యలో 15 మాసాలు మినహాయిస్తే 2003 నుంచి ఇప్పటి కాదా మధ్యప్రదేశ్‌లో బీజేపీయే అధికారంలో ఉన్నది. ఇప్పుడు కర్ణాటక ఫార్ములాను అనుసరించి కాషాయ పరివారం మొత్తాన్ని కారాగారాలలోకి తోసేసి తాళాలు వేస్తాం అని హామీ ఇస్తే ఈసారైనా అధికార ప్రాప్తి సాధ్యమవుతుందన్న దింపుడుకళ్లం ఆశ దిగ్గీలో తళతళలాడుతున్నది.  కానీ, కాంగ్రెస్‌ ‌హామీలు ఇస్తుంది గాని, వాటిని అమలు చేయడం మరచిపోతుందని తెలియదా అంటున్నారు బీజేపీ వారు. రుణాల రద్దు, నిరుద్యోగ భృతి అంటూ గతంలోనే హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌తరువాత ఏం చేసిందో ప్రజలు మరచిపోలేదని గుర్తు చేస్తోంది కమలదళం.

కర్ణాటకలో హామీలతో పాటు, ఓటరు మహాశయులలో కాంగ్రెస్‌ ‌నవ చైతన్యాన్ని కూడా ధారాళంగా నింపేసింది. ఆ చైతన్యం ఎంతవరకు పోయిం దంటే ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలులోకి తెచ్చేదాకా జనం ఆగడం లేదు. ప్రభుత్వాదేశాలు,  అధికారిక ప్రకటనలు వెలువడే దాకా ఆ చైతన్యం ఆగేటట్టు లేదు. కరెంటు మీటర్‌ ‌రీడింగ్‌కి వచ్చిన వారి చెంపలు పగలగొ డుతున్నారు. బస్సులో టిక్కెట్టు అడిగితే మహిళామణులు కస్సుమని లేస్తున్నారు. బజ్రంగ్‌దళ్‌ ‌నిషేధం ఎప్పుడు? హిజాబ్‌ ‌మీద నిషేధం తొలగింపు ఎప్పుడు అంటూ నిలదీయగలిగే ఓటర్లు ఇంకా ఎందుకు వేచి ఉన్నారో అంతు పట్టడం లేదు. వాళ్ల చురుకుదనం కూడా మేల్కొంటే కథ రంజుగా మారిపోతుంది. దిగ్గీరాజా! బజ్రంగ్‌దళ్‌నూ, బీజేపీనీ బంధించగలవా? అంత దమ్ముందా? ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ, వీహెచ్‌పీ, బజ్రంగ్‌దళ్‌ ఈ ‌మట్టి నుంచి జనించాయి. ఈ మట్టి వాసన వేస్తాయి. వీటిని ముట్టుకుంటే ఏమౌతుంది? కర్ణాటక కమలదళ అధ్యక్షుడు చెప్పలేదా? నువ్వు వినలేదా? పోనీ ఇప్పుడు విను! వాటి జోలికొస్తే కాంగ్రెస్‌ ‌బూడిదైపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధిః

About Author

By editor

Twitter
YOUTUBE